Sunday, 31 March 2024

శ్రీ గరుడ పురాణము (136)

 


హే వృషభధ్వజా! శుక్రవారంతో భరణి, సోమవారంతో చిత్ర, మంగళవారంతో ఉత్తరాషాఢ, బుధవారంతో ధనిష్ట, బృహస్పతితో శతభిష (అంటే గురువారంతో) శుక్రవారంతో రోహిణి, శనివారంతో రేవతి కలిసొచ్చే కాలాలు మానవులకు కలిసొచ్చే కాలాలు ఏ మాత్రమూ కావు. వీటికి విషయోగాలని పేరు. అవి దుష్కాలాలు.


పుష్య, పునర్వసు, రేవతి, చిత్ర, శ్రవణ ధనిష్ట, హస్త, అశ్వని, మృగశిర, శతభిష నక్షత్రాలు దుర్యోగాలను తప్పిస్తే సామాన్యంగా మంచివి. ఈ నక్షత్రాలలో జాతకర్మాది సంస్కారాలు చేయడం ఉత్తమం.


విశాఖ ఉత్తరఫల్గునీ, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర, మఖ, ఆర్ద్ర, భరణి, ఆశ్లేష, కృత్తిక నక్షత్రాలు యాత్రలు చేయడానికి మంచివి కావు. మృత్యుభయముంటుంది.


(అధ్యాయం -59)


గ్రహదశ, యాత్రాశకున, సూర్యచక్రాది నిరూపణం

 

( పురాణంలో ఈయబడిన గ్రహాల మహాదశల యోగ్య సమయం, వాటి క్రమం పరాశర మహర్షి ద్వారా నిర్దిష్టమైన వింశోత్తరీ మహాదశతో అక్కడక్కడ ఏకీభవించడంలేదు. ఇందులో కేతుదశ కూడా కనబడుటలేదు)

 

మహేశాదులారా! ఇపుడు గ్రహాల మహా దశలను వర్ణిస్తాను. సూర్యుని దశ ఆరేళ్ళు, చంద్రునిది పదిహేను, మంగళునిది ఎనిమిది, బుధునిది పదిహేడు, శనిది పది, గురువుది పందొమ్మిది, రాహువుది పన్నెండు, శుక్రునిది ఇరవై ఒక్కటి.

 

సూర్యదశ (అనగా ఒక వ్యక్తి జీవితంపై సూర్యగ్రహాధిపత్యం కొనసాగే కాలం) దుఃఖములనే ఎక్కువగా కలిగిస్తుంది. ఉద్వేగాలను రేకెత్తిస్తుంది. రాజుని నాశనం దాకా తీసుకుపోతుంది.


Saturday, 30 March 2024

శ్రీ గరుడ పురాణము (135)

 


కృష్ణపాడ్యమి, బుధవారంనాడు పడిన విదియ శుభదినాలు. మంగళునితో కలిసిన తదియ, శనితో కలిసిన చవితి, గురువారం నాడు పడిన పంచమి, శుక్రవారం షష్టి, షష్టి మంగళగ్రహం కలిసి పడిన రోజులు మంచి రోజులు. అలాగే బుధవారం సప్తమి, మంగళ లేదా ఆదివారాల్లో అష్టమి, సోమవారం నవమి, గురువారం దశమి కలసి వచ్చిన రోజులు శుభదినాలు. ఏకాదశి రోజున గురు లేదా శుక్రవారాలు, బుధవారం ద్వాదశి, శుక్ర మంగళవారాల్లో త్రయోదశి, శనివారం చతుర్దశి, గురువారం నాడు పడిన అమావాస్య పున్నమి రోజులు కూడా శుభప్రదాలే.


ద్వాదశి - ఆదివారం, ఏకాదశి సోమవారం, దశమి మంగళవారం, నవమి - బుధవారం, అష్టమి - గురువారం, సప్తమి - శుక్రవారం, షష్టి - శనివారం యోగించిన వాటిని దగ్ధ దినాలంటారు. ఇటువంటి తిథి - దగ్ధ యోగ సమయాల్లో యాత్రల వంటి శుభకార్యాలను మొదలెట్టకూడదు. పాడ్యమి, నవమి, చతుర్దశి అష్టమి తిథులు బుధవారం నాడు పడితే మరీ ప్రమాదం. ఆ రోజుల్లో పక్క వూరికి కూడా బయలుదేరే ఆలోచనే చేయరాదు.


