Saturday, 20 December 2014

హిందూ ధర్మం - 116 (వేదం)

వేదం ప్రత్యేకించి ఒక మతాన్నికానీ, భావజాలాన్ని కాని వ్యాప్తి చేయదు, చెప్పదు. ఆ రకంగా చూసుకున్నప్పుడు అది ఒక మతగ్రంధం కాదు, కేవలం తత్త్వం గురించి, ధర్మాల గురించి బోధ చేస్తుంది. ఉదాహరణ చెప్పాలంటే బైబిల్ క్రీస్తు బోధనలు వ్యాప్తి చేస్తూ క్రైస్తవమతాన్ని వ్యాప్తి చేస్తుంది, దేవుడు ఒక దైవదూతను పంపాడని, ఆయన చెప్పిందే ఆచరణయోగ్యమని, ఇతరులు చెప్పిందంతా అసత్యమని ఒక ప్రత్యేకమైన భావజాలాన్ని వ్యాప్తి చేస్తుంది. ఖూరాన్‌ను నమ్మేవారంతా ముస్లింలు అని, తమ మతప్రవక్త మాటలే సత్యమని, అన్యమతస్థులను కాఫిర్‌లు అంటూ ఒక భావజాలాన్ని వ్యాప్తి చేస్తుంది. కానీ వేదంలో అటువంటి ప్రత్యేకమైన భావజాలం మచ్చుకు కూడా కనిపించదు. వేదం ఏం చెప్పినా సమస్త మానవాళిని, విశ్వాన్నిఉద్దేశ్యించి చెప్తుంది. 'మనుర్భవ - కృణ్వంతు విశ్వమార్యం' : ముందు మనుష్యులుగా మారండి, విశ్వం మొత్తాన్ని శ్రేష్టతరమైనదిగా చేయండి అంటుంది. అట్లాగే గుడ్డిగా నమ్మమని కూడా వేదం ప్రవచించదు, ఒక దేవుడిని నమ్మమని కూడా చెప్పదు. సత్యాన్ని శోధించండి, సత్యాన్ని తెలుసుకోండి, అనుభూతి చెందండి అంటుంది.

అటువంటి వేదాన్ని అర్దం చేసుకోవడంలో భాగంగా వేదాన్ని నాలుగు భాగాలుగా విభజించారు.
1. మంత్రసంహిత
2. బ్రాహ్మణం
3. ఆరణ్యకం
4. ఉపనిసత్తు

1. సంహిత:
సంహితం భవతి హ్యక్షరిణి ధనం ప్రతిష్ఠాయై - అనగా తరగని సంపదను కలిగించునది సంహితము. సంధి అనే అర్ధంలో కూడా సంహితను వివరిస్తారు. వేదము నందున్న ఉన్న శాస్త్రమును సంధించునది సంహితము. (సంహితమ్ = కూడుకొనునది). మంత్రాలన్నీ కలిపితే సూక్తం అవుతుంది, సూక్తలన్నీ కలిపితే సంహిత అవుతుంది. నిజానికి భగవంతుని ద్వారా ఇవ్వబడిన భాగమే వేదసంహిత. దీనినే వేదమని అంటారు. దీని గురించి మరింత విపులంగా తరువాయి భాగంలో చెప్పుకుందాం.

To be continued ...........

Friday, 19 December 2014

హిందూ ధర్మం - 115 (వేదం)

