Friday, 20 September 2024

శ్రీ గరుడ పురాణము (294)

 


పాడ్యమి నుండి పంచమి దాకా వివిధ తిథి వ్రతాలు


వ్యాసమహర్షీ! ఇప్పుడు నేను ప్రతిపదాది తిథుల వ్రణాలను ఉపదేశిస్తాను. ప్రతిపదా అనగా పాడ్యమి తిథి నాడు చేయవలసిన ఒక విశేషవ్రతం పేరు శిఖి వ్రతం. ఈ ప్రతాన్నాదరించిన వారికి వైశ్వానరపదం సిద్ధిస్తుంది. పాడ్యమి నాడు ఏకభుక్తవ్రతం. అనగా పగటిపూట ఒకేమారు భోజనం చేసి వుండిపోవాలి. వ్రతం చివర్లో కపిల గోవును దానమివ్వాలి. చైత్రమాసారంభంలో విధిపూర్వకంగా గంధ, సుందరపుష్ప, మాలాదులతో బ్రహ్మను పూజించి హవనం చేసినవారు అభీష్ట ఫలప్రాప్తి నందగలరు. కార్తిక శుద్ధ అష్టమినాడు పూలను వాటి మాలలనూ దానం చేయాలి. ఇలా ఏడాదిపొడవునా చేసిన వారికి రూప సౌందర్యం లభిస్తుంది.


శ్రావణ కృష్ణ తదియనాడు లక్ష్మీ, శ్రీధర విష్ణుల మూర్తులను బాగా అలంకరించబడిన శయ్య పై స్థాపించి పూజించి రకరకాల పండ్లను నివేదించి ఆ శయ్యాదులను బ్రాహ్మణునికి దానం చేసి ఈ విధంగా ప్రార్ధించాలి. శ్రీధరాయనమః శ్రియైనమః. ఈ తదియనాడే ఉమామహేశ్వరులనూ, అగ్నినీ కూడా పూజించాలి. ఈ దేవతలందరికీ హవిష్యాన్నీ, తన కిష్టమైన పదార్థాలనూ, తెల్లకమలాల (దమనకాల) నూ నివేదించాలి.


ఫాల్గునాది తదియల వ్రతంలో వ్రతి ఉప్పు తినరాదు. వ్రతాంతమున బ్రాహ్మణుని ఆయన పత్నితో సహా పూజించి అన్న, శయ్యా, పాత్రాది ఉపస్కరయుక్తమైన ఇంటిని దానం చేసి భవానీ ప్రియతాం అనాలి. ఇలా చేసిన వారికి దేహాంతం లో భవానీలోకం ప్రాప్తిస్తుంది. ఈ లోకంలో కూడా సర్వసుఖాలూ లభిస్తాయి.


మార్గశిర తదియనుండి క్రమంగా తిథి నాటి కొకరుగా గౌరి, కాళి, ఉమ, భద్ర, దుర్గ, కాంతి, సరస్వతి, మంగళ, వైష్ణవి, లక్ష్మి, శివా, నారాయణి దేవీ స్వరూపాలను పూజించాలి. దీనివల్ల ప్రియజన వియోగాది కష్టాలు కలగకుండా వుంటాయి.

Thursday, 19 September 2024

శ్రీ గరుడ పురాణము (293)

 


వ్రత పరిభాష, నియమాదులకు సంబంధించిన జ్ఞానం


వ్యాసమునీంద్రా! నారాయణ సంప్రీతికరములైన కొన్ని వ్రతాలను పదేశిస్తాను. శాస్త్రములలో వర్ణింపబడిన నియమములను తప్పకుండా పాటించడమే. వ్రతం. అదే తపస్సు కూడానూ, కొన్ని సామాన్య నియమాలిలా వుంటాయి.


నిత్యం త్రిసంధ్యలలో స్నానం. భూమిపై శయనం. పవిత్రంగా వుంటూ రోజూ హవనం చేయడం.