మేష-కర్కాటక సంక్రాంతి అష్టమితో గాని, కన్య-మిథున సంక్రాంతి అష్టమితో, వృష కుంభ సంక్రాంతి చవితితో, మకర తుల సంక్రాంతి ద్వాదశితో, వృశ్చిక సింహ సంక్రాంతి ద్వాదశితో, వృశ్చిక సింహ సంక్రాంతి దశమితో, ధను- మీన సంక్రాంతి చతుర్దశితో కలసి పడిన రోజులు మహాదగ్ధ దినాలు. ఇవి కష్టదాయకాలు. ఈ తిథుల్లో నూతన ప్రయత్నాలు చేయరాదు.


మహాదేవాదులారా! రవివారంతో విశాఖ, అనురాధతో జ్యేష్టతిథి, సోమవారంతో పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణ నక్షత్రాలు, మంగళవారంతో ధనిష్ఠ, శతభిష, పూర్వాభాద్రలు, బుధవారంతో రేవతి, అశ్వని, భరణులు, గురువారంతో రోహిణి, మృగశిర, ఆర్ద్రలు, శుక్రవారంతో పుష్య, ఆశ్లేష ముఖలూ, శనివారంతో ఉత్తరఫల్గుని, హస్త, చిత్రలూ యోగిస్తే ఆ దుర్యోగం ఉత్పాతాలను కలిగిస్తుంది. ఆయా కాలాల్లో యాత్రాదికార్యాలు ప్రారంభిస్తే ఉత్పాతాలు, మృత్యువు రోగాలు సంభవించవచ్చును.


ఆదివారంతో మూల, సోమవారముతో శ్రవణ, మంగళవారంతో ఉత్తరాభాద్ర, బుధవారంతో కృత్తిక, గురువారంతో పునర్వసు, శుక్రవారంతో పూర్వఫల్గుని, శనివారంతో స్వాతి కలిసొస్తే మాత్రం అది అద్భుత శుభయోగం. దాన్ని అమృత యోగమంటారు. ఆ రోజుల్లో చేపట్టే కార్యాలన్నీ సిద్ధిని పొందుతాయి.


విష్కంభయోగం అయిదు గడియలూ (120 నిముషాలు) శూలయోగం ఏడు గడియలూ, గండ, అతి గండయోగాల్లో ఆరేసి గడియలూ, వ్యాఘాత, వజ్ర యోగాల్లో తొమ్మిదేసి గడియలూ, వ్యతీపాత, వైదృతి, పరిఘ యోగాల్లో పూర్తికాలమూ మృత్యుతుల్యములు. మిక్కిలి కష్టదాయకములు. సర్వకర్మలనూ పరిత్యజించవలసిన సమయాలివి.


ఆదివారంతో హస్త, గురువారంతో పుష్య, బుధవారంతో అనురాధా నక్షత్రాలు, శనివారంతో రోహిణి, సోమవారంతో మృగశిర, శుక్రవారంతో రేవతి, మంగళవారంతో అశ్వని, యోగించినవి ఉత్తమ, శుభదినాలు. ఈ దినాలలో చేసే పనులకు సిద్ధియోగమూ, పాపనాశనమూ కూడా వుంటాయి. ఇవి సర్వదోషహరములు.


Friday, 29 March 2024

శ్రీ గరుడ పురాణము (134)

 


అశ్వని, అనురాధ, రేవతి, మృగశిర, మూల, పునర్వసు, పుష్య, హస్త, జ్యేష్ఠ నక్షత్రాలున్న సమయాలు యాత్రకు ప్రశస్తాలు.


