Sunday, 7 May 2023

శ్రీదత్త పురాణము (131)

 


విష్ణు దత్త - దత్త స్తుతి


దత్తాత్రేయం హరికృష్ణ మున్మాదం ప్రణతోస్మ్యహం 

ఆనందదాయకం దేవం మునిబాలం దిగంబరమ్ || 

పిశాచ రూపిణం విష్ణుం వందేఽహం జ్ఞాన సాగరమ్ | 

యోగినం భోగినం నగ్న మనసూయాత్మ జం కవిమ్ ॥ 

భోగ మోక్ష ప్రదం వందే సర్వదేవ స్వరూపిణమ్ । 

ఉరుక్రమం విశాలాక్షం పరమానందవిగ్రహమ్ || 

వరదం దేవదేవేశం కార్తవీర్య వరప్రదమ్ 

నానారూప ధరం హృద్యం భక్త చింతామణిం గురుమ్ ॥ 

విశ్వవింద్య పదాం భోజం యోగిహృత్ పద్మవాసినమ్ । 

ప్రణతార్తి పారం గూఢం మత్సితాచార చేష్టితమ్ ||

మితాచారం మితాహారం భక్ష్యాభక్ష్య వివర్జితమ్ । 

ప్రమాణం ప్రాణ నిలయం సర్వాధారం నతోస్మ్యహమ్ ||

సిద్ధసాధకం సంసేవ్యం కపిలం కృష్ణపింగళమ్| 

విప్రవర్యం వేదవిదం వేదవేద్యం నియత్సమమ్ || 

పరాశక్తి పదాక్లిష్టం రాజరాజ్య ప్రదం శివమ్ ।

శుభదం సుందరగ్రీవం సుశీలం శాంత విగ్రహమ్ ॥

యోగినం రామయాస్పృష్టం రామరామం రమాప్రియమ్। 

ప్రణతోస్మి మహాదేవం శరణ్యం భక్తవత్సలమ్ ॥ 

వీరంవరేణ్యం ఋషభం వృషాచారం వృషక్రియమ్ । 

అలిప్త మనఘం మేద్యమనాది మగుణం పరమ్ || 

అనేక మేక మీశాన మనంతమని కేతనమ్ | 

అధ్యక్ష మసురారాతిం శమంశాంతం సనాతనమ్ ॥ 

గుహ్యం గభీరం గహనం గుణజ్ఞం గహ్వరప్రియమ్ | 

శ్రీదం శ్రీశం శ్రీనివాసం శ్రీ వత్సాంకం పరాయణమ్ | 

శ్రీ జపంతం జపతాం వంద్యం జయంతం విజయప్రదమ్ । 

జీవనం జగతస్వేతుల జానానం (= సర్వజ్ఞమ్) జాతవేదసమ్ | 

యజ్ఞమిజ్యం యజ్ఞభుజంయజ్ఞేశం యాజకంయజుః | 

యష్టారం ఫలదంవందే సాష్టాంగం పరయాముదా ॥


Saturday, 6 May 2023

శ్రీదత్త పురాణము (130)

 


ఈ ప్రార్ధనకు సంబరపడ్డాడు అంబరవిహరి. సౌమ్యుడై విప్రరూపంలో దర్శనమిచ్చాడు. సాధ్వీ ఏమి ఆజ్ఞ ? అన్నాడు. ఆబ్ధికంలో రెండవ భోక్తగా కూర్చోవాలి నాయనా - అంది. సరే అన్నాడు. లోపలికి వచ్చి విష్ణుదత్తుడి నుండి అర్ఘ్యపాద్యాదులు అందుకొని రెండో పీట మీద కూర్చున్నాడు. అరిటాకు పరిచాడు విష్ణుదత్తుడు. సాధ్వీ! విశ్వదేవస్థానంలో మేమిద్దరం కుదిరాము. బాగుంది. మరి పితృదేవస్థానంలో కూర్చోడానికి మాకు సాటి మనిషి ఏడి? అని అడిగారు దత్తస్వామి చిరునవ్వులు చిందిస్తూ.


