Tuesday, 14 March 2023

శ్రీదత్త పురాణము (78)

 


ఋతధ్వజుడి తల్లితండ్రులు ఈ పిడుగులాంటి దుర్వార్తను తట్టుకోలేక మూర్చపోయారు. మదాలస అయితే ప్రాణాలనే వదిలేసింది. కాసేపటికి తెలివి వచ్చిన అత్తమామలుకి ఈ వార్త మరొక అశనిపాతమయ్యింది. రాజధానిలో విషాద వాతావరణం అలుముకుంది. రాజధానిలో మాయమైన కపట మహర్షి తాళకేతువు మళ్ళీ ఇక్కడ ఆశ్రమంలో ప్రత్యక్షమైనాడు. తన రాక కొరకు ఎదురుచూస్తున్న ఋతధ్వజుడ్ని మృదువుగా కౌగలించుకొని చిరంజీవ చిరంజీవ అని ఆశీర్వదించాడు. నాయనా రాకుమారా నన్ను కృతార్ధుణ్ణి చేసావు. చాలా సంతోషం. నేను చెయ్యాలని అనుకున్న వన్నీ చేసేశాను. నీకు ఆశీస్సులు కూడా ఇచ్చేశాను. కనుక నువ్వు ఇంక నీ రాజ్యానికి బయలుదేరవచ్చు అన్నాడు. ఋతధ్వజుడు మాయా మహర్షికి మరో మారు సాష్టాంగ నమస్కారం చేసి సెలవు తీసికొని తన కువలయాశ్వం అధిరోహించి రాజధానికి చేరుకున్నాడు. తనను చూసిన పౌరులందరూ గుసగుసలాడుకుంటూ నివ్వెరపోయి చూస్తున్నారు. పోనీలే బ్రతికేవున్నాడు. ప్రాణాలతో తిరిగివచ్చాడు అదృష్టవంతులం చిరంజీవ చిరంజీవ అంటూ వున్నారు. రాకుమారుడు ఇది ఏమిటో ఎందుకిలా వారు అంటున్నారో అర్థంకాలేదు రాజమందిరం చేరుకున్నాడు. దాసదాసీజనం ద్వారపాలకులు అందరూ విస్తుపోయారు. అందరూ గొణుక్కుంటూ చెమ్మగిల్లిన కళ్ళతో దీవిస్తున్నారు. తల్లితండ్రులూ ఆశ్చర్యపోయి అవాక్కయి అలాగే చూస్తూవుండిపోయారు. పాదాభివందనం చేసిన తనను తండ్రి ఆనందభాష్పాలు రాలుస్తూ ఉక్కిరి బిక్కిరి అవుతూ ఆప్యాయంగా ప్రేమతో కౌగలించుకున్నాడు. నాయనా మనం అదృష్టవంతులం నువ్వు జీవించేవున్నావు చాలు అంటూ ప్రేమగా శిరస్సు నిమిరాడు. తల్లి కూడా అలాగే దుఃఖం ఆనందం కలగలపి అవును అవును అంటూ ప్రేమగా వీపు నిమిరింది.


ఋతధ్వజుడు తండ్రితో - తండ్రీ ఏమిటి ఇందతా? ఏమయ్యింది మీకు? నేను బాగానే వున్నాను. నీ ఆజ్ఞప్రకారం యమునా తీరంలోని ఆశ్రమాలకి వెళ్ళాను. మునుల్ని సందర్శించాను. ఆశీస్సులు అందుకున్నాను. ఒక మహర్షి అడిగితే నా కంఠంలోని రత్నహారం బహుకరించాను. సంపూర్ణ ఆశీస్సులు అందుకొని హాయిగా తిరిగివచ్చాను. ఇంతకీ ఏదీ నా ప్రాణ ప్రియ మదాలస కనిపించడంలేదు? ఎక్కడికెళ్ళింది? అన్నాడు. కొడుకుకి ఏం సమాధానం చెప్పాలో ఆ దుర్వార్తను ఎలా అందించాలో అర్ధంకాలేదు. నాయనా అన్యాయం జరిగిపోయింది. ఎవడో కపట ఋషి అన్యాయంగా మోసం చేసాడు. నీ కంఠ హారం తెచ్చియిచ్చి నిన్ను రాక్షసుడెవడో హత్య చేసాడని నమ్మపలికాడు. తట్టుకోలేక మూర్ఛపోయాం మేము. నీ భార్య ప్రియ మదాలస ఆ మాటలు నమ్మి ప్రాణాలు వదిలేసింది. నువ్వు తిరిగి రానిలోకాలకు వెళ్ళి పోయావుగదా అని నేనే ఈ పాపిష్టిచేతులతో కోడలికి ఉత్తరక్రియలు జరిపించాను. ఇదిగో ఋషిఇచ్చిన కంఠహారం అంటూ హారాన్ని అందించాడు తండ్రి శత్రుజిన్మహారాజు.


