Monday, 31 May 2021

రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (7)



ఎంతటివారైనా పిల్లలు కాకుండ పెద్దవారు కారు. మానవుని భావి జీవితానికి బాల్యం (చిన్నతనం) పునాది. ఆ బాల్యాన్ని సరి యగు మార్గానికి మళ్ళించిన మున్ముందు ఆతని జీవితం పూలబాట కాదేని ముళ్ళబాట- సహజంగా చెడును ఆకర్షించే మనసును, ఆవైపునకు బాల్యాన పోనీయరాదు. తల్లిదండ్రులు, గురువులు — గురుతర బాధ్యతతో పిల్లలకు క్రమశిక్షణగల చదువును నేర్పించాలి అలా చేసినవాడు “చెడు కనకు- వినకు-చూడకు" అను సూక్తికి ఉదాహరణలై భావి భారత సత్పౌరులై సత్పథాన పయనించగలరు. "మొక్కయి వంగనిది మానై వంగునా" అనికదా పెద్దల సుద్ధి.


తల్లి ఆనతిపై ఆంజనేయుడు సూర్యభగవానుని చేరి "గురు దేవా! నన్ను శిష్యునిగా స్వీకరింపుము. వేద వేదాంగముల నుప దేశింపుము, జ్ఞానభిక్ష ప్రసాదింపు"మని కోరెను.


సకలశాస్త్ర మర్మజ్ఞుడు, సర్వలోక సాక్షియగు సూర్యదేవుడు "కుమారా! నేనొకచోట నిలకడగ నిలుచువాడను కాను కదా! నిరంతరం వినువీధినీ విహరించేవాడను. ఎలా విద్య నభ్యసించగలవు" అని పల్కెను.


అందుకు ఆంజనేయుడు "ప్రభూ! మీరావిషయంలో ఆలోచించవలసిన పనిలేదు” అని ఉదయాద్రిపై ఒక పాదమును, అస్తాద్రిపై మరొక పాదము నుంచి సూర్యగమనావరోధి కాకుండగ వెనుకకు నడుస్తూ ఏకాగ్రత కోలుపోక శ్రద్ధగా, ఆసక్తిగా సాంగో పాంగముగా వేదాధ్యయనము చేసి నవ వ్యాకరణములను నేర్చెను సకలశాస్త్ర పారంగతుడయ్యెను. బుద్ధిమతాం వరిష్ఠుడయ్యెను.


Sunday, 30 May 2021

రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (6)



ఇదొక మహత్కార్యం. గొప్ప సాహసం. ఆంజనేయుడు బాలుడుగ నున్నపుడే తన ధైర్య, బల సాహసాలతో అద్భుత కార్య సాధనకు పూనుకున్నాడు. ఆ కార్యసాధనలో హనువుకు దెబ్బ తగి లినా సహించి సత్ఫలితాల నంది, భవిష్యత్కాలంలో బ్రహ్మవు కాగలవన్న వరాన్ని దాశరధి నుండి పొందినాడు. మరెన్నో అద్భుత కార్యాలు సాధించాడు.


విదిళించ నురుగు సింగపుకొదమయు 

మదనులినగండ కుంజరములపై 

నిది బలశాలికి నైజము కద 

తేజోనిధికి వయసు కారణమగునే.


తన శక్తి సామర్థ్యాలను ప్రకటించడానికి వయసుతో పని లేదు. అది సహజ స్వభావ సిద్ధం. దీనిని ఆదర్శంగా తీసుకుని తల్లిదండ్రులు తమ సంతానానికి ఉన్నత కార్యాలను సాధించు నేర్పు, ఉన్నత భావాలను గూర్చి తెలపాలేగాని అల్ప విషయాల పైకి మనసును పోనీయరాదు. ఇదే ఆంజనేయుని బాల్యం మనకు నేర్పే నీతి-రీతి.


మొక్కయి వంగనిది మానై వంగునా ?