పతిత జన సాంగత్యాన్ని వర్ణించడం. వ్రతం కోసం కాంస్యపాత్ర, ఉడద (చిక్కుడు) ధాన్యం, పెసరవంటి పప్పు, ధాన్యాలు, ఉల్లి, ఇతరులు పెట్టే అన్నం, కూరలు, మధుసేవనం (అనగా తేనె వంటి రుచులు, భోగాలు, మద్యపానం ఎప్పుడూ పాపమే) వీటన్నిటినీ విసర్జించాలి. పువ్వులు, ఇతర అలంకారాలు, కొత్తబట్టలు, ధూపగంధలేపనాది సరదాలు, అంజన ప్రయోగం - వ్రతకాలంలో వదిలెయ్యాలి. ఒక మారు కంటే నెక్కువగా నీరు, ఇతరపానీయాలు (కాఫీ, టీలాంటివి ఇప్పుడు) తాంబూలం, పగటినిద్ర, భార్యతోనైనా మైథునం, వీటిలో నేది చేసినా ప్రతిభంగమే అవుతుంది. పంచగవ్యాలను త్రాగవచ్చు.


క్షమ, సత్యం, దయ, దానం, శౌచం, ఇంద్రియనిగ్రహం, దేవపూజ, అగ్నిలో హవనం, సంతోషం, నీతి (పురాణంలో అచౌర్యమని వుంది) ఈ పదీ అన్ని వ్రతాలకూ సర్వసామాన్య ధర్మాలు.


క్షమా సత్యం వయాదానం శౌచమింద్రియనిగ్రహః ।

దేవ పూజాగ్ని పావనే సంతోషోఽస్తేయమేవచ ।

సర్వ ప్రతేష్వయం ధర్మః సామాన్యోదశథా స్మృతం |

(అధ్యాయం .. 128/8,9)


ఇరవై నాలుగు గంటలలో ఒకేమారు చీకటిపడి నక్షత్ర దర్శనం జరుగుతుండగా భోజనం చేయడమే నక్తవ్రతమవుతుంది. రాత్రెప్పుడో భోంచేయడం కాదు. పంచగవ్యప్రాశ్నకి కూడా హద్దులూ, మంత్రాలూ వున్నాయి.


గోమూత్రం   గాయత్రి  ఒక్పలం

గోమయం   గంధద్వార  అర్ధాంగుష్ఠ

ఆవుపాలు  ఆప్యాయస్వ    ఏడు పలంలు 

ఆవు పేరుగు  దధి   మూడు పలంలు

ఆవునెయ్యి  తేజోఽసి   ఒకపలం


దేవస్య.... అనే మంత్రంతో కుశదర్భలు కడిగిన మంత్రజలంతో పంచగవ్యాలను శుద్ధి చేయాలి. ఒక పలం ఆ జలాన్ని ఆయా మంత్రాలను చదువుతూ ఆయా ద్రవ్యాల బరువును తూచి పెట్టుకొని సేవించాలి.


ఆగ్న్యాధానం, ప్రతిష్ఠ యజ్ఞం, దానం, వ్రతం, వేదవ్రతం, వృషోత్సర్గం, చూడాకరణం, ఉపనయనం, వివాహాది మంగళకరకృత్యాలు, రాజ్యాభిషేకాది అధికార కర్మలు మలమాసంలో చేయరాదు.


అమావాస్యనుండి అమావాస్య దాకా జరిగే కాలాన్ని చాంద్రమానమంటారు. సూర్యోదయం నుండి మరుసటి సూర్యోదయం దాకా వుండే కాలాన్ని ఒక దినం (ప్రస్తుత భాషలో రోజు) అంటారు. ఇలాటి ముప్పదిరోజులొక మాసం. ఒక రాశి నుండి మరొకరాశి లోకి సూర్యుని సంక్రమణకాలాన్ని సౌరకుటుంబం అంటారు. నక్షత్రాలు ఇరవైయేడు. వాటివల్ల లెక్కగట్టే మాసం నక్షత్రమాసం, వివాహకార్యానికి సౌరమాసాన్నీ, యజ్ఞాదులకు మాసాన్నీ (సావనమానం) గ్రహించాలి.


యుగ్మతిథులనగా రెండు తిథులో కేరోజు పడదం. వీటిలో విదియతో తదియ, చవితితో పంచమి, షష్ఠితో సప్తమి, అష్టమితో నవమి, ఏకాదశితో ద్వాదశి, చతుర్దశితో పున్నమి, పాడ్యమితో అమావాస్య యోగించిన రోజులు గొప్పఫలదాయకాలవుతాయి. ఇతర యుగ్మాలు మహాఘోర కాలాలు, వాటికి మన పూర్వజన్మపుణ్యాన్ని కూడా హరించేటంత దుష్టశక్తి వుంటుంది. 