స్వామి తొందరపడకండి ఇపుడే వస్తాను అంటూ సుశీల తమ నిరతాగ్నిశాలలోకి వెళ్ళింది. ఇలవేల్పు అగ్ని దేవుడ్ని ప్రార్ధించింది. సర్వశుచీ! సర్వభక్షకా! లే మరో రూపం ధరించు. త్వరగా రా. శ్రాద్ధభోక్తగా వచ్చి కూర్చున దత్తస్వామి నీ కోసం ఎదురు చూస్తూ వున్నాడు. తమకు సాటి వచ్చే మూడవ వాడివి నువ్వేనని భావిస్తున్నాడు. సురోత్తమా - సురవర్యా- వైశ్వానరా హవిర్భుజా అగ్నిముఖావై దేవాః అంటుంది వేదం. దేవతలకు నీవు ముఖ స్థానీయుడవు - ధూమకేతూ- గృహపతీ- కర్మాధ్యక్షా- నీకు ఇదే నమస్కరిస్తున్నాను అనుగ్రహించు.


ఆ పతివ్రత ఇలా ప్రార్ధించేసరికి ఒకానొక అగ్ని గుండం నుండి ఒక అంశతో అగ్నిదేవుడు ఆవిర్భవించాడు. మరొక అంశతో కుండంలోనే వున్నాడు. వచ్చిన అగ్ని దేవునికి కూడ అర్ఘ్యపాద్యాదులు సమర్పించాడు విష్ణుదత్తుడు. సరాసరి పీట మీదకెళ్ళి కూర్చున్నాడు. అరిటాకు సిద్దంచేసాడు విష్ణుదత్తుడు. ఆ పాతివ్రత్య మహత్మ్యాన్ని చూస్తున్న దత్తస్వామి ఆనందం పొందాడు. సూర్యాగ్నులూ దత్తదేవుడూ ఆహుతులై ఆయాస్థానాల్లో కూర్చుంటే విష్ణుదత్తుడు పితృయజ్ఞాన్ని అపూర్వంగా నిర్వహించాడు. ఇంతటి ఉత్తము విప్రులు ఎవరికైనా ఎన్నడైనా దొరుకుతారా? ముగ్గురూ శ్రాద్ధవిధి నియమాలకు అనుగుణంగా భోక్తృత్వం నెరపి సంతుష్టులై తృప్తాస్మాః అని ముక్త కంఠంతో పలికారు. విష్ణుదత్తుడి పితృపితామహ, ప్రపితామహులకు అక్షయ పుణ్యలోక ప్రాప్తి కలగాలని ఆశీర్వదించారు. సుశీలా విష్ణు దత్తులు సాష్టాంగపడ్డారు. లేచి అంజలి ఘటించి శిరస్సు వంచి నిలబడ్డారు. అప్పుడు ఆనందంతో భక్తిశ్రద్ధలతో విష్ణుదత్తుడు దత్తాత్రేయుడ్ని స్తుతించాడు.


Friday, 5 May 2023

శ్రీదత్త పురాణము (129)

 


ఓరి మూఢుడా నన్ను ఏడిపించుకుతింటావేమిరా? నిన్ను చంపేస్తాను నీకసలు నాతో పని ఏమిటి? - అని వికృతాకారుడు కర్ణకఠోరంగా గద్దించాడు. అయినాసరే తన పని సాధించుకోవాలనే పట్టుదలతో విష్ణుదత్తుడు పాదాలు వదలలేదు. అప్పటికి స్వామి ప్రసన్నుడయ్యాడు. వికృతాకారం వదిలేసాడు. మృదువుగా శ్రావ్యంగా ఇలా అన్నాడు. విష్ణుదత్తా! ఈ వికృతాకారుడితో నీకు పని ఏమిటయ్యా? నాకోసం మూడుమార్లు వచ్చావు అన్నాడు. స్వరంలో వినిపించిన మార్ధవం మాధుర్యం విష్ణుదత్తుణ్ని పులకింపజేశాయి. వీపు మీద మాంసం ముద్ద బరువు ఎవరో తీసేసినట్లయ్యింది. పట్టుకున్న కాళ్ళు, నేలా రమణీయంగా మారిపోయాయి. విష్ణుదత్తుడు మెల్లగా కళ్ళు తెరచాడు. ఆ పాదాల మీద పట్టు పీతాంబరపు ఎర్రంచు వ్రేళ్లాడుతూ కనిపించింది. నల్ల కలువలు లాంటి పాద పద్మాలు తనచేతుల్లో వున్నాయి. ఆ పాదాలపై శిరస్సు ఆన్చి గబగబా మూడుమార్లు కళ్ళకి అద్దుకున్నాడు. లేచి నిలబడ్డాడు. చిరునవ్వులు చిందిస్తూ ప్రసన్న ముఖారవిందంతో పర్ణశాలముందు గున్నమావిచెట్టు నీడన తిన్నె మీద త్రిమూర్తి స్వరూపుడు దివ్యాభరణ, దివ్యాంబరములు ధరించిన వాడు, తులసీదళదామ విరాజితుడు, పుసుమాలికా సమలంకృతుడు, పారిజాత పరిమళాలు వెదజల్లుతూ దర్శనమిచ్చాడు. కనుచూపు మేరలో ఎక్కడా వెలివాడ లేదు. మాంసపు ముద్దలూ లేవు. కంటికి ఇంపుగొల్పే పచ్చని ఆశ్రమ వాతావరణం పర్ణశాలలు, కుటీరాలు. శుచియై శాంతుడై ఎట్టఎదుట ఆశీనుడైవున్న దత్తస్వామికి మళ్ళీ మళ్ళీ సాష్టాంగ దండప్రణామాలు చేసి ఆనందభాష్పములతో దోసిలి యొగ్గి ఆనందభాష్పములతో నిండిన కళ్ళను తుడుచుకొని గద్గద స్వరంతో ఇలా పలికాడు.


