Tuesday, 7 February 2023

శ్రీదత్త పురాణము (43)



సుమతి భారంగా ఊపిరి పీల్చింది. చుట్టూ అంతా దుర్గంధం. భర్త పాదాలను రెండు చేతులతో స్పృసించింది. కళ్ళకు అద్దుకుంది. మరల నడక సాగించింది. ఇంత జరిగినా కౌశికుడు ఏమీ పట్టనట్లుగా వున్నాడు. పెద్ద పెట్టున విరగబడి నవ్వుతూ వున్నాడు. ఆ కదలికలకు సుమతి కాళ్ళు తడబడుతున్నాయి. కంగారు పడింది. రెండు పాదాలు పట్టుకొని స్వామి, నాధా అని పిలచింది. అప్పుడు కౌశికుడు నడు, నడు తొందరగా సానిపాప ఇంటికి చేరే సరికి తెల్లవారేలాగా వుంది అన్నాడు కౌశికుడు.


తెల్లవారితే తన భర్త తనకు లేడు. ఏమిటి చెయ్యడం ఏముంది ఒకటే దారి. సూర్యోదయాన్ని అడ్డుకోవడం. అడ్డుకుంటే సకల సృష్టి అల్లకల్లోలమవుతుంది. ఏమైతే నేమి నా భర్త నాకు ముఖ్యం. సుమతి త్వరగా ఒక నిశ్చయానికి వచ్చింది. “ఈ రేయి తెల్లవారకుండుగాక! సూర్యదేవా! నీకు ఇంక ఉదయాస్తమయాలు లేవు" అని బిగ్గరగా అంది. కౌశికుడు అదిరిపడ్డాడు. "సుమతీ ఏమిటి ఈ శాపం? ప్రత్యక్షదైవం సూర్యనారాయణున్నా నీవు శపించడం? నా కామవాంఛను పొడిగించడం కోసం ఈ రాత్రిని అనంతంగా పొడిగిస్తున్నావా? సూర్యుడే ఉదయించకపోతే సృష్టి అంతా ఏమయిపోతుంది ఆలోచించావా? ఇది మహా పాపం సుమతీ శాపాన్ని ఉపసంహరింపజేసుకో" అన్నాడు కౌశికుడు. నాధా సూర్యుడు ఉదయిస్తే నాకు మాంగళ్యం నిలువదు అంది. అదేమిటి ఎవరు చెప్పారు నేను బ్రతికి ఉండగా నీకు మాంగళ్యం ఉండక పోవడం ఏమిటి? అన్నాడు కౌశికుడు. ఇది మాండవ్యుడి శాపం. ఇపుడేగా శపించాడు. మీకు వినిపించలేదా అంది సుమతి.


ఏమిటి సుమతీ నీవు అంటున్నది. నాకేమీ అర్థం కావడంలేదు. మాండవ్యుడేమిటి శపించడమేమిటి? ఈ శ్మశానంలోకి ఆయన ఎలా వచ్చాడు? ఎందుకు శపించాడు? మనం ఏం తప్పు చేశాము?


సుమతి ఆశ్చర్యపోయింది. ఏమిటి ఇలా మాట్లాడుతున్నారు. జరిగిన దుఃస్సంఘటన ఈయనకి తెలియదా. ఇప్పుడేగా జరిగింది. ఏమీ తెలియనట్లు జరగనట్లు మాట్లాడుతున్నాడు ఏమిటి నాధా. పరీక్షిస్తున్నారా. లేదా గేలిచేస్తున్నారా. కొరతకు వ్రేల్లాడుతున్న మాండవ్యుడు శిరస్సుకి మీకాలు తగిలింది. ఆయన మండిపడుతూ శపించాడు. సూర్యోదయం అయితే నా మాంగళ్యం విలవదు. ఇది జరిగి రెండు క్షణాలు కాలేదు. ఏమీ ఎరగనట్లుగా అడుగుతున్నారు. వేళా కోళానికి ఇదేనా వేళ? '


Monday, 6 February 2023

శ్రీదత్త పురాణము (42)

 

మాండవ్యుడు భాధతో మూలిగాడు. అతని నోటి నుండి చెవుల నుండి ముక్కు నుండి రక్తం ధారలు ధారలుగా కారుతూ అతని భుజాల నుండి కారుతూ నేలమీద మడుగులు కట్టింది. మహర్షీ మీ పరిస్థితి దయనీయంగా వుంది.


