Monday, 31 July 2023

శ్రీదత్త పురాణము (213)

 


కృష్ణా మలకం కథ


ఒకానొక సందర్భంలో ఏక వీరా దేని ఆజ్ఞ మేరకు చతుర్ముఖుడు విష్ణు సందర్శన కాంక్షతో క్షీర సముద్రానికి బయలు దేరాడు. కానీ అక్కడ విష్ణుమూర్తి కనిపించలేదు. ఎంత వెదికినా ఎంతసేపున్నా శేష శాయి దర్శనమే కాలేదు. ఏమిటి ఈ వింత చెప్మా- అని భయ సందేహ పరాభవాది భావాలతో ఉక్కిరి బిక్కిరి అవుతుండగా అక్కడ ఒక అమలకీ తరువు (ఉసిరిక) కనిపించింది. అది విద్యుత్కాంతులు విరజిమ్ముతున్న కృష్ణామలకీ తరువు. దాన్ని తీసుకొని తిరిగి వచ్చాడు విరించి, ఆ తరు రూపంలో స్వయంగా విష్ణుమూర్తి వచ్చినట్లే అనిపించి రేణుకాదేవి పరశురామునితో - నాయనా! మరొక్కసారి ఈ కృష్ణామలకీ రూప విష్ణుమూర్తిలోకి ప్రవేశించు. శివ స్వరూపుడైన నీ తండ్రిని స్తుతించు. ఈ కృష్ణామలకం త్రిభువనేశ్వరుడు. సాక్షాద్విష్ణువు, నీ తండ్రి సదాశివుడు. కనుక తరువు అవుతుంది.


Sunday, 30 July 2023

శ్రీదత్త పురాణము (212)

 


జననీ! త్రిలోక వందితా! గాయత్రీ! వేదమాతా! కటాక్షించు. వేదాలను మరచిపోయాము ఏ ఒక్క మంత్రమూ గుర్తుకు రావడం లేదు. నువ్వు పరమేశ్వరివి. జగద్గురుత్వం నీది. సర్వదేవతా మయివి. నీ అక్షరరూపాన్ని నా బుద్ధిలో తిరిగి ప్రకాశింపజెయ్యి.


చతురాననా! వెళ్ళి దత్తాత్రేయుణ్ని అభ్యర్ధించు. అతడు వర్ణమాత్రా సహితంగా సకల విద్యలూ నేర్చినవాడు అని రేణుకా దేవి బ్రహ్మకు చెప్పి వెంటనే దత్తాత్రేయుణ్ని పిలిచింది. జ్ఞానవేత్ఛ పురస్కృతా! సర్వదేవ నమస్కృతా! ఈ బ్రహ్మ దేవుడు ఏదో అంటున్నాడు. కొంచెం కనుక్కో నాయనా అని చెప్పింది. అప్పుడు దత్త దేవుడు బ్రహ్మను సమీపించాడు. చతుర్ముఖా ! సర్వజ్ఞానవేత్తా! ఏమిటి అడుగుతున్నావో చెప్పు. నాకు తెలిసింది తప్పక చెబుతాను.


మునిశ్రేష్టా! వేదాలను, వేదాంగాలనూ, ఉపనిషత్తులను సమస్తమూ మరచిపోయాను. దయజేసి వర్ణమాత్రాస్వరాత్మాంకంగా వాటిని నాకు బోధించు. 


విరించీ! కకారాది సకల వర్ణాలలోనూ ఏకైకమై పరిఢవిల్లే అనంత వాదాత్మకత ఒక్కటే. అది ఎవరిలో ప్రకాశిస్తుందో ఆ దేవిని “సవర్ణ” అంటారు. ఆ సవర్ణ - ఈ రేణుకాదేవియే తప్ప మరొకరెవ్వరూ కాదు. సవర్ణ - వేదమాత - సావిత్రి- బ్రహ్మరూపిణి- అన్నీ ఆ జగద్ధాత్రి రేణుకాదేవియే. రెండవ శక్తి లేదు. ఏకమాత్ర ఏక వీర ఓంకారైక స్వర - అన్నీ ఆమెయే. అష్టపర్యాయక వాచక అని కూడా ఆమెను అంటారు. (హ్లాదిని విమల ఉత్కర్షిణి జ్ఞానయోగ ఇత్య ఈశాన ప్రసీ అనుగ్రహ అని అష్టపర్యాయ వాచకాలు) ఒక్కటే అయినా అనేక రూపాలు ధరిస్తుంది. - - - - కనుక ఏక వీర అన్నారు. ఆమెయే వేదమాత. గాయత్రి బ్రహ్మ రూపిణి.


