Tuesday, 7 March 2023

శ్రీదత్త పురాణము (71)



కాకపోతే అతనికి తీరని దిగులు మాత్రం వుంది. దాన్ని మరచిపోవడానికే అతను మాతో ఆటపాటలతో మునిగిపోతూంటాడు. ఆ దిగులు తీర్చగలిగితే అదే నిజమైన ప్రత్యుపకారం. నాయనలారా మీ మిత్రుడి దిగులు ఒకటి, మీ దిగులు ఒకటీనా! తప్పక తీరుద్దాం శక్తివంచన లేకుండా ప్రయత్నిద్దాం అసలు ఆ దిగులేమిటో చెప్పండి.


జనకా మా మిత్రుడు వివాహితుడు. మదాలస అతని భార్య ఒక గంధర్వరాజకుమారి. సౌందర్యరాశి. ఒక రాక్షసుడి వంచనకు గురి అయి హఠాత్తుగా మరణించింది. అప్పటినుండీ ఋతవ్వజుడు ఆమెనే తల్చుకుంటూ పునర్వివాహమునకు మనసొప్పక కఠిన బ్రహ్మచర్యంతో గడుపుతున్నాడు. మాతోడిదేలోకంగా మెలుగుతున్నాడు. దిగులు మర్చిపోతున్నాడు. తండ్రి ఆ దిగులు తీర్చగలమా?


పుత్రులారా తప్పక తీర్చగలం ముందు ఆ రాక్షసుడు ఎవరు? ఎలా వంచించాడు? ఆ వివరాలు చెప్పండి. తండ్రీ మాకు తెలిసింది చెబుతాము ఆలకించండి. గాలవుడు అనే మహర్షి పేరు మీరు వినే వుంటారు. అతడు మహా తపస్వి. ఎక్కడో ఆశ్రమంలో శిష్య బృందంతో ఇతర మునిగణాలతో కలసి తపస్సు చేసుకుంటూ వుండే వాడు, ఒక రోజున ఒక దివ్యాసం అధిరోహించి శత్రుజిత్తు మహారాజు దగ్గరికి ఆకాశమార్గంలో వచ్చాడు. శత్రుజిత్తు మహారాజు ఆశ్చర్యంతో అతిధి మర్యాదలు చేసాడు. గాలవుడు సంతోషించి మహారాజా మా ఆశ్రమంలో తపస్వులకు రాక్షసపీడ ఎక్కువగా వుంది. మా తపశ్శక్తిని ఉపయోగించి ఆ రాక్షసుల్ని శాపాగ్నికి గురిచేద్దామంటే వెనుకటికి విశ్వామిత్రుడు వలె తపస్సును వృధా చేసుకోవడం ఇష్టంలేదు. ఆ రాక్షస పీడను భరిస్తూ మాలో మేమే కుమిలి పోతూవున్నాము. ఒకనాటి మధ్యాహ్నం ఈ దివ్యమైన అశ్వం నాముందు నిలచింది. సూర్యుడి రధాశ్వంలాగా మెరిసిపోతున్న దీన్ని చూసి ఆశ్చర్యంగా నిలబడ్డాను. అంతలోనే అశరీరవాణి వినిపించింది. గాలవా ఇది దివ్యాశ్వం. దీని పేరు కువలయ. సూర్యుడు పంపాడు. దీని గమనానికి అడ్డులేదు. ఇది ఆకాశంలో ఎగురుతుంది. నేల మీద పరుగెడుతుంది. పర్వతాల మీద దూకుతుంది. సముద్రాల్లో ఈదుతుంది. నీటిపై నడుస్తుంది. ఇది పాతాళాలలో చుట్టివస్తుంది. ఈ ఉత్తమజాతి గుర్రాన్ని శత్రుజిత్తు మహారాజు కుమారుడైన ఋతధ్వజునికి ఇచ్చి రాక్షస సంహారం చేయించుకో అని చెప్పింది. కాబట్టి శత్రుజిన్మహారాజా నీ దగ్గరకు వచ్చాను. నీ పుత్రుణ్ని నాతో పంపు మునిజన సంరక్షణ చేసి వస్తాడు. ఈ దివ్యాశ్వంని అధిరోహించడం వల్ల నీ కుమారుడికి కువలయాశ్వుడు అనే పేరు స్థిరపడుతుంది.


