Sunday, 30 June 2024

శ్రీ గరుడ పురాణము (221)

 


మూడేళ్ళకు సరిపడునంత బియ్యమును పండించి దాచగలిగినవాడు సోమరసపానానికి అర్హతను సంపాదించుకుంటాడు. ఒక్కయేడాది అన్నానికి సరిపడు బియ్యం లేదా ధాన్యమును దాచగలిగిన వారు ముఖ్యంగా సోమయాగం యొక్క ప్రాక్ క్రియను చేయవలసి వుంటుంది. అనగా సోమయాగానికి పూర్వం చేయవలసిన అగ్నిహోత్ర, దర్శపూర్ణమాస, ఆగ్రాయణ, చాతుర్మాస్యాది కర్మలను అనుష్ఠించాలి. ద్విజుడు ప్రతియేటా సోమయాగం, పశుయాగం, చాతుర్మాస్యయాగం, ఆగ్రాయణేష్ఠి (అనగా కొత్తగా ధాన్యపుగింజలు కనబడగానే చేయుయాగం) లను ప్రయత్న పూర్వకంగా శ్రద్ధగా చేయాలి. ప్రతియేటా చేయలేనివారు రెండుసంవత్సరాలలో ఒకమారు అదే వేళకు వైశ్వానరీ యిష్టిని చేయాలి.


ఆధ్యాత్మికంగా ఉన్నత శిఖరాలందుకొని మోక్ష ప్రాప్తిని కోరు బ్రాహ్మణుడు జీవించవలసిన విధానం వేరు. స్వాధ్యాయ విరోధియైన అర్థ సంపాదనం చేయరాదు. ఎవరి వద్దా ధనమును పుచ్చుకొనరాదు. చిన్న చిన్న పనులకూ వ్రతాలకూ ప్రతి ఫలాన్ని స్వీకరించరాదు. నృత్య గీతాదుల ద్వారా కూడా ధన సంపాదన చేయరాదు. శూద్రుని చేత యజ్ఞాన్ని చేయించి డబ్బును పుచ్చుకున్న బ్రాహ్మణుడు మరుజన్మలో చండాలునిగా పుడతాడు. యజ్ఞం కోసం తీసుకువచ్చిన అన్నాన్ని దానం చేసుకున్నవాడు కోడి, గ్రద్ధ, కాకి యోనుల్లో పుడతాడు.


ఆధ్యాత్మికాశయాలను కలిగి శరీరాన్ని ధర్మమోక్షాలకొక సాధనంగా వాడుకోదలచిన బ్రాహ్మణుడు రెండు మూడు రోజులకు సరిపడు బియ్యాన్ని మాత్రమే ఉంచుకోవాలి. మోక్ష సాధకునికి అన్నిటికంటె *శిలోంఛవృత్తి పరమ శ్రేష్ఠము. (* శిలవృత్తి అనగా పంట కోతలైనాక పొలములో మిగిలియున్న ధాన్యపు గింజల నేరుకొని వాటితోనే అన్నం వండుకొని కడుపు నింపుకొనుట. ఉంఛవృత్తి యనగా ధాన్యపు బస్తాలనుండి రహదారిపై రాలిన ఒక్కొక్క గింజ నేరుకొని తెచ్చుట. ఈ రెండిటినీ కలిపి శిలోంఛవృత్తి అని వ్యవహరిస్తారు.)


అతనిని గుర్తించి రాజుగానీ, శిష్యుడుగానీ, యజ్ఞాలను నిత్యకృత్యంగా చేయించే యజమానిగాని ముందుకివచ్చి పోషణ భారాన్ని వహిస్తే అంగీకరించవచ్చును అప్పుడయినా ప్రాణాన్ని నిలబెట్టుకోవడం కోసంమే తినాలిగాని భోగద్రవ్యాలను స్వీకరించుట తగదు.


