Sunday, 7 April 2024

శ్రీ గరుడ పురాణము (143)

 


కాలిబొటనవ్రేలు దిబ్బగా వుండేవాడు భాగ్యహీనుడు; వికృతంగా వుండేవాడు దుఃఖపీడితుడు. ఆ వేలు వంకరగా, చిన్నదిగా, విరిగినట్టు వుండేవాడు కష్టాలపాలవుతాడు.


కాలిచూపుడు వేలు బొటన వ్రేలికన్నా పెద్దది కలవానికి స్త్రీ సుఖం ఎక్కువగా ప్రాప్తిస్తుంది. చిటికెన వేలు సామాన్యంగా కంటే పెద్దది గలవాడు బంగారాన్ని పొందుతాడు. గోళ్ళు పాడైపోయినట్లుగా కనబడేవానికి శీలముండదు, అలాగని కామభోగమూ అనుభవంలోకి రాదు.


తొడలపై రోమాలుంటే ధనం నిలువదు. తొడలు చిన్నవిగా వుంటే ఐశ్వర్యం పడుతుంది. కాని, బంధనాల్లో వుండిపోతుంది. లేడితో సమానమైన జంఘలున్నవాడు రాజ్యాన్ని సంపాదిస్తాడు. పొడవుగా దిబ్బగా వుండే తొడలున్నవాడు ఐశ్వర్యవంతుడవుతాడు. పులి లేదా సింహపు తొడలవాడు ధనికుడు కాగలడు. మోకాలు మాంసరహితంగా నున్న వానికి పరదేశ మరణం ప్రాప్తిస్తుంది. వికట జానువు దరిద్రహేతువు. మోకాళ్ళు కాస్త క్రిందికి వున్నవాడు ఏ ఆడదాన్నయినా గెలుచుకోగలడు. అక్కడ ఎక్కువ మాంసమున్నవాడు రాజవుతాడు. శ్రేష్ఠమైన పశు, పక్షి (సింహం, ఏనుగు, హంస) గమనము గలవాడు రాజుగాని గొప్ప ధనికుడు గాని కాగలడు.


కమలం రంగులో రక్తమున్నవాడు ధనవంతుడవుతాడు. ఎరుపు, నలుపు కలగలసిన రుధిర వర్ణమున్నవాడు అధముడు, పాపకర్ముడు కాగలడు. పగడపు రంగులో నుండి తేటగా మెరిసే రక్తము గలవాడు ఏడు ద్వీపాలకు అధిపతి కాగలడు. లేడి లేదా నెమలి పొట్ట ఉత్తమ పురుష లక్షణము. పులి, సింహము లేదా కప్ప (కడుపు వంటి) కడుపు రాజలక్షణము. పులి వంటి పీఠము సేనాపతి లక్షణము. సింహం పీఠం వలె పొడవుగా నుండే పీఠము గల వానికి బంధనాలెక్కువ. తాబేలు పీఠము సకలైశ్వర్య సంపన్న లక్షణము. విశాలంగా, ఎత్తుగా, పుష్టిగా రోమయుక్తమైయున్న వక్షఃస్థలము గల పురుషుడు శతాయువు, ధనవంతుడునై అన్ని భోగాలనూ అనుభవింపగల అదృష్టవంతుడు కాగలడు.


చేతిలో మీనరేఖ గలవాడు గొప్ప కార్యసాధకుడు, ధనవంతుడు, పుత్రవంతుడు కాగలడు. తుల, వేది చిహ్నమున్నవాడు వ్యాపారంలో లాభాన్నార్జించగలడు. చేతిలో సోమలతా చిహ్నమున్నవాడు ధనికుడై యజ్ఞం చేస్తాడు. పర్వత, వృక్ష చిహ్నాలున్న వాని వద్ద లక్ష్మి స్థిరంగా వుంటుంది. అనేక సేవకులకు స్వామి కాగలడు. శూలము, బరిసె, బాణము, తోమరము, ఖడ్గము లేదా ధనుస్సు వంటి చిహ్నమేదైనా అరచేతిలో గలవాడు యుద్ధ విజయుడు. ధ్వజం కాని శంఖంగాని వుండే సముద్ర, ఆకాశయానాలు చేసి వ్యాపారాల్లో బాగా గడిస్తాడు. శ్రీవత్స, కమల, వజ్ర, రథ లేదా కలశ చిహ్నమున్న పురుషుడు శత్రురహితుడైన రాజు కాగలడు. కుడిచేతి బొటన వ్రేలిలో యవధాన్యపు గుర్తున్నవాడు, అన్ని విద్యలలో ఆరితేరినవాడవుతాడు; ప్రవక్త కూడా కాగలడు. చిటికెన వేలిక్రింది నుండి చూపుడు వేలి మధ్యదాకా ఆగకుండా పయనించే రేఖగలవాడు వందేళ్ళ దాకా (ప్రస్తుతం కాలంలో) జీవిస్తాడు.


