Friday, 14 February 2025

శ్రీ గరుడ పురాణము (347)

 


కఫ దోషం వుంటే అది బరువెక్కిపోయి చల్లగా తగులుతుంది. గోరోజనం చిన్నపిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. దీనిని నిర్మూలించడం సులభమే.


ఇంకా మూత్రానికి సంబంధించి శుక్రాశ్మరి, శర్కర, వాతవస్తి, వాతష్టిల, వాతష్టిల, వాత కుండలిక, ఉష్ణవాత, మూత్రక్షయ, మూత్రసాద అను పేళ్ళు గల రోగాలుకూడా ఉన్నాయి. వీటిలో కొన్ని వీర్య సంబంధమైనవి. వీటిని కుదర్చడం సాధ్యమే.


(అధ్యాయం 158)


ప్రమేహ రోగ నిదానం


ప్రమేహ శబ్దానికి మోతీలాల్ బనారసీదాస్ ప్రకాశకులు ప్రచురించిన గరుడ పురాణంలో డయాబిటిస్ అనే అర్థం ఈయబడింది. ఈ గ్రంథంలో చక్కెరవ్యాధి అని కూడ వాడడం జరిగింది.


ప్రమేహ లేదా చక్కెర వ్యాధిలో ఇరవై రకాలున్నాయి. వీటిలో పది కఫ దోషం వల్ల, ఆరు పిత్త ప్రకోపం వల్ల నాలుగు వాత భేదం వల్ల వస్తాయి. కొవ్వు, మూత్రం, శ్లేష్మం వీటికి మూలాలౌతాయి. మూత్ర విసర్జన బట్టి రోగం పేరు ఉంటుంది.


* మలం వేడిగావుండి మూత్రం చింతపండు రంగులో యేలాం చేప వాసన వేస్తుంది - హరిద్రమేహ


* ఎరుపు వాకతో పసుపు పచ్చరంగు మూత్రం - మంజిష్ఠమేహ


* మాంసం వాసనతో ఎఱ్ఱటి లవణాలతో ఎఱ్ఱటి రంగులోనే మూత్రం - రక్తమేహ


* తఱచుగా పడుతూ కొవ్వుతో కలసి జారుతూ కొవ్వు రంగులోనే మూత్రం - వసామేహ


* మూలగతో కలిసి పడుతూ అదే రంగులో వుండే మూత్రం - మజ్ఞమేహ


* ధారాపాతంగా పడుతూ జిగటగా వుండే చీముతో కలిసిజారే మూత్రం - హస్తిమేహ


మధుమేహ రోగి మూత్రం తేనె రంగులో వుంటుంది. ఈ మేహం రెండు రకాలు.


ధాతువుల తగ్గుదల వల్ల ప్రకోపించిన సర్వవాయు (వాత)దోషం వల్ల మూత్ర మార్గం నిరోధింపబడుతుంది. రోగలక్షణాలు కొన్నాళ్ళు పుష్కలంగా కనిపించడం కొన్నాళ్లు అసలు కనిపించకపోవడం, మరల కొన్నాళ్ళకు కనిపించడం అనగా బయటపడడం జరుగు తుంటుంది. దీనికి కారణం మాత్రం కనిపింపదు. కానీ రోగం మాత్రం ప్రమాదకరస్థాయిని చేరుకొంటుంది.


ప్రమేహ వ్యాధులన్నీ, నిర్లక్ష్యం చేస్తే మధుమేహంగా పరిణమిస్తాయి. మధుమేహం అంటేనే పూర్తిగా కుదరనిదని సూచన. ప్రమేహంలో ఏ విభాగంలోనైనా విసర్జనాలు తేనెలాగుండి తీపి వాసన వస్తుంటే మధుమేహం వచ్చేసిందని భావించవచ్చు.


కఫ దోష జనిత మేహ వ్యాధుల లక్షణాలలో ముందుగా అజీర్ణం, అరుచి, ఆహార నిరాసక్తత, వాంతులు, ఎప్పుడూ నిద్రవస్తున్నట్లే మగతగా వుండడం, దగ్గు, పడిశం బయట పడతాయి. అదే పిత్త జన్యమైతే మూత్రకోశంలోనూ దానికి కాస్త పైనా పీకుతున్నట్లుండడం, వృషణాలలో ఉబ్బు, వాపు, జ్వరం, శరీరమంతా మండు తున్నట్లుండుట, దప్పిక, పుల్ల త్రేన్పులు, మూర్ఛ, మలద్వారము జారినట్లుండుట అనే లక్షణాలు బయటపడతాయి.


వాత దోషజన్యమైన మేహంలో ఈ క్రింది లక్షణాలుంటాయి. ఉదావర్తం (గుద స్థానభ్రంశం) కంపము, గుండెనొప్పి ఘాటైన రుచులకోసం వెంపర్లాట, నిద్రలేమి, పడిశం, దగ్గు


బయటికి తేలకుండా వుండే పుండ్ల ద్వారా పదిరకాల ముదిరిన ప్రమేహాలను ఈ పేర్లతో గుర్తించారు. శరావిక, కచ్ఛపిక, జ్వాలిని, వినత, అలజి, మసూరిక, సర్షపిక, పుత్రిణి, విదారిక, విద్రధి.

Thursday, 13 February 2025

శ్రీ గరుడ పురాణము (346)

 


స్థూలంగా అతిసారం రెండు విధాలు. అవి సామ(చీముగలవి) నిరామ (చీము లేనివి) మొదటిరకంలో కంపు దారుణంగా వుంటుంది. మలంద్వారం వాచిపోయి విసర్జకాన్ని అడ్డుతుంటుంది. చొంగ కారుతుంటుంది. (నోరు) నిరామ రకంలో దీనికి వ్యతిరేక లక్షణాలుంటాయి.


అతిసారను సకాలంలో నిరోధించకుంటే అది ప్రమాదించి, ముదిరి గ్రహణి అవుతుంది. వాతజగ్రహణి వచ్చినవారికి గుండెదడ, ప్లీహవాపు, మొలలు, కామెర్లు, మతిపోవుట, శబ్దంతో నిర్గమించే ఆవిరుల జిగట, గట్టి, పొడి మలం, వెక్కిళ్ళు, ఊపిరందక పోవుట, తఱచు విరేచనమగుట అను లక్షణాలు కనిపిస్తాయి.


పిత్తజ గ్రహణిలో విరేచనం పసుపు పచ్చగా లేదా నీలం కలిసిన పసుపు రంగులో, పలచగా వుంటుంది. ఆమ్లపు పొక్కులు, గుండె, గొంతుల్లో మంటలు, అన్నద్వేషం, బాగా దప్పిక వుంటాయి.


కఫం ప్రకోపించడం వల్ల వచ్చే గ్రహణిలో అరుగుదల సమస్యా, మలం పోయినపుడు నొప్పి, వాంతులు, అన్నంగాని మరే ఆహారం గాని సహించకపోవడం, నోటిమంట మాటిమాటికి ఉమ్ముఊరడం, దగ్గు, చిరాకు, పడిశం, గుండె బరువు, కడుపుబ్బు, తీపిత్రేన్పు, బద్ధకం, రోమాంచము అనే లక్షణాలుంటాయి. ఇంకా, సన్నిపాత గ్రహణిలో, మలం చిక్కగా, ముక్కలుగా పడుట, మనిషి దుక్కగా వున్నా బలహీనంగానే కనబడుట కూడా జరుగుతాయి.


గ్రహణిని కుదుర్చుట అసాధ్యము తచ్ఛాంతిని చేయవచ్చు.


(అధ్యాయం -157)



మూత్ర ఘాత నిదానం


సుశ్రూతా! వస్తి, వస్తిశిరం, మేడ్రం, కటి, వృషణములు, గుదము ఈ ఆరు శరీరభాగాలూ ఒకదానికొకటి సంబంధితములై, ముడివడియుంటాయి. మూత్రకోశం క్రిందికి వంగి వున్నా ఎపుడూ నిండుగానే వుంటుంది. దానిలోకి ఎన్నో చిన్న చిన్న నాళాలు ద్రవాలను తెచ్చి నిరంతరం ఒంపుతునే వుంటాయి. ఈ ద్రవాలలో త్రిదోషాలు ప్రవేశిస్తే ఇరవై రకాల రోగాలొస్తాయి.


మూత్రఘాతం (మూత్రం తొక్కిపట్టబడుట) మధుమేహం పైన చెప్ప ఆరు విశిష్ట భాగాలలో దేనికి సోకినా అన్నీ చెడతాయి. వాతరోగమైతే మూత్రం తక్కువగా వస్తుంది గాని పోస్తున్నంతసేపూ లింగభాగం నొప్పెడుతునే వుంటుంది. పిత్త దోషమైతే పచ్చగా వచ్చే మూత్రం లింగనాళాన్ని మండిస్తుంది. పోస్తున్నంతసేపూ మంటగానే వుంటుంది. కఫప్రకోపంలో మూత్రం ఎఱ్ఱగా వుంటుంది. లింగం బరువెక్కినట్టుంటుంది. వాపు వుంటుంది.


త్రిదోషాలూ కలిపి వుంటే మూత్రం మెరుపుతో కూడిన పసుపు రంగులో జారుతుంది. వాయువు మూత్రకోశ ద్వారాన్ని తిప్పి వైచి ఎండిపోయేలా చేస్తుంది. పిత్త, కఫాలూ, వీర్యమూ మూత్రంతో కలిసి ఒక గట్టి ముద్దలాగ ఏర్పడతాయి. ఇది గోరోచనంలా వుంటుంది.


అశ్శరీ లేదా గోరోజనమను పేరు గల భయంకర రోగంలో కఫ ప్రకోపానిదే ప్రధానపాత్ర. మొదట్లో కనిపించే లక్షణాలు మూత్రకోశం వాపు, ఆ ప్రాంతమంతటా భరింపలేనినొప్పి.


మూత్రం దానికోశంలోనే నిరోధింపబడడంతో మూత్ర విసర్జనం యాతన పూరితమవుతుంది. జ్వరం, ఆహారం పట్ల విరక్తి కలుగుతాయి. బొడ్డు భాగంలో వెనుకవైపూ మూత్రాశయంలోనూ నొప్పులు పెరుగుతాయి. మూత్రం పడినపుడు స్వచ్ఛంగా ముత్యం రంగులోనే వుంటుంది. కాని గొప్ప నొప్పి పుడుతుంది. ఎప్పటికీ రావటం లేదని బలవంతాన పోస్తే రక్తం, మాంసం బయటికి వచ్చి మరీ ఎక్కువ నొప్పి వస్తుంది. వాతజదోషం వుంటే రోగి పళ్ళు పటపట కొరుకుతుంటాడు, కుదుపుకీ లోనౌతాడు. మూత్రం తఱచుగా చుక్కలు చుక్కలుగా పడుతుంది. మలం వాయు సహితమై పడుతుంటుంది. పిత్తదోషం వల్ల మూత్రాశయంలో మంట పుడుతున్నట్లుంటుంది. ఉడకబెడుతున్నట్లు వేడిగా వుంటుంది.

Wednesday, 12 February 2025

శ్రీ గరుడ పురాణము (345)

 


అతిసార గ్రహణి రోగాలు


శుశ్రుతా! నిజానికి అతిసార, గ్రహణిరోగాలు రెండూ నీళ్ళ విరేచనాలకి పెట్టబడిన పేర్లే. ఇవి ఆరు రకాలుగా వుంటాయి. త్రిదోషాలూ ఒక్కొక్కటిగానూ అంటే విడివిడిగానూ కలివిడిగాను నాలుగు రకాలౌతాయి. భయం, దుఃఖం ఉత్పత్తి చేసే రకాలు రెండు.


నీటిని గాని ఇతర పానీయాలను గాని అతిగా తాగెయ్యడం ఈ జబ్బులకి సాధారణ కారణం. వాతం విచక్షణ రహితంగా తినే తిండి వల్లా, కొవ్వు వల్లా, వేపుడు వల్లా, పులుపు (మసాలా) ఘాటువల్లా, కొన్ని మొక్కల రెమ్మలు, గింజలవల్లా, సారా వల్లా, పగటి నిద్రవల్లా, మలమూత్రాలను బలవంతంగా ఆపడం వల్లా ప్రకోపించి వీటిని తెస్తుంది. వాయు ప్రకోపం వల్ల రక్తం శరీరంలోని క్రింది భాగాలకు అతిగా ప్రసరణంగావించి జఠరాగ్నిని ఆర్పేస్తుంది. తరువాత జీర్ణవ్యవస్థ అంతర్భాగంలో ప్రవేశించి ఆహారాన్ని మలాన్నీ కూడా పలచగా, ద్రవంలాగ చేసి పారేస్తుంది. ఛాతీనొప్పి, మలద్వారంలో బాధ, శరీరంలోపలి నుండి కముకు దెబ్బలు తిన్నట్టు నొప్పులు ఒకేసారి శరీరం పై దాడిచేస్తే ఈ రోగం వచ్చేసిందని పోల్చవచ్చు.