చివరి దశలోవున్న మీకు నీ ఉపకారము చేయలేకపోతున్నాం. ఇది గృహస్థాశ్రమానికి విరుద్ధం. ఇందుకు సిగ్గుపడుతున్నాను. నా భర్తను ఈనేల మీద దించలేను. దించి మళ్ళీ భుజాల మీద ఎత్తుకోలేను అశక్తురాలిని. నన్ను క్షమించండి. మహారాజు గర్వాంధుడు. వాళ్ళకి చెవులే కాని కళ్ళు వుండవు. సరే కారణం ఏదయితేనేమి మీరు ఈ భవ సాగరం నుంచి మరికొద్ది సేపట్లో విముక్తులు కాబోతున్నారు. యోగ విద్యాపారంగతులు మీరు అంతరగ్నిని ప్రజ్వలింపజేసుకొని బ్రహ్మగ్రంధితో ముక్తి మార్గాన పయనించగలరు. ఉపాధి తాలూకు నశ్వరత్వం మీకు తెలియంది కాదు. ఈ సమయంలో నా భర్తను శపించి అది రోగంతో వున్న బ్రాహ్మణున్ని శపించి నా నొసట వైధవ్యాన్ని లిఖించడం భావ్యంకాదు. కొరతతో మీ ప్రాణాలు తడబడుతున్నాయి. బరువుతో నా పరిస్థితి అలాగే వుంది. దయచేసి శాపాన్ని తొలగించండి. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పులకి దండన వుండాలంటే ఇంకో శాపం ఏదైనా ఇవ్వండి. నేను వైధవ్యం భరించలేను. స్వామి దయచూపండి. శిరస్సు వంచి చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. ఇదే సాష్టాంగ నమస్కారమనుకోండి అన్నది.


అప్పుడా మహర్షి ఆమెతో సాధ్వి! నీ పతి సేవా పరాయణత్వమునకు సంతోషపడుతున్నాను. అయినా ఇచ్చిన శాపం తొలగించలేని అశక్తుణ్ని. ఇది కూడా దైవలీల. అందుకే నా నోటి నుండి శాపం అలా వచ్చింది. వెంటనే శిరస్సు వ్రక్కలైపోవుగాక అని నేను అనలేదు కదా. సూర్యోదయం వరకు వ్యవధివుంది కదా ప్రయత్నించు. నీ భర్తను కాపాడుకోగలుగుతావు. నీ పాతివ్రత్యమే నీకు శ్రీరామరక్ష వెళ్ళిరా శుభమగు గాక అన్నాడు. అప్పుడా సుమతి చాలు మహర్షి చాలు ఇంతటి ఆశీస్సులు ఇచ్చారు. ఇంక నాకు భయంలేదు. కానీ ఉపచారములు చెయ్యవలసిన సమయంలో మిమ్మల్ని ఈ స్మశానంలో ఒంటరిగా వదలి వెళ్తున్నాము. మన్నించండి. మీకు ఉత్తమ గతులు కల్గాలని ఇష్టదైవాన్ని ప్రార్ధిస్తున్నాను. సెలవు అంటూ బయలు దేరింది.


Sunday, 5 February 2023

శ్రీదత్త పురాణము (41)



అడ్డంగా వచ్చిన చెట్లకొమ్మలను రెమ్మలను లతలను కాళ్ళతో చేతులతో ఆడిస్తూ వున్నాడు. తలకు తగిలే చెట్లు కొమ్మల నుండి తప్పించుకుంటూవున్నాడు. గర్వంగా నవ్వుకుంటున్నాడు. పై బరువుల కదలికలతో సుమతి కాళ్ళు తడబడుతున్నాయి. అప్పుడప్పుడు తూలిపడిబోతోంది. చెట్లకొమ్మలు గీసుకుంటున్నా, కాళ్ళ క్రింద ముళ్ళూ రాళ్ళూ వున్నా లెక్కచేయకుండా నడుస్తూవుంది. ఎటుచూసినా కారు చీకటి. ఏనాడూ చూసి ఎరగని ప్రాంతం దారి ఎటో తెలియని స్థితి అడుగుదామంటే ఎవరూ కనిపించడం లేదు. అయినా నడుస్తోంది. ఇంతలో "చంపేశావురా నీచుడా” అంటూ మూలుగులాంటి కేక వినిపించింది. భారంగా ఆ మాట వినిపించింది. సుమతి నివ్వెరపోయింది. ఎవరది అంటు ఆ మూలుగు వినిపించిన వైపుకు చూసింది. చేరువలోనే మానవశరీరం. కొరత వేయబడి కొన వూపిరితో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తి కనపడ్డాడు. చీకటిలో ఎవరో పోల్చుకోలేకబోయింది. సుమతి ఎవరు స్వామి తమరు అంది భయంభయంగా.


