Wednesday, 7 August 2024

శ్రీ గరుడ పురాణము (258)

 


నదిని నమ్ముకొని ఒక చోట వుండిపోవాలనుకోవడం తెలివైన పనికాదు. అది అతిగా నిండినా పూర్తిగా ఎండినా ముప్పు తప్పుడు. అలాగే గోళ్ళతో కొమ్ములతో వుండే జంతువులనూ ఆయుధాన్ని ధరించి తిరిగేవారినీ, రాజ పరివారాన్నీ విశ్వసించి ఉండిపోకూడదు.


నదీనాంచనఖీ నాంచ శృంగిణాం శస్త్రపాణి నాం ! 

విశ్వాసోనైవ కర్తవ్య స్త్రీ షు రాజకులేషు చ -- 

(ఆచర... 109/14)


*అర్ధనాశం మనస్తాపం గృహేదుశ్చరితానిచ

పంచనం చాపమానం చ మతిమాన్ న ప్రకాశయేత్


(ఆచార... 109/15)


ఈ ప్రపంచంలో దోషం లేని వంశం. రోగ పీడితులు కాని మనుషులు, దుఃఖితులు కాని వారు, అహంకారాన్ని గెలువగలిగిన ధనవంతులు, దుర్జనుల వల్ల దెబ్బతిననివారు ఉండరు.


*అవమానమును, ధన నష్టమును ప్రకాశము చేయరాదందరు అనే నీతిచంద్రిక సూక్తికి కూడ గరుడ పురాణమే మూలము (శ్లో 109/15)

ఎచ్చోటనైతే వ్యక్తికి గౌరవం లభించదో, ఆదరించేవారుండరో, బంధుబాంధవులు లేరో, విద్యా లాభ అవకాశమే వుండదో అచ్చోటును వీలైనంత వేగం వదలిపోవాలి.


ధనసంచయం చేసేవాడు దానినెంత వఱకు రక్షించగలడో కూడా ఆలోచించుకోవాలి. రాజులు, చోరులు దాని జోలికి రాకుండా కాపాడుకోగలగాలి. అప్పుడైనా ప్రాణాలను పణంగా పెట్టి కొండొకచో అన్యాయానికి ఒడిగట్టి సంపాదించిన సొమ్ము వానితో పరలోకానికి వెళ్ళదు కానీ తత్సంపాదనకై వాడుచేసిన పాపాలు వానిని నరకం దాకానూ మరుజన్మల లోనూ కూడా అనుసరిస్తాయి. కాబట్టి అధర్మం, లోభం పనికిరావు. సాధారణంగా ఇటువంటి అధార్మికులూ, లోభులే మరుజన్మలో కడుపారగ కూడుగానీ తలదాచగ గూడు కానీ చలినాపగవలువలుగానీ లేని దరిద్రులుగా, రోగులుగా జీవనాన్ని గడుపుతుంటారు. వీరంతా దానం, ధర్మం లేని ఒకనాటి శ్రీమంతులే. మనం ఇటువంటి వారు మనను యాచిస్తున్నపుడు మనకొక హెచ్చరిక చేస్తున్నారని అర్ధం చేసుకోవాలి. 'ఓయి మానవులారా, మీరు అన్యాయాలు చేసి, దానాలు చేయకుండా బతికేస్తే వచ్చే జన్మలో మాలాగే అడుక్కుతినాలి'


శిక్షాయంతి చయాచంతే దేహీతి కృపణా జనాః | 

అవస్థేయమదానస్యః మా భూదేవం భవానపి ॥


(ఆచార --- 109/25)


Tuesday, 6 August 2024

శ్రీ గరుడ పురాణము (257)

 


అధికారంలో వున్నవాడికైతే సాయపడడానికి ఆపరిచిత వ్యక్తులు కూడా అత్యుత్సాహంతో ముందుకు వస్తారు. చిటికెలో మిత్రులయి పోతారు. అదే వ్యక్తి పదవీచుత్యుడైతే, అసమర్థుడని తేలిపోతే పరిచయస్తులు కూడా పలకరించరు. స్వంతవారే శత్రువులా చూస్తారు. (తరువాత తెలుగులో వచ్చిన అధికారాంతమునందు చూడవలెరా ఆయయ్య సౌభాగ్యముల్ అనే సుభాషితానికి గరుడపురాణమే మూలం కావచ్చు.)