Saturday, 29 June 2024

శ్రీ గరుడ పురాణము (220)

 


ద్విజులు అమృతతుల్యమైన భోజనాన్ని పాత్రలో ఆకుమూతపెట్టి వుంచినదాన్ని తినాలి. అతిథికోసం భోజనం ఎప్పుడూ కూడా ఎంత సాయంకాలమైనా సిద్ధంగావుండాలి. రోజులో ఎప్పుడైనా ఇంటికి వచ్చిన అతిథి అన్నంతినకుండా పోరాదు. బ్రహ్మచారులకూ సన్యాసులకూ (వారు లభిస్తే, వాళ్ళు దొరకడమే అదృష్టం) రోజూ భిక్షవేయాలి. స్నాతకులనూ, ఆచార్యులనీ, రాజునీ ప్రతియేటా పూజించాలి. అలాగే మిత్రులూ, అల్లుళ్ళూ, ఋత్విజులూ ప్రతి వర్షమూ ఆతిథ్య పూజలకు అర్హులు. బాటసారిని అతిథియనీ వేదపారంగతుని శ్రోత్రియుడనీ అంటారు. బ్రహ్మలోక ప్రాప్తిని కోరుకొనేవారు ఈ రెండు రకాల వారిని పూజించాలి.


ఎవరైనా మిక్కిలి వినయంగా, ఆదరంగా, గౌరవంతో ఆహ్వానిస్తేనే బ్రాహ్మణుడు, ఒకరియింటి పక్వాన్నాన్ని స్వీకరించాలి. గృహ మితంగా భుజించాలి. నోటిని అనవసరంగా వాడకూడదు. ఏ విషయంలోనూ అతిచాంచల్య చాపల్యాలు కూడదు. అతిథులను సగౌరవంగా ఊరిపొలిమేరదాకా దిగబెట్టి సముచితంగా వీడ్కోలు పలకాలి.


తనకు ఇష్టులైన మిత్రులతో విద్వత్సంపన్నులతో గోష్ఠులు సలుపుతుండాలి. సాయంకాలం మరల సంధ్యవార్చి అగ్నిహోత్రం పనిచూసుకొని భోంచేయాలి. భోజనం తరువాత బుద్ధిమంతులైన భృత్యులతో ఇంటి వ్యవహారాలనూ, రాబోయే కార్యాలనూ ముచ్చటించాలి.


వైశ్యులకూ, క్షత్రియులకూ కూడా యజ్ఞానుష్ఠానమూ, అధ్యయనమూ, దానమూ ముఖ్య విహిత కర్మలే. బ్రాహ్మణునికి యజ్ఞమును చేయించుట, అధ్యాపనం, దానగ్రహణం అనేవి అదనపు ధర్మ కర్మలు.


క్షత్రియునికి ప్రజాపాలనమే ప్రధానధర్మము. వైశ్యవర్ణులకు అప్పులిచ్చుట, వ్యవసాయము, వాణిజ్యము, పశుపాలన ముఖ్య కర్మలుగా విధింపబడ్డాయి. శూద్ర వర్ణం వారు పై మూడు వర్ణాల వారికీ సాయపడాలి. ద్విజులు యజ్ఞాదికర్తవ్యాలను మానరాదు. అహింస, సత్యం, అస్తేయం, శౌచం, ఇంద్రియ సంయమనం, దమం, క్షమ, సరళత, దానం- మానవులందరికి అవశ్యాచరణీయ ధర్మాలు. అందరూ కుటిల, దుష్టప్రవృత్తులను పరిత్యజించాలి.


ప్రధానం క్షత్రియం కర్మ ప్రజానాం పరిపాలనం ॥ 

కుసీదకృషి వాణిజ్యం పశుపాల్యం విశః స్మృతం | 

శూద్రస్యద్విజ శుశ్రూషా ద్విజోయజ్ఞాన్ నహాపయేత్ ॥ 

అహింసా సత్యమస్తేయం శౌచమింద్రియ సంయమః | 

దమం క్షమార్జవం దానం సర్వేషాం ధర్మసాధనం ॥

ఆచరేత్ సదృశీం వృత్తమజిహ్మామశరాం తథా ।


(ఆచార 96 (27-30))


Friday, 28 June 2024

శ్రీ గరుడ పురాణము (219)

 


ఇక గృహస్థధర్మాన్ని గూర్చి మాట్లాడుకుందాం.