Monday, 13 March 2023

శ్రీదత్త పురాణము (77)



అప్పుడా మహర్షి నాయనా రాకుమారా! తండ్రికి తగిన తనయుడవు నీవు. చాలా సంతోషంగావుంది. అడవిలో కందమూల ఫలాదులు తింటూ జీవించేవాళ్ళం అడవిలో మాకు ఎలాంటి బాధలు లేవు హాయిగా మా జపాలు మా తపస్సులు చేసుకుంటున్నాం అయినా అడివిలోకి వచ్చి మా క్షేమ సమాచారములు కనుక్కొనే పాలకులు వుండడం మా అదృష్టం. అయితే నా కన్నుల్లో దాగిన కలవర పాటును నీవు గ్రహించావు. దానికి కారణం వుంది. నేను ఒక యజ్ఞం చేస్తున్నాను. అది ముగింపుకొచ్చింది. ఇప్పుడు భూరిదక్షిణలు సమకూర్చుకోవాలి. ఎలాగా అనే దిగులు. బహుశ అదే నా కన్నుల్లో నీకు కనిపించివుంటుంది. నీకు అభ్యంతరం లేకపోతే నీ మెడలో ధగధగలాడుతున్న రత్న హారాన్ని ఇచ్చి వెళ్ళు అన్నాడు. ఆ మహర్షి అడగడమేమిటి రాకుమారుడు ఇవ్వడం తక్షణం జరిగిపోయాయి. అప్పుడా మహర్షి రాకుమారా నీ దాతృత్వం నన్ను మురిపిస్తోంది. సంతోషం. ఇక్కడేవుండు. నేనొకసారి యమునానదికి వెళ్ళి జలాధి దేవతను అర్చించి ఇప్పుడే వస్తాను. నీకు ఆశీస్సులిస్తాను. అవి అందుకొని వెడుదువుగాని అంటూ ఆ మహర్షి త్వరత్వరగా నదివైపుకి వెళ్ళాడు.


పిచ్చివాడు నన్ను నిజంగానే మహర్షి అనుకుంటున్నాడు. ఇది నిజంగానే ఆశ్రమం అనుకొంటున్నాడు. కన్నుల్లో కలవరపాటుని గుర్తించాడు కానీ నన్ను తాళకేతువుగా గుర్తించలేకపోయాడు. నా అన్న పాతాళ కేతువును సంహరించిన ఈ దుష్టుడికి తగిన ప్రతీకారం చేస్తాను. నా అన్న ఆత్మకు శాంతి కలిగిస్తాను అనుకున్నాడు దొంగ మహర్షి ఋతధ్వజుడు. చేతికి చిక్కాడన్న సంబరంతో తాళకేతువు యమునా నదిలోకి దిగాడు. తన మాయాశక్తితో అదృశ్యమై వెళ్ళి శత్రుజిన్మహారాజు ముందు ప్రత్యక్షమయ్యాడు.