వ్రత ప్రారంభానంతరం స్త్రీలకు రజోదర్శనమైనా వ్రతనష్టం జరగదు. వారు దాన, పూజాది కార్యాలను ఇతరులచేత చేయించాలి. స్నాన- ఉపవాసాదిక కాయిక కార్యాలను స్వయంగా చేస్తే చాలు.


క్రోధ, ప్రమాద, లోభాల వల్ల వ్రత భంగమైనవారు మూడు రోజులుపవసించి శిరోముండనం చేయించుకొని వ్రతాన్ని పూర్తి చేయవచ్చు. శరీరం సహకరించక మధ్యలోనే వ్రతాన్ని ఆపవలసి వచ్చినవారు పుత్రాదులచే దానిని పూర్తి చేయించవచ్చును. వ్రతం చేస్తూ ప్రతి మూర్ఛపోయినంత మాత్రమున వ్రత భంగమైపోదు. జలాది పరిచర్యలచే మేలుకొని, తేరుకొని మరల కొనసాగించవచ్చును.


(అధ్యాయం -128)

Wednesday, 18 September 2024

శ్రీ గరుడ పురాణము (292)

 


భీమా - ఏకాదశి (భీమైకాదశి)


(సంస్కృత వ్యాకరణం ప్రకారం 'భీమైకాదశి' అనాలి)


ప్రాచీనకాలంలో పాండు పుత్రుడైన భీమసేనుడు మాఘశుద్ధ హస్తనక్షత్ర యుక్త ఏకాదశినాడు ఈ పరమ పుణ్యప్రద వ్రతాన్ని చేసి పితృణ మిముక్తుడైనాడు. ఆ మరుసటి రోజును ఆనాటినుండి భీమద్వాదశిగా వ్యవహరిస్తున్నారు. బ్రహ్మహత్యాది మహాపాతకాలు కూడా ఆ రోజు శాస్త్రోక్తంగా వ్రతం చేస్తే నశిస్తాయి.


బ్రహ్మ హత్య, సురాపానం, స్వర్ణచౌర్యం, గురుపత్నీగమనం -ఈ పాపాలు మహాపాతకాలని ధర్మశాస్త్రాలు వక్కాణిస్తున్నాయి. వీటిలో ఏ ఒక్కదాన్నయినా చేసినవాడు త్రిపుష్కర తీర్థాలలో మునిగినా శుద్ధుడు కాడు, పవిత్రుడు కాలేడు. ఈ వ్రతం మహాపాతకుని కూడా శుద్ధునీ, పవిత్రునీ చేయగలదు. నైమిష, కురు, ప్రభాసక్షేత్రాలూ, కాళింది(యమున) గంగ మున్నగు తీర్థాలూ ఎట్టి పాపాన్నయినా కడిగివేయగలవు గానీ మహాపాపములను నశింప జేయలేవు. దానాలూ, జపాలూ, హోమాలూ, పూజలూ కూడా అంతే. పృథ్వినే దానం చేయగా వచ్చేపుణ్యాన్ని త్రాసులో ఒకవైపూ, ఈ పవిత్ర భీమైకాదశి ద్వారా హరిని పూజింపగా వచ్చిన పుణ్యాన్నొక వైపూ వేసి తూస్తే ఏకాదశిపుణ్యమే ఎక్కువ శక్తిమంతమని తేలిపోతుంది.


వ్రత విధానమేమనగా ముందుగా వరాహ దేవుని స్వర్ణ ప్రతిమను తయారుచేయించి దానిని నూతన తామ్రపత్రంలో కలశపై స్థాపించాలి. తరువాత బ్రాహ్మణులచే సమస్త విశ్వమునకే బీజభూతుడైన విష్ణుదేవుని రూపమైన ఆ వరాహ ప్రతిమను తెల్లని పట్టుబట్టలచే కప్పించి స్వర్ణ నిర్మిత దీపాదులచే ప్రయత్నపూర్వకంగా పూజచేయించాలి.