గృహస్థు ప్రతిదినం స్మార్తకర్మా, వైశ్వదేవాది అగ్నికార్యాలూ సంపన్నం చేయాలి. దీనికి వివాహాగ్నిని కానీ సంపద్విభాగసమయంలో స్వయంగా తానే తెచ్చుకున్న సుసంస్కృతమైన అగ్నిని కానీ ఆరాధించాలి. శ్రౌతకర్మానుష్ఠానానికి అగ్నిహోత్రం వైతానాగ్ని (ఆహవనీయ మున్నగు అగ్నులలో నేదో ఒకటి) తో సంపన్నం చేయాలి. శరీర చింతలను (విసర్జనాలను) ఉదయసాయం కాలాలలో శాస్త్రోక్తంగా తీర్చుకోవాలి. గంధలేపనివృత్తి పర్యంత శుద్ధిని పొంది దంతధావన, స్నానాదికములను గావించి ప్రతి ద్విజుడూ ప్రాతఃకాల సంధ్యో పాసనను ముగించి అగ్నిహోత్ర కార్యాన్ని నిర్వర్తించుకోవాలి. హవనం చేసి సమాహిత చిత్తంతో సూర్యమంత్రాలను, అనగా ఉదుత్యం జాతవేదసం... మున్నగు వాటిని జపించాలి. తరువాత వేదార్థాలనూ అనగా నిరుక్త వ్యాకరణాదులనూ ఇతర శాస్త్రాలనూ అధ్యయనం చేయాలి. యోగ క్షేమాది సిద్ధికై ఈశ్వరో పాసనను కూడా చేయాలి. 

గృహస్థధర్మంలో మరొక ముఖ్యమైన అంశం తర్పణాలు. ప్రతి గృహస్థు ప్రతిరోజూ దేవతలకూ పితరులకు స్నానానంతరం తర్పణాలివ్వాలి. పూజ కూడా చేయాలి. వేదపురాణేతిహాసాలలో కొంతమేర, యథాశక్తి, పారాయణం చేయాలి. జపంచేసుకొని భూత, పితర, దేవ, బ్రహ్మ, మనుష్య జాతులకు బలికర్మ*ను గావించాలి.


(* భూతయజ్ఞం, స్వధా - పితృయజ్ఞం, హోమ- దేవయజ్ఞం, స్వాధ్యాయ- బ్రహ్మయజ్ఞం, అతిథి సత్కారం - మనుష్యయజ్ఞం. ఈ యజ్ఞాలన్నిటినీ బలికర్మగా వ్యవహరిస్తారు.)


తరువాత స్వధా, హోమ, స్వాధ్యాయ, అతిథి సత్కారాలు చేయాలి. దేవతలనుద్దేశించి అగ్నిలోహవనాలిచ్చి కుక్కలు, చండాలురు, కాకులు మున్నగు ప్రాణులకై వండిన అన్నాన్ని భూమిపై వేయాలి. పితృగణాలకూ మనుష్యులకూ అన్నంతో బాటు జలదానం కూడా చేయాలి. అన్నమును తన కుటుంబమునకు మాత్రమే సరిపడునంత వండుట సరికాదు. పక్వాన్న మెల్లప్పుడూ అవసరానికి ఎక్కువగానే ఇంట్లో వుండాలి. స్వవాసిని, (పెళ్ళయినా కూడా ఏవోకారణాలవల్ల ఆనాటికి పుట్టింట్లో వున్న స్త్రీ) వృద్ధులు, గర్భిణులు, వ్యాధి పీడితులు, కన్యలు, అతిథులు, భృత్యులు- వీరందరికీ భోజనాలు పెట్టాకనే ఇంటి యిల్లాలు, ఇంటి యజమాని అగ్నిలో పంచప్రాణాహుతులనిచ్చి అన్నానికి గౌరవ భక్తి ప్రపత్తులతో నమస్కరించి భోజనం చెయ్యాలి. భోజనానికి ముందూ వెనకా అవపోసన పట్టాలి.