మునిశ్రేష్ట ! సాధు, వేదమాత అన్నా, గాయత్రి అన్నా, బ్రహ్మ రూపిణి అన్నా ఒక్కరేనని చాలా చక్కని విషయం స్పష్టపరిచావు.


దత్తాత్రేయ చతుర్ముఖులు ఇలా సంభాషించుకుంటూ ఉండగానే దత్తదేవుడి అంకపీఠ నివాసినియైన శ్రీదేవి ముఖం నుంచి చతుర్వేదాలు వెలువడి రేణుకాదేవి శరీరంలో ప్రవేశించాయి. దీనితో సంతృప్తి చెందిన చతుర్ముఖుడు రేణుకాదేవియే వేద మాత అని గుర్తించి భక్తి ప్రపత్తులతో నమస్కరించాడు. తల్లీ! ఛందస్స్వరూపిణివి నీవు. ఓం కార స్వరూపిణివి నీవు. అనంత రూపిణివి నీవు. తెలిసిగానీ, తెలియక గానీ నిన్ను నిందించే వాళ్ళు సకల పుణ్య ఫలాలనూ కోల్పోతారు అని స్తుతించి మరొక్కసారి నమస్కరించి దత్తాత్రేయుడికి ప్రణమిల్లి పురాతన వేద స్మృతిని తిరిగిపొంది సత్యలోకానికి వెళ్ళిపోయాడు.


ఆ జగదంబికయే రేణుమహారాజు చేసిన తపస్సుకు సంతుష్టయై వారింట కన్యగా జన్మించి శివస్వరూపుడైన జమదగ్నిని పరిణయమాడింది. సేవలు చేసినది. ఆ దంపతులు కొంతకాలానికి లౌకిక దేహాలను విడిచిపెట్టి శివశివాని రూపాలతో కైలాసం తిరిగి చేరుకున్నారు. దీపకా! ఈ కధ నీకింతకు ముందే చెప్పాను కదా! అంచేత నీ మరో ప్రశ్నకి సమాధానం చెబుతున్నాను. తిలకించు అని వేద ధర్ముడు కొనసాగించాడు. -



Saturday, 29 July 2023

శ్రీదత్త పురాణము (211)

 


గురూత్తమా! కార్త వీర్యార్జుని అవతార సమాప్తితో పాటు పరశురాముని వృత్తాంతం కూడా నాకు తెలియజెప్పి ఎనలేని ఆనందం సమకూర్చారు. అయితే ఇక్కడ నాదొక సందేహం. ఈ రేణుకాదేవి ఎవరు? సాక్షాత్తు శ్రీ మన్నారాయణుడైన దత్తాత్రేయుడే నమస్కరించి స్తుతించాడంటే ఆ తల్లి అవతారగాధ వినవలసిందే. అనుగ్రహించండి. రేణు అనే మహారాజు ఒకరు ఉండే వాడనీ, ఆయనగారి కూతురు రేణుక అనీ, నేనెప్పుడో ఎక్కడో విన్నాను. అటువంటి రేణుకను దేవదేవుడు నమస్కరించడమేమిటి చెప్మా? అని నా సందేహం. అలాగే కాన్యకుబ్జంలో ఉండే పరశురాముడికి సహ్యాద్రిలో అమలకీ గ్రామం ఎందుకు ఆశ్రమమయ్యింది? అవి ఇప్పటికి నా చిరు సందేహాలు. దయచేసి వీటిని తీర్చండి.


దీపకుడి అభ్యర్ధనతో వేద ధర్ముడు వీటికి సమాధానాలు వివరించాడు. నాయనా, దీపకా! ఇదే విషయాన్ని పూర్వకాలంలో శ్రీశైల శిఖరం మీద మహర్షులడిగితే కుమారస్వామి వారికి వివరించాడు. అదంతా నీకు చెబుతాను - అంటూ ప్రారంభించాడు.


