Sunday, 31 August 2014

గణపతి ఆరాధన అన్ని రంగాలవారికి విశేషఫలాన్ని ఇస్తుంది

గణపతి ఆరాధన అన్ని రంగాలవారికి విశేషఫలాన్ని ఇస్తుంది.

గణపతి దేవతలకు ఆదిదేవుడు. గణాలకు మహాగణపతి. విఘ్నాలకు నాయకుడు, విద్యలన్నిటికి గురువు, నాట్యాకారులకు నాట్యాచార్యుడు, కవులకు ఆదికవి, పార్వతీదేవి గారాల బిడ్డ, అమ్మ చేతి పసుపు ముద్ద.

అటువంటి గణపతిని పరమభక్తితో గణపతిని పూజించడం వలన నాకు అది ప్రాప్తిస్తుంది, ఈ ఫలాన పని జరుగుతుందన్న ఫలాపేక్ష లేకుండా, నిత్యం ఆరాధించడం వలన త్వరితంగా జ్ఞానం సిద్ధించి తీరుతుంది. ఎటువంటి విద్యనైనా వినగానే నేర్చుకోగలిగిన 'ఏకసంధాగ్రహణ' శక్తి లభిస్తుంది.  గణపతిని గురువుగా భావించి పూజిస్తే, స్వయంగా గణపతి మన మనసులో ఉండి విద్యలను నేర్పిస్తాడు. బుధగ్రహానికి అధిదేవతగా గణపతిని చెప్తారు. కనుక ఇంజనీరింగ్, అకౌంట్స్, గణితం మొదలైన రంగాల్లో ఉన్నవారికి ఇది విశేష ఫలితం లభిస్తుంది. గణపతికి గరిక సమర్పించడం వలన మేధస్సు వృద్ధి చెందుతుంది. అన్ని విద్యలకు గురువు కనుక విద్యను ఇట్టే ఇచ్చేస్తాడు వినాయకుడు.

గణపతి సర్వజనులను వశం చేసుకోగలిగిన వశీకరణ విద్యను ప్రసాదిస్తాడు. కళాకారులు, నటుల ఎదుగుదలకు కావల్సినది ప్రజల అభిమానం, అందుకోసం ప్రజలందరిని వశం చేసుకోవడం. ఈ వశీకరణం నిత్యం గణపతిని ఆరాధించేవారికి సహజంగానే ప్రాప్తిస్తుంది.

గణపతి ఆరాధన సృజనాత్మకతను వృద్ధి చేస్తుంది. సినిమారంగంలో ఉన్నవారు, యానిమేషన్ రంగంలో ఉన్నవారికి అవసరమైనది సృజనాత్మకత (క్రియేటివిటి). గణపతి నిత్యం భక్తితో కలిచేవారికి సృజనాత్మకత సహజంగానే సిద్ధిస్తుంది.      

గణపతి ఆనందస్వరూపుడు. వినాయకుడి గురించి చెప్పుకోవడమే ఆనందం. గణపతిని ఉపాసించేవారు నిత్యం ఆనందంతో జీవిస్తారు. గణపతి క్షిప్రప్రసాది. భారీ పూజలు చేయవలసిన పని లేదు, చిన్న పూజలకే చాలా సులభంగా కోరికలను తీరుస్తాడు.

జ్యోత్సిష్యులకు వాక్కు ప్రధానం. జ్యోతిష్యం సక్రమంగా చెప్పాలంటే గణపతి అనుగ్రహం ఉండాలి. యోగులకు తమ శరీరంలో ఉన్న కుండలిని శక్తి జాగృతమవ్వాలి. గణపతి మూలాధారచక్రంలో ఉంటాడు. మూలాధరానికి అధిష్టాతయై కుండలిని శక్తికి రక్షకుడిగా ఉంటాడు. గణపతి యోగశాస్త్రంలో కాపలాదారుడు. వక్రమార్గంలో శక్తులను సాధించకుండా గణపతి మూలాధారంలో కాపాలకాస్తాడు. వాస్తు శాస్త్రంలో గణపతి వాస్తు పురుషుడు. గణపతిని ఈశాన్యంలో కానీ, లేక మనకు అనుకూలంగా ఉన్న ఏ దిక్కులోనైనా నెలకొల్పి, రోజు ఒక చిన్న బెల్లం ముక్క నైవేధ్యం పెట్టి, దీపారాధన చేస్తే, ఇంట్లో ఉన్న వాస్తు దోషాల పాలిట కాలుడై సర్వదోషాలను హరిస్తాడు వినాయకుడు.

గణపతి లీలావైభవం ఎంతని చెప్పుకోగలం.

ఓం ఏకదంతాయ విద్మహే
వక్రతుండాయ ధీమహి
తన్నో దంతిః ప్రచోదయాత్ ||

ఏకదంతుడు, వక్రతుండుడైన గణపతిని మన మనసును ప్రభావితం చేయుగాకా. మనలని మంచి మార్గంలో నడిపించిగాకా.

