Sunday, 31 October 2021

శ్రీ హనుమద్భాగవతము (63)



సర్వశక్తి సంపన్నుడైన రఘునాథుడు సుగ్రీవునితో ! నా కార్యము గురించి నీకు తెలుసు. ఉచితమని భావిస్తే శీఘ్రముగా వీరిని సీతాన్వేషణమునకై పంపుమని పలికాడు.


సావధానముగా అంతటా తిరుగుతూ సీతా దేవి జాడను తెలుసుకొనవలసినదని యూథపతులకు అందఱకి ఆజ్ఞ ఇస్తూ సుగ్రీవుడిట్లు పలికాడు -- 


విచిన్వంతు ప్రయత్నేన భవంతో జానకీం శుభామ్ | 

మాసాదర్వాజ్ నివరధ్వం మచ్ఛాసనపురస్సరాః || 

సీతామదృష్ట్వా యది వో మాసాదూర్ధ్వం దినం భవేత్ | 

తదా ప్రాణాంతికం దండం మత్తః ప్రాప్స్యథ వానరాః ||


(ఆ రా. 4–8–25,28)


నా ఆజ్ఞ అనుసరించి మీరందఱు ఎంతో ప్రయత్నముతో జానకీ దేవిని అన్వేషించండి, ఒక మాసములోపల తిరిగి రండి. సీతాదేవిని చూడకుండా మాసముకంటే అధికముగా ఒక్క రోజు గడిచినా నా చేతులో మీకు ప్రాణదండన తప్పదు”.  


ఇట్లు సుగ్రీవుడు సీతా దేవిజాడను తెలుసుకొనుటకై వానర యూథపతులను, భల్లూక యూథపతులను కఠినముగా శాసించాడు. అతడు సర్వదిక్కులకు ఎందరినో వానరులను "పంపి దక్షిణదిక్కునకు గొప్ప ప్రయత్నముతో మహాబలుడు యువరాజైన అంగదుడు, జాంబవంతుడు, హనుమానుడు, నలుడు, సుషేణుడు, శరభుడు, మైందుడు, ద్వివిదుడు మొదలైన వారిని పంపాడు. అప్పుడు అతను వీరవరుడగు హనుమానుని ప్రశంసిస్తూ ఇట్లా పలికాడు.


"కపి శ్రేష్టా ! పృథివిలోగాని, అంతరిక్షమునందుగాని, ఆకాశమునందు గాని, దేవలోకమునందు గాని, జలమునందు గానీ నీగతికి అవరోధమున్నట్లు నాకెక్కడా కనపడలేదు. అసుర గంధర్వ నాగ మనుష్య దేవ సముద్ర పర్వత సహితముగా సర్వలోకముల గుఱించి నీకు తెలుసు. వీరుడా! అంతట అబాధిత మగు గతి, వేగము, తేజస్సు, స్ఫూర్తి అనే గుణములన్నీ మహాపరాక్రమవంతుడైన నీ తండ్రియైన వాయు దేవునిలో ఉన్నట్లు నీలో ఉన్నవి. ఈ భూమండలమున ఏ ప్రాణియు నీ తేజస్సుతో సరిపోయినట్టిది లేదు. అందువలన సీతా దేవి లభించునట్టి ఉపాయమును నీవే ఆలోచించు. హనుమానుడా! నీవు నీతిశాస్త్ర నిపుణుడవు. నీ ఒక్కని యందే బలము, బుద్ధి, పరాక్రమము, దేశకాలనుసరణము, నీతియుక్తమైన నడవడి ఒక్క మారే కనబడుతుంది.”

