Monday, 7 August 2023

శ్రీదత్త పురాణము (220)


 

అందరూ ఆశ్చర్యచకితులయ్యారు. రేణుకాదేవిని ధ్యానిస్తూ మనకళ్ళ ఎదుటే కళ్ళు మూసుకొని కూర్చున్న దత్తాత్రేయుడు ఏమయ్యాడంటే ఏమయ్యాడు ? ఎటువెళ్ళాడంటే ఎటువెళ్ళాడు ? అందరూ ఒకరినొకరు ప్రశ్నించుకున్నారే తప్ప ఎవరికీ సమాధానం దొరకలేదు.


దత్త దేవుడికి రేణుకా ధ్యానంతప్ప మరొకటి లేదు. ఆయన గారి శయనాసనయాన కధాదులన్నీ రేణుకామయమే. ఎరుగుదుంగదా ! కాబట్టి రేణుకాదేవిలో లీనమయ్యుంటాడు అని దేవతలు భావించారు. ఋషులు మరొకలా అనుకున్నారు. రేణుకా హృదయమూ మనకు తెలీదు. దత్త హృదయమూ మనమెరుగం. ఇద్దరూ దివ్యతేజోమయులే. దేవి తన దివ్య తేజస్సుతో దత్త దేవుణ్ని ఆచ్ఛాదించిందేమో, లేదా దత్తస్వామి వేడుకగా పాతాళానికెళ్ళాడేమో, స్వామివి అన్నీ చిత్ర విచిత్ర లీలలు గదా! అనుకున్నారు. ఇక్కడే అదృశ్యరూపంతో గూఢంగా వుండి వుంటాడు. మన స్వామికి ఇలాంటి కుతూహలాలు ఉన్నవే కదా! అనుకున్నారు సిద్ధులు. కాసేపట్లో కూసేపట్లో ప్రత్యక్షమవుతాడు చూడండి.


ఆ నగ్న సుందరితో మధువును సేవిస్తూ ప్రత్యక్షమవుతాడని విధ్యాధరులు అభిప్రాయపడ్డారు. ఈ అజ్ఞానమనే వలను మన అందరిమీదకు వదలి తమాషాగా ఇక్కడే తనను తానే ఆజ్ఞాపించుకుని మనల్ని గమనిస్తూ ఉండి ఉంటాడు అని నిశ్చయించుకున్నారు చారణులు.


వీరందరి సంభాషణలు విని సంబరపడ్డ దత్తాత్రేయుడు కొంచెంసేపటికి స్వయంగా ప్రత్యక్షమయ్యాడు. సురగంధర్వ సిద్ధ సాధ్యదేవర్షి గణమంతా స్వామిని దర్శించి హమ్మయ్య అని గుండెలనిండుగా గాలి పీల్చుకున్నారు. స్వామికి ప్రణమిల్లి కౌగలించుకొని తమతమ లోపలి అలజడిని తీర్చుకున్నారు. ఇలా తేరుకున్నాక అందరూ కలిసి ఏకగ్రీవంగా స్వామిని ప్రశ్నించారు. దత్తవిభూ! నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చావు ? దేవతలకీ, మంత్రద్రష్టలకీ, ఋషులకీ కనిపించని చోటుకి వెళ్ళివచ్చావు. దివ్యదృష్టులకు సైతం అందని ఆ చోటు ఏది? ఎక్కడ ? ఇలాంటి తపస్సు కానీ, ధ్యానం కానీ, తత్వంకానీ మరెక్కడా ఏనాడూ కన్నదికాదు, విన్నది కాదు. మొదలూ, తుదీ నువ్వే కనుక నువ్వే తెలియజెప్పాలి.


Sunday, 6 August 2023

శ్రీదత్త పురాణము (219)

 


దత్తాత్రేయా ! రేణుకాదేవికి తనయుడన్న మాటేకానీ ఆ తల్లిమూలతత్వం ఏమిటో నాకు ఏ మాత్రమూ తెలీదు. ఏకవీరాదేవి స్థూల సూక్ష్మాత్మక తత్వాలన్నీ తెలిసినవాడవు నువ్వే. కనుక నువ్వే మాకు చెప్పు - అన్నాడు పరశురాముడు.