మహేశా! ఈ జగతీ తలంలో నేను ధన్యుణ్ని. నన్ను కన్న తల్లిదండ్రులు ధన్యులు. యోగి వంద్య పదార విందుడవైన నీ దర్శన భాగ్యం కలిగింది - అని మరొకసారి పాదాల మీద పడ్డాడు. విష్ణు దత్తా నాతో నీ పనేమిటో చెప్పావు కాదు అన్నాడు దత్తాత్రేయుడు. అప్పటికి తేరుకున్న విష్ణుదత్తుడికి భార్య సుశీల చెప్పిన మాటల జ్ఞాపకం వచ్చాయి. అడగవలసింది ఏదో స్ఫురించింది. స్వామి ఈ రోజు మా తండ్రి గారి ఆబ్ధికం. తమరిని భోక్తగా నియంత్రించుకుంటాను. తమరు తప్పకుండా రావాలి - అన్నాడు. విష్ణుదత్తుడి అభ్యర్ధననూ స్వామి అంగీకరించారు. అలాగే తప్పక వస్తాను. నువ్వు ముందు నడువు కాసేపట్లో స్నానం సంధ్య ముగించుకొని నీవెనుకనే నీ ఇంటికివస్తాను. నీ ప్రయత్నం సఫలం అయ్యింది కదా ఇకపద అన్నారు దత్తస్వామి.


విష్ణుదత్తుడు పరుగుపరుగున ఇంటికి చేరుకున్నాడు. పట్టరాని ఆనందంతో ఒగురుస్తూ సుశీలమ్మకు జరిగిందంతా పూసగ్రుచ్చినట్లు వివరించాడు. శ్రాద్ధవిధికి వంట సిద్ధం చెయ్యమన్నాడు. అవిడ కూడా చాలా సంబర పడింది. స్నానం చేసింది. తడిగుడ్డలతో తద్దినపు వంటలో మునిగిపోయింది. విష్ణుదత్తుడు స్నానం చేసి మిగతా సామాగ్రి అంతా సిద్ధం చేస్తున్నాడు. సరిగ్గా వంట అయ్యింది. దత్తస్వామి గుమ్మంలో ప్రత్యక్షమైనాడు. విష్ణుదత్తుడు భక్తి శ్రద్ధలతో ఎదురు వెళ్ళి అర్ఘ్యపాద్యాలిచ్చి లోపలికి తీసుకొచ్చాడు. మడి బట్టలు కట్టుకుని పీట మీద కూర్చున్నాడు. సుశీల అరిటాకులందించింది. సాధ్వీ! నా సహపంక్తికి మిగతా ఇద్దరూ ఏరి? నాలాటి వాళ్ళని ఎవరిని పిలిచారు? అని అంటూ కుశలం అడుగుతున్నట్లుగా ప్రశ్నించాడు. అప్పటికి గాని గుర్తురాలేదు, మిగతా ఇద్దరినీ పిలవలేదని. గాబరాపడకుండా, గంభీరంగా సమాధానం చెప్పింది, సుశీల. దేవదేవా నీతో సమానుడైన భోక్త ఉన్నాడు, వస్తున్నాడు అంటూ వంటింటిలోంచి పెరట్లోకి వచ్చింది. ఆకాశంలో నడినెత్తిన సూర్యుడు ధగధగలాడుతు కనిపించాడు. సుశీల సూర్యునికి నమస్కరించి సూర్యదేవా జగదేకబంధు, సర్వాత్మకా సర్వదీపాక్షి నమోనమః. రవి ప్రభూ! అచేతనమైన ఈ సమస్త విశ్వాన్ని నీ చేతులతో సచేతనం చేస్తున్నావు. సర్వదష్టపూ సర్వాత్మకుడవూ పరాత్పరుడవూ అయిన నిన్ను నీను ప్రత్యక్షంగా పిలివవలసింది ఏముంది? మాయాశక్తి సంపన్నుడైన నువ్వు ఈ వివిధ వికార భూతజాలంలోకి అంతరాత్మగా ప్రవేశించి అంతరాలోచనలకు బహిచ్చేష్టలకు ఏకైక సాక్షిగా వెలుగొందుచున్నావు..


