Thursday, 14 October 2021

యాదేవీ సర్వభూతేషు (4)



'అపరాజిత స్తోత్రానికి అర్ధం తెలుసుకున్నాం గదా. అందులోనే ఋషులు మనకు సులభోపాయాలు ఎన్నో చెప్పారు . ప్రతి విశేషణానికి ముందు 'యాదేవీ సర్వభూతేషు ______ రూపేణా సంస్థితా' అన్నారు. ఇంతకీ ఈ యాదేవీ అంటే ఏమిటి ? ఏ దేవి అయితే సర్వభూతములయందూ ఈ ఈ విభూతులుగా వ్యక్తమవుతుందో ఆ దేవికి ముమ్మారు నమస్కారములు అన్నారు. ఋషి దేన్నీ వదల్లేదు. సర్వభూతములు అన్నారు, అంటే పిపీలికాది బ్రహ్మపర్యంతం (చిన్న విత్తనం నుంచి బ్రహ్మదేవుని వరకు) అఖిల లోకాల్లో, అనేకరూపాల్లో వ్యక్తమవుతున్న అమ్మవారి విశ్వరూపం చూపెట్టారు. అంటే మనం భగవతి ఉపాసన చేయాలంటే అమ్మవారిని అన్నిటియందు చూడటం నేర్చుకోవాలి.


స్త్రీలోనే అమ్మవారిని చూడాలని కూడా వారు అనలేదు. సర్వభూతాల్లో చూడాలి అన్నారు. అంటే ఎవరిని అల్పంగా చూడరాదు, అవమానించకూడదు. అది జంతువైనా , మొక్కైనా ఏదైనా. ఇక ప్రత్యేకించి స్త్రీల గురించి చెప్పనవసరం లేదు. 


కులమతలింగ బేధాలను మనం దాటి అంతటా భగవతి చూడగలిగితేనే అది నిజమైన శ్రీవిద్యోపాసన. నిజమైన శ్రీవిద్యోపాసకుడు దేన్నీ అల్పంగా భావించడు. ఎందుకంటే అనేక రూపాల్లో అమ్మ అతని వద్దకు నిత్యం వస్తూ ఉంటుందని భావన చేస్తాడు. 


ఇక్కడ కేవలం జీవుల గురించి మాత్రమే చెప్పలేదు. కార్యకలాపాల గురించి కూడా చెప్పారు చూడండి - నిద్ర, ఆకలి, దాహం, మతిమరుపు వంటి వాటిల్లో కూడా అమ్మవారిని చూడమన్నారు. అది కదా నిజమైన ఉపాసన అంటే. మనం యజ్ఞాలు చేయక్కర్లేదు, జపాలు చేయక్కర్లేదు. చండీ సప్తశతిలో చెప్పినట్లు అమ్మవారిని సమస్త కార్యకలాపాల్లో, విశ్వమంతటా దర్శించగలిగితే చాలు. అంటే ఇక్కడ చండి హోమాలను, జపాలను తక్కువ చెయ్యట్లేదు. కానీ సాటిజీవుల పట్ల ప్రేమను చూపలేనప్పుడు, తన తోటి మానవులను గౌరవించలేనప్పుడు భగవతి ప్రసన్నం చేసుకునేందుకు ప్రత్యేకించి కర్మలు చేయుట ఎందుకు? నోటికి ఎంతొస్తే అంత మాట్లాడేవాళ్ళు, తల్లిదండ్రులను, కట్టుకున్న ఇల్లాలిని గౌరవించని వాళ్ళు, స్త్రీల పట్ల అమర్యాదగా ప్రవర్తించేవాళ్ళు భగవతి ఉపాసన చేస్తున్నామని చెప్పుకోవటమంటే అది శుద్ధ అబద్ధమే. నిజమైన దేవి ఉపాసకుడు తాను ఎవరిని దూషించడు, తన వాళ్ళు దూషిస్తే చూస్తూ ఊరుకోడు.    