కడుపును నొక్కితే కొన్నిచోట్ల గట్టిగానూ, కొన్నిచోట్ల లోతుగా, మెత్తగానూ తగులుట, అజీర్ణము ఈ రోగలక్షణాలు. జ్వరం వుండదు. మలం చాలతక్కువగా పడుతుంది. అది కూడా ఎన్నో అవరోధాలను దాటుకొని వస్తున్నట్లు కష్టంగా పడుతుంది. ధ్వని వుండదు. వాత ప్రకోప లక్షణాలివి. ఇంకా మలం గట్టిగా జిగటగా బుడగలతో నుండుట, మలద్వారా నికి కొంచెం పైన వుండే మాంసల ప్రదేశంలో మంట, కోసినట్లుండి నీళ్ళు తగిలితే మంట, ద్వారం మూసుకుపోయినట్లయి అతి కష్టం మీద తెఱచుకొనుట, ఒళ్ళు తఱచు గగుర్పాటుకు లోనగుట కూడా వాత దోష ప్రకోపజన్య అతిసార, గ్రహణి లక్షణాలే.


పిత్తజమైన అతిసారంలో మలం పచ్చగా, నల్లగా, చింతపండు రంగులో లేదా పచ్చగడ్డి రంగులో రక్తమిళితమై వుంటుంది. కంపు ఎక్కువగా వుంటుంది. రోగి అతి దాహంతో మందాగ్ని పీడతో, తల తిరుగుడు, మూర్ఛలతో బాధ పడుతుంటాడు. కడుపు నుండి మలం ద్వారా దాకా మండుతున్నట్లుంటుంది.


కఫదోషం వల్ల వచ్చే అతిసారంలో మలద్వారం వద్ద నొప్పి, మంట పెద్దగానే వుంటాయి. మలం దళసరిగా అంటే చిక్కగా, తక్కువగా, ఆగకుంగా కొంచెంగానే పడి ఆగిపోతుంది.


మూడుదోషాలూ కలిపివుండే అతిసారంలో పై లక్షణాలన్నీ దశలవారీగా బయట పడుతుంటాయి. గగుర్పాటు, భరింపలేనంత నొప్పి, మూత్రాశయం, కడుపు గుహ్యం బరువెక్కిపోతుండుట, తెలివి తప్పదు కానీ చేసిన పని చేయలేదనుకొనేటంత మఱపు కమ్ముకొనుట కూడా జరుగుతాయి.


భయం వల్ల ఈ రోగం వస్తే రోగి పడుకొని వుండగానే విరేచనమైపోతుంది. వాయవు ద్రవంగా మారి ప్రవాహంగా బయటకొస్తుంది. దుఃఖం వల్ల వచ్చే ఈ రోగంలో వాత, పిత్త ప్రకోపాలు కలిసిన లక్షణాలు కనిపిస్తాయి.

Tuesday, 11 February 2025

శ్రీ గరుడ పురాణము (344)

 



మూత్ర విసర్జన కష్టతరమౌతుంది. ఆలోచించడానికి కూడా బద్దకమేర్పడి తలదిమ్మెక్కి పోతుంది. చలి, శరీరంలో కుదుపు కలుగుతాయి. అన్ని రకాల సామర్థ్యమూ కొరవడుతుంది. ఏం తిన్నా ఒకంతట అరగదు. వాంతులు మున్నగు అజీర్ణ సంబంధ రోగాలన్నీ వచ్చి పడతాయి. విరేచనం మసిరంగులోకి వచ్చేస్తుంది. చీము పడుతుంది. మొలలు పగలవు, రక్తం కూడా కారదు. కాని చికాకు పెడతాయి. చర్మం బూడిద రంగును పులుముకున్నట్లయిపోతుంది. మరీ నున్నగా కూడా అయిపోతుంది. 


మూడుదోషాలూ కలిసిన మొలల లక్షణాలు ఇలా వుంటాయి. రక్తంలో మాలిన్యాలున్న వారిలో పిత్త దోష లక్షణాలన్నీ కనిపిస్తాయి. మొలలు మట్టి లేదా గంజాయి చిగురుల్లా వుంటాయి. మలం గట్టిగా వేడిగా రోగగ్రస్తమై వుంటుంది. రక్తహీనత వల్ల వచ్చే రోగలక్షణాలన్నీ ఈ మొలల రోగిలో కూడా కనిపిస్తాయి. విరేచనాలు ఎక్కువై ఒక్కొక్కసారి ధారాపాతంగా రక్తంపోతుంది. శరీరం కప్పతోలు రంగులోకి వస్తుంది.


రోగి శరీర వర్ణాన్నీ, బలాన్నీ, బుద్ధి నిలకడనీ కోల్పోతాడు. శరీరంలోని ముఖ్య చర్యలు పాడవుతాయి. జ్ఞానేంద్రియాలు సక్రమంగా పనిచేయవు. గట్టి అనగా అరుగుట కష్టమైన ఆహారాన్ని ఆరగించడం వలన వాయువు ఎక్కువగా గుహ్య ప్రాంతంలో రేగిపోయి క్రిందికి వస్తున్న నాళాలను అడ్డుకుంటుంది. మొత్తం వ్యర్థ పదార్థాలన్నిటినీ పొడిగా, గట్టిగా మార్చేస్తుంది. మలమూత్రాలలోని తేమను హరించి వేసి రోగిని పరమ ప్రమాదకర స్థితిలోకి నెట్టివేస్తుంది. దానివల్ల నడుము, వీపు, ఛాతీప్రాంతాల్లో భరింపరాని నొప్పికి వ్యక్తి గురౌతాడు. మహోదరం, మలం ఒకే చోట ఉండిపోవడం, శూలనొప్పి, మూత్రాశయంలో బాధ, బుగ్గలు లోపలికి నొక్కుకు పోవడం జరుగుతాయి.


వాతదోషంలో వాయువు పైకి అంటే క్రింది భాగాలలో నుండవలసిన వాయువు శరీరంపై భాగాలలోకి పయనించడం వల్ల వాంతులు, అన్నంపై విరక్తి జ్వరం, గుండె భాగంలో దడ, నీళ్ళ విరేచనాలు, నులుగడుపు, మూత్రం అణచబడుట సంభవిస్తాయి. దాహం, తలనొప్పి, పడిశం, ప్లీహవ్యాకోచం కలుగుతాయి. చెవులు పనిచేయడం తగ్గుతుంది. ఈ వాతదోషాల వల్ల మరణం సంభవించవచ్చు. వాతమొలలు అతి ప్రమాదకరం. వీటిని తగ్గించడం జరుగుతుందే కాని నిర్మూలన సాధ్యం కాదు.


రెండు ప్రకోపాల వచ్చే మొలలను వెంటనే పోల్చి మందు వేస్తే ప్రయోజన ముంటుంది గాని ఒకయేడాది దాటితే మాత్రం నయం చేయడం అసాధ్యం. బాహ్య గుహ్యకాలయిన మొలలు ఏదో ఒక దోషం వల్ల యేర్పడితే, వెంటనే అయితే, సులభంగానే వాటిని నిర్మూలించవచ్చు.


జననేంద్రియం పైగాని, బొడ్డులోగాని పుట్టే మొలలు కూడా వుంటాయి. అలాగే వ్యానమను పేరు గల వాయువులో తేడాలో చర్మంపై కూడా పుట్టుకొస్తాయి. ఆహార నియమాలను క్రమం తప్పకుండా పాటించేవారికి ఇవి తగ్గిపోయే అవకాశం ఎక్కువ. వైద్యునికి రోగి పూర్తిగా సహకరించాలి.


మొలలలో గరుకుదనం, పొడిచినట్లు పొటమరించడం వాతదోషం, మొనల్లో నలుపు పిత్త ప్రకోపం, రంగులు, నున్నన, మెత్తన కఫరోగం లక్షణాలు. (అధ్యాయం-156)

Wednesday, 5 February 2025

శ్రీ గరుడ పురాణము (343)

 


ఈ రోగలక్షణాలు అతిసార, క్షయ, పచ్చకామెర్లు, క్లోమ వ్యాకోచాదులను పోలివుంటాయి. అయితే మల ద్వారం దగ్గరి బాధ పెరుగుతున్న కొద్దీ లక్షణాల వ్యగ్రతా పెరుగుతుంటుంది. అపానవాయువుకి బయటకు పోయే దారి మూసుకుపోతే అది మళ్ళా శరీరంలోకే వెనక్కి మళ్ళి పోయి అన్ని జ్ఞానేంద్రియాలనూ, హృదయాది ప్రధానాంగాలను చికాకు పెడుతుంది. అప్పుడది వాత, పిత్తాలలో పగుళ్ళను కల్పిస్తుంది. ఆ తరువాత మొలలు మరీ ఎక్కువగా విస్తరిస్తాయి.


రోగి బక్కచిక్కిపోతాడు, మరీ పుల్లల్లా కాలుసేతులైపోతాయి, విరక్తుడై పోతాడు. ముఖం పాలిపోతుంది. చెదచే పూర్తిగా మింగబడిన చెట్టు లాగైపోతాడు. మనిషిలో నవకం పోతుంది.


యక్ష్మవిషయంలో ఇదివఱకు చెప్పబడిన బాధలన్నీ ఈ రోగిని తాకుతాయి. సంధులన్నిటిలో నొప్పులు వస్తుంటాయి. దగ్గు, అతిదాహం, నోరు తడారిపోవుట, శ్వాసకృచ్ఛము, పడిశం, తుమ్ములు, కడుపులో తిప్పు, ఒళ్ళునొప్పులు, వినికిడి తగ్గుట, జ్వరం, అతి నీరసం, ఒళ్ళు కొయ్యబారిపోవుట, జల్లిరోగము కనిపిస్తాయి. మలద్వారం నుండి మాంసం కడిగిన నీటిని పోలిన ద్రవం కారుతుంటుంది.


తడిమొలలు పిత్త దోషం వల్ల వస్తాయి. ఇవి చింతపండు రంగులో వుండి వాచుట, పగులుట చేస్తాయి. వాత మొలలు పొడిగా గరుగ్గా వుంటాయి. ఎఱ్ఱగా గాని జేగురు రంగులో గాని వుంటాయి. ఇవి ఏ ఆకారంలోనైనా వుండవచ్చు. పగుళ్ళు వేసినట్లు కనిపిస్తాయి. ఖర్జూర, కర్కందు, కర్పాస పిక్కల రంగులో కూడ ఉంటాయి. కదంబ పుష్ప వర్ణంలోనూ తెల్ల ఆవాల రంగులోనూ కూడా వుండవచ్చు.


ఈ రోగం పెరుగుతున్నకొద్దీ శరీరం, గోళ్ళు, మలం, మూత్రం, కనులు, ముఖము నల్లబడుతూ వుంటాయి. వాపు, గుండ్రంగా వుండి, జారి పడుతున్నట్లున్న పెద్ద పొక్కులు, మల విసర్జనలో విపరీతమైన శ్రమ, బాధ వస్తాయి. (ఈ పొక్కులను అస్త్రీలలంటారు)


పిత్త దోషం వల్ల వచ్చే మొలలు మొదట్లో నీలం రంగులో వుంటాయి. పోను పోను ఎఱ్ఱగా, నలుపు ఎరుపు కలిసిన రంగులోకి వస్తాయి. వాటినుండి అరుణవర్ణంలో పలచగా వున్న ద్రవం కారుతుంటుంది. పచ్చిమాంసపు వాసనను వెలువరుస్తుంటాయి. మెత్తగా తగులుతాయి. వాటిలో కొన్ని చిలుక నాలుకలాగా, జలగ నోటిలాగా వుంటాయి. విరేచనం అజీర్ణంగా, పలచగా, ద్రవరూపంలో, ఎరుపు పసుపు నలుపు కలిపిన రంగులో అవుతుంది. ఈ మొలలు బార్లీ గింజల్లా మధ్యలో దళసరిగా వుంటాయి. చర్మం, గోళ్ళు ఆకుపచ్చ లేదా పసుపు రంగుల్లోకి వస్తాయి.


కఫం దోషం కారణంగా వచ్చే మొలలు బాగా లోపలికి వేళ్ళూనుకొని వుంటాయి. దళసరిగా వుంటాయి. నొప్పి మిగతా రకాల కన్న తక్కువ పెడతాయి. తెల్లగా వుండి, కుళ్ళినట్లు కనిపిస్తూ, గుండ్రంగా, నున్నగా, నిటారుగా వుంటాయి. ఆవుపొదుగులా, వెదురు కొమ్మలా, జీడిపిక్కలా ఉంటాయి. దురద పుట్టిస్తాయి. గోక్కుంటే గొప్ప హాయిగా వుంటుంది. తొడల సంధుల్లో నొప్పి, గుదంలో, మూత్ర కోశంలో, బొడ్డులో కూడా నొప్పి మొదలవుతుంది. శ్వాసలో ఇబ్బంది, పడిశం, దగ్గు, గుండెలో అశాంతి, చొంగకారడం, అన్నం సహించకపోవడం మున్నగు లక్షణాలు క్రమేపీ బయటపడతాయి.