Thursday, 4 May 2023

శ్రీదత్త పురాణము (128)

 


విష్ణుదత్తుడు నమ్మలేకపోయాడు. ఇంత అనాచారుడా తన స్వామి. అబ్బే ఈ రాక్షసుడు ఏదో ఆట పట్టించడానికి ఇలా అన్నాడు అని అనుకున్నాడు. ఇలా తనలో తాను తర్కించుకుంటూ వుండగానే ఆ ఉన్మత్తుడు అలా అలా దూరమై అదృశ్యమైనాడు. రాక్షసుడు తిరిగివస్తూనే ఏమి మందమతివయ్యా విష్ణుదత్తా నీకు ముందే చెప్పాను గదా స్వామి చిత్రవిచిత్ర రూపాల్లో తిరుగుతుంటాడని మరచి పోయినట్లున్నావ్. గుర్తించలేకపోయావు బంగారం లాంటి అవకాశాన్ని జారవిడుచుకున్నావు. పోనీలే చింతించకు. మరోసారి చూపిస్తాను అని వూరడించి వెళ్ళిపోయాడు.


మరొక రోజున మరింత హడావిడిగా వచ్చాడు రాక్షసుడు. విష్ణుదత్తా రా, రా మహాదేవుడు ఇక్కడే దగ్గర్లో సంచరిస్తున్నాడు అన్నాడు. విష్ణుదత్తుడు బయలు దేరాడు. అది స్మశానం. శ్మశానవాటికలో దుమ్ము కొట్టుకొని పోయివున్న ఒక మనిషి కనిపించాడు. అతడి చుట్టూ కుక్కలు గుమికూడి తిరుగుతూ వున్నాయి. అతడి చేతిలో కపాలం వుంది. కళ్ళు ఎర్రగా చింతనిప్పుల్లా వున్నాయి. ఎముకల్ని శరీరంనిండా ఆభరణాలుగా ధరించి వున్నాడు. స్వామికి ఇది మరొకరూపం కాబోలు అనుకొని విష్ణుదత్తుడు దగ్గరికి చేరబోయాడు. ఆ పెద్దమనిషి కస్సుమన్నాడు. అందుబాటులో వున్న పొడవాటి ఎముక ముక్కను తీసికొని విష్ణుదత్తున్ని కొట్టాడు. విష్ణుదత్తుడు భయపడిపోయాడు. కాళ్ళల్లో వణుకు బయలుదేరింది. కళ్ళు తిరిగాయి. పడిపోబోయి నిలద్రొక్కుకున్నాడు. బ్రతికుంటే బలుసాకు తినిబ్రతకొచ్చు అనుకొని వెనక్కి తిరిగి చూడకుండా పరుగు లంఘించాడు. దూరం నుండి రాక్షసుడు ఇదంతా చూస్తున్నాడు. రాక్షసుడు అయ్యో ఈ వెర్రి బాపడు ఈసారి అవకాశం కూడా పోగొట్టుకున్నాడే దైవం అనుకూలించకపోతే దైవ దర్శనం కాదు. విష్ణుదత్తుడు సిగ్గుపడుతూ ఇంటికి చేరుకున్నాడు.