నిజమైన మిత్రుడెవరో ఆపదవచ్చినపుడే తెలుస్తుంది. అలాగే యుద్ధంలో వీరత్వమూ, ఏకాంతంలో శుచితా, వైభవం క్షీణించినపుడు పత్నీ, దుర్భిక్షంలో అతిథి ప్రియత్వం నిగ్గు తేలతాయి. అనగా వారి అసలు రంగులు బైట పడతాయి.


వృక్షం క్షీణఫలం త్యజంతి విహగాః 

శుష్కం సరః సారసా నిర్ద్రవ్యం 

పురుషంత్యజంతి గణికా భ్రష్టం నృపం మంత్రిణః । 

పుష్పం పర్యుషితం త్యజంతి మధుపాః

దగ్ధం వనాంతం మృగాః సర్వః కార్యవశా 

జ్జనోహరమతే కస్యాస్తి కో వల్లభః ॥


(ఆచార...109/9)


ఎవరికి యెవరు? చివరికి యెవరు? పళ్ళ కాపు ఆగిన చెట్టుని పిట్టలు వదిలిపోతాయి. సరస్సు ఎండిపోవడం మొదలవగానే అక్కడ వాలేని ఇక వాలవు. వేశ్యలు ధనాన్ని పిండేసిన తరువాత విటుని ఇక తమ గుమ్మం తొక్కనివ్వరు. వాడిన, మాడిన పూలపై తుమ్మెదలు వాలడం మానుకుంటాయి. కాలిన అడవిని జంతువులన్నీ త్యజిస్తాయి. ఇవన్నీ వేరే ఆశ్రయాలను వెతుక్కుంటూ పోతాయి. కాబట్టి మునులారా! ఈ వ్యావహారిక జగత్తులో ఎవరూ ఎవరికీ ఏమీ కారు.


లుబ్ధమర్ధ ప్రదానేన శ్లాఘ్యమంజలి కర్మణా। 

మూర్ఖం ఛందాను వృత్త్వా చ యాథాత థ్యేన పందితం ॥ 

సద్భావేన హి తుష్యంతి దేవాః సత్పురుషాః ద్విజాః। 

ఇతరేఖాధ్యపానేన మానదానేన పండితాః ॥


(ఆచార... 109/10,11)


లోభికి ఏదో రూపంలో ధనాన్నిస్తే తెగ ముచ్చటపడిపోతాడు. ఆ రకంగా వాడి మనసును గెలుచుకోవచ్చును. అలాగే అంజలించి ఉదారచిత్తులనూ, పొగడ్తలతో మూర్ఖులనూ, తాత్త్వికచర్చ ద్వారా విద్వాంసులనూ, మంచి మనసు చేత, ఉన్నతాలోచనల చేత దేవతలనూ సజ్జనులనూ ద్విజులనూ మన్చి చేసుకోవచ్చును. అన్నపానాలతో సామాన్యులనూ, మాన సమ్మానాలతో పండితులనూ ఆకట్టుకోగలము. 


Monday, 5 August 2024

శ్రీ గరుడ పురాణము (256)

 


వర్ణం కోసమొక వ్యక్తినీ, గ్రామం రక్షించబడవలసి వస్తే తప్పనిసరైతే ఒక కుటుంబాన్నీ, మహానగరాన్ని కాపాడవలసి వస్తే జనపదాన్నీ త్యాగం చేయవచ్చు. ఆత్మరక్షణ కోసమైతే గ్రామం, నగరం, దేశం, దేనినైనా పరిత్యజించవచ్చును.


త్యజేవేశం కులసార్టే గ్రామస్వార్థ కులం త్యజేత్ | 

గ్రామం జనపదస్యార్దే ఆత్మారే పృథివీం త్యజేత్ ||


(ఆచార - 109/2) 


దుష్టచరిత్రుని ఇంటిలో ఉన్డడం కన్నా నరకంలో నుండుటయే మేలు. ఎందుకంటే నరకం పాపాలను దగ్ధం చేస్తుంది.