నన్నే గుర్తు పట్టలేకపోయావా? నేను మాండవ్య మహర్షిని. ఈ దేశం ఏలే మహారాజు గర్వాంధుడై నాకు చౌర్యం అంటగట్టి కొరత వేయించాడు. పరమాత్మని ధ్యానం చేసుకుంటూ ప్రాణాలుపోకడకు ఎదురుచూస్తున్నాను. నీ భుజాల మీద స్వారీ చేస్తున్న ఈ దుష్టుడు నా తలపై తన్నాడు. ప్రాణం జిల్లార్చుకుపోయింది. మహర్షి అనే మర్యాదలేదు. మనిషి అనే గౌరవంలేదు. చావుకి సిద్ధంగా వున్నాననే దయలేదు. దీనికి వీడు శిక్ష అనుభవించవలసిందే. వీడు సూర్యోదయం అయ్యేలోగా మరణించవలసిందే ఇది నా శాపం అన్నాడు. పాపం సుమతి నిలువునా ఒణికిపోయింది. మహర్షీ మహర్షీ అంటూ రెండు చేతులు జోడించి కన్నీరు మున్నీరుగా విలపిస్తూ పాదాలపైబడి ప్రాధేయపడలేని స్థితిలో వున్నాను. నా భుజాలపై నున్నది ఎవరో కాదు నా భర్త కౌశికులవారు. మేము మీకు తెలియని వాళ్ళంకాదు. వీరి ఆరోగ్యం బాగున్న రోజుల్లో తమరికి నేను చాలా మార్లు అతిధి మర్యాదలు చేసుకున్నాను. ఇటీవలే ఈ రోగంతో ఈయన ఇలా వున్నారు. కుష్టురోగంతో పరితపిస్తున్నారు. పాపం ఏమి చేస్తున్నారో వారికి తెలియడంలేదు. కాళ్ళు చేతులు తిమ్మిరి లెక్కి పాపం స్పర్శ జ్ఞానాన్ని కోల్పోయారు. వీరి చిన్న కోరిక తీర్చడానికి నేను భుజాల మీద మోసుకెళ్తున్నాను. పాపం పొరబాటున వీరి కాలు మీ శిరస్సుకు తగిలింది. కళ్లు కనిపించని చీకటి ఇది. తెలిసి చేసిన పొరబాటు కాదు. కావాలని చేసిన అవమానం కాదు. మిమ్మల్ని అర్చించి ఆశీస్సులు పొందవలసిన వాళ్ళం. తెలిసి అవమానిస్తామా? అవమానిస్తే మాకు ఒరిగే దేమిటి? మహర్షులు అనుగ్రహిస్తే మహా రోగాలు సైతం ఉపశమింపజేసు కోవచ్చు. ఈ ఆశతో అర్చిస్తాము కాని అవమానిస్తామా? తెలియక జరిగిన ఈ తప్పు కాయండి. నా అవస్థ చూస్తున్నారుకదా. మూలిగే నక్క మీద పిడుగు పడ్డట్లుగా అయ్యింది నా పరిస్థితి. వైధవ్యం భరించలేను. దయచేసి శాపం ఉపసంహరించండి. ఆరోగ్యం కుదుటపడేటట్లు ఆశీర్వదించండి. జన్మజన్మలకు మీకు ఋణపడి వుంటాను అన్నది.


