Thursday, 20 October 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 227 వ భాగం



కొంతకాలం తరువాత వీరు శంకరులను సమీపించి అయ్యా! మీకు గురుదక్షిణ ఈయాలనుకుంటున్నానంటూ ఒక తాళపత్ర సంపుటిని వీరి ముందుంచారు. అదే నైష్కర్మ సిద్ధియనే గ్రంథం అది నిష్క్రియత్వాన్ని చెప్పే గ్రంథం, అనగా మోక్షాన్ని చెప్పేది. శంకరుల సంకల్పం వీరిలో ప్రవేశించి వ్రాయించి ఉండవచ్చు.


సురేశ్వరులకు ఆ విధంగా ఆటంకం వచ్చి శారీరక సూత్రాల వార్షికం వ్రాసి యుండకపోవచ్చు. కాని శంకరులు రెండు ఉపనిషత్ భాష్యాలకు వార్షికం వ్రాసేరు. తైత్తిరీయము అనేది; కృష్ణ యజుర్వేదానికి చెందింది. బృహదారణ్యకం శుక్ల యజుర్వేదానికి చెందింది. దక్షిణాదిన ఎక్కువగా కృష్ణయజుర్వేదం ఉత్తరాది శుక్ల యజుర్వేదం వాడుకలో ఉన్నాయి. శంకరుల దక్షిణామూర్తి శ్లోకాలపైన మానసోల్లాసం వ్రాసేరు.


కంచి, శృంగేరి, ద్వారక మఠాలవారు సురేశ్వరులను ఆచార్య పరంపరలో చేర్చారు. సురేశ్వరులకు పీఠాధిపత్యానికి అర్హత ఉన్నా, సర్వజ్~ణాత్ముడనే బ్రహ్మచారి, శాస్త్ర సంబంధ విషయాలను చూస్తూ ఉండేవాడు. సురేశ్వరులు సిద్ధి పొందిన తరువాత ఇతడు పీఠాధిపతి అయ్యాడు.


సురేశ్వరులను అన్ని మఠాలకు ప్రధాన వ్యక్తిగా, పర్యవేక్షకునిగా నియమించి ఉంటారు.


ఎందుకిట్లా వీరికి ప్రాధాన్యం ఇచ్చి యుంటారు? పూర్వాశ్రమంలో గొప్ప మీమాంసకులు, వయస్సులో, విద్యలో అందరికంటే పెద్దవారు సంపదనంతటినీ త్యాగం చేసి వచ్చినవారు. కనుక వారికి తగిన స్థానం ఈయాలని పై మూడు మఠాలపై పర్యవేక్షణ చేసే బాధ్యతను వీరికి అప్పగించి యుంటారు. వారి తరపున బ్రహ్మచారిని నియమించి యుండవచ్చు. 


మఠాధిపతికి కొన్ని లౌకిక కార్యకలాపాలు ఉంటాయి. అంటే నిత్య కృత్యంలో కార్యకలాపాలు జరగాలి, వాటిని చూసే సురేశ్వరులకు బాధ్యత అట్లా ఉంచగా, వైదిక కార్యకలాపాలకు బ్రహ్మచారియై వచ్చిన సర్వజ్ఞాత్మునకు పీఠాధితిపత్యాన్ని ఇచ్చి యుంటారు. బ్రహ్మచారియై తరువాత సన్న్యాసించిన వ్యక్తిపై ఎక్కువ పూజ్యభావంతో జనులు చూస్తారు.


కంచిలో ఒక వీధికి మండన మిశ్ర అగ్రహారం అనే నామం ఉంది. వీరికి ఆశ్రమ స్వీకారానికి ముందు జరిగియుంటుంది. మాహిష్మతి నుండి రెండు వందల బ్రాహ్మణ కుటుంబాలు ఇక్కడకు వచ్చాయని యుంటారు.