అదే ఈ స్తోత్రం చెబుతోంది. నిత్యజీవితంలో సర్వావస్థల్లో భగవతిని చూడు. అన్నిటియందు అమ్మవారిని భావన చేసినవాడికి అపజయం ఉండదు. అతడిని భగవతి తనతో సమానంగా చూస్తుంది. కనుక దేవతలు, ప్రకృతి అతనికి అన్ని విజయాలనే ఇస్తాయి (వారి ద్వారా అపరాజిత దేవి అతడిని అపరాజితుడిని చేస్తున్నది). 


ఓం శ్రీ మాత్రే నమః 

Wednesday, 13 October 2021

యా దేవీ సర్వభూతేషు (3)



యా దేవీ సర్వభూతేషు విష్ణుమాయేతి శబ్దితా!

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః!! 


ఏ దేవి అయితే సర్వజీవుల యందు విష్ణుమాయ రూపంలో ఉన్నదో, ఆ తల్లకి నమస్కారములు.


యా దేవీ సర్వభూతేషు చేతనేత్యభిధీయతే!

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః!!


ఏ దేవి అయితే సర్వజీవుల యందు చైతన్యం రూపంలో ఉన్నదో, ఆ తల్లకి నమస్కారములు.



యా దేవీ సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థితా!

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః!!


ఏ దేవి అయితే సర్వజీవుల యందు బుద్ధిరూపంలో ఉన్నదో, ఆ తల్లకి నమస్కారములు.



యా దేవీ సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థితా!

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః!!


ఏ దేవి అయితే సర్వజీవుల యందు నిద్ర రూపంలో ఉన్నదో, ఆ తల్లకి నమస్కారములు.



యా దేవీ సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థితా!

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః!!


ఏ దేవి అయితే సర్వజీవుల యందు ఆకలి రూపంలో ఉన్నదో, ఆ తల్లకి నమస్కారములు.



యా దేవీ సర్వభూతేషు ఛాయారూపేణ సంస్థితా!

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః!!


ఏ దేవి అయితే సర్వజీవుల యందు జీవాత్మ రూపంలో ఉన్నదో, ఆ తల్లకి నమస్కారములు.



యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా!

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః!!


ఏ దేవి అయితే సర్వజీవుల యందు శక్తి రూపంలో ఉన్నదో, ఆ తల్లకి నమస్కారములు.



యా దేవీ సర్వభూతేషు తృష్ణారూపేణ సంస్థితా!

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః!!


ఏ దేవి అయితే సర్వజీవుల యందు దాహం రూపంలో ఉన్నదో, ఆ తల్లకి నమస్కారములు.



యా దేవీ సర్వభూతేషు క్షాంతిరూపేణ సంస్థితా!

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః!!


ఏ దేవి అయితే సర్వజీవుల యందు ఓర్పు/ సహనం రూపంలో ఉన్నదో, ఆ తల్లకి నమస్కారములు.



యా దేవీ సర్వభూతేషు జాతిరూపేణ సంస్థితా!

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః!!


ఏ దేవి అయితే సర్వజీవుల యందు మూలప్రకృతి తత్త్వంగా (సర్వజీవుల పుట్టుకకు కారణం) ఉన్నదో, ఆ తల్లకి నమస్కారములు.



యా దేవీ సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థితా!

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః!! 


ఏ దేవి అయితే సర్వజీవుల యందు సిగ్గు రూపంగా ఉన్నదో, ఆ తల్లకి నమస్కారములు.


యా దేవీ సర్వభూతేషు శాంతిరూపేణ సంస్థితా!

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః!!


ఏ దేవి అయితే సర్వజీవుల యందు శాంతి రూపంలో ఉన్నదో, ఆ తల్లకి నమస్కారములు.


యా దేవీ సర్వభూతేషు శ్రద్ధారూపేణ సంస్థితా!

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః!!


ఏ దేవి అయితే సర్వజీవుల యందు శ్రద్ధ (భగవంతుని యందు విశ్వాసము, ధర్మం మరియు శాస్త్రము చెప్పేదే సత్యము అనే భావనను శ్రద్ధ అంటారు) రూపంలో ఉన్నదో, ఆ తల్లకి నమస్కారములు.