హస్త, చిత్ర, స్వాతి, విశాఖ, అనురాధ నక్షత్రాలు నిత్యంగానూ, ఉత్తర ఫాల్గుని, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర అశ్వని, రోహిణి, పుష్యమి, ధనిష్ఠ, పునర్వసు నక్షత్రాలు సామాన్యంగానూ నవీన వస్త్రధారణకు శ్రేష్ఠములు.


కృత్తిక, భరణి, ఆశ్లేష, మఘ, మూల, విశాఖ, పూర్వాభాద్ర, పూర్వాషాఢ, పూర్వఫల్గునీ నక్షత్రాలను అధోముఖీ నక్షత్రాలంటారు. ఈ నక్షత్రాల్లో వాపీకూప తటాకాలనూ, సరోవరాలనూ, దేవాలయాదుల నిర్మాణంలో పునాదులనూ తవ్వించుట మొదలుపెట్టాలి. అలాగే భూమిలో దాగియున్న స్వర్ణాది లోహాలకూ, ఖనిజాలకూ పాతిపెట్టబడిన నిధులకూ భూమిని త్రవ్వడానికి ఈ నక్షత్రాలు బహు ప్రశస్తమైనవి.


రేవతి, అశ్వని, చిత్ర, స్వాతి, హస్త, పునర్వసు, అనురాధ, మృగశిర, జ్యేష్ఠా నక్షత్రాలను పార్శ్వముఖి నక్షత్రాలంటారు. ఈ నక్షత్రాలున్నపుడే ఏనుగు, ఒంటె, గుఱ్ఱం, ఎద్దు వంటి పశువులను వశపఱచుకొనే ప్రయత్నం చేయాలి. అంటే తాళ్ళు కట్టుట, జీను వేయుట, మచ్చిక వంటివి చేయాలి.


పైన చెప్పబడిన పార్శ్వముఖి నక్షత్రాలలోనే పొలాలలో విత్తులు నాటడం, రాకపోకలు, చక్ర యంత్రాలు, రథాలు, నౌకాదుల క్రయాలు, నిర్మాణ ప్రారంభాలూ చేయడం శుభకరం.

రోహిణి, ఆర్ద్ర, పుష్య, ధనిష్ఠ, ఉత్తరఫల్గుని, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర, శతభిష (వారుణ) శ్రవణ ఈ తొమ్మిది నక్షత్రాలనూ ఊర్ధ్వముఖీ నక్షత్రాలంటారు. వీటిలో రాజ్యాభిషేకం, అధికార స్వీకరణం వంటి కార్యాలనుచేయాలి. అభ్యుదయ ప్రదాయకములైన కార్యాలను చేపట్టాలి.


చవితి, షష్ఠి, అష్టమి, నవమి, ద్వాదశి, చతుర్దశి, అమావాస్య, పున్నమి తిథులు అశుభకారకాలు. ఈ తిథులలో శుభకార్యాలను చేయరాదు.


Thursday, 28 March 2024

శ్రీ గరుడ పురాణము (133)

 


ఇక ఏయే తిథులలో ఏయే దిశలలో ఏయే యోగినులుంటారో వినండి.


తిథులు - యోగిని పేరు - దిశ


పాడ్యమి, నవమి - బ్రహ్మాణి - తూర్పు

విదియ, దశమి - మాహేశ్వరి - ఉత్తరం

పంచమి, త్రయోదశి - వారాహి - దక్షిణం

షష్టి, చతుర్దశి - ఇంద్రాణి - పశ్చిమం

సప్తమి, పున్నమి - చాముండ - వాయవ్యం

అష్టమి, అమావాస్య - మహాలక్ష్మి ఈశాన్యం

ఏకాదశి, తదియ - వైష్ణవి - ఆగ్నేయం

ద్వాదశి, చవితి - కౌమారి – నైరృత్యం

యోగిని నెదురుగా పెట్టుకొని యాత్రచేయరాదు. అనగా ఉదాహరణకి, దశమినాడు బయలుదేరేవారు ఉత్తరంలో లేదా ఉత్తరం వైపు బయలుదేరకూడదు. అంటే మాహేశ్వరి తప్ప మిగతా యోగినులున్న వైపు వెళ్ళవచ్చును.