Wednesday, 19 October 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 226 వ భాగం



ఐదు ప్రధాన మఠాలను, ఇంకా చిన్న మఠాలను శంకరులు స్థాపించారని ఉన్నా రామేశ్వరంలో ప్రధాన మఠాన్ని స్థాపించకుండా చిన్న మఠాన్ని స్ధాపించారు. మహమ్మదీయుల దండయాత్రలో చిన్నమఠాలు ధ్వంసమైపోయాయి. ప్రధాన మఠాలకు వీరి తాకిడియున్నా అవి పూర్తిగా అదృశ్యం కాలేదు. వాటిని ఇతర ప్రాంతాలకు తరలించారు. లేదా ఆ మఠాలను కొంతకాలం మూసి యుండవచ్చు. మన కంచి మఠాన్ని ఉడయార్ పాలయానికి, తరువాత కుంభకోణానికి మార్చారు. జోషీ మఠాన్ని (బదరి) కూడా కొంతకాలం మూసియుంచి తరువాత తెరిచారు.


రామేశ్వరంలో ప్రధాన మఠమే కనుక ఉంటే అది కనుమరుగైన పరిస్థితి యుండేది కాదు. అందువల్ల శృంగేరిలోనిదే ప్రధాన మఠంగా పరిగణింప బడింది. అయితే దీనిని తమ యూహ ప్రకారం ఏర్పాటు చేయలేదు. అదంతా దైవికంగా జరిగింది. విద్యా దేవతయే ఇక్కడ మఠాన్ని నెలకొల్పునట్లు చేసింది. ఈ మఠానికి ప్రత్యేక క్షేత్రం, రామక్షేత్రం అనగా 

రామేశ్వరమే. కంచి ప్రపంచానికి నాభి వంటిది కనుక అక్కడొక మఠాన్ని స్థాపించారు. ఇవి ప్రధానమైనవి. శారదా సంకల్పానుగుణంగా శారదా మఠం ఏర్పడింది.


సురేశ్వరుల ప్రత్యేక వ్యక్తిత్వం


మానవ స్వభావం ఎంత విచిత్రంగా ఉంటుందో చూడండి. శంకరుల శిష్యులు, సురేశ్వరునే శంకించారు. శంకరుల శారీరక భాష్యానికి వివరణ వ్రాసే సురేశ్వరులు గురించి శంకరులతో శిష్యులు "అతడు పూర్వాశ్రమంలో గొప్ప మీమాంసకుడు కదా, మీ చేత ఓడింపబడ్డాడు. తప్పనిసరై మీకు శిష్యుడు కావలసి వచ్చింది. అతడు, అద్వైత వేదాంతాన్ని హృదయ పూర్వకంగా తమ రచనలలో ప్రతిపాదిస్తాడంటారా? మీ మాదిరిగా బ్రహ్మచర్యం నుండి ఆశ్రమ స్వీకారం చేయలేదు కదా. అతనికి తత్త్వం ఒంటబట్టిందా? సిద్ధాంతానికి చేటు తీసుకొని వస్తాడేమో!" అని గొణిగి యుంటారు. సురేశ్వరులు వీరి హావభావాలను చూసి వ్రాయడానికి పూనుకోలేదు.


Tuesday, 18 October 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 225 వ భాగం



శృంగేరి యొక్క గొప్పదనం


ప్రయాణం సాగిస్తూ తుంగభద్రా నదీతీరంలోని శృంగేరికి చేరుకున్నారు. అక్కడ ప్రసవించే కప్ప పై ఎండ తగలకుండా ఉండడం కోసం పాము పడగనెత్తిన దృశ్యాన్ని చూసారు. పాముకి, కప్పకు సహజ వైరం. కాని ఇక్కడ రక్షిస్తోందేమిటి? ఇది పరమసాత్వికమైన, మహనీయమైన స్థలమని భావించారు. ఇంతలో అందెల చప్పుడు వినబడడం లేదు. శంకరులు వెనుదిరిగి చూసారు.


అక్కడ ఇసుక తిన్నెలలో సరస్వతి పాదాలు చిక్కుకోవడంచే అందెల చప్పుడు వినబడలేదు. ఏది జరిగినా మన మంచికోసమే అంటూ అక్కడే శారదా పీఠాన్ని స్థాపించారు.


వారక్కడ చాలాకాలముండి అమ్మవారిని అర్చించారు. మొదటి 16 సంవత్సరాల వయస్సులో గ్రంథాలన్నిటినీ వ్రాసేరు. మిగిలిన 16 సంవత్సరాలలో దేశాన్ని ముమ్మారు పర్యటించి అనేక ఘన కార్యాలు చేసారు. చాలాకాలం శృంగేరిలోనున్నట్లు శంకర విజయం చెబుతోంది.