వేదాలంచించే జ్ఞానం ఎంతో సూక్ష్మంగా ఉన్నా, అది ఒక వ్యక్తికి, కాలానికి, ప్రాంతానికి చెందదు. అందులో వ్యక్తుల, రాజుల , దేశాల చరిత్ర, ప్రవక్తల గురించి అసలే ఉండదు. అందులో చెప్పబడ్డ విజ్ఞానమంతా కాలాతీతం, ఖచ్చితం. సర్వకాలాలో మార్పు చెందినవి, ఎన్నటికి నిలిచి ఉండేవి అయిన సత్యాల అందులో చెప్పబడ్డాయి. భగవంతుడు మానవసమాజంతో మాట్లాడవలసి వచ్చినప్పుడు, తన సందేశాన్ని వేదం ద్వారానే చెప్పాడు. అందుకే వేదానికి స్వతఃప్రమాణం (Self-evident) అని పేరు. అంటే అందులో చెప్పబడ్డ విషయాలను ఋజువు చేయడానికి వెరొక సాక్ష్యం (evidence) కానీ, ప్రమాణం కానీ అవసరంలేదు. ఉదాహరణకు కళ్ళ ముందు సూర్యుడు కనిపిస్తున్నప్పుడు, సూర్యుడు ఉన్నాడని చూపడానికి ఏం సాక్ష్యం చూపిస్తారు? ఎలాగైతే సూర్యుడు ఉన్నాడనటానికి సూర్యుడే ప్రమాణమో, ఇంకో సాక్ష్యమవసరంలేదో, అలాగే వేదానికి కూడా మరొక ప్రమాణం అవసరంలేదు. వేదంలో ఫలానా విషయాలు చెప్పబడ్డాయి, మాకు వాటి మీద నమ్మకం లేదు అనుకుంటే, పరిశోధన చేయండి, ఫలితం వేదంలో ఎలా చెప్పబడిందో అదే కనిపిస్తుంది.

ఎల్లప్పుడూ అభ్యసింపబడునవి కనుక సమమ్నాయము అని, ఆవృత్తి లేదా మననం ద్వారా నేర్చుకోబడే విద్య కనుక ఆమ్నాయము అని వేదానికి పేర్లు. వేదం అనే పదానికి ఆలోచన అనే అర్దముంది. మనిషిలో విచక్షణా జ్ఞానాన్ని, ఎదుగుదలను కలిగించేది ఆలోచనే. వేదం మానవునికి సత్, అసత్‌ల మధ్య ఉండే తేడాను వివరిస్తుంది.

వేదం అన్నమాటకు మరొక అర్దం 'ఉన్నది' అని, అంటే వేదం అస్తిత్వం గురించి చెప్తోంది. నేను, నేను అంటూ తరచు అంటుంటాం, ఆ నేను అనేది ఒక అస్తిత్వం. ఒక యంత్రాన్ని తయారు చేసి, దాన్ని శక్తి సాయంతో నడిపించవచ్చు, కానీ యంత్రానికి అస్తిత్వభావన ఇవ్వలేము. మన ఇంట్లో ఉన్న కంప్యూటర్‌నే తీసుకోండి. కంప్యూటర్ అద్భుతంగా పని చేస్తుంది కానీ నేనీ పని చేస్తున్నాను అనలేదు, దానికి నేను అనే భావన కలగదు, కలగలేదు, అది లెక్కలే చేస్తుందో, వాతవరణాన్ని అంచనా వేస్తుందో, అదంతా తర్వాతి మాట. దానికి అహం భావం లేదు. నేను అనేది అస్తిత్వం. ఆ అస్తిత్వం గురించి తొలుతగాను, విపులంగాను వేదం చెప్పింది. అందుకే భారతీయ ధర్మశాస్త్రం ఒక మాట అంటుంది. ఎవరు నాస్తికులు అన్న ప్రశ్న వచ్చినప్పుడు, ఎవరు వేదాన్ని విశ్వసించరో, వారే నాస్తికులు. ఇతర మతాల్లో దేవుడిని విశ్వసించనివారు నాస్తికులు అనబడతారు. ఇదే మనకి, వాళ్ళకీ ఉన్న ఒక పెద్ద తేడా. నేను వేదాన్ని నమ్మనండి, గీత, రామాయణం, పురాణాలే నమ్ముతాను అంటే ఋషులు ఒప్పుకోలేదు. నువ్వు వేదాన్ని నమ్ముతావా? నమ్మితే ఆస్తికుడివి, నమ్మకపోతే నాస్తికుడివి అంటుంది ధర్మం.

దేవుడు కళ్ళకి కనిపించడు, కానీ ఉన్నాడు. ఆయనను చూడలేదు కనుక ఉన్నాడని గట్టి విశ్వాసం చూసేవరకు కలగదు . కానీ ఆయనిచ్చిన వేదం ఉంది. కనిపించే స్థూలప్రపంచంలో ఉన్నవన్నీ వేదంలో చెప్పబడ్డట్టుగానే ఉన్నాయి, తర్కానికి (Logic) వేదం నిలుస్తుంది, అందులో చెప్పబడ్డ విషయాలు తార్కికంగా (Logical) ఉంటాయి. కళ్ళకు కనిపించేవన్నీ చెప్తున్నప్పుడు, దాన్ని నేను నమ్మను అనడం అస్తిత్వాన్ని నమ్మకపోవడమే అవుతుంది. అందుకే వేదాన్ని విశ్వసించనివారు, అంగీకరించనివారు నాస్తికులు అన్నారు శాస్త్రకారులు.