ఓం గం గణపతయే నమః 

Saturday, 30 August 2014

ఓం శ్రీ మహాగణాధిపతయే నమః

ఓం శ్రీ మహాగణాధిపతయే నమః అంటూ ప్రతి కార్యక్రమం ప్రారంభంలో గణపతి తలుచుకుంటాము. గణపతికి సంప్రదాయంలో, మానవజీవన విధానంలో విశిష్టవంతమైన స్థానం ఉంది. గణపతి ఆదిపూజ్యుడు, ముందు మొక్కులవాడు. అందుకే పురాతన కాలం నుంచి ఆధునిక కాలం వరకు గణపతి ఆరాధన ఎంతో గొప్పగా జరుగుతోంది. వినాయకుడికి గణాధిపత్యం ఇచ్చి, గణధిపతిని చేశారు. గణాలంటే చీమలు మొదలు బ్రహ్మ వరకు ఉన్న వివిధ వర్గాలు, జీవులు. గణం అంటే సమూహం, గుంపు, వర్గం, Group, Category అని అర్దం. ఈ సమస్త సృష్టిని చాలా వర్గాలుగా విభజించవచ్చు. మానవులు ఒక గణం, దేవతలు ఒక గణమ, రాక్షసులు ఒక గణం, చెట్లు ఒక గణం, జంతువులు ఒక గణం. మళ్ళి ప్రతి గణాన్ని ఇంకా విభజించవచ్చు. ఉదాహరణకు చెట్లను తీసుకుంటే పుష్పించే చెట్లు ఒక గణం, పెద్ద పెద్ద వృక్షాలు ఒక గణం, పండ్లు అందించే మొక్కలు ఇంకో గణం, లతలు, తీగలు, కందలు, కూరగాయలు వేర్వేరు గణాలు. మళ్ళీ వీటిలో ఇంకా గణాలు ఉన్నాయి. ఎర్రని పూలు పూసే మొక్కలు ఒక గణం, తెల్లనివి ఇంకో గణం, పసుపుపచ్చనివి వెరొక్ గణం. మనుష్యుల్లో కూడా మంచివాళ్ళు ఒక గణం, చెడు వాళ్ళు ఇంకో గణం, తెలివైనవారు ఒక గణం. ఇలా ఎన్నో విధాలుగా విభజించబడిన ఈ సృష్టి మొత్తం, వివిధ గణాల మధ్య సయోధ్య కారణంగా సక్రమంగా సాగుతోంది. ఒక పదిమంది కలిస్తేనే, అందులో ఎన్నో అపోహలు, అపనమ్మకాలు, విమర్శలు, గొడవలు వస్తాయి. ఇంత పెద్ద సృష్టి, ఎన్నో నక్షత్రాలు, గ్రహశకలాలు, ఉల్కలు, తోకచుక్కలు, అనేక కోటి బ్రహ్మాండాలలో ఇన్నిన్ని సమూహలను ఏక తాటిపైకి తీసుకురావడం ఎంతో కష్టతరం. అసలు వీటి మధ్య కనుక బేధాభిప్రాయం ఏర్పడితే, ఎంతో గందరగోళం ఏర్పడుతుంది. ఇలా గందరగోళం ఏర్పడకుండా, చిన్న అణువు (Atom), కణం (cell) నుంచి బ్రహాండాల వరకు సమస్త గణాలకు నాయకులు ఉన్నారు. అలా ప్రతి గణానికి, పరబ్రహ్మ నాయకత్వం వహించి, వాటిని నిర్ణీత మార్గంలో నడిపిస్తున్నారు. ప్రతి గణానికి ఉన్న నాయకునికి గణపతి అని పేరు. తంత్రశాస్త్రం ప్రకారం సృష్టిలో అనేకమంది గణపతులు ఉన్నారు.

గణపతి ఆరాధన యొక్క తత్వం కూడా ఇక్కడే దాగి ఉంది. గ్రహాలు అనుకూలించకుంటే వాటిని శాంతపరచాలి. ప్రకృతి సహకరించకుంటే, ప్రకృతికి సంబంధించిన దేవతను మెప్పించాలి. దేవతలు ఆగ్రహంతో ఉంటే, వారిని పూజించాలి. మన జీవితంలో నిత్యం ఎన్నో ఒడిదుడుకులు వస్తుంటాయి. వాటిన్నిటిని దాటాలంటే ఎంత మందిని మచ్చిక చేసుకోవాలి? అంత మందిని ఒప్పించేలోపు జీవితం కాస్త ముగిసిపోతుంది. అందుకే పరమేశ్వరుడు గణపతికి గణాధిపత్యాన్ని ఇచ్చాడు. ప్రతి గణానికి ఒక నాయకుడు ఉంటాడు. ఆయన గణపతి. గణం గణం కలిస్తే, మహాగణం. దానికి నాయకుడు మహాగణపతి. అంటే గణపతులకు గణపతి మహాగణపతి.