Tuesday, 4 February 2025

శ్రీ గరుడ పురాణము (342)

 


గుహ్యనాళం అయిదున్నర అంగుళాల పొడవుంటుంది. అందులో పొడిగా రాళ్ళవలె ఉండే మొలలు మూడున్నర అంగుళాల మేరకు పెరుగుతాయి. ఆదారంట వెళ్ళే రక్తనాళాలీ మొలలకు తగిలి పగులుతాయి. తద్వారా రక్తస్రావం జరుగుతుంది. ఇది సాధారణంగా తల్లిదండ్రుల దోషాల కారణంగా పిల్లలకు సంక్రమిస్తాయి. దేవతల శాపాలు కూడా మొలలను పెంచుతాయి.


సహజంగా, అనగా వంశపారంపర్యంగా వచ్చే మొలలు సంపూర్ణంగా నశించడమనేది వుండదు. ఈ రకం మొలలు గరుకుగా, చండాలంగా, లోపలివైపు మొనదేలి, పాలిపోయిన పసుపురంగులో వుంటాయి. వీటివల్ల వచ్చే అనారోగ్య ఫలితాలు పరమభయంకరంగా వుంటాయి. 


ఈ మొలలు ఆరు విధాలుగా విభజింపబడ్డాయి. త్రిదోషాలూ కలిసి కాని రెండేసి కలిసి గాని ఈ రుగ్మతకు కారణమవుతాయి. పొడిమొలలు వాత, కఫదోషాల వల్లా, తడిమొలలు పిత్త దోషం వల్లా ఏర్పడతాయి.


జఠరరసాలు ఆహారాన్ని దహించే వేళలో శృంగారానుభవాన్ని పొందే వారిలో ఈ దోషాలు మరింత ప్రకోపిస్తాయి. అపానవాయువు ప్రకోపించడానికి తెలివి తప్పేదాకా త్రాగడం, బరువైన - అరగడం కష్టమైన తిండి తినడం, కడుపును మాటిమాటికీ నిమురు కోవడం, కనులను గొంతును అరచేతులతో రుద్దుకోవడం, అతి శీతల ద్రవాన్ని వాడడం, అతిగా స్వారి చేయడం, సహజమైన కోరికలను అణచుకోవడం, విరేచనాలు, మలబద్ధకం ఇలాటివన్నీ దోహకాలౌతాయి, కారణాలూ అవుతాయి.


అపానవాయువు కలత చెందినపుడు మలం పైకి పోయే దారిలో ములుకు ల్లాటి మొలలు లేచి దానిని అడ్డేస్తాయి. అప్పుడు ఎముకలు కూడా నొప్పెడతాయి. తల తిరుగుతుంది. కళ్ళు మండుతాయి. వాయువు నాభి క్రింది ప్రాంతాల్లో కదలాడడం వల్ల రోగి శ్వాస తీసుకున్నపుడు ఇబ్బంది కలిగి, మలద్వారం వద్ద రక్తం వస్తుంది. తలనొప్పి, పేగుల నుండి గుడగుడ ధ్వనులు, అతి త్రేన్పులు, అతి మూత్రము, తక్కువ మలం, అన్నద్వేషం, తల, తిరుగుతున్నట్లుండుట, నాలిక చేదెక్కుట, తల ఛాతీ, పక్కల్లో నొప్పులు, భోగేచ్ఛ, ఇంట్లో వాళ్ళపై చిరాకు కలుగుతాయి.

Thursday, 16 January 2025

శ్రీ గరుడ పురాణము (341)

 


మత్తురోగులలో వాతం ప్రకోపిస్తే మనిషి చీపురు పుల్లలాగైపోతాడు. రక్తహీనత ఏర్పడు తుంది. ఏ కోశానా మెరుపన్నది మిగలదు. జీవకళ కనబడదు. శరీరం ఎఱ్ఱబడు తుంటుంది. మనిషిలో మోసం చేసే బుద్ధి పెరిగిపోతుంది. ఆలోచనలు, చర్యలు స్థిరంగావుండవు. పిత్తం ప్రకోపిస్తే మత్తులో వున్నా లేకున్నా ఆ రోగి తెగ చిరాకు పడిపోతుంటాడు. శరీరానికిఎరుపూ, పసుపూ కలిగిన అందవికారమైన రంగు వస్తుంది. కఫం ప్రకోపిస్తే మనిషి నడుస్తున్నా, అరుస్తున్నా నిద్రలో వున్నట్లే వుంటాడు. సందర్భశుద్ధి లేకుండా మాట్లాడుతుంటాడు. ఏదో మరో లోకంలో వున్నట్లుంటాడు. మూడు ప్రకోపాలూ కలిసివున్న వారికి ఈ పై లక్షణాలన్నీ కనిపిస్తాయి. రక్తప్రసరణంలో ఆటంకమేర్పడుతుంది. పక్షవాతమూ రావచ్చు.


త్రిదోష ప్రకోప లక్షణాలు ఇంకా ఇలా కూడా ఉంటాయి. రోగి తన వారి గొంతుకలను ఎంత ప్రయత్నించినా పోల్చలేకపోవడం పిత్తలోపం. మనిషి నిద్ర పోతున్నా శరీరం వణకుతునే వుండడం జరిగినపుడు వాత లక్షణాలను జాగ్రత్తగా పరిశీలించాలి. రోగికి ఆకాశం ఎఱ్ఱగా కనిపించవచ్చు. లేదా అంతా చీకటిగా నల్లటి తెరల చాటుననున్నట్లు కనిపించవచ్చు. ఒక్కసారి తల విదిలించి చూస్తే అంతా బాగానే కనబడుతుంది. కాని గుండెలో సన్నగా నొప్పి మొదలెట్టినట్లవుతుంది. తల తిరుగుతుంది. ఛాతీ భాగమంతా ప్రకంపిస్తున్నట్లవుతుంది. వెక్కిళ్ళు వస్తుంటాయి.


పిత్త ప్రకోపంలో ఆకాశం ఎఱ్ఱగా గాని పచ్చగా గాని కనబడుతుంది. మాటిమాటికీ స్పృహ పోతుంటుంది. తెలివి వచ్చాక విపరీతంగా చెమటలు పడతాయి. అధికదాహం, గొంతులో మంట వుంటాయి. శరీరం రంగు ఒకవైపు పసుపు పచ్చగానూ మరొకవైపు నీలంగానూ తేలవచ్చు. కనులు ఎఱ్ఱగానో పచ్చగానో అయిపోతాయి.


కఫ ప్రకోపంలో రోగికి ఆకాశం నిత్యం మేఘావృతంగానే గోచరిస్తుంది. మృతి చెందినట్లయిపోయి ('కోమా' లో వుండి) కొన్ని గంటల తర్వాత ఎప్పుడో ఈ లోకంలోకి వస్తాడు. గుండెలో గాబరాగా వుందని గోల పెడుతుంటాడు. చొంగ కారుతుంటుంది. అంగాలన్నీ బరువెక్కిపోయి తిమ్మిర్లు వస్తాయి. ఉన్నట్టుండి 'దబ్బు'మని కిందపడిపోతాడు. అపస్మారంలోకి వెళ్ళిపోతాడు. మరల లేచి తన పనులు తాను చేసుకుంటున్నపుడు కూడా మాటలో స్పష్టత వుండదు.


కాబట్టి మత్తు మందు ఏదైనా ప్రమాదకరమే కాని అదే మత్తు పానీయాన్ని వ్యక్తి యొక్క శరీరతత్త్వాన్ని బట్టి రోజుకి అయిదు నుండి పదిచుక్కలు తీసుకుంటే నిద్రబాగా పడుతుంది. బుర్ర చక్కగా పనిచేస్తుంది. అంగాలలో చురుకుదనం వస్తుంది. చర్మానికి నైగనిగ్యం, ముఖానికి నవకం వస్తాయి. కాని మానవజాతి చేసుకునే దురదృష్టమేమనగా అలా రోజుకి అయిదు, పది చుక్కలనే పుచ్చుకొని అంతటితో ఆగేవాడు కోటికొక్కడుంటాడు.


(అధ్యాయం -155)


అర్శలు లేదా మొలలు


మాంసం నుండి కొంచెం సూదిగా మొనలుదేలిన పెరుగుదలలు శరీరం లోపల అన్నిచోట్లా ఏర్పడుతుంటాయి. కాని, వాటిలో మలద్వారంలో పెరిగి మల విసర్జన కంతరాయం కలిగించే వాటిని మొలలు లేదా లేదా అర్శలు అంటారు. (ప్రస్తుత భాషలో పైల్సు) ఇవి సహజ అనంతరోతయని రెండు విధాలు.

Wednesday, 15 January 2025

శ్రీ గరుడ పురాణము (340)

 


అది సజ్జనుడిని నీచునిగా మార్చేస్తుంది. అది బాగా నెత్తికెక్కినవాడు ఎంత చెడ్డ పనిచేయడానికైనా భయపడడు. మందుకి బానిసైపోయి అది దొరకని వాడు, ఆ దొరకని నాడు పరమనీచుడై పోయి గుక్కెడు మద్యం కోసం హత్యచేయడానికైనా వెనుకాడడు. ఈ దశకి వచ్చేసరికి వాని ఆరోగ్యం సర్వనాశనమైపోయి వుంటుంది. మెదడు దెబ్బతినేయడంతో ఏది సుఖమో ఏది అసుఖమో తెలియక ఏడవవలసినపుడు నవ్వుతాడు. నవ్వవలసినపుడు ఏడుస్తాడు. జ్ఞాపకశక్తి నశిస్తుంది. తులన దెబ్బతిని ఎక్కడబడితే అక్కడ పడిపోతుంటాడు.


సహజంగా బాగా తిని అరిగించుకొనేశక్తి గలవారు, స్వతహాగా బాహుబల సంపన్నులు, మంచి పుష్టికరమైన భోజనంతో మద్యాన్ని పుచ్చుకున్నా వారికి పెద్దగా మత్తెక్కదు. ఆ మత్తుకోసం మరింత తాగితే మాత్రం సర్వనాశనం తప్పదు.


తాగుబోతులకు వచ్చే జబ్బులు పిత్త, కఫ దోషాల్లో దేని ప్రకోపం వల్లనైనా రావచ్చు. త్రిదోషాలూ ఒకేసారి దాడి చేయడం వల్ల కూడా కలగవచ్చును.


తఱచుగా వచ్చే విరేచనాల వల్ల దాహం, కాసింత నిరాశ, జ్వరం, అరుచి, ఆహార విముఖత, మలబద్ధకం, కళ్ళు చీకట్లు కమ్ముట, వెక్కుళ్ళు, శ్వాసలో ఇబ్బంది, నిద్రపట్టక పోవుట, అతిగా చెమటలు పట్టుట, మలమూత్ర విసర్జనల్లో ఏదో అడ్డు పడినట్లుండుట, ఒళ్ళు అక్కడక్కడ వాచుట, మానసిక ఆందోళన ఇవన్నీ త్రిదోషాలు కలిసి తాగుబోతుపై దాడిచేస్తే బయటికి కనిపించే లక్షణాలు. రోగి ఏదో కలల లోకంలో పడినట్లుంటాడు. పిలిచినా పలకడు.


ఈ రోగం పిత్తదోషం వల్ల వస్తే అంతటా మంటపుడుతున్నట్లుంటుంది. లోనాపైనా కూడా. జ్వరం, స్వేదనం, స్పృహ తప్పుట, గుండె దడ కనిపిస్తాయి.


కఫ ప్రకోపం వల్ల వస్తే వాంతులు, అశాంతి, నిద్రమత్తు, కడుపు వాయువు ఎక్కువై బరువెక్కుట (ఉదరగౌరవం) అనే లక్షణాలు బయటపడతాయి.


తెలిసి తెలిసీ మత్తుకి అలవాటుపడిపోయిన వారు క్రమేపీ ఆలోచించే శక్తిని కోల్పోతారు. మానసిక రోగాలు ప్రవేశిస్తాయి. ప్రతీదీ వారికి ఆనందాన్నే కలిగిస్తుంటుంది.