To be continued ..................

Thursday, 18 December 2014

హిందూ ధర్మం - 114 (వేదం)

విశ్వనియమాలను ఎవరు మాత్రం రచించగలరు, ఒక భగవంతుడు తప్ప. ఉదాహరణకు సూర్యుడి చుట్టు భూమి తిరగాలని ఎవరు నిర్ణయించలేరు, ఒక వేళ అలా చెప్పినా జరగదు. ఎందుకంటే అది భగవంతుడు ఏర్పరిచిన నియమం. అలాగే వేదం కూడా అనంతమైన జ్ఞానం, విశ్వనియమాల సమాహరం, దైవీజ్ఞానం. దాన్ని ఏ మానవుడు రచించలేదు, అందుకనే వేదానికి అపౌరుషేయము అని పేరు. అనగా మానవుల చేత రచింపబడనిది అని అర్దం.

సృష్టి ఆదిలో వేదాన్ని ధ్యానంలో సమాధి స్థితిలో ఉన్న ఋషులు స్వరయుక్తంగా తొలిసారిగా దర్శించారు. భగవంతుడు వాళ్ళకి ఈ అపారమైన వేదరాశిని స్వరయుక్తంగా వినిపించాడు. వినబడినది కనుక వేదానికి 'శృతి' అనిపేరు. వేదాలను దర్శించిన ఋషులను మంత్రద్రష్టలు అంటారు. ద్రష్ట అంటే చూసేవాడు. ఋషులు భగవత్ప్రసాదమైన, పరమేశ్వర వాణి అయిన వేదాలను చూశారు కనుక వారు మంత్రద్రష్టలే కానీ మంత్రకర్తలు కారు, వారు ఏ మంత్రాన్ని రాయలేదు. ఈశ్వరుడిచ్చిన మంత్రాలనే లోకానికి అందించారు. అందుకే ఋషులను ఆంగ్లంలో seers (one who see) అంటారు. మనకున్న ఋషులందరూ మంత్రద్రష్టలే. మరొక విషయం సృష్టి ఆది అన్నప్పుడు ఇప్పుడు మనం ఉన్న సృష్టిగా భావన చేయాలి. సముద్రపు అలలపై వచ్చే నురుగులో కొన్ని వందల నీటి బుడగలు పుట్టి, నశించిపోయిన రీతిలోనే భగవంతుని అనంతమైన సృష్టిలో ప్రతి క్షణం కొన్ని వందల విశ్వాలు ఉద్భవిస్తుంటాయి, ఆయనలో లీనమవుంటాయని సనాతన ధర్మం చెప్తుంది. వాటికి ఆద్యంతాలు ఎవరు చెప్పలేదు. దీనిని ఆధునిక సైన్సు కూడా అంగీకరిస్తుంది. మనకు ఈ యొక్క విశ్వమే కనిపిస్తున్నా, దానికి ఆవల కొన్నిలక్షల పాలపుంతలు, విశ్వాలు ఉన్నాయని, కొత్త విశ్వాలు ఉద్భవిస్తుంటాయని, కొన్ని నశించిపోతుంటాయని, ఇది ప్రకృతి యొక్క లక్షణమని అంగీకరిస్తుంది. దీనినే వేల సంవత్సరాల క్రితమే ఋషులు చెప్పారు.