గాలవ ముని అభ్యర్ధనను శత్రుజిత్తు మహారాజు ఆజ్ఞగా అంగీకరించి ధశరధ మహారాజు విశ్వామిత్ర మహర్షి వెంట రాముణ్ని పంపినట్లు నేను కూడా మీ వెంట మా చిరంజీవిని పంపిస్తున్నాను అన్నాడు. వెంటనే ఋతుధ్వజుడు. తండ్రి పాదములకు నమస్కరించి దివ్యాశ్వముకు మ్రొక్కి దాని సకిలింపును అనుమతిగా గ్రహించి అధిరోహించి గాలవుడుతో సహా ఆశ్రమానికి చేరుకున్నాడు. అక్కడ వున్న ముని బృందానికి నమస్కరించి ఆశీస్సులు పొందాడు. ఆ నిమిషం నుండీ జాగరూకుడై ఆశ్రమ సంరక్షణ బాధ్యతలను స్వీకరించాడు.

Monday, 6 March 2023

శ్రీదత్త పురాణము (70)

 

తండ్రీ! దత్తాత్రేయుణ్ని ఉపాసించి కార్తవీర్యుడు పొందిన దివ్యశక్తుల గురించి క్లుప్తంగా తెలియజేసాను. ఇంక అలర్క జన్మ కర్మాదులు వివరిస్తాను ఆలకించు అని సుమతి తన కధనం కొనసాగించాడు.


కువలయాశ్యుడి కథ


పూర్వకాలంలో శత్రుజిత్తు అనే రాజు వుండేవాడు. మహావీరుడు అనేక యజ్ఞాలుచేసి ఇంద్రుడ్ని సంతృప్తి పరచాడు. ఆ పుణ్య ఫలం వల్ల పుత్రుడ్ని పొందాడు. ఋతుధ్వజుడు అని పేరు పెట్టుకున్నాడు. తండ్రికి తగిన పుత్రుడు, బుద్ధిలో ఆ బృహస్పతి సమానుడు. విక్రమ లావణ్యాలలో ఇంద్ర అశ్వనీ కుమారులతో సమానుడు. తన ఈడు రాకుమారులతో కలసి ఆడుకుంటూవుంటే ఒక రోజున నాగలోకం నుండి ఇద్దరు రాకుమారులు వచ్చారు. వారిద్దరూ అశ్వతరుడు అనే నాగరాజు కుమారులు. వారు బ్రాహ్మణ బాలకులుగా వచ్చి ఋతధ్వజునితో కలసి మెలసి తిరుగుతూ ఆటపాటల్లో భాగస్వాములయ్యారు. ఋతర్వజనితో వీరికి గాఢమైన స్నేహం ఏర్పడింది. రోజూ వీరు నాగలోకం నుండి వచ్చి వెళుతూవుండేవారు. చివరికి వీరి స్నేహం ఒకరిని వదిలి ఒకరు ఉండలేని పరిస్థితి ఏర్పడింది. అందువలన ఒక్కొక్కసారి వారిని తిరిగి వెళ్ళనివ్వడంలేదు. తనతోనే స్నానపానాదులు ఏర్పరచి ఉంచుకుంటున్నాడు. ఇలా రోజులు గడుస్తున్నాయి.


అశ్వతరుడు ఒక రోజున తన పుత్రుల్ని పిలచి తరుచుగా మీరు మన లోకంలో వుంటున్నట్లుగా కన్పించడంలేదు. కారణం ఏమిటి? ఎక్కడికి వెళ్తున్నారు. ఇటీవల రాత్రుళ్ళు కూడా ఇంటికి రావడంలేదు. ఏం చేస్తున్నారు అని గద్దించి ప్రశ్నించాడు. నాగకుమారులు తమకు భూలోకంలో ఋతర్వజునితో కలిగిన స్నేహబంధం గురించి చెప్పారు. అప్పుడా నాగరాజు మానవులతో మనకు స్నేహం ఏమిటని ప్రశ్నించాడు. అప్పుడా నాగకుమారులు ఆ రాజకుమారుడి గుణగణాలను ఆత్మీయతలను ఏకరువుపెట్టారు. మా కోసం ప్రాణాలు సహితం త్యజిస్తాడు. మేములేనిదే బ్రతుకలేదు. మాకు ఎన్నెన్నో బహుమతులు ఇస్తుంటాడు. మేము ఏది అంటే అది జరిపిస్తాడు. అతడు వయస్సులో పెద్ద అయినా మాతో కలసి వుంటాడు. నిండు యౌవనంలో వున్నాడు. అయినా మాలో ఒకడుగా ప్రాణంలో ప్రాణంలా కలిసిపోయాడు. మాతో వున్నప్పుడు సమస్త లోకాల్ని మరిచిపోతాడు. తాను ఆనందిస్తాడు మమ్మల్ని ఆనందంలో ముంచెత్తుతాడు. తండ్రీ మానవుడు కదా అని శంకించవలసిన పనిలేదు. అతడితో మైత్రికి మేము ఎంతగానో గర్వపడుతున్నాము.