బుద్దిమంతుడెప్పుడూ ఒక పాదాన్ని పూర్తిగా స్థిరంగా మోపిన తరువాతే రెండో కాలెత్తుతాడు. నేల విడిచి సాము చేయడు. అంటే ఒక చోటుని వదలిపోవునపుడు ఇంకొక దానిని సిద్ధం చేసుకొన్నాకనే కదలాలి.


దుష్టజనులచే పరివ్యాప్తమైన దేశాన్నీ, ఉపద్రవగ్రస్తమైన నివాసభూమినీ, మాయానియైన మిత్రునీ ఏ మాత్రం సంకోచించకుండా, ఆలస్యం చేయకుండా వదిలేయాలి.


పీనాసి వాడి చేతిలో పడిన ధనమూ, అత్యంత దుష్టుడూ, కోపిష్టి వద్ద నున్న జ్ఞానమూ, గుణంగానీ శౌర్యంగానీ లేనివానికి గల సౌందర్యమూ, ఆపద వేళలో మొగం చాటేసే మిత్రుడూ ఎందుకూ పనికిరారు.


Sunday, 4 August 2024

శ్రీ గరుడ పురాణము (255)

 


చెప్పిన పనిని అక్షరాలా మనసా చేసేవాడే సేవకుడు, మొలకెత్తే విత్తనమే విత్తనం, ప్రియంగా సంభాషించేదే భార్య, తండ్రినీ తల్లినీ, వృద్ధులైనా పూజించి పోషించేవాడే కొడుకు, గుణవంతునిగా ధర్మప్రవృత్తితో బతికేవాడి బతుకే నిజమైన బతుకు. ఇలా కాని వాళ్ళు బతకడం భూమికి బరువు.


సాభార్యా యా గృహేదక్షా సాభార్యా యా ప్రియం వదా ।

సాభార్యా యా పతి ప్రాణా సా భార్యా యా పతివ్రతా ॥ (ఆచార... 108/18)


ఇలాంటి పతివ్రతయు, పైగా సుందరి, మంగళప్రదకార్యాలు చేయునది, ధర్మపరాయణ, శృంగార సుఖం కోసం కాకుండా పుత్ర సంతానం కోసం మాత్రమే సంగమాన్ని కోరుకొనేది యగు భార్య లభించినవాడు దేవేంద్రుని వలె వెలుగొందుతాడు.


అలాకాకుండా ఎగుడుదిగుడు కన్నులది, పాపిని, కలహప్రియ, పరపురుషులపై ఆసక్తి కలదియైన భార్యకు దొరికిపోయినవాడు ఎన్ని వున్నా, అన్నీ వున్నా దరిద్రుడే. ఇలాంటి వాడు పెళ్ళయిన స్వల్పకాలంలోనే వృద్ధావస్థను చేరుకుంటాడు.


దుష్టపత్ని, దుష్టమిత్రుడు, పొగరుబోతుభృత్యులు గలవాడు సర్పమున్న గృహంలో నివసిస్తున్నట్లే లెక్క. వానికి సుఖం వుండదు. శాంతీ వుండదు.


దుష్టసాంగత్యాన్నొదిలేసి, మంచివారితో కలసిమెలసి తిరుగుతూ రాత్రింబవళ్ళు వీలైనంతవఱకు పుణ్యాన్నే సంపాదిస్తూ భగవంతుని నిత్యత్వాన్నీ మనయొక్క అనిత్యత్వాన్నీ తలుస్తూనే జీవించాలి.


వేశ్యాలంపటంలో పడరాదు. అల్పమైన చదువున్నవాడూ బలహీనుడూ మహాశక్తిశాలిగా రూపొందవచ్చు, పచ్చికృతఘ్నుడని ప్రజలంతా అనేవాడు కూడా మంచివాడై పోయి నమ్మదగిన వ్యక్తిగా పేరొందవచ్చు, అగ్ని చల్లగా కావచ్చు, మంచుని ముట్టుకుంటే వేడిగా తగలవచ్చు. కాని వేశ్యకు పురుషునిపై ప్రేమ రాదు.


సూతుడిలా కొనసాగించాడు. నీతిసారాన్ని మునులకీయసాగాడు. ధనాన్ని సంపాదించాలి కాని, దాన్ని తనకూ, స్త్రీలకూ, పిల్లలకూ ఆపదవచ్చినపుడు వాడుకోవడానికి చాలినంతవఱకే దాచుకోవాలి.