Thursday, 27 June 2024

శ్రీ గరుడ పురాణము (218)

 


వర్ణసంకరమంటే వివాహ విషయంలో మాత్రమే చేయబడేదని కాదు. వృత్తి విషయంలో కూడా జరుగుతుంది. యాజన, అధ్యయన, అధ్యాపనాలను చేయవలసిన బ్రాహ్మణుడు పరిస్థితుల ప్రభావం వల్ల ఆ వృత్తి ద్వారా జీవించలేక, బతుకు గడవక క్షత్రియ, వైశ్య లేదా శూద్రవృత్తి నవలంబించవచ్చు. ఇలా ఏ వర్ణం వారు మరొక వర్ణం పనిని చేసినా అది కర్మ వ్యత్యయమవుతుంది. అదీ వర్ణ సంకరంవంటిదే. అయితే పరిస్థితులు మెరుగు పడగానే ఎవరి అసలు పనిలోకి వాళ్ళు వెళ్ళకుండా తమ వర్ణం కన్నా హీనవర్ణానికి చెందిన కర్మను నిర్వహిస్తూ వుండి పోతే వారు వర్ణసంకరులుగానే పరిగణించబడతారు. వారు క్రమంగా ఏడవ, ఆరవ, అయిదవతరంల దాకా ఆ హీనవృత్తిలో వుండిపోవలసినదే.


ఇక సంకరజాతులను మూడు రకాలుగా విభజించవచ్చు. అవి సంకర, సంకీర్ణ, సంకర, వర్ణ సంకీర్ణ సంకర విభాగాలు.


అనులోమజులు, ప్రతిలోమజులు అనగా నిదివఱకు చెప్పబడిన మూర్ధవసిక్త నుండి ఆవయోగ జాతి దాకా గల పన్నెండు రకాలవారూ సంకరజాతి విభాగానికి చెందినవారు.


ఈ సంకరజాతిలో మరల సంకరం జరుగగా పుట్టినవారు అనగా మాహిష్య-కరణ సంయోగం వల్ల పుట్టిన రథకార జాతి వంటి వారు సంకీర్ణ సంకరజాతి వారవుతారు.


మరింత లోతైన సంకరం జరిగిన చోట వర్ణ సంకరజాతి వారు పుడతారు. ఉదాహరణకి మూర్ధావసిక్త స్త్రీకి క్షత్రియ, వైశ్య లేదా శూద్ర పురుషుని ద్వారా పుట్టినవారు, అంబష్ఠ స్త్రీకి వైశ్య లేదా శూద్ర పురుషుని ద్వారా కలిగినవారు అలాగే పారశవ నిషాద స్త్రీకి శూద్రుడు కన్న పిల్లలూ ఈ జాతిలోకి వస్తారు. వీరిని అధరప్రతిలోమజులంటారు.


ఇటువంటి సంకరజాతి స్త్రీలకే బ్రాహ్మణ బీజం ద్వారా కలిగినవారు, మాహిష్య, ఉగ్రజాత్యాది స్త్రీలకు బ్రాహ్మణ లేదా క్షత్రియ పురుషుని ద్వారా పుట్టినవారు, కరణజాతి స్త్రీయందు అగ్రవర్ణుని ద్వారా కలిగినవారు ఇటువంటి వారిని ఉత్తర ప్రతిలోమజులంటారు. వీరినే అధర - అసత్, ఉత్తర- అసత్ వర్ణ సంకీర్ణ జాతుల వారని వ్యవహరిస్తారు.