భార్యతో, కోడలి కూర్చుని ఆ మహారాజు ఏదో వినోదం తిలకిస్తున్నాడు. హఠాత్తుగా ప్రత్యక్షమైన మహర్షిని చూసి ఆశ్చర్యంతో అందరూ లేచి నిలబడ్డారు. పరిచారకులు అర్ఘ్యపాద్యాదులు సమకూర్చారు. అతిధి మర్యాదలు జరిపారు. మహారాజా నాకు నోరు రావడంలేదు. ఇంతటి అప్రియమైన వార్తను నీకు అందించవలసిన దుఃస్థితి నా నొసటరాశాడు భగవంతుడు. ఇదిగో కంఠహారం మీ కుమారుడిది. ఎవడో మాయావిరాక్షసుడు ఋతధ్వజున్ని పొట్టన బెట్టుకున్నాడు. కువలయాశ్వాన్ని అపహరించుకుపోయాడు. మా ఆశ్రమానికి చేరువలోనే ఈ ఘోరం జరిగింది. ఆశ్రమ వాసులందరూ కలసి రాకుమారుని పార్థివ శరీరానికి అంత్యక్రియలు జరిపించారు. ఈ రత్నహారాన్ని మీకు అందించి మిమ్మల్ని ఓదార్చి ధైర్యం చెప్పి రమ్మని నన్ను పంపించారు మా ఆశ్రమవాసులందరూ. నా తపశ్శక్తిని ధారపోసి వాయువేగను నోవేగములతో నీ ముందు ప్రత్యక్షమయ్యాను. మహారాజా ఆనిత్యాని శరీరాణి ఉన్నారు. జాతస్య హి ధ్రువో మృత్యు అన్నారు. నీకు తెలియనివి కావు. తాపసులం మమ్మల్నే ఈ సంఘటన కంటతడి పెట్టించింది. ఇక కన్నవారి సంగతి కట్టుకున్న వారి సంగతి వేరే చెప్పాలా? గుండె దిటవు చేసుకోండి. చిన్నపిల్ల మదాలసను ఓదార్చండి అంటూ వచ్చినంత వేగంగానూ మాయమయ్యాడు.


Sunday, 12 March 2023

శ్రీదత్త పురాణము (76)

 

మదాలసను తన దివ్యాశ్యం మీద ఎక్కించుకొని భూలోకానికి బయలు దేరపోతున్నాడు కువలయాశ్వుడు. సరిగ్గా అదే సమయానికి పాతాళకేతువు సైన్యంతో వచ్చిపడ్డాడు. జాగ్రత్తగా కూర్చోమని మదాలసను హెచ్చరించి కువలయాశ్వుడు ధనుష్టంకారం చేశాడు. ఆ దివ్యాస్త్రం మీద అనూహ్యమైన వేగంతో అనుహ్యమైన దారుల్లో మెరుపుతీగలా తిరుగుతూ మొత్తం దైత్యమహాసైన్యాన్ని అవలీలగా సంహరించాడు. పాతాళకేతువును ఖండించి విజయశంఖం పూరించాడు. తాళకేతువు తన అనుచరులు మరికొంతమందితో పలాయనం చిత్తగించాడు.


మదాలసా సహితుడై కువలయాశ్వుడు భూలోకానికి వచ్చి గాలవమహర్షికి నమస్కరించి పాతాళకేతు వధను వివరించి ఆశీస్సులు అందుకొని తన రాజధానికి వెళ్ళిపోయాడు. కువలయాశ్వానికి తగిన విడిది ఏర్పాటు చేయించాడు. తల్లిదండ్రులకు ఆ నవ దంపతులు పాదాభివందనం చేసి, దీవెనలు అందుకొని, అంతఃపురంలో ప్రవేశించారు. రాజభోగాలు అనుభవిస్తూ శృంగార క్రీడా విలాస వినోదాలతో మురిసిపోతున్నారు.