పుత్రులిద్దరూ ఏకకంఠంతో చెప్పేసరికి అశ్వతరుడు మరింక ప్రశ్నించలేదు. నాయనలారా సత్సాంగత్యం సకల శ్రేయోదాయకం. మీ స్నేహాన్ని కొనసాగించండి. అతడికి ప్రత్యుపకారంగా ఏమైన బహుమతులు మీరు కూడా ఇవ్వండి. అని ప్రోత్సహించాడు.


తండ్రీ ఋతద్వజుడుకి మనం ఇవ్వగలిగిన బహుమతులు ఏమీ లేవు. అన్నింటా అతడు మనకన్నా సంపన్నుడు.


Sunday, 5 March 2023

శ్రీదత్త పురాణము (69)

 

దత్తస్వామి తనకు వరాలు ఇచ్చిన రోజు ఏటేటా గుర్తు చేసుకుంటూ ఆ రోజు ప్రత్యేకంగా దత్త పూజా మహోత్సవాలు జరుపుతూవున్నాడు. వీటిలో ప్రజలంతా ఉత్సాహంగా పాల్గొనేటట్లుగా చేస్తున్నాడు. అతడి చేష్టలు చిత్రాతి చిత్రంగా వుంటున్నాయి. ఉన్నట్లుండి ఒక్కొక్క రోజున దత్త దర్శనమున కెళ్లాడు. నమస్కరించి వెంటనే తిరిగి వస్తూ వుంటాడు. ఒక్కొ రోజున అక్కడే ఉండిపోతూ వుంటాడు. ధర్మ శాస్త్రాలు యోగవిద్యలూ పండితులతో చెప్పించుకొని వింటూ వుంటాడు. వారిని బహుదా సేవిస్తూ వుంటాడు. వారిని అనేక విషయాలు అడిగి తెలుసుకుంటూ వుంటాడు. దత్తుడి గురించి తానేమి విన్నాడో అన్నీ తన ప్రజలకు వివరిస్తూ వుంటాడు. అతడికి దాచవలసింది ఏమీ లేదు.


ఒక రోజు కార్తవీర్యుడు తన అంతఃపుర కాంతలతో కలసి రేవానదిలో క్రీడిస్తూ వున్నాడు. ఉన్నట్లుండి అతడికి వింత ఆలోచన వచ్చింది, తనలో నుండి సహస్ర బాహువులను ఆవిర్భవింపజేసాడు. రేవానదిని అడ్డగించాడు. ఒకప్రక్క అయిదువందల చేతులు ఇంకొక ప్రక్క అయిదువందల చేతులు వేసి మధ్యలో తాను వుండి రేవానదికి ఆనకట్ట వేశాడు. ప్రవాహం ఆగిపోయింది. ఒక్క చుక్క నీరు కూడా ముందుకు సాగలేదు. నీరంతా ఎగదన్నింది. వెనుకవైపున దూరంగా ఎక్కడో విడిది చేసిన రావణాసురుని సేనా శిబిరాలను రేవానది ముంచివేసింది. రావణుడికి కోపం వచ్చింది. మేఘంలేని వానలాగ వర్షంలేని ఈ వరద ఏమిటని హుంకరించి విషయం ఏమిటో తెలుసుకొనిరమ్మని భటులను పంపాడు. వాళ్ళు వచ్చి చూసి సంగతి తెలియజేసారు. ఆడవాళ్ళతో జలకాలాటకు వచ్చిన కార్తవీర్యుడు ఒంటరిగా దొరికాడు కనుక తేలికగా జయింపవచ్చునని భావించాడు రావణుడు. సైన్యంతో వచ్చి చుట్టుముట్టాడు. అర్జునుడు చిద్విలాసంగా నవ్వుతూ నదిలో నుండి లేచి వచ్చాడు. తనకున్న సిద్దులతో ఎంతమంది రాక్షసులు వున్నారో అన్ని రూపాలను ధరించి అందర్ని క్షణంలో మట్టుబెట్టాడు. రావణాసురుణ్ని వెయ్యి చేతులతో పట్టుకొని బంధించి వాడి ఇరవై చేతులను విరిచికట్టేసి తన రాజ్యానికి తీసికెళ్ళి చెరసాలలో బంధించాడు.