( న భూమా నాంతరిక్షేవా నాంబరే నామరాలయే | 
నాప్సు నా గతిభంగం పశ్యామి హరిపుంగవ ||
సాసురాః సహగంధర్వాః సనాగనర దేవతాః | 
విదితాః సర్వలోకాస్తే ససాగరధరాధరాః || 
గతిర్వేగశ్చ తేజశ్చ లాఘవం చ మహాకపే | 
చితుస్తే సదృశం వీర మారుతస్య మహౌజసః || 
తేజసా వాపి తే భూతం న సమం భువి విద్యతే | 
తన్మయా, లభ్యతే సీతా తత్త్వమేవాను చింతయ ||
త్వయ్యేవ హనుమన్న స్తి బలం వృద్ధిః పరాక్రమః | 
దేశాకాలాను వృత్తిశ్చ నయశ్చ నయపండిత || 
(వా. రా. 4-44-3, 7)

Saturday, 30 October 2021

శ్రీ హనుమద్భాగవతము (62)



'అవును, తప్పక వెళదామూ అని పలికి సుగ్రీవుడు అర్ఘ్యపాద్యాదులచే లక్ష్మణుని పూజించి ఆయనతో పాటు తాను ఉత్తమమైన రథముపై కూర్చున్నాడు. సుగ్రీవునితో పాటు అంగదుడు, నీలుడు, ఆంజనేయుడు మొదలైఅన ప్రధానులైన వానరులు కూడా శ్రీ రాముని దగ్గరకు వెళ్ళారు. అప్పుడు భేరీ మృదంగాది నానా విధములైన వాద్యములు మ్రోగసాగాయి.


సీతాన్వేషణార్థమై పయనమగుట


మృగచర్మము చేత, జటామకుటము చేత శోభిల్లువాడు నీలమేఘశ్యాముడు అయిన శ్రీరాముడు గుహద్వారము దగ్గర ఒక శిలా ఖండముపై కూర్చుని ఉదాసీనమైన మనస్సుతో పక్షులను చూస్తున్నాడు. దూరము నుండి శాంతమూర్తియైన శ్రీరాముడు కనబడగానే సుగ్రీవుడు, లక్ష్మణుడు రథమునుండి దిగారు, సుగ్రీవుడు వేగముగా శ్రీ రాముని వద్దకు వెళ్ళి అజ్ఞానుడైన బాలులు వలె ఆయన పాదపద్మముల పై ప్డి ఏడ్వసాగాడు. దయామూర్తి యైన శ్రీరాముడు వెంటనే అతనిని లేవనెత్తి ఆలింగనము చేసుకుని, సమీపమున కూర్చుండ బెట్టుకుని ప్రేమ పూర్వకంగా అతని యోగక్షేమములల్ను అడగసాగాడు.


సుగ్రీవుడు చేతులజోడించి ఎంతో వినయముతో పలికాడు. 'ప్రభూ ! నా దోషమేమీలేదు. నీ మాయ

చాలా ప్రబలమైనది. నీ దయ ఉంటేగాని దీనిని దాటలేము. నేను భోగాసక్తుడైన పామరపశువును. నా పై దయ చూపు.


కరుణామయుడైన శ్రీరాముడు సుగ్రీవుని శిరమును తన కరకమలముతో నిమురసాగాడు. అప్పుడు అసంఖ్యాకులైన వానర భల్లూక వీరులు అచటికి రాసాగారు.


వారిని చూసి సుగ్రీవుడు శ్రీ రామునితో ఇట్లు పలికాడు. "ప్రభూ! ఈ వానరులు, భల్లూకవీరులు నీ ఆజ్ఞను పాలిస్తారు. ఫలమూలాదులను భక్షిస్తారు. ఈతడు భల్లూకములకు అధిపతియైన జాంబవంతుడు, మహాయోధుడు, బుద్ధి మంతుడు. ఇతడొక కోటిమంది వానరులకు అధిపతి. మంత్రులలో శ్రేష్ఠుడు. ఇంతేకాక నలుడు, నీలుడు, గవయుడు, గవాక్షుడు, గంధమాదనుడు, శరభుడు, మైందుడు, గజుడు, పనసుడు, బలీముఖుడు, దధిముఖుడు, సుషేణుడు, తారుడు, మహాబలుడు పరమధీరుడు హనుమంతుని తండ్రియైన కేసరి వీరందఱు ప్రధానయూథపతులు. వీరి ఆధీనంలో పర్వతములతో సమానమైన విశాలకాయములు కలిగిన వానర వీరులు కోట్లగొలదిగా ఉన్నారు. మీరు వీరిని ఇష్టానుసారముగా ఆజ్ఞాపింపవచ్చును.