రేణుకా వృత్తాంతం


కృతయుగారంభంలో సృష్టి కర్త అయిన పితామహుడు అనేకోపాయాలతో ఈ జగత్ సృష్టి చేసాడు. దేవ - దైత్య - మనుష్య - పశు - పక్షి వృక్షాది జాతుల్ని వర్ణాశ్రమ ధర్మాలను సమస్తమూ వేద నిర్దిష్టమైన మార్గంలో సృజించాడు. ముల్లోకాలు హాయిగా ఉన్నాయి. అందరూ జ్ఞాన విజ్ఞాన పారంగులై తపోనిష్టులై కామ క్రోధ రాగ ద్వేష రహితులై శాంతి సౌఖ్యాలతో ప్రసన్నంగా కాలం గడుపుతున్నారు. బ్రహ్మదేవుడు గమనించాడు. ఇలాగైతే ఇక సృష్టి వృద్ధి చెందినట్టే - అనుకున్నాడు. ఆలోచించాడు. తమోగుణం, మోహం, మహామోహం, తామిశ్రం, అంధతామిశ్రం - అనే పంచ పర్వాలతో అవిద్యను సృష్టించి ప్రాణికోటిని సమ్మోహపరచడానికి లోకం మీదికి వదిలిపెట్టాడు. అతడు సృష్టించిన అవిద్య ముందుగా అతడినే ఆవరించింది. దాని మహిమతో వేదాలు మరిచిపోయాడు. ఎంత గింజుకున్నా ఒక్క మంత్రమూ గుర్తురావడం లేదు. కళ నళపడ్డాడు. భయపడ్డాడు. వెంటనే బయలుదేరి హంసవాహనం అధిరోహించి సహ్యపర్వతం చేరుకున్నాడు. ఒక ప్రశాంత రమణీయ స్థలంలో అమలకీ వనంలో (ఉసిరిక) కూర్చుని నిష్టాగరిష్టుడై రేణుకామాతను ధ్యానించాడు. ఆ తల్లి కరుణామయి. క్షణకాలంలో దర్శనమనుగ్రహించింది. చతుర్ముఖుడు ప్రణమిల్లి నిలిచి బహువిధాల స్తుతించాడు. మెల్లగా తన అవస్థను విన్నవించాడు.


Friday, 28 July 2023

శ్రీదత్త పురాణము (210)

 


స్వామిన్! దత్తదేవా! అరిందమా! నేను విష్ణువును కాను, మహాశూరుణ్ని కాను. ఇది నిజం. గురుదేవ-ద్విజులకు నేను శిష్యుణ్ని, వటువుని, సందేహం ఏమీ లేదు. దేవ ఋషి- పితృ తృప్తి కోసం ఏదో చెయ్యాలను కుంటున్నాను. దానికి నీ సహాయం కోరుతున్నాను. దయచేసి గురుస్థానం అంగీకరించు అంటూ ఒదిగి పరశురాముడు దత్తాత్రేయుడికి నమస్కరిస్తూ ప్రదక్షిణం చేశాడు. దత్తదేవుడు చిరునవ్వుతో అంగీకరించాడు.