తాళ కేతువు కుతంత్రం


కొడుకూ కోడళ్ళ అనుకూల దాంపత్యాన్ని చూసి సంబరపడి పోతున్న శత్రుజిన్మహారాజు ఒకరోజు కొడుకును చేరబిలచి ఇలా అన్నాడు. నాయనా కుమారా అప్పుడప్పుడు సాయంకాలం వేళల్లో అయినా ముని వాటికల వైపుకి వెళ్ళి ఆశ్రమవాసుల క్షేమ సమాచారములు తెలుసుకొని వస్తూవుండు. వారి కుశలమే మన కుశలం. వారి దీవెనలే మనకు శ్రీరామరక్ష. ఇది మన రాజ ధర్మం కూడా అని మృదువుగా ఉపదేశించాడు. ఋతుధ్వజుడు అంగీకరించి మరునాటి సాయంకాలం కువలయాశ్వాన్ని అధిరోహించి పవిత్ర యమునాతీరంలోని అడవిలోకి వెళ్ళాడు. అక్కడొక దివ్యమైన ఆశ్రమం కనిపించింది. చిత్ర విచిత్ర విరాజితమైన పర్ణశాలలు కనిపించాయి. ఒక్కొక్క పర్ణశాలలో నేల కూడ ఒక్కొక్క రంగులో వుంది. ఆ పర్ణశాలల చుట్టూతా తీర్చిదిద్దబడిన అందమైన ఉద్యానవనములు. ఆ వనాలలో వివిధ రూపాల్లో ఉన్న పొదరిల్లులు. కొన్ని దేవతామూర్తుల రూపాల్లో, కొన్ని రధాకారాలలో కొన్ని గజాశ్వాది జంతువుల ఆకృతిలో కొన్ని వివిధ పక్షి జాతుల రూపాలలో ఉన్నాయి. వివిధ కంఠ స్వరాలతో పలకరిస్తున్న పక్షులు జంతువులు కనీ వినీ ఎరుగని పువ్వులు, ఫలాలు. ఆశ్చర్యచకితుడై ఋతధ్వజుడు ఆశ్రమం అంతటా తిరిగాడు. తను ఏ ప్రక్కకు వెళ్ళినా పచ్చని స్వాగత తోరణాలు అప్పుడే తనకోసమే కట్టినట్లుగా వున్నాయి. ఋతధ్వజుని ఆనందానికి అంతులేకుండా పోయింది. పర్ణశాలల నుండి మెల్లగా పెల్లుబికి వస్తున్న హోమధూపం, బూడిద వర్ణంలో వినువీధికి ప్రయాణం చేస్తుంది. పెద్ద వృక్షవాటికల క్రింద వేదపనసలకు సంతచెప్పుకుంటున్న శిష్యబృందాలు. ఇంతలో ఒక పర్ణశాల దగ్గర ఒక మహర్షి తన కోసమే ఎదురు చూస్తూవున్నట్లుగా అర్ఘ్యపాత్రతో కనిపించాడు. ఆ మహర్షి ముఖంలో తేజస్సు కన్పిస్తోంది, కానీ కన్నుల్లో ప్రశాంతి కనబడటం లేదు. ఆ మహర్షి ఏదో కలత చెంది కలవరపడుతున్నట్లు అనిపించింది. ఋతధ్వజుడు దగ్గరికి వెళ్ళి పాదాభివందనం చేశాడు. మహర్షి సాదరంగా ఆత్మీయంగా దారితీసాడు. మహర్షీ తమరెవరు? మీ చూపుల్లో ఏదో కలవరపాటు కన్పిస్తోంది నిజమో అది నా భ్రాంతియో. మీ ఆశ్రమానికి ఏ రాక్షసుల పీడలు లేవుగదా క్రూరమృగాల బెడద కూడా లేదు కదా. ఫలం, పుష్పం సమిధలు, జలం ఇవన్ని మీకు సమృద్ధిగా లభిస్తున్నాయా? మా తండ్రిగారు శత్రుజిన్మహారాజు మిమ్మల్ని దర్శించి కుశల వార్తలు తెలుసుకొని రమ్మన్నారు అన్నాడు.


Saturday, 11 March 2023

శ్రీదత్త పురాణము (75)

 


కుండలా! నీ వంటున్న ప్రతి మాటా నాకూ సమ్మతమే. నా మనస్సులో మెదలుతున్న వూహలనే నువ్వు పలుకుతున్నావు. కానీ నాదొక చిన్న అభ్యంతరం. మీరు గంధర్వులు. గాంధర్వ వివాహం మీకు శోభిస్తుంది. మేము మానవులం. సమంత్రకంగానే మాకు వివాహం జరగాలి. అదీగాక నేనింకా తండ్రిచాటు బిడ్డను. తల్లిదండ్రుల అనుమతి లేకుండా వివాహం జరుపుకోవడం నాకంతగా నచ్చదు. ప్రస్తుతం గాలవమహర్షి అధీనంలో ఆశ్రమ రక్షకుడుగా ఉన్నాను. కాబట్టి వారి అనుమతి కూడా అవసరం.