కొన్ని రోజులకు ఈ వార్త లంకాపట్టణమంతా తెలిసి పోయింది. దశకంఠుడి తాతగారు పులస్త్య బ్రహ్మ వచ్చి కార్తవీర్యుణ్ణి అభ్యర్ధించి మనవణ్ణి విడిపించుకుపోయాడు.


కార్తవీర్యార్జునుడికి ఇలాంటి దివ్యశక్తులూ మహిమలు దత్తస్వామి అనుగ్రహం వల్ల లభించాయి. దత్తాత్రేయుడంటే సాక్షాత్తూ శ్రీమన్నారాయణుడే శంక చక్ర గదాధారి. అతడే పరాత్పరుడు అతడే వాసుదేవుడు. అతడే మహా మాయతో కలసి ఈ చరాచర జగత్తుకి సృష్టి, స్థితి, లయాలు జరుపుతూ వుంటాడు. ఇతడికన్నా అన్వేషింపదగిన వస్తువులేదు. ధ్యానింపదగిన శక్తిలేదు. కర్మబంధనాలు త్రెంచి ముక్తిని ప్రసాదించే హృషీకేశుడు ఇతడే. శ్రీహరికి దత్తరూపమే ఉత్తమోత్తమం. త్రికరణశుద్ధిగా చేస్తే చాలు అనుగ్రహం కురిపిస్తాడు. నేను భక్తికి దాసుణ్ని భక్తితో పత్రంగాని, పుష్పంగాని, ఫలంగాని, చివరకు కాసిన్ని మంచినీళ్ళుగాని నాకు సమర్పించండి నేను మిమ్మల్ని కాపాడుతాను అనేది స్వామి వారి ప్రతిజ్ఞ. ధర్మ సంస్థాపనకు అధర్మ నిర్మూలనకు శిష్ట రక్షణకూ దుష్ట శిక్షణకూ బద్ధ కంకణుడై శ్రీహరి దత్తావతారం ధరించాడు.


Saturday, 4 March 2023

శ్రీదత్త పురాణము (68)



దత్త దేవా నా జన్మ ధన్యమైయ్యింది. నీ అనుగ్రహానికి నేను పాత్రుణ్ని అయ్యాను. ఇంతకన్నా నేను కోరుకోవలసింది ఏముంది. అయినా నీ ఆజ్ఞను కాదనలేక, నా రాజధర్మాన్ని విడిచిపెట్టలేక కొన్ని వరాలు అడుగుతున్నాను. నేను చేసే ప్రజాపాలనలో ధర్మార్ధాలు వృద్ధిపొందేటట్లు, ఎదుటివారి ఆలోచనలు నాకు తెలిసిపోయేటట్లు, పుణ్య పాప సుఖ దుఃఖాల ద్వంద్వాలను తెలుసుకునే ప్రసిద్ధి కలిగేటట్లు, నేను కోరుకున్నప్పుడు నాకు వేయి బాహువులు (చేతులు) వచ్చేటట్లు, అణిమాది అష్టసిద్ధులు నాకు వశం అయ్యేటట్లు పర్వతాలపై ఆకాశం పై, సముద్రంపై, సృధివిలో పాతాళంలో నిరాటంకంగా సంచరించే శక్తి కలిగేటట్లు నా కన్నా గొప్పవాడు ప్రసిద్ధుడు అయిన వ్యక్తిచేతిలోనే మరణించేటట్లు, నేను దారి తప్పినప్పుడల్లా నాకు సన్మార్గం చూపించే వారు లభించేటట్లు, గొప్ప గొప్ప అతిధులు నిత్యము దొరికేటట్లు, సంపదలు అక్షయంగా వుంటేటట్లు నన్ను స్మరిస్తేచాలు ప్రజలకు పోయిన వస్తువులు దొరికేటట్లు, నీ పట్ల నిశ్చలమైన భక్తి నిలచేటట్లు అనుగ్రహించుదేవా అని అడిగాడు.