Saturday, 6 April 2024

శ్రీ గరుడ పురాణము (142)

 


చర, క్షిప్ర స్వభావాలున్న గ్రహాలు (అంటే బుధుడు, గురుడు) శాసించే వారాల్లో అంటే బుధ, గురు వారాల్లో యాత్రలు చేయాలి. శుక్ర, ఆది వారాల్లో గృహప్రవేశాది కార్యాలను చేపట్టాలి.


శని, మంగళవారాల్లో యుద్ధాలకు క్షత్రియవీరులు బయలుదేరవచ్చును.


రాజ్యాభిషేకాలకూ, అగ్ని కార్యాలకూ సోమవారం ప్రశస్తదినంగా పరిగణింప బడుతుంది. ఇల్లు కట్టడాన్ని, సున్నాలేయడాన్నీ కూడా ఈ రోజే మొదలెట్టవచ్చు.


గురువారంనాడు వేదపాఠాన్నీ, దేవపూజనీ, వస్త్రాలంకార ధారణనూ చేయవచ్చును. శుక్రవారం కన్యాదానానికీ, గజారోహణకీ, శనివారం గృహప్రవేశ, గజబంధనాలకీ మంచివి.


(అధ్యాయం - 62)


సాముద్రికశాస్త్రానుసారం స్త్రీ పురుషుల శుభాశుభ లక్షణాలు, మస్తక, హస్త రేఖలాధారంగా వ్యక్తుల ఆయుః పరిజ్ఞానం


మహేశా! ఇప్పుడు స్త్రీ పురుషుల అంగాలను బట్టి వారికుండే మంచి, చెడు బుద్ధులను సంక్షిప్తంగా వర్ణిస్తాను. 


అరికాళ్ళు, అరిచేతులు కోమలంగా, మాంసపుష్టితో, రక్తవర్ణంలో వుండి, పాదాలు, చేతులు ఎత్తుగా, చెమట పట్టకుండా, రక్తనాళాలూ, ముడులూ కనబడకుండా ఎవనికైతే వుంటాయో అతడు రాజవుతాడు. అరికాలిలో అంకుశ చిహ్నమున్న వాడు సుఖి. అందమైన మడమ, తాబేటి రూపమున్న పాదము, వెచ్చటి శరీరము, రక్తవర్ణంలో, ముక్కలు కాకుండా, నల్లగీతలు లేకుండా వుండే గోళ్ళు కూడా రాజలక్షణాలే. కాలివేళ్ళొకదానికొకటి తగులుతూ వుండడం ఐశ్వర్యం లక్షణం. అలా తగలకుండా విడివిడిగా నున్నవాడు, తెల్లగా పారల్లాటిగోళ్ళు, పాదంపై నరాలు, ముడులు కనిపించేవాడు దరిద్రుడు. నిప్పుల్లో కాల్చబడిన మట్టిరంగులో పాదాలున్న వాడు బ్రహ్మహత్య చేస్తాడు. పచ్చని పాదాలవాడు తిరుగుబోతు; నల్లనిపాదాల వారు తాగుబోతు; తెల్లని పాదాల వాడు తిండిపోతు.


Friday, 5 April 2024

శ్రీ గరుడ పురాణము (141)

 