కర్రముక్క ఇచ్చినా, అన్నం ముద్ద పెట్టినా, లడ్డూను చేతిలో వుంచినా ఒకలాగే, చిన్నపిల్లల్లా, సంతోషపడిపోతారు. ఇవి ఎక్కువగా వాత ప్రకోప లక్షణాలు. నోటి నుండి కఫం, చీము పడుతుండడం, ఏమీ తాగకున్నా నిద్రమత్తులో జోగుతున్న ట్లుండడం వీరి లక్షణాలు. ఒళ్ళు నొప్పులెక్కువగా వుంటాయి. ఏం మాట్లాడిన పెద్దగా అర్ధం వుండదు. ఒకటనుకొని ఇంకొకటి అంటారు. గుండె, గొంతు చెడతాయి. మూర్ఛలొస్తుంటాయి. ఊపిరి హాయిగా, సక్రమంగా ఆడక అవస్థ పడుతుంటారు. దాహం, జ్వరం, కడుపులో తిప్పు బాధిస్తుంటాయి. ఏదో ఒకటి రెండు మార్లు దారి తప్పి తాగినా తెలివితేటలుపయోగించి దానిని పూర్తిగా వదిలేసిన వారికి ఈ రోగాలేవీ రావు.


వంచనకు గురైనవారు, ప్రథమకోపులూ మత్తుకి సంబంధించిన మూడు రోగాలకూ అనగా మూర్ఛలు, నేలపైబడి లేవలేకపోవుట, కడుపులో త్రిప్పులకూ లోనవుతారు. వీరు తిండికి సంబంధించిన నియమాలను సరిగా పాటించకపోతే ప్రమాదమే. శరీరంలో నాళాలన్నీ చెడతాయి. వాత, పిత్త, కఫలోపాలూ, మలిన రక్తం, శరీర భాగాలన్నిటిలో సారా ప్రవహించడం వల్ల ఈ రోగులను సరిచేయుటకు చాలాకాలం పడుతుంది.

Tuesday, 14 January 2025

శ్రీ గరుడ పురాణము (339)

 


పిత్తదోషం ఆమ్లత్వంలో సన్నటి పెరుగుదలనూ, మూర్ఛనూ, నోట చేదునీ, కంట ఎరుపునీ, శరీరంపై పొడినీ, లోపల మంటనీ, రోమకూపాల్లోంచి ఆవిరులొస్తున్న భ్రమనీ కలిగిస్తుంది.


హానికారక కఫం ఒక చోట స్థిరంగా వుండిపోయి అలా వెళుతున్న, జలనాళి కలలోని, వాయువుని అడ్డేస్తుంది. అప్పుడా గొట్టాలు మంటలలో పడిన మట్టి కుండల్లా ఉష్ణాన్ని పీల్చుకున్నట్లయిపోతాయి. గొంతు బార్లీ గింజతో పొడవబడుతున్నట్లుంటుంది. నోటిలో తీపి, నిద్రవస్తున్నట్లు వుండడం అనుభవమవుతాయి. తల సోమరిగా మారుతుంది. అలసట, ఆయాసము, తిండి నచ్చకపోవుట, అజీర్ణము- ఇవన్నీ త్రిదోషాలూ కలిసి హృద్రోగిపై దాడి చేయడం వల్ల వస్తాయి.


చీము, అజీర్ణ పదార్థాల నిలువ కలిసి రక్త ప్రసరణాన్ని నిరోధిస్తాయి. దీనివల్ల వాత, పిత్తాలు ఆందోళితమవుతాయి. దీని వల్ల రోగి కొంతసేపు వేడినీ కొంతసేపు చల్లదనాన్నీ తట్టుకోలేకపోతుంటాడు. రెండూ భరించలేనంత భారీగానే శరీరంపై దాడి సలుపుతాయి.


దాహం ప్రేగులలోని ముఖ్య ప్రాంతాన్ని నిరోధిస్తే అది పిత్త ప్రకోపమే. రసాల తగ్గుదల వల్ల వచ్చే దాహం త్రిదోష కారకం. కణజాల క్షీణత, మూర్ఛ, జ్వరం, త్రిదోష తీవ్రతల వల్ల దాహాన్ని ఉపసర్గాత్మిక అంటారు. ఇది మృతికి ముందలి దశ చిహ్నం.


(అధ్యాయం - 154)


మదాత్యయరోగ నిదానం


మత్తు పదార్థాలను సేవించడం వల్ల వచ్చే రోగాన్ని మదాత్యయ రోగమంటారు. మద్యం వల్ల ముందుగా శృంగారంలో సమయం తగ్గిపోతుంది. అది శరీరంలోని అతి సూక్ష్మ నాళాల్లో కూడా చొచ్చుకుపోయి వాటిని చెడగొడుతుంది. మెదడుపై ప్రభావాన్ని చూపడం ప్రారంభిస్తుంది.


మధువును గాని సారాను గాని ఇతర మాదక ద్రవ్యాలను గాని అతిగా సేవించిన వారిని బ్రతికించడం కష్టం. అది వారి కణములన్నిటినీ సోమరులుగా తయారుచేస్తుంది. దాంతో అవి ఏ మందుకీ ప్రతి చర్యను చూపించవు. మద్యం జ్ఞానేంద్రియాలనుద్రేకపఱచి మెదడును మొద్దుబారేలా చేస్తుంది. అందువల్ల వాటి మధ్య సమన్వయం లోపించి మొత్తం శరీరభాగాలన్నీ దెబ్బతింటాయి. అందుకే మొదటిసారి, రెండవసారి తాగిన వాడికి చురుకుదనం పెరిగినట్లై గొప్ప హాయిగా వుంటుంది కాని తరువాత ఆ సుఖం వుండదు. అయినా మూర్ఖుడు భ్రమలో మునిగి ఆ సుఖం కోసం అన్వేషిస్తూ తాగుతునే ఉంటాడు. తాగుడుకి అలవాటుపడిన ఉన్నతాధికారి అదుపులేని క్రూర విషసర్పమువంటివాడు. ఈ మత్తులో గాని, అది దొరకనపుడు గానీ ఎవరిని ఎందుకు కాటేస్తాడో చెప్పలేం. మద్యం క్రూరత్వాన్ని పెంచుతుంది. నోటితో చెప్పలేని చెడ్డపనులు చేయిస్తుంది.

Tuesday, 31 December 2024

శ్రీ గరుడ పురాణము (338)

 


హృదయ తృషారోగము


హృద్రోగం - అనగా గుండె జబ్బు. క్రిముల వల్ల వాత, పిత్త, కఫ, ప్రకోపాల వల్ల లేదా మూడిటి కలయిక వల్ల మొత్తం అయిదు కారణాలలోనేదో ఒక దాని వల్ల గుండె చెడవచ్చును.


వాతం వల్లే వచ్చే హృద్రోగంలో గుండె, కడుపుభాగం అంతా ఖాళీ అయిపోయినట్లుంటుంది. రోగి తెగతింటూ వుంటాడు. ఈ తిన్నదంతా ఎక్కడికి పోయిందని ఏడుస్తుంటాడు. గుండె భాగం తిమ్మిరెక్కినట్లవుతుంది. తడుముకుంటే లోపలేదో విరిగిపోయినట్లుంటుంది. గుండె తడారిపోతుంది. రోగికి మత్తుగా వుంటుంది. ఉన్నట్లుండి రోగి నిరాశ చెందుతాడు. దుఃఖభారం పెరుగుతుంది. తీవ్రంగా భయపడతాడు. ధ్వని ద్వేషం కలుగుతుంది. చిన్న ధ్వనికి కూడా చిరాకు పడిపోతాడు. నిద్ర సరిగా పట్టదు, శ్వాస కష్టం మీద ఆడుతుంది.


పిత్తం వల్ల వచ్చే హృద్రోగంలో రోగికి విపరీతమైన దాహం, నీరసం, నిస్సత్తువ, మంట, చెమట, త్రేన్పులు (పుల్లటివి) అరగనివి, ఆమ్లం, వాంతి, జ్వరం, కనులు మబ్బు వేయుట జరుగుతాయి.


ఇదే రోగం కఫం వల్ల వస్తే గుండె తిమ్మిరెక్కిపోతుంది. జీర్ణకోశం చెడుతుంది. ముఖంలోతుకి పోయినట్లవుతుంది. లేదా ఉబ్బుతుంది. వెక్కుళ్ళు, ఒంటి నొప్పులు, ఉమ్ములో చీము పడుట, మత్తుగా వుండుట, ఆయాసము, తిండిపట్ల విముఖత దీని ఇతర లక్షణాలు.


వాత, కఫ, పిత్త, మూడిటి దోషాల కారణంగా గుండె సమస్య వస్తే పై విభిన్న లక్షణాలన్నీ కనబడతాయి. క్రిముల వల్ల వచ్చే హృదయ తుషారోగంలో నల్లని పచ్చని కలగలుపు రంగు కనులలో కనబడుట, మత్తుగా వుండుట, కళ్ళు చీకట్లు కమ్ముట, గుండె రసాల నిల్వ, అశాంతి, అంగాలలో దురద, దగ్గున్నా లేకున్నా కఫం నోటి నుండి రాలుట అనే లక్షణాలు బయటపడతాయి. 


గుండెనెవరో అంపంతో కోస్తున్నట్లుంటుంది. కత్తెరతో కత్తిరిస్తున్నట్లుంటుంది. ఈ రోగమునకు తొలి దశలోనే మందు పడకపోతే ప్రాణాంతకమే.


త్రిదోషాలలో దేనివల్లనైనా పిపాస హెచ్చు మీరుతుందిగానీ గుండె నీరసం మాత్రం మూడూ కలిసి వస్తేనే వుంటుంది.


హృద్రోగాలలో అంటువ్యాధి కూడా ఒకటుంది. అది సోకినా వాత, పిత్త దోషాలుం టేనే శరీరం లో వర్ధిల్లుతుంది (ఇది ఆరవ హృద్రోగం)


హృదయరోగం లేదా హృద్రోగం ఏదైనా మరొక దోష ప్రోద్భలం ఉంటేనే ఉద్రేకిస్తుంది. కుదుపు, గుండెదడ, మనోద్రేకము, గుండెలోమంట, ధాతు బలహైన్యము వల్ల మూర్ఛ - ఇవన్నీ కనిపిస్తాయి. నాలుక అంగిలి భాగం ఎండిపోయి దాహం వేయుట, అన్ని జలభాగాలూ పొడిబారుట, పరాకుమాటలు, స్పృహ తప్పుట, నోరు బీటలు వారినట్లగుట, అన్నద్వేషం, గొంతులో దైన్యం, మనసు ఒకరీతిలో నుండక పోవుట, జలాంగాలన్నీ ఎండుట వల్ల నాలుకను బయటకు తీయలేకపోవుట, త్రేనుపులు కూడా హృద్రోగికి ఉంటాయి.


వాత దోషం వల్ల వచ్చే గుండెజబ్బు అతి బలహైన్యము, నిరాశ, తలలో మత్తు, కణతల నొప్పి, వాసన చూసే శక్తి తగ్గుట, (నాలుకకి) నునుపు జిడ్డుతగ్గుట, నిద్రపట్టక పోవుట, మొత్తంగా నీరసం - లను కలిగివుంటుంది.

Monday, 30 December 2024

శ్రీ గరుడ పురాణము (337)

 


అరోచకం


సుశ్రుతా! ఇపుడు అరోచక అనగా అన్నముగాని మరేమిగాని సహించక నిరాసక్తత పెరుగుట అనే రోగాన్ని చర్చిద్దాం. నాలుకనుండీ, గుండె నుండీ స్రవించే మూడు గ్రంథుల వల్ల వాత పిత్త కఫప్రకోపాల వల్ల మూడు రకాల అరోచకం కలుగుతుంది. నాలుగవ రకం ఈ మూడు ప్రకోపాలూ కలిస్తే వస్తుంది. అయిదవ దానికి కారణంమానసిక రుగ్మత.


వాతం వల్ల వచ్చే అరోచకంలో నోరంతా వగరు తిన్నట్టుగా వుంటుంది. పిత్త ప్రకోపంలో చేదు కఫం కారణమైతే తీపి రుచులు నోటిని కమ్మేస్తాయి.


కోపంగాని దుఃఖం కాని కమ్ముకున్నపుడు మనిషికి ఏ రుచీ పట్టదు. అరోచక రోగికి ఏది తిన్నా నోటిలో రోగ ప్రకోపం వల్ల వున్న రుచితప్ప ఇంకేరుచీ తెలియదు. దీనికి కారణం వాంతి వస్తున్నట్లుండడం ఈ కఫ ప్రకోపానికి మూల కారణమేమిటంటే ఉదాన వాయువు నాలుక అడుగున చేరిన ప్రకోపాలను ఎగురుగొట్టడానికి ప్రయత్నం చేసినపుడు పిచ్చి పిచ్చి రసాలేవో ఊరిపోయి నోరంతటా చిమ్మబడడం. అది నాభి ప్రాంతాన్ని, వీపుని బాధిస్తుంది. తిన్నదేదైనా లోనికి పోగానే పక్కలోకి దిగబడుతుంది. కొంచెం కొంచెం వాంతి రూపంలో బయటికొస్తుంది. మొత్తం నోరంతా వగరైపోతుంది. వాత చర్యల వల్ల పెద్ద ధ్వనులతో త్రేన్పులు వచ్చి నాలుక తడారిపోతుంది. వెక్కుళ్ళు, గొంతు బిరుసెక్కుట వుంటాయి. 