భగవంతుడి యొక్క ఉఛ్ఛ్వాశ, నిశ్వాసలే వేదం. అనగా వేదం భగవంతుని ఊపిరి. కనుక వేదానికి నిగమం, ఆగమం అని రెండు పేర్లు. వేదాన్ని శృతి అని చెప్పడానికి గల ఇంకొక కారణం, వేదం గురువుగారి దగ్గర విని నేర్చుకునేది. గురువు ఉచ్చరించినదాన్ని విని అదే విధముగా శిష్యుడు ఉచ్చరిస్తూ నేర్చుకుంటాడు కానీ పుస్తకం చూసి చదువుకుని, నేర్చుకునేది కాదు. ఎందుకంటే వేదానికి స్వరం ప్రధానం. ఉచ్చరించడంలో దోషం వచ్చినా, స్వరంలో దోషం వచ్చినా, అక్షర దోషం వచ్చినా, అర్దాలు మారిపోతాయి, వ్యతిరేక ఫలితాలు వస్తాయి. వేదోచ్చారణలో జరిగే చిన్న పొరపాటు మాహా విపత్తులకు దారి తీస్తుంది. అందువల్ల శిష్యుడు గురువు వద్దకు వెళ్ళి, గురువు ఉచ్చరించినదాన్ని సరిగా తిరిగి అదే విధంగా ఉచ్చరిస్తూ నేర్చుకుంటాడు ఉంటాడు. ఆ సంప్రదాయం చేత వేదానికి అనుశ్రవం అని పేరు.    

To be continued .................

Wednesday, 17 December 2014

హిందూ ధర్మం - 113 (వేదం)

వేదమంటే ఒక గ్రంధం కాదు, వేదమంటే విశ్వరహస్యాలు, విశ్వనియమాలు, తత్వాలు, ధర్మాల సమాహరం. వేదం సనాతనమైన జ్ఞానం. అంటే ఒకప్పుడు ఉండి, ఆ తర్వాత పోయేదికాదు. ఎప్పటికి ఉండేది అని. వేదం ఒకప్పుడు పుట్టింది అని చెప్పలేము, ఒక సమయం తర్వాత నశిస్తుందని కూడా చెప్పలేము. ఒక ఉదాహరణ చెప్పాలంటే గురుత్వాకర్షణ సిద్ధాంతమే (Law of Gravitation) తీసుకోండి. దాన్ని మొదట భారతీయులే చెప్పారు. కానీ ఆ విషయం కాసేపు పక్కనపెడదాం. న్యూటన్ ప్రపంచంలో గురుత్వాకర్షణ సిద్ధాంతం గురించి చెప్పిన మొదటివాడు అనుకుందాం. ఆయన గురుత్వాకర్షణ సిద్దాంతం చెప్పకముందు కూడా ఆ సిద్ధాంతం అలాగే ఉంది, ఒకవేళ ప్రపంచమంతా ఆ సిద్దాంతం మర్చిపోయినా కూడా ఆ సిద్దాంతం అట్లాగే ఉంటుంది. ఏదో న్యూటన్ చెప్పకముందు ఈ భూమిపై జీవరాశి గాలిలో తేలుతూ ఉందా? ఆయన చెప్పగానే ఒక్కసారే భూమి యొక్క అయస్కాంత ఆకర్షణకులోనై జనం అందరు నేలపై పడ్డారా? లేదు కదా. అప్పటివరకు అలా ఎవరు ఆలోచించలేదు, న్యూటన్ ప్రతిపాదించాడు, ఒక కొత్త విషయం తెలిసింది. కానీ అంతకముందు కూడా గురుత్వాకర్షణ ఉన్నట్లే వేదం కూడా ఉంది. 

అలాగే మొదట భారతీయులు తప్ప ప్రపంచమంతా సూర్యుడే భూమి చుట్టూ తిరుగుతాడని నమ్మింది, కానీ కాసేపు మనకూ, వాళ్ళు చెప్పేవరకు తెలియదనుకుందాం. ప్రపంచమంతా భూకేంద్రక సిద్ధాంతం (Geo-centric theory) నమ్మిందని సూర్యుడు నిజంగా భూమి చుట్టు తిరిగాడా? తర్వాత అది తప్పని తెలుసుకున్నాక, భూమి తిరగడం మొదలుపెట్టిందా? సూర్యుడి చుట్టూ భూమి, నక్షత్రాలు విశ్వారంభం నుంచి తిరుగుతూనే ఉన్నాయి. విశ్వమంతా సూర్యుడిలో కలిసి అంతమయ్యేవారకు తిరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే అది యొక్క ప్రకృతి ధర్మం, తత్వం, యధార్ధం కూడా. వేదం కూడా అటువంటిదే. ప్రాకృతిక సత్యాలు, నియమాల జ్ఞానమే వేదం. వేదం ఋషులకు తెలియబడకముందు ఉంది, మానవజాతి మర్చిపోయినా ఉంటుంది. ఒకవేళ ప్రళయం వచ్చి మొత్తం సృష్టి అంతమైనా వేదం నిలిచి ఉంటుంది, మళ్ళీ పునఃసృష్టి కూడా వేదం ఆధారంగానే జరుగుతుంది. అంటే వేదం సృష్టికి కూడా అతీతమైనది. దానికి దేశకాలాలతో సంబంధం లేదు. ప్రళయ సమయంలో అది పరమాత్మలో ఉంటుంది. అందుకే వేదం సనాతమైనది అన్నారు భారతీయులు.