సింహ లగ్నంలో పుట్టినామెకు పుత్రసంతానం అల్పం. కన్యాలగ్నంలో పుట్టిన కలికి రూపవతి; తులా లగ్నంలో పుట్టిన తెఱవ రూపవతీ, ఐశ్వర్యవంతురాలూ కూడా అవుతుంది. వృశ్చిక లగ్నంలో పుట్టిన వనితకి కర్కశ స్వభావముంటుంది. ధనుర్లగ్నంలోనైతే సౌభాగ్యవతీ, మకరలగ్నంలోనైతే తనకన్న తక్కువ స్థాయి పురుషుని పెండ్లి చేసుకొనేదీ అవుతుంది. కుంభలగ్నంలో పుట్టినామెకు మగ పిల్లలు తక్కువ. మీనలగ్నంలో పుట్టిన మీనాక్షి వైరాగ్యయుక్త అవుతుంది*. (* ఈ ఒక్క అంశాన్నే పట్టుకొని స్త్రీల విషయంలో ఒక నిర్ణయానికి వచ్చేయడం ప్రమాదం. ఇలాంటి అంశాలు కనీసం యాభై దాకా పరిశీలించి అప్పుడు ఆ స్త్రీ ఎలాంటిదో ఆలోచించాలి. కనీసం పది జ్యోతిశ్శాస్త్రగ్రంథాలైనా చదవకుండా జాతకాలు చెప్పెయ్యకూడదు.)


ఇక రాశుల చర, స్థిర భేదాలు చూద్దాం.


తుల, కర్కాటక, మేష, మకరాలు, చరరాశులు. ఈ రాశులున్నపుడు యాత్రకు వెళ్ళవచ్చు. సింహ, వృషభ, కుంభ, వృశ్చిక రాశులు స్థిరరాశులు. ఇవి ఉన్నపుడు స్థిరమైన కార్యాలు చేపట్టాలి.


కన్య, ధను, మీన, మిథునాలు ద్విస్వభావమున్న రాశులు. చర, స్థిర-రెండు స్వభావాలూ గల కార్యాలను, విద్వాంసులు, ఈ రాశులున్న కాలంలో చేపడతారు.


యాత్రలను చరలగ్నాలలోనూన, గృహప్రవేశాది స్థిరకార్యాలను స్థిరలగ్నాలలోనూ చేయాలి. దేవతాదుల స్థాపనా, వైవాహిక సంస్కారాలూ ద్విస్వభావ లగ్నాలలో జరగడం అన్ని విధాలా శ్రేయస్కరం.


పాడ్యమి, షష్టి, ఏకాదశీ తిథులు మూడింటినీ, నందాతిథులంటారు. అలాగే విదియ, సప్తమి, ద్వాదశిలను భద్రా తిథులనీ, తదియ, అష్టమి, త్రయోదశులను జయాతిథులనీ అంటారు. ఇకపోతే చవితి, నవమి, చతుర్దశి ఈ మూడిటినీ రిక్తాతిథులని వ్యవహరిస్తారు. రిక్తాతిథులలో ఎట్టి శుభకార్యమునూ చేయరాదు.


సౌమ్యస్వభావుడైన బుధుడు చర స్వభావం గల గ్రహం. గురుడు క్షిప్ర, శుక్రుడు మృదు, రవి ధ్రువ ప్రకృతులు గలవారు. శని దారుణ, మంగళుడు ఉగ్ర, చంద్రుడు సమ తత్త్వములు గలవారు.


Thursday, 4 April 2024

శ్రీ గరుడ పురాణము (140)

 


అశ్వని, రేవతి, చిత్ర, ధనిష్ఠ నక్షత్రాలు కొత్త సొమ్ములు పెట్టుకోవడానికి ప్రశస్తాలు. మృగశిర, అశ్వని, చిత్ర, పుష్య, మూల, హస్త నక్షత్రాలు కన్యాదానానికీ, యాత్రలకూ, ప్రతిష్ఠాది కార్యాలకూ శుభప్రదాలు.


జన్మలగ్నంలో శుక్రుడూ, చంద్రగ్రహమూ గల వారికి శుభఫలాల ప్రాప్తి ఎక్కువగా వుంటుంది. ఈ రెండు గ్రహాలూ రెండవ ఇంట నున్న వారికీ శుభాలే వుంటాయి. తృతీయ భావంలో (అంటే మూడోయింట) చంద్ర, బుధ, శుక్ర, బృహస్పతులూ, చతుర్ధ భావంలో మంగళ, శని, చంద్ర, సూర్య, బుధులూ శ్రేష్టతను ప్రసాదిస్తారు. అలాగే పంచమభావంలో శుక్ర, బృహస్పతి, చంద్ర, కేతువులూ, ఆరోయింట శని, సూర్య, మంగళులూ, సప్తమ భావంలో బృహస్పతి, చంద్రులూ, అష్టమభావంలో బుధ, శుక్రులూ కూడా శుభాలనే ఇస్తారు. అదేవిధంగా నవమ స్థానంలో బృహస్పతీ, దశమ భావంలో సూర్యశనులూ, చంద్రుడూ, ద్వాదశ స్థానంలో బుధ, శుక్రులూ సర్వ విధాల సుఖాలనూ సమకూరుస్తారు. ఇక ఏకాదశ స్థానంలో ఏ గ్రహమున్నా శుభాన్నే ప్రదానిస్తుంది.