యా దేవీ సర్వభూతేషు కాంతిరూపేణ సంస్థితా!

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః!!


ఏ దేవి అయితే సర్వజీవుల యందు ప్రేమ మరియు సౌందర్యంగా ఉన్నదో, ఆ తల్లకి నమస్కారములు.


యా దేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా!

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః!!


ఏ దేవి అయితే సర్వజీవుల యందు సద్గుణములు/ అదృష్టము/ ఐశ్వర్యం రూపంలో ఉన్నదో, ఆ తల్లకి నమస్కారములు.


యా దేవీ సర్వభూతేషు వృత్తిరూపేణ సంస్థితా!

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః!!


ఏ దేవి అయితే సర్వజీవుల యందు క్రియాశీలత్వంగా/ చురుకుదనము/ స్వధర్మము రూపంగా వ్యక్తమవుతున్నదో, ఆ తల్లకి నమస్కారములు.


యా దేవీ సర్వభూతేషు స్మృతిరూపేణ సంస్థితా!

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః!!


ఏ దేవి అయితే సర్వజీవుల యందు జ్ఞాపకశక్తిగా ఉన్నదో, ఆ తల్లకి నమస్కారములు.


యా దేవీ సర్వభూతేషు దయారూపేణ సంస్థితా!

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః!!


ఏ దేవి అయితే సర్వజీవుల యందు దయా గుణంగా ఉన్నదో, ఆ తల్లకి నమస్కారములు.


యా దేవీ సర్వభూతేషు తుష్టిరూపేణ సంస్థితా!

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః!!


ఏ దేవి అయితే సర్వజీవుల యందు సంతృప్తి భావనగా ఉన్నదో, ఆ తల్లకి నమస్కారములు.


యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా!

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః!!


ఏ దేవి అయితే సర్వజీవుల యందు మాతృస్వరూపంగా ఉన్నదో, ఆ తల్లకి నమస్కారములు.


యా దేవీ సర్వభూతేషు భ్రాంతిరూపేణ సంస్థితా!

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః!!


ఏ దేవి అయితే సర్వజీవుల యందు (మతి)మరపు/ మోహము/ భ్రమ రూపంలో వ్యక్తమవుతున్నదో, ఆ తల్లకి నమస్కారములు.


ఇంద్రియాణామధిష్ఠాత్రీ భూతానాం చాఖిలేషు యా!

భూతేషు సతతం తస్యై వ్యాప్త్యై దైవ్యై నమో నమః!!


అఖిల లోకాల యందున్న జీవుల ఇంద్రియాలకు అదిష్ఠాన దేవతయై, సర్వజీవులయందు సర్వత్రా వ్యాపించి ఉన్న భగవతికి నమస్కారములు.


చిత్తిరూపేణ యా కృత్స్నమేతద్వ్యాప్య స్థితాం జగత్!

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః!!


ఈ జగత్తంతా వ్యాపించి, చిత్శక్తి (చైతన్యం) రూపంలో అన్నింటియందూ ఉన్నదో, ఆ తల్లికి ముమ్మారు నమస్కారములు.

Tuesday, 12 October 2021

యా దేవీ సర్వభూతేషు (2)

 


మంత్రోపదేశం కావాలని, అమ్మవారిని ఉపాసన అంటే తమకు ఎంతో ఇష్టమని అనేకులు గురువు కోసం అన్వేషిస్తుంటారు. అమ్మవారిని సులభంగా ఉపాసించే పద్ధతులను ఋషులు దేవీ మహాత్యంలోని చండీ సప్తశక్తిలో చెప్పకనే చెప్పారు. అందులోని 'అపరాజితా స్తోత్రం' లోని రెండు పంక్తులు చూడండి.


యా దేవీ సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థితా |

నమస్తస్యై నమస్తస్యై  నమస్తస్యై నమో నమ: || 


సర్వజీవులయందూ ఆకలి రూపంలో వ్యక్తమవుతున్న అమ్మవారికి నమస్కారములు.