శృంగేరీ మఠ ప్రత్యేకత


మిగిలిన మఠాలు, తామెక్కడ స్థాపించాలో ఊహించి ఏర్పాటు చేయబడినవి. భారతదేశంలో నాల్గు మూలలా నాల్గు క్షేత్రాలున్నాయి. వీటిని 'చార్ధామ్' అంటారు. ఉత్తరంలో బద్రీనాథ్, పడమర తీరాన ద్వారకానాథం (సోమనాథం); తూర్పున పూరీలో జగన్నాథం, దక్షిణాన రామనాథం (రామేశ్వరం) వీటిల్లో బదరి, ద్వారక, పూరీ క్షేత్రాలలో మూడు ప్రధాన మఠాలను స్థాపించారు.


Monday, 17 October 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 224 వ భాగం



తన భర్త ఓడిపోయాడని ప్రత్యక్షంగా చెప్పకుండా ఇద్దరూ నా భిక్షను స్వీకరించండని గడుసుగా చెప్పింది. ఇద్దరికీ నమస్కరించింది.


భోజనానికి రండని గృహస్థు ఇతరులను పిలవకూడదు. వైశ్వదేవానికో, లేదా దేవతార్చనకో దయ చేయండని అనాలి. మండనుడు ఓడినట్లు సున్నితంగా చెప్పినట్లైంది.


ఏ భార్యయైన తన భర్త, సన్న్యాసం పుచ్చుకుంటున్నాడంటే సహించగలదా? కాని సరసవాణి, ఇంత వరకు యజ్ఞ పత్నిగా ఉంది. ఆమెకు అలౌకిక శక్తి యుంది. కనుకనే 21 రోజులు, పూలమాల వాడిపోకుండా ఉండగలిగి ఉంది. ఆమె ఉభయ భారతిగా ఇప్పుడు ప్రసిద్ధిని పొందింది. ఆమె సరస్వతి యొక్క అవతారమే కదా!


మండనుడు సన్న్యాసం స్వీకరించి సురేశ్వరాచార్యులైనారు. బ్రహ్మలోకానికి, తిరిగి సరసవాణి వెళ్ళాలనుకుంది.


ఇట్లా వెళ్ళిపోతే ఎలా అమ్మా! నీవిక్కడే ఉండి అందరికీ జ్ఞానాన్ని, బుద్ధిని కలిగించాలని నవదుర్గా మంత్రంలో ఆమెను శంకరులు బంధించారు. ఆ మంత్రానికి లొంగినట్లు కనబడింది. అట్లా భక్తి ప్రేమ పాశాలతో శంకరులామెను బంధించగలిగారు.


అయితే నన్నిక్కడ ప్రతిష్ఠించవద్దని, నీవు దేశం తిరుగుతూ ఉండమని, వెనుదిరిగి చూడవద్దని చూస్తే అక్కడే ఉండిపోతానని ఆమె అనడం, శారదా పీఠాన్ని శంకరులేర్పాటు చేయడం మొదలైన కథ మనకు తెలిసిందే అయినా చెబుతున్నాను. వెను దిరిగి చూడకుండా నడుస్తున్నారు. ఆమె అందెల గలగల, వినబడుతూనే ఉంది.


Sunday, 16 October 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 223 వ భాగం



ఇక వాదానికి కూర్చున్నారు. మధ్యవర్తి ఉండాలి కాబట్టి ఇతని భార్యయైన సరసవాణియే మధ్యవర్తినిగా ఉంచారు. మండనుడు, బ్రహ్మయని, ఆమె సరస్వతీయని శంకరులకు తెలుసు. కనుక సరస్వతి మాట శిరోధార్యమే. తన భర్త ఓడిపోయాడన్నా తనకి ఇబ్బందియే, సన్న్యాసి గెలిచాడని గట్టిగా చెప్పగలదా? వారిద్దరి మెడలలో పూలమాలికలను వేసి ఏది వాడిపోతే అతడోడినట్లని నిర్ణయించింది.  