సింహంతో మకరం, కన్యతో మేషం, తులతో మీనం, కుంభంతో కర్కాటకం, ధనుస్సుతో వృషభం, మిథునంతో వృశ్చికరాశి యోగిస్తే మంచిది. దీన్ని షడష్టక యోగమంటారు. ఇది ప్రీతికారకం*. (* ఒక్క గరుడ పురాణంలోనే షడష్టక యోగం మంచిదని చెప్పబడింది. వధూవరుల జాతకాలకు సంబంధించి మిగతా అన్ని శాస్త్ర గ్రంథాలలోనూ ఇది అశుభకారకంగానే పరిగణింపబడింది. వరుని లేదా వధువు యొక్క జన్మ రాశి ఒకరిది రెండవవారికి ఆరవదిగాని ఎనిమిదవది గాని అగుటనే షడష్టకయోగమంటారు.)


(అధ్యాయం - 61)


లగ్నఫలాలు, రాశుల చర-స్థిరాది భేదాలు గ్రహాల స్వభావాల, ఏడు వారాలలో చేయవలసిన యోగ్య ప్రశస్తకార్యాలు.


ఈశ్వరాదులారా! సూర్యుడు ఉదయకాలం నుండి మేషాది రాశులలో వుంటాడు. ఆయన దినంలో క్రమంగా ఆరురాశులను దాటుకొని పోయి రాత్రిలో కూడా ఆరురాశులను దాటి వస్తాడు.


మేషలగ్నంలో పుట్టిన ఆడది గొడ్రాలు అవుతుంది. వృషభలగ్నంలోనైతే కామిని, మిథున లగ్నంలో పుడితే సౌభాగ్యశాలినీ కర్కాటక లగ్నంలోనైతే *వేశ్యా అవుతుంది. (* వేశ్య అనేది ఇప్పటి అర్థంలో వాడబడిన మాట కాదు. సూతుడు శౌనకాది మహామునులకు చెప్తున్న కాలంలో అదొక వృత్తి; కొన్ని సందర్భాలలో అదొక గౌరవప్రదమైన వ్యవస్థ కూడానూ. ఇప్పుడీ విషయాన్ని పట్టించుకోనక్కర్లేదు.)


Wednesday, 3 April 2024

శ్రీ గరుడ పురాణము (139)

 


గ్రహాల శుభాశుభస్థానాలు తదనుసారంగా శుభాశుభ ఫలాల సంక్షిప్త వివేచన


మహేశాదులారా! ఒక జాతకుని యేడవ ఇంట్లో ఉపచయంలో వుండే చంద్రుడు మంగళకారి అవుతాడు. శుక్ల విదియనాడూ, పంచమ, నవమ గృహాల్లోవుండే చంద్రుడు ఆ జాతక చక్రమున్న వానిని గురువు వలె పూజ్యుని, గౌరవ్యుని చేస్తాడు.


చంద్రునికి పన్నెండు అవస్థలు అనగా దశలుంటాయి. నక్షత్రాలు మూడేసి ఒక బృందం లేదా మండలంగా వుంటాయి కదా. అశ్వనితో మొదలుపెట్టి మూడేసి నక్షత్రాల కలయికలతో చంద్రునికి ఈ అవస్థలేర్పడతాయి ప్రవాసావస్థ, దృష్టావస్థ, మృతావస్థ, జయావస్థ, హాస్యావస్థ, నతావస్థ, ప్రమోదావస్థ, విషాదావస్థ, భోగావస్థ, జ్వరావస్థ, కంపావస్థ, సుభావస్థ.


ఫలితాలు కూడా అదే క్రమంలో ఇలా వుంటాయి ప్రవాసం, హాని, మృత్యువు, జయం, హాసం, రతి, సుఖం, శోకం, భోగం, జ్వరం, కంపం, సుఖం.