ఓం వరాహాయనమః       - చరణ కమలాలు

ఓం క్రోడాకృతయేనమః     - కటిప్రదేశం

ఓం గంభీర ఘోషాయనమః  - నాభి

ఓం శ్రీ వత్సధారిణే నమః   - వక్షఃస్థలం

ఓం సహస్ర శిరసే నమః    - భుజాలు

ఓం సర్వేశ్వరాయనమః     - గ్రీవము

ఓం సర్వాత్మనే నమః       - నోరు

ఓం ప్రభవాయ నమః      - లలాటము

ఓం శతమయూఖాయనమః  - కేశరాశి 


పైన చెప్పబడిన మంత్రాలను జపిస్తూ స్వయంగా వ్రతియే వాటికెదురుగా చెప్పబడిన, మహావిష్ణువు యొక్క శరీరభాగాలను పూజించాలి. తదనంతరం రాత్రి జాగారం చేసి హరికథా శ్రవణం చేయాలి. అదీ విష్ణు పురాణమైతే ప్రశస్తం. మరుసటి దినం స్నానాదికాలనూ నిత్యపూజను ముగించి నిన్న పూజలందిన స్వర్ణమయ వరాహమూర్తిని పూజాసక్తుడైన బ్రాహ్మణునికి దానమిచ్చి పారణ వేయాలి.


ఈ విధంగా ఈ వ్రతాన్ని చేసిన వానికిక పునర్జన్మ వుండదు. పితృ, గురు, దేవ ఋణాలూ తీరిపోతాయి. ఈ లోకంలో వున్నంతకాలం అన్ని కోరికలూ తీరి సుఖశాంతులతో జీవిస్తాడు. "ఈ వ్రతమే అన్ని వ్రతాలకు ఆది" అని పెద్దలంటారు. (అధ్యాయం -127)

Tuesday, 17 September 2024

శ్రీ గరుడ పురాణము (291)

 


విష్ణుమండల పూజావిధి


“భుక్తి ముక్తిప్రదాయకం, పరమగతి ప్రాప్తిదం ఐన మరొక శ్రేష్ఠ పూజను విధి విధానయుక్తంగా వర్ణిస్తాను వినండి" అంటూ బ్రహ్మదేవుడు విష్ణుమండల పూజను వర్ణించసాగాడు.


ప్రతి ముందొక సామాన్య పూజామండలాన్నే నిర్మించి దాని ద్వారం దగ్గర పూజను మొదలుపెట్టాలి. ద్వారప్రదేశంలోనే ముందుగా ధాత, విధాత, గంగా యమునలనూ తరువాత శ్రీ, దండ, ప్రచండ, వాస్తు పురుషులనూ పూజించాలి.


తరువాత మండల మధ్యభాగంలో ఆధారశక్తి కూర్మదేవ, అనంతులను పూజించాలి.


పిమ్మట పృథ్వి, ధర్మ, జ్ఞాన, వైరాగ్య, ఐశ్వర్య, అధర్మ, అజ్ఞాన, అవైరాగ్య, అనైశ్వర్యాలను కంద, నాళ, పద్మ, కర్ణిక, కేసరాది భాగాలపై పూజించి, సత్త్వ రజస్తమో గుణాలను కూడా పూజించాలి. తరువాత యథావిహిత స్థానాల్లో సూర్యాదిగ్రహాలనూ, విమలాది శక్తులనూ అర్చించాలి.


తరువాత మండల కోణ భాగాలలో దుర్గ, గణేశ, సరస్వతి, క్షేత్ర పాలుడగు స్వామిలను పూజించాలి. అప్పుడు వాసుదేవుని ఆసనాన్నీ దానిపై వుంచిన మూర్తులనూ పూజించి వాసుదేవ, బలభద్రుల స్మరణను కొంతసేపు గావించి ఆపై అనిరుద్ధునీ, నారాయణునీ పూజించాలి. అప్పుడు నారాయణుని సంపూర్ణ పూజను - అనగా హృదయాది సర్వాంగములనూ, శంఖ చక్రగదాది ఆయుధాలనూ అర్చించాలి. అనంతరం శ్రీ, పుష్టి, గరుడ, గురు, పరమగురువులనూ, ఇంద్రాది అష్టదిక్పాలకులనూ (వారి వారి దిశలలోనే) పూజించి మండల పైభాగంలో బ్రహ్మనీ, క్రింది భాగంలో నాగదేవతనీ పూజించాలి. ఆగమశాస్త్రంలో చెప్పబడిన విధంగా చోటును చూసి ఈశానకోణంలో విష్వక్సేనుని పూజించడంతో మంగళకరమైన మండలపూజ సంపూర్ణమవుతుంది.