కువలయాశ్వా! మదాలసను వివాహమాడటం ఇష్టమేనన్నావు. అది చాలు. మిగతా అభ్యంతరాలు నేను తీరుస్తాను. కులగురువులు పితృసమానులని శాస్త్రం చెబుతోంది. నా యోగశక్తితో మీ కుల గురువులు తుందిల మహర్షిని ఇక్కడికి రప్పిస్తాను. వారు మీ కులాచారం ప్రకారం సమంత్రకంగా వివాహం జరిపిస్తారు. దీనితో నీ అభ్యంతరాలన్నీ తొలగిపోతాయి.


ఋతుధ్వజుడు అంగీకరించాడు. కుండల తన యోగ మాయా శక్తితో తుందిల మహర్షిని ఆహ్వానించింది.


వారు వివాహానికి అవసరమైన వస్తుసామగ్రితో విచ్చేశారు. సమంత్రకంగా మదాలసా ఋతుద్వజులకు అగ్నిసాక్షిగా వివాహం జరిపించారు, దక్షిణ తాంబూలాదులు స్వీకరించి తన ఆశ్రమానికి వెళ్ళిపోయారు. కుండల కూడా నవదంపతులను దీవించి తన గంధర్వ లోకానికి తాను వెళ్ళిపోయింది.


పంది రూపంలో పారిపోయివచ్చిన పాతాళకేతువు తన సోదరుడు తాళకేతువుతో మంతనాలు జరిపి రాక్షస మహాసైన్యాన్ని సమకూర్చుకుని తాను మదాలసను బంధించి ఉంచిన సౌధం దగ్గరకి వచ్చాడు. తనను వెన్నంటి తరుముకంటూ వచ్చిన కువలయాశ్వుడు అక్కడే గదా ఆగిపోయాడు. ఒంటరిగా దొరుకుతాడు. సైన్యంతో చుట్టుముట్టి మట్టు పెడదామని ఆశించి వచ్చాడు.


Friday, 10 March 2023

శ్రీదత్త పురాణము (74)



సింహద్వారం దగ్గర నీ ప్రశ్నలకు నేను బదులు పలుకలేదు. క్షమించు. నురుగులు కక్కుతూ పంది రూపంలో పారిపోయివస్తున్న పాతాళకేతువును చూశాను. వాడి డొక్కలో నాటుకున్న బాణం చూశాను. కామధేనువు నిన్న చెప్పిన మాటలు ఈ రోజే నిజమైపోతున్నయా అనే సంబరంతో ఈ శుభవార్తను మదాలసకు చెప్పాలనే ఉత్కంఠతో మెట్ల వెంట సౌధాగ్రం మీదకి పరుగులు తీశాను. నిన్నూ నీ ప్రశ్నలనూ పట్టించుకోలేదు. అవును, నేను మెట్లు ఎక్కివచ్చేలోగానే నువ్వు సౌధాగ్రం చేరుకున్నావే. అంత వేగంగా ప్రయాణించే శక్తి నీకు ఎలా వచ్చింది. మానవ మాత్రుణ్ణి అంటున్నావు. ఇది ఎలా సాధ్యం? ఆకాశయానం వాయువేగం ఈ సౌందర్యం ఈ రూపసౌష్టవం- ఇవన్నీ అతిమానుషమైన విషయాలే. దయచేసి నిజం చెప్పు. ఆ పందిగాణ్ని నువ్వే తరుముకుంటూ వచ్చావా? లేకపోతే, కాక తాళీయంగా జరిగిందా?


కుండలా! నీ సందేహం సమంజసమే. గాలవ మహర్షి ఆశ్రమంలో అలజడి సృష్టిస్తున్న పందిని నేనే తరుముకుంటూ వచ్చాను. నా బాణం దెబ్బ తగిలినా వాడు ప్రాణాలతో పారిపోయి వచ్చాడు. గాలవ మహర్షికి సూర్యదేవుడు బహుకరించిన దివ్యాశ్వాన్ని అధిరోహించడంవల్ల నాకు వాయువేగ మనోవేగాలు పాఠ్యపడ్డాయి. దీన్ని అధిరోహిస్తే పాతాళానికేమిటి పూర్వలోకాలకేమిటి ఎక్కడికైనా క్షణంలో చేరుకోవచ్చు. బహుశ నీకు నీ రాకుమారికి సందేహాలన్నీ తీరిపోయాయనుకుంటాను. నేను మానవ మాత్రుణే, ముమ్మాటికీ రాకుమారుణ్ని. మా తండ్రిపేరు శత్రజిన్మహారాజు.