యా దేవీ సర్వభూతేషు తృష్ణారూపేణ సంస్థితా |

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమ: || 


సర్వజీవులయందూ దాహం రూపంలో వ్యక్తమవుతున్న అమ్మవారికి నమస్కారములు.


జీవులలో ఆకలి, దాహార్తి రూపంలో వ్యక్తమయ్యేది కూడా అమ్మవారే అంటున్నారు. ఇదే మనకు భగవద్గీత, శివగీత, గణేశగీతలలో కనిపిస్తుంది. గీతలో భగవానుడు 'అహం వైశ్వానరో భూత్వా ప్రాణీనాం దేహమాశిత్రః' అంటాడు. వైశ్వానరుడు అంటే ఆహారన్ని జీర్ణం చేసే అగ్ని, సైన్స్ పరిభాషలో హైడ్రో క్లోరిక్ యాసిడ్. 


ఆకలితో ఉన్నవాడికి పట్టేడన్నం పెట్టి అతని కడుపు నింపితే అది అమ్మవారి అర్చన. దాహంతో ఉన్నవాడి దాహం తీరిస్తే అది కూడా అమ్మావారికి చేసే అర్చనయే. భగవతికి ఏ పువ్వులంటే ఇష్టం, ఏ నివేదన అంటే ఇష్టం అని అడుగుతారు. ఆకలి మరియు దప్పికతోనున్న జీవులకు ఆహారం మరియు నీరు అందిస్తే దేవి భగవతి సంతసిస్తుందని దేవీ మహాత్యం చెబుతోంది. ఇంతకంటే సులభమైన పని ఏముంది ?


కాకపోతే వాళ్ళు నిస్సహాయులనే భావనతో లేదా నేను ఇస్తున్నాననే భావన ఇక్కడ పనికిరాదు. జీవులయందున్న భగవతిని ఆహారం మరియు నీరు ద్వారా పూజిస్తున్నానే భావన రావాలి. ప్రతిఫలం ఆశించకుండా, నిష్కామంగా, పవిత్రభావనతో చేయాలి. సెల్ఫీలు తీసుకుని పెట్టడమంటే ప్రదర్శనయే అవుతుంది. నువ్వు ఇలా జీవుల ఆకలిదప్పికలు తీర్చుతున్నావనే విషయం నీకు, పరమేశ్వరికి తప్ప ప్రపంచానికి తెలియాల్సిన అవసరం లేదు. అలా చేసిందే నిజమైన ఉపాసన. మిగితాదంతా బాహ్యప్రదర్శనయే. 


ఇంకా చెప్పాలంటే ఒకప్పుడు గోదావరి జిల్లాల్లో ఆకలితో ఉన్నవారికి ఆకలి తీర్చిన డొక్కా సీతమ్మగారు చేసింది కూడా ఒక రకమైన దేవీ ఉపాసనయే. అమ్మవారి పారాయణలు చేసినప్పుడు ఏదో ఒక రూపంలో అమ్మ ఆ భక్తుని దగ్గఱకు వస్తూ ఉంటుందని, అందుకే దేవీ ఉపాసకులు నిత్యం అన్నదానం వంటివి చేస్తూ ఉండాలని శ్రీ విద్యలో చెబుతారు. మంత్రం జపిస్తేనే ఉపాసన కాదు, సర్వజీవులలో వ్యక్తమవుతున్న శక్తిని తగిన విధంగా అర్చించడం కూడా ఉపాసనయే.


ఓం శ్రీ మాత్రే నమః     

Monday, 11 October 2021

శ్రీ హనుమద్భాగవతము (47)



అతని గర్జనమును విని పరాక్రమ శ్రేష్ఠుడైన వాలి కోపముతో బయటకు వచ్చాడు. అపుడు అతని కంఠము ఇంద్ర ప్రదత్తము, విజయప్రదాయిని యగు సువర్ణ మాలతో శోభిల్లుచుండేది. దుందుభిని చూసిన్నంతనే అతనితో యుద్ధము చేయుటకు వాలి సంసిద్ధుడయ్యాడు. దుందుభి తన కొమ్ములతో పొడుచుటకై ఎంతో వేగముగా వాలిపైకి దూకాడు. వెంటనే వాలి వాని రెండుకొమ్ములను గట్టిగా పట్టుకొని నలువైపుల వానిని త్రిప్పసాగాడు.