సకల దేవతా వర ప్రభావం వలన అమిత బల సంపన్నుడైన బాల ఆంజనేయుని ఆల్లరి ఇంతింతనరానిదీ. సహింపరానిదైనది. ఓర్పుకే ఒక పరీక్షగా నిలిచినై ఆ అల్లరిచేష్టలు. మునులు, మహర్షులు, పరమర్షులు, పిన్నలు, పెద్దలు ఒకరేమిటి? వారు వీరు అన నేల ? ఆ ప్రాంత నివాసులందరు అంజనాసూనుని చేతిలో బాధలు పడినవారే. తమ కుమారుని అల్లరి భయంకర రూపు దాల్చుట అంజనా కేసరులకు దిగులు పుట్టించినది. ఏమి చేయాలో పాలుపోక చివరకు తపోధనులను ఆశ్రయించిరి. త్రికాల వేత్తలైన వారు దివ్య దృష్టితో బాలుని గమనించి ఇలా శపించిరి. "ఆంజనేయా! ఏ బల గర్వముతో మమ్ములను హింసించుచున్నావో ఆ శక్తి సామర్థ్యము లను మరచెదవు గాక! ఎవరైన నీ బలపౌరుషాలను గుర్తుచేసిననే గాని నీశక్తి నీకు గుర్తురాదు!" తదాది ఆంజనేయుడు అమాయకుని వోలె ప్రవర్తించ సాగెను. అది గమనించి తల్లిదండ్రులు బాలునికి విద్యాబుద్ధులు నేర్పింపదలచిరి. ఉపనయన సంస్కారముల గావించి విద్యాభ్యాసమునకై సూర్యునికడ కంపిరి.

Saturday, 29 May 2021

రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (5)



మూర్చిల్లిన కుమారునిగాంచి వాయుదేవుడు దుఃఖితుడైనాడు. తనయుని తినుకుని కొండగుహచేరి ఉపచరించుచు వాయుస్తంభన చేసినాడు. సకల చరాచర జంతుచయము ఊపిరాడక తల్లడిల్లింది. ఆ సన్నివేశాన్ని ఉత్తర రామాయణం ఇలా వర్ణించింది.    


చేసినాడు. సకల చరాచర జంతుచయము ఊపిరాడక తల్లడిల్లింది. ఆ సన్నివేశాన్ని ఉత్తర రామాయణం ఇలా వర్ణించింది.


యాజకుల్ వహ్ని హవ్యములు వ్రేల్వగ జూచు


హస్తముల్ సాచినయటుల నుండె


దివిజులు ప్రేరేస దివికెగిరిన దేవయాసంబు


లెగిరిన యటుల నుండె


మునులు నదీతోయముల దోగముంచిన


యంగములో ముంచిన యటుల నుండె


బశు మృగ నరముఖ ప్రాణు లుర్వినిబెట్టు


నడుగులు బెట్టిన యటుల నుండె


భానుమండల మొక్కచో బాదుకొనియె 

గాలగతిదప్పే సత్రియల్ గడచె వేద 

పాఠముడివోయె బాహ్యమభ్యంతరంబు

గాడ్పు బంధించి చనిన యక్కాలమందు.


ఇలా లోకాలన్నీ వాయు సంచారం లేక అల్లాడిపోసాగినవి. ఇంద్రాది దేవతలు బ్రహ్మను ఆశ్రయించారు. ఆ బ్రహ్మదేవుడును ఇంద్రుని తొందరపాటుకు మందలించి అందరిని తీసుకుని వాయు వున్న పర్వత గుహ చేరి చేష్టలుడిగిన బాలుని స్పృశించి చైతన్య వంతుని చేసినాడు. దేవతలందరితో "యీ బాలుడు సామాన్యుడు కాడు. దేవకార్య సిద్ధ్యర్థం జన్మించిన మహానుభావుడు. మీ మీ శక్తుల నీతనికి ప్రసాదించండి" అని పలికినాడు చతురాననుడు.