Saturday, 4 February 2023

శ్రీదత్త పురాణము (40)

 

సుమతి మాటలతో కౌశికుడు కాస్తంత తేరుకున్నాడు. మరల సానిపాపనే తలుచుకుంటూ సూర్యాస్తమయము కొరకు ఎదురు చూస్తూ నడుం వాల్చాడు. వంటింటి పనులన్నీ చకచకా ముగించుకొని సుమతివచ్చి భర్తను చూచి కారణం ఏదైతేనేమి తన భర్త ఆనందంగా వున్నాడు. అనారోగ్యాన్ని పూర్తిగా మరచిపోయాడు ఇదే చాలునని తృప్తిపడి భర్తను లేవదీసి పీటవేసి దానిపై అతన్ని కూర్చోబెట్టి కుష్టురోగంతో కుళ్ళివున్న శరీరంపై వున్న కట్లను విప్పి చీమునెత్తురూ శుభ్రంచేసి మందులురాసి కొత్త గుడ్డలతో కట్లు కట్టింది. రోగకారణంగా సగానికి పైగా తినేసిన చేతి వ్రేళ్ళు కాలి వేళ్ళు కనబడకుండా జాగ్రత్తలు తీసుకుంది. రసికంపురాకుండా పరిమళ ద్రవ్యాలు శరీరం అంతా పులిమింది. నొసట వీభూతి కుంకమ అద్దింది. పట్టు పంచ కట్టించింది. పట్టు శాలువా రెండు భుజాల నిండుగా కప్పి అటు ఇటూ అందంగా వ్రేలాడేటట్లుగా సర్దింది. మల్లెల దండలు మెడలో, చేతిమణి కట్టులకు అలంకరించింది. గుండెల మీద భుజాల మీద మంచి గంధం రాసింది. కౌశికుడు పెళ్ళి కొడుకులా తయారయ్యాడు. నీళ్ళునిండిన కళ్ళతో సుమతి కళ్ళల్లోకి చూచి, సుమతీ ఉదయం కనిపించింది సానిపాప. సూర్యుడు అస్తమిస్తున్నా నన్ను వదలడంలేదు. హృదయంలో హత్తుకొనిపోయింది ఆసానిపాప చూసిన చూపు. ఆమెను పొందలేకపోతే నేను బ్రతుకలేను అన్నాడు.


సుమతి హఠాత్తుగా ఏదో జ్ఞాపకం వచ్చినట్లు ఇంట్లోకి వెళ్ళి అద్దంతెచ్చి భర్తకు చూపించింది. మందగించిన చూపుతో కౌశికుడు అద్దంలో తన బింబాన్ని చూసి మురిసిపోయాడు. వేశ్యలకు బంగారం ప్రాణమంటారు కనుక తన మెడలోవున్న కాసుల హారాన్ని తీసి భర్త మెడలో వేసింది. నాధా! సూర్యాస్తమవుతుంది, ఇంక బయలుదేరుదాం వేశ్యవాటిక మనింటికి చాలా దూరం మధ్యలో శ్మశానం దాటాలి, బయలుదేరుదాం అని కొంగు బిగించి కొంత ధనాన్ని మూట కట్టుకొని మంచానికి చేరువలో నేల మీద కూర్చుంది. కౌశికుడు మంచం మీద నుండి ముందుకు జరిగి ఆమె మెడకు అటుఇటూ కాళ్ళువేసి సర్దుకొని కూర్చున్నాడు. పూతగా ఆమె శిరస్సును పట్టుకున్నాడు. నేలకు చేతులు ఆనించి సుమతి అతి ప్రయత్నం మీద లేచింది. భర్త కాళ్ళను చేతులతో అదిమిపట్టుకొని బరువుగా అడుగులు వేస్తూ బయలుదేరింది. 


దారిలో కన్పించిన వారినందర్ని కౌశికుడు సరదాగా పలకరిస్తున్నాడు. వింతగా ఇకిలిస్తూవున్నాడు. చూసిన వాళ్ళంతా ఇతనికి పిచ్చిపట్టిందేమో అనుకున్నారు. తెలిసినవాళ్ళు ఏమోయి కౌశిక ఎందాక అంటే మాత్రం సమాధానం చెప్పకుండా దాటవేస్తున్నాడు. సుమతి మాత్రం ఇక్కడికే వ్యాహ్యాళికి అని అంటోంది. ఇంతలో చీకట్లు కమ్ముకున్నాయి. వూరు దాటి స్మశానంలోకి అడుగుపెట్టారు. కౌశికుడులో ఉత్సాహం రెట్టింపు అయ్యి గుర్రం మీద స్వారీ చేస్తున్నట్లుగా కాళ్ళు అటు ఇటూ ఆడిస్తూ వెకిలిగా వింతగా ప్రవర్తిస్తున్నాడు. 