అప్పుడు వాలి రూపము క్రోధముతో భయంకరముగా ఉండేది. అతడు మాటిమాటికి గట్టిగా గర్జించుచుండేవాడు. ఇట్లతడు మొదట పర్వతాకారుడైన రాక్షసుని నలువైపుల త్రిప్పి బలముగా నేలపైగొట్టాడు. దుందుభి రెండు చెవులనుండి రక్త ధారలు ప్రవహింపసాగాడు.


అమితశక్తి శాలియైన దుందుభి లేచి వెంటనే మరల వాలిని ఎదుర్కొన్నాడు. వారిరువురు ఘోరముగా పోరాడసాగారు. వారొకరినొకరు చంపుకొన చూచుచుండేవారు. దుందుభి త నగిట్టలను, కొమ్ములతోను వాలిని ఎదుర్కొనుచుండేవాడు. వాలి పిడికిలి పోటులతోను, కాలితన్నులతోను, రాళ్ళతోను, వృక్షములతోను దుందుభిని కొట్టుచుండేవాడు.


వీరవరుడైన వాలి ద్బెబలచే దుందుభి బలము క్షీణింపసాగింది. చివరకు అతడు దుర్దమనీయుడైన ఆ దానవుని పైకెత్తిన సంపూర్ణశక్తితో నేలపై గొట్టాడు, దూమికి అతనిపైన తన కూర్చున్నాడు. సాటి లేని వాలి బరువును వాడు మోయలేకపోయాడు. అతని అవయవముల నుండి రక్తము ప్రవహింప సాగింది. వెంటనే వాడు నేలపై కూలి ప్ర్రాణములను విడిచాడు.


దుందుభి మరణానంతరము వాలి మిక్కిలి కోపముతో వాని శవమును ఒక యోజనము దూరము విసిరాడు. అది మతంగముని ఆశ్రమమున పడ్డాడు. వేగముగా విసరుటచే చనిపోయిన ఆ అసురుని శరీరము నుండి ప్రవహించిన రక్త బిందువులు కొన్ని మహాముని శరీరముపై బడ్డాయి.


శ్రీ హనుమద్భాగవతము (46)



స్వార్థపరుడైన నా ఈ సోదరుడు నా భార్యను, రాజ్యాన్ని పొందదలచి బిలద్వారమును బండరాతితో కప్పివేసినాడు, దానివలన నేను బయటకు రాలేక లోపలే మరణిస్తానని అతని ఊహయై ఉండవచ్చూ అనే ఆలోచన మనస్సు లోనికి వచ్చిన వెంటనే నేయి పోయగానే భగ్గుమని లేచే అగ్నివలె వాలి క్రోధోన్మత్తుడయ్యాడు.


క్రోధారుణలోచనుడైన తన అన్నను చూసినంతనే సుగ్రీవుడు అతని రాజ్యాన్ని అతనికిచ్చి వేసి, నిజం చెప్పే ప్రయత్నం చేసాడు, కాని ‘మహాక్రుద్ధుడైన వాలి సుగ్రీవునకు బద్ధశత్రువయ్యాడు. అతడు రాజ్యముతో పాటు సుగ్రీవుని భార్యయైన రుమను కూడా లాగుకొని, సుగ్రీవుని వధింపదలంచాడు. సుగ్రీవుడు ప్ర్రాణరక్షణార్థమై మంత్రులతో క్లసి పాఱిపోయాడు.


భయకంపితుడైన సుగ్రీవుడు పరుగెత్తుచున్నాడూ. వాలి అతనిని చంపదలచి వెంటబడ్డాడు. నదులను, నదములను, వనములను, పర్వతములను, సముద్రములను, నగరములను దాటుతూ సుగ్రీవుడు పరిగెడుతున్నాడు. ఎక్కడా కూడా ఒక్క రోజైన నిలబడటానికి అతనికి ధరియం లేకపోయింది. వాలి ప్రాణఘాతకుడైన శతృవు వలె వెంబడిస్తున్నాడు.