అంటూనే ముందుగా తానే "ఏ అస్త్రము వలనా మరణం లేని" వరం ఆంజనేయునకు ఇచ్చినాడు.


ఇంద్రుడు పశ్చాత్తప్తుడై స్వేచ్ఛా మరణాన్ని వరంగా ప్రసాదించగా, సూర్యుడు సకల శాస్త్ర విశారదునిగా చేస్తానన్నాడు. ఇలా దేవతలందరూ తమ తమ శక్తులను వరంగా అనుగ్రహించారు. సంతసించిన వాయుదేవుడు బంధించిన శీతల వాయువులతో ప్రాణి లోకంను ప్రాణవంతం చేశాడు, విరిగిన హనువు కలవాడగుట వలన ఆంజనేయుని నాటినుండి హనుమంతుడన్నారు.


Thursday, 27 May 2021

రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (4)



ఇది బలశాలికి నైజము కధ


కానక కన్న సంతానమగుట అంజనా కేసరులు ఆంజనేయుని కడు గారాబముగ సాకుచుండిరి. కుమారుని బాల్యక్రీడలు కని ఆ తల్లిదండ్రులు అవధి లేని ఆనంద తరంగాల తేలియాడుచుండిరి. ఒకనాడు ఆంజనేయుడు ఆకలిగొని ప్రాగ్దిశన అపుడే ఉదయించు బాలభానుని గాంచి పండిన పండుగా భ్రమించి దానిని పట్టుకొనుటకై ఒక్క ఉదుటున ఎగిరి వాయువేగ మనోవేగాల అంబరవీధిన సాగిపోవుచుండెను.


సూర్యుని చేరబోవు కుమారుని చూచి వాయుదేవుడు గమనా యాసము కలుగనీయక చల్లగ వీచుచు వెన్నంటి సాగెను. తననే చేరవచ్చు తన మిత్రకుమారునకు తన కిరణాల వేడి తగలనీయ రాదను భావనతో కాబోలు సూర్యుడును చల్లగనే తోచెను.


ఆనాడు సూర్య గ్రహణం. సూర్యగ్రసనమునకై రాహువు వచ్చెను. అంజనా నందనుడు రాహువునే కబళింపబోయెను. రాహువు వెఱగంది భీతచితుడై సరగున శచీనాథుని చేరి తన దీన గాథను విన్నవించెను. ఇంద్రుడు సంభ్రమాశ్చర్యాలతో సింహికా తనయుని వెంటగొని ఐరావతారూఢుడై వచ్చి హనుమంతునితో ఇది తగదని పలికెను. ఇరువురకు పోరు సాగింది. ఆత్మరక్షణార్థం ఇంద్రుడు వజ్రాయుధమును సామీరిపై ప్రయోగించెను. అది బాలుని ఎడమ హనువును తాకింది. పర్వత శిఖరాన పడిపోయినాడు. ఆ దెబ్బకు మూర్ఛితుడై పర్వత శిఖరాన పడిపోయినాడు.


Wednesday, 26 May 2021

రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (3)



ఇంతలో- వీచిన గాలి తాకిడికి చీరకొంగు తొలగినది. వక్ష స్థలమూ- శరీర భాగాలూ కనిపించసాగినై, యతికైనా- మతిపోయే ఆ అందం వాయుదేవుని డెందాన్ని హరించింది, మోహం జనించింది. నిగ్రహం కోల్పోయిన వాయుదేవుడు అంజనను గట్టిగా కౌగిలించుకున్నాడు.


తనను కౌగిలించుకున్నది దేహమే లేని వాయువు కావడం వలన అంజన ఏమి జరుగుతున్నదో గమనించలేక పోయినది. ఐతే తనకేదో జరుగుతున్నదని మాత్రం కొంత వడికి గ్రహించుకున్నది. భయకంపితురాలైనది. పెద్దగ అరచినది. 'నా శీలమును అపహరింప చూస్తున్నదెవరు ?' అంటూ శపించ సిద్ధపడింది.