శంకరులు ఓడిపోతే మరల గృహస్థాశ్రమాన్ని స్వీకరించాలని, మండనుడు ఓడిపోతే సన్యాసం పుచ్చుకోవాలని నియమం పెట్టుకున్నారు. వాదం మొదలైంది. రెండు పర్వతాలు ఢీకొన్నట్లుగా 21 రోజులు చర్చ జరిగింది.


శంకరులు అద్వైతాన్ని ప్రతిపాదించారు. కొన్ని వేద మంత్రాలను ఆధారంగా వీరిని ఖండించడం సబబు కాదు. ఎవడగ్నులను ఆరాధించకుండా ఉంటాదో అతనికి వీరహత్యాదోషం వస్తుందనే తైత్తిరీయ మంత్రాన్ని వీరిపట్ల అన్వయించకూడదు. ఎవడు వైదిక కర్మలను విడిచిపెట్టాడో అట్టివానికి ఆ మంత్రం అన్వయిస్తుంది. అట్టివారిని కర్తవ్యోన్ముఖ్యులను చేయడం కోసం అట్టి మంత్రాలున్నాయి. ఇక నివృత్తి మార్గంలో శంకరులు ఉన్నారు. బాహ్యమైన అగ్నిని విడిచి జ్ఞానాగ్నితో నిరంతరం వెలుగొందుతూ ఉన్నారు. ఒక పచ్చి కాయ, పండు కావడం రంగు రుచి మారడం జరిగి పక్వమైన తరువాత క్రిందబడితే మరల చెట్టునకు తగిలిస్తారా? అదేవిధంగా, జ్ఞానం పండేదాకా కర్మలు చేస్తూ ఉండవలసిందే. పండు పక్వానికి (పూర్తిజ్ఞానం) వచ్చిన తరువాత కర్మలు తమంత తామే తొలగిపోతాయి. ఇట్టి జ్ఞానం కలిగినవారు అన్నిటినీ సమంగా చూడగలరు. ప్రేమతో చూస్తారు. తరువాత నిష్క్రియులై యుంటారు. సర్వభూతములు, తననుండి భయం లేకుండా ఉండుగాక అని వారు ప్రైష మంత్రాన్ని పలికినవారు కదా.


మండునుడు అద్వైతాన్ని పూర్తిగా అంగీకరించాడు. ఇతని మెడలో పూలమాల వాడిపోయింది. ఇక ఇతనిలో సగభాగమైన ఆమె ఊరుకొంటుందా? ఆమె కూడా అంగీకరించింది. తల ఒగ్గింది. ఆమె అంగీకరించడం ఎటువంటి దంటే వసిష్ఠుడు తనను బ్రహ్మర్షియని పిలవాలని విశ్వామిత్రుడన్నట్లుగా భావించాలి.


శంకరులు, సర్వజ్ఞ పీఠారోహణం చేసినపుడు సరస్వతి ప్రత్యక్షమై వీరిని సర్వజ్ఞులని చెప్పినట్లున్న కథ కూడా ఉంది.


Saturday, 15 October 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 222 వ భాగం



ఇతనికి ఉపదేశించాలని శంకరులు వెళ్ళారు. ఆనాటి కాలంలో కల్లుగీత గీసేవారికి ఒక విద్య తెలుసు. కొబ్బరి చెట్టు మొదట్లో ఒక మంత్రం చదివితే వెంటనే చెట్టు నేలకొరిగేదట. కొబ్బరికాయలను, కల్లును అట్లా సులభంగా తీసుకునేవారు. మరొక మంత్రం చదివితే లేచి నిలబడేదట.


మండనుల ఇంట్లో కొబ్బరి చెట్టు ఒకటుండేదని, ఆ వీధిలో పోతున్న కల్లుగీత గీసేవాడిని తనకా విద్య నేర్పమని అడిగారని, దానినతడు నేర్పాడని, మండన మిశ్రుల ఇంట్లో వాలేరని ఒక కథ ప్రచారంలో ఉంది. యోగశక్తి ద్వారా ప్రవేశించారని మరొక కథ.


శ్రాద్ధంలో భోక్తలుగా జైమిని మహర్షి, వ్యాసాచార్యులున్నారు. పరీక్షిత్తు ఎంత జాగరూకత వహించినా తక్షకుడు నిమ్మకాయలో దూరలేదా? అట్లాగే శంకరులూ ప్రవేశించారు. తక్షకుడు విషం కక్కడానికి వెడితే, శంకరులు అమృతాన్ని పంచడం కోసం వెళ్ళారు.