ఆ రమ్యమైన సహ్యాచలమే యాగ భూమి అయ్యింది. ఋషులంతా ఆహుతులై విచ్చేశారు. ద్వారతోరణ పతాకాలంకారాలతో యాగ మంటపం సిద్ధమయ్యింది. వేదికలూ యజ్ఞ కుండాలూ శాస్త్రీయంగా రూపొందాయి. బ్రహ్మవేత్తలైన ఋత్విక్కులు. ఋజుభక్తి తాత్పర్యాలతో సమర్చితులై యజ్ఞాంగాలను అన్నింటినీ నిర్దుష్టంగా సంపూర్ణంగా నిర్వహించారు. దివ్యాభరణ వస్త్రాదులను బహుమతులుగా పొందారు. యజ్ఞశాలకు వచ్చిన ప్రతి విప్రుడికీ సువర్ణోపస్కురాలు దక్షిణలుగా అందాయి. అన్నపానాలు సమృద్ది చెప్పనవసరమే లేదు. అన్ని జాతుల వారికీ కావాలన్నదల్లా పుష్కలంగా అందింది. ఇలా రామయజ్ఞం సుసంపన్నం, సుసంపూర్ణం అయ్యింది. దేవ మానవ యక్ష కిన్నెర నాగరాక్షస చారణ సిద్ధ సాధక జాతులవారందరూ పితృదేవతలూ ధన - ఘన సన్మానాలతో సంతృప్తులయ్యారు. సోమంతో ఇంద్రుడూ, భూరి దక్షిణలతో భూసురులూ, అన్న పాన వస్త్రాదులతో దీనులూ పరితుష్టి చెందారు. ప్రధాన ఋత్విక్కుగా అన్నీ నడిపించిన కాశ్యపుడికి చాతర్ హోత్ర విధానంగా సంపూర్ణ క్షితి మండలాన్నే దక్షిణగా సమర్పించాడు భార్గవరాముడు. ఇరవై యొక్క మార్లు క్షత్రియ సంహారం చేసి భుజబలంతో తాను గెలుచుక్ను భూగోళమిది. కశ్యపుడికి దక్షిణ అయ్యింది.


ఆచార్యకత్వం నెరపిన దత్తస్వామిని రత్నాభరణాలతో దివ్య వస్త్రాలతో సత్కరించి ఆర్చించాడు. రాముడిచ్చిన వాటిని అన్నింటినీ దత్తదేవుడు అక్కడున్న మునులకూ, బ్రాహ్మణులకూ నమస్కరించి మరీ సమర్పించాడు. కాశ్యపుడు భార్గవరాముని అనుమతి తీసుకొని తన క్షితి మండలాన్ని విప్రులందరికీ పంచిపెట్టాడు. దీనికి పరశురాముడు చాలా సంబరపడ్డాడు. కాశ్యపా! నీ వంటి జ్ఞానులు చెయ్యవలసిన పనిని చేశావు. ముండిత శిరస్కుడై, దిగంబరుడై మన మధ్య నడయాడుత్ను ఈ యోగివర్యుడు దత్తాత్రేయుడు స్వయంగా సాక్షాత్తు శ్రీ మన్నారాయణుడు. సందేహం లేదు. ఇంత సుదుష్కరమైన ఈ మహాయజ్ఞం ఇంత తేలికగా ఒక లీలగా పరిసమాప్తమయ్యింది అంటే కేవలం ఇది వీరి అనుగ్రహమే, శ్రీ దేవీ కరుణా కటాక్షమే - అని తన భక్తి భావాన్ని ప్రకటించి కాశ్యపునికి దత్త దేవునికీ మరొకసారి నమస్కరించి రేణుకామాతను మనస్సులోనే ధ్యానించి సురసిద్ద మునీంద్ర దేవ బ్రాహ్మణులందరికీ ఇంకొక పర్యాయం కృతజ్ఞతగా శిరసువంచి అభివాదం చేస్తూ అందరి దగ్గరా సెలవు తీసుకొని భార్గవరాముడు మహేంద్ర పర్వత శిఖరాగ్రాన తపస్సుకి వెళ్ళిపోయాడు.


Thursday, 27 July 2023

శ్రీదత్త పురాణము (209)

 