కార్తవీర్యుడు కోరికలన్నీ దత్తుడు అంగీకరించాడు. తధాస్తు అని పలికాడు. నా అనుగ్రహంవల్ల నీవు చక్రవర్తిని అవుతావు వెళ్ళు అన్నాడు. అర్జునుడు పరమానందంతో తన చేతుల్ని చూసుకున్నాడు. చొట్ట చేతుల స్థానంలో బలమైన దృఢమైన చేతులు వచ్చాయి. సంవత్సరముల తరబడి సేవ చేసి అలసిన శరీరం వింతకాంతితో వెలిగిపోయింది. తృప్తిగా శరీరం అంతా చూసుకొని ఆనందంతో మరోసారి సాష్టాంగ నమస్కారంచేసి దత్తస్వామి వద్ద సెలవు తీసికొని బయలుదేరాడు. రాజధాని మహిష్మతీపురం చేరుకున్నాడు. పౌర జానపద సామంత దండనాయక మంత్రి కవి పండితావళి సాక్షిగా పట్టాభిషేకం జరిపించుకున్నాడు. అమరులూ, గంధర్వులూ, అప్సరసలూ వచ్చి సింహాసనం మీద కూర్చుండబెట్టి ఆశీర్వదించి వెళ్ళారు. గురువర మహిమ వల్ల సామ్రాజ్యంలో సకల సంపదలూ వృద్ధి చెందాయి. ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు. అర్జునుడు అత్యంత బలిష్ఠుడై రాజ్య పరిపాలన చేస్తున్నాడు. రాజ్యంలో తాను తప్ప ఎవరూ ఏ ఆయుధమూ చేపట్టరాదని అలా పడితే అతణ్ని పరహింసా పరాయణుడిగా గుర్తించి శిక్షిస్తామని దీనికి శిక్ష శిరచ్ఛేదమని శాసనం అమలుచేసాడు. అంతే ఆ క్షణం నుండి అతని రాజ్యంలో ఎవ్వడైనా ఆయుధం ముట్టుకుంటే ఒట్టు గ్రామ పాలన, క్షేత్రపాలన, పశుపాలన, గోబ్రాహ్మణ సంరక్షణ సమస్తమూ తానే చూసుకుంటున్నాడు. ప్రజలకు చోర, సర్ప, అగ్ని, శత్రు భయాదులు లేకుండా చేసాడు. ఒకవేళ ఎవరికైన ఏదైనా ఆపద వస్తే కార్తవీర్యార్జునుడ్ని తలుచుకుంటే చాలు స్వయంగా ప్రత్యక్షమై వారి వారి ఆపదలు తొలగిస్తున్నాడు. అతడి స్మరణతో పోయిన వస్తువులు కూడా దొరుకుతున్నాయి. ప్రజలు హాయిగా సుఖశాంతులతో భోగభాగ్యములతో వర్ధిల్లుతున్నారు అతడి పాలనలో, భూరి దక్షిణలతో యజ్ఞ యాగాది క్రతువులను మహావైభవంగా జరిపిస్తున్నాడు. చుట్టుప్రక్కల రాజ్యాలన్నింటిని జయిస్తున్నాడు. ఇతడి ధర్మానురక్తిని, శౌర్య పరాక్రమాలను ఆత్మాభిమానాన్ని కళ్ళారా చూసిన అంగీరసుడు ఆనందం పట్టలేక కార్తవీర్యార్జునుడు అంతటి రాజు మరొకడు లేడని ఘంటాపధంగా ప్రకటించాడు.