ఓ సన్యాసీ ఎక్కణ్ణుంచి వచ్చావని శ్లేషతో కూడిన ప్రశ్నలు, శంకరుల సమాధానాలు అయ్యాయి. శ్రాద్ధంలో విష్ణుస్థానంలో సన్న్యాసిని నియమించవచ్చని జైమిని, వ్యాసులన్నారు. భిక్ష స్వీకరింపుమని మండనుడు అన్నాడు.


నేను కేవలం భిక్ష కోసం రాలేదు. నాకు కావలసింది వాద భిక్ష, కుమారిలుడు పంపగా వచ్చానన్నారు. ముందీ భిక్షను గ్రహించండని తరువాత వాద భిక్షయని అన్నాడు మండనుడు.

Friday, 14 October 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 221 వ భాగం



సరియైన జ్ఞానాన్ని 'ప్రమ' అని అంటారు. తప్పైన జ్ఞానాన్ని 'భ్రమ' అని అంటారు. భ్రమ తప్పైనా ఆ సమయంలో అది నిజమే అనిపిస్తుంది. ప్రమాణంగా కన్పిస్తుంది. కాని ఆలోచిస్తే అది భ్రమ అని తెలిసి అప్రమాణమై పోతుంది.


ఒక వస్తువు కనబడితే ఇది తప్పా? లేక ఒప్పా అని తెలుస్తుంది. రెండు భిన్న వస్తువులను చూసినపుడు అది వేరు, ఇది వేరని మొదట కలుగుతుంది. వెంటనే అది నిజం అనే మరొక జ్ఞానం కలుగుతోంది. ఒక చెట్టును చూసాం. ఇది చెట్టే, నిజం అనే రెండవ జ్ఞానం కల్గుతోంది. ఈ రెండవ జ్ఞానానికి చెట్టును చూడడం కారణమా? లేక మరొక దానివల్ల ఇది కల్గుతోందా? చెట్టును చూడడమే రెండవ జ్ఞానానికి కారణమనేవారు స్వతః ప్రమాణవాదులు, అట్లా కాదు. వేరొక దాని వల్ల ఈ రెండవ జ్ఞానం ఏర్పడుతుందని చెప్పేవారు. పరతః ప్రమాణవాదులని సారాంశం.


(ఒక జ్ఞానం యొక్క యథార్ధాన్ని రుజువు పరచడానికి పర ప్రమాణం కావలసి వస్తుందని ఇది అంతు పట్టదని మీమాంసకులు లేవనెత్తి వేదం యొక్క ప్రామాణాన్ని సాధించడం కోసం ఈ చర్చ సాగింది. శబ్దం, స్వతః ప్రమాణమైతే శబ్ద రూపమైన వేదం యొక్క ప్రామాణికతను ప్రశ్నింపతగదని; శబ్దం పరతః ప్రమాణమైతే వేదాలయొక్క ప్రామాణ్యాన్ని సాధించడం కోసం ఈశ్వరుడు వీటి కర్తయని చెప్పాలని, రెండు వాదాలు. మొదట దీనిని స్థాపించినవారు మీమాంసకులు. వేదం తనంతట తానే ప్రమాణమనేవారు. ఈశ్వరుడు కర్త అవడం వల్ల ఇవి ప్రమాణములని చెప్పేది నైయీయికమతం - అనువక్త)


మండనులను, సరసవాణిని ఓడించుట


కుమారిలుడు ప్రతివాదులను గౌరవించునట్లుగా మండనుడు స్వాగతం పలుకలేదు. అసలు సన్న్యాసులంటే ఇష్టపడడు. వారు వేద కర్మలను విడిచారని కోపం. వీరిని చూడడమే పాపమని భావించేవాడు. పిలువకుండా శంకరులు అతని ఇంటికి వెళ్ళారు. ఆనాడతని ఇంట్లో శ్రాద్ధకర్మ, ఆనాడు సన్యాసులను చూడడం మహాపాపమని భావించాడు. ఇంటి తలుపులు మూసేసి యున్నాయి.