Wednesday, 27 March 2024

శ్రీ గరుడ పురాణము (132)


 

జ్యోతిశ్చక్రంలో వర్ణింపబడే నక్షత్రాలు, వాటి దేవతలు, శుభాశుభ యోగాలు, ముహూర్తాల వర్ణన


ముందుగా నక్షత్రాల కుండే దేవతల పేర్లను తెలుసుకుందాం.


కృత్తిక - అగ్ని

రోహిణి - బ్రహ్మ

మృగశిర - చంద్రుడు

ఆర్ధ్ర - రుద్రుడు

పునర్వసు - ఆదిత్య

పుష్య - తిష్యుడు

ఆశ్లేష - సర్పుడు

మఘ - పితృగణాలు

పూర్వఫల్గుని - భగుడు

ఉత్తరఫల్గుని - అర్యముడు

హస్త - సవిత

చిత్ర - త్వష్ట

స్వాతి - వాయువు

విశాఖ - ఇంద్రాగ్నులు

అనురాధ - మిత్రుడు

జ్యేష్ఠ - ఇంద్రుడు

మూల - నిరృతి

పూర్వాషాఢ - శివుడు

ఉత్తరాషాఢ - విశ్వేదేవులు

అభిజిత్ - బ్రహ్మ

శ్రావణ - విష్ణు

ధనిష్ఠ - వసువులు

శతభిష - వరుణుడు

పూర్వాభాద్ర - అజపాదుడు

ఉత్తరాభాద్ర - అహిర్బుధ్ని

రేవతి - పూష

అశ్వని - అశ్వనీకుమారులు

భరణి - యమధర్మరాజు


Tuesday, 26 March 2024

శ్రీ గరుడ పురాణము (131)

 


విష్ణుశక్తి వల్ల తేజోమయులైన మహామునులు సూర్యమండలానికెదురుగా వుండి ఆయనను స్తుతిస్తుంటారు. గంధర్వులాయన యశోగానాన్ని కావిస్తుంటారు. అప్సరలు నర్తిస్తుంటారు. వాలఖిల్యులను పేరు గల మునులు, యక్షరాక్షస నాగ ప్రతినిధులూ రథమును పరివేష్టించి వుండి అవసరమైన మేరకు రక్షణ కలిపించే ఉద్దేశ్యంతో వుంటారు.


చంద్రరథానికి మూడు చక్రాలుంటాయి. గుఱ్ఱాలు కుంద పుష్పం రంగులో తెల్లగా వుంటాయి. వాటి సంఖ్య పది. చంద్రపుత్రుడైన బుధుని రథం నీరూ, నిప్పు కలిపిన ద్రవ్యంతో తయారు చేయబడుతుంది. గోధుమరంగులో వుండి వాయువేగంతో పోగలిగిన ఎనిమిది గుఱ్ఱాలుంటాయి.


శుక్రుని మహారథం సైన్య బలయుక్తమై, అనుకర్ణ (రథం కింద బలానికై పెట్టు మిక్కిలి దృఢమైన నిలువు, అడ్డకర్రలు) తో, ఎత్తయిన శిఖరంతో పతాకంతో, మిక్కిలి బలము, వేగము గల అశ్వాలతో శోభిస్తుంటుంది.


భూమి పుత్రుడైన మంగళుని రథం అగ్నిజ్వాలల్లోంచి అప్పుడే బయటికి తీసిన బంగారం రంగులో మెరిసిపోతుంటుంది. అగ్ని సంభవాలైన ఎనిమిది గుఱ్ఱాలుంటాయి. వాటి రంగు పద్మరాగమణుల అరుణ వర్ణం బృహస్పతి స్వర్ణరథంపై ఏడు పాండుర వర్ణం (తెలుపు పసుపు కలిసిన) లో ప్రకాశిస్తున్న గుఱ్ఱాలను పూన్చి ప్రయాణిస్తూ ఏడాదికొక రాశిలో నివసిస్తూ వుంటాడు.