చికాగో సర్వమత సభలో కూడా స్వామి వివేకానందులు వేదాల గురించి ఇలా చెప్పారు. 'తత్వావిష్కరణ మూలంగా - వేదాలమూలంగా - హిందువులు తమ ధర్మాన్ని పొందారు. వేదాలు ఆద్యంతరహితాలని విశ్వసిస్తారు. ఒక గ్రంధం ఎలా ఆద్యంతరహితమై ఉండగలదని ఈ సభాసదులు ఎంచవచ్చు. అది మీకు హాస్యాస్పదంగా తోచవచ్చు. కాని వేదాలనటంలో ఏ గ్రంధాలు సూచితాలు కావు. వేదాలంటే విభిన్న వ్యక్తులచే విభిన్న సమయాల్లో కనుగొనబడిన ఆధ్యాత్మిక నియమనిక్షేపని అభిప్రాయం. గురుత్వాకర్షణ నియమం, అది కనుగొనబడటానికి ముందు ఉండినట్లే, అంతేగాకా మానవాళి అంతా దాన్ని మరచినా ఆ నియమం ఉండేరీతినే, అధ్యాత్మిక ప్రపంచాన్ని పరిపాలించే నియమాలు శాశ్వతంగా ఉంటాయి. ఒక జీవికీ, మరొక జీవాత్మకు పరమాత్మకు విన్న నైతిక, ఆధ్యాత్మిక సంబంధబాంధవ్యాలు లోకంచే కనుగొనబడటానికి పూర్వమూ ఉన్నవే, మనం వాటిని మరిచినా అవి నిలిచే ఉంటాయి. ఈ తత్వాలను కనుగొన్నవారు ఋషులనబడతారు'.             

To be continued ...............

Tuesday, 16 December 2014

హిందూ ధర్మం - 112

మానవజాతి వికాసానికి, ఆలోచనకు స్వేచ్ఛనిచ్చి అభివృద్ధికి బాటలు వేసింది సనాతన ధర్మం. ఆనో భద్రాః క్రతవో యంతు విశ్వతః అంటుంది ఋగ్ వేదం. అంటే మంచి ఆలోచనలు, భావనలు, సంకల్పాలు అన్ని దిశల నుంచి మాపై ప్రసరించుగాకా అని అర్దం. నిత్యం నూతనమైన విషయాలు తెలుసుకోవాలని వేదం చెప్తోంది. మానవపతనం ఎప్పుడు మొదలవుతుంది లేక మానవ వికాసం ఎప్పుడు కుంటుపడుతుందని ప్రశ్నిస్తే, దానికి ఒకటే జవాబు దొరుకుతుంది. ఎప్పుడు మనిషి ఆలోచనలకు అడ్డంకి కలుగుతుందో, ఆ క్షణమే మానవ వికాసం కుంటుపడుతుంది. గత చరిత్ర గమనిస్తే ప్రపంచమంతా అదే జరిగింది, కానీ దానికి భారత్ భిన్నం. ఈ దేశంలో రాజులు నూతన ఆవిష్కరణలు చేసినవారికి బహుమానాలు ఇచ్చారు, సత్కారాలు, సన్మానాలు చేశారు, బిరుదిలిచ్చి గౌరవించారు. మానవజాతి పురోగమనం కోసం పండితులతో నిత్యం శాస్త్ర చర్చలు నిర్వహించారు. ఒకే విషయంపై వందల మంది పరిశోధనలు చేశారు. ఫలితంగా సైన్సు పురాతన భారతదేశంలో విస్తృతంగా అభివృద్ధి చెందింది. క్రీస్తు పుట్టకముందే ప్రపంచం మొత్తం నుంచి వేలమంది విద్యార్ధులు వచ్చి భారతదేశంలో విద్యను అభ్యసించారు. నలందా, తక్షశిలా ఇందుకు చెప్పుకోదగ్గ ఉదాహరణలు.