నన్ను ఋతుర్వజుడంటారు. ఈ గుర్రం పేరు కువలయాశ్వం. అందుచేత నన్ను కూడా కువలయాశ్వుడన్నారు ఆశ్రమవాసులు కొందరు.


ఉన్నట్టుండి మదాలస బుగ్గలు ఎరుపెక్కాయి. కన్నులు చెమరించాయి. కన్నుల్లో చూపుల్లో ఒక బెదురు తొంగిచూసింది. ప్రథమ సందర్శనంలో అంకురించిన అభిలాష ఇప్పుడు పల్లవించింది. అతడి ఎదుట నిలబడలేక పోతోంది. అలాగని వెళ్ళిపోనూ లేకపోతోంది. ఈ అవస్థను గుర్తించింది కుండల. రాకుమారుడివైపు చూసి సాభిప్రాయంగా నవ్వింది.


రాకుమారా! కామధేనువు చెప్పిన మానవ మహావీరుడవు నువ్వే. నీ చేతిలో పాతాళకేతువు సంహరింపబడతాడు మా మదాలస తపస్సులు ఫలించాయి. మేము గంధర్వులం. అమంత్రకమైన గాంధర్వ వివాహం మాకు పరిపాటి. ఈ దివ్యాశ్వం మీద అధిరోహింపజేసి మదాలసను మీ రాజ్యానికి తీసుకెళ్ళు. కావలసివస్తే అక్కడ మీ పద్దతిలో వివాహం జరిపించుకో.


Thursday, 9 March 2023

శ్రీదత్త పురాణము (73)

 


కువలయాశ్వుడు ఆశ్చర్యంతో నివ్వెరపోయాడు. ఇంతటి సౌందర్యరాశికి దుఃఖమా? ఇన్ని సంపదలు వుండి కన్నీరా? కారణం ఏమిటో తెలుసుకోవలసిందే అనుకొని మృదువుగా ఇలా పలకరించాడు. సుందరీ నీవు ఎందుకు దుఃఖిస్తున్నావు? నా రాక నీకు ఇష్టం లేదా? ఇంత అందంవుండి సంపద వుండీ నీకు కన్నీరేమిటి? ఇంతకీ అసలు నువ్వు ఎవరు? పేరేమిటి? నీ తల్లితండ్రులు ఎవరు? ఈ పాతాళ నివాసం ఏమిటి? ఋతధ్వజుడు ప్రశ్నిస్తున్నాడే తప్ప ఆమె మాత్రం సమాధానం చెప్పడంలేదు. ఇంతలో ఇంతకు ముందు సింహద్వారం దగ్గర కనిపించిన సుందరాంగి వచ్చింది. ఆ యువతులు ఇద్దరూ గుసగుసలాడుకున్నారు. ఇంతకు ముందు కనిపించిన సుందరి కువలయాశ్వుడి దగ్గరగా వచ్చి ఇలా అంది. మహావీరా, నీకు స్వాగతం అతిధి మర్యాదలు జరుపని మా అజ్ఞానాన్ని క్షమించు. ఇంతకీ మీరు ఎవరు? కిన్నెర కింపురుష, గంధర్వులలో ఏ జాతివాడవు? మమ్మల్ని ఈ నరక యాతన నుండి తప్పించడానికి వచ్చిన దేవతవా? ఎవరు మీరు? తెలియజెప్పి మా సందేహసంకటాలను తొలగించండి. అప్పుడు మాత్రమే నేను గాని మా రాకుమారి గాని నీతో ధైర్యంగా మాట్లాడుతాం.


ఈ ప్రశ్నలకు కువలయాశ్వుడు బదులు ఇలా చెప్పాడు. సుందరీ సింహద్వారంలో కనిపించి నా ప్రశ్నలకు జవాబు చెప్పకుండా ఇక్కడికి పరుగుపరుగున వచ్చావు మీకు వచ్చిన ఆపద ఏమిటి? మీరిద్దరూ అసలు ఎవరు? భయపడకండి నేను రాక్షసుణ్ని కాదు, దేవతనూ కాను. సామాన్య మానవుణ్ని రాజకుమారుణ్ని. శత్రుజిత్తుపాలుడి కుమారుణ్ని మీ విషయాలు తెలియజెయ్యండి. చేతనయినంత సహాయం చేస్తాను.