Friday, 29 October 2021

శ్రీ హనుమద్భాగవతము (61)



అంతఃపురమున భయపడుతున్న సుగ్రీవుడు తన భార్య యైన రుమతో కలిసిలక్ష్మణుని చరణములకు నమస్కరించాడు, అచట కూడా క్రుద్ధుడై యున్న లక్ష్మణునితో నీతివేత్తయైన సమీరకుమారుడు ఇట్లు పలికాడు.


త్వత్తో ఒధికతరో రామే భక్తోఽయం వానరాధిపః || 

రామ కార్యార్థమనిశం జగత విస్మృతః | 

ఆగతాః పరితః పశ్య వానరాః కోటిశః ప్రభో || 

గమిష్యంత్యచి రేణైవ సీతాయాః పరిమార్గణమ్ | 

సాధయిష్యతి సుగ్రీవో రామకార్యమశేషతః ||


(వా. రా. 4-5-54, 56) 


'మహారాజా ! ఈ వానర రాజు శ్రీరామచంద్రునకు నీ కంటెను గొప్ప భక్తుడై ఉన్నాడు. శ్రీరామకార్యార్థమై ఆయన రేయింబవళ్లు మేలుకొని ఉంటున్నాడు. ఆయన దానినేమాత్రము మఱచియుండలేదు. ప్రభూ! చూడుము కోట్లకొలదిగా ఉన్నఈ వానరులు దీనికోసమే అన్ని వైపుల నుండి వచ్చుచున్నారు. వీరందఱు శీగ్రముగా సీతాన్వేషణకై వెళతారు. మహారాజైన సుగ్రీవుడు శ్రీరామచంద్రుని సర్వకార్యమును చక్కగా నెరవేర్చగలడు !


అనంతరము వానరరాజైన సుగ్రీవుడు లక్ష్మణుని చరణములకు నమస్కరించి వినయముగా ఇట్లా పలికాడు - 'ప్రభూ ! నేను శ్రీరామచంద్రుని దాసుడను. ఆయనయే నా ప్రాణములను కాపాడినాడు. ఈ ధనము, వైభవము, రాజ్యాదులు సర్వము ఆయన ఇచ్చినవే. ఆయన స్వయముగా త్రిభువనములను జయించగలడు. నేనాయన కార్యమునకు సహాయక మాత్రుడనవుతాను. విషయలోలుడను, పామరుడను అయిన నేను పూర్తిగా మీ వాడనే. అందువలన నీవు నా అపరాధ ములను క్షమించు.


సుగ్రీవుని ప్రార్థన వినినంతనే సుమిత్రానందనుడు అతని భుజములను పట్టుకొని హృదయమునకు హత్తుకొని, ప్రేమ పూర్వకముగా అతనితో నిట్లుపలికెను 'మహాభాగా ! నేను కూడా ప్రణయ కోపవశములో ఏవియో మాటలను పలికాను. వాటిని గూర్చి నీవు ఆలోచించవలదు. శ్రీరాముడు అరణ్యమున ఒంటగా ఉన్నాడు. సీతాదేవి వియోగముచే వ్యాకులుడై ఉన్నాడు. అందువలన ఇప్పుడు ఆయన దగ్గరకు మనము వెళ్ళాలి.