Friday, 3 March 2023

శ్రీదత్త పురాణము (67)


 కార్తవీర్యుడికి గర్గముని చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. దత్తుడు ఇంద్రాది దేవతల్ని పరీక్షించిన కధ గుర్తొచ్చింది. ఇప్పుడు ఇది తనకు కఠిన పరీక్ష. అంటే స్వామి అనుగ్రహించబోతున్నాడన్న మాట. ఇందులో నెగ్గితే తన కోరిక నెరవేరుతుంది. ఈ ఆలోచనలతో ధైర్యం వచ్చింది. దత్త స్వామితో ఇలా అన్నాడు. దత్త యోగీంద్రా నువ్వు సాక్షాత్తూ శ్రీ మన్నారాయణుడవని నా విశ్వాసం. ఈ తల్లి కలుముల కల్పవల్లి మహాలక్ష్మి. ఇక్కడ మీకు సేవచేస్తున్న పరిచారక గణం అంతా గంధర్వులు. వీరితో సహవాసము నీ సేవా భాగ్యము నాకు బహుజన్మ తపఃఫలం. ఏ రాజభోగాలు దీనికి సాటి రావు. స్వామి నీ కఠిన పరీక్షలు గురించి విన్నాను. నీ మాయలు కళ్ళారా చూసాను. ఇంద్రాది దేవతలకే అర్ధంకాదు నీ మాయలు. వాటిని అర్ధం చేసుకోవడం నువ్వు పెట్టే పరీక్షల్లో నెగ్గడం నా బోటి సామాన్య మానవుడికి అయ్యేపనా. స్వామి నువ్వు కరుణా మూర్తివని వేదాలు శాస్త్రాలు పొగుడుతున్నాయి. అలాంటి నీవు ఒక సామాన్య మానవుణ్ని ఇంతగా కఠిన పరీక్షలకు గురి చెయ్యడం భావ్యమా? నువ్వే వంచిస్తే మాకు దిక్కు ఎవరు? రక్షకుడెవరు? పోనీలే పరీక్షించు నీకు సంతృప్తి కలిగే దాకా పరీక్షించు. రెండు చేతులే కాదు రెండు కాళ్ళు పోయినా ఫరవాలేదు. చివరకు ప్రాణాలు పోయినా ఇబ్బంది లేదు. నీ సేవ వదలను. నీ సన్నిధిని విడిచిపెట్టను.


అవతలకి పొమ్మని మాత్రం ఆజ్ఞాపించకు. అదే పదివేలు అంటూ కార్తవీర్యార్జునుడు ఆపుకోలేని దుఃఖంతో సాష్టాంగపడ్డాడు. కన్నీళ్ళతో కాళ్ళు కడిగాడు. దత్తాత్రేయుడు చిరునవ్వులు చిందిస్తూ మురిసిపోయాడు.


కార్తవీర్యా, లే నీ భక్తికి సంతోషించాను. నీ జ్ఞానానికి ఆనందించాను. నీ సేవలకు సంతృప్తి చెందాను. లే లేచి వరం కోరుకో నీకు కావలసింది ప్రసాదిస్తాను. లక్ష్మీ సమేతుడుగా (అనఘ) నన్ను సేవించిన వారికి మృష్టాన్న మద్యమాంసాదులు నాకు నివేదనలు చేసిన వారికి, వీణా వేణు శంఖాదులు మ్రోగిస్తూ సంగీత సాహిత్య నృత్యాలతో నన్ను ఆరాధించిన వారికి, వేద శాస్త్ర పండితులను సత్కరించే వారికి, నేను కోరికలన్నీ తీరుస్తాను. పుత్ర పౌత్రాభి వృద్ధిని ధన ధాన్య భోగభాగ్య సమృద్ధిని ఆయురారోగ్యములను తనివితీరా ప్రసాదిస్తాను. నన్ను శంకించే వారిని అవమానించే వారిని నిర్ధాక్షిణ్యంగా అణిచిపారేస్తాను. కార్తవీర్యార్జునా ఇది నా దీక్ష నీ మీద నాకు అనుగ్రహం కలిగింది. నీకు ఏమేమి కావాలో నిస్సంసయంగా కోరుకో వెంటనే తీరుస్తాను అన్నారు దత్తస్వామి.


కార్తవీర్యుడు మనస్సులో కళ్ళల్లో ఆనదం వెల్లివిరిసింది. కళ్ళల్లో ఆనంద భాష్పాలు రాలాయి. మెల్లగా లేచి నిలబడ్డాడు స్వామి వైపు సవినయంగా చూస్తూ శిరస్సు వంచి మెల్లగా చిన్న స్వరంతో ఇలా అన్నాడు.