రామా ! నీకు తెలియదంటే నేనెందుకు నమ్ముతాను. నాతో చెప్పించాలని నీ ప్రయత్నం పోనీలే అలాగే చెబుతాను విను. ముల్లోకాలను తన గర్భకోశంలో సంరక్షించే జగదేకమాత రేణుకాదేవియే ఆమె దివ్యరూపం స్థూల సూక్ష్మా - భేదాలతో రెండు విధాలుగా వుంటుంది. అద్భుతావహమైన అంశం ఇది. అరణ్యాలు, నదులు, సముద్రాలు, పర్వతములు, ప్రాణికోటి ఈ భూగోళం - ఇదంతా తల్లికి స్థూలరూపం, స్వర్గాలు, సర్వతీర్థాలు, దేవతలు, మహర్షులు, సప్తపాతాళ లోకాలు, శేష కూర్మాదులు ఈ దృశ్యమాన జగత్రయమంతా ఆ తల్లి స్థూలరూపమే. పరబ్రహ్మమే ఆమె సూక్ష్మరూపం - అని దత్తాత్రేయుడు చెబుతూంటే విని పరశురాముడు ధ్యాన నిమగ్నుడయ్యాడు. అక్కడే అలాగే అమలకీ తరువు చెంత ఏకవీరాదేవిని ఉపాసిస్తూ ఉండిపోయాడు. 


దీని ఒకప్పుడు కైలాస దర్శనానికి వెళ్ళిన మహర్షులు కుమారస్వామిని ఇదే వృత్తాంతం అడిగారు. ఆ షణ్ముఖుడు చెప్పిన రేణుకా మహత్మ్యం నీకు తెలియపరుస్తాను, శ్రద్ధగా విను.


రేణుకాదేవి - మహిమ


మహర్షులారా ! రేణుకాదేవి అంటే త్రిజగన్మాత. అందుకనే ఆ తల్లి నివసించిన స్థలాన్ని మాతృతీర్ధం లేదా మాత్రాలయం అంటారు. ఒకప్పుడు దత్తాత్రేయుడు తాను ఆచార్యుడై నిలచి ఆ పవిత్ర స్థలంలో పరశురాముని చేత ఒక మహాయజ్ఞం చేయించాడు. అది రేణుకా యజ్ఞం. దానికి ప్రజాపతియే ప్రధాన ఋత్విక్కుగా బ్రహ్మస్థానం అలంకరించాడు. తక్కిన మహర్షులందరూ వేదమంత్రాలు పరిస్తూ మిగిలిన భూమికలు నిర్వహించారు. ఆ యజ్ఞంలో నారదాది దేవర్షులు సిద్ధచారణ గంధర్వాధి దేవజాతులవారూ శుభప్రదమైన రేణుకా చరిత్రను భక్తిప్రపత్తులతో గానం చేశారు. దేవతలు దుందుభులు మ్రోగించారు. అప్సరసలు నృత్యాలు చేశారు. యజ్ఞ పరిసమాప్తిలో - క్షీర సముద్రం నుంచి పాలు, దధ్యుదధి నుండి పెరుగు, ఘృతాబ్ధి నుండి నెయ్యి ఇలా సప్తసముద్రాల నుండీ సప్తద్రవాలను తెచ్చి కృష్ణామలకి నుండి మధుశర్కరలు గ్రహించి గంగాది పుణ్యనదుల నుండి పవిత్రోదకాలు తెచ్చి - వీటన్నింటితో దత్తాత్రేయుడు స్వయంగా ఏకవీరాదేవికి అభిషేకం చేశాడు. సాష్టాంగపడి లేచి చతుర్వేద మంత్రాలతో స్తుతించాడు. పద్మాసనం వేసికూర్చుని మెల్లగా ధ్యానంలోకి జారుకున్నాడు. దేవతలు అందరూ చూస్తూనే వున్నారు. దత్తాత్రేయుడు హఠాత్తుగా అంతర్ధానం చెందాడు. 