Thursday, 28 October 2021

శ్రీ హనుమద్భాగవతము (60)



నగరవాసులందఱు ఎంతో కలత చెందుట చూసి యువరాజైన అంగదుడు లక్ష్మణుని దగ్గరకు వెళ్ళి ఆదర పూర్వకముగా చరణములకు నమస్కరించాడు. అతనిని చూడగానే భ్రాతృభక్తుడైన లక్ష్మణుని కోపము శాంతించింది. ఆయన యువరాజును హృదయమునకు హత్తుకొని ‘వత్సా! నీవు త్వరగా సుగ్రీవుని దగ్గరకు వెళ్ళి శ్రీ రాముడు నీపై కోపము పూనియున్నాడు, ఆయన పంపగా నేనిచటకు వచ్చిచ్చానని అని ఆయనతో చెప్పు' అని పలికాడు.


‘చాలమంచి’దని పలికి అంగదుడు వినయపూర్వకముగా చేతులను జోడించి లక్ష్మణుని దగ్గర సెలవు తీసుకుని సుగ్రీవుని వద్దకు వెళ్ళాడు. అంగదుని వలన లక్ష్మణుడు పలికిన క్రోధ పూర్ణములైన మాటలను వినినంతనె సుగ్రీవుడు భయాక్రాంతుడయ్యాడు. వెంటనే అతడు లక్ష్మణుని అనుకూలునిగా చేసుకొనుటకు పవన కుమారుని పంపాడు.


హనుమానుడు లక్ష్మణుని సమీపించి ఆయన చరణములకు భక్తి పూర్వకముగా ప్రణమిల్లి వినయముతో ఇట్లా పలికాడు.


ఏహి వీర మహాభాగ భవద్గృహమశంకితమ్ | 

ప్రవిశ్య రాజదారాదీన్ దృష్ట్వా సుగ్రీవమేవ చ | 

యదాజ్ఞాపయసే పశ్చాత్ తత్సర్వం కరవాణి భోః | (4-5-37, 38)


మహాభాగా! వీరశ్రేష్ఠా! ఎలాంటి సందేహం లేకుండా రండి. ఈ ఇల్లు నీది. లోనికి దయచేసి రాజమహిషులను, మహారాజైన సుగ్రీవుని కలవండి. పిమ్మట నీ ఆజ్ఞనను అనుసరించి మెలుగుతాము.


హనుమానుడు ఎంతో భక్తితో లక్ష్మణుని కరకమలములను ప్ట్టుకొని నగరము గుండా రాజభవనమునకు తీసుకుని వెళ్ళాడు. మధుర భాషిణి యైన తార లక్ష్మణునకు స్వాగతమిస్తూ ‘మీ కార్యమును గూర్చియే సుగ్రీవుడాలోచించుచున్నాడు. దయ యుంచి మీరు అంతఃపురములోనికి వచ్చి ఆయనకు ఆభయమీయండని' పలికింది.

Wednesday, 27 October 2021

శ్రీ హనుమద్భాగవతము (59)



ధనుర్బాణములను తీసుకుని సుగ్రీవవధకై బయలు దేరిన లక్ష్మణుని చూసి ధీరుడు, గంభీరుడు, పురుషోత్తముడు అయిన శ్రీరాముడు సోదరునకు నచ్చజెప్పుచు ఇట్లు పలికాడు - 'లక్ష్మణా ! నీ వంటి ఉత్తమవీరుడు మిత్రవధవంటి నిషిద్ధకర్మ చేయుట ఉచితముగాదు. ఉత్తమమైన వివేకముద్వారా తన క్రోధమును చంపుకున్న వీరుడు సర్వపురుషులలోను శ్రేష్ఠుడని చెప్పబడతాడు. 

కోపమార్యేణ యో హంతి స వీరః పురుషోత్తమః || (వా.రా. 4-81-8) 


నాయనా! సుగ్రీవుడు నాకు మిత్రుడు. అతనిని నీవు చంపకూడదు. అక్కడకు వెళ్ళి 'వాలివలె నీవు కూడా చంపబడుదువూ అని మాత్రము పలికి అతనిని భయపెట్టవలసినది. 'శీఘ్రముగా దానికి సమాధానము తీసుకునిరా.