ఇంకొక రోజున ఆ రాక్షసుడు విష్ణుదత్తుణ్ణి పిలచి నీకు దత్తస్వామిని మూడు మార్లు చూపిస్తాను అని చెప్పాను గదా ఇది చివరి ప్రయత్నం నాతో రా అని తీసికెళ్ళాడు. సుశీలమ్మ కూడా భర్తకు బాగా ధైర్యం నూరి పోసింది. ఏమైనా సరే ఈ సారి విజయం సాధించితీరాలి అని గట్టిగా చెప్పి పంపించింది. తాను దృఢంగా సంకల్పించుకున్నాడు. మూడో మారు కూడా భయపడి వెనుదిరిగితే ఈ సృష్టిలో నాకన్నా దౌర్భాగ్యుడు ఇంకొకడు వుండడు. ఏమైనా ధైర్యం చెయ్యవలసిందే. స్వామి రూపం ఎంతభయంకరంగా వుండనీ జుగుప్సాకరంగా వుండనీ, నన్ను తిట్టనీ, కొట్టనీ, ఈ మారు స్వామి పాదాలు వదలనుగాక వదలను అని ఆలోచించుకుంటూ రాక్షసుడి వెంటవెళ్ళాడు. గ్రామందాటారు. వెలివాడ చేరుకున్నారు. అల్లంత దూరాన ఒక వికృతాకారుడు కనిపించాడు. చచ్చిపోయిన గాడిద శరీరం నుండి మాంసం ముద్దలు పెకిలించి కాకులకూ, గ్రద్ధలకూ-కుక్కలకూ, నక్కలకూ-విందులు పంచుతున్నాడు. బ్రాహ్మణోత్తమా అతడే దత్తుడు. త్వరగా వెళ్ళు వెళ్ళి కాళ్ళ మీద బడు - అని మెల్లగా చెప్పి రాక్షసుడు చల్లగా జారుకున్నాడు. విష్ణుదత్తుడు సర్వశక్తులూ కూడ గట్టుకున్నాడు. ధైర్యం తెచ్చుకున్నాడు. గబగబా వెళ్ళి ఆ వికృతా కారుడి కాళ్ళమీద బడ్డాడు. రెండు పాదాలూ రెండు చేతులతో గట్టిగా పట్టుకున్నాడు కళ్ళు మూసుకొని. ఆయన ఎంత విదిలించినా వదలలేదు. మాంసం ముద్దలతో వీపు మీద ఎంత బాదినా పట్టు సడలించలేదు. తన శరీరంపై గాడిద మాంసం గుట్టలాగా పడింది. అయినా అసహ్యించుకోలేదు. అలా పాదాలు పట్టుకొని సాష్టాంగపడ్డవాడు పడ్డట్టే ఉన్నాడు.


Wednesday, 3 May 2023

శ్రీదత్త పురాణము (127)

 


వేదాంతశాస్త్రం - సదాచారం విష్ణుదత్తుడు-


సహ్యాద్రి సమీపంలో మాతాపురం అనే గ్రామ మున్నది. అది చాలా ప్రసిద్ధమైన నగరం. ఆ నగరంలో విష్ణు దత్తుడు అనే బ్రాహ్మణుడు వున్నాడు. అతడు వేద శాస్త్ర పారంగతుడు. మంచి వైష్ణవుడు. అతడి ధర్మపత్ని పేరు సుశీల పేరుకు తగ్గ పతివ్రత. వీళ్ళ ఇంటి ఆవరణలో ఒక రావిచెట్టు వుంది (ఆశ్వత్థ వృక్షం) దాని మీద ఒక భయంకర రాక్షసుడు నివాసముంటున్నాడు. విష్ణుదత్తుడు రోజూ నిత్యకర్మానుష్టానాలు అన్నీ పూర్తి చేసుకొని రోజూ భోజనం చేసే ముందు భూత బలిని (వైశ్వదేవం) ఇంటి ఆవరణలో గల రావిచెట్టు క్రింద సమర్పిస్తుండేవాడు. రోజూ విష్ణుదత్తుడు వేసే భూతబలిని చెట్టుపై ఉన్న రాక్షసుడు కాకి రూపంలో వచ్చి తింటూవుండేవాడు. రోజూ విష్ణుదత్తుడు వేసే భూతబలి తింటున్నందువల్ల ఆ బ్రహ్మ రాక్షసునిలో తమో గుణం నశించి సాత్విక చింతన బయలు దేరింది. ఒక రోజున ఆ రాక్షసుడికి ఒక మంచి బుద్ధి పుట్టింది. ఎంతో కాలంగా తిండి పెడుతున్నాడు గదా! ఇతడికి ఏదైనా ఉపకారం చెయ్యాలనే తలంపుతో విష్ణుదత్తుడి ఎదుట ప్రసన్న రూపంతో ప్రత్యక్షమయ్యి ఇలా అన్నాడు. విప్రవర్యావిష్ణుదత్తా! రోజూ నువ్వు పెడుతున్న అన్నం తింటున్నాను. సంతృప్తి చెందాను. నీకు ఏదైనా ప్రత్యుపకారం చేద్దామని అనిపించింది. ఏదైనా చెయ్యగల సమర్థుల్లే కనుక ఏం ఉపకారం చెయ్యమంటావో చెప్పు అన్నాడు. విష్ణుదత్తుడు ధర్మపత్ని సుశీలతో ఆలోచించి రాక్షసోత్తమా, చాలాకాలంగా మాకు తీరని కోరిక ఒకటి వుండిపోయింది. దత్త స్వామి ఈ పర్వత ప్రాంతంలోనే సంచరిస్తూ వుంటారని వినడమేగాని ఎప్పుడూ వారి దర్శనం కాలేదు. దయచేసి వారి నొక్కసారి చూపించు.