Saturday, 5 August 2023

శ్రీదత్త పురాణము (218)

 


దేవతలు చెప్పిన ఉపాయాన్ని భానుమతి, తండ్రికి వినిపించింది. అతడు వెంటనే బయలుదేరి పడుతూ లేస్తూ పాకుతూ దేకుతూ దత్తాశ్రమం చేరుకున్నాడు. నిత్యం పద్మతీర్థంలో స్నానం చేస్తూ దత్తదేవుడ్ని ధ్యానిస్తూ చిరకాలం తపస్సు చేశాడు. రేణుకాదేవిని బహు విధాలుగా మంత్రాలతో శ్లోకాలతో స్తుతించాడు. ఆ తల్లి కరుణించింది. తేజోరాశీ! నీ స్తుతులకు ప్రసన్నురాలినయ్యాను. నీ శరీరం ఆరోగ్యంతో రెట్టింపు అవుతుంది. నువ్వే అందరికీ వరాలు ఇచ్చేవాడివి. నీకు ఇవ్వేళ వరమిస్తున్నాను. ఇక ఆలసింపకు - స్వస్థానం చేరుకో. ఈ పద్మతీర్ధంలో స్నానం చేసి పితృదేవతలకు తర్పణాలు విడిచి పెట్టినవారంతా త్రివిధ ఋణాల నుండీ విముక్తులై దివ్యగతులు పొందుతారు. ఆయురారోగ్య భోగభాగ్యాలతో ఇహలోకంలో సుఖించి పరలోకంలో ఇంద్రభోగాలు అనుభవిస్తారు అని రేణుకాదేవి అంతర్ధానం చెందింది. భాస్కరుడు ఆ క్షణంలోనే కుష్టురోగం నుండి విముక్తుడయ్యాడు. తన సూర్యలోకం చేరుకున్నాడు. దీపకా ! తెలిసిందికదా ! పద్మ తీర్థ మహిమ ఎంతటిదో. నువ్వు ఇంకా ఏమి వినాలనుకుంటున్నావో, అడుగు చెబుతానంటూ వేదధర్ముడు కమండలూదకంతో కాసింత గొంతు తడుపుకొన్నాడు.


గురుదేవా ! సర్వధర్మజ్ఞా ! సర్వసందేహ భేదకా ! ఈ దత్త దేవుడి చరిత్ర నువ్వు చెబుతూంటే నేను వింటూంటే ఎంతకీ తనివితీరడంలేదు. కన్నమ్మకే వాపు, తిన్నమ్మకే తీపు అన్నట్లు ఇంకాఇంకా వినాలనిపిస్తోంది. నిజమే రసజ్ఞుడెవడు సంతృప్తి చెందకుండా వుంటాడు. ఆధ్యాత్మిక దుఃఖాలన్నింటినీ వశింపజేసే కథలివ్వి, అలనాడెప్పుడో దేవతలు సేవించారని చెబుతున్న అమృతం - ఈ దత్త కథామృతం ముందు అతితుచ్ఛం. దీనికి సాటిరానేరాదు.


దయజేసి అదే అమృతగోళాన్ని మరింతగా అందించు. రేణుకాదేవి స్వరూపం గురించి ప్రసక్తి వశాత్తూ చెప్పావు కానీ క్లుప్తంగా చెప్పావు. దాన్ని ఇంకా విస్తారంగా వినాలని నా తహతహ కరుణానిధీ ! అనుగ్రహించు. ఈ జగత్తుకి ధేనువు, ఖని, ధాత్రి అయిన ఆ మహాదేవి తత్వాన్ని నీ కన్నా బాగా ఎరిగినవారు కానీ ఎరుక పరచగలవారు కానీ మరొకరు ఉన్నారని నేననుకోను.