జన్మలగ్నంలో చంద్రుడుంటే తుష్టి, అదే చంద్రుడు ద్వితీయ భావం (రెండింట) వుంటే సుఖ-హాని, మూడవ ఇంట వుంటే రాజ సన్మానం, చుతర భావంలో వుంటే కలహం, పంచమభావంలో వుంటే స్త్రీ లాభం కలుగుతాయి. ఆరవ ఇంట చంద్రుడుంటే ధన, ధాన్య ప్రాప్తి కలుగుతాయి. అష్టమభావంలో చంద్రుడు అరిష్టదాయకుడై ఆ జాతకునికి ప్రాణ సంకటాన్ని తెచ్చే అవకాశాలున్నాయి. నవమస్థానంలో వుంటే కోశంలో ధనంబాగా పెరుగు తుంది. దశమస్థానంలో కార్యసిద్ది, ఏకాదశ స్థానంలో ఘన విజయం కలిగించే చంద్రుడు ఎవరికైనా పన్నెండవ ఇంటవుంటే మాత్రం మృత్యువు చేతిలోనికి పంపించి వేస్తాడు.


ఇక ఈ క్రింది నక్షత్రాలున్న గడియల్లో ఈ క్రింద సూచింపబడిన దిక్కుల వైపే యాత్రలకు బయలుదేరాలి. మరోలా కూడదు.


కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ధ్ర, పునర్వసు, పుష్య, ఆశ్లేష - తూర్పు 

మఖ, పూర్వఫల్గుని, ఉత్తర ఫల్గుని, హస్త, చిత్ర, స్వాతి, విశాఖ - దక్షిణ

అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణ, ధనిష్ఠ - పశ్చిమ 

ధనిష్ఠ, శతభిష, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి, అశ్వని, భరణి - ఉత్తర  


Tuesday, 2 April 2024

శ్రీ గరుడ పురాణము (138)

 


యాత్రలో ఎడమవైపు నక్క, ఒంటె, గాడిద కనిపించడం మంగళప్రదమే. కాని పత్తి, మందులు, నూనె, రగులుతున్న, అగ్ని జుట్టు విరబోసుకున్న మనిషి, పామును పట్టుకున్న వాడు, నగ్నంగా నున్న పెద్దవారు కనిపించడం అశుభసూచకం; మంచిది కాదు.


తుమ్ములు కూడా అన్నీ చెడ్డవి కావు. తూర్పు వైపు తుమ్ము వినిపిస్తే మంచిది. పడమటి నుండి తుమ్ము వినిపిస్తే తీపి పదార్థాలు లభిస్తాయి. వాయవ్యం నుండి వినిపిస్తే ధనప్రాప్తి వుంటుంది. ఉత్తరం వైపు నుండి వినిపిస్తే కలహం వస్తుంది.


ఆగ్నేయం నుండి తుమ్ము వినిపిస్తే శోక, సంతాపాలు కలుగుతాయి. దక్షిణం వైపు నుండైతే హాని వస్తుంది. నైరృత్యం ఆగ్నేయం వలెనే ఈశాన్యం వైపు నుండి వినిపించే తుమ్ము అత్యంత ప్రమాదకరం; మరణసమానమైన కష్టాలు కలుగుతాయి.


సూర్యభగవానుని ప్రతిమను మనిషి ఆకారంలోనే చేయాలి. సూర్య ప్రతిమను తయారు చేసిన రోజున ఆయన ఏ నక్షత్రంలో వున్నాడో చూసుకొని దాని నుండి మూడు తారలను లెక్కగట్టి వాటిని ఆ ప్రతిమ యొక్క మస్తకంపై నిర్మించాలి. ఆ రోజు వున్న నక్షత్రాన్ని ముఖంపై అంకితం చేయాలి. దానికి తరువాత వచ్చే నక్షత్రాలను భుజాలపై స్థాపించాలి. వాటి తరువాత రెండింటిని ఇరుహస్తాలపై చిత్రించాలి. అనంతరం వచ్చే అయిదు నక్షత్రాలనూ ప్రతిమ హృదయంపై లిఖించి, తరువాతి దానిని నాభి మండలం లోనూ, ఆ తరువాత నక్షత్రాన్ని పిరుదుల మధ్యా లిఖించాలి. తరువాత రెండు తారలను మోకాళ్ళపైనా, మిగిలిన వాటిని సూర్యదేవుని చరణాలపైననూ లిఖించాలి.