Friday, 3 February 2023

శ్రీదత్త పురాణము (39)

 

కౌశికునకు ఏదో కొత్తగా శక్తి ఆవరించినట్లయింది. లేచేందుకు తన ప్రయత్నం తాను చేశాడు. పూర్తిగా సుమతి పై వాలిపోకుండా తనకు తాను నిలబడటానికి ప్రయత్నం చేశాడు. సుమతీ ఒక చేత్తో నిన్ను పట్టుకుంటాను. ఒక చేత్తో గోడపట్టుకుంటాను. ఈ పాటి ఆసరా నాకు చాలు ఏదో కొత్తశక్తి ఆవరించింది నన్ను. నెమ్మదిగా వస్తాను వన్ను తొందరపెట్టకు అని తన ప్రయత్నం తాను చేశాడు. చిన్నగా నడుచుకుంటూ వంటగదిలోకి వెళ్ళాడు. సుమతి కాళ్ళు కడిగి తుడిచి పీటవేసి కూర్చోబెట్టింది. వండినవి విస్తరిలో వడ్డించి ముద్దలు చేసి పెడ్తూ ప్రేమగా తినిపించింది. ఆనందంతో మాట్లాడబోయిన కౌశికుడికి పొలమారింది. దగ్గు వచ్చింది. సుమతి కంగారుతో అతని మాడుపై చిన్నగా తడ్తూ నెమ్మదిగా తినండి ఇంకా చీకటి పడటానికి చాలా సమయం వుంది అంటూ అతని చేత మంచినీళ్ళు త్రాగించింది. కౌశికుడు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కంఠాన్ని సవరించి సర్దుకున్నాడు. సుమతి ముఖంలో చిరునవ్వు మెరిసింది. మరోవైపు తిరిగి ఎడమచేత్తో పెరుగు అందుకొని అతనికి వడ్డిస్తూ అతన్ని కవ్వించాలని బహుశా సానిపాప మిమ్మల్ని తలుచుకుంటోందేమో అంది. కౌశికుడి ముఖంలో సిగ్గు ఉదయించింది. సుమతీ నేను చాలా సిగ్గుపడుతున్నాను. జీవితంలో ఏనాడూ కలగని కోరిక ఈనాడు కలిగింది. తప్పు అని నాకు అనిపిస్తుంది. అయినా మనస్సు నిగ్రహించుకోలేకపోతున్నాను. ఇది దైవ లీల అనుకుంటాను. ఏమి జరుగనున్నదో తెలియడంలేదు. అన్నింటిలోకి బాధిస్తున్న విషయం ఏ యుగంలో ఎంతటి నీచుడూ చెయ్యని పని నేను చేస్తున్నాను. సాని వాడకు తీసికెళ్ళమని కట్టుకున్న ఇల్లాలిని అడగడం ఎంత నీచం, దారుణం అని అంటూ కౌశికుడు దుఃఖంతో ఉండగా తెరలుగా దగ్గువచ్చి గొంతులో మెతుకులు అడ్డంపడ్డాయి. ఉక్కిరి బిక్కిరి అయ్యాడు దగ్గుతో పాపం సుమతి కంగారుపడి భయపడి వూరడిల్లండి, వూరడిల్లండి అంటూ మంచినీళ్ళు అందించింది. ముక్కూమూతి తుడిచింది. చేతులు కడిగి కాళ్ళను తడిచేత్తో తుడిచింది. కౌశికుడు కొద్దిగా తేరుకున్నా ఇంకా బాధపడుతూనే వున్నాడు.


