Sunday, 8 May 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 64 వ భాగం



మన కంటే మరొకడు లేనప్పుడు, మనకన్నా మరొకటి విడిగా లేనపుడు ప్రేమగానీ, ద్వేషం గాని కల్గుతోందా?


అంటే మిగిలినవారు లేకుండా నాశం చేయాలని కాదు. అట్లా ఎవ్వరూ చేయలేరు. అట్టి శక్తియున్న ప్రాణులను సంహరించవచ్చు గాని జడరూపాన్ని రూపుమాపగలమా? దానిని నిర్మూలిస్తే మనం ఎక్కడ ఉంటాం?


విడిగా నున్న వ్యక్తుల వల్లనే కాదు, జడ ప్రకృతి వల్ల, శాంతికి భంగం కల్గుతోంది. మామిడిపండు కనబడితే తినాలనే ఉబలాటం ముళ్ళ చెట్టును చూస్తే ముళ్ళు గ్రుచ్చుకుంటాయేమోనని బాధ, ఇక ఉరుములు, మెరుపులు, భూకంపాల వల్ల భయం మొదలైనవి ఎన్నో కల్గుతున్నాయి. ఇవన్నీ లేకుండా ఉండాలంటే ఎలా?

అన్నిటినీ వదిలించుకున్నా ఆకలి దప్పులు మనల్ని బాధిస్తాయి. ఇక కోరిక, దుఃఖం సరేసరి. కోరికల పరంపరకు అంతులేదు. ఎవ్వరూ కనబడకపోయినా ఒంటరిగా ఉన్నా అట్టి భావాలు వెంట తరుముతూ ఉంటే శాంతి ఎక్కడ? ఏమిటి? మూర్ఖునిగా ఆలోచించానేమిటియని తనను తానే నిందించుకుంటాడు. 


తనకంటే భిన్నమైనది లేదనే భావనను అద్వైతము అందిస్తున్నదంటే దానికి అర్ధం తనకంటే భిన్నమైన వ్యక్తి ఉండకూడదని కాదు. అయితే ఉండకూడనిది ఏమిటిది? మనస్సే. ఇది ఎంతవరకూ మన దగ్గర ఉంటుందో అనేక దుఃఖ పరంపరలు సిద్ధం. మత్తుమందిచ్చి శస్త్ర చికిత్స చేసినపుడు బాధ పడుతున్నామా? రోజూ నిద్ర బోతున్నారు. అపుడు చరాచర వస్తు ప్రపంచం లేకుండా ఉందా? అయితే ఎప్పుడు బాధ కల్గుతోంది? మనస్సు పనిచేసినపుడే. మనస్సుంటేనే కదా సుఖ దుఃఖాలనుభవించేది?


కనుక రెండవ వ్యక్తి ఎవరు? నీ మనస్సే. నిద్ర బోతున్నపుడు గాని, మత్తు మందిచ్చినపుడు గాని నీ మనస్సు లేదు. కాని నీవు బ్రతికే యున్నావు. అట్టి ప్రాణశక్తియే ఆత్మ. అదే నీ నిజరూపము. మాయ, మనస్సును రెండవదానిగా తీసుకొని వచ్చింది. జ్ఞానం వల్ల దీనిని నిర్మూలించు, అపుడు నీకంటె మరొకటి కనబడదు. అపుడు అద్వైతం పట్టుబడుతుంది. నీకంటే మరొకటి లేదనినపుడు క్రియలేదు, మాట లేదు, దానికై వెంపర్లాడడం లేదు. నిన్ను అటూ ఇటూ లాగే ప్రపంచమూ నిన్నేమీ చేయలేదు. అపుడు నీ దృష్టిలో ప్రపంచము లేదు. నీవు ఒంటరిగా ఉన్నా కోపతాపాలు నీ దరిచేరవు. శాశ్వత కాంతితో ఉండిపోతావు. నిన్ను మంచి చెడులు రెండూ బాధించవు.


Saturday, 7 May 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 63 వ భాగం



నిష్క్రియునకు దయయా?