ఉదాహరణకు జ్యోతిష్యం తీసుకుంటే జ్యోతిష్యం మీద భృగుమహర్షి అద్భుతమైన గ్రంధం రాశారు భృగు సంహిత అన్న పేరుతో, భృగు మహర్షి అందించారని పరాశర మహర్షి ఆగిపోలేదు, వారు మరింత పరిశోధించి వారొక జ్యోతిష్య గ్రంధం రాశారు. ఇది ఎప్పుడో 5000 ఏళ్ళ క్రితం జరిగినది. ఆ తర్వాత అనేకమంది ఇంకా ఇంకా కొత్త విషయాలతో మళ్ళీ గ్రంధాలు రాశారు. ఎక్కడ పాతవి ఖండించబడలేదు, పురాతన గ్రంధాలను, వాటి రచయితలను మెచ్చుకుంటూనే నూతన విషయాలు ప్రస్తావించారు. అలా చూసుకుంటే మిహురుడు బృహజ్జాతకం అనే అపూర్వమైన గ్రంధం అందించారు. మిహురుడు విక్రమాదిత్యుని ఆస్థానంలో పండితుడు, విక్రమాదిత్యుడికి కొడుకు పుట్టినప్పుడు, ఆ పిల్లవాడు 13 వ ఏట పంది కారణంగా మరణిస్తాడని మిహ్రుడు చెప్తాడు, అదే జరిగింది. అయినా విక్రమాదిత్యుడు కోపించకుండా, శాస్త్రం అభివృద్ధి చెందాలని మిహురిడికి కావలసిన సదుపాయాలు కల్పించి, జ్యోతిష్యం మీద మరింత పరిశోధన చేయమంటాడు. అలా వరాహమిహురుడు అద్భుతమైన గ్రంధం లోకానికి ఇచ్చారు. ఇది జరిగిన తర్వాత కూడా ఇంకా అనేకులు పరిశోధన చేసి, మరిన్ని విషయాలు చెప్పారు. ఆధునిక కాలంలో గత 500-600 ఏళ్ళ క్రితం శ్రీ మాధవ విద్యారణ్య భారతీ స్వామివారి కూడా జ్యోతిష్యం గురించి చాలా విలువైన సమాచారం ఇచ్చారు. ఒకరు ఇస్తే సరిపోదా, ఇంతమంది ఇవ్వాలా అంటే జ్ఞానం అపారమైనది, దానికి అంతు లేదు. ఇది ఇంతవరకే అని చెప్పే అవకాశం చాలా తక్కువ. ఇది భారతీయులకు అర్దమైంది. అందుకే ప్రతి విషయంపై లోతైన పరిశోధన చేశారు. అందుకే శాస్త్రాలు విస్తరించాయి. దానికి మూలం వేదంలో ఉంది.

To be continued ....................