న హంతవ్య స్త్వయా వత్స సుగ్రీవో మే ప్రియః స్సభా 

కింతు భీషయసుగ్రీవం వాలివత్వం హనిష్యసే 

ఇత్యుక్త్వా శీఘ్రమాదాయ సుగ్రీవం ప్రతిభాషితమ్||


(వా. రా. 4–5–18,14)


అలాగే అని ఇక్ష్వాకు కులసింహుడు వీరవరుడైన సుమిత్రానందనుడు శ్రీరాముని చరణములకు నమస్కరించి, భయంకరమైన తన ధనుర్బాణములను తీసుకుని కిష్కంధకు వెళ్ళాడు. అపుడు క్రోధమువలన అతని ఆకారము ఎంతో భయావహముగా ఉండింది. అతని అధరము వణకుచుండింది. అత్యధికమైన కోపముతో అతడు మార్గములో గల వృక్షములను పడగొట్టుతూ, పర్వతశిఖరములను దూరముగా విసరుతూ వెళుతున్నాడు. ఆ సమయమున అతడు ప్రలయంకరుని వలె కనబడుతున్నాడు.


కిష్కంధ దగ్గరకు వెళ్ళి లక్ష్మణుడు తన వింటినారిని భయము గొల్పునట్లుగా మ్రోగించెను. ఆ సమయమున కొందఱు సామాన్యవానరులు కోటగోడపై నుండు రాళ్ళను చెట్లను దీని కొని హర్ష ధ్వానముల చేయసాగారు. ఇది చూచినంతనే లక్ష్మణుని క్రోధాగ్ని ప్రజ్వరిల్లింది. ప్రళయాగ్నివలె నున్న లక్ష్మణుడు విశాలమైన తన ధనుస్సుపై భయానకమైన బాణమును ఎక్కుపెట్టాడు. వెంటనే కిష్కింధలోని వానరవీరులందరు వణకి పోయారు. లక్ష్మణుడు సమూలముగా కిష్కింధను నాశము చేయటకు సిద్ధపడ్డాడు.

Tuesday, 26 October 2021

శ్రీ హనుమద్భాగవతము (58)



ఇక అచట వర్ష ఋతువు పిమ్మట శరదృతువు వచ్చెను. సుగ్రీవుడు నిశ్చింతునిగా, నిష్రియునిగా ఉండుట చూసి భగవానుడైన శ్రీరాముడు కలత చెంది తన సోదరునితో ఇట్లా పలికాడు. ‘లక్ష్మణా ! వానరరాజైన సుగ్రీవుడు సీతాన్వేషణమునకు గడువును నిర్ణయించినాడు. కాని తన స్వార్థము నెరవేరిన పిమ్మట దుష్టబుద్ధియైన ఆ వానరుడు నన్ను ఉపేక్షించాడు. నన్ను అతడు రాజ్యభ్రష్టునిగా, దీనునిగా, అనాథునిగను, శరణాగతునిగా భావించి తిరస్కరించుచున్నాడు. అందువలన నీవక్కడికి వెళ్ళి స్పష్టముగా పలుకు – ‘బలపరాక్రమ సంపన్నులు, ఉపకారము చేయునట్టి వారు కార్యార్థులైన పురుషులకు ప్రతిజ్ఞాపూర్వకముగా ఆశను క్లుగజేసి తరువాత దానిని భగ్నము చేయువాడు ప్రపంచంలోనున్న మనుషులందరిలో నీచుడు, తన నోటి ద్వారా ప్రతిజ్ఞారూపంగా వెలువడిన మాటలు మంచివి కావచ్చు, చెడ్డవి కావచ్చు. ఎలా ఉన్నా ఆ వాక్కులు తప్పక నెఱవేర్చదగినవని భావించి సత్యాన్ని కాపాడే ఉద్దేశ్యంతో వాటిని పాటించే వీరుడు మనుష్యులలో శ్రేష్ఠునిగా చెప్పబడుతున్నాడు.