దక్షిణామూర్తి, మౌనంగా మర్రిచెట్టు క్రింద ధ్యానంలో ఉంటాడు. ఆయన చూడడు, మాట్లాడడు కాని ఆయన మనస్సు దయతో పొంగుతోంది. అద్వైతంలో మనస్సే లేదు. మనస్సు పోతేనే ఆత్మ ప్రకాశిస్తుందని ఉంటుంది. అయితే దయతో, అయ్యో మానవులిట్లా అయిపోతున్నారేమిటని జాలిపడ్డాడు. (నవ్వుతూ అన్నారు స్వామి). అయితే అద్వైతమూర్తి ఎట్లా కాగలడతడు? మనపై దయ చూపించాడంటున్నాం. అయితే మనస్సుండాలి కదా!


ఘోషాస్త్రీ కనబడదు. వినబడదు కూడా. అయితే పిల్లవాడొక గోతిలో పడిపోతున్నపుడు బైటకు వచ్చి కేకలు వేస్తూ రక్షించదా? దక్షిణామూర్తికి అట్టి పరిస్థితి ఏర్పడింది. అతడు నిష్క్రియుడైనా దయతో వీక్షించాడు.


ప్రజలు బుద్ధితో వాదవివాదాలు చేసికొంటున్నారు. చేతులు కలబడడం వల్లనే కాదు, సంకల్పాల వల్లనూ సంఘర్షణలు వస్తాయి. ఇపుడు మనస్సును సక్రమ మార్గంలో పెట్టాలని చివరకు క్రియా రహిత స్థితిని పొందునట్లు చేయాలి.


మనస్సులోని ద్వైతాన్ని తొలగించడం అద్వైతం


సంకల్పాలను లేకుండా మనస్సును నిర్మూలించుటయే అద్వైతం. మనకంటే భిన్నమైనది ఒకటుందని మనస్సు వల్లనే కల్గుతోంది. స్వప్నంలో మరొకటి కనబడదు. మనస్సు అణిగియుండడం వల్ల అట్లా జరిగింది. అందువల్ల ప్రశాంతంగా ఉంటున్నాం. మరొక వ్యక్తి కనబడితే శాంతికి భంగం. అతనికేదో ఉపకారం చేయాలని ఒక మాటు, మరొక సందర్భంలో ఒకర్ని చూస్తే ఈర్ష్యా ద్వేషాలు కల్గుతున్నాయి. ఒకనిమీద ప్రేమ చూపిస్తే మనసులో సంతోషం, ద్వేషం చూపిస్తే అవతల వ్యక్తికి కీడు కంటె మనకపకారం కల్గుతోంది.


Friday, 6 May 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 62 వ భాగం



(అనగా హిరణ్యగర్భుని కోసం) ఉంది. మరొక చోట అతడే బ్రహ్మను సృష్టించాడని చెప్పబడింది. మహర్షి అనడం వల్ల ఉపదేశించు ఆచార్యుడే. రెంటిలోనూ మాకు సద్బుద్ధిని ప్రసాదించుగాక అని ప్రార్ధన. పరమ మంగళ కరమైనదే బ్రహ్మము. దానిని చింతించువానికి అది వరప్రదాయిని అని


"అతి కల్యాణ రూపత్వాత్ నిత్య కల్యాణ సంశ్రయాత్ స్మరౄణాం వరదత్వాచ్చ బ్రహ్మ, తం మంగలం విదుః"


స్మరించేవారికి ఎట్టి వరమది? జ్ఞానమే వరఫలము. దీనినిచ్చునది శివమే. అతడిచ్చు జ్ఞానమూ శివమే. శంకరులే దాని స్వరూపము. ఆయనే శివం, కల్యాణం, శుభం. శివమే ఆచార్య శివమైంది.


ఈ అవతారానికి తల్లిదండ్రులెవరు? ఎక్కడ?