పరిస్థితిని గ్రహించిన వాయుదేవుడు ప్రత్యక్షమై “అంజనా? 'మాభీః' భయపడవలసినది లేదు. నీ శీలమునకేమి తక్కువలేదు. నేను పవనుడను. నా ఆలింగనము వలన గొప్ప ధైర్యవంతుడూ, నీతికోవిదుడూ, మహా పరాక్రమవంతుడూ, తేజస్వంతుడూ, మహా బలుడూ, ఎగురుటలోనూ- దుముకుటలోనూ- నాతో సమానుడైన ఒకకుమారుడు నీకుజన్మించగలడు" అనిచెప్పి అదృశ్యుడయ్యెను.


కలనైనా ఊహించని యీ హఠాత్సంఘటన అంజనను అనందవార్ధిలో ముంచెత్తినది. పుత్ర జననోత్సాహ వార్తను భర్త కేరిగించినది. కేసరియు, అవధిలేని ఆనందంతో పొంగిపోయినాడు. అంజన గర్భవతియైనది. అచటి పర్వత ప్రాంతాలలో విహరిస్తూ నవమాసాలు నిండగనే- వైశాఖ బహుళ దశమీ పూర్వాభాద్రా నక్షత్ర వైధృతియోగ మధ్యాహ్నవేళ ఒక కుమారుని కన్నది. అతడే ఆంజనేయుడు. అంజనాగర్భ సంభూతుడగుట వలన యీ పేరు వచ్చినది. 


Tuesday, 25 May 2021

రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (2)


ఆంజనేయ ఆవిర్భావం


ఒకప్పుడు మేరుపర్వత ప్రాంతమును పరిపాలించిన వానర వీరుడు కేసరి, మహా బలశాలి. పరాక్రమవంతుడూనూ- తనవారికి కొంగు బంగారం- వైరులతో సింహస్వప్నం! మూర్తీభవించిన ధర్మ మూర్తి. ఇతని ఏలుబడిలోని వారందరూ కలకాలం ఇతనినే తమకు రాజుగా- మహారాజుగా ఉండాలని కోరుకునేవారు.


దేవలోకాన 'పుంజిక స్థల' అను అప్సరస కలదు. సాటిలేని అందం ఆమెది. అందానికే అందాలు నేర్పే సోకులాడి. చంచల నేత్ర- చపల హృదయ, శాపకారణంగా మనుజ లోకాన జనించినది అంజనగా. కుంజరునకు దైవదత్తమైన కూమార్తైనది. పద్మ పత్ర విశాలాక్షి. తలిరాకుల సోయగం. మేని అందానికి తోడు ఆమె వేషధారణ ఆమెకు మరింత శోభను చేకూరుస్తూ- 'బంగారము నకు తావి అబ్బినటుల' ఉండేది.


కుంజరుడు. అంజనను, తన మేనల్లుడూ, మహావీరుడైన కేసరికిచ్చి వివాహం చేశాడు. ఈడూ జోడైన యీ ఆలుమగల సంసార యాత్ర సరాగాల రాగాల సాగింది.


ఎంతకాలానికి సంతతి కలుగలేదు. చింతాక్రాంతులయ్యారు అంజనా కేసరులు. ఎందరి మన్ననలో పొందిన వీరికి సంతానం లేని దిగులు- ఎవరితో చెప్పుకోలేనిదీ ఎవరూ తీర్చలేనిదీయైనది.


ఒకనాడు- సహజసిద్ధమైన పరమ సుకుమార లావణ్యంతో అపురూప సౌందర్యవతిగా వెలుగొందే ఆంజన- పూవునకు తావిలా శరీరానికి తగిన వస్త్రాలనూ, దివ్యాభరణాలనూ ధరించి- తనను, చూచువారి కనులు చెదరునట్లుగా వసంతయామిని వోలె పర్వత శిఖరాన నిలబడి చల్లగ వీచే పిల్లవాయువుల లాలనలో-ప్రకృతిలోని అందచందాలను పరికించు సమయాన మదిలో 'వీరమాతనైన బాగుండెడిది గదా!!" అన్న భావన వచ్చినది.

