Thursday, 13 October 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 220 వ భాగం



మండన మిశ్రుల ప్రాంతం- పండితుల నిలయం


కర్మ మార్గంలో బద్ధులైన వారిని ఉద్దరించడం కోసం, దయతో వారితో వాదించడం కోసం శంకరులు బయలుదేరారు. మాహిష్మతీ నగరంలో మండనమిత్రుల ఇంటిని వెదుకుతూ ఉండగా కొంతమంది స్త్రీలు నీళ్ళ బిందెలతో కనబడ్డారు. మండనుల ఇల్లు ఎక్కడ? అనగా వారు శ్లోకరూపంలో సమాధానం ఇచ్చారు:


"స్వతః ప్రమాణం పరతః ప్రమాణం

కీరాంగనా యత్ర గిరం గిరంతి

ద్వారస్థ నీడాంతర సంనిరుద్దా

జానీ హి తన్మండన పండి తౌకః" 


అనగా ఏ ఇంటి ద్వారంలో పంజరాలలో నున్న చిలుకలు, వేదం స్వతః ప్రమాణమా? పరతః ప్రమాణమా అని వాదిస్తూ ఉంటాయో అదే వారిల్లని సమాధానం చెప్పారు. చూసారా? న్యాయ మీమాంసపరిచయం స్త్రీలకు, తుదకు పక్షులకు కూడా ఆనాడుండేదని తెలియడం లేదా? 


ఇది ఆనంద గిరియంలో ఉన్న శ్లోకం. స్వతః ప్రామాణ్యవాదం, పరతః ప్రామాణ్యవాదం అని ప్రామాణ్య వాదం రెండు రకాలుగా ఉంటుంది.


ఒక వస్తువును చూస్తే మనకు కలిగిన జ్ఞానం రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి సరియైనదని, రెండవది కాదని తెలుస్తుంది. ఒక తగరపు చిప్పపై సూర్యకాంతి పడిందనుకోండి. అది వెండిలా కనిపిస్తుంది. కాని అది తగరపు చిప్పయని తెలుసు. మన బుద్ధి, ముందు వెండిదని చెప్పినా అట్టి బుద్ధి ప్రమాణం కాదని తెలుస్తుంది. వెండి పాత్ర, వెండి పాత్రయే. తగరపు చిప్ప, తగరపు చిప్పయే అని తెలిసి కొనుట ప్రమాణమవుతుంది.


Wednesday, 12 October 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 219 వ భాగం



కుమారిలుడు శాంతించాడు. వీరి మాటలు, వీరి దర్శనం వల్ల, అతని తాపం తగ్గింది. అప్పర్ స్వామిని ఒక సున్నపు బట్టీలో శత్రువులు తోసివేస్తే ఈశ్వర పాదాలను ఆశ్రయించిన నాకు చల్లగా ఉందని అనలేదా? ఆ పాదాలే శంకరుల పాదాలు.


నేనెందుకు జ్ఞానమార్గాన్ని ఖండించానో మీకు తెలుసు. కర్మలను తుంగలో త్రొక్కిన బౌద్ధుల నెదిరించడం కోసం, కర్మ మార్గానికి ఎక్కువ ప్రాధాన్యమిచ్చాను. నేనీ ప్రాయశ్చిత్త కర్మ చేసుకునేటపుడు, ఫలదాతయైన శంకరుడే వచ్చాడని భావిస్తున్నా. అయితే నా శిష్యుడు మీమాంసను బాగా వ్యాప్తి చేసి యజ్ఞ యాగాలను చేసినవాడు, మాహిష్మతీ నగరంలో ఉన్నాడు. అతణ్ణి నివృత్తి మార్గంలో త్రిప్పగలిగితే దిగ్విజయయాత్ర సఫలమౌతుందని కుమారిలుడన్నారు.


(హస్తినా పూర్ దగ్గరగా నున్న విద్యాలయంలో మండనుడున్నాడని కొందరు, మరొక చోటని కొందరు చెబుతారు. ఇతని శిష్యుడని కొందరు, బావ మఱది అని కొందరు వ్రాసేరు. వాటికేమి గాని, అందరూ అతడు మీమాంసకుడని అన్నారు అనువక్త).


సీతాదేవి ఆశీస్సులవల్ల హనుమంతుని తోకకు నిప్పంటించినా ఎట్లా చల్లగా ఉందో, శంకరుల సమక్షంలో కుమారిలుడంత చల్లదనాన్ని పొందాడు. అగ్ని రూపుడైన ఎవడు పరమశివుని నేత్రాగ్నినుండి సుబ్రహ్మణ్యుడై కుమారిలుడుగా అవతరించాడో, ఆ అవతారం ఆ అగ్నిలోనే లీనమై పోయింది. ధర్మశాస్త్ర ప్రమాణాన్ని అనుసరించి చూపించాడు. అట్టివారే మన మతానికి పునాదులని మరువకండి.