అవతారానికి ఉపక్రమం


పోలీసు స్టేషన్లో ఎవరైనా దొంగతనం జరిగిందని ఫిర్యాదు చేస్తే తగు చర్య తీసుకుంటారు. అట్లాగే అవతరించడానికి తగిన కారణం కోసం భగవానుడు ఎదురు చూస్తున్నాడు. ధర్మం క్షీణిస్తోందని దేవతలు, ఆర్జీ పెడితే భగవానుడవతరిస్తాడు. అంతేకాదు అవతారానికి జన్మనిచ్చే దంపతులు తమకు మంచి సంతానం కావాలని అనాలి. ఏదీ లేకుండా అవతరిస్తాడా?


ఇట్లా రెండువైపులా ఆర్జీ ఉంటుంది. ఇట్టిది రామకృష్ణావతారాలలో చూసాం. ముందు దేవతల ఫిర్యాదు. దశరథుడు పుత్రకామేష్టి చేయుట. తరువాత రామావతారం. సుతపస్ అనే ప్రజాపతి, అతని భార్య పృశ్ని చాలాకాలం పాటు తపస్సు చేసారని భగవానుడే మూడు జన్మలలో అవతరిస్తాడని ఉంది. అందు కృష్ణావతారం చివరది. దేవకీ వసుదేవుల బిడ్డడై జన్మించాడు. అంతకుముందు అదితి కశ్యపులకు వామనునిగా పుట్టాడు. విష్ణువు విషయంలో అట్టి ఆర్జీలుంటే శివుని విషయంలో ఉండవద్దా?


అతనికి లాంఛనాలతో పనిలేదు. అతనిలో ఉన్నది దయయే.


Thursday, 5 May 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 61 వ భాగం



ఇక అవతారం, గురు రూపంలో ఉండాలి. అసలు, పరమాత్మయే గురువు. ఉపనిషత్తు, అతణ్ణి గురువని చెప్పింది. అతనికి నమస్కరించుట, శరణు జొచ్చుట చెప్పబడింది. బ్రహ్మయే వేదాలనిచ్చాడు. ఆ మంత్రాలతోనే సృష్టి కార్యక్రమం మొదలౌతుంది. బ్రహ్మ విద్య నందించువాడు కూడా అతడే. అతణ్ణి పరమాత్మ సృష్టించి అతనికి వేదాలనందించాడు. ముముక్షువైన నేను అతనికి శరణు జొచ్చుతున్నానని మంత్రం:


"యో బ్రహ్మాణం విదధాతి పూర్వం 

యోవై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై 

తం (గ్0) హ దేవం అత్మబుద్ధి ప్రకాశం  

ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే"


-శ్వేతాశ్వతరం (6-18)


ఇందే మరొకచోట పరమ గురువు శివరూపంలో ఉన్నాడని ఉంది. మహర్షి రుద్రుడు. వేదాలను పఠించే బ్రహ్మజననం కోసం చూస్తున్నాడని (అనగా హిరణ్యగర్భుని కోసం) ఉంది. మరొక చోట అతడే బ్రహ్మను సృష్టించాడని చెప్పబడింది. మహర్షి అనడం వల్ల ఉపదేశించు ఆచార్యుడే. రెంటిలోనూ మాకు సద్బుద్ధిని ప్రసాదించుగాక అని ప్రార్ధన. పరమ మంగళ కరమైనదే బ్రహ్మము. దానిని చింతించువానికి అది వరప్రదాయిని అని శ్లోకార్ధం.


"అతి కల్యాణ రూపత్వాత్ నిత్య కల్యాణ సంశ్రయాత్ స్మరౄణాం వరదత్వాచ్చ బ్రహ్మ, తం మంగలం విదుః"


స్మరించేవారికి ఎట్టి వరమది? జ్ఞానమే వరఫలము. దీనినిచ్చునది శివమే. అతడిచ్చు జ్ఞానమూ శివమే. శంకరులే దాని స్వరూపము. ఆయనే శివం, కల్యాణం, శుభం. శివమే ఆచార్య శివమైంది.