అట్లా పరుగెడుతూ సుగ్రీవుడు హిమాలయమును, మేరువును, ఉత్తరసముద్రమును సమీపించాడు. అయినా వాలి అతనిని విడువలేదు. సుగ్రీవునకు ఎవ్వరూ అభయమిచ్చేవారు కనబడకపోయారు. అప్పుడు అతని వెంట నిరంతరము నీడవలె ఉన్నవాడు జ్ఞానులలో శ్రేష్ఠుడైన హనుమంతునకు దుందుభివధను గూర్చిన ఘటన జ్ఞాపకమునకు వచ్చింది.


మహిష వేషములో ఉండే దుందుభి అనే దైత్యుడు వేయి ఏనుగుల బలముగలవాడు. తాను గొప్పశక్తివంతుడననే గర్వము అతనికి ఎక్కువగా ఉండేది. ఒకనాటివిషయము, దుందుభి సముద్రుని, హిమవంతుని తిరస్కరించి గర్జిస్తూ వీరశిరోమణియైన వాలితో యుద్ధము చేయుటకు కిష్కింధా పురపుపొలిమేరలలోనికి వచ్చి బిగ్గరగా దుందుభి ధ్వనివలె గర్జింపసాగాడు. దుందుభి తన గిట్టలతో భూమిని త్రవ్వుతూ, వృక్షములను నాశము చేస్తూ, పురద్వారమును కొమ్ములతో విరుగగొట్ట యత్నిస్తూ యుద్ధమునకు ఆహ్వానించసాగాడు.

Sunday, 10 October 2021

యాదేవి సర్వభూతేషు (1)



దేవి ఉపాసనను నిత్యజీవితంలో ఎలా ఉపాసించవచ్చో తెలుసుకుందాము.


యాదేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా |

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః ||


సర్వ జీవులలోనూ, సర్వత్రా శక్తి రూపంలో ఉన్న తల్లికి నమస్కారాలు. ఈ విశ్వమంతా శక్తి వ్యాపించి ఉంది. అది అనేక రూపాల్లో వ్యక్తమవుతోంది.


యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థితా |

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః ||


సర్వ జీవులలోనూ బుద్ధి రూపంలో ఉన్న తల్లికి నమస్కారాలు.


మనం చాలా సందర్భాల్లో బేరాలు చేస్తాము. ఒక పని చేయించుకున్నప్పుడు ఆ పనికి తగిన మూల్యము చెల్లించము. ఎవరైనా ఏదైనా చిన్న వడ్రంగి పని చేసినా, కూలి పని చేసినా, దానికి కొందరు తగినంత డబ్బు ఇవ్వరు. అంతెందుకు ఇంతే తీసుకోవచ్చు గదా అనేవారు ఎందరో ఉన్నారు. పని చేయించుకున్న తర్వాత కూడా జీతం ఇవ్వని యజమానులు ఎందరినో నేను చూసాను. రెండు నెలలు, మూడు నెలల జీతం తమ దగ్గరే అట్టి పెట్టుకునే యజమానులు/ సంస్థలు సైతం ఉన్నాయి. ఒక వ్యక్తి ఏదైనా పని చేస్తున్నాడంటే అతనిలో శక్తి రూపంలో ఆ అమ్మవారు వ్యక్తమైంది. అతను చేసిన శ్రమకు తగిన ప్రతిఫలాన్ని వెంటనే ఇవ్వడమే శక్తిని ఉపాసించడం. ప్రతిఫలం ఇవ్వకుండా జాప్యం చేయడం, లేదా తగినంత ప్రతిఫలం ఇవ్వకపోవడం అమ్మవారిని అవమానిచడం.