ఏదైనా ఒక పని చేయాలని సంకల్పించుకుంటే, దానికి ఎంతో మంది సహాయసహాకారాలు కావాలి. సాయం మానవుల నుంచే కాదు, అణువుల దగ్గరి నుంచి దేవతల వరకు, అందరు మనకు సానుకూలంగా మారాలి, సహాకారం అందించాలి. ఇంత వైవిధ్యమైన సృష్టిలో, ఇంతమంది సహాయాన్ని అర్ధించడం చాలా కష్టం. అందరిని సంప్రదించడం కష్టం, అయినా అంతమందిని ఏక తాటిపకి తీసుకురావడం, ఏకాభిప్రాయం ఏర్పరచడం ఇంకా కష్టం.  సృష్టిలో ఇన్ని గణాలు ఉన్నా, అన్నిటికి ఒకడే నాయకుడై ఉన్నాడు. ఆయనే వినాయకుడు. వినాయకుడంటే విశిష్టవంతమైన నాయకుడని, నాయకుడే లేనివాడని అర్ధాలున్నాయి. మొత్తం సృష్టి ఆయన చేతిలో ఉన్నది కనుక, ఆయన చెప్పినట్టే వింటుంది. అందుకే ఏదైన పని ప్రారంభించే ముందు మహాగణపతిని స్మరిస్తే, సమస్త జగత్తు ఒక్కసారిగా ‘అలర్ట్’ (Alert) అవుతుంది, అన్నీ పనులు పక్కనబెట్టెసి, విశ్వనాయకుడైన వినాయకుడి మాట వింటుంది. దాంతో ప్రారంభించే పనిలో ఏ ఆటంకాలు రావు. అందుకే గణపతికి ప్రధమ పూజ. ఇక గణపతి విశ్వగణాలకు నాయకుడు కనుక గణపతిని స్మరిస్తే, సమస్త బ్రహ్మాండాలను స్మరించినట్టే, గణపతిని తెలుసుకోవడమంటే సమస్త బ్రహ్మాండం గురించి తెలుసుకోవడమే. అందుకే ప్రతి కార్యానికి ముందు ఓం శ్రీ మహాగణాధిపతయే నమః అని వినాయకుడిని స్మరిస్తాం. స్మరించాలి. అప్పుడే నిర్విఘ్నంగా సకలకార్య సిద్ధి చేకూరుతుంది.

ఇదే వ్యాసాన్ని అంతర్జాల మాస పత్రికైన అచ్చంగా తెలుగులో కూడా మనం ప్రచురించాం.
http://acchamgatelugu.com/?p=7096

Friday, 29 August 2014

గణపతిగా రూపాన్ని స్వీకరించారు

నిరాకారుడైన పరబ్రహ్మం భక్తుల సౌలభ్యం కోసం గణపతిగా రూపాన్ని స్వీకరించారు. జగత్తు మొత్తం వ్యాపించిన చైతన్య స్వరూపమే గణపతి. గణపతి ఏనుగు ముఖం అని చెప్పకున్నప్పటికి, ఈ సాకార రూపాన్ని ఆరాధించడం చేత, క్రమంగా నిరాకరమైన (ఎటువంటి రూపం లేని) పరమాత్మ తత్వాన్ని అర్ధం చేసుకునే శక్తి లభిస్తుంది.

'అజం నిర్వికల్పం నిరాకారమేకం' అంటూ శంకరాచార్యులు గణపతిని స్తుతించారు. గణపతి అజుడు, అంటే ఎప్పుడు పుట్టనివాడు, ఎందుకంటే ఎప్పుడు ఉన్నవాడు, ఎప్పటికి ఉండేవాడు. పుట్టుక ఉన్నదానికి, మరణం కూడా ఉంటుంది, ఆది ఉన్నదానికి, అంతం ఉంటుంది. గణపతి ఆద్యంతరహితుడు కనుక అజుడు అన్నారు.

నిర్వికల్పుడు వినాయకుడు. అంటే గణపతి ఇలా ఉంటాడు, అలా ఉంటాడని ఎవరు చెప్పలేరు, పసితనం, యవ్వన, ముసలితనం వంటి మార్పులకు లోనవ్వనివాడు. శరీరమే లేనివాడు కనుక శరీర అవస్థలకు అతీతమైనవాడు.

నిరాకారుడు అంటే ఎటువంటి ఆకారంలేనివాడు. ఈ సృష్టిలో ఉన్న అన్ని ఆయన స్వరూపాలే కనుక, ఆయనకంటూ ప్రత్యేకంగా ఒక ఆకారం లేదు. అందువల్ల పరమాత్మను నిరకారుడన్నారు. గజముఖుడిగా కొలిచే గణపతి మన అందరిని ఈ నిరాకార, నిర్వికల్ప తత్వాలకు చేరవేస్తాడు. అంతటా వ్యాపించి పరబ్రహ్మ తత్వం, సచ్చిదానంద స్వరూపమే గణేశుడు.