అటు పైని బ్రాహ్మణులను అర్చించి మహదాశీర్వచనం తీసుకున్నాక పరశురాముడు స్వయంగా దత్తాత్రేయుణ్ని పాదాభివందన పురస్సరంగా పూజించాడు. దత్తదేవుడి అనుమతి పొంది అమలకీ వనం నుంచి బయలుదేరాడు. తన ప్రతిజ్ఞను తీర్చుకోడానికి భూమండలం మీద విరుచుకుపడ్డాడు. పొడి తప్పిన క్షత్రియులందర్నీ ముయ్యేడు మార్లు గాలించి రాసాడి రాపాడి ప్రతిన నెరవేర్చుకున్నాడు. భూమిని క్షత్రియరహితం చేసేశాడు. గతమత్సరుడై అదే జలం తీసుకొని దత్తాశ్రమానికి వెళ్ళాడు. అక్కడ తన ఆయుధాలను ప్రక్షాళించి ఆయుధాధి దేవతలను అర్చించాడు. దత్తాత్రేయుడికి నమస్కరించాడు. అంతలో తల్లితండ్రులు దివ్యదర్శనం అనుగ్రహించారు. సకల క్షత్రియాంతకా! నీ సాహసానికీ శౌర్య పరాక్రమాలకూ సంతృప్తి చెందాను. ఇక ప్రతీకారాగ్నిని శాంతింపజేసుకో. హింసా ప్రవృత్తివల్ల మూటగట్టుకున్న మహాపాపం తొలగించుకోవడంకోసం మహాయజ్ఞాలు చెయ్యి వాటితో శుద్ధి పొందుతావు- అని తండ్రి జమదగ్ని ఆజ్ఞాపించాడు. నాయనా! బ్రహ్మచారిని గదా ధర్మపత్ని తోడు లేకుండా యజ్ఞాలు ఎలా చేస్తానని సంశయించకు. దత్తాత్రేయుణ్ని గురువుగా అభ్యర్ధించు. కాశ్యపుణ్ని ప్రధాన ఋత్విక్కుగా వరించు. బంగారపు ప్రతిమను భార్యగా చెంత ఉంచుకో. యజ్ఞాలు చెయ్యి - అని తల్లి రేణుక ఉపాయం చెప్పింది.


ఇలా ఆజ్ఞాపించిన తల్లిదండ్రులిద్దరికీ సభక్తికంగా నమస్కరించి వీడ్కోలు పలికాడు. సహ్యాద్రి ఆమలకవనంలోని ఏక వీరాశ్రమ పదంలో ఇది జరిగింది. ఫలపుష్పభరితాలైన తరులతా గుల్మాలతో పక్షుల కిలకిల రావాలతో నానామృగ గణాకీర్ణమై దివ్యనదీ పరీవాహక ప్రాంతమై అన్నిటికీ మించి దత్తాత్రేయ సంరక్షితమైన ఆ ప్రదేశం తపస్సులకే కాదు యజ్ఞయాగాదులకూ అనువైన స్థలం. ఆ ఆశ్రమంలో ఒక రమ్యమైన పర్ణశాల ఉంది. పరశురాముడు అందులోకి ప్రవేశించాడు. అది దత్తాత్రేయుడి పర్ణశాల. సురసిద్ధ సాధ్య మునీశ్వర సేవితుడై దత్తదేవుడు కొలువుతీరి ఉన్నాడు. పరశురాముడు వినయవిధేయతలతో సాష్టాంగ నమస్కారం చేశాడు. భక్తితో మౌనంగా స్తుతించాడు. అప్పుడు దత్తాత్రేయుడు ఆనందతుందిలుడై పరశురాముణ్ని ఆప్యాయంగా దగ్గరకు పిలిచి తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. మృదువుగా సంభాషించాడు.


నాయనా, భార్గవరామా! నువ్వు చాలా కష్టసాధ్యమైన ఘనకార్యాలు చేశావు. కార్తవీర్యార్జునుడంతటి వాణ్ని అనాయాసంగా బాహు పరాక్రమంతో మట్టుబెట్టావు. దైత్య రాక్షస వీరులెందర్నో సంహరించావు. క్రూర కర్ములూ అధార్మికులూ అయిన దుర్జయ క్షత్రియ మహావీరులందరినీ ముయ్యేడు మార్లు ఏరి ఏరి మట్టి కరిపించావు. ఇంతలేసి ఘనకార్యాలు సాధించావంటే శిశూ! నువ్వు సాధారణ శూరుడవో బ్రాహ్మణుడవో కావని నా అభిప్రాయం. ఈ లోకంలో ఈ రూపంలో సంచరిస్తున్న స్వయం శ్రీమహావిష్ణుడవని నా నమ్మకం.