Saturday, 3 August 2024

శ్రీ గరుడ పురాణము (254)

 


కాలం బహుశక్తివంతం. దానిని గెలుచుట కష్టసాధ్యం. అది దురతిక్రమణీయం. అదే ప్రాణులను పరిపాలిస్తుంది, సంహరిస్తుంది, ప్రాణులు నిద్రిస్తున్నా అది నిద్రించదు. కాలమే మానవ జీవితంలోని అన్ని ఘట్టాలనూ నిర్ణయిస్తుంది.


ఋషులారా! బృహస్పతి బోధనలవల్లే ఇంద్రాది దేవతలు నీతిజ్ఞులు కూడ అయినారు. ఆయన ఇంకా ఇలా చెప్పాడు:


స్థితిమంతులంతా అశ్వమేధయాగం చెయ్యాలి. దేవుళ్ళను పూజించినంత భక్తిశ్రద్ధలతోనే బ్రాహ్మణులనూ రాజర్షులనూ పూజించాలి.


ఉత్తమైః సహసాంగత్యం పండితైః సహ సత్కథాం ।

అలుబైః సహమిత్రత్వం కుర్వాణో నావసీదతి ॥


(ఆచర ... 108/12)


ఉత్తమ ప్రకృతి గల మంచివారితో కలిసి తిరగడం, పండితులతో మాట్లాడుతూ వారికి సల్లాపంబునందుల్లాసంబు కలిగింపజేసి ఉత్తమ కథలను విశేషాలను వినడం, లోభులు కాని వారితో స్నేహం చేయడం వీటిని పాటించే బుద్ధిమంతుడు సుఖపడతాడు.


ఇతరులను నిందించుట, పరుల ధనాన్ని అపహరించుట, మగనాలితో సరసాలాడుట, తనది కాని ఇంటిలో నుందుట ఎన్నడూ చేయరాదు. మనకి మేలు చేసేవాడు పరుడైనా బంధువే; మనకి కీడు చేసేవాడు బంధువైనా పరుడే అని గ్రహించాలి.



ఎవరు మనను పోషిస్తారోవారే మాతాపితలు. శరీరం నుండి పుట్టినదే అయినా వ్యాధిని తగిలేయడానికే చూస్తాము కదా! ఎక్కడో అడవిలో పుట్టినదైనా మందుని మనలో కలుపుకుంటాము కదా!


పరోఽపి హితవాన్ బంధుర్బంధు రష్యహితః పరః |

అహితో దేహజో వ్యాధిర్హిత మారణ్య మౌషధం ॥

సబంధుర్వోహితే యుక్తః సపితా యస్తు పోషకః |

తన్మిత్రం యత్ర విశ్వాసః సదేశోయత్ర జీవ్యతే ॥


(ఆచార ... 108/14,15)


చూసేవాడే నేస్తం, మానింది మందు, బతికింది ఊరు అని పెద్దలంటారు కదా!

Friday, 2 August 2024

శ్రీ గరుడ పురాణము (253)

 


బృహస్పతి ప్రోక్త నీతిసారం


నైమిషారణ్యంలో శౌనకాచార్యుని జిజ్ఞాస మేరకు అర్థశాస్త్రంపై ఆధారపడిన నీతిసారాన్ని, ఒకప్పుడు ఇంద్రునికి బృహస్పతి ఉపదేశించిన దాన్ని, ఇలా బోధించసాగాడు సూతమహర్షి.


"శౌనకాది మహామునులారా! ఇది రాజులు - అనగా పరిపాలకులు, వ్యాపార సామ్రాజ్యాధినేతలు, వారి గురువులైన మునులు, బ్రాహ్మణులు ఇలా అందరూ తెలుసుకోవలసిన విషయము.


పురుషార్థ చతుష్టయాన్ని, అనగా ధర్మార్థ కామమోక్షాలను సిద్ధించుకోదలచుకున్న వాడు సజ్జనులతోనే చెలిమిచేయాలి. దుర్జన సాంగత్యంలోనే బతికేసేవాడు ఇహపరాలు రెండింటికీ చెడతాడు.