Thursday, 2 March 2023

శ్రీదత్త పురాణము (66)

 


ఉదయం ఫలపుష్పాదులు సమకూర్చడం మధ్యాహ్నం చందనాదులు సిద్ధం చెయ్యడం సాయంకాలం మండపాలను వివిధ రకాల పూల మాలలతో మండపాలు అలంకరించడం, మిగతా పనులన్నింటిని చెయ్యడం, వగైరా పనులన్నింటిని తనే చేస్తున్నాడు. స్వామి వేళ తప్పకుండా భోజనం చేసేటట్లు సిద్ధం చేసి తానే దగ్గరుండి వడ్డిస్తూ కొసరి కొసరి తినిపిస్తూవున్నాడు. స్వామి భుక్తశేషాన్ని కళ్ళకద్దుకొని భక్తితో తాను భుజిస్తున్నారు. అవిటి చేతులతో ఇంత చేస్తుంటేస్వామి యొక్క పరిచారక గణం చూచి ఆశ్చర్యపోతున్నారు. స్వామి భక్తి అంటే ఇది అని కొందరు మెచ్చుకుంటున్నారు. మనం ఏనాటి నుండో సేవ చేస్తున్నా నిన్న మొన్న దగ్గరయిన ఇతడు దత్తస్వామికి సన్నిహితుడూ అంతరంగికుడు అవుతున్నాడే అని మరి కొందరు లోలోపల అసూయపడుతున్నారు. సూటిపోటి మాటలు అంటున్నారు. కార్తవీర్యార్జునుడు మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా నిజమైన భక్తితో రేయింబవళ్ళు స్వామిని కంటికి రెప్పలా చూసుకుంటూ సేవచేస్తున్నాడు. నెలలూ సంవత్సరాలు గడిచిపోతున్నాయి.


ఒక రోజున దత్త స్వామి కూర్చున్న మణిశిలపై వున్న మెత్తని పరుపులను అతడు సర్దుతున్నాడు. దత్తస్వామి పృష్టభాగం బాధ కలుగకుండా వుండేందుకు వీలుగా సుఖంగా కూర్చునేందుకు వీలుగా సౌకర్యంగా వుండేందుకు పడకను సర్దుతున్నాడు. ఆ సమయంలో దత్తస్వామి పృష్ట భాగం నుండి అపాన వాయువు వెలువడింది. ఆ వాయువు నుండి పుట్టిన వేడికి కార్తవీర్యుడి రెండు లొట్ట చేతులు మాడిపోయాయి. ఓర్చుకోలేనంత బాధ కలిగింది. నొప్పి మంట కలగడంతో గట్టిగా మూలిగాడు కార్తవీర్యుడు. భాధతో మెలికలు తిరుగుతూ కూర్చుండిపోయాడు.


దత్తస్వామి కంగారుగా అయ్యయ్యో ఎంత ప్రమాదం జరిగింది. కొండ నాలికకు మందు వేస్తే వున్న నాలిక పోయినట్లు అయ్యింది. ఎవరో ఏదో చెబితే నన్ను సేవిస్తున్నావు. లొట్ట చేతులు బాగుపడతాయి అనుకున్నావు చూసావా ఏమయ్యిందో వున్న చేతులు కూడా పూడిపోయాయి. ఇకనైనా కళ్ళు తెరువు నువ్వు ఆశించినట్లు, లేదా నీకు చెప్పినవారు. అన్నట్లుగా 'నేనేమి మహాదివ్యశక్తులు కలిగిన వాణ్ణి కాదు. సాధారణ తపశ్విని. నిజానికి అది కూడా కాదు. నువ్వే చూస్తున్నావుగా నా దినచర్య. స్త్రీలోలుణ్ణి ఎవరికీ అందనివాణ్ణి. నన్ను నమ్మి ఎన్ని సంవత్సరాలు వృధా చేసుకున్నావో. చూడు. రాజకుమారుడవి. నీవు భోగ భాగ్యములకు దూరమై ఇన్ని అవస్థలు పడుతున్నావు. వెర్రి వాడా తాగుబోతుల్ని, తిరుగుబోతుల్ని సేవిస్తే లొట్ట చేతులు బాగుపడతాయా, అయ్యిందేదో అయిపోయింది. ఇకనైనా వెళ్ళు ఎవరినైనా శక్తి మంతుణ్ని ఆశ్రయించు అన్నారు దత్తస్వామి.


