Sunday 28 October 2018

యక్ష ప్రశ్నలు ఎలా వచ్చాయి?

ఇన్నాళ్ళు యక్ష ప్రశ్నలు- వాటి సమాధానాలు తెలుసుకున్నాము. అసలు యక్ష ప్రశ్నలు ఎలా వచ్చాయి? ఇప్పుడది తెలుసుకుందాము.

ఇవి మహాభారతంలో చెప్పబడినవి. మహా భారతం లోని అరణ్య పర్వంలో పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు ధర్మరాజును పరీక్షించటానికి యమధర్మరాజు యక్షుని రూపంలో అడిగిన ప్రశ్నలే యక్ష ప్రశ్నలు. వ్యవహారికములో చిక్కు ప్రశ్నలను, సమాధానం కష్టతరమైన ప్రశ్నలకు పర్యాయంగా యక్ష ప్రశ్నలు అనే మాటను వాడతారు.

పూర్వం మహాభారత అరణ్య పర్వంలో పాండవులు అరణ్య వాసంలో ఉన్నప్పుడు ఒక బ్రాహ్మణుడు పాండవుల వద్దకు వచ్చి తన ఆరణిని ఒక చెట్టుకు తగిలిస్తాడు. (అరణి అంటే యజ్ఞయాగాదుల్లో అగ్నిని రగిల్చేందుకు ఉపయోగించే వస్తువు) అంతలో అక్కడికి ఒక లేడి వచ్చి, ఆ చెట్టును ఓరుసుకోగా, తన కొమ్ములకు తగిలిన ఆ ఆరణిని అది అలాగే తీసుకుళ్ళిపోతుంది. అతన అరణిని ఆ లేడి తీసుకెళ్ళిందని, అది లేకపోతే, తాను యజ్ఞయాగాదులు ఎలా చేయాలని వాపోయి, త్వరగా ఆ జింకను వెతికి, ఆ అరణిని తెచ్చిమని ధర్మరాజును వేడుకోగా, ధర్మరాజు తన తమ్ముళ్ళతో కలిసి దాన్ని వెతకడానికి బయలుర్దేరుతారు. అది ఎక్కడా కనిపించక, వెతికి వెతికి అలసిపోయి, ఒక చెట్టు నీడలో బాధపడుతూ కూర్చుంటారు. ధర్మాత్ములమైన మనకు ఈ బ్రాహ్మణోపకారం చేసే అవకాశం కలగట్లేదని బాధపడుతుండగా, ఒక్కొక్కరు ఒక్కో సమాధానం ఇస్తారు. అప్పుడు ధర్మరాజు, వీళ్ళంతా అలసిపోయారు, వీరికి మంచి నీరు తెమ్మని నకులుని పంపుతాడు. అప్పుడు నకులుడు అక్కడున్న పెద్ద చెట్టి మీదకు ఎక్కి, దగ్గర్లో ఎక్కడైనా తటాకం ఉందా, ఉంటే అక్కడి నుంచి నీరు తేవచ్చని అని చూసి, దగ్గరలో ఉన్న ఒక జలాశయానికి వెళతాడు. అక్కడున్న ఆకులతో డొప్పలు చేసి, నీటిని పట్టుకుందామని ఉద్యుక్తుడవ్వగా, అక్కడున్న యక్షుడు నకులునితో ఈ విధంగా అంటాడు. అయ్యా! నీటిని తీసుకునే సాహసం చేయకు. ఈ తటాకం నా ఆధీనంలో ఉంది. దీన్ని నేను పొందాను. నేను అడిగిన ప్రశ్నలకు సమాధనం చెప్పిన తర్వాతే, నీవు నీరు త్రాగి, నీ సహోదరులకు తీసుకువెళ్ళు. అది విన్నా లక్ష్యపెట్టక నీటిని త్రాగిన నకులుడు గట్టు మీదకు రాగానే పడిపోయాడు. నకులుడు ఎంతకూ రాకుండుటంతో సహదేవుని పంపారు. అతను కూడా యక్షుడికి బదులు చెప్పక, నీటిని త్రాగి, పడిపోయాడు. అప్పుడు ధర్మరాజు అర్జునిని పంపాడు. అతను కూడా తిరిగి రాలేదు. ఆ తర్వాత వెళ్ళిన భీముడు కూడా అదే విధంగా తిరిగిరాలేదు. చివరకు ధర్మరాజు బయలు దేరాడు. మంచినీటి కొలను ప్రక్కనే మృతులై పడి యున్న తన నలుగురు తమ్ములను చూసి, దు:ఖంతో భీతిల్లసాగాడు. అంతలో అదృశ్యవాణి (అదృశ్య రూపంలో ఉన్న యక్షుడు) పలికినది... ధర్మనందనా నేను యక్షుడను. ఈ సరస్సు నా ఆధీనంలో ఉంది. నేనడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పక, నీ తమ్ములు అహంభావంతో దాహం తీర్చుకోబోయినందుననే ఈ గతి పట్టినది. నీవైనా, నా ప్రశ్నలకు సమాధానం చెప్పి దాహం తీర్చుకో అన్నాడు యక్షుడు. సరే అన్నాడు ధర్మరాజు. అప్పుడు యక్షుడు ఈ ప్రశ్నలను అడిగాడు. 
చివరి నాలుగు ప్రశ్నలు వేసిన తర్వాత, యక్షుడు ఇలా అంటాడు. " నాకు ఈ నాలుగు ప్రశ్నలకు సమాధానం చెప్పు. మరణించిన నీ సోదరులు బ్రతుకుదురుగాక". వాటికి కూడా ధర్మరాజు సమాధనం చెప్తాడు (అవి కూడా ఇంతకముందే చెప్పుకున్నాము, గమనించండి). అప్పుడు చివరలో ఈ నలుగురిలో ఒక్కరిని పునర్ జీవింపచేస్తాను. ఎవరిని చేయమంటావో కోరుకో అనగా, నకులుడిని బ్రతికించమని ధర్మరాజు వేడుకుంటాడు. "నీకు భీముడు ప్రియమైనవాడు, అర్జునుడైతే ప్రాణము కదా, మరి సవితి తల్లి కొడుకైన నకులుడు బ్రతకాలని ఎందుకు కోరుకున్నావు" అని యక్షుడు ప్రశ్నిస్తాడు.