ఓం గం గణపతయే నమః 

Thursday, 28 August 2014

శమంతకోపాఖ్యానం - 4

జాంబవంతుడు వచ్చి కృష్ణపరమాత్మతో మల్లయుద్దం చేశాడు. యుద్దంలో కిందపడవేయడానికి ఎన్ని సార్లు ప్రయత్నించినా పడట్లేదు. ఎన్ని సార్లు ముట్టుకున్న జాంబవంతుడికి కృష్ణపరమాత్మను ముట్టుకోవాలనిపిస్తోంది. ఎన్నిసార్లు కౌగిలించుకున్నా ఇంకా ఇంకా హత్తుకోవాలి అనిపిస్తొంది. 21 రోజుల పాటూ నిర్విరామంగా యుద్దం చేసినా కృష్ణుడు అలసిపోలేదు. వచ్చింది రాముడే అన్న విషయం తెలుసుకున్నాడు జాంబవంతుడు. ఆయనకు నమస్కరించి, శమంతకమణి ఇచ్చి, తన కూతురు జాంబవతికి కృష్ణునితో వివాహం చేశాడు. కృష్ణపరమాత్మ జాంబవతిని వెంటపెట్టుకొని మణితో ద్వారకకు వెళ్ళాడు. జరిగిన విషయాన్ని సత్రాజిత్తుకు వివరించాడు. నిజం తెలుసుకున్న సత్రాజిత్తు, కృష్ణుడు ఎంతో మంచివాడని, కృష్ణుడి మీద వేసిన నీలాపనిందలకు క్షమాపణగా ఆయన కూతురు సత్యభామను ఇచ్చి వివాహం చేశాడు. శమంతకమణిని ఇచ్చాడు కానీ కృష్ణుడు తీసుకోలేదు. ఉన్నది ఒక్క కూతురే కనుక ఎలాగో తరువాత తమకే దక్కుతుందని, ఎంతో ఇష్టపడి సూర్యుడి దగ్గరనుండి తెచ్చుకున్నారు కనుక తన  దగ్గరే ఉంచుకోమని సత్రాజిత్తుకు చెప్పాడు.    

ఇక్కడితో కధ ముగియలేదు. పెద్ద మలుపు తిరిగింది. ఎప్పటినుంచో సత్యభామను వివాహం చేసుకుంటామని అక్రూరుడు, శతధన్వుడు, కృతవర్మ అనే ముగ్గురు సత్రాజిత్తును అడుగుతున్నారు. ఇంతకాలంగా వివాహ విషయాన్ని దాటవేతూ వచ్చిన సత్రాజిత్తు ఇప్పుడు మణి తెచ్చి ఇచ్చాడని కృష్ణపరమాత్మకు ఇచ్చి వివాహం చేయడం సహించలేకపోయారు. ఆ ముగ్గురిలో అక్రూరుడు, కృతవర్మకు కృష్ణుని యందు అపారమైన భక్తి. శతధన్వుడికి భక్తి కాస్త తక్కువ. సత్రాజిత్తు మీద ఉన్న కసిని తీర్చుకోవడానికి సమయం కోసమని ఎదురుచూస్తున్నారు.


ఆ సమయానికి పాండవులను లక్క ఇంట్లో పెట్టి, ఇంటిని తగలబెట్టి చంపేశారని కృష్ణుడికి వార్త అందింది. తమ్ముడి కొడుకులు చనిపొయారని బాధపడుతున్నట్టు నటిస్తున్న దృతరాష్ట్రుడిని ఓదార్చడానికి కృష్ణుడు వెళ్ళాడు. ఈ ముగ్గురికి సమయం దొరికింది. సమావేశం జరిపి సత్రాజిత్తును చంపాలి అని పధకం వేశారు. అక్రూరుడు,కృతవర్మకు భక్తితత్పరులు కనుక శతధన్వుడికి ఈ పని అప్పగించారు. శతధన్వుడు నిద్రపోతున్న సత్రాజిత్తును చంపాడు. చంపి ఆ మణిని మెడలో వేసుకొని వచ్చాడు. మణి అపవిత్రమయ్యింది. వాడు అక్రూరుడి వద్దకు వచ్చి ఈ మణి తన దగ్గర ఉంటే జాగ్రత్తగా ఉండదని, అందువల్ల అక్రూరుడి వద్ద దాచమని చెప్పి, బలవంతంగా ఇచ్చి తన ఇంటికి వెళ్ళి దాక్కున్నాడు.

సత్యభామ రధమెక్కి కృష్ణుడి వద్దకు వెళ్ళి జరిగినదంతా చెప్పింది. కృష్ణుడు శతధన్వుడిని చంపుతానని రధం ఎక్కి ద్వారకకు వెళ్ళి, బలరాముడికి విషయం చెప్పి, రా! అన్నయ్యా ఇద్దరం కలిసి వెళదాం అన్నాడు. ఇద్దరు కలిసి రధం మీద బయలుదేరారు. బలరామకృష్ణులు వస్తున్నారన్న సంగతి తెలుసుకున్న శతధన్వుడు, జాంబవంతుడినే ఓడించిన కృష్ణుడు తనను చంపుతాడని ఆందోళన చెంది  గుర్రమెక్కి పారిపోయాడు.