నాయనా దీపకా ! నీ జిజ్ఞాస నన్ను ఆనందపరుస్తోంది. రేణుకాదేవి మహాత్మ్యాన్ని సమగ్రంగా వివరిస్తాను. తెలుసుకో. ఇది వింటే చాలు సకలప్రాణులకు సర్వశ్రేయస్సులు కలుగుతాయి. సుర - సిద్ధ - ఋషిమండలితో పరివేష్టితుడై అమలధీవృష్ణ ఛాయలో కూర్చుండి ఒకనాడు దత్తాత్రేయుడు పరశురాముణ్ని ఇలా అడిగాడు. రామా ! నువ్వు సర్వజ్ఞుడవు. త్రిలోకాధిపతిని, రేణుకా సుతుడవు. పైగా నీ మీద ప్రేమతో గణాధిపతి నీకు ఆత్మతత్వ స్వరూపం కూడా బోధించాడు. కాబట్టి నీ తల్లి రేణుకాదేవి స్వరూపాన్ని మహాత్మ్యాన్ని నువ్వు పూర్తిగా గుర్తించి ఉంటావు. దయజేసి ఆ జగన్మాత మూల తత్వాన్ని మాకు తెలియపరుచు.


Friday, 4 August 2023

శ్రీదత్త పురాణము (217)

 


పద్మ తీర్ధ మహిమ


దీపకా ! పనిలో పనిగా ప్రణీతానదిలోని పద్మ తీర్థ ప్రభావం కూడా చెబుతాను ఆలకించు అని వేదధర్ముడు - తన ప్రవచనాన్ని ఇలాకొనసాగించాడు.


పూర్వకాలంలో ఉషా సూర్యదంపతులకు ఒక ఆడపిల్ల పుట్టింది. భానుమతి అని పేరు పెట్టుకున్నారు. సర్వశుభలక్షణలక్షిత. రోజుకొక ఏడాదిగా త్వరత్వరగా ఎదిగింది. అందానికి చురుకుదనానికి చలాకీ ఆటపాటలకు పెట్టింది పేరయ్యింది. పరిపూర్ణ కన్యకామణి అయ్యింది. ఆ విశ్వమోహినిని చూసి భాస్కరుడే దురదృష్టవశాత్తూ మోహితుడయ్యాడు. కోరిక తీర్చమంటూ వెంటపడ్డాడు. అజ్ఞానావృతుడైన తండ్రి నుండి తప్పించుకొని ఆ భానుమతి పాపభీతయై మృగీరూపం ధరించి ఘోరారణ్యంలోకి పారిపోయింది. మోహాంధుడైన సూర్యుడు ఆ రూప ద్రవిణ సంపన్నను వెదుక్కుంటూ ముల్లోకాలూ సంచరించాడు. ఎట్టకేలకు అరణ్యంలో మృగీరూపంలో దాక్కున్న భానుమతిని పట్టుకున్నాడు. బలాత్కారం చెయ్యబోయేలోగా ఇంద్రాది దేవతలూ కశ్యపాది ఋషులూ ప్రత్యక్షమై వారించారు. కానీ కన్న కూతుర్ని కామించిన పాప చింతనకూ బలాత్కార ప్రయత్నానికి శిక్షగా కుష్టురోగం సంక్రమించింది. అది దినదిన ప్రవర్ధమానమై సూర్యుణ్ణ్ని దారుణంగా పీడించసాగింది. అవయవాలు తిమ్మిరిలెక్కి వికలేంద్రియుడయ్యాడు. తండ్రి పరిస్థితి చూసి భానుమతి దిగులుపడింది. మృగీరూపం విడిచిపెట్టింది. తండ్రికి నమస్కరించి ఆశీస్సులు తీసికొని బ్రహ్మాదిదేవతలను సందర్శించి తండ్రి కుష్టురోగం నయమయ్యేదారి చెప్పమని అభ్యర్ధించింది. స్మరణతో సందర్శనతో అందరికీ ఆరోగ్యం పంచిపెట్టే భాస్కరుడు మండల మధ్యభాగంలో విష్ణుమూర్తిని సకలదేవతలను ధరించే సూర్యభగవానుడు, సురసిద్ధ ఋషిగణపూజితుడు మళ్ళీ సర్వాయవసంపూర్ణుడై అందర్నీ ఆరోగ్యవంతుల్ని చేసేదెప్పుడూ ? దీనికీడైనా ప్రాయశ్చిత్తం చెప్పండి అని బతిమాలుకుంది.