ఇక సూర్య చక్రం వివరాలను వినండి. దాని చరణాలపై జాతకుని జన్మ నక్షత్రం పడితే వాడు అల్పాయుష్కుడౌతాడు. మోకాళ్ళపై పడితే విదేశయానం చేస్తాడు. గుహ్యస్థానం పై పడితే స్త్రీలతో నెక్కువగా సుఖించేవాడవుతాడు. నాభిస్థానంపై పడితే అల్పసంతోషి అవుతాడు. జన్మనక్షత్రం సూర్యదేవుని హృదయస్థానం పై పడ్డవాడు మహేశ్వరుని యంతవాడు కాగలడు. చేతులలోపడితే దొంగవుతాడు. భుజాలపై అయితే అస్థిరుడూ, కంధాలపైనైతే (కుబేరునంత) ధనికుడూ, ముఖంపైనేతే తీపి పదార్థాలు ప్రాప్తించేవాడూ కాగలరు. 


మహేశా! ఏ మనిషి జన్మనక్షత్రమైతే సూర్యుని మస్తకంపై నున్న నక్షత్రమవుతుందో అతడు నిత్యం పట్టు వస్త్రాలే ధరించు ప్రధాన వ్యక్తి కాగలడు. 


(అధ్యాయం -60)


Monday, 1 April 2024

శ్రీ గరుడ పురాణము (137)

 


చంద్రదశ ఐశ్వర్యాన్నిస్తుంది, సుఖాలను సృష్టించ ప్రసాదిస్తుంది, ఇష్టమైన, మనసుకి అనుకూలమైన అన్నాదులనిస్తుంది.


మంగళుని దశ దుఃఖాన్నే ఎక్కువగా ఇస్తుంది. రాజ్యాదులు నశిస్తాయి. బుధ మహాదశ చాలా మంచిది. ఈ దశలో దివ్యమై స్త్రీ లాభము, రాజ్యప్రాప్తి, కోశవృద్ధి వంటివి ఒనగూడు తాయి. శని మహాదశలో రాజ్యనాశం, బంధు బాంధవాదికష్టం జరుగుతాయి. (అంటే బంధువులకూ బాంధవులకూ కష్టాలొస్తాయని తాత్పర్యం) గురు మహాదశలో రాజ్యలాభం, సుఖసమృద్దీ కలుగుతాయి. ధర్మోద్దరణ బుద్ధి కలుగుతుంది. రాహుదశలో రాజ్యనాశనము, రోగములు పెరుగుట, దుఃఖాలూ సృష్టింపబడుట జరుగుతాయి. శుక్రమహాదశలో రాజ్య, గజ, అశ్వ, స్త్రీ లాభాలుంటాయి.


మంగళుని యొక్క క్షేత్రం మేష నక్షత్రం. అలాగే శుక్ర, బుధ, చంద్రగ్రహాలకు వృషభ, మిథున కర్కాటకాలు క్షేత్రాలు.


ఈ క్షేత్రాలపై వాటి ప్రభావం ఉంటుంది. బుధునికి కన్యారాశి కూడా క్షేత్రమే. సూర్య, శుక్రులకు సింహ తులారాశులు క్షేత్రాలు. మంగళునికి, వృశ్చిక రాశి కూడా క్షేత్రమే. బృహస్పతికి ధను, మీనాలు; శనికి మకర, కుంభాలు క్షేత్రాలు. సూర్యగ్రహం కర్కాటక రాశిలోకి వెళ్ళినపుడు విష్ణువు శయనిస్తాడు. అశ్వని, రేవతి, చిత్ర, ధనిష్ట, నక్షత్రాలు ఆభూషణ ధారణకు ఉత్తమములు. అంటే ఈ నక్షత్రాలున్న సమయాల్లో కొత్త నగలనూ, ఉంగరాలు మున్నగు వాటినీ ధరిస్తే మంచిది.


యాత్రలో కుడివైపున లేడి, సర్పము, కోతి, గండుపిల్లి, కుక్క, పంది, నీలకంఠ, పక్షి, ముంగిస కనిపిస్తే మంచిదే. ఆ వ్యక్తికి ఆ యాత్ర మంగళప్రదమవుతుంది. బ్రాహ్మణ కన్య ఎదురుగా వచ్చినా, శంఖ మృదంగ వాద్యాలు వినిపించినా, సదాచారి, శ్రీమంతుడు నగు వ్యక్తి కనిపించినా కూడా మంచిదే. వేణువు, మంచి స్త్రీ, నీటి కుండ ఎదురుగా రావడం శుభసూచకం.