శతధన్వుడు వంద ఆమడల దూరం పరిగెత్తగల గుర్రం ఎక్కాడు. బలరామకృష్ణులు నాలుగు గుర్రాలతో నడిచే రధం మీద వెంబడిస్తున్నారు. కొంచం దూరం వెళ్ళాక శతధన్వుడి గుర్రం కిందపడి మరణించింది (శమంతమణి ప్రభావం). వాడు పరిగెత్తడం చూసి రధంలో వెంబడిస్తున్న కృష్ణుడు అన్నయ్యా, వాడి గుర్రం చనిపొయింది. అలా నేల మీద పరిగెడుతున్న వాడిని రధంలో వెంబడించడం తగదు. ఒంటరిగా పరిగెడుతున్న వాడిని ఇద్దరు వెంబడించడం ధర్మం కాదు. అందువల్ల నువ్వు రధంలోనే ఉండు నేను వాడిని చంపి మణి తీసుకువస్తానన్నాడు.

కృష్ణుడు వాడిని వెంబడించగా, వాడు పొదల్లొ దాక్కొవడం, యుద్దం చేయడం, వాడిని చంపడం జరిగింది. వాడు చనిపోయాక వాడి బట్టలంతా వెతికినా శమంతకమణి దొరకలేదు (ఇంతకముందే వాడు అక్రూరుడికిచ్చాడు). జరిగినదంతా చెప్పి శమంతకమణి దొరకలేదన్న విషయాన్ని చెప్పగా, బలరాముడు 'చిన్నప్పటినుంచి నిన్ను చూస్తునేవున్నా. నువ్వు ఎన్ని దొంగతనాలు చేయలేదు, ఎంత వెన్న తినలేదు, నేను వయసులో పెద్దవాడిని, మణి నాకు ఇవ్వవలసి వస్తుందని, మణి దొరకలేదని అబద్దాలు చెప్తున్నావు. మణిని శతధన్వుడు రధంలో దొంగిలించడం చూసి సత్యభామ నీకు చెప్పింది. మరి మణి వాడి దగ్గర లేకపొతే ఎక్కడ ఉంటుంది? నువ్వూ వద్దు, ద్వారక వద్దు. నేను విదేహరాజ్యానికి వెళ్తున్నాను' అని చెప్పి వెళ్ళిపోయాడు.

తిరిగి ద్వారకకు వెళ్ళిన కృష్ణుడిని చూసి 'చుశారా! అన్నయ్యని కూడా మోసం చేశాడి కృష్ణుడు' అంటూ ప్రజలు అన్నారు.

జాంబవతి 'ఈయన మా నాన్న మీద గెలిచి నన్నూ, మణిని తీసుకున్నాడు. ఈ మణి మా నాన్న ఇచ్చాడన్న గౌరవం కూడా లేకుండా, మా నాన్నకు పేరు వస్తుందని సత్రాజిత్తుకిచ్చాడు. సత్రాజిత్తుకిచ్చి ఆయన దగ్గర నుండి తిరిగి మణిని తీసుకొని సత్రాజిత్తుకు పేరు తేవాలని చూస్తున్నాడు' అని జాంబవతి అనుమానం వ్యక్తం చేసింది.

ముందు మా నాన్న మణి అడిగితే ఇవ్వలేదు. తరువాత ఇచ్చినా అహంకారం అడ్డువచ్చి తీసుకోలేదు. శతధన్వుడు చంపుతాడని తెలిసి, ఆయన మా నాన్ను చంపడం కోసమే కృష్ణుడు ఊరు విడిచి వెళ్ళాడు. ఆ శతధన్వుడిని చంపి ఆ మణి తన దగ్గరే దాచిపెట్టుకొని, లేదని చెప్తూ నటిస్తున్నాడని సత్యభామ అన్నది. తనలో సగమైన భార్యలు కూడా అనుమానించడం మొదలు పెట్టారు. ఇంతకంటే పెద్ద నీలాపనిందలు ఇంకేమంటాయి?

ఇన్ని నీలాపనిందలు ఎదురుకున్న కృష్ణుడు అంతఃపురంలో కూర్చుని ఎంత బయట పడదామన్నా, ఇంకా ఇంకా అపనిందలు వస్తూనే ఉన్నాయి, ఏమి చేయాలని ఆలోచిస్తున్నాడు.

అక్రూరుడికి కృష్ణునియందు అపారమైన భక్తి ఉన్నా, ఆ మణిని కృష్ణునకు ఇవ్వడానికి సిగ్గుపడి, ఆ మణిని తీసుకొని కాశీకి వెళ్ళాడు. కాశీకి వెళ్ళగానే ఆయన మనసు మారింది. నేను మణి ఇవ్వకపోవడం వల్లనే కృష్ణుడి మీద ఇన్ని అపనిందలు పడ్డాయి అని భాదపడ్డాడు. దానిని పవిత్ర కార్యాలకు వాడడం మొదలు పెట్టాడు. దాని నుండి వచ్చిన బంగారంతో కాశీలో రోజు అన్నదానం చేశాడు. ఆ మణిని పవిత్రంగా ఉంచడంవల్ల దాని ప్రభావంతో కాశీలో కరువుకాటకాలు రాలేదు. వ్యాధులు అసలే లేవు.