Wednesday, 26 June 2024

శ్రీ గరుడ పురాణము (217)

 


వర్ణసంకర జాతుల ప్రాదుర్భావం - గృహస్థధర్మం, వర్ణ ధర్మం, ముప్పదేడు ప్రకారాల అనధ్యాయం


బ్రాహ్మణ పురుషుడు క్షత్రియ కన్యను పెండ్లాడి ఆమెకు కనిన పుత్రునితో మూర్ధావసిక్త అనే సంకరజాతి ప్రారంభమైంది. అలాగే బ్రాహ్మణ వైశ్య సంకరంలో అంబష్ఠ, బ్రాహ్మణ శూద్ర సంకరంలో పారశవనిషాద జాతులు పుట్టుకొచ్చాయి. దీనిని అనులోమ సంకరమన్నారు.


పురుష     శ్త్రీ    సంకరజాతి పేరు


క్షత్రియ    వైశ్య     మాహిష్య

క్షత్రియ    శూద్ర    మ్లేచ్ఛ 

'యాజ్ఞవల్క్య స్మృతిలో మ్లేచ్ఛ పదానికి బదులు 'ఉగ్ర' యను పదం వాడబడింది.


వైశ్య     శూద్ర    కరణ

(మూర్ధవసిక్త, అంబష్ట, నిషాద, మాహిష్య, ఉగ్ర, కరణ- ఈ ఆరు సంకరజాతులనూ అనులోమజలన్నారు.) 

క్షత్రియ   బ్రాహ్మణ సూత

వైశ్య     బ్రాహ్మణ వైదేహక

శూద్ర    బ్రాహ్మణ చాండాల

వైశ్య     క్షత్రియ  మాగధ 

శూద్ర    వైశ్య   అయోగవ

(సూత, వైదేహక, చాండాల, మాగధ, క్షత్తా, ఆవయోగ జాతులను ప్రతిలోమజలన్నారు.)

శూద్ర    కరణ   రథకార


సంకరం వల్ల చెడిన వర్ణం మరల పాతదశకు రావాలంటే ఆరు తరాలు పడుతుంది. అంటే బ్రాహ్మణునికీ శూద్రునికీ పుట్టిన సంతానాన్నీ నిషాదులన్నాము కదా. ఆ నిషాదుని కొక కూతురు పుట్టి,దానినొక బ్రాహ్మణుడు పెండ్లాడి, వారికొక కూతురు పుట్టి, దానినీ బ్రాహ్మణుడేమనువాడి... అలా నిషాద, బ్రాహ్మణ వివాహం ఆరు తరాల బాటు కొనసాగితే ఏడవతరం నిషాదునికి కూతురు పుట్టి ఆమెను కూడా బ్రాహ్మణుడే పెళ్ళిచేసుకుంటే అప్పుడు వారికి పుట్టిన పిల్లలు ఏడవతరం వారవుతారు కదా! వారికి శుద్ధ బ్రాహ్మణ వర్ణాన్ని శాస్త్రాలు ప్రసాదిస్తున్నాయి. అలాగే బ్రాహ్మణ వైశ్య సంకరమైన అంబష్ట జాతిలో అయిదవతరానికి పుట్టినవారు అనగా ఆరవ తరంవారు శుద్ధ బ్రాహ్మణులవుతారు. అలాగే మూర్ధావసిక్తజాతిలో అయిదవ తరంవారు శుద్ధబ్రాహ్మణులౌతారు. ఇదే విధంగా ఉగ్రా, మాహిష్యా జాతులలోనూ ఏడవ ఆరవ తరాలలో శుద్ధ క్షత్రియులుద్భవిస్తారు. అదే విధంగా కరణనామక సంకరజాతిలో ఆరవతరంలో శుద్ధ వైశ్యులుద్భవిస్తారు. అనగా సంకరదోషం పితృవర్ణ బీజం ఆరేడుతరాల పాటు అనుస్యూతంగా ప్రవహిస్తే గాని కడుక్కుపోదు.