సద్భిఃసంగం ప్రకుర్వీత సిద్ధికామః సదానరః |

నాసద్భిరిహలోకాయ పరలోకాయ వాహితం ॥


(ఆచార ... 108/2)


క్షుద్రునితో సంభాషణా, దుష్టుని దర్శనమూ, శత్రు సేవకునిపై ప్రేమా, మిత్రునితో విరోధమూ, మూర్ఖునికుపదేశమూ, దుష్ట స్త్రీ నుండి సహాయ స్వీకరణమూ ప్రమాదకరములు, దుఃఖదాయకములు. కాలవైపరీత్యం వల్ల మిత్రునితో శత్రుత్వమూ, శత్రువుతో మిత్రత్వమూ నెఱపవలసి వచ్చినపుడు అది శాశ్వతంకాదని మనసులో గట్టిగా అనుకుంటూ జాగ్రత్తగా నిర్వహించాలి.


Thursday, 1 August 2024

శ్రీ గరుడ పురాణము (252)

 


కుక్కకాటుకి గురైనవాడు ఔషధసేవనం గావించి గాయత్రి మంత్రాన్ని జపిస్తే అశౌచం పోతుంది. స్వయంగా దాన్ని జపించే అర్హత లేనివారు బ్రాహ్మణునెవరినైనా ఆశ్రయించి ఆయన చేత ఈ జపాన్ని చేయించాలి. చండాలాదుల ద్వారా చంపబడిన బ్రాహ్మణుడు స్వయంగా అగ్నిహోత్రి అయితే ఆయనను లౌకికాగ్నితో దహనం చేయవచ్చును. ఆయన అస్థికలను సేకరించి మరల మంత్రపూర్వకంగా ఆయన యొక్క అగ్నిహోత్రశాల నుండి అగ్నిని తెచ్చి, అంతకు ముందే పాలతో శుద్ధి చేసిన ఆయన అస్థికలను అందులో దహనం చేయాలి. వ్యక్తి పరదేశంలో మరణిస్తే ఇక్కడి పరిజనులు తమ గృహాలలోనే కుశలతో ఆ వ్యక్తి శరీరాన్ని తయారుచేసి అగ్నికి ఆహుతిచేయాలి. ఆ పరదేశ మృతుడు అగ్నిహోత్రియైతే మృగచర్మంపై ఆరువందల పలాశ ఆకులను అతని ఆకారంలో పఱచి శిశ్నభాగంలో శమీ, వృషణభాగంలో అరణీ పెట్టి కుడిచేతి జాగాలో అన్నం కుండనీ ఎడమచేతి జాగాలో యజ్ఞియపాత్రనీ వుంచాలి. వక్షోభాగంలో సోమరసం తయారీలో వాడే రాతినుంచాలి. ముఖభాగంలో నేతిలో ముంచిన తిలలనూ, తండులాలనూ నేత్రాల వద్ద నేతికుండనూ ఉంచాలి. కనులు, చెవులు, ముక్కు, నోరు ప్రాంతాలలో చిన్న చిన్న బంగారు ముక్కలనుంచే పద్దతి కూడా వుంది. ఇలా అగ్నిహోత్రం యొక్క సమస్త ఉపకరణాలనూ వుంచి ఆ అగ్నిహోత్రి ఊహాకల్పిత కళేబరాన్ని 'అసౌస్వర్గాయ లోకాయ స్వాహా' అనే మంత్రాన్ని చదువుతూ నేతిని ఒక ఆహుతి నిచ్చి... అగ్నికి ఆహుతి చేస్తే ఆయనకు బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది.


హంస, చిలుక, క్రౌంచం, చక్రవాకం, కోడి, నెమలిలలో దేనిని వధించినా ఒక పగలూ ఒక రాత్రీ ఉపవాసం చేస్తే పాపం పోతుంది. నాలుగు కాళ్ళ పశువును (గోవును కాదు) దేనిని వధించినా ఒక రోజంతా నిలబడి, ఉపవసించి, గాయత్రిని జపిస్తే పాపశాంతి కలుగుతుంది.


శూద్రుని వధిస్తే కృచ్ఛవ్రతం చేయాలి. వైశ్యుని హత్య చేస్తే అతికృచ్ఛవ్రతము చేయాలి. క్షత్రియుని చంపితే ఇరవై రెండూ, బ్రాహ్మణుని మృతి నొందిస్తే ముప్పదీ చాంద్రాయణ వ్రతాలు చేయాలి".


(అధ్యాయం 107)