దీనంగా ఆలోచిస్తున్న కృష్ణుని వద్దకు నారదమహర్షి వచ్చారు. కృష్ణా! నీకు ఇన్ని అపనిందలు రావడానికి కారణం భాద్రపద శుక్లచవితినాడు (అంటే వినాయక చవితి)  నువ్వు ప్రసేనుడితో కలిసి వీటకు వెళ్ళినప్పుడు చూసిన చవితి చంద్రుడు. ఆ రోజు చంద్రున్ని చూసిన వారికి నీలాపనందలు వస్తాయని వినాయకుడి శాపం. అందువల్ల ఈసారి నువ్వు వినాయకచవితి రోజున వరసిద్ధివినాయకచవితి వ్రతం ఆచరించు. 21రకాల పత్రిని, అలాగే పచ్చని దొసపండు (కీరదోసకాయ) ను సమర్పించు. వినాయకుడు తప్పక అనుగ్రహిస్తాడు అని పలికాడు నారదమహర్షి.

నారదమహర్షి చెప్పినట్టుగానే కృష్ణుడు వ్రతం ఆచరించాడు. వ్రతం ముగియగానే గణపతి ప్రత్యక్షమయ్యి, మామయ్య!(పార్వతిదేవి విష్ణుమూర్తికి చెల్లెలు. గణపతికి విష్ణుమూర్తి మామయ్య) నా వ్రతం ఆచరించావు కనుక ఈ రోజుతో నీ మీద పడ్డ నీలాపనిందలు తొలగిపోతాయి అన్నాడు. వరం ఇవ్వగానే  కాశీకి  'అక్రూర, జరిగింది ఏదో జరిగిపొయింది. ఇక్కడ కరువు వచ్చింది. వర్షాలు లేవు. అందువల్ల నువ్వు తక్షణమే ఆ మణిని తీసుకోని ద్వారకకు రావాలి' అని కబురు పంపాడు.

సాక్షాత్ కృష్ణుడే రమ్మన్నాడు కదా అని అక్రూరుడు ద్వారకు వచ్చి కృష్ణుడికిస్తే, దానికి బదులుగా కృష్ణుడు 'నాకేందుకీ మణి. నేను ప్రజల బాగు కోసమే అడిగాను. నీ దగ్గరే పెట్టుకోని, దీని నుండి వచ్చిన బంగారంతో అన్నదానం చేస్తూ, ఆ మణిని పవిత్రకార్యాలకు వాడు' అని పలికాడు.

అప్పటినుండి ద్వారకలో కరువులేదు. ప్రజలు సుఖశాంతులతో హాయిగా ఉన్నారు. ఆ సమయంలో వినాయకుడు కృష్ణుడితో 'ఇప్పుడు ఆనందంగా ఉందా. నీ మీద పడ్డ పనిందలన్ని తొలగిపోయయి కదా' అని అంటే కృష్ణుడు 'భగవంతుండినైన నేనే చంద్రుని చూసినందుకు నీ శాపం కారణంగా ఇన్ని అపనిందలు పడ్డాను. ఇక సామాన్య మానవులు మరెన్ని కష్టాలు పడతారో. దీనికి ఏదైనా పరిష్కారం చూపవా' అన్నాడు. అందుకు బదులుగా వినాయకుడు, వినాయక చవితి రోజున నువ్వు పడ్డ కష్టాలతో కూడిన ఈ కధను చదివి లేదా విని అక్షింతలు వేసుకుంటారో వారి 'పొరపాటున' చంద్రున్ని చూసినా వారికి ఏ నీలాపనిందలు రాకుండా వరం ఇస్తున్నా. అలాగే పూజ చేయకూడని వారు (జాతాశౌచం, బందువుల మరణం లాంటి కారణాల వల్ల) ఈ కధ చదివిన లేదా విన్న వారు, కధా చదివే సమయంలో చేతిలో పట్టుకున్న అక్షతలను తలమీద వెసుకున్నా ఫలితం లభిస్తుంది' అని పలికాడు.

గణపతి ఎంత శక్తివంతుడో,ఆయన శాపానికి ఎంత శక్తి ఉంటుందో ఈ కధ ద్వారా మనకు అర్దం అవ్తుంది. అలాగే మన కోసమని కృష్ణపరమాత్మ ఇన్ని కష్టాలు పడి, వినాయకుడి ద్వారానే ఒక పరిష్కారం చూపి మనల్ని ఉద్ధరించాడు.