Wednesday, 4 May 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 60 వ భాగం



శంకరులు, శైవులూ, వైష్ణవులూ, శాక్తేయులు కూడా 


శంకరుల గురించి "అంతః శాక్తో బహిః శైవః వ్యవహారే తువైష్ణవః" అంటారు. ఆయన లోపలేమో అంబిక. విభూతి, రుద్రాక్ష ధారణచే శివుడు. ప్రాపంచిక వ్యవహారాలో విష్ణువు. ఆయన నోటినుండి నారాయణ, నారాయణ అని వస్తుంది. వ్రాయవలసి వచ్చినప్పుడు "క్రియతే నారాయణ స్మృతిః" అనగా విష్ణు భావనతో శివావతారంగా చెలామణి అయి చేసేదంతా నారాయణ కృత్యమే. ఇట్లా శివ- విష్ణు అద్వైతం కుదిరింది.


విష్ణువు చేస్తున్నాడంటే అమ్మవారు చేస్తున్నట్లే. అవతారం పురుషాకారంలో ఉంది. నారాయణుని పేరుతో పనులు. ఆ నారాయణుడూ అమ్మవారి పురుష రూపమే. లోపల అమ్మవారి రూపం. మరొకవిధంగా హృదయంలో అపారమైన దయ యుంటుంది. అందువల్ల "అంతశ్శక్తః"


ఇక్కడ శక్తి అంటే దయయే. అది లేకపోతే శివం లేదు. శివుడు, తనలో నున్నది శక్తియని తెలియాలన్నా శక్తియుండవలసిందే. శివం దయను చూపిస్తే అది శక్తియే. ఆమె లేకపోతే ఆయన, రాణించడనే మాట ఉంది కదా.


అయితే ఈ అవతారం, సీతారాముల మాదిరిగా, రాధాకృష్ణుల మాదిరిగా ఉండదు. సన్న్యాసిగా అవతరించాడు కనుక, అమ్మవారు బైటకు కనబడదు. తన భార్య కనబడేటట్లు విష్ణువు, ఆమెను ధరిస్తాడు. నరనారాయణులుగా కన్పడినపుడు విష్ణువుగా కన్పడకుండా అంశావతారంగానే కన్పిస్తాడు. కలిలా భగవత్ శక్తి అవతరించాలి. అయినా లక్ష్మి - విష్ణువనే జంటగా కాదు. సన్న్యాసి కదా! ఆపైన దక్షిణామూర్తి శుద్ధమైన, సంపూర్ణమైన పరమేశ్వరునిగా కన్పిస్తాడు. పార్వతీ పరమేశ్వర రూపంలో కాదు. అందువల్ల దక్షిణామూర్తి నుండి శంకరువతరించాలి.

Monday, 2 May 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 59 వ భాగం



శక్తిని అంతర్గతం చేసుకొని దక్షిణామూర్తి


పరమేశ్వరుడనేక రూపాలలో ఉంటాడు. అవి కళ్యాణ సుందరమూర్తి, సోమస్కంద మూర్తి, నటరాజమూర్తి, భైరవమూర్తి మొదలైనవి. ఇందులో ఏది అవతారానికి కారణం? కలిలో సన్న్యాస గురువు అవతరించాలి కనుక శక్తితో కూడిన సోమస్కందాది మూర్తులు వీలుపడవు. ఎందుకంటే పక్కనే అమ్మవారుండాలి కదా! ఇక భైరవమూర్తి వచ్చాడంటే భయంకరంగా ఉంటాడు. అటువంటివాడు, శాంతమైన పలుకులతో ఉపదేశం ఎలా ఇస్తాడు?


కనుక దక్షిణామూర్తి, అవతార కారకుడు కావాలి. అతడు, అమ్మవారితో కలిసి యుండడు. అయితే బాలా త్రిపుర సుందరిగానో, కన్యాకుమారిగానో, దుర్గగానో అమ్మవారు వచ్చినా అయ్యవారు ప్రక్కన ఉన్నట్లు కనబడరు. శివశక్తులు విడదీయరానివి కనుక విడిగానున్నట్లు భావించకూడదు. నిర్గుణ సగుణ బ్రహ్మమే అసలైన శివశక్తి స్వరూపము. ప్రపంచంలో లీలార్ధమై దంపతులుగా ఒకమారు, విడిగానున్నట్లు ఒక మారు కన్పిస్తారు.