Tuesday, 11 October 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 218 వ భాగం



'స్వకర్మణా తం అభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః" (18-46) 


ఇది చిన్న స్థాయిలో ఒక సిద్ధి వంటిది. ఇక కర్మలను విడిచి జ్ఞాన విచారంలో గట్టిగా అడుగిడినపుడు అది మహాసిద్ధి మోక్షం ప్రాప్తిస్తుంది.


'నైష్కర్మ్య సిద్ధిం పరమం సన్న్యాసేన అధిగచ్ఛతి" (18-49) 


నైపుర్ణ్య సిద్ధియే పరమసిద్ధి. అది సన్న్యాసియైన వెనుక సిద్ధిస్తుందని అన్నాడు. కనుక పరిపక్వమనస్సు లేనివారు కర్మలను చేయాలన్నాడు. అదైనా శాస్త్రం ప్రకారం అన్నాడు. అంతేనే కాని కర్మలను చేయడమే అంతిమ లక్ష్యమని చెప్పలేదు. చిట్టచివరి దశలోనే అన్ని కర్మలనూ విడిచిపెట్టుట:


"ఆరురుక్షో మునేర్యోగం కర్మకారణ ముచ్యతే

యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే (6-3)


అన్ని కర్మలు, బ్రహ్మజ్ఞానికి సాధనంగా ఉండి అందులో లీనమై పోతాయి. 


"సర్వం కర్మాఖిలం పార్ధ జ్ఞానే పరిసమాప్యతే" (4-33) 


జ్ఞానికి కర్మతో పని లేదు. 


"తస్య కర్మన విద్యతే" (3-17) అని సారాంశం గీతాచార్యుడందించాడు.


ఇట్లా కుమారిలునకు శంకరులు బోధ చేసారు. ఉపనిషత్తులలో కర్మయోగం ఉన్నా అదే అంతిమ లక్ష్యం కాదని అన్నారు. ఈశావాస్యం ఆరంభ మంత్రంలో జీవించిన వంద సంవత్సరాలు కర్మలు చేస్తూ ఉండాలని ఉంది. "జిజీవిషేత్" అని కూడా ఉంది. అంటే ప్రాపంచిక జీవితం కావాలనుకున్న వానికని అర్ధం. అంతేనే కాని నివృత్తి మార్గంలో ఉన్నవానికని కాదు. దీనితో శంకరులు ఏకీభవించారు. దీని వెనుక మంత్రంలో ఆత్మను, తెలుసుకొనలేనివాడు, అనగా జ్ఞాన మార్గాన్ని గుర్తించనివాడు, ఆత్మహత్య చేసుకున్నవానితో సమానమని ఉంది. తరువాత ఆత్మ గురించి అద్వైత ధోరణిలో వివరింప బడింది. కనుక జ్ఞాన మార్గానికి ముందు అనగా ప్రాథమిక దశలో కర్మమార్గం ఉంది.


కుమారిలునకు ఈ విధంగా శంకరులు ఉపదేశించారు. క్రియలలో మునిగినా, తన నిష్క్రియత్వ లక్ష్యాన్ని శాంత స్థితిని మరిచిపోలేదు. అది పనిచేస్తూ చేయని స్థితి. అది ఎట్టిదో వారి నడవడికవల్ల తెలుస్తుంది.


Monday, 10 October 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 217 వ భాగం



"కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసాస్మరన్

ఇంద్రియార్ధాన్ విమూఢాత్మా మిథ్యాచారః స ఉచ్యతే" (3-6)


కనుక అర్జునా! ప్రస్తుతం నీవు భ్రాంతిలో పడి యుద్ధ ధర్మం చేయనంటే, నీ సహజ గుణాలు నీ అదుపు లేకుండా నిన్ను కర్మవైపు లాగుతూ ఉంటాయి:


"స్వభావ జేన కౌంతేయ నిబద్ధః స్వేన కర్మణా 

కర్తుం నేచ్చసి యత్ మోహాత్ కరిష్యతి అవశోఽపితత్ (18-60)


అందువల్ల ప్రస్తుత దశలో కర్మలను విడిచిపెట్టకు. అయితే ఆ కర్మలను నీ ఇష్టం వచ్చినట్టు చేయకు. శాస్త్ర ప్రకారం చేయాలి సుమా! ఏది చేయాలో శాస్త్రం చెబుతుంది:


"తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే" (16-24) 


నేను నీతో చెప్పేదేమంటే సంగ బుద్ధి లేకుండా ఫలాన్ని నాకర్పించు.