Monday, 15 December 2014

హిందూ ధర్మం - 111

ఆలోచనలకు, ప్రశ్నలకు, సిద్దాంతాలకు స్వేచ్చనిచ్చే లక్షణమే సనాతనధర్మాన్ని ఇతర మతాల నుంచి వేరు చేస్తుంది. ఇతరమతాలన్నీ తమ పవిత్రగ్రంధంలో చెప్పినదే నిజమని, అందుకు భిన్నంగా ఏది చెప్పినా, అది అబద్దమని, దైవదూషణ క్రిందకు వస్తుందని, అటువంటి కొత్త సిద్ధాంతాలు ప్రతిపాదన చేసినవారు పాపులని, నరకానికి పోతారని, వారిని దుష్టశక్తులు ఆవరించాయని, అటువంటి మతవ్యతిరేక సిద్ధాంతాలు ప్రతిపాదించినవారిని రాళ్ళతో కొట్టి చంపమని బోధించాయి. గత 300 సంవత్సరాల క్రితం వరకు పాశ్చాత్య ప్రపంచం అదే చేసింది. భారతీయ మతగ్రంధాలు తప్పించి, మిగితా మతాలన్నీ భూమి చుట్టు సూర్యుడు తిరుగుతున్నాడని చెప్పాయి. క్రైస్తవము, చర్చి కూడా అదే బోధించింది. అంతరిక్షంలో ఉన్న గ్రహాలు, నస్త్రాలకు చలనం లేదని, అవి స్థిరంగా ఉంటాయని, భూమి గోళాకారంగా కాకుండా బల్లపరుపుగా ఉంటుందని, ఈ భూమిని భగవంతుడు బలమైన పునాదుల మీద స్థిరంగా నిలిపాడని, సూర్యోదయం, సూర్యాస్తమయం అయ్యాక సూర్యుడు తనకు నిర్ధారించబడిన ప్రదేశానికి వెళ్ళిపోతాడని చెప్పసాగారు. ఇది మొత్తం ప్రపంచం, ఈనాటి అధునిక యూరోప్ కూడా అంగీకరిస్తుంది. సోక్రటీస్ అయితే మరింత ముందుకువెళ్ళి భూమి చుట్టు సూర్యుడేంటి, మొత్తం విశ్వమే తిరుగుతోందని ప్రతిపాదన  చేశారు. స్థూలంగా భూకేంద్రక సిద్ధాంతాన్ని(Geo-centric theory) ప్రతిపాదన చేశారు.

దాదాపు అందరూ అదే చదివారు ఒక 200 ఏళ్ళ క్రితం వరకు ఆ దేశాల్లో. నికోలస్ కాపర్నికస్, గెలిలియో మొదలైనవారు సంప్రదాయబోధనలకు భిన్నంగా సూర్యుడు చుట్టు భూమి, ఇతర గ్రహాలు తిరుగుతున్నాయని సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని (Helio-centric theory) ప్రతిపాదించారు. ఇది మతగ్రంధ బోధనకు వ్యతిరేకంగా ఉందని చర్చివ్యవస్థ వీరిని చాలా ఇబ్బందులు పెట్టింది. కాపర్నికస్ తన సిద్ధాంత ప్రతిపాదన చేసిన తర్వాత  కొద్దికాలానికే చనిపొయాడు. గెలిలియోను మాత్రం చాలా ఇబ్బందులు పెట్టారు, ఆయన సిద్ధంతామ బూటకం అని ఒప్పుకోమన్నారు, అతని రచనలపై నిషేధం విధించారు, అతను దైవదూషణకు పాల్పడ్డాడని ఆరోపించారు. చివరకు చర్చి ఆదేశాల మేరకు గృహనిర్బంధం చేసారు. గెలిలియో మరణం వరకు గృహనిర్బంధంలోనే ఉన్నాడు. ఇది జరిగి ఒక 300 ఏళ్ళు గడిచాకా, 1992 లో అతని పట్ల చేసిన అపరాధానికి చర్చి బాధ వ్యక్తం చేసింది. కానీ అప్పటికి అనేకమార్లు భూకేంద్రసిద్ధంతాం తప్పని సాక్ష్యాలతో సహా ప్రపంచానికి తెలిపోయింది, పుస్తకాల్లో పిల్లలు చదువుకోవడం కూడా జరిగింది. మనం ఒకసారి సైన్సు అభివృద్ధి గురించి పాశ్చాత్య దేశాల చరిత్రలో చూసినప్పుడు ఇలాంటి అనేకానేక సంఘటనలు కనిపిస్తాయి. ఇప్పుడు మనం చెప్పుకున్నది ఒక చిన్న ఉదాహరణ మత్రామే. అందుకే ఆయాదేశాల్లో మతాలు మానవజాతి అభివృద్ధికి అడ్డకింగా మారాయి. కానీ దీనికి పూర్తి భిన్నం వేదం, వేదం నుంచి వచ్చిన సనాతనధర్మం.

(నమ్మకపోతే ఆ శాస్త్రవేత్తల పట్ల ప్రదర్శించిన తీరును ఈ వెబ్‌సైట్‌లో కానీ, లేదా మీరే గూగుల్ చేసి చూడవచ్చు.
http://freethinker.co.uk/2010/05/25/a-little-late-catholics-make-it-up-to-copernicus-and-bury-him-a-hero/ )

To be continued .................