Wednesday, 1 March 2023

శ్రీదత్త పురాణము (65)



సామ్రాజ్యలక్ష్మి, విజయలక్ష్మి మిమ్మల్ని వరించడం తధ్యం. ఇదే తగిన సమయం త్వరపడండి. మీరు మీ శస్త్ర అస్త్రాలతో రాక్షసుల విూద విరుచుపడండి. ఇప్పటికే వారు నిర్వీర్యులై వున్నారు. ఇప్పుడు మీరు వారిని జయించడం చాలా తేలిక, బయలుదేరండి.


దేవతలు తమ తమ ఆయుధములు ధరించి రాక్షసుల వెంటబడ్డారు. దొరికిన వాణ్ణి దొరిగినట్లు చావబాదారు. అదేమిటో రాక్షసుల వీరుల నుంచి ఏ కొద్దిపాటి ప్రతిఘటన ఎదురుకాలేదు. అందరూ నీరసంగా వ్రేలాడుతూ వున్నారు. జీవచ్ఛవాలుగా దేవతల చేతికి చిక్కుతున్నారు. దేవతలు ఆనందంతో అరటి చెట్లును తెగ నరికినట్లుగా నరికేశారు. చివరకు జంభాసురుడు కూడా ఇంద్రుడి వజ్రాయుధం వేటుకు నేలకొరిగాడు. లక్ష్మీదేవి బంగారు పల్లకీ నుండి ఎగిరివచ్చి దత్తుడి చెంతకు చేరింది. దేవేంద్రుడు తన సింహాసనం అధిష్టించాడు. ఇంద్రుడు వెంటనే దత్త్యాశ్రమమునకు వచ్చి దత్తుని ముంగిట నిలిచి సాష్టాంగ నమస్కారములు ఆచరించి స్తుతించాడు.


దత్తాత్రేయుడు సంతోషించి ఆశీస్సులు ఇచ్చి పంపాడు. కాబట్టి రాకుమారా, నువ్వు కూడా దత్త యోగీంద్రుణ్ని సేవించి అభీష్ట సిద్ధిని పొందు అని గర్గముని కార్తవీర్యార్జునికి చెప్పాడు. 


కార్తవీర్యార్జునుని దత్తోపాసన


కార్తవీర్యార్జునుడు వెంటనే గురువైన గర్గముని వద్ద సుముహుర్తం నిర్ణయించుకొని తమ మంత్రి పురోహితాదులైన పెద్దలైన వారి వద్ద శుభాశీస్సులు అందుకొని రాజ్య బాధ్యతలను వారికప్పగించి సహ్యాద్రి పర్వత ప్రాంతానికి బయలుదేరాడు. దత్తాశ్రమం చేరుకున్నాడు. నిరాడంబర వేషధారణలతో ఒంటరిగా పాదచారియై ఆశ్రమంలోకి చేరుకున్నాడు. మణి శిలాపీఠంపై మదవతీ మధు పాన గోష్టిలో ఓలలాడుతున్న దత్తస్వామిని దర్శించాడు. గోత్ర నామాదులు చెప్పుకొని సాష్టాంగ నమస్కారాలు చేసాడు. దత్తస్వామి ఒక వింతైన చిరునవ్వు విసిరారు. కార్తవీర్యుడు మనస్సు కుదుట పడింది. స్వామి తన రాకను గమనించారని అనుమతించారని సంబరపడ్డాడు. తన జన్మ ధన్యమయిందని మురిసిపోయాడు. అలజడి తగ్గి సంశయాలు తొలగి మనస్సులో క్రమక్రమంగా ధైర్యం బయలు దేరింది. దత్త స్వామికి మరింత చేరువయ్యాడు. దత్తస్వామి పాదాలు తన చొట్ట చేతులతో ఒత్తుతూ నేలపై చతికిల బడి కూర్చున్నాడు. కాసేపటికి దత్త యోగిచేతిలో మధుపాత్రఖాళీ అవటంతో తానే లేచివెళ్ళి మధువును నింపి తెచ్చాడు. బంగారు పళ్ళెదాలలో వున్న మధురమైన ఫలాలను, పదార్థాలను అదనుకని పెట్టి స్వామికి అందిస్తున్నాడు. క్రమక్రమంగా స్వామి దినచర్యలో స్వామి పరిచారక గణంలో కార్తవీర్యుడు ఒక భాగస్వామి అయ్యాడు.