అప్పుడా రాక్షసుడు చాలా మంచికోరిక కోరావు, తప్పకుండా చూపిస్తాను. అయితే ఒక్క షరతు, దత్తస్వామిని అల్లంత దూరం నుండి నీకు మూడు మార్లు చూపించే ప్రయత్నం చేస్తా. ఆయన చిత్రవిచిత్ర రూపాల్లో సంచరిస్తూ వుంటారు. గుర్తించ గలిగి పట్టుకోగలిగితే నీ అదృష్టం- ఈ షరతుకు విష్ణుదత్తుడు అంగీకరించాడు. అయితే సిద్ధంగా వుండు. స్వామివారు ఆ చుట్టు ప్రక్కలలో తిరుగుతున్నప్పుడు హఠాత్తుగా రాక్షసుడు ప్రత్యక్షమయ్యాడు. రా, రా అన్నాడు. పాపం విష్ణుదత్తుడు పడుతూ లేస్తూ వెళ్ళాడు. మద్యమాంసాలు విక్రయించే వీధిలో ఉన్మత్తవేషంలో ఒక వ్యక్తి కనిపించాడు. తాగిన మత్తులో దుమ్ముగొట్టుకొనిపోయి పిచ్చివాని రూపంలో వున్న ఆ వ్యక్తిని చూపించి అతడే దత్తస్వామి వెళ్ళి దర్శించు అని రాక్షసుడు వెళ్ళిపోయాడు. 

Tuesday, 2 May 2023

శ్రీదత్త పురాణము (126)

 


వేదశర్మ అపుకోలేని దుఃఖంతో భళ్ళుమన్నాడు. భిక్షువు పాదాల మీద పడ్డాడు. తన ఒక్కగానొక్క కొడుక్కి పట్టిన దురవస్థను చెప్పి వాడి దుఃఖాన్ని తొలగించమని అర్ధించాడు. భిక్షువు ప్రసన్నుడయ్యాడు. ఏడు మంత్రాలను బీజాక్షర సహితంగా ఉపదేశించాడు. నీ కొడుకుని ఏడుగురు బ్రహ్మరాక్షసులు పట్టి పీడిస్తున్నారు. రోజుకొక మంత్రాన్ని జపించి ఆ ఉదకాన్ని బిడ్డడి మీద జల్లు, ఒక్కొక్క రాక్షసుడూ వదిలిపోతాడు. ఒకేసారి ఏడుగురునీ వెళ్ళగొట్టడం ఏ మంత్రానికీ సాధ్యంకాదు. అదీగాక - ఒక మూఢుణ్నీ విద్వాంసుణ్ని చెయ్యాలంటే అన్ని శాస్త్రాలూ ఒకేసారి నేర్పుతామా? కొన్ని అవిద్యల్ని న్యాయశాస్త్రంతో, కొన్నింటిని మీమాంసాశాస్త్రంతో, సాంఖ్యంతో కొన్నింటిని పతంజలి యోగ విద్యతో కొన్నింటిని - ఇలా క్రమక్రమంగా అవిద్యావాసనలను పూర్తిగా తొలగించి చిత్త పరిశుద్ధి చేసి అప్పుడుగదా బ్రహ్మవిద్యను ఉపదేశించాలి. అలాగే ఈ బ్రహ్మరాక్షసుల్ని కూడా ఒక్కొక్కరుగానే వెళ్ళగొట్టాలి. ఆటుపైని నీ బిడ్డడు నీ అంతటి పండితుడూ కర్మతుడూ అవుతాడు. ఇక వెళ్ళు- అన్నాడు.