Wednesday, 26 July 2023

శ్రీదత్త పురాణము (208)

 


"ఓయీ పరశురామా! దత్తాత్రేయునితో కలిసి మంత్ర పూర్వకంగా విధి విధానంగా మీ తండ్రికి అంతిమ సంస్కారాలు శ్రద్ధగా నిర్వహించు" ఇది వినడంతోనే పరశురాముడు నాలుగువైపులకూ తేరిపార చూశాడు. కందమూల ఫల సమృద్ధితో పచ్చగా ప్రశాంతంగా ఉన్న ఆశ్రమంలో తామున్నట్టు గుర్తించాడు. కావిడి దింపుకున్నాడు. దృష్టి ముందుకు సారించాడు. గుబురుగా ఉన్న చెట్ల మాటున ఎవరో ఉన్నట్టనిపించి అటు నాలుగు అడుగులు వేశాడు. ఒక దిగంబర మహర్షి పానపాత్రను చేతబట్టి కనిపించాడు. రాముడు సభక్తికంగా నమస్కరించాడు. కన్న తండ్రి అంత్యక్రియలు దగ్గరుండి జరిపించమని ప్రార్ధించాడు. ఏమిటి? నేను జరిపించాలి? నాకు విధివిధానములు, ధర్మాధర్మములు తెలియవు. ఏదో నాకు తోచిన దారిలో నేను పోతున్నాను. నాలాగే నీకు తోచిన దారిలో నువ్వు వెళ్ళు అన్నాడు దత్తస్వామి.


స్వామిన్ ! నీకు ధర్మాధర్మాలు తెలియవంటే నేనెలా నమ్ముతాను. సకల దేవతలకూ సకల మునులకూ నువ్వు పరమ గురువువి. జగత్ప్రసిద్ధుడివి. యోగీశ్వరుడివి నువ్వే సంశయం లేదు.

జమదగ్ని పాదాలకు నమస్కరించి పరశురాముని వైపు చూశాడు. రామా! శుభప్రదాలైన సర్వతీర్ధ క్షేత్రాలలో స్నానం చేసిరా. నేను చెప్పినట్టు సంస్కారం చేద్దువు గాని - అని ఆజ్ఞాపించాడు. రాముడు వెంటనే ధనస్సు సంధించి దివ్యబాణం ఎక్కుపెట్టి సహ్యాద్రిని గురిచూసి వదిలాడు. ఆ బాణ రంధ్రం నుంచి భుక్తిముక్తి ప్రదాలైన సకల పుణ్య నదీ తీరాలూ క్రమంగా ఆవిర్భవించాయి.


ఇలా తన దివ్యబాణ శక్తితో రప్పించుకొన్న పవిత్రనదీ తీర్ధజలాలలో పరశురాముడు స్నానం చేసి తండ్రి కళేబరానికి ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించి అగ్నిని ఉజ్వలంగా ప్రజ్వలింపజేసి దహన సంస్కారం జరిపాడు - జగన్మాతయైన రేణుక సర్వాభరణ భూషితయై నిలిచి దత్తాత్రేయా! పతివెంట నేను కూడా స్వస్థానానికి వెడదామనుకుంటున్నాను అని చెప్పి, నాయనా, భార్గవరామా! గురుదేవ, ద్విజులను రక్షించు నీ ప్రతిజ్ఞ నెరవేర్చుకో అని ఆజ్ఞాపించి, ఆ జగదంబిక తన పతిదేవుడి చితిలో సాంజలి బంధంగా ప్రవేశించింది. మరుక్షణాన భార్యా భర్తలిద్దరూ దేదీప్యమాన దివ్యరూపులై ఆనందమూర్తులై విను వీధిలో నిలిచారు. దత్తాత్రేయ, పరుశురాములిద్దరూ ఆ దంపతుల్ని చూసి సంబరపడుతూ శిరసువంచి నమస్కరించారు. భక్తిశ్రద్ధలతో పూజలు చేసి వీడ్కోలు పలికారు.


