Wednesday 14 July 2021

రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (50)



మన నీతికారులు కూడా -


చేతనగువాడు కార్యము 

కై తగ్గును వంగు గాక యల్పుండగునా|

యేతము చడి తా వంగును

బాతాళము నీరు దెచ్చి బయలం జల్లున్ 


"ధనమును విద్యయు వంశం 

బును దుర్మదులకు మదంబు బొనరించును స 

జ్జను లైనవారి కడకువ

యును వినయము నివియ తెచ్చు" నన్నటుల మారుతి యీ సందర్భమున చూపిన వినయం సమాజంలో సర్వులూ అల వరచుకోవలసిన విశిష్ట లక్షణం.


సీతామాతకు ధైర్యం చెప్పి- ఆనవాలుగా ఇచ్చిన శిరోరత్నాన్ని తీసుకుని- ఆనాడు అరణ్యవాసంలో జరిగిన కాకాసుర వృత్తాంతంతోపాటు ఆమె సందేశాన్ని విని తిరుగుముఖం బోతున్న పావనితో "మారుతీ! నీకు మరోసారి నా దీనావస్థను చెబుతున్నాను విను. కార్యసాధన జరిగే తీరున రామ ప్రభువును ప్రోత్సహించు. నీవు చక్కగా యోజించి ప్రయత్నిస్తే నా కష్ట పరంపరలు తొలగుతాయి!" అనగనే పవన తనయుడు 'తధేతి' అన్నాడు. అంతలోనే కన్నీరు విడుస్తూ సీత “హనుమా! అందరినీ పేరుపేరునా అడిగానని చెప్పు. నా బొందిలో ప్రాణాలుడుగక పూర్వమే రాముడు నన్ను చూచేటట్లు చేయవలసినది. నీవు పుణ్యవంతుడవు. నీ మాటలు విని రామప్రభువు స్పందించి వచ్చి నన్ను తీసుకు వెళ్ళునట్లు చేయి. నా మాటలనెలా చెబితే నా నాథుడు ఉత్తేజితుడై ఎంత త్వరగా తీసుకు వెళ్ళగలడో- అలా చెప్పు అంటుంది.


అంటే మాట విలువ ఆమోఘం అన్నమాట. మాటకున్న శక్తిని గూర్చి మహాభారతం ఇలా అంటుంది.


అరిది విలుకాని యుజ్వల శరమొక్కని నొంచు 

దప్పి చనినం జను, నేర్పరియైన వాని నీతిస్ఫురణము, పగరాజు నతని భూమిం జెరచుస్.


విలుకాని బాణం గురితప్పనిచో ఒక్కని నొంచును. గురి తప్పిన వ్యర్థమగును కాని నీతిమంతుని మాట గురితప్పుట అన్నదే లేదు, మాట అంత శక్తివంతమైనదన్నమాట. ప్రమోదం, ప్రళయం రెంటిని కలిగించగలదు.


No comments:

Post a Comment