Tuesday, 25 June 2024

శ్రీ గరుడ పురాణము (216)

 


గృహస్థధర్మానికి మూలం పతివ్రతయగు గృహిణి. ఆమె పతి చిత్తవృత్తిని కూలంకషంగా తెలుసుకొని వుండాలి. అతడెపుడేది కోరుకుంటాడో దానిని అప్పటికి అతడు అడగకుండానే అమర్చిపెట్టాలి. సర్వకాల సర్వావస్థలలోనూ అతని మేలునే కోరుతూ తన ప్రతిపనీ ఆ ఆశయం వైపే మళ్ళేలా చూడాలి, చేయాలి.


భర్త యొక్క తల్లిదండ్రులనూ, అక్కచెల్లెళ్లనూ, అన్ననూ, పినతండ్రినీ, గురువునీ, వృద్ధ స్త్రీలను గౌరవించడం ఆదరించడం పత్నియొక్క ధర్మం. తనకన్నా చిన్నన్నవారైన భర్తృ వర్గీయులతో స్నేహంగా వుంటూనే ఇంటి పనులు చేయించుకోవాలి. లేకుంటే సోమరులవుతారు. పతి యొక్క బంధువుల మధ్యలో తాము కూర్చునియున్నపుడామె యొక్క మాటలు, చేతలు అన్నీ అతనికి అనుకూలంగానే సాగాలి; ఈ సంగతి అందరికీ తెలియాలి. ఈ శీలమే ప్రశస్తమని జనశ్రుతి.


ఇంటికోడలు తనకు వరసైన పురుషులతో హాస్యాలాడకూడదు. పర పురుషునితో ఏకాంతంగా అసలు ఉండనేకూడదు. పరపురుషుల చేతిలో ఏ వస్తువునూ ఉంచకూడదు, వారి చేతి నుండి తన చేతితో అందుకొనరాదు. భర్త అక్కడే వున్నా కూడా పరపురుషుల మధ్య కూర్చొనరాదు.


ఇంటిలోని సామగ్రి అంతా ఆమె అధీనంలోనే వుంటుంది. దానిని అనవసరంగా ఖర్చు చేయకూడదు. అవసరానికి తగినంతగా వాడుతుండాలి. కార్యకుశల, ప్రసన్న, మితవ్యయి అయివుండి రోజులో ఒకసారైనా అత్తమామలకు పాదాభివందనం చేసే స్త్రీని భర్త ప్రేమిస్తాడు, సమాజం గౌరవిస్తుంది. ప్రోషిత పతికగానున్నపుడు- అనగా తన భర్త పరదేశానికి వెళ్ళినపుడు తన సఖీజనంతో ఆనందంగా ఆటలాడడం, పొరుగు వారిళ్ళలో కూర్చుని వాగడం, అతిగా అలంకరించుకోవడం, ఉత్సవాలలో పాల్గొనడం, హాసాలూ పరిహాసాలూ వంటివి చేయరాదు.


ఇల్లాలి మనుగడ పతితోనే. వీలైనంత వఱకు ఆమె గడపవలసిన సమయమూ అతనితోనే. ఆమె అధికారాలు పరిమితమే అయినా గృహస్థధర్మానికీ తద్వారా సమాజానికీ ఆమె అవసరం అపరిమితం. అందుకే సదాచారిణియైన స్త్రీ మరణించినపుడు అగ్నిహోత్రం లోని అగ్నితో ఆమె దహన సంస్కారాలను చేస్తారు. పతిహితైషిణియైన పత్నికి ఈ లోకంలో కీర్తి సమ్మానాలూ పరలోకంలో స్వర్గమూ సంప్రాప్తిస్తాయి.