విప్రుడు పునఃపునః నమస్కరించి ఇంటి దారి పట్టాడు. ఇందాక గాడిద కళేబరం కనిపించినచోట ఇప్పుడు రక్తచందన వృక్షం కనిపించింది. తన చేతిలోని మాంసపుముద్ద రక్తచందన పుష్పమయ్యింది. భిక్షువు దత్తుడే అని ధృడమయిన నమ్మకం కలిగింది. ఇంటికి వచ్చాడు. నియమ నిష్టాగరిష్ఠుడై క్రమం తప్పకుండా రోజుకు ఒక మంత్రాన్ని తీవ్రంగా జపించాడు. మొదటి రోజున దుర్ధరుడు అనే రాక్షసుడు ఘోరంగా ఏడుస్తూ వెళ్ళిపోయాడు. ఆ రోజుతో బిడ్డడు ఏడవటం మానేశాడు. ఇలాగే ఆయా మంత్రాల తేజస్సులు తట్టుకోలేక మిగతా ఆరుగురు రాక్షసులు పరుగు పరుగున పలాయనం చిత్తగించారు. ఏడవరోజుకి సుశీలుడు తన సహజమైన రూపాన్నిపొంది రోగ విముక్తుడై హాయిగా సుఖంగా తల్లిదండ్రుల్లోకి వచ్చాడు. దేవేంద్రా విన్నావు గదా! ఇప్పుడేమంటావు. మంత్ర తంత్ర శాస్త్రాలను క్షుద్ర శాస్త్రాలంటావా! లేదా పరంపరగా ముక్తిసాధనాలు అవుతాయని ఒప్పుకుంటావా! బాగా ఆలోచించి చెప్పు, ఇప్పుడు నాలుగో నిదర్శనం కూడా చెబుతాను. అది కూడా శ్రద్ధగా విను అని బృహస్పతి ఇలా చెప్తున్నాడు.


Monday, 1 May 2023

శ్రీదత్త పురాణము (125)

 


మంత్ర తంత్ర శాస్త్రాలు


శచీపతి! మరొక ఉదాహరణ చెబుతాను. ఆలకించు. వెనుకటికి విశాలనగరంలో వేదశర్మ అనే ఒక పండితుండేవాడు. శాంతి (బహిరింద్రియ నిగ్రహం) దాంతి (అంతరింద్రియ నిగ్రహం) ఉన్నవాడు. అరిషడ్వర్గాలను జయించినవాడు. వేదధర్మాలను తు.చ. తప్పకుండా పాటించేవాడు. ఇతడికి ఒక కుమారుడు కలిగాడు. సుశీలుడు అని నామకరణం చేశాడు. ఆ బిడ్డడు పూర్వజన్మలో చేసుకున్న పాపకర్మలు ఏమోగానీ పుట్టినప్పటి నుంచీ ఏడుగురు బ్రహ్మరాక్షసులు అతణ్ణి ఆవరించారు. ఆ ఏడుగురు పరస్పరం కలహించుకుంటూ పరస్పరం వధించుకునే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తుంటే సుశీలుడు విలవిలలాడిపోతూ దారుణంగా రోదించేవాడు. ఒక్కొక్కసారి విపరీతంగా నవ్వేవాడు. గంతులు వేసేవాడు. నృత్యం చేసేవాడు. ఉన్నట్టుండి మూర్ఛపోయేవాడు. ఇతడి చేష్టలన్నీ వింతగానూ విపరీతంగానూ ఉండేవి. తినటం మొదలు పెడితే భక్ష్యాభక్ష్య వివేచన లేకుండా అమితంగా తినేవాడు. మానేస్తే ఘోరంగా పస్తులుండేవాడు. ఉన్నట్టుండి ఘోరంగా రోదించేవాడు. బాధ ఏమిటో నివారణోపాయం ఏమిటో ఏమీ తెలియక వేదశర్మ దంపతులు పడే ఆవేదనకు అంతు ఉండేదికాదు. దెయ్యాలో భూతాలో పట్టుకున్నాయని వాటిని వదిలించాలనీ ఆ పండితుడు చాలా ప్రయత్నాలు చేశాడు. హోమాలు చేశాడు. వ్రతాలు చేశాడు. నోములూ తీర్థయాత్రలూ అన్నీ అయ్యాయి. ఫలించలేదు. ఏదీ