ఈ విధంగా విష్ణుమండలపూజను గావించినవారు మహాత్ములవుతారు. వారికి పునర్జన్మ వుండదు.


(ఇందులో పేర్కొనబడిన దేవతలందరినీ మంత్ర సహితంగా ఎలా పూజించాలో ఈ పురాణంలోనే అధ్యాయాలలో చెప్పబడింది) (అధ్యాయం -126)

Monday, 16 September 2024

శ్రీ గరుడ పురాణము (290)

 


ఏకాదశీ* మహాత్మ్యం

* ఈ పురాణంలో వైష్ణవంలోని ఏకాదశిని మాత్రమే చర్చించడం జరిగింది.


ఒకప్పుడు మాంధాతయని ఒక రాజుండేవాడు. ఆయన ఈ వ్రతాన్ని చేసి చక్రవర్తి, సమ్రాట్ అనిపించుకొనే స్థాయికి ఎదిగాడు. ఈ వ్రతపుణ్యం అంత గొప్పది. ఈ వ్రతంలో ప్రథమ నియమం కృష్ణ, శుద్ధ రెండు ఏకాదశులలోనూ జీవితాంతమూ భోజనం చేయకుండా వుండుట.


కౌరవ సమ్రాజ్ఞి గాంధారి దశమీ విద్ద ఏకాదశినాడు ఈ వ్రతాన్ని చేసింది. ఆ దోషం వల్ల ఆమె పుత్రులామె జీవితకాలంలోనే నశించారు. కాబట్టి దశమితో యుక్తమైన ఏకాదశినాడు వ్రతం చేయరాదు.


ద్వాదశితో కలిసిన ఏకాదశినాడు శ్రీ హరి వ్రతుల వద్దకు వచ్చి వుంటాడు. దశమితో కలిసిన ఏకాదశినాడు రాక్షసులు వచ్చి వుంటారు. తిథి విషయంలో సందేహాలున్నవారు ద్వాదశినాడు కూడా ఉపవసించి త్రయోదశినాడు పారణం చేయడం మంచిది.


ఒకరోజులో ఏకాదశి ఏకకళ మాత్రమే వుంటే ద్వాదశినాడీ వ్రతాన్ని చేయాలి. (తగులు, మిగులు అనే మాటలు తెలుగు కుటుంబాలలో వాడుకలో వున్నాయి. తగులు మరీ తక్కువగా వుంటే మిగులులో చేయవచ్చని అర్థం) ఒకే రోజులో దశమి, ఏకాదశి, త్రయోదశి తిథులు వస్తే ఆ రోజు తప్పనిసరిగా వ్రతం చేయాలి. అది పరమమంగళకరమైన రోజు; సర్వపాపవినాశకరమైన రోజు.


రాత్రి జాగరణ, పురాణ శ్రవణం, గదాధర విష్ణుదేవుని పూజ ఈ మూడిన్టినీ కృష్ణ శుద్ద ఏకాదశులలో, ఉపవాసంతో సహా జీవితాంతమూ చేసిన రుక్మాంగద మహారాజుకి మోక్షం లభించింది. కాబట్టి ఈ వ్రతాన్ని ఎవరుచేసినా సుఖజీవనం, మోక్షప్రాప్తి కలుగుతాయి.


(అధ్యాయం -125)

Sunday, 15 September 2024

శ్రీ గరుడ పురాణము (289)

 


శివరాత్రి వ్రతకథ విధానం


ఒకప్పుడీ వ్రతాన్ని శంకరభగవానుడు గౌరీదేవికుపదేశించాడు.


మాఘ, ఫాల్గున మాసాల మధ్యలో వచ్చే కృష్ణ చతుర్దశినాడు ఉపవాస, జాగరణాలు చేసి శివుని పూజించిన వారికాయన 'ఇక్కడ' భుక్తినీ 'అక్కడ' ముక్తినీ ప్రసాదిస్తాడు.