అమ్మాయీ ! మీ నాన్నకు కుష్టు రోగం ఎందుకు వచ్చిందో తెలుసుగదా ! నిన్ను కామించిన మహా పాపానికి అది ఫలం. బ్రహ్మహత్యకన్నా గురుభార్యాభిగమనం కన్నా ఘోరమైన పాతకమిది. దీన్ని తొలగించగల శక్తి కేవలం ఒక్క పద్మ తీర్థానికి మాత్రమే వుంది. అమలకీవనంలో దత్తాత్రేయ ఆశ్రమం ఉంది. దాని చెంత ప్రవహిస్తున్నదియే ప్రణీతానది. ఆశ్రమ తీర్థమే పద్మ తీర్థం. మీ తండ్రిని అక్కడకు వెళ్ళమను. అందులో స్నానం చేసి ఏకవీరా దేవిని అర్చించమను. ఆవిడ సకలదేవతాధీశ్వరి, జగన్మాత, భక్తితో ఆరాధిస్తే కరుణిస్తుంది. భుక్తిముక్తి ఫలాలు ప్రసాదిస్తుంది. వెంటనే బయలుదేరమను. రోగం మరీముదిరి కదలలేని దశవస్తే కష్టం.


Thursday, 3 August 2023

శ్రీదత్త పురాణము (216)

 


చాంఘిక గాధ


పూర్వం కృతయుగంలో పురందర అనే పట్టణంలో చాంఫ్రికుడు అనే విప్రుడు ఉండేవాడు. అతడి భార్యపేరు భామ, అన్యోన్య దాంపత్యం ఇద్దరిదీ. చాంద్రీకునికి ఇంద్ర పదవినధిష్టించాలని కోరిక, తపస్సు చెయ్యాలని నిశ్చయించుకున్నాడు. అనువైన ప్రదేశం ఎక్కడా అని ఆ దంపతులు అన్వేషణకు బయలుదేరి భూగోళం అంతా సంచరించి, పర్వతాలూ, అరణ్యాలూ, నదీతీరాలు, సరోవరాలు గాలించారు. ఎక్కడా వారికి అనువైన ప్రదేశమే కనిపించలేదు. దిగులుగా కూర్చున్నారు.


అప్పుడు అతడి పితృదేవతలు దుర్ధర్షులు అదృశ్యరూపాలలో ఆకాశాన నిలబడి - నాయనా వృధాగా కాలయాపన చేసుకుంటున్నావు. మూఢుడవై తీర్థాలు తిరుగుతున్నావు. వెంటనే బయలుదేరి మాతృతీర్ధం చేరుకో, అక్కడ పితృణముక్తిపొందు. ఆ తీర్థంలో రేణుకా సమక్షంలో భక్తిశ్రద్ధలతో పితృదేవతలకు పిండప్రదానం చేస్తే అధికర్తకూ, పితృదేవతలకు సద్గతులు కలిగిస్తుంది. అంచేత మిగతా తీర్థాలన్నీ నిరర్థకాలు, వాటి సంగతి మర్చిపో వెంటనే మాతృతీర్ధం చేరుకో - అని సలహా ఇచ్చారు. అందుమీదట చాంఘ్రకుడు వెంటనే బయలుదేరాడు. సహ్యాద్రిమీద దత్తాత్రేయాశ్రమం చేరుకుని యేరుతటాకంలో స్నానం చేసి మాతృతీర్ధంలో పితృదేవతలకు తర్పణాలు విడిచి పెట్టి చెంతనే గట్టుమీద  ఉన్న కృష్ణామలకం క్రింద పిండప్రదాన శ్రాద్ధ విధులు నిర్వహించాడు. ఆ క్షణంలోనే అతని పితృదేవతలు ముక్తులై అక్షయ పుణ్యలోకాలకు వెళ్ళిపోయారు.