శనిదేవుడు ఆకాశంలో పుట్టిన అనేక వర్ణములు గల అశ్వాలులాగే రథంపై తిరుగుతాడు. చాలా మెల్లగా కదులుతూ మందగామి అనే పేరును సార్థకం చేసుకుంటాడు.


రాహువు రథాశ్వాలు ఎనిమిది. ఇవి ధూసరవర్ణంలో అంటే పాండుర వర్ణంలో పసుపు కాస్త తక్కువగా కలిసిన రంగులో వుంటాయి. అవి ఒకమారు కదిలాక ఆగవు.


కేతువు రథానికుండే ఎనిమిది గుఱ్ఱాలూ లాక్షారసం వలె అరుణకాంతులను వెదజల్లుతుంటాయి. వీటి వేగం వాయువేగాన్ని మించి వుంటుంది.


ఈ విధంగా విష్ణువు యొక్క విశ్వరూపంలో భాగమైన భూమ్యాకాశాలలో ఆయన ఆదేశం మేరకు ఈ రథాలలో పరిభ్రమిస్తూ నవగ్రహాలు మానవుల, దేవతల జాతకాలను మారుస్తూ తిరుగుతుంటాయి.


(అధ్యాయం - 58)


Monday, 25 March 2024

శ్రీ గరుడ పురాణము (130)

 


రౌరవ, సూకర, రోధ, తాళ, విశసన, మహాజ్వాల, తప్తకుంభ, లవణ, విమోహిత, రుధిర, కృమిశ, కృమిభోజన, అసిపత్రవన, కృష్ణ నానాభక్ష (లాలాభక్ష), దారుణ, పూయవశ, పాపవహ్నిజ్వాల, అధఃశిర, సందంశ, కృష్ణసూత్ర, తమస్, అవీచి, శ్వభోజన, అప్రతిష్ట, ఉష్ణవీచి అనేవి విభిన్న నరకాల పేర్లు.


ఈ లోకాలన్నిటికీ పైన జల, అగ్ని, వాయు, ఆకాశలోకాలున్నాయి. ఇంతవఱకు చెప్పబడిన దానిని బ్రహ్మాండమంటారు. దీనికి బాగా పైన దీనికి పదింతల పరిమాణంలో మరొక లోకముంది. అందులో శ్రీమన్నారాయణుడుంటాడు. (అధ్యాయాలు 56,57)


నవగ్రహాల రథాలు


దేవతలారా! సూర్యదేవుని రథం వైశాల్యము తొమ్మిది వేల యోజనాలు. దాని ఈషా దండానికీ అంటే కాడికీ రథ మధ్యానికీ మధ్య వుండే దూరం రథ వైశాల్యానికి రెట్టింపు వున్నది. ఇరుసు ఒక కోటీ ఎనభై యేడు లక్షల యోజనాల పొడవు ఉంటుంది. ఆ ఇరుసుకి గల చక్రమొకటే. దానికి మూడు నాభులు (పూర్వ, మధ్య, అపర అన్జలు) అయిదు అరలు (పరివత్సరాదులు) ఆరునేములు (వసంతాది ఆరు ఋతువులు)


సంపూర్ణ కాలచక్రమే సూర్యదేవుని రథచక్రము. ఇరుసులలో రెండవది నలభై వేల యోజనాల పొడవుంటుంది. రథాక్షములు ఒక్కొక్కటీ అయిదున్నరవేల యోజనాల పొడవును కలిగియున్నవి. 


గాయత్రి, బృహతి, ఉష్టిక్, జగతి, త్రిష్టుప్, అనుష్టుప్, పంక్తి అనే ఏడు ఛందాలూ సూర్యభగవానుని సప్తాశ్వాలు.


సూర్యునికి పన్నెండు పేర్లు పన్నెండు తత్త్వాలు పన్నెండు ఆత్మలు. ఒక్కొక్క నెలలో ఒక్కొక్క నామంతో ఆయన రథంలో వుంటాడు. ఆ రథం వెనుకనొక అప్సర, ఒక మహాముని, ఒక యక్షుడు, ఒక నాగుడు, ఒక రాక్షసుడు, ఒక గంధర్వుడు వుంటారు. (అనుబంధం-8లో చూడండి).