అప్పుడు సుమతి అతని దగ్గరగా వచ్చి కూర్చుని నాధా! మీరు ఇంతగా భాదపడవలసిన పనిలేదు. సానివాడకు మీరు తీసికెళ్ళమని నన్ను అడిగారా లేదు నా అంతట నేను అన్నాను. మరి సిగ్గు పడటం ఎందుకు? బాధపడటం ఎందుకు? భార్యలను మోసంచేసి సానివాడల్లో తిరిగే వారు ఎంతమంది లేరు. నా మగడు అటువంటి వాడు కాదు. నన్ను మోసంచేయడంలేదు. నా భర్త నా సహాయమే అడుగుతున్నాడు. ఇది నాకు గర్వకారణం. ఈ పరిస్థితుల్లో మీకు ఇలాంటి కోరిక కలగడం కేవలం కామవాంఛ అని నేను అనుకోవడం లేదు. మీరన్నట్లుగా ఇదేదో దైవలీల. లేవండి మంచం మీద కూర్చోబెడతాను. కాసేపు నడుంవాల్చండి. ఈలోగా నేను కూడా భోజనం చేసి వంటిల్లు సద్దివస్తాను. ఆ తర్వాత మిమ్మల్ని ముస్తాబుచేస్తాను అన్నది.


Thursday, 2 February 2023

శ్రీదత్త పురాణము (38)



క్షణానికొకసారి పెడబొబ్బలుతో పిలిచే భర్త ఈ పూట ఇంత ప్రశాంతంగా ఉన్నాడని ఆశ్చర్యపోతూ వంట ముగించుకొన్న సుమతి ఇంటి ముంగిటకు వచ్చింది. మనసులో మల్లగుల్లాలు పడుతున్న భర్తను గమనించింది. ప్రేమగా సరసన కూర్చుంది. వంట ఆలస్యమయిందని కోపం వచ్చిందా! లేవండి వడ్డిస్తాను అంటూ అతణ్ణి లేవనెత్తే ప్రయత్నం చేసింది. కోపంగా కౌశికుడు విదిలించుకున్నాడు. సుమతి నివ్వెరపోయింది. లేచి లోపలికి వెళ్ళబోయింది. ఇంతలో కౌశికుడు ఆమె చెయ్యి పట్టుకొని కూర్చోబెట్టి, సుమతీ ఇవాళ నాకు ఆకలిగా లేదు అని సరసమైన చూపుతో అన్నాడు. సుమతి బుగ్గలు ఎరుపెక్కాయి. అపుడు కౌశికుడు తెచ్చిపెట్టుకొన్న ప్రేమతో సుమతి బుగ్గపట్టుకొని సుమతీ నాకున్న దిక్కు మొక్కు నీవే. నీతోకాక ఎవరితో చెప్పుకుంటాను. కట్టుకొన్న భార్యను అడగకూడదు. అయినా అడగక తప్పటంలేదు, కాలు చెయ్యి తిన్నగా ఉండి ఈ రోగం రాకుండా ఉంటే అసలు నీకు తెలియనిచ్చేవాడినే కాదు. పాపం నీ దురదృష్టం. నాకేమో ఈ మాయ రోగం వచ్చింది. నీ సహాయం అడగక నీ తప్పట నువ్వు లేదు. కాదనవనే నమ్మకం నాకుంది. నీ పాతివ్రత్యం నాకు తెలుసుగదా! కౌశికుడు ఇలా మాట్లాడుతూ ఉంటే సుమతికి ఏమీ అర్ధంకాలేదు. నాధా అంటూ చేరువకు వచ్చింది. ఈ రోజేమిటి, మీ ప్రవర్తన వింతగా ఉంది. దాపరికం లేకుండా చెప్పండి. ఏనాడైనా మీ మాట కాదన్నానా! మీకు ఎదురు చెప్పానా! మీరు ఏది కోరినా మంచి చెడులతో నాకు సంబంధం లేదు. శక్తి మేరకు తీర్చడం నా ధర్మం. సంశయించకండి. మీ మనసులో ఉన్నదేమిటో ఆజ్ఞాపించండి. నా ప్రాణం అర్పించి అయినా సరే మీ కోరిక నెరవేరుస్తాను. మీ ఆనందమే నా ఆనందం. మీ సంతోషమే నా సంతోషం, త్వరగా చెప్పండి అన్నది.