(అధ్యాయం - 95)


Monday, 24 June 2024

శ్రీ గరుడ పురాణము (215)

 


స్త్రీకి తన భర్త యొక్క ఆజ్ఞను పాలించుటయే పరమధర్మము. స్త్రీకి ఋతు లేదా రజోదర్శనమైన తొలి దినం నుండి పదహారవ రాత్రి వఱకు సంతానప్రాప్తికి అవకాశముంటుంది. పుత్రప్రాప్తి కోసమై పురుషుడు ఆ రాత్రులలో మాత్రమే ఆమెతో సంగమించాలి. ఇలా సంతానం కోసం మాత్రమే సంగమించి మిగతా కాలాల్లో ఇంద్రియ నిగ్రహాన్ని పాటించడమే బ్రహ్మచర్య వ్రతం. అంతేగాని బ్రహ్మచర్యమంటే పెండ్లిని మానుకొనుట, స్త్రీవైపే చూడకపోవుట కాదు. పర్వతిథులలోనూ (అష్టమి, చతుర్దశి, అమావాస్య, పున్నమ (మను-4/156)) ఋతుకాలం మొదటి నాలుగు రాత్రులందూ, దినము అనగా ఎప్పుడైనా పగటివేళా సంగమం నిషిద్ధం. మఘ, మూల నక్షత్రాలలో సంగమం వర్జ్యం.

ఈ నియమాలను కచ్చితంగా పాటిస్తేనే సుందరుడు, సబలుడు, సద్గుణవంతుడు, ఆరోగ్యవంతుడునైన కొడుకు పుడతాడు. స్త్రీ పట్ల అన్ని బాధ్యతలూ అనగా తిండి, బట్ట, ఇల్లు మున్నగునవే కాక ఆమె కామవాంఛను పూర్తిగా తీర్చి ఆమెను సంతృప్తి పఱచవలసిన బాధ్యత కూడా ఆమెను చేపట్టిన వానిపై వుంటుంది. పైగా ఈ బాధ్యతకు సంబంధించి ఇంద్రుడు స్త్రీలకొక వరాన్నిచ్చాడు. అదేమనగా స్త్రీ యొక్క కామవాసనను అనిషిద్ధ రాత్రులందు ఆమె పతి తప్పనిసరిగా తీర్చాలి. లేకుంటే వాడు పాపమును మూటకట్టు కుంటాడు.

స్త్రీని ఇంటియిల్లాలిగా గృహలక్ష్మిగా సంభావించి మెట్టినింటి వారంతా అనగా భర్త, వాని సోదరులు, వాని తల్లిదండ్రులు, ఇష్టబంధువులు ఆమెను మధురాహారముతో చీని చీనాంబరాలతో అలంకార విశేషాలతో ఎల్లప్పుడూ ప్రసన్నంగా సుఖంగా వుండేలా చూడాలి. ఇది సామాజిక బాధ్యత కూడా.

స్త్రీకి గల బాధ్యతలు బాగా ఎక్కువ. ముఖ్యంగా పురుషునితో స్త్రీ యొక్క ప్రవర్తన ఎంతో బాధ్యతాయుతంగా వుండాలి. పుత్రసంతానమైనా స్వర్గప్రాప్తియైనా స్త్రీకి 'భర్తకు తనపై గల' ప్రేమ ఆధారంగానే సంక్రమిస్తాయి కాబట్టి ప్రతి ఆడదీ తన పత్యారాధన ఫలితంగా, స్నేహఫలంగా పతి ప్రేమను పొందాలి. సాధారణ స్త్రీకి శాస్త్రాలను గాని గ్రంథాలను గాని పఠించే అర్హత లేదు కాని భర్త ద్వారా వాటన్నిటినీ ఆమె వినవచ్చును. విధి నిషేధ పూర్వకంగా భర్త చెప్పే ధర్మాచరణను సాంతమూ చేయడం ద్వారా మోక్ష ప్రాప్తి నందవచ్చును. భర్త అనంతరం కొడుకే ఆమెకు ధర్మశాస్త్రగురువు కాగలడు.