Tuesday, 25 July 2023

అడవిలో కంద మూలాలు సేకరిస్తున్న పరశురాముడికి అపశకునాలు కనిపించాయి. మనస్సు కీడును శంకించింది. త్వరత్వరగా పర్ణశాలకు వచ్చాడు. జరిగిన ఘోరం కళ్ళారాచూసాడు. తండ్రిని తలుచుకొని దుఃఖపడ్డాడు. ఇటువంటి మరణం సంక్రమించినందుకు బాధ పడ్డాడు. కన్నతల్లిని చూస్తే కడుపు తరుక్కుపోయింది. చిట్టి పొట్టి తమ్ముళ్ళు భయభ్రాంతులై వొణికి పోతూ బిక్కుబిక్కుమని తన వైపే చూస్తున్నారు. అందరిని ఒక్కసారిగా పట్టుకొని బావురుమన్నాడు పరశురాముడు. అమ్మా! నా కారణంగానే ఈ దారుణం జరిగింది. నేనే - నేనే బాధ్యణ్ణి అనుకుంటూ తలబాదుకుంటూ తల్లి పాదాల మీద పడ్డాడు. కుమిలిపోతున్న తల్లితో సమానంగా రోదించాడు. రెండు క్షణాల్లో తెప్పరిల్లాడు. చివాలున లేచి నిలబడ్డాడు. ఎర్రబారిన కళ్ళల్లో నీళ్ళు నిండుకొని విప్పారి ఒక్కక్షణంలో ప్రళయ కాలరుద్రుడిగా మారిపోయాడు. అశక్తుడిలా నేను నిలపించడం ఏమిటి? కర్తవ్యాన్ని విస్మరించడం ఏమిటి అని తనకు తాను ప్రబోధించుకున్నాడు. ధనుర్భాణాలూ గండ్రగొడ్డలీ ధరించాడు. సోదరులూ ఆశ్రమవాసులు వారిస్తున్నా లెక్క చెయ్య లేదు. ఎవరి మాటా వినిపించుకోలేదు. రాజధాని వైపు సుడి గాలిలా దూసుకు వెళ్ళాడు. కార్తవీర్యార్జునుని కొడుకులందర్ని ఊచకోత కోసేసాడు. అంతే వేగంగా ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. వస్తూనే ఆశ్రమవాసులందరూ వినేట్లుగా జలదభీషణంగా భీకర ప్రతిజ్ఞ చేసాడు. ఈ భూమిని క్షత్రియ శూన్యం చేస్తాను. ఒక్క సారికాదు ఇరవై ఒక్క మార్లు చేస్తాను. ఇందులో అసత్యం గానీ అధర్మం గానీ లేదు - అని ఒక్క పెట్టున దిక్కులు పిక్కటిల్లేలాగా భూగోళంలోని క్షత్రియులందరికీ టముకు వేసినట్లుగా ధనుష్టంకారం చేసాడు. నాయనా! నీ ప్రతిజ్ఞలూ ప్రతీకారాలు తరువాత. ముందు నీ తండ్రికి భక్తితో అంత్యక్రియలు జరిపించు. మాకు జరగవలసిన సంస్కారాల సంగతి చూడు. నన్నొక వైపూ మీ తండ్రి శరీరం మరొక వైపూ కావిడికి ఎత్తుకుని బయలుదేరు - ఆగు - ఆగు - అనే మాట వినిపించిన చోట దింపు. సర్వ శాస్త్ర విశారదుడైన ఆచార్యుడు చెప్పినట్లు మాకిద్దరకూ ఉచిత సంస్కారములు జరిపించు. రేణుకాదేవి ఆజ్ఞతో ఆ వీరావేశం నుంచి స్పృహలోకి వచ్చాడు పరశురాముడు. తల్లి చెప్పినట్లే ఇద్దరినీ కావిడకు ఎత్తుకొని తమ కావ్యకుబ్జాశ్రమం నుంచి బయలుదేరాడు. అతడితో పాటు ఆశ్రమవాసులైన మహర్షులూ బయలుదేరారు. వడివడిగా నడుచుకుంటూ తీర్థాలూ, తాపసాశ్రమాలూ, వనాలూ, అరణ్యాలూ, పర్వతాలూ, నదులూ అన్నీ దాటుకుంటూ ప్రయాణం సాగిస్తున్నారు. సహ్య పర్వతం చేరుకున్నారు. ఆమలకీ తరుమండితమై దత్తాత్రేయుల వారి ఆశ్రమం కనిపించింది. అదే సమయానికి అశరీరవాణి వినిపించింది.