Monday, 24 May 2021

రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (1)



రాయప్రోలు రథాంగపాణి గారు రాసిన పుస్తకమిది.


అభయం వరదం దోర్భ్యాం కలయే మారుతాత్మజం 


శ్రీ మహాగణాధిపతయేనమః 

ఓం నమో భగవతే వాయునందనాయ


హనుమత్సందేశం


అవతార విశిష్టత


సీతారామ గుణగ్రామ పుణ్యారణ్య విహారిణా| 

వందే విశుద్ధ విజ్ఞానా కవీశ్వర కపీశ్వరౌ ॥


అనేకములైన పెద్ద పెద్ద కొమ్మలతో చాల దూరం విస్తరించి యున్న ఒక పెద్ద మఱిచెట్టును ఆశ్రయించి ఎందరో అనాధలు ఎండబారి పడకుండ తల దాచుకుంటారు. నానాజాతి పక్షులు నలు దిక్కులకు మేతకై వెడలి సాయం సమయాన ఆ చెట్టుకొమ్మలపై నివసిస్తుంటాయి. ఎవరికీ ఏ హానీ చేయని ఆ నోరులేని పక్షులను అదే చెట్టు ఊడల మాటున పొంచి కొందరు కిరాతులు తమకాహారంగా హింసిస్తారు. కొందరు రకరకాలైన జీవన సమస్యలతో పోరాడలేక నిరాశా నిస్పృహలకులోనై-ఆ చెట్టు ఊడలనే ఉరిత్రాడుగ చేసుకుని ప్రాణత్యాగం చేస్తారు. చిత్రం ఏమంటే వీరిలో ఎవరిని గుఱించీ అంటే తన చెంతన జరిగే హింస, ఆహింసల గుణించి ఇసుమంతైనా పట్టించుకోక ఆ మఱిచెట్టు తన పని తాను చేసుకుపోతుంది. ఇదే సృష్టి! ఇదొక సృష్టి రహస్యం !!


ఐతే మానవుడు మాత్రం యీ సృష్టిని తనకనుకూలంగా కావలసిన రీతిలో మార్చుకోవాలనే తపనతో మనసు నిలుపుకోలేక కష్టనష్టాల కడలిలో కొట్టుకుపోతూ సాయానికై పరితపిస్తున్నాడు.


దైవ సృష్టిలో తరతమ భేదాలు లేవు. పక్షపాతం లేదు. అందరూ సమానమే. అందరినీ ఒకేలా చూస్తాడు.


తనను తిరస్కరించినవానిని సైతం దగ్గరకు చేర్చుకుంటాడు. సేద దీరుస్తాడు. తన తప్పు తాను తెలుసుకుని బాగుపడాలనే భావనతో మానవునికి తోడుగా అవతార పురుషులను పంపుతాడు. ఒక్కో వేళ తానే అవతార మూర్తిగా అవతరిస్తాడు.


అట్టి మూర్తులలో హనుమన్మూర్తి ప్రతిభావంతమైనదీ, మహా మహిమాన్వితమైనదీనూ -----


ఆంజనేయస్వామివారి జనన, విద్యాభ్యాసాది విధానమంతా మానవజాతికి ఒక సందేశ కావ్యమే.


కేవలం స్వామివారి చరిత్రను చదివిన చాలదు. స్తోత్ర పారాయణాదులను పఠించినదానికన్న వారి సందేశమును ఆచరణలో చూపినవారి జన్మ నిజముగ ధన్యము. వారే స్వామికి విశ్వాస పాత్రులు. ఆ భావంతో.... ఇక చదవండి....