Sunday, 14 December 2014

హిందూ ధర్మం - 110 (వేదం)

హిందువులకు ధర్మం విషయంలో ఏదైనా సంశయం వచ్చినా, ఒక పని ఎలా చేయాలనే సందేహం కలిగినా, దేని నుంచి సందేహం నివృత్తి చెసుకోవాలనే అనుమానం వస్తుంది. పురాణాలు, శాస్త్రాలు మొదలైనవి అనేకం ఉన్నా, అన్నిటికి మూలం వేదం. అనేక చోట్ల పరస్పర విరుద్ధమైన అభిప్రాయాలు శాస్త్రంలో ఉండవచ్చు, అటువంటి సమయంలో వేదం దేన్ని అంగీకరిస్తుందో, దాన్నే హిందువులు ప్రామాణికంగా తీసుకోవాలి. వేద విరుద్ధమైనది ఆచరణయోగ్యం కాదు. వేదమే సనాతన ధర్మానికి ప్రామాణికం. సమస్త సృష్టికి మూలం వేదం. వేదమంటే ఒక గ్రంధం కాదు.

వేదం సమస్త జ్ఞానబాంఢాగారం. వేదంలో లేనేదేది సృష్టిలో లేదు, ఉండదు కూడా. సృష్ట్యాదిలో బ్రహ్మదేవుడు కూడా వేదాన్ని అనుసరించే సృష్టి చేస్తాడు, వేదం నుంచే సమస్త కర్మలు, యజ్ఞాయాగాది క్రతువులు, వ్యవసాయం మొదలుకుని చెప్పులు కుట్టడం, వస్త్రాలు నెయ్యడం, కుండలు చేయడం వరకు, ప్రకృతి, సాంకేతిక పరిజ్ఞానం, ఖగోళ, అంతరిక్ష, భౌతిక, రసాయన, జీవ, ధాతు, ఆయుర్వేద, మంత్ర, తంత్ర, యంత్ర, గణిత, నిర్మాణ, వైద్య శాస్త్రాలు, ఇంకా అనేకం ఉద్భవించాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అన్నిటికి మూలం వేదం, అందుకే శాస్త్రం 'వేదోఖిలం జగన్మూలం' అని చెప్పింది. ఈ వేదంలో చెప్పబడనటువంటిదేదీ లోకంలో కనిపించదు, అది ఆధునిక పరిజ్ఞానమైనా సరే. ఈ రోజు కనుగొనబడనివి, ఇంకా 1000 ఏళ్ళ తర్వాత కూడా కనుగొనడం కష్టంగా భావించే అనేకానేక విషయాలు వేదంలో ప్రస్తావించబడ్డాయి. వేదం ప్రధానంగా రెండిటి గురించి చెప్తుంది. ఒకటి ప్రకృతి/ పదార్ధం (Matter) అయితే రెండవది ఆత్మతత్వం(Spirit), ఇది అగోచరమైనది. పదార్ధజ్ఞానంలో అణువుల (Atom) నుంచి విశ్వాంతరాళం వరకు అనేకానేక విషయాలు చెప్పబడ్డా అవి వేదంలో బీజ రూపంలో ఉంటాయి. బీజ రూపంలో అంటే చదివి తెలుసుకునేందుకు వీలుగా, ప్రత్యక్షంగా కాదు. చదివి, ఆలోచించి, అర్దం చేసుకుని, పరిశోధించి కనుగొనె విధంగా అన్నమాట.

ఇలా బీజరూపంలో విశ్వానికి సంబంధించిన విషయాలు చెప్పి మనిషి ఆలోచించడానికి, ఎదగడానికి, కొత్త ఆవిష్కరణలు చేయడానికి అవకాశం ఇస్తుంది వేదం. అన్నీ భగవంతుండే వ్యక్తపరిస్తే ఇక మానవుడికి మేధస్సు ఇవ్వడం ఎందుకు, మెదడు అనేది అవసరమే ఉండదు. అందుకే మానవ ఆలోచనకు వేదం పూర్తి స్వేఛ్ఛనిస్తుంది. మనిషి ఆలోచినాలి, నిత్యం కొత్తవి కనుగొనాలంటుంది వేదం. ఇదే ఇతర మతాలను సనాతనధర్మం నుంచి వేరు చేస్తుంది.      

To be continued .............