ఈ కధనే వినాయకచవితి నాడు చదవాలి. అలా వీలుకాని పక్షంలో కనీసం శ్లోకమైన చదివి అక్షతలు వేసుకోవాలి.

సింహప్రసేనమవధి సింహోజాంబవతాహతః
సుకుమారకమారోధి తవహేష్యాశ్శమంతకః

ఓం శాంతిః శాంతిః శాంతిః

పాలవెల్లి

ఓం గం గణపతయే నమః

వినాయక చవితి పూజలో పాలవెల్లి కడతాం ఎందుకు?

ఎక్కడైనా ఒక ప్రదేశానికి ఒక సినీహీరోనో లేక ఒక రాజకీయనాయకుడొ వస్తుంటే, వాళ్ళని చూడటానికి జనం బారులు తీరుతారు.  మరి  వినాయకచవితికి సాక్షాత అనంతకోటి బ్రహ్మాండనాయకుడు, ఆదిమద్యాంతరహితుడైన ఆ పరంబ్రహ్మాన్ని గణపతి స్వరూపంగా చిన్న మట్టి విగ్రహంలోని ఆవాహన చేస్తున్నాం. పరమాత్ముడు మనం పూజించే విగ్రహంలోని వస్తున్నాడంటే, ఆయన్ను సేవించడానికి దేవయక్షకిన్నెరకింపురుషాదులు, గ్రహాలు ఆ పూజాప్రదేశానికి చేరుకుని ఆ పరమాత్ముడిని సేవిస్తాయి. దీనికి సంకేతంగా మనం పాలవెల్లి కడతాం. పాలవెల్లి కట్టే పండులు అంతరిక్షానికి, అక్కడ ఉండే జ్యోతిర్మండలానికి, నక్షత్ర, తారా సమూహానికి, గ్రహాలకు సంకేతం. మనం మాత్రమే కాదు, మన కట్టే పాలవెల్లి ద్వారా ఆయా శక్తులు స్వామిని సేవిస్తాయి.  

ఓం గం గణపతయే నమః    

Wednesday, 27 August 2014

శమంతకోపాఖ్యానం - 3

కొందరు మాత్రం వస్తామనడంతో, వారిని తీసుకొని అడవిలో వెతకడానికి వెళ్ళాడు శ్రీ కృష్ణుడు. వారు వస్తున్నారు కాని వారికి శ్రీ కృష్ణుడి మీద నమ్మకం లేదు. గుర్రపు అడుగుజాడలను అనుసరించి వెళ్ళగా అక్కడ ప్రసేనుడి బట్టలు, ఎముకలు, రక్తపు మరకలు ఉన్నాయి. "చుశారా! నేను చంపానన్నారు. ఇక్కడ సింహపు అడుగుజాడలు ఉన్నాయి. వారిని సింహమే చంపింది. అందువల్ల ఎముకలే ఉన్నాయి కాని శరీరాలు లేవు. అది చంపి వారిని తినేసింది" అని కృష్ణుడాన్నాడు. అయితే వచ్చిన వారిలో కొందరు 'ఈయనే చంపి మణి తీసుకున్నాక, సింహం ఈ దారిన వచ్చినప్పుడు శవాలను తిని ఉంటుంది. మళ్ళీ ఒక కట్టుకధ అల్లుతున్నాడు. మహా మోసగాడు చుశారా' అన్నారు. ఇంకొక నీలాపనింద.    

కాస్త ముందుకు వెళ్ళి చుస్తే అక్కడ ఎలుగుబంటి అడుగులు కనిపించాయి. సింహం శవం ఉంది. ఎలుగుబంటి సింహాన్ని చంపి మణి ఎత్తుకుపొయింది. ఈ పాదముద్రలు పట్టుకొని వెళదాం అన్నాడు కృష్ణుడు. సింహం ఎలుగుబంటిని చంపుతుంది కాని ఎక్కడైన ఎలుగుబంటి సింహాన్ని చంపుతుందా? ఇది ఇంకొక కట్టుకధ అన్నారు ఆయనతో వచ్చిన వారు. మళ్ళీ అబద్దాలు ఆడుతున్నాడని నీలాపనిందలు వేశారు.