ఒక వస్తువు కొన్నప్పుడు కూడా బేరం చేస్తారు. ఏ వస్తువును తయారు చేయాలన్నా, దానికి బుద్ధి బలం అవసరం. బుద్ధి అంటే కూడా అమ్మవారే. కనుక ఒక వస్తువుకు తక్కువ విలువ కట్టడం (బేరమాడటం) అమ్మవారిని అవమానించడం.


ఓం శ్రీ మాత్రే నమః

దుష్టులపై కూడా సద్గరుని అనుగ్రహం‌ - తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారి జీవితంలోని సంఘటన



బాలా త్రిపుర సుందరి అమ్మవారు అనగానే మనకు గుర్తుకు వచ్చేది శ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు. మన తెలుగు నేలన ఈ మధ్యకాలంలో నడయాడిన గొప్ప బాల ఉపాసకుల లో తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు అగ్రగణ్యులు... వారి జీవితంలోని ఒక సంఘటన.


*దుష్టులపై కూడా సద్గరుని అనుగ్రహం‌*


*దొంగలు దొరలయ్యారు*


ఒకసారి శ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు కొన్ని రోజులు ఖాజీపాలెంలో రాత్రి వేళ పురాణమును చెప్పి ప్రతిరోజూ అర్థరాత్రి సమయాన కాలినడకన చందోలు చేరుతుండేవారు.


అది అడవి మార్గం. ఆ మార్గంలో దోపిడిదొంగలు అధికం. అనుకున్నట్లే శాస్త్రిగారిని దొంగలు వెంబడించసాగారు. శాస్త్రిగారు ముందు నడుస్తుంటే, దొంగలు వెనుక కర్రలతో పరుగులు పెడుతూ ఉన్నారు. ఆయన నడక మాములుగా ఉంటే, ఆయనను దోచుకునేందుకు సిద్దమైన దొంగలు పరుగెడుత్తుతూనే ఉన్నారు. కానీ ఆయనను అందుకోలేక పోతున్నారు.


చివరకు ఒకచోట శాస్త్రిగారు ఆగి వెనుదిరిగి " ఎవరు మీరు?" అని ప్రశ్నించారు.


వెంటనే వారందరూ కర్రలు క్రింద పడేసి నేలమీద సాగిలాపడి, లెంపలు వేసుకుంటూ "అయ్యా! మీ ఒంటిపై తళతళలాడుతున్న ఆభరణాలు దోచుకుందామని దుర్బుద్ధితో వెంబడించాము. మేము దొంగలం. కానీ అదేమి చిత్తమో, మీ మహిమోగానీ, ఏ అడుగుకు ఆ అడుగులో మిమ్ము దోచుకుందామని మైలుదూరము పైగా వెంబడించాము. మిమ్మల్ని కేకలు వేసి భయపెట్టేందుకు మాకు మాట పెగల్లేదు. చేతుల్లో ఉన్న కర్రలు, కత్తులతో మీపై దాడి చేద్దామంటే చేతులు రావు. అసలు ఏమీ తోచకుండానే ఇంత వరకు వెంబడించాము. తమరు దయతలచి క్షమిస్తే మా దారి మేము పోతాము" అని దీనంగా పలికారు.


"మీరు ఎవరికీ ఇబ్బంది కలిగించకుండా గౌరవముగా జీవిస్తే నాకు సంతోషంగా ఉంటుంది" అని పలికారు శాస్త్రిగారు.


అంతట ఆ దొంగలు " దొరవారూ! మీ ఆన మేరకు మేమందరం నేటితో ఈ నీచవృత్తి వదిలేస్తాము. మా చుట్టుప్రక్కల గల దారిదోపిడీగాండ్లందరినీ హెచ్చరిస్తాము. మిమ్మల్ని కన్నెత్తి చూచేవాడుండడు. ప్రొద్దుపోయింది. పోయి రండి" అని గౌరవముగా వంగి నమస్కారాలు చేస్తూ వెనుదిరిగి వెళ్ళిపోయారు. ఆ దోపిడీ దొంగలు.


ఆ దొంగలు దోపిడీలు మానుకొని పనులు చేసుకుని జీవించసాగారు.


*సద్గురు కృప మాసపత్రిక నుంచి*


*2018 మే సంచిక*