చాలాకాలం క్రిందట అర్బుద దేశంలో సుందరసేనుడను ఒక పాపాత్ముడైన నిషాద రాజుండేవాడు. అతడొకనాడు కుక్కలను వెంటబెట్టుకుని వేటకై ఒక అడవికి వెళ్ళాడు. దైవవశాన అతడికి ఏ జంతువూ దొరకలేదు. వెంట తెచ్చుకున్న ఆహారమూ, నీరూ నిండుకోవడంతో ఆకలి దప్పులతో అలమటిస్తూ వాటి కోసం కూడా తిరిగి దారి తప్పి రాత్రంతా నిద్రలేకుండా వెదకి చివరికి ఒక తటాకాన్ని చేరుకుని అక్కడే నిలచిపోయాడు. ఆకలి వల్ల నిద్రపట్టలేదు. అక్కడే ఒడ్డు మీద ఒక చెట్టు క్రింద అతనికి శివలింగం కనిపించింది. అతడు చెట్టుపైన రాత్రిని గడపడం కోసం ఎక్కగా అతడు కదిలినపుడల్లా ఆ చెట్టు ఆకులు శివలింగం మీద పడ్డాయి. అది బిల్వవృక్షం. అవి బిల్వపత్రాలు. అతడు త్రాగడానికి తెచ్చుకున్న నీళ్ళు శివలింగం మీద పడ్డాయి. పాత్ర నుండి పడిన నీటితో శివునికి అభిషేకం జరిగింది. అతని పొదిలోని బాణమొకటి జారి శివలింగం ప్రక్కన పడింది. అతడా బాణాన్ని తీసుకోవడానికి చేయి సాచినపుడా చేతికి శివలింగం తగిలింది.


* ఈ ప్రకారమా కొండరాజు ద్వారా రాత్రి జాగరణ, ఉపవాసము, బిల్వపత్రాలతో శివపూజ, లింగాభిషేకం అతనికి తెలియకుండానే జరిగిపోయాయి. అతనికి తెలియని విషయం మరొకటి కూడా ఉంది. ఆ రాత్రి శివరాత్రి తెల్లవారాక అతడు తన నిషాద రాజ్యానికి వెళ్ళిపోయాడు.


* శివలింగ సమీపంలో అతని బాణం పడిపోయినపుడతడు వంగి మోకాళ్ళపై కూర్చుని చేతిని ముందుకి చాచి దానినందుకున్నపుడతని చేయి శివలింగానికి తగిలింది కదా! తద్వారా అతనికి మోకాటిపూజ, శివస్పర్శన పుణ్యం కూడా కలిగాయి.


అతడు కొంతకాలానికి మరణించాడు. యమ దూతలాతని పాశబద్ధుని చేసి గొనిపోవుచుండగా శివదూతలడ్డుపడ్డారు. యమదూతలకు శివరాత్రి పుణ్యాన్ని వివరించి ఆ నిషాదుడు తన కుక్కలతో సహా నిష్పాపుడెలాగైనాడో బోధపరచి వానిని కైలాసానికి గొంపోయారు. ఈ విధంగా తెలియక చేసిన అసంకల్ప ప్రతికే ఇంత అదృష్టం పట్టినపుడు ఇక తెలిసి, సంకల్పించి మరీ శివరాత్రి వ్రతాన్ని చేసిన వారి సంగతి వేరే చెప్పాలా?


ఈ వ్రతానికి త్రయోదశినాడే దీక్షాగ్రహణం చేసి శివుని పూజించి ఇలా ప్రార్థించాలి.


ప్రాతర్దేవ చతుర్దశ్యాం జాగరిష్యా మ్యహం నిశి |

పూజాం దానం తపోహోమం కరిష్యామ్యాత్మక శక్తితః ||

చతుర్దశ్యాం నిరాహారో భూత్వా శంభు పరే హని ॥

భోక్ష్యేఽహం భుక్తి ముక్త్యర్థం శరణం మే భవేశ్వర ॥ (ఆచార 124/12,13)


మహాదేవునికి పంచామృతాలతో స్నానం చేయించి 'ఓం నమో నమశ్శివాయ' అనే మంత్రంతో పూజ చేయాలి. తదనంతరం పెరుగు, తిలతండులాలతో, వరి ధాన్యంతో నిర్మితమైన 'చరు' ని ఆహుతులుగా అగ్నిలో వ్రేల్చి పూర్ణాహుతినివ్వాలి. ప్రతి రాత్రి గీత వాద్యాలతో ఉత్సవాన్ని చేయించి హరి కథలను కూడా పెట్టించి తాను కథలను వినాలి. అర్ధరాత్రి, మూడోజాము, నాలుగోజాములు మొదలుకాగానే కాసేపు శివపూజ చేస్తూ మూలమంత్రాన్ని జపిస్తుండాలి. తెల్లవారగానే స్వామినీ విధంగా అర్థించాలి.