పరమేశ్వరుడు దక్షిణామూర్తిగా వచ్చినా, నిష్క్రియుడైనా, క్రియా స్వరూపిణి యైన అమ్మవారు లోపలే ఉంటుంది. ఆమెను మనం చూడలేం. అట్టి శక్తి లేకపోతే శంకరులుగా అవతరించి దేశాన్ని ముమ్మారు పర్యటించి, అనేక గ్రంథాలు వ్రాసి, వాదాలలో పాల్గొని అందర్నీ అనుగ్రహించడం కుదురుతుందా?


శుభమును చేయువాడే శంకరుడు. కనుక నిష్క్రియుడెట్లా అవతరించాడు? అన్ని శక్తులకు పరాశక్తియే మూలం. అనగా క్రియాశక్తి, ఇచ్ఛాశక్తి, జ్ఞాన శక్తులకు మూలం. ఇట్టి పరాశక్తి, దక్షిణామూర్తిలో సూక్ష్మాకారంతో ఉంటుంది.


Sunday, 1 May 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 58 వ భాగం



పరమ శివునకు ఎన్నో పేర్లున్నాయి. వేదంలో సమస్త విద్యలకు అతడధిపతి యని, అతడే సమస్త ప్రాణులకు ప్రభువని చెప్పబడింది. "ఈశానః సర్వవిద్యానాం..." అనే మంత్రంలో. సదాశివుణ్ణి ఓంకారంగా చెప్పి అదే ఆత్మస్వరూపమని చెప్పి చివరగా అట్టి మంగలమూర్తియైన శివుడు మాకు అనుకూలుడగు గాక అని యుంది. ఆ పై మంత్రమే గీతలోనూ చెప్పబడింది.


అట్టి విద్యాధినాథుడు, శంకరులై ఉపదేశ గురువు కావద్దా? 


తంత్ర గ్రంథాలలో పరమేశ్వరుడే అమ్మవారికి ఉపదేశించినట్లు ఉంటుంది.


అద్వైత విద్య అన్ని విద్యలకంటే అధికం. అది ఒక పుస్తకం కాదు, మంత్రం కాదు. అనుభవంతో కూడిన విద్య. అట్టి అద్వైతవిద్యయే శివుడు. 'అహం బ్రహ్మాస్మి' అన్నట్లుగా 'శివోహం' అని అంటారు. కేవలం ఈ మూడు అక్షరాలపై ధ్యానం చేయవచ్చు. మాండూక్యోపనిషత్తులో కూడా 'శివం అద్వైతం' అని యుంటుంది. కనుక అద్వైతాచార్య రూపంలోనే అవతరించడం సబబు. అమర కోశంలో పరమేశ్వరుణ్ణి సర్వజ్ఞుడని యుంది.


ఆపైన ప్రశ్నోత్తర మాలికలో ఎవరు జగద్గురువని ప్రశ్న. "కోహి జగద్గురు రుక్తః?" చటుక్కున మనం ఆదిశంకరులని అంటాం. అంతకు ముందే కృష్ణునకు జగద్గురు పదం ఉంది. కాని శంకరులు "శంభుః" అని సమాధానం చెప్పారు. ఆ శంభువే శంకరుడు. జ్ఞానం ఎవని వల్ల వస్తుందని ప్రశ్న. "జ్ఞానం కుతః?" శివుని నుండే అని జవాబు. "శివాదేవ"


కనుక జ్ఞానావతారం, పరమశివుడే కావాలి. ఇంతకుముందు వచ్చినవి విష్ణ్వతారాలు. కలిలో పరమేశ్వరుడవతరించాలి. వారే శంకరులు.