ఈ రోగం పిత్త ప్రకోపం వల్ల వచ్చినదైతే ఉప్పు నీరు లాటిది రక్తంతో కలిసి వాంతిలో పడుతుంది. అది హరిత, పీత వర్ణాలు కలిసిన రంగులో ఉంటుంది. వాంతి వస్తున్నపుడు నోరంతా చేదుగా, ఘాటుగా వుంటుంది. దాహం, తెలివితప్పుట, శరీరమంతా మండుతున్నట్లుండుట దీని ఇతర లక్షణాలు. కఫం వల్ల వచ్చే రోగంలో చిక్కగా తేనెలా జిగటగా నున్న పసుపు పచ్చటి చీము నీటితో కలిసి వాంతి అవుతుంది. నోరు ఉప్పగా అయిపోతుంది. రోమాంచమూ కలుగుతుంది.


ఇది తీవ్రతరమైతే నోరు వాచిపోయి తీయగా అయిపోగా, మనిషిలో స్థిరతపోయి, నాడిలో అశాంతి బయలుదేరి, అక్కడ నొప్పి వచ్చి, వెక్కుళ్ళు తరుచుగా వస్తుంటాయి. ఈ దశలో కుదుర్చడం అసాధ్యం.


ఈ రోగికి ఏది విన్నా, ఏమికన్నా అసహ్యతే కలుగుతుంటుంది. ఈ బాధలన్నీ ఆహారంలో కల్తీ వల్ల కలిగినవైతే (పురుగులున్నవైతే) శూల లక్షణాలన్నీ వస్తాయి. ప్రకంపనం వుంటుంది. వాతం కూడా చెడుతుంది.


(అధ్యాయం -153)

Sunday, 29 December 2024

శ్రీ గరుడ పురాణము (336)

 


గోళ్ళూ, ఎముకలూ, జుట్టూ అసహజమైన వేగంతో పెరిగిపోతుంటాయి.


శ్వాసకోశానికి సంబంధించి ఈ రోగరాజంలో పదకొండు రుగ్మతలు బయట పడతాయి. పడిశము, శ్వాసకృచ్ఛము, దగ్గు, గొంతు నీరసించుట, తలనొప్పి, అన్నద్వేషం, ఎగవూపిరి, అంగముల్లో అతి నీరసం (చీపురుపుల్లల వలె అయిపోవుట) వాంతులు, జ్వరం, ఛాతీనొప్పి ఇవి వచ్చిన తరువాత గొంతులో భరించలేని బాధ, ఉమ్ములో చీము, నెత్తురు, అంగాలు నొక్కుకుపోతున్న బాధ కలుగుతాయి.


వాత ప్రకోపంవల్ల తల, కణతలు అంగాలు నొప్పెడతాయి. అన్నీ ఒత్తిడికి లోనౌతాయి. గొంతు నొక్కుకుపోతున్నట్లుంటుంది. పిత్త ప్రకోపం వల్ల భుజాలలో మంట, అరికాళ్ళలో, చేతుల్లో మంట, నులుగడుపు, నెత్తుటి వాంతులు, మలంలో దారుణ దుర్వాసన, నోటి దగ్గర దుర్వాసన, జ్వరం, పేలాపన వస్తాయి. కఫం ప్రకోపిస్తే అరుచి, వాంతులు, సగం శరీరం బరువెక్కిన భీతి కలుగుతాయి.


నోటినుండి చొంగకారుట, జలుబు, అజీర్ణం, శ్వాసకృచ్ఛం, గొంతు బొంగురు కూడా కఫం వల్లనే వస్తాయి. జీర్ణకోశం సరిగా పనిచేయకపోవడం వల్ల మామూలుగా స్రవించే ద్రవాలు పెరిగి కఫం రసాలు అతిగా ఊరి నిలవైపోయి నిల్చిపోయి అన్ని నాళాలపై పూతలాగేర్పడి వాటి ద్వారాలను మూసేస్తాయి. అప్పుడు శరీరంలో ధాతునిర్మాణం ఆగిపోయి మొత్తం అంతటా మంటలు చెలరేగుతున్నట్లుండి మతి చెదరిపోతుంది. మరికొన్ని దారుణ బాధలు కూడా వుంటాయి. క్షయరోగి తీసుకునే ఆహారం హానికర ఆమ్లాలతో తడిసిపోయి ఇతర ద్రవాలతో కలిసి ఎందుకూ పనికిరాకుండా పోతుంది. అతనికి బలం చేకూరదు. రసాలేవీ అతని శరీరంలో రక్తాన్నుత్పత్తి చేయవు. దాంతో రోగి క్షీణించి పోయి కాళ్ళూ చేతులూ చీపురుపుల్లల్లాగా అయిపోతాయి. ఈ చీపురుపుల్ల లక్షణం కనిపించే లోపల ఎన్ని రుగ్మతలు బయటపడినా మందుల ద్వారా చికిత్స ద్వారా రోగాన్ని కుదర్చవచ్చు.


దేహంలో జఠరాదిరసాలు పాడైతే కొవ్వు చేరక మనిషి నీరసించిపోతాడు. గొంతు బొంగురు వచ్చి గొంతు బలహీనమై బొంగురువోయి వణుకుతుంది.


వాత ప్రకోపంలో శరీర కాంతినాశనమగుట, నునుపు పోవుట, వెచ్చదనం మాయమగుట జరిగి గొంతుభాగం బార్లీగింజ రూపంలో రంగులోకి వచ్చేస్తుంది. కఫ ప్రకోపానికి ఈ జబ్బులో ఒక వింతైన గురక, గొంతులో నిరంతరం జిగటగా చీము కదులుతుండడం సూచనలు. పిత్త ప్రకోపం వున్న క్షయ రోగికి గొంతు, తాలువు మండుతున్నట్లుంటాయి. కఫలక్షణాలైన తలతిప్పు, కనులముందు చీకటి తెరలు కూడా కనిపించవచ్చు.


ఏది యేమైనా కాలుసేతులు చీపురు పుల్లలవలె కాక ముందైతే చికిత్స చేయవచ్చు.


(అధ్యాయాలు 148-152)

Saturday, 28 December 2024

శ్రీ గరుడ పురాణము (335)

 



* హిక్కా (హిక్కా అంటే వెక్కిళ్ళు) ముందుగా 'గాలి అరటి' (ఊపిరాడక గట్టిగా ప్రయత్నించి నీరసం తెచ్చుకోవడం) తో సోకుతుంది. ఇందులో భక్ష్మోద్భవ, క్షుద్ర, యమలా, మహతీ, గంభీరా అనే రకాలున్నాయి. మొదటి రకం తొందర తొందరగా గట్టి, ఘాటు పదార్ధాలను ముందూ వెనకా చూసుకోకుండా మేసెయ్యడం వల్ల వస్తుంది. ముఖ్యంగా సాయంత్రం లేదా రాత్రి వాతం ఆందోళితంగా వున్నపుడు నోట్లోకి త్రోయబడే గట్టి తిండి ద్రవాలు దీనికి ఉత్పాదకాలు, వాయువు రెచ్చగొట్టబడగానే చిన్నచిన్న ధ్వనులు వస్తాయి. రోగి ఏ కాస్త కష్టించినా వాతం ప్రకోపించి క్షుద్ర హిక్కా వస్తుంది. బోరయెముక నుండి పుట్టే ఈ రోగంలో కొన్నాళ్ళు దాకా వ్యాప్తి, తీవ్రతా వుండవు. తరువాతి రకమైన యమలా జంటలలో కనిపిస్తుంది. అది కూడా తీవ్రంగా వుండదు. అయితే ఈ దశలో ముఖం వణుకుతుంటుంది. తల, మెడ తిరుగుతుంటాయి. ఇది ముదిరితే తెలివిలేని వాగుడు, వాంతులు, విరేచనాలు, కనుగ్రుడ్లు తిరుగుట, కళ్ళు తేలవేయుట, ఆవులింతలు ఇవన్నీ గోచరిస్తాయి. ఇవన్నీ ఎక్కువ కాలం పాటు వుంటే రోగం ముదురుతోందని గ్రహించాలి.


మహతీ వెక్కిళ్ళలో అన్నీ తీవ్రంగానే ఉంటాయి. కనుబొమ్మలు క్రిందికి జారిపోతాయి. కణతలు లోతుకిపోతాయి, కళ్ళు చెవులకి దగ్గరగా జరుగుతుంటాయి. ఒళ్ళంతా తిమ్మిరెక్కిపోతుంది. మాటలో స్పష్టత పోతుంది. జ్ఞాపకశక్తి నశిస్తుంది. తెలివి తప్పిపోతుంది. సంధులన్నీ విడిపోతాయి. వెన్నెముక వంగిపోతుంది.


గంభీర అంటేనే తీవ్రత. ఇది నడుము, నాభిలలో మొదలవుతుంది. తీవ్రమైన నొప్పి, పెద్ద ధ్వనులు, పరమహింస, మిక్కిలి బలం (అంటే మందుకి లొంగకపోవడం) దీని లక్షణాలు. పెద్ద పెద్ద ఆవులింతలూ, అంగాల కుదుపూ వుంటాయి. జాగ్రత్తగా, ఓపిగ్గా చికిత్స చేస్తే దీన్ని రూపుమాపవచ్చు, హిక్కా, క్షయలు ప్రాణాంతకాలు, ఇతర (ఈ అధ్యాయంలో వున్న) రోగాలు కూడా బలహీనుల, త్రాగుబోతుల, అతి తిండిపోతుల, వృద్ధుల, అతి నీరస జీవుల, మలబద్ధక రోగుల విషయంలో ఒక రోజు నిర్లక్ష్యం చేసినా ప్రాణాంతకాలవుతాయి.


రాజయక్ష్మ, క్షయ రోగాలలో తొలి జబ్బు పాతరోజుల్లో నక్షత్రాలకీ, చంద్రునికీ, రాజులకీ, బ్రాహ్మణులకీ ఎక్కువగా సోకేది కాబట్టి దానికాపేరు పెట్టబడింది. దీనికే క్షయ అనీ రోగరాట్ అనీ శోష అనీ కూడా పేర్లున్నాయి. దీనికి కారణాలు 1) సాహసం అనగా తెగింపు, అతి వ్యాయామం, అతి బలం 2) వేగ సంరోధం అనగా మలమూత్రాలను బలవంతంగా అణచిపెట్టుట 3) శుభ్రజ స్నేహ సంక్షయం అంటే వీర్యాన్ని, శక్తినీ, బలాన్నీ వృథా చేయడం 4) అన్నపాన విధి త్యాగం అనగా ఒక నియమమూ, అదుపూ లేకుండా తినడం, త్రాగడం.


పైన చెప్పిన కారణాల వల్ల వాతం ప్రకోపిస్తుంది. పిత్తం చెదరిపోతుంది. అనవసరాలూ హానికరాలునైన పదార్థాలు గడ్డకట్టిపోయి కఫం ఉద్రేకానికి లోనై అది నాళాలలో పేరుకుపోతుంది. సంధులలో చేరుతుంది. కాలువలను అడ్డుతుంది. అపుడు ఈ రోగం కవాటాలను మూసిగాని, వాచేలా చేసి గాని నరాలను చెడగొడుతుంది. అప్పుడు గుండె దానిప్రక్క క్రింది భాగాల్లో తీవ్రమైన నొప్పి పుడుతుంది.


ఈ రోగ లక్షణాలు (వచ్చిందని సంకేతాలు) పడిశం, ఉష్ణోగ్రత పెరుగుదల, చొంగ కారుట, నోటిలో తీపి రుచి, శరీరం నున్నబడుట, తిండి సహించకపోవుట, నడవాలనే తీవ్రవాంఛ, తినాలనే గట్టి కోరిక, ఆ రెండూ చేయలేకపోవడం, స్వచ్ఛతలో అతివ్యగ్రత, ఎంత శుభ్రంగా వున్నదైనా అపరిశుభ్రంగా వుందని అరవడం, తన భోజనపాత్రలో తాగే వాటిలో లేని ఈగలను, తలవెంట్రుకలను గడ్డి పరకలను ఉన్నాయని అనుమానించి ఏరుతుండడం, వెక్కుళ్ళు, అశాంతి, వాంతులు, ఎంత రుచికరమైనవి పెట్టినాబాగు లేవనడం.