ఆ ఎలుగుబంటి జాంబవంతుడు. ఆయన 24 వ త్రేతాయుగంనాటి వాడు. కృష్ణుడు 28 వ ద్వాపరయుగం నాటి వాడు. త్రేతాయుగంలో రామసేతు నిర్మాణసమయానికే జాంబవంతుడు కడువృద్ధుడు. అంటే ఆయన వయసు చాలా ఎక్కువ. త్రేతాయుగంలో రామున్ని చూసిన జంబవంతుడు ఆయన సౌందర్యానికి ముగ్ధుడయ్యాడు. 'పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం' అని రాముడిని వర్ణిస్తాం. మగవారే మొహించేంతటి సుందరుడు శ్రీ రామ చంద్రుడు. అటువంటి రాముడిని గట్టిగా కౌగిలించుకొవాలి అని కోరిక పుట్టింది జాంబవంతుడికి. రామున్ని అడుగగా, ఈ అవతారంలో కుదరదు, రాబోయే కృష్ణావతారంలో అవకాశం ఇస్తానన్నాడు. ఆ జాంబవంతుడికే ఒక పిల్లవాడు పుట్టాడు. పేరు సుకుమారుడు. వాడి ఆహారం కోసమని అడవిలో తిరుగుతున్న జాంబవంతునకు శమంతకమణి నోట కరుచుకున్న సింహం కనిపించింది. ఆ మణి చూడడానికి బాగుందని సింహాన్ని చంపి ఆ మణిని తీసుకొని వెళ్ళి తన కూమారుడి ఉయ్యాలకు కట్టాడు. కళ్ళు మిరమిట్లుకొరిపే ఆ మణి ఒక పసిపిల్లవాడికి ఆట వస్తువంటే వారు ఎంత బలవంతులో అర్దం చేసుకోండి.    

అంతా కలిసి ఆ ఎలుగుబంటి అడుగుజాడలను పట్టుకొని వెళ్ళగా, ఒక గుహలోకి వెళ్ళినట్టు ఆ అడుగుజాడల గుర్తులు ఉన్నాయి. కృష్ణుడు లోపలికి వెళ్ళి వెతుకుదాం అన్నప్పటికి వారు రాలేదు. రాకపోగా వచ్చినవారు కృష్ణుడు లోపలికి తీసుకువెళ్ళి చంపుతాడని, అందుకోసమే ఈ అడవిలో ఈ గుహ వద్దకు తీసుకువచ్చాడని అన్నారు. కృష్ణుడు 'ఒంటరి లోపలికి వెళతాను, బయట వేచి ఉండండి' అన్నా, తాము వేచి ఉండేది లేదని, ద్వారకకు తిరిగి వెళ్ళిపొయారు.

పడ్డ అపనింద తొలగించుకోవాలని కృష్ణపరమాత్మ చీకటిగా ఉన్న ఆ గుహలోనికి వెళ్ళాడు. కొంచం దూరం వెళ్ళాక అక్కడ యవ్వనంలో ఉన్న ఒక స్త్రీ ఒక పిల్లవాడిన ఉయ్యాలలో వేసి ఊపుతోంది. ఆ స్త్రీ జాంబవతి. జాంబవంతుని కూమార్తే. ఊయలలో ఉన్నది జాంబవంతుని కూమారుడు సుకుమారుడు. తమ్ముడిని ఊయలలో పడుకోబెట్టి ఊయల ఊపుతోంది. ఆ ఊయలకు శమంతక మణి కట్టి ఉండడం కృష్ణుడు చూశాడు. కృష్ణుడిని చూడగానే జాంబవతి మొహించింది. ఆయనే తనకు భర్త అని భావించింది. కృష్ణుడు ఆ మణి వంకే చూడడం గమనించి ఆ మణి కృష్ణుడిదే అని, తన తండ్రి తీసుకువచ్చి ఉంటాడని, కృష్ణుడు మణి  కోసమే వచ్చాడని గ్రహించింది. ఎవరైన క్రొత్తవారు వచ్చారని తెలిస్తే జాంబవంతుడికి కోపం వస్తుందని, కృష్ణుడిని చంపుతాడని భయపడుతుండగా, ఆ మణి కోసం కృష్ణుడు దగ్గరగా వస్తున్నాడు. ఆవిడ కృష్ణుడికి ఆ మణి ఇక్కడకు ఎలా వచ్చిందో అర్దమయ్యేలా, పిల్లవాడికి జోల పాడుతున్నట్టుగా, జాంబవంతునకు కృష్ణుడు వచ్చాడన్న సంగతి తెలియకుండా ఉండేందుకని ఒక పాట రూపంలో ఊయల ఊపుతూ జరిగినదంతా చెప్పింది.    

సింహప్రసేనమవధి సింహోజాంబవతాహతః
సుకుమారకమారోధి తవహేష్యాశ్శమంతకః

సింహం ప్రసేనుడిని చంపింది. సింహాన్ని జాంబవంతుడు చంపాడు. ఓ సుకుమార! నువ్వు ఏడవకు. ఈ మణి నీదే అని అర్దం.

ఇంతా చెప్పిన కృష్ణుడు దగ్గరకు వచ్చేస్తున్నాడు. ఏంటయ్యా, ఎంత చెప్పిన వినకుండా దగ్గరకు వచ్చేస్తున్నావు. మా నాన్న చూస్తే నిన్ను చంపేస్తాడు. అది నేను తట్టుకోలేను. వెనక్కి వెళ్ళు అని జాంబవతి పలికింది. రక్షించాలనుకుంది, ఇంతలో జాంబవంతుడు వచ్చాడు.    

To be Continued ...........

వినాయక చవితి - ఆహారనియమాలు & ఆరోగ్యం

వినాయక చవితి - ఆహారనియమాలు & ఆరోగ్యం

గణేశ చతుర్థీ రోజున నూనె తగలని