ఈ మాటలతో కాశికుడికి ధైర్యం వచ్చింది. సుమతీ, యిది ఏమో విధి వైపరీత్యంలా ఉంది. దైవలీలలన్నీ చిత్ర, విచిత్రంగా ఉంటాయి. ఆరోగ్యం అన్ని విధాలా బాగున్న రోజుల్లో నిండు యవ్వనంలో ఏ రోజు కలుగనిదీ, ఈ రోజు కలిగింది నాకు ఆ కోరిక. ఎంత వింత! సుమతి! మన వీధికి ఏనాడైనా సానిపాపలు రాగా నీవు చూసావా! విన్నావా! అదే ఆశ్చర్యం. ఇందాక ఒక సాని పాప మన వీధిలో నడుచుకుంటూ వెళ్ళింది. మన ఇంటి ముందు క్షణం నిలబడి కొంటె చూపుల్ని నా గుండెల్లో గ్రుచ్చి వెళ్ళింది. నా మనస్సంతా కలచి వేసింది. ఇప్పుడు శరీరంలో క్రొత్తరోగం ప్రవేశించింది. ఆ రోగం పోవాలంటే సానిపాపను కలవవలసిందే. ఇపుడు నేను శారీరకంగా మన ఇంట్లో ఉన్నాను కాని, మానసికంగా సానిపాప ఇంటి గడపలో ఉన్నాను. చకచకా నడిచి వెళ్ళగలిగిన శక్తిలేదు. మాయరోగం నా కాళ్ళు, చేతులూ తినేసింది అంటూ దుఃఖ వదనంతో చెప్పాడు.


నాధా! ఇంత చిన్న పనికి హైరానా పడతారెందుకు! నేను ఏమనుకుంటానో అనే చింత వదిలివెయ్యండి. నేను మీ కొరకై జీవిస్తున్న వ్యక్తిని. మీ ముఖంలో ఇలాంటి కాంతి, తేజస్సు నేను చూసి ఎన్నాళ్ళయ్యిందో. మీ ఆనందం కన్నా నాకు ఏంకావాలి, దాని కోసం నేను ఏం చెయ్యమన్నా చేస్తాను, కాళ్ళు, చేతులు ఆడటం లేదని నడవలేనని బాధపడకండి. నేను తీసుకువెళతాను. భుజాలపై కూర్చోబెట్టుకొని మీకు ఏ శ్రమ కలగకుండా హాయిగా తీసుకువెళతాను. ముందు లేవండి! భోజనం చెయ్యండి! కాసేపు విశ్రాంతి తీసుకోండి. ఈ లోగా సాయంకాలం అవుతుంది. స్నానం చేయించి పట్టు వస్త్రాలు కట్టించి, చందన సుగంధద్రవ్యాలు చల్లి, మిమ్మల్ని అలంకరించి, సాని వాడకు తీసుకొని వెడతాను. నాది బాధ్యత. లేవండి భోజనం చేద్దురుగాని, అంటు సుమతి భర్తమ ప్రేమగా అనునయంగా మాట్లాడుతూ లేవనెత్తింది.


Wednesday, 1 February 2023

శ్రీదత్త పురాణము (37)

 