ఈ రోగిలో కొన్ని సందర్భాల్లో శరీరమంతటా కనులతో సహా తెల్లటి మెరుపు రంగు వచ్చి చేరుతుంది. నాలుక, బాహువు తీవ్రంగా నొప్పెడతాయి. స్త్రీ సుఖం కావాలని పిస్తుంది. మద్యమాంసాలూ కావాలనిపిస్తుంది. తీరా వాటిని చూస్తే చిరాకు కలుగుతుంది. విచిత్రమైన కలలు వస్తుంటాయి. నిర్మానుష్యగ్రామాలూ, ఎండిన చెరువులు, దొరువులు, చాలా కాంతివంతమైన తోకచుక్కలు, చెట్లతో సహా తగలబడిపోతున్న అడవులు, తనపైకి ఉరుకుతున్న ఊసరవెల్లులు, పాములు, కోతులు, పక్షులు- ఇలాటివన్నీ కలలోకి వస్తుంటాయి.

Friday, 27 December 2024

శ్రీ గరుడ పురాణము (334)

 


ఈ రుగ్మతలో కనిపించే తొలి బాధలు ఛాతీలో నొప్పి, శ్వాసలో తేడా, మలబద్దకం, కణతల వద్ద పగుళ్ళు వేస్తున్నంత నొప్పి, అతిగా తినడం వల్ల ఆయాసం. లోలోన ఉద్రేకించిన వాయువులు శ్వాస నాళాలలో వెనుకకూ ముందుకూ పరుగిడుతూ కఫాన్ని రెచ్చగొడతాయి. దానివల్ల కలిగే శ్వాసలో శ్రమను, క్షుద్ర శ్వాస రుగ్మత అంటారు. అది తలను, మెడను, గుండెను పిడికిట బట్టి వాటి పక్కలలో అతి నొప్పిని కలిగిస్తుంది. గొంతులో పిల్లికూతలు, వెక్కిళ్ళు, పడిశము, ముక్కు వాపు వస్తాయి. కఫం పైకి పోయినపుడు ఒళ్ళంతా నొప్పెడుతుంది. కాని అది పోగానే కాసింతసేపు ఊపిరాడుతుంది. 


పడుకుని వుంటే ఊపిరాడదు. కూర్చుంటే కాస్త నయం. నిలబడితే బాగా ఊపిరాడుతుంది. దీనివల్ల రాత్రిళ్లు కాళరాత్రులవుతాయి. తల పైకెత్తితే ముదురంతటా చెమట్లు పట్టి కణతల వద్ద నొప్పి పుడుతుంది. ఊపిరి తీయడం కోసం అవస్థ పడుతున్న రోగి వణకుతుంటాడు. వేడిగా ఏదైనా తాగాలనుకుంటాడు. ఇది తమక దశ బలమైన అంగాలు కలవారిలో ఈ రుగ్మతను చికిత్స ద్వారా కుదర్చవచ్చును. తీక్షణమైన జ్వరం, కంపనం వున్నవారిని చలవద్వారా రోగముక్తులను చేయలేము.


మహాశ్వాస రోగంలో బాధితులకు ఊపిరందదు. దానికై గట్టిగా ప్రయత్నిస్తే సర్వాంగాలూ బద్ధలైనంత నొప్పి పుట్టుకొస్తుంది. చెమటలు పడతాయి. తెలివి తప్పు తుంటుంది. నడుముకి లోపలంతా మండుతుంటుంది. కళ్ళుపైకెత్తి చూడలేరు. అవి గిరగిర తిరిగిపోతున్నట్లనిపిస్తాయి. ఒక కన్ను బాగా ఎఱ్ఱబడిపోతుంది. మలబద్దకముంటుంది. నోరంతా పొడిగా వుంటుంది. అతి వాగుడు, పలవరింతలు, తెలివితప్పుట ఒక దాని వెంట నౌకటి వస్తుంటాయి. ముఖం పాలిపోతుంది. లేసి కూర్చోబెడితే శ్వాస తీసుకున్నప్పుడు శబ్దాలు వస్తుంటాయి. అవి ఎద్దు అంకెల్లా వుంటాయి.


తరువాతి దశలో రోగికి స్పర్శ కూడా తెలియదు. కనులలో ముఖంలో ఏదీ అర్ధం దానప్పుడు కలిగే గాబరా కనిపిస్తుంది. మలమూత్రాలాగిపోతాయి. మాట పడిపోతుంది.


ఊర్ధ్వ శ్వాసరోగికి నిశ్వాసం ఉండదు. ఊపిరి పీలుస్తున్నట్టే వుంటాడు. అదీ లోపలికి గాలి వెళుతున్నట్టే వుంటుంది. పైకి రాదు కణతలు, తల తీవ్రమైన నొప్పికి లోనవుతాయి. గొంతు తడారిపోతుంది. నోరు, చెవులు కఫాన్నీ చీమునీ కలిగి నిండిపోయినట్లుంటాయి. వాయు ప్రకోపం వల్ల రోగి అటూ ఇటూ ఏదో, ఎటో తెలియనట్లుగా తిరుగుతుంటాడు. సంధులు నొప్పెడుతున్నాయని మూలుగుతాడు. అరుస్తాడు. కాని ధ్వని బయటకు రాదు. ఈ బాధలన్నిటినీ రోగాన్ని కుదర్చడం ద్వారా తొలగించవచ్చు. అదీ మరీ ముదిరిపోకుండా వుంటేనే. ఈ రోగం శీఘ్ర ప్రాణాంతకం.

Tuesday, 24 December 2024

శ్రీ గరుడ పురాణము (333)

 


వాతదోషం వల్ల వచ్చే దగ్గు రుగ్మతలో గొంతు నోరులు బీటలు వేసినట్లవుతాయి. చెవి పొరలు పొడిదేరిపోతాయి. శరీరం లోపల వుండే వాయువులు పైకెగసి ఛాతీలోకి దూసుకుపోయి కంఠనాళమును ఒత్తుతుంటాయి. అన్ని అంగాలలోకి ఆ వాయువు దూరడంతో ఒళ్ళంతా బూరటిల్లినట్టుంటుంది. కనుగ్రుడ్డు పైకి ఉబికి వచ్చినట్లుంటాయి. గొంతులోంచి ఇనుప రేకులను విరిచిన ధ్వని వస్తుంది. ఛాతీ, పక్కలు, తల, తొడలు నొప్పెడతాయి. ఉద్రేకము, మూర్ఛ వస్తాయి. రోగి మాట్లాడలేక పోతుంటాడు. పొడిదగ్గు బాధిస్తుంది. దగ్గినపుడు శరీరమంతా విపరీతంగా నొప్పి పుడుతుంది. ఆ దగ్గు ధ్వని పెద్దదిగా వుంటుంది. ఒళ్ళంతా గగుర్పాటులకు లోనవుతుంది. అతి కష్టం మీద ఎంతో కొంత పొడి కఫాన్ని ఉమ్మితే కాస్త తేలికగా అనిపిస్తుంది.


పిత్త ద్రవ ప్రకోపం వల్ల వచ్చే దగ్గుకి ఈ లక్షణాలుంటాయి. కళ్ళు పచ్చబడతాయి. నోరు చేదుగా వుంటుంది. శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. తల తిప్పుతుంది. వాంతిలో రక్తం పడుతుంది. దాహం వుంటుంది, గొంతు పెగలదు. చూపు మబ్బేసినట్లుంటుంది, మత్తు ఆవరిస్తుంది, దగ్గినపుడు గొంతుపై అగ్నివృత్తాలు కనిపించి, పోతుంటాయి. కఫదోషం వల్ల వచ్చే ఛాతినొప్పి, తలనొప్పి, తిమ్మిరి, గుండె బరువు వుంటాయి. గొంతునిరంతరం కఫం ముద్దలతో గరగరమంటూనే వుంటుంది. ముక్కు దిబ్బడ, వాంతి వస్తున్నట్లుండడం, తిండి అంటే చిరాకు, ఒళ్ళు గగుర్పాటు కలుగుతాయి.


పోరాటాలలో వ్యాయామాలలో అజాగ్రత్తగా, శక్తికి మించి పాల్గొంటే ఛాతి లోపలి భాగంలో గాయాలై వాత, పిత్త,కఫాలు మూడూ ప్రకోపిస్తాయి. కఫం రక్తంతో కలసి ముడులు కడుతుంది. అది పసుపు పచ్చ లేదా మలిన రంగులో వుంటుంది. రోగి దగ్గుతూ కఫాన్ని ఉమ్ముతున్నపుడు ఛాతీ విరిగిపోతుందేమో అన్నంత బాధ కలుగుతుంది. శరీరమంతా సూదులతో పొడుస్తున్నట్లుంటుంది. తరువాత బల్లెంతో పొడుస్తున్నట్లుంటుంది. మోచేతుల, మోకాళ్ళ (సంధుల) నొప్పులు, జ్వరపు వేడితో బాటు పెరుగుతుంటాయి. దాహం, ఊపిరాడక ఆయాసపడుతుండడం, గొంతు క్షీణించడం, వణుకు, పావురం వలె గుడగుడ ధ్వనులు, ఉమ్మినా వాంతి చేసుకున్నా బోలెడు కఫం రావడం, జ్వరం కాస్త ముదిరితే మూత్రంలో రక్తం పోవడం, వెన్నునొప్పి ఇవన్నీ వుంటాయి. ఇవన్నీ క్షతకాస లక్షణాలు. ఈ దశలో వాతం ప్రకోపించి శరీర ధాతువులన్నీ తీవ్రంగా దెబ్బతింటే రాజయక్ష్మ జ్వరం ప్రవేశిస్తుంది.


అప్పుడు రోగి దగ్గినపుడు పడే కఫం ఆకుపచ్చగా, పసుపుపచ్చగా, ఎఱ్ఱని చారలతో నిండి బహిర్భూమి సందర్భంలోని దుర్వాసన వేస్తుంటుంది. చీము కూడా పడుతుంటుంది. నిద్ర పోవడానికి ఎంత ప్రయత్నించినా నొప్పి వల్ల కుదరదు. గుండెను ఎవరో మూకుడులో పెట్టి వేయిస్తున్నట్లుంటుంది. అకస్మాత్తుగా వేడిగా ఒకమారు చల్లటిదొక మారు తినాలని పిస్తుంది. ఎంత తిన్నా చాలదనిపిస్తుంది. నీరసం ఎక్కువవుతుంది.


ఉన్నట్టుంటి ముఖం కాంతివంతంగా, గాజువలె నున్నగా అవుతుంది. కనులలో మెరుపు కనబడుతుంది. అయినా రోగబాధలన్నీ పెరుగుతుంటాయి. బలహీనులను ఈ జ్వరం పూర్తిగా వంచివేస్తుంది. బలవంతులలో గాయాల వల్ల వచ్చిన దగ్గు అయితే చికిత్స ప్రారంభ దశలో వుండగానే తగ్గిపోతుంది. జాగ్రత్తగా చికిత్స చేస్తే వృద్దులను కూడా తొలిదశలలోనైతే రోగవిముక్తులను చేయవచ్చు. దగ్గు, మందాగ్ని, క్షయ, కడుపులో తిప్పు, వాంతి మున్నగు రోగలక్షణాలు కనబడగానే నిర్లక్ష్యం చేయకుండా చికిత్సకుని సంప్రదించాలి. లేకుంటే అవి చాలా వేగం ముదిరి పోతాయి.


శ్వాసనిరోధక రోగం దగ్గు బాగా ముదిరితే వస్తుంది. శరీరంలోని ద్రవాలను ఉద్రిక్తపఱచడం వల్ల కూడా ఇది రావచ్చు. ఆమాతిసారం (చీము విరేచనం) వమనం, పచ్చకామెర్లు, ధూళి అసహ్యత, పొగ, గాలి తెరలలో చిక్కుకొనుట, మంచు కరిగిన నీరు, విషతుల్యరసాలు, సంధులపై హింస్రకదాడులు కూడా శ్వాస నిరోధక జ్వరాలను కలిగిస్తాయి. ఇందులో క్షుద్రక, తమక, ఛిన్న, మహా, ఊర్ధ్వ అని ఐదు రకాలున్నాయి. కఫం పేరుకుపోవడం వల్ల గాలికి అడ్డంకి ఏర్పడుతుంది. శరీరంలో నిరంతరం పరిభ్రమించే వాయువులు ఒకచోట నిరోధింపబడితే చుట్టూ తిరుగుతూ మెత్తటి ప్రధాన కణజాలాలపై నాళాలపై గుండెపై, బలమైన ఒత్తిడిని కలుగజేసి ఆయా భాగాలను పాడు చేస్తాయి. నడుము లోపలి అంగాలను కూడా ప్రభావితం చేస్తాయి.