అవిఘ్నేనవ్రతం దేవత్వత్ప్ర సాదాన్మయార్చితం !

క్షమ స్వ జగతాం నాథ త్రైలో క్యాధి పతేహర ॥


యన్మయాద్యకృతం పుణ్యం యద్రుద్యస్య నివేదితం !

త్వత్ర సాదాన్మయాదేవ వ్రత మద్య సమాపితం ॥


ప్రసన్నో భవమే శ్రీమన్ గృహం ప్రతిచ గమ్యతాం |

త్వదాలోకన మాత్రేణ పవిత్రోస్మి న సంశయః ॥ (ఆచార.. 124/17-19)


తరువాత ధ్యాన నిష్ఠుడైన బ్రాహ్మణుని భోజనంతో తృప్తిపఱచి వస్త్ర, ఛత్రాదులతో, యథాశక్తి, ఆయనను పూజించి మరల పరమశివుని ఇలా వేడుకోవాలి.


దేవాదిదేవ భూతేశ లోకానుగ్రహ కారక ॥

యన్మయా శ్రద్ధయాదత్తం ప్రీయతాం తేన మే ప్రభుః॥॥ (ఆచార124/20,21)


ఇలా క్షమాపన స్తుతి చేయడంతో శివరాత్రి వ్రతమైపోతుంది. శివుడు సంప్రీతుడవుతాడు. సాధారణంగా ఈ వ్రతాంతంలోనే ద్వాదశ వార్షిక సంకల్పం చేస్తారు. ప్రతి ద్వాదశి నాడూ ఉపవాసజాగరణలతో సహా ఇలాగే ఏడాదిపాటు శివపూజను చేస్తారు. దీనివల్ల వ్రతికి సంపదలు, కీర్తి, పుత్రులు, అధికార ప్రాప్తి- ఇవన్నీ కలుగుతాయి. దేహాంతంలో శివలోకమూ ఒనగూడుతుంది. ఏడాది చివర పన్నెండుగురు బ్రాహ్మణులను భోజనం ద్వారా సంతృప్తి పఱచి దీపదానం చేసిన వారికి స్వర్గలోక ప్రాప్తి వుంటుంది. (అధ్యాయం -124)

Saturday, 14 September 2024

శ్రీ గరుడ పురాణము (288)

 

మాసోపవాసవ్రతం


ఇది సర్వోత్తమ వ్రతాలలో నొకటి. ఈ వ్రతాన్ని వానప్రస్థులు, సన్యాసులు, స్త్రీలు పాలన చేసారు. ఆశ్వయుజ శుద్ధ ఏకాదశినాడుపవాసం చేసి వ్రతారంభంలో విష్ణు భగవానునిలా ప్రార్థించాలి.


ఆద్యప్రభృత్యహం విష్ణో యావదుత్థానకం తవ| 

అర్చయే త్వామనశ్నంస్తు దినాని త్రింశదేవ తు ॥

కార్తికా శ్వినయోర్విష్ణో ద్వాదశ్యోః శుక్లయోరహం ! 

మ్రియే యద్యంతరాలే తువ్రతంభంగో సమేభవేత్ || (ఆచార.. 122/3,4)


స్వామీ! నీవు లేచేదాకా నేనేమి తినను. ఈ ఆశ్వయుజ కార్తీక శుద్ధ ద్వాదశులమధ్య నేను మరణిస్తే ఆవిధంగా వ్రతం చెడినా ఫలితం మాత్రం నాకు దక్కించు అని ఆయనను వేడుకొని మధ్యాహ్న, సాయంకాలాలలో స్నానం చేసి, హరిని, దేవాలయానికి పోయి సుగంధాదులతో పూజించాలి. ప్రతి మాత్రము తాను ఉబటన, సుగంధిత గంధాలే పాదులను పూసుకోరాదు.