సుమతీ కౌశికుల వృత్తాంతం


ప్రతిష్టానపురంలో కౌశికుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్యపేరు సుమతి. పేరుకు తగిన గుణవతి. మహా పతివ్రత. కొంతకాలంగా వాళ్ళిద్దరి యొక్క సంసారం అన్యోన్యంగా సాగింది. ఉన్నట్టుండి కౌశికుడికి ఏ పూర్వ జన్మ పాపమో కుష్టురోగం సోకింది. రోజులు గడుస్తున్న కొద్ది రోగం ముదిరి తనువంతా చీము, నెత్తురు కారుతుంటే సుమతి మనస్సులో కూడా ఏవగించుకోకుండా అతని శరీరాన్ని నీటితో కడిగి మెత్తని గుడ్డలతో వత్తి, వైద్యులిచ్చిన తైలములను మృదువుగా రాస్తూ ఉండేది. ఔషధాలను సమయానికి అందిస్తుండేది. మలమూత్రాలను ఎత్తిపోయడం, కంపు కొట్టే గుడ్డలు ఉతికి ఆరవేయడం, దగ్గరగా కూర్చుని వింజామరతో విసరడం, కాళ్ళు పట్టడం, మంచిగా చెప్పి ఇంత తినిపించడం, ఒకటేమిటి సకలోపచారాలు విసుగు విరామం లేకుండా చేసేది. రోగం తగ్గుముఖం పడుతుందని తొందరలోనే నయమవుతుందని ధైర్యం నూరి పోసేది. అయితే రోగబాధతో ఉన్న కౌశికుడు మాత్రం ఆమెపై అనుక్షణం మండిపడుతుండేవాడు. అయిన దానికి కాని దానికి తిట్టేవాడు. చిన్న, చిన్న విషయాలకే చిరాకు పరాకు ప్రదర్శించే వాడు. చేతికి ఏది అందితే అది తీసుకొని కొట్టేవాడు. నవ్వుతూ కనిపించినా, వీధిలోకి వెళ్ళి రావడం, క్షణం ఆలస్యమైన కుళ్ళు మాటలతో ఏడిపించేవాడు. అలాగని నవ్వకుండా ఉంటే ఏమీ నా సేవ చేయాలని ఏడుస్తున్నావా! ఎప్పుడు చస్తాడాని ఎదురుచూస్తున్నావా అంటూ చంపుకు తినేవాడు. పాపం సుమతికి నవ్వాలో ఏడ్వాలో తెలియదు. ఇది రోగ లక్షణం కాబోలు అనుకొని అలాగే సహనంతో, ప్రేమతో, భక్తితో సంవత్సరాల తరబడి సేవలు చేస్తూనే ఉంది.


ఒక రోజు ఉదయాన కౌశికుడుకి శరీరం అంతా శుభ్రం చేసి విభూధిరేఖలు దిద్ది శుభ్ర వస్త్రాలు కట్టి ఇంటి ముంగిట పంచలో మంచం వేసి, మెత్తని పడకలు ఏర్పరిచి సుఖంగా కూర్చోబెట్టి తాను వంట పనుల్లో తలదూర్చింది సుమతి. కౌశికుడు కులాసాగా వీధిన వచ్చిపోయేవాళ్ళని పలకరిస్తూ పుండ్ల మీద వాలుతున్న ఈగల్ని తోలుకుంటూ సరదాగా ఉన్నాడు.


అంతలోకే ఒక మెరుపు తీగలాంటి అమ్మాయి నడుచుకుంటూ ఆ వీధిలోకి వచ్చింది. 16 ఏళ్ళ పడుచుపిల్ల. ఆ పిల్ల చూపు మన్మధ భాణంగా ఉంది. ప్రతిష్ఠానపురంలో పెద్ద, పెద్ద ధనవంతుల కుమారులను సైతం లోకువకట్టి వెంట తిప్పుకొంటున్న సానిదాని కూతురు ఆ పిల్ల. కౌశికుడి కంటబడింది. కళ్ళు జిగేలుమన్నాయి. గుండెల్లోకి దిగింది మన్మధ బాణం. అసలే రోగంతో తిమ్మెరలు ఎక్కిన దేహం. జువజువలాడింది. ఆ కుర్రపిల్ల సోయగాలు విసురుతూ కౌశికుడు వైపుకు కొంటెచూపు విసిరి తుర్రుమని వెళ్ళిపోయింది. పాపం ఆ పిచ్చి బాపడు విలవిల్లాడిపోయాడు. ఆ హొయలు, వయ్యారం, రూపు, చూపు తలుచుకుంటూ మురిసిపోయాడు. తనవైపు ఎందుకు చూచిందీ అని ఆలోచించి కామంతో ఉడికిపోయాడు. కౌశికుడు తనని తాను చూసుకున్నాడు. అందంగా కనిపించాడు. ఏమైనాసరే సాని పాపను కలవాల్సిందే, లేదంటే మరణించవలసిందే. ఇందుకు శరీరం సహకరిస్తుందా! ఈ రోగంతో ఉన్న రూపాన్ని ఆమె అంగీకరిస్తుందా? ఇంతకీ వేశ్య ఇంటికి తనను తీసుకువెళ్ళేది ఎవరు? ఇలా ప్రశ్నలు పుట్టుకొచ్చాయి అతని మనస్సులో, ఆకలిదప్పికలు మరచిపోయాడు. ఇంతలో సూర్యుడు నడినెత్తికి చేరుకున్నాడు.