Monday, 23 December 2024

శ్రీ గరుడ పురాణము (332)

 


రక్త, పిత్త, కాస, శ్వాస, హిక్కా, రాజయక్ష్మ రోగ నిదానాలు


రక్తపిత్త రోగంలో పిత్తం రక్తాన్ని కలుషితం చేస్తుంది. పిత్తం ఆందోళన చెందడానికి ప్రధానకారణం విపరీతమైన, బలమైన తిండి (ఉదా॥ కోద్రవ, ఉద్దాలకాది ధాన్యాలు) మిక్కిలి వేడి, పుల్లని, కారపు, ఘాటైన ఇతర చిక్కటి వాసనలు, రుచులుగల పదార్థాలను తినుట వల్ల పిత్తం పాడవుతుంది. ఈ రోగంలో శరీరం నుండి బయటికి వచ్చే ద్రవాలూ, రసాలూ ఎఱ్ఱగా రక్తపు వాసననే కలిగియుండడం వల్ల ఈ రోగానికి ఆయుర్వేదంలో రక్త పిత్త రోగమని పేరు పెట్టబడింది. ఈ ద్రవాలూ, రసాలూ, రక్త నాళాల్లోంచి, కాలేయం నుండీ, క్లోమం ద్వారాను స్రవిస్తాయి.


ఈ జ్వరం చేసే రక్త స్రావక దురాక్రమణ, చాలా లక్షణాల ద్వారా సూచించబడుతుంది. తల బరువు, ఆకలి లేకపోవడం, చల్లని వస్తువులు తినాలనిపించడం, దృష్టి పొగలు గ్రమ్మడం, పుల్లవాసనలతో వాంతులు, అసహ్యత, వెక్కుళ్ళు, ఊపిరందకపోవడం, తల తిరగడం, గ్లాని, ఎఱ్ఱరంగుని భరించ లేకపోవటం, జ్వరం తగ్గినపుడల్లా, నోటిలోంచి చేపల వాసన రావడం, కనులలో ఎరుపు, ఆకుపచ్చ, పసుపుపచ్చ ఛాయలు ఏర్పడడం, బయట కనిపించే రంగులలో తేడా తెలియకపోవడం, పిచ్చెక్కిపోయినట్లు కలలు రావడం ఈ లక్షణాలు.


తారుమారైన, కలుషితమైన రక్తం శరీరంపైకి ప్రవహించినపుడు ముక్కు, కన్ను, నోరు, చెవుల ద్వారానూ, క్రిందికి వచ్చినపుడు లింగ, యోని, గుదాల ద్వారానూ బయటికి వస్తుంది. శరీరమంతటా వున్న రోమకూపాల నుండి కూడా చిమ్ముతుంది.


ఈ రోగ చికిత్సలో రక్తాన్ని నిరోధించడం కంటే ప్రక్షాళన చేయడమే మంచిది. కఫం ఉన్నచోట ప్రక్షాళన చికిత్స ద్వారా మొత్తం శరీరమంతా స్వచ్ఛమై పోతుంది. వగరైన తియ్యనైన ఓషధుల ద్వారా కఫమును ఉత్పత్తి చేయవచ్చును. పులుపు, ఘాటు, వగరు గల మందులలో కఫాన్ని ఉత్పత్తి చేసే వాటిని కూడ వాడవచ్చును. రక్తస్రావం శరీరపు క్రింది భాగాలలో వుంటే రోగి పరిస్థితి ప్రమాదకరంగా వుంటే మంగకాయను వాడాలి. ముందు కొంచెంగా పిత్త పీడక ఔషధాన్ని కూడా వాడితే రోగికి బలం చేకూరుతుంది. అటువంటి రోగికి వగరుగా, తియ్యగా వుండే పదార్థాలను తినిపించడం అవసరం. అయితే పాడైపోయిన పిత్తంతో బాటు వాత, కఫ దోషాలు కూడా కలిసి వున్న రోగిని కాపాడడం అసాధ్యం. ఊర్ధ్వకాయంలో అత్యధిక రక్తస్రావం కలిగిన వారిని ప్రక్షాళించినా ప్రయోజన ముండదు. అసలు ప్రక్షాళనే జరుగదు.


రక్త పిత్త రోగుల్లో ప్రతిలోమ (పైకి) రక్తస్రావమున్న వారికి మంగకాయ (నక్స్వా మికా), ప్రక్షాళన మాత్రమే చికిత్స మార్గములు. అన్ని శారీరక ద్రవాలూ పాడయినపుడు మంగకాయ చికిత్స ఒక్కటే అనుసరింపబడాలి. సాధారణంగా ఈ రోగులకు తొలిరోజు నుండే తీవ్రస్థాయికి చెందిన బాధలు బయటపడుతుంటాయి. కాబట్టి రోగం కచ్చితంగా కుదురుతుందని మాత్రం చెప్పలేము.


కాస (దగ్గు) లోపల్లోపల వేగంగా వ్యాపించే రోగానికి సంకేతం. ఇది వాత, పిత్త, కఫ దోషాలతో బాటు శరీరంలోపల చేయబడిన గాయాల వల్ల లోనికి పోయిన ద్రవ్యాలవల్ల కూడా సోకుతుంది. వాత దోషం వల్ల తీవ్రంగానూ క్రమంగా ఇతరాలలో కాస్త తక్కువ గానూ దగ్గు కనిపిస్తుంది. నిర్లక్ష్యం చేస్తే శరీరం పూర్తిగా వేగంగా పాడవుతుంది. ఈ రోగం సోకిందనడానికి గొంతు దురద, మంట, అన్నద్వేషం సంకేతాలు.

Sunday, 22 December 2024

శ్రీ గరుడ పురాణము (331)

 


ఈ అయిదు రకాల చతుర్దక విపర్యయ జ్వరాలనూ వాటి దశలు పెరిగేకొద్దీ తగ్గించడం కష్టమవుతూ వుంటుంది. ప్రలేపక రకానికి చెందిన జ్వరానికి లక్షణాలు స్పృహ తప్పుట, పలవరింతలు, చలి, వేడి తగ్గిపోవడం, అంగాలన్నీ బరువెక్కడం, శరీర మంతటా కఫం ఒక పొరలాగా ఏర్పడినట్లు భయం కలగడం.


అంగ బలాశక (అంగాలబలాన్ని తినివేయు) జ్వరంలో ఉష్ణోగ్రత పడిపోవడం, ఒళ్ళంతా గరుకుగా కొయ్యబారినట్టుండడం, నడక కష్టం కావడం, అంగాలు తిమ్మిరెక్కడం, నిరంతరం కఫం బయటికి వస్తుండడం జరుగుతాయి. ఈ సమయంలో శరీరం నుండి స్రవించే ద్రవం చింతపండు ముక్కల రంగులో వుంటే దానిని హారిద్రక జ్వరమంటారు. ఈ పసుపు పచ్చ జ్వరం ప్రాణాంతకమే.


రాత్రిజ్వర లేదా పౌర్వరాత్రిక జ్వరంలో మూడు రకాల దోషాలుంటాయి. రోగి బలహీనుడైపోతాడు. ఇది రాత్రి మాత్రమే కాస్తుంటుంది. పగటివేళ ఇది కనబడకనే పోవడానికి కారణం కఫంలో తేమపోగా వాతం పొడిగా అయిపోవడం. కఫమూ, పిత్తమూ రోగి మొండెంలో చెడినపుడు శరీరంలో పైభాగాలన్ని వెచ్చగా, వేడిగా తగులుతుండగా బొడ్డు కింద అన్ని భాగాలూ మంచు ముద్దల్లా తగుల్తాయి.


శరీర ద్రవాల్లో రసాల్లో, రక్తనాళాల్లో వున్న జ్వరాన్ని చికిత్స ద్వారా తరిమేయవచ్చును. కొవ్వులో మాంసంలో చేరిన జ్వరాన్ని మాన్పవచ్చు. ఎముకల్లో మూలుగలో దూరిన జ్వరం తగ్గదు. (అస్థిగతరోగం) ఇందులో అపస్మారకం, కోపదారి తనం ప్రధాన లక్షణాలు.


జ్వరం తగ్గినట్లు ఎలా తెలుస్తుందంటే రోగికి శరీరం తేలికైనట్లుంటుంది. అలసట తీరుతుంది. ఉష్ణోగ్రత వుండదు. కనులు తేటగా వుంటాయి. చిన్న చిన్న చెమరింపులుండి వెంటనే ఆరిపోతుంటాయి. నోరు ఎగుడు దిగుడుగా వున్నట్లనిపిస్తుంది. ఏదైనా తినాలని పిస్తుంది. మనసు ప్రశాంతంగా వుంటుంది. తుమ్ములు వస్తాయి. తుమ్మినపుడల్లా హాయిగా వుంటుంది. బుఱ్ఱ గోక్కోవాలనిపిస్తుంటుంది.


(అధ్యాయం -147)

Thursday, 19 December 2024

శ్రీ గరుడ పురాణము (330)

 


శరీరగత ద్రవాల విషమత సాధారణంగా సతత జ్వరానికి కారణమవుతుంది. ఇది మొదట్లో వచ్చిపోతుంటుంది. పోయింది కదాని ఆలసిస్తే పీకపట్టుకుంది. రాత్రిళ్ళు ఎక్కువగా బాధపెడుతుంది. అన్యెద్యు జ్వరం సంధ్య (పగటికీ, రాత్రికీ మధ్య) లో ఎక్కువ ఉగ్రమవుతుంది. ఇందుల మాంస పుష్టిగల శారీరక ప్రదేశాలు ప్రభావితమవుతాయి. తలనొప్పి ఎక్కువగా వుంటే ఇది పిత్తవాత దోషమనీ (త్రిక) వెన్నునొప్పిగా వుంటే అది కఫ, పిత్త, దోష జనితమనీ గ్రహించాలి. వాత, కఫ దోష జనితమైన జ్వరంలో వీపంతా నొప్పెడుతుంది. ఈ జ్వరం ఒకరోజు మధ్యలో పూర్తిగా ఆగిపోతుంది. మరల ఒకరోజు తరువాత మొదలవుతుంది.


చతుర్థక జ్వరానికి కొవ్వు, మూలుగ, ఎముకలు గురవుతాయి. మూలుగకు మాత్రమే అంటే దోషం రోజులో రెండు మార్లు విజృంభిస్తుంది. కఫ దోషముంటే మోకాళ్ళు నొప్పెడుతాయి. తొడనొప్పి వుంటుంది. వాత దోషముంటే తల నొప్పి కూడా వుంటుంది. ఈ చతుర్దక విపర్యయజ్వరం సరైన మందుపడితే నాలుగవ రోజు కల్లా తగ్గుముఖం పడుతుంది. ద్రవాలు ఊరడంలో తేడా గలవారు వారం పాటు లంఖణాలు చెయ్యాలి. అయితే ఈ జ్వరదోషాలు మెదడులోనికి ప్రవేశిస్తే మాత్రం దానిని ఆపడం అసాధ్యం.


జ్వరం దోషప్రవేశానికి సంకేతం - రోగం శరీర ద్రవాలతో కలిసి నెమ్మదిగా ప్రవహిస్తూ రక్తనాళాలను కలుషితం చేసి వ్యాపిస్తుంది. మందు ప్రవేశించని మనిషి బలహీనుడవుతున్న కొద్దీ రోగం తీవ్రతరమై విషపు స్థాయిని చేరుకొంటుంది. కాబట్టి జ్వరం కనబడినా 'అదే పోతుందిలే' అనుకొని ఒక లంఖణం చేసేసి ఊరుకోకూడదు.


విషమ, సతత జ్వరాలు దేహ రసాలలోకి ప్రవేశించి ఆగగానే కొన్ని లక్షణాలు బయటపడతాయి. అవి సముద్ర ప్రయాణం తొలిసారి చేసే వారికి వచ్చే రుగ్మతలను పోలివుంటాయి. తరువాత ఒళ్ళు బరువు, నిస్త్రాణ, కాలుసేతులను పొడుస్తున్నట్టుగా నొప్పులు, ఆవులింతలు, అరుచి, వాంతి వస్తున్నట్లుండడం, శ్వాసలో శ్రమ. జ్వరం రక్తంలో చేరితే మరిన్ని లక్షణాలు బయటపడతాయి. అవి ఉమ్మితే రక్తం పడడం, తీవ్ర పిపాస, చర్మంపై వేడి పగుళ్ళు, ఎఱ్ఱమచ్చలు, మంట, తల తిరుగుడు, మత్తు, అతి పలవరింతలు.