Wednesday, 2 August 2023

శ్రీదత్త పురాణము (215)

 


మునిశ్రేష్టా! అడగవలసిందే అడిగావు. ఇందులో నన్ను నొప్పించింది ఏమీ లేదు. నువ్వన్నట్లు ఇంత వరకూ లోకంలో ఉన్నవి నాలుగే ఆశ్రమాలు. కానీ నాది - ఆపైది, అయిదో ఆశ్రమం. ఈ చరాచర జగత్తునంతటినీ ఆత్మాభిన్నమనీ అవికల్పంగా చూడగలిగినవాడు, కామక్రోధాదులనైన అరిషడ్ వర్గాన్ని జయించి సర్వ భూతకోటిపట్లా సమచిత్తంతో వైరాగ్యంతో ఉండగలిగినవాడు మాత్రమే ఈ అయిదవ ఆశ్రమానికి అర్హుడు. నేను చెప్పిన ఈ తత్వం నువ్వన్న నాలుగు ఆశ్రమాలలోనూ ఎక్కడైనా వున్నట్లా లేనట్లా? బహుశ నీకు తెలీదు. చెప్పలేవు. కేవలం బ్రహ్మవాదులు మాత్రమే గుర్తించగలరు.


మహానుభావా! నువ్వే విశ్వేశ్వరుడవు. నువ్వే పురుషోత్తముడవు. అనసూయ - అత్రిదంపతులకు జన్మించిన నువ్వే కమలాపతివి. అజ్ఞానంతో నేను చేసిన ఈ అధిక ప్రసంగాన్ని క్షమించు. నన్ను రక్షించు. నీ ఉదరంలో ప్రవేశించి సురక్షితంగా ఉండాలని నా ఆకాంక్ష. హే శ్రీ రామా! నారాయణా! వాసుదేవా! గోవిందా! వైకుంఠా! ముకుందా! కృష్ణా! శ్రీ కేశవా! అనంతా! నృశింహా! విష్ణు! సంసార సర్ప ద్రష్టుణ్ని. నన్ను కాపాడు - అని పింగళనాగుడు సాగిలపడి మ్రొక్కాడు. పింగళనాగుడి ప్రార్ధనను మన్నించి దత్తాత్రేయుడు శివరూపంతో అతడిని గర్భాన ధరించాడు. 


ఆమలకీ వృత్తాంతం - ఉసిరిక


శివరూపధారియై కృష్ణా మలకం క్రింద కూర్చున్న దత్తాత్రేయుణ్ని గానీ, త్రిమూర్తి స్వరూపమైన ఆ కృష్ణా మలకిని గానీ దర్శించినవారు సద్గతులుపొందుతారు అనడంలో సందేహం లేదు. నరనారీజనం ప్రణీతానదిలోని పద్మ తీరాన స్నానం చేసి దానధర్మాలు నిర్వహించి ఒడ్డున ఉన్న ఈ కృష్ణా మలకిని దర్శించి స్పర్శించి ప్రదక్షిణం చేస్తే ఏకకాలంలో హరిహర విరించిలకు ప్రదక్షిణం చేసిన పుణ్యఫలం పొంది, మహాయోగులకు సైతం అందని పరమపదం చేరుకుంటారు. కృత యుగారంభంలో క్షీరసాగర మధనం జరుగుతున్నప్పుడు ఫలపుష్ప భరితమై పీయూషామలక వృక్షం ఆవిర్భవించింది. దాన్ని అప్పుడు దేవతలు విష్ణుమూర్తికి బహూకరించారు. సముద్రుడేమో కౌస్తుభాదిరత్నాలనూ దివ్యాభరణాలను లక్ష్మీదేవినీ స్వయంగా సమర్పించి విష్ణుమూర్తిని సత్కరించాడు. పుణ్యప్రదమైన క్షీరాబ్ధి మందిరంలో ఈ పీయూషామలకిని స్థాపించి లక్ష్మీదేవిని ఆనందపరచాడు శ్రీ మహావిష్ణువు. అనసూయాత్రి మునులకు తాను పుత్రుడుగా అవతరించినవేళ తనతోపాటు ఈ పీయూషామలకిలో అర్ధాంశం తెచ్చుకున్నాడు. అటుపైని దాన్ని తన సహ్యాద్రి ఆశ్రమంలో నాటుకున్నాడు. అదే కృష్ణామలకీ నామంతో ప్రసిద్ధమయ్యింది. దానిక్రిందనే దత్తస్వామి తీవ్రంగా తపస్సు చేసాడు. ఈ తరువు మూడు రూపాలతో నామాలతో త్రిభువనాల్లోనూ విఖ్యాతి పొందింది. ఒకటే తరువు ఊర్ధ్వ భువనాన క్షీరాబ్ది మందిరంలో ఒకరూపంతో, పీయూషామలక నామంతో సహ్యాద్రి శిఖరం మీద, మరొక్కరూపంతో, కృష్ణామలక నామంతో పాతాళలోకంలో వేరొక రూపంతో, నామంతో విరాజిల్లుతోంది. దత్తాత్రేయాశ్రమంలోని తృతీయాంశ విరాజితానికే సిద్ధామలకమని కూడా పేరు. ఇందువల్లనే సిద్ధామలక గ్రామం ఏర్పడి అటుపైని మాతాపురం అయ్యింది. దీన్ని దర్శించిన నరనారీ జనం పరమపదం చేరుకుంటారు.