 


అడవిలో కంద మూలాలు సేకరిస్తున్న పరశురాముడికి అపశకునాలు కనిపించాయి. మనస్సు కీడును శంకించింది. త్వరత్వరగా పర్ణశాలకు వచ్చాడు. జరిగిన ఘోరం కళ్ళారాచూసాడు. తండ్రిని తలుచుకొని దుఃఖపడ్డాడు. ఇటువంటి మరణం సంక్రమించినందుకు బాధ పడ్డాడు. కన్నతల్లిని చూస్తే కడుపు తరుక్కుపోయింది. చిట్టి పొట్టి తమ్ముళ్ళు భయభ్రాంతులై వొణికి పోతూ బిక్కుబిక్కుమని తన వైపే చూస్తున్నారు. అందరిని ఒక్కసారిగా పట్టుకొని బావురుమన్నాడు పరశురాముడు. అమ్మా! నా కారణంగానే ఈ దారుణం జరిగింది. నేనే - నేనే బాధ్యణ్ణి అనుకుంటూ తలబాదుకుంటూ తల్లి పాదాల మీద పడ్డాడు. కుమిలిపోతున్న తల్లితో సమానంగా రోదించాడు. రెండు క్షణాల్లో తెప్పరిల్లాడు. చివాలున లేచి నిలబడ్డాడు. ఎర్రబారిన కళ్ళల్లో నీళ్ళు నిండుకొని విప్పారి ఒక్కక్షణంలో ప్రళయ కాలరుద్రుడిగా మారిపోయాడు. అశక్తుడిలా నేను నిలపించడం ఏమిటి? కర్తవ్యాన్ని విస్మరించడం ఏమిటి అని తనకు తాను ప్రబోధించుకున్నాడు.


ధనుర్భాణాలూ గండ్రగొడ్డలీ ధరించాడు. సోదరులూ ఆశ్రమవాసులు వారిస్తున్నా లెక్క చెయ్య లేదు. ఎవరి మాటా వినిపించుకోలేదు. రాజధాని వైపు సుడి గాలిలా దూసుకు వెళ్ళాడు. కార్తవీర్యార్జునుని కొడుకులందర్ని ఊచకోత కోసేసాడు. అంతే వేగంగా ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. వస్తూనే ఆశ్రమవాసులందరూ వినేట్లుగా జలదభీషణంగా భీకర ప్రతిజ్ఞ చేసాడు. ఈ భూమిని క్షత్రియ శూన్యం చేస్తాను. ఒక్క సారికాదు ఇరవై ఒక్క మార్లు చేస్తాను. ఇందులో అసత్యం గానీ అధర్మం గానీ లేదు - అని ఒక్క పెట్టున దిక్కులు పిక్కటిల్లేలాగా భూగోళంలోని క్షత్రియులందరికీ టముకు వేసినట్లుగా ధనుష్టంకారం చేసాడు.


నాయనా! నీ ప్రతిజ్ఞలూ ప్రతీకారాలు తరువాత. ముందు నీ తండ్రికి భక్తితో అంత్యక్రియలు జరిపించు. మాకు జరగవలసిన సంస్కారాల సంగతి చూడు. నన్నొక వైపూ మీ తండ్రి శరీరం మరొక వైపూ కావిడికి ఎత్తుకుని బయలుదేరు - ఆగు - ఆగు - అనే మాట వినిపించిన చోట దింపు. సర్వ శాస్త్ర విశారదుడైన ఆచార్యుడు చెప్పినట్లు మాకిద్దరకూ ఉచిత సంస్కారములు జరిపించు.


రేణుకాదేవి ఆజ్ఞతో ఆ వీరావేశం నుంచి స్పృహలోకి వచ్చాడు పరశురాముడు. తల్లి చెప్పినట్లే ఇద్దరినీ కావిడకు ఎత్తుకొని తమ కావ్యకుబ్జాశ్రమం నుంచి బయలుదేరాడు. అతడితో పాటు ఆశ్రమవాసులైన మహర్షులూ బయలుదేరారు. వడివడిగా నడుచుకుంటూ తీర్థాలూ, తాపసాశ్రమాలూ, వనాలూ, అరణ్యాలూ, పర్వతాలూ, నదులూ అన్నీ దాటుకుంటూ ప్రయాణం సాగిస్తున్నారు. సహ్య పర్వతం చేరుకున్నారు. ఆమలకీ తరుమండితమై దత్తాత్రేయుల వారి ఆశ్రమం కనిపించింది. అదే సమయానికి అశరీరవాణి వినిపించింది.