లక్ష్మణా ! ఆ దురాత్మునితో ఇంకను నిట్లు పలుకుము ‘నా బాణముచే జంపబడిన వాలి యే మార్గమున వెడలినాడో ఆ మార్గ మింకను మూతబడలేదు. అపుడు నేను నాలి నొక్కనినే చంపితిని. కాని యిపుడు నీవు నీ ప్రతిజ్ఞను నెఱ వెర్చనిచో బంధువులతో గూడ నిన్ను మృత్యువాతబడ వేయుదును'అని శ్రీరాముడు మిగుల బాధతో తనసోదరునితో బలి


* అర్థినాముపపన్నానాం పూర్వం చాప్యుపకారిణామ్ | 

ఆశాం సంశ్రుత్య యో హంతి స లోకే పురుషాధమః || 

శుభం వా యది వా పాపం యో హ వాక్యముదీరితమ్ | 

సత్యేన ప్రతిగృహ్ణాతి స వీరః పురుషోత్తమః || (వా. రా: 4.80–71,27)  


శ్రీ రాముని వాక్కులను వినినంతనే సుమిత్రానందనుడు రోష పూర్ణుడయ్యాడు, అతడు అన్నపాదములకు నమస్కరించి ఇట్లు పలికాడు - ‘విషయభోగాసక్తుడు, బుద్ధిహీనుడైన వానరుడు అగ్నిసాక్షిగా స్నేహముజేసినాడు; కాని తనపని నెఱవేరిన పిమ్మట అతని అభిప్రాయము మారినది. అసత్యవాదియైన సుగ్రీవుని ఇప్పుడే చంపి అంగదునకు రాజ్యపట్టాభిషేకము చేస్తాను. అతడే రాజై వానరవీరుల ద్వారా సీతా దేవి జాడను తెలిసికొనగలడు.'

Monday, 25 October 2021

శ్రీ హనుమద్భాగవతము (57)