Tuesday, 1 August 2023

శ్రీదత్త పురాణము (214)

 


నువ్వు దత్తాత్రేయుడు కలిసి ఈ కృష్ణామలకి తరువుని ఇక్కడ సహ్యాద్రి మీద ఉన్న ఈ శుభప్రదమైన దత్తాశ్రమంలోనూ దండకలోనూ స్థాపించండి. నాకూ సంతోషం కలిగించండి. నువ్వు కూడా దీని నీడలో విశ్రాంతి తీసుకో. ఈ తరువును దర్శించిన వారుగానీ స్పృశించిన వారు కానీ సద్గతులు పొందుతారు - అంది. అప్పుడు పరశురాముడు ఆ తరువులో ప్రవేశించి తన ఉనికితో దానికి త్రిదేవత్వాన్ని కలిగించాడు. అటుపైని బ్రహ్మ దేవుడు రేణుకా దేవి వద్ద శలవు తీసుకొని తన సత్య లోకం చేరుకున్నాడు. రేణుక అంతర్థానం చెందింది. దత్తాత్రేయుడు ఆ తల్లికి నమస్కరించి ఆ తరువు క్రింద ధ్యాన నిష్ఠకు ఉపక్రమించాడు. తలపెట్టిన యజ్ఞం పూర్తి అయ్యే వరకూ భార్గవరాముడు సైతం ఆ తరువు చెంతనే విశ్రాంతి తీసుకున్నాడు.


పింగళనాగ వృత్తాంతం


ప్రణీతానది ఒడ్డున కృష్ణామలకీ తరుచ్ఛాయలో ధ్యానం చేసుకుంటున్న దత్తాత్రేయుడి దగ్గరకు ఒకనాడు పింగళనాగుడు అనే ముని దర్శనార్ధం వచ్చాడు. సభక్తిగా నమస్కరించి దత్త దేవుడి అనుమతితో చేరువలో కూర్చున్నాడు.


స్వామీ! నాకు తెలీక అడుగుతున్నాను. నా అజ్ఞానాన్ని క్షమించి నా సందేహం తొలగించండి. నాకు తెలిసీ నాలుగు ఆశ్రమాలే ఉన్నాయి. వాటికి వాటి నియమ నిబంధనలున్నాయి. వీటిలో తమరు ఏ ఆశ్రమానికి చెందిన వారుగా కనిపించడం లేదు. మీరిద్దరూ దిగంబరులై ఉంటారు. మదిరా మాంసాలను పుచ్చుకుంటూ కనిపిస్తారు. దిగంబరీ! ఈ అందగత్తెను ఎప్పుడూ అంకపీఠం దింపవు. ఏమిటి స్వామి! ఇదంతా. దీన్ని ఏ ఆశమ్రం అంటారు? ఈ ఆశ్రమదీక్షను మీకు ఇచ్చిన ఆ గురు మహానుభావుడెవరు? ఎంతో కాలంగా మిమ్మల్ని అడగాలని. ఇప్పటికి కుదిరింది. కాసింత విశ్రాంతిగా ఏకాంతంగా దొరికారు. అందుకని అడిగేశాను. నొప్పిస్తే క్షమించండి చెప్పకూడనిది అయితే చెప్పవద్దు. తెలుసుకోవాలని మాత్రం చాలా కుతూహలంగా ఉంది.