"తతః కురుష్వ మదర్పణం" (9-27) 


ఇట్లా చేస్తూ ఉంటే ఒకనాటికి పాపం నిన్ను అంటకుండా ఉంటుంది. తామరాకుపై నీటి బొట్టులా ఉండగలవు.


"లిప్యంతే నస పాపిన పద్మపత్రమి వాంభసా (5-10) 


ఇట్లా శాస్త్ర ప్రకారం ప్రతి వ్యక్తి చేస్తూ ఉంటే అతనికి యోగ్యత లభిస్తుంది. జ్ఞానమార్గంలోకి అపుడు వెళ్ళగలదు. 


Sunday, 9 October 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 216 వ భాగం



ఆ అద్వైత జ్ఞానం వచ్చే వరకూ భక్తితో ఉండాలని, ప్రేమ కలిగియుండాలని చివరకు ఇద్దరూ (జీవాత్మ పరమాత్మలు) ఒక్కటే అనే జ్ఞానం వస్తుందని వీరంటారు. మీమాంసలో ప్రేమతో కూడిన భక్తి లేకపోవడం ఒక లోపం. శరీరంతో పనులు చేస్తూ ప్రేమతో కూడిన మనస్సుంటే, చివరకు ఆ మనస్సే మటుమాయమై శాంతంతో కూడినపుడు ఆత్మ సాక్షాత్కారమని ఇట్లా సమగ్ర ప్రణాళికను అందించింది వేదాంతం. అదేమీ లేకుండా వట్టి కర్మలు చేసి ఏం ప్రయోజనం? జీవునకు పరిపూర్ణ తృప్తి ఎట్లా వస్తుంది?


కర్మ భక్తులతో స్వామిని ఆరాధించాలి. ఈ ప్రపంచాన్ని అతని స్వరూపంగా భావించాలి. సంఘానికి మేలు చేయాలి. ఇదంతా ఇతరుల కోసం చేస్తున్నామనే భావన పోయి ఆత్మోద్ధరణకై చేస్తున్నామనే భావన రావాలి. ఆ స్థితిలో నిష్క్రియత్వం. ఇది అభ్యాసం వల్ల గాని పట్టుబడదు. ఎంతవరకూ శరీరం, మనస్సు ఉందో అంతవరకూ జనన మరణాలు తప్పవు, ఆకారం, భావం లేనపుడు కర్మ ఏమిటి? ఫలాలేమిటి? సంసారంతో సంబంధమేమిటనే స్థితి ఏర్పడుతుంది. శాశ్వత సుఖం, మన లక్ష్యమని భావించవద్దా? కర్మలతో నిరంతరం మునిగిపోవడం చిత్తాందోళనలతో జీవితాన్ని చివరి కంటా గడపడమా? అని వేదాంతులు ప్రశ్నిస్తారు.


"మాతే సంగోస్తు అకర్మణీ" (2-47) అనగా కర్మలను చేయకపోవడంతో అనగా కర్మత్యాగంలో పట్టుదల వద్దు. ఇది ప్రాథమిక దశలో నున్న సాధకుణ్ణి ఉద్దేశించింది. అతడు పుట్టినప్పటి నుండి గిట్టేవరకూ భౌతిక సుఖాల కోసం చేస్తూనే ఉంటాడు. అట్టివానిని వెంటనే కర్మలు వద్దని చెబితే సాధ్యమా?


నేనన్నీ మానేస్తాను. జ్ఞానినౌతానంటే అది సాధ్యం కాదు. దానికి తగినంత బలం లేదు. ఎంతవరకూ దేహంతో సంబంధం ఉంటుందో అంతవరకూ పని చేయకుండా ఉండలేరని చెప్పింది గీత "నహి దేహభృతా శక్యం త్యక్తుం కర్మాణి అశేషతః" (18-11) శరీరం పనిచేస్తూ ఉండకపోయినా మనస్సు పనిచేస్తూ ఉంటుంది. కనుక ఇంద్రియాలకు సుఖం ఉంటుంది. ఆ మనస్సు అణగలేదు. పైకి మాత్రం జ్ఞానిలా ఉంటూ లోలోపల మనస్సు, ఇంద్రియాల వెంట తిరుగుతూ ఉంటే ఇంతకంటె కపటి మరొకడు ఉంటాడా? అని గీత ప్రశ్నించింది.


Saturday, 8 October 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 215 వ భాగం



శంకరుల ఉపదేశ సారాంశం: 


వేదాలలో చెప్పిన కర్మలను అనుసరించవలసిందే. దేనికోసం! చిత్తశుద్ధి కోసం. కేవలం అనుష్ఠానమే లక్ష్యమని మీమాంసకులంటారు. వారు పొందే స్వర్గాది సుఖాలు కూడా నిత్యం కావని, ఆత్మను తెలిసికోవడమే అంతిమ లక్ష్యమని శంకరులున్నారు.