మళ్ళీ సుందరాంగులిద్దరూ చెవులు కొరుక్కున్నారు. పరిచారక లాగ కన్పిస్తున్న సుందరి ఇవతలకి వచ్చి ఇలా అంది. రాకుమారా విశ్వాసువు అనే పేరు వినే వుంటావు. గంధర్వరాజు. వారి గారాల కూతురు ఆమె. పేరు మదాలస. నేను ఈమె ఇష్టసఖిని. నన్ను కుండల అంటారు. ఇది పాతాళలోకం. ఇది ఒక రాక్షసుడి భవనం. వాడిపేరు పాతాళ కేతువు, వీడి తండ్రి పేరు చంద్రకేతువు. వాడూ రాక్షసుడే. గంధర్వలోకంలో ఉద్యానవనంలో హాయిగా విహరిస్తున్న ఈ మదాలసను నన్నూ పాతాళ కేతువు తన తమో విద్యను ప్రయోగించి అపహరించి తెచ్చి ఇక్కడ బంధించాడు. మదాలస తనను వివాహం చేసుకోవాలట. ఎంతగానో ఒత్తిడి చేస్తున్నాడు. అన్ని ఉపాయాలు పన్నుతున్నాడు. ఈమె తిరస్కరిస్తూంది. అయినా ఆ మూర్ఖుడు పట్టువదలడంలేదు. రేపు త్రయోదశినాడు బలవంతంగానైనా పెళ్ళి చేసుకొని తీరతానని విన్ననే బెదిరించి వెళ్ళాడు. మదాలస భయపడి ప్రాణత్యాగానికి సిద్ధం అయ్యింది. ఇంతలో కామదేనువు ప్రత్యక్షమై ఆమెను వారించింది. మదాలసా తొందరపడకు ఈ రక్కసుడు నిన్ను వివాహం చేసుకోలేడు. ఈ రోజే వీడికి మరణం నిశ్చయం అయ్యింది. కాసేపట్లో వీడు భూలోకానికి వెళ్తాడు. అక్కడ ఒక ముని ఆశ్రమంలో అలజడి సృష్టిస్తాడు. అప్పుడొక రాజకుమారుడు వీణ్ని బాణంతో కొడతాడు. ఆ మహావీరుడే నిన్ను వివాహం చేసుకుంటాడు. ఎక్కడి పాతాళం ఎక్కడి భూలోకం అని ఆశ్చర్యపడకు రేపటికి అంతా నీకే తెలుస్తుంది. ఇలా కామధేనువు ధైర్యంచెబితే మా రాకుమారి ఆత్మ హత్యా ప్రయత్నం నుండి విరమించుకుంది.


Wednesday, 8 March 2023

శ్రీదత్త పురాణము (72)

 