రాజ్యం ప్రాప్తం యశశ్చైవ కౌలీ శ్రీరభవర్ధితా

మిత్రాణాం సంగ్రహః శేష సద్భవాన్ కర్తుమర్హతి

తద్భవాన్ వృత్త సంపన్నః స్థితః పధి నిరత్యయే| 

మిత్రార్థమఖనీతార్థం యధావత్ కర్తుమర్హతి || 

తదిదం మిత్రకార్యం నః కాలాతీతమరిందమ | 

క్రియతాం రాఘవ స్యైతత్ వైదేహ్యాః పరిమార్గణమ్ || 

న చ కాలమతీతం తే నివేదయతి కాలవిత్ | 

త్వరమాణో2పి స 'ప్రాజ్ఞ స్తవరాజన్ వశానుగః || 

న హి తావత్ భవేత్కాలో వ్యతీతశ్చోదనాదృతే | 

చోదితస్య హి కార్యస్య భవేత్కా-లవ్యతిక్రమః || 

శక్తిమానితి విశ్రాంతో వానరర్క్ష గణేశ్వరః |

కర్తుం దాశరధేః ప్రీతిమాజ్ఞాయాం కిం ను సజ్జ సే ||

ప్రాణత్యాగవిశం కేన కృతం తేన మహత్రియమ్ | 

తస్య మార్గామ వైదేహీం పృథివ్యామపి చాంబరే || 

దేవదానవగంధర్వా అసురాః సమరుద్గణాః | 

న చ యక్షాభయం తస్య కుర్యుః కిమివ రాక్షసాః || 

త దేవం శక్తియు క్తస్య పూర్వం ప్రతికృతస్థథా | 

రామస్యార్హసి పింగేశ కర్తుం సర్వాత్మనాప్రియమ్ || 


(వా. రా. 4-29-9-9-12,15,16,19,21 23-25


రాజా ! నీవు ! రాజ్యమును, యశస్సును పొందావు. వంశపారంపర్యముగా వచ్చిన లక్ష్మీని వృద్ధిపఱచావు. కాని ఇంకా మిత్రులకు చేయవలసిన కార్యము మిగిలియున్నది, దానిని ఇప్పుడు నీవు నెరవేర్చవలెను. నీవు సదాచార సంపన్నము, నిత్యము, సనాతనము అయిన ధర్మమార్గమున నిలచియున్నావు. అందువలన మిత్రకార్యమును చక్కపెట్టుట్టకు నీవొనర్చిన ప్రతిజ్ఞను తగినట్లు నెరవేర్చు. శత్రుదమనుడా! శ్రీ రాముడు మనకు పరమమిత్రుడు, ఆయనకు చేయవలసిన కార్య సమయము గడచిపోవుచున్నది. అందువలన సీతా దేవికై వెదకుట ఆరంభించాలి. రాజా! పరమబుద్ధిమంతుడైన శ్రీరాముడు కాలవేత్త. కార్యసిద్ధికై నీవు త్వరపడిన ఆయన నీకు పశుడైయుంటాడు. కాలము గడస్తున్నదని సంకోచము వలన ఆయన నీతో చెప్పడు. కనుక శ్రీరాముడు చెప్పక ముందు మనము పనిని మొదలుపెడితే సమయము గడచినట్లు ఆయన భావింపడు. కాని ఆయన దీనికై ప్రేరణ కలిగించినచో మనము సమయమును గడిపామనీ, ఆలస్యం చేశావని ఆయన కార్యమున లోకమున వెల్లడి కాగలదు. వానర భల్లూకములకు ప్రభువైన సుగ్రీవా! నీవు శక్తిమంతుడవు, పరాక్రమవంతుడవు. అయినా దశరథనందనుడైన శ్రీ రామునకు ఇష్టమైన కార్యమును ఒనర్చుటకు వానరులను ఆజ్ఞాపించుటకు ఎందుకు ఆలస్యము చేయుచున్నావు? నీకై శ్రీ రాముడు వాలి ప్రాణములను తీయుటకు కూడా సందేహింపలేదు. 


ఆయన నీకు ఎంతో ఇష్టమైన కార్యము చేసాడు. అందువలన మనమి ఇప్పుడు ఆయన భార్య యైన సీతాదేవికై భూమ్యాకాశముల రెండింటి యందును వెతుకు. దేవతలు, దానవులు, గంధర్వులు, అసురులు, మరుద్గణములు, యక్షులు మున్నగు వారెవ్వరూ శ్రీ రామునకు భయమును కలిగించలేరు. ఇక రాక్షసుల విషయమై చెప్పేదేమి! వానరరాజా! ఇట్టి శక్తిశాలీ, మొదటనే ఉపకారము చేయువాడైన శ్రీరామునకు ఇష్టమైన కార్యమును నీవు నీ శక్తియుక్తులను వినియోగించి చెయ్యి. 


శ్రీరాముని కార్యమున ఆలస్యము జరిగినందులకు స్వగుణసంపన్నుడైన సుగ్రీవుడు భయగ్రస్తుడయ్యాడు. ఆయన ఎల్లప్పుడూ హనుమానుని సలహాలను గౌరవించుచుండేవాడు. ప్రేమపూర్వకముగా కర్తవ్యమును గురించి తెలియ జేసినందులకు సుగ్రీవుడు చాలా సంతోషించి వెంటనే నీలుడనే వానర వీరుని ఇట్లా ఆజ్ఞాపించాడు – ‘నీవు పదిహేను దినముల లోపల ఆ ఉద్యోగులను, శీఘ్రగాములైన యూథపతులను వీర సైనికులను నా సమీపమునకు పంపుటకు ప్రయత్నించు. ఈ గడువు లోపల ఇచటికి చేరని వానర వీరులు తమ ప్రాణములపై ఆశ వదలుకొనవలసివస్తుంది. ఇది నా ధృడనిశ్చయము'.