ఒక రోజున వేదశర్మ వైశ్వదేవం ముగించుకుని అతిథి కోసం ఎదురుచూస్తున్నాడు. ఒకానొక బిక్షువు వచ్చాడు. దుమ్ముకొట్టుకుపోయినట్టు ఒళ్ళంతా బూడిద. మాసిపోయి పీలికలుగా వేలాడుతున్న గుడ్డలు. గుప్పుమని కొడుతున్న దుర్గంధం. ఈగలూ, మసములూ ముసురుతున్నాయి. అభ్యాగతః స్వయం విష్ణుం అన్నారు గదా అని ఆ బిక్షువుకి అర్ఘ్యపాద్యాదులిచ్చి ఆదరాతిశయంతో ఆతిధ్యం ఇచ్చి తాము కూడ ప్రసాదం స్వీకరించివచ్చి భిక్షువుకి వింజామర నిస్తూ కూర్చున్నాడు. ఎందుకో వేదశర్మ మనస్సులో ఈయన దత్తాత్రేయుడు కాదుకదా అనే ఆలోచన మెదిలింది. దత్తదేవుడు ఈ నగరంలోనే సంచరిస్తున్నాడనీ భిక్ష స్వీకరిస్తున్నాడని వింటున్నాను. ఈయనే దత్తదేవుడైతే అంతకన్నా కావలసింది ఏముంది? నా జన్మ తరించినట్టే అనుకున్నాడు. క్రమక్రమంగా ఆలోచన బలపడింది. దత్తాత్రేయుడే అని నిశ్చయం కలిగింది. అంతలోకి ఆ భిక్షువు నేనింక వెడతానంటూ బయలుదేరాడు. బయలు దేరడమేంటి రెండు అంగల్లో వీధిలో నిలిచాడు. వేదశర్మ అతడి వెంటబడ్డాడు. భిక్షువు-పొమ్మంటున్నా వినకుండా వెంబడించాడు. చేతికి అందిన కర్రతో రాయితో ఇటుకముక్కతో అదీ ఇదీ అని లేదు ఏది దొరికితే దానితో వేదశర్మను కొడుతున్నాడా భిక్షువు. అయినా ఇతడు వెంటబడుతూనే ఉన్నాడు. దెబ్బలు ఓర్చుకుంటున్నాడు. నెత్తురు కారుతున్నా లెక్కచేయడం లేదు. వెంట నడుస్తున్నాడు. కొంత దూరం వెళ్ళేసరికి అక్కడ చచ్చిపడి ఉన్న గాడిద కళేబరం కనిపించింది. దాని శరీరం నుంచి ఇంత మాంసం ముద్ద పెకిలించి ఆ భిక్షువు వేద శర్మదోసిట్లో పడేసి "ఇంద తిను" అన్నాడు. వేదశర్మ భద్రంగా ప్రసాదంలా ఆ ముద్దను అలాగే దోసిట పట్టుకొని అతడివెంట నడిచాడు. చేరువకు రానిచ్చి భిక్షువు కాలితో ఒక్క తాపు తన్నాడు. వేద శర్మ తట్టుకొని నిలబడ్డాడు. చకచకా పరుగులాంటి నడకతో భిక్షువు వెళ్ళి వెళ్ళి ఒక కొండ గుహలో దూరాడు. వేదశర్మ కూడా ప్రవేశించాడు. అక్కడ ఒక శిలావేదిక మీద కూర్చుని ఆ భిక్షువు - ఏమయ్యా నావెంట బడ్డావు? తిట్టినా వదలవు. కొట్టినా వదలవు. నాతో ఏమిటి పని? చూస్తున్నావుగా కంపుగొడుతున్న నా రూపాన్ని, నేనేమి చెయ్యగలనని? ఏమికోరి నా వెంట బడ్డావు? రూక్షంగా ప్రశ్నించాడు.