జ్వరం మాంసంలోనే వుంటే దాహం, అలసట, అపనమ్మకం, లోపలంతా మండు తున్నట్టుండడం, కళ్ళు తిరగడం, చీకట్లు కమ్మడం, దుర్వాసన, అంగాలలో వణకు కనిపిస్తాయి. జ్వరం కొవ్వులోనికి చేరినపుడు చెమట, అతిపిపాస, వాంతులు, పుల్లవాసన, చిరాకు వుంటాయి. ఇక జ్వరము ఎముకలలోనికి దూరినపుడు కనిపించే లక్షణాలు తెలివితప్పడం, పలవరింతలు, అలసట, అరుచి, ఆకలి బాగా మందగించుట, ఎముకలలో నొప్పి, జ్వరం వీర్యంలోనికి ప్రవేశిస్తే చీకట్లు కమ్ముతాయి. సంధులు వీడిపోతున్న ట్లవుతాయి. లింగం మొద్దుబారిపోతుంది. వీర్యం కారితే మరణమే సంభవిస్తుంది. 


*రస, రక్త, మాంస, మేద, అస్థి, మజ్జ, శుక్ర అనేవి సప్తధాతువులు

Wednesday, 18 December 2024

శ్రీ గరుడ పురాణము (329)

 



గ్రహదోష జ్వరంలో సన్నిపాత లక్షణాలు కనిపిస్తాయి. అదనంగా వాయుసమస్య, జీర్ణసమస్య ఉంటాయి. శాప, రక్త జ్వరాల్లో అన్ని బాధలూ భరించలేనంతగా వస్తూ పోతుంటాయి. మంత్రోచ్చాటన జరుగుతున్నపుడల్లా రోగులు ఎగిరెగిరిపడుతుంటారు. శరీరం పగుళ్ళు వేస్తుంటుంది. మత్తు ఆవహిస్తుంది. ప్రతిభాగం మండుతున్నట్లుగా వుంటుంది. మూర్ఛవస్తుంది. ఉష్ణోగ్రత రోజు రోజుకీ పెరిగిపోతుంటుంది. 


జ్వరాలలో ఎనిమిది రకాలుంటాయి. ముందుగా శారీరక, మానసిక విధాలుగా వాటిని విభజించారు. అలాగే మంద, తీవ్ర, ఆంతర, బాహ్య, ప్రాకృత, వైకృత, కుదిరేవి, కుదరనివి, పక్వాలు, అపక్వాలు. వీటిలో మొదటివి శారీరకం. రెండోవి మానసికం.


కఫ, వాత, మిశ్రిత రోగాలలో చలి, వణుకు వుంటాయి. పిత్తలోపం వుంటే ఒళ్ళంతా మంటలు పుడుతున్న బాధ వుంటుంది. మూడిటి సన్నిపాతమూ వుంటే ఒక మారు చలీ ఒకమారు వేడీ బాధిస్తాయి. (ఈ వేడినే ఉడుకు అంటారు) ఈ జ్వరం లోజ్వరమైతే (ఆంతరమైతే) అన్ని బాధలు లోపలే వుండి మలబద్దకం కూడా పుట్టుకొస్తుంది. బాహిర జ్వరానికి ప్రత్యేక లక్షణం విరేచనాలు. ఈ జ్వరాలను కుదర్చవచ్చును.


ప్రాకృత, వాత, వర్షాకాల జ్వరాన్నీ, వైకృత వర్షకాల జ్వరాన్నీ కుదుర్చుట దాదాపు అసాధ్యం.


* (మరో వర్గీకరణ ప్రకారమైతే శారీర- మానస, సౌమ్య - తీక్ష, అంతర్- బహిరాశ్రయ, ప్రాకృత- వైకృత, సాధ్య- అధ్యాయ, సామ- నిరామయ జ్వరాలు పైన చెప్పిన వాటికి అదనంగా కనిపిస్తాయి.)


ఆకురాలు కాలంలో పిత్తదోషంవల్ల వచ్చేది ప్రాకృత జ్వరం, వాత, కఫ దోషం వల్ల వచ్చేది వైకృతం. కాలంలో కఫదోష జ్వరాన్ని ప్రాకృతమనీ ఇతరాలని వైకృతమనీ అంటారు. వైకృతరోగాలేవీ కుదిరేరోగాలు కావు (జ్వరాలు మాత్రం) వాత దోషం వల్ల వానల కాలంలో వచ్చే జ్వరానికి పిత్త, కఫాలు కూడా లోనవుతాయి. ఆకురాలు కాలంలో పాడయిన పిత్తం కఫాన్ని కలుపుకొని జ్వరాన్నేర్పాటు చేస్తుంది. ఈ జ్వరాలకు లంఖణం మంచి నిరోధక మార్గమే. వసంతంలో వన్నె చెడిన కఫం వాతంతో కలిసి తెచ్చే జ్వరాలుంటాయి. పిత్త దోషం కూడా కలుస్తుంది. బలంగా వున్న మనుష్యులు జ్వరాన్ని మందులనే ఆయుధాలతో జయిస్తారు కానీ జన్మతః బలహీనులను జ్వరం బలిగొంటుంది.


మలబద్దకం వల్ల వచ్చేదీ, మూడు దోషాలు కలిపి వుండేదీ ఆమజ్వరం. జఠరాగ్ని మందం, అతిమూత్రం, జీర్ణమండల వ్యవస్థ మందగించడం (ఆకలి నశించడం) దీని లక్షణాలు.


పచ్యమాన జ్వరలక్షణాలు ఉష్ణోగ్రతతో సహా దాహం, వాగుడు, పలవరింతలు అన్నీ తక్కువ కాలంలోనే పెరిగిపోవడం, ఊపిరి తీవ్రంగా వేగవంతమవుతుంది. తల తిరుగుతుంది. నీళ్ళ విరేచనాలవుతాయి. నొప్పులుంటాయి. జీర్ణకోశాన్ని ఖాళీగా వుంచితే ఆమ వ్యర్థాలు పోతాయి కాబట్టి ఈ జ్వరానికి వారం రోజుల ఉపవాసాన్ని (లంఖణాలని) గట్టిగా సూచించవచ్చును. జఠర రసాల్లో లోపాలను బట్టి అయిదు రకాల జ్వరాలను పోల్చవచ్చును.


సంతత, సతత, అన్యెద్యు, త్రిత్యక, చతుర్థక సప్తధాతువులలోనూ, మలమూత్ర కోశాలలోనూ, నాళాలలోనూ పేరుకుపోయిన జ్వరం ఏడు, పది లేదా పన్నెండు రోజుల్లో వాత, పిత్త, కఫ దోషాలతో బాటు తగ్గించబడవచ్చు. తగ్గుతుంది కూడా. తగ్గకపోతే మాత్రం ప్రాణాపాయమే. ఇలా అగ్నివేశుడన్నాడు. పదునాల్గు, తొమ్మిది, పదకొండు రోజులని హారితుడన్నాడు.


శుభ్రత, పరిశుభ్రత, అశుభ్రతల ప్రభావం కూడా దోషనివారణకు పట్టే కాలంపై ప్రభావాన్ని చూపుతాయి. అలాగే ఒళ్ళు బరువుకూడా. దోషం పూర్తిగా మందులు, ఆహారపు మార్పుల వల్ల, నశించాకనే జ్వరం కూడా తగ్గిపోతుంది. జ్వరం తగ్గుతున్న కొద్దీ బాధితుల మలమూత్ర విసర్జన ప్రక్రియలు మెరుగు పడుతుంటాయి. అలాగే ముఖంలో తేటదనం, మెరుపు, శరీరంలో చురుకుదనం కూడా పెరుగుతుంటాయి.

Tuesday, 17 December 2024

శ్రీ గరుడ పురాణము (328)

 


రోగి నోటినుండి రక్త పిత్త మిశ్రితమైన ఉమ్మి పడుతుంటుంది. తట్టుకోలేనంత దాహం వేస్తుంటుంది. కోష్ట (పొట్ట) ప్రదేశాలన్నీ నల్లగా ఎఱ్ఱగా అయిపోతాయి. గుండ్రటి దద్దుర్లు పొట్టపై ఏర్పడతాయి. గుండెలో బాధ కలుగుతుంది. అన్ని ద్వారాల నుండీ అత్యధికం గానో, అత్యల్పంగానో విసర్జనాలు వస్తుంటాయి. ముఖంలో జిడ్డు, నీరసం, హీనస్వరం, తేజస్సు మందగించడం, ప్రలాపం పుట్టుకొస్తాయి. ఈ జ్వరం బయటపడకుండా లోపల్లోపలే శరీరంలో పెరుగుతుంటుంది. గొంతునుండి గురక, కంఠం నుండి అవ్యక్త శబ్దాలు, శరీరాన్ని కదపాలనే కోరిక నశించడం అనే లక్షణాలు కనిపిస్తే రోగవ్యాప్తి ప్రమాదకర స్థాయికి చేరిపోయిందని అర్థం. దానిని బలవీర్య - వినాశక అభిన్యాస సన్నిపాత జ్వరంగా వ్యవహరిస్తారు.


ఈ సన్నిపాత జ్వరం యొక్క వాయు వికారం వల్ల గొంతులో అడ్డు ఏర్పడి పిత్తం లోపలి భాగంలో నొప్పి పుట్టుకొచ్చి నాసికాదులు కారుతుంటాయి. కళ్ళు పచ్చబడతాయి. మూడు రకాల జ్వరమూ ఒకేసారి తగిలినపుడు శరీరంలోని అగ్నితత్త్వం నశించిపోవడం మొదలౌతుంది. అది పూర్తిగా నశిస్తే మాత్రం రోగం మానడం అసాధ్యం.


ఈ సన్నిపాత జ్వరానికి మరోరూపం కూడా ఉంటుంది. పిత్తం వేరైపోయినట్లుంటుంది. పొట్టలో మంట పుడుతుంది. జ్వరం రాకముందే ఒక విధమైన గాబరా వుంటుంది. వాత - పిత్త ప్రవృత్తులు శరీరంలో పెరుగుతుంటే ఈ జ్వరం కమ్ముతుంది. చలీ, వేడీ రెండూ వుంటాయి. వాటి నుండి రక్షింపబడడం మిక్కిలి కష్టం. శీత ప్రభావం వల్ల నోటినుండి కఫం వస్తుంటుంది. నోరు ఎండిపోతుంది. పిత్తం పనితగ్గడం వల్ల మూర్ఛ, మదం, దాహం ఏర్పడతాయి. బద్దకం, కదలలేనితనం వచ్చి పుల్లవాంతులవుతాయి.


ఆగంతు జ్వరలక్షణాలు: బాహిర కారణాల ద్వారా తగిలే ఈ తాత్కాలిక జ్వరం దెబ్బ తగలడం వల్ల కానీ, సంయోగం వల్ల కానీ, శాపం లేదా రక్తం తగలడం వల్ల గానీ చిల్లంగి దిష్టి వంటి ప్రయోగాల వల్ల గానీ వచ్చే జ్వరాన్ని ఆగంతు జ్వరం అంటారు. వీటిలో మొదటిది అభిఘాతజం అనబడుతుంది.


కాలిన గాయాల వల్ల గాని ఒళ్ళు చురికిపోవడం వల్ల గానీ వచ్చేది అభిఘాతజ జ్వరం. అత్యధిక శ్రమ వల్ల వచ్చే జ్వరంలో వాతం రక్తాన్ని పాడుచేస్తుంది. చర్మం పేలిపోయినట్లవుతుంది. ఒళ్ళు నొప్పులు వాపులు వుండి ఉష్ణత పెరుగుతుంది.


దుష్ట గ్రహపీడ, మత్తు పదార్థాలు, విషాలు, కోపం, భయం, దుఃఖం, ప్రేమ కూడా జ్వరాన్ని కలిగిస్తాయి. ఇది సామాన్య జ్వరంలాగే వుంటుంది కానీ తెరలు తెరలుగా వచ్చే నవ్వూ, ఏడుపూ దీని ఉదృతిని తెలియజేస్తాయి. మత్తుమందులనీ, పొగనీపీల్చడం వల్ల వచ్చే జ్వరానికి స్పృహతప్పుట. తలనొప్పి, వాంతులు, తుమ్ములు లక్షణాలు, విషం వల్ల వచ్చే జ్వరంలో తెలివి తప్పుట, విరేచనాలు, కనులు చీకట్లు కమ్ముట, చర్మం రంగు మారుట, మంట, తలతిరుగుట, కనిపిస్తాయి. కోపం వల్ల వచ్చే జ్వరంలో ప్రత్యేకంగా వణుకు, దడ, తలనొప్పి పుట్టుకొస్తాయి. క్రోధ జ్వరంలో లేదా భయ జ్వరంలోనైతే ఆగకుండా వెలువడే వాగుడు ప్రత్యేక లక్షణం. ప్రేమ, కామం వల్ల జ్వరం వచ్చినపుడు మత్తుగా వుంటుంది. ఏం తిన్నా రుచి తెలియదు, ఒళ్ళంతా మండుతున్నట్లుంటుంది. సిగ్గుగా వుంటుంది, నిద్రపట్టదు, బుఱ్ఱ సరిగా పనిచేయదు, ధైర్యం పోతుంది.