వేదంలో చెప్పిన కర్మకాండకే మీమాంసకులు ప్రాధాన్యం ఇచ్చారుగాని అందలి జ్ఞాన కాండను తడమరు. అయితే అది ఎందుకుందని వారిని ప్రశ్నిస్తే వాటిని అర్ధవాదాలంటారు. అనగా వేదంలోని విధి నిషేధ వాక్యాలను బలపరచి బోధించడానికి నిందా రూపంలో గాని స్తుతి రూపంలోగాని చేసే వివరణ, అర్ధవాదం. అనగా స్తుతిగాని, నిందగాని యోజనంగాగల లౌకిక వాక్యం. జ్ఞాన కాండ గురించి వీరేమంటారంటే నీవు దేవుడవవుతావని, కర్మలను ప్రోత్సహించినట్లే ఆ మాటలుంటాయని అర్ధం చెబుతారు.


శంకరుల ఉపదేశ సారాంశం: శంకరులు కర్మలను కర్మల కొరకే చేయడం లేదని, స్వర్గాది సుఖాల కోసం చేస్తున్నారని అన్నారు. కర్మకాండ ఇది చేయి ఇవి చేయి అని అంటే, ఏది చేయకూడదో అది వద్దని జ్ఞానకాండ చెబుతోంది. వేదంలో సత్యం పలుకుమని విధి వాక్యం ఎట్లా ఉందో పరదార సంగమం వద్దనీ ఉంది. చేయకూడని వాటిని ఎట్లా చేయకుండా ఉంటున్నామో అనగా అక్కడ నిష్క్రియత్వం ఎట్లా ఉందో అట్లాగే చివరి దశలో అనగా జ్ఞాన దశలో నిష్క్రియంగా ఉండడమే అద్వైతలక్ష్యమని శంకరులన్నారు. ఆత్మ సుఖం కోసం అన్నిటినీ విడిచి పెట్టాలని వీరంటారు. అటువంటప్పుడు జ్ఞానకాండ, ఎట్లా అర్ధవాదమౌతుంది? కర్మవల్ల వచ్చే ఫలాన్ని, జ్ఞానం వల్ల వచ్చే ఫలాన్ని బేరీజు వేసుకోవద్దా? కర్మల వల్ల వచ్చే సుఖం తాత్కాలికం. జ్ఞానం వల్ల ఆత్మానందం కల్గుతుంది. అది శాశ్వతం. ముందుగా కర్మలను చిత్తశుద్ధికై చేయాలి. ఇది చిక్కిన తరువాత వాటిని విసర్జించాలని వేదాంతులంటారు.


ఆపైన మీమాంసకులు కర్మయే ఫలమిస్తుందని, దేవునితో నిమిత్తం లేదని అంటారు. ఈ సమస్త ప్రపంచం ఒక నియతితో సాగుతోందని, దీనిని నడిపేవాడున్నాడని, కర్మలకు తగిన ఫలమిస్తాడని వేదాంతులంటారు. కర్మ ఫలాలనాశించకుండా కర్మలను చేయాలని, ఫలాలను స్వామికి అర్పించాలని, చిత్తశుద్ధిని ప్రసాదింపుమని ప్రార్ధించాలని వేదాంతులంటారు.


Friday, 7 October 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 214 వ భాగం



"పతన్ పతన్ సౌధత లాన్యరో రుహం

యది ప్రమాణం ప్రుతయో భవంతి 

జీవేయేమస్మిన్ పతితో సమస్ధలే 

మజ్జీవనే తచ్ఛృతి మాన్యతా గతిః"


అంత ఎత్తునుండి కింద పడినపుడు బ్రతికాడు కానీ కంటికి గాయం అయింది. ఎందుకిట్లో జరిగిందని కోపగించాడట. వేదాలే ప్రమాణమైతే అని శంకించావు. కిందపడి చనిపోలేదు. కాని కంటికి గాయం అయింది. నీలో సందేహం ఉంది కనుక ఇట్లా జరిగిందని అశరీరవాణి వినబడిందట.


విద్యాశాలలో తాను బౌద్ధుడనని గురువులను నమ్మించి మోసం చేసానని, అనగా గురు ద్రోహం చేసానని, దానికి తగిన ప్రాయశ్చిత్తం మండుతున్న ఊకలో పడి మరణించడమే మేలనుకొని అట్లా చేస్తున్న సమయంలో శంకరులు వెళ్ళారు. 


వీరి దర్శనం వల్ల ఆ మంటలో చల్లదనం అలముకుంది. అంతేకాదు వీరు జ్ఞానామృతాన్ని పంచి పెట్టారు, వెదజల్లారు కూడా.