"ధర్మానికి హాని తలపెడితే, హాని చేసినవాడు నశిస్తాడు. అందువలన ధర్మాన్ని నేను విడువను. ధర్మాన్ని చెఱచకపోతే, అది మనల్ని చెఱపదు. అహింసయే ముఖ్యమైన ధర్మము. అనగా పొరుగువారిని బాధించకుండుట. అదే పరమార్ధమని నా అభిప్రాయము. అందువలన అట్టి అహింసను ఆచరించడానికి నిశ్చయించుకున్నాను. కనుక నకులుడిని బ్రతకనివ్వు. నన్ను జనులంతా ధర్మరాజని అంటారు. కాబట్టి నా ధర్మం నుంచి నేను చలించకుండా జీవిస్తాను. మా తండ్రికి కుంతి, మాద్రి అని 2 భార్యలు. ఈ ఇద్దరూ పిల్లలతో కూడినవారు కనుక, నకులుడిని బ్రతికుంచు. నేను కాక, నా తల్లికి పుట్టిన మిగితా ముగ్గురు మరణించినా, నేను మిగిలినానని సంతోషిస్తుంది. అదే సంతోషం నా సవితి తల్లి మాద్రికి కూడా కలుగుగాక. నాకు ఆమె తల్లితో సమానం. నా తల్లికి ఒక కొడుకు మిగిలినప్పుడు, ఆమెకు కూడా ఒక కొడుకైన బ్రతికి ఉండాలి. ఆమెకు పుత్రశోకం ఉండరాదు. కనుక నకులుడు బ్రతకాలి" అని ధర్మరాజు సమాధనం చెబుతాడు.

ఆ సమాధానం యక్షునికి నచ్చుతుంది. వెంటనే నిద్ర నుండి మెల్కొన్న విధంగా, తన నలుగురు తమ్ములు పునర్జీవితులవుతారు.

యక్ష ప్రశ్నలు సమాప్తం.
మంగళం మహత్
సర్వేజనాః సుఖినోభవంతు ||

No comments:

Post a Comment