ద్వాదశినాడు భగవానుడైన హరిని పూజించి బ్రాహ్మణులకు భోజనాలు పెట్టాలి. ఒక మాసం దాకా హరినే పూజిస్తూ మంచినీళ్ళే త్రాగుతూ అప్పుడు పారణ చేయాలి. మధ్యలో ప్రతి నీరసంతో మూర్ఛపోతే ఇతరులు ఆయన నోటిలో పాలుపోయవచ్చు. దీనివల్ల వ్రత భంగం కాదు. ఈ వ్రతం భక్తి, భుక్తి, ముక్తిదాయకం. (అధ్యాయం -122)


భీష్మపంచకవ్రతం


కార్తీకమాసమంతా ఏకభుక్తాలతో, నక్తవ్రతాలతో, అయాచిత వ్రతాలతో, కూర-పాలు- పండ్లు వీటిలో నొక ఆహారంతో ఉపవాసాలతో హరిపూజనం గావిస్తూ గడపాలి. అలా గడిపిన వారికి అన్ని పాపాలూ నశించి అన్ని కోరికలూ తీరి, హరిని కటవాస ప్రాప్తి కలుగుతుంది.


హరివ్రతమెప్పుడైనా శ్రేష్ఠమే కాని, సూర్యుడు దక్షిణాయనంలోనికి వెళ్ళినపుడు చేసే ఈ వ్రతాలు అధిక ప్రశస్తాలుగా పేర్కొనబడుతున్నాయి. ఈ కాలం తరువాత చాతుర్మాసాలూ, కార్తీకమాసం సముచితాలుగా చెప్పబడుతున్నాయి. సాధారణంగా కార్తిక శుద్ధ ఏకాదశి నాడీ వ్రతాన్ని మొదలు పెడతారు. ఈ రోజు త్రి సంధ్యలలో స్నానాలు చేసి యవాది పదార్థాలతో పితరులకు నిత్యపూజలను గావించి అప్పుడు హరిని పూజించాలి. ప్రతి మౌనంగా నెయ్యి, తేనె, చక్కెర, పంచగవ్యాలు, నీరులతో హరి మూర్తికి స్నానం చేయించి కర్పూరాది సుగంధ ద్రవ్యాలతో హరి శరీరానికి అనులేపనం చేయాలి.


సాధకుడు పున్నమి వరకూ ప్రతిరోజూ విష్ణుదేవునికి నేతి తోడి గుగ్గిల ధూపాన్నిచ్చి పక్వాన్నాలనూ మధురమైన మిఠాయిలనూ నైవేద్యంగా సమర్పించి ఓం నమోవాసుదేవాయ అనే మంత్రాన్ని నూటెనిమిది మార్లు జపించాలి. తరువాత ఇదే మంత్రాన్ని స్వాహాయుక్తంగా పఠిస్తూ బియ్యం, నువ్వులు, నెయ్యిలను కలిపి వాటితో (దానితో) ఆహుతులివ్వాలి.


ప్రతి తొలిరోజు కమల పుష్పాలతో శ్రీమన్నారాయణుని పాదాలనూ, మలిరోజు బిల్వపత్రాలతో జంఘలనూ, మూడవరోజు గంధంతో నాభినీ, తరువాతి దినాన బిల్వ పత్రాలతో జవాపుష్పాలతో స్కంధమునూ, చివరిరోజు మాలతీ పుష్పాలతో స్వామి శిరోభాగాన్నీ పూజించాలి. ఈ అయిదురోజులు పుడమిపైనే నిద్రించాలి. ఈ రోజుల్లో క్రమంగా గోమయం, గోమూత్రం, పెరుగు, పాలు, నెయ్యిలను మాత్రమే రాత్రి నోటిలో వేసుకోవాలి. పగలంతా ఏమీ తినరాదు. ఈ వ్రతం వల్ల ఇహంలో భోగం, పరంలో మోక్షం కూడాలభిస్తాయి. మాసంలోని రెండు పక్షాలలోనూ ఈ వ్రతాన్ని చేసిన వారికి ఏయే పాపాలుచేస్తే నరకానికి పోతామో ఆయా పాపాలన్నీ పూర్తిగా నశిస్తాయి. (దీన్ని భీష్మపంచకవ్రతమని ఎందుకన్నారో తెలియరాలేదు. శోధించాలి)


సూతకులూ, మృతకులూ కూడా అశౌచకాలంలో కూడా ఈ వ్రతాన్ని చేయవచ్చును. సూతకయనగా పుట్టుక, మృతకయనగ బంధుమరణము)


దశమీ ఏకాదశీ ఒకేరోజులో పడితే అది అసురదినమవుతుంది. కాబట్టి అటువంటి రోజు వ్రతం గాని ఉపవాసం కాని చేయరాదు.


(అధ్యాయం -123)