ఒకనాటి సాయంకాలం గాలవాదులు సంధ్యోపాసన చేస్తూ వుండగా రాక్షసుడు పంది రూపంలో వచ్చి ఆశమ్రాన్ని అల్లకల్లోలం చేస్తున్నాడు. ఋతధ్వజుడు కువలయాశ్వాన్ని అధిరోహించి ఆ మాయా పందిని వెంబడించాడు. బాణం దెబ్బలు తప్పించుకుంటూ శరవేగంగా పరుగు తీస్తోంది ఆ పంది. కువలయాశ్వుడు వెంటబడి తరుముతున్నాడు. ఎట్టకేలకు ఒక బాణం దాని డొక్కలో గ్రుచ్చుకుపోయింది. అయినా అది లెక్క చేయకుండా పరుగెడుతూ చివరకు అది పాతాళానికి చేరింది. రాకుమారుడు దాని వెంట పాతాళలోకానికి చేరుకున్నాడు. అది ఒక దివ్య భవనంలోకి ప్రవేశించి అదృశ్యమయ్యింది. కువలయాశ్వుడు ఆ భవనం అంతా వెదికాడు. కానీ ఆ మాయా పంది జాడ కనిపించలేదు. కాని ఒక ద్వారం వద్ద ఒక కాంతామణి కనిపించింది. కువలయాశ్వుడికి సందేహం వచ్చింది. రాక్షసుడే ఆ రూపం ధరించాడేమోనని, ఆమె రాక్షసుడేనని సంహరిస్తే ఒక వేళ కాని పక్షంలో స్త్రీ హత్యా పాతకం చుట్టుకుంటుందేమో అడిగి చూద్దామని గంభీరస్వరంతో ఇలా అన్నాడు. నారీ ఎవరు నీవు? ఈ దివ్య మందిరం ఎవరిది? నువ్వు ఇక్కడ ఎందుకువున్నావు? ఆ అమ్మాయి నోట ఏ ఉలుకూ లేదు పలుకూ లేదు. ఒకసారి కువలయాశ్వున్ని ఎగా దిగా చూసి కనురెప్పలు టపటప ఆర్పి భవనం పైభాగానికి మెట్ల మీదుగా తుర్రుమని జారుకుంది. కువలుడు కూడా సౌధాగ్రం చేరుకున్నాడు. గుర్రం దిగాడు. ఆ సుందరి వెంట తాను కూడా సౌధాగ్ర మందిరంలోకి ప్రవేశించాడు పరుగు పరుగున.


అది ఒక పాలరాతి మందిరం. విశాలంగా వుంది. స్తంభాల మీద అపూర్వ శిల్ప సంపద ఉట్టి పడుతోంది. ఆ మందిరంలో ఎక్కడ వాలిన చూపు అక్కడే నిలిచిపోతోంది. మందిర మధ్యభాగంలో బంగారు వేదిక, దాని మీద హంసతూలికా తల్పము. దాని చుట్లూ ఉల్లిపారల్లాంటి తెల్లని దివ్యాంబరం గొడుగులా వేలాడుతోంది. ఆ తెరలోపల వేదికపై ఒక సుందరి. తెలిమబ్బుల్లో చందమామలా దోబూచులాడుతోంది. పరికించి చూసాడు. కళ్ళు చెదిరిపోయే సౌందర్యం ఆమెది. మన్మధుణ్ని విడిచి వచ్చిన రతీదేవిలావుంది. పాతాళలోకాధి దేవత కాబోలు అనుకున్నాడు ఋతధ్వజుడు. ఆమె కువలయాశ్వుణ్ని చూడగానే తల్పందిగి తలవంచుకొని ఒయ్యారంగా నిలబడింది. కుడికాలిపై బరువు ఆనించి ఎడమకాలి బొటన వ్రేలితో నేలను రాస్తోంది. ఎడమ చేతిలో కమలాన్ని కుడి చేతితో సుతారంగా పొదివిపట్టుకొని పావురం వీపు నిమిరినట్లుగా కమలం రేకులు ముడుచుకొనేలా కలుపుతోంది. కడగంటి చూపులు విసురుతోంది. అతడు చూస్తుంటే కన్నులు దించుకుంటోంది. చూపులు కలిస్తే కలవరంతో కన్నులు దించుకుంటుంది. ఆమెకు తెలియకుండానే పెదవులపై చిరునవ్వులు విరుస్తున్నాయి. బుగ్గల్లో గులాబీలు రేకులు విప్పుకుంటున్నాయి. ఋతధ్వజునిలో అభిలాష మొదలయింది. రెండడుగులు ముందుకేశాడు. ఆ సుందరాంగి చేరువలో నిలబడ్డాడు. పలకరించాలని తహతహ బయలుదేరింది. అతిధి మర్యాదలు చేయదా? కనీసం పలుకదా? రండి కూర్చోండి అనదా? అని ఎదురు చూపులు మొదలయ్యాయి. అతడు చేరువకు వస్తున్నకొద్దీ ఆ లావణ్యవతిలో కళవరం బయలుదేరింది. కువలయాశ్వుడి ముఖంలోకి ఒక్కసారిగా చూసి వెంటనే చూపులు దించుకుంటోంది. ఆమె కన్నుల నుండి రెండు అశ్రుబిందువులు హఠాత్తుగా రాలి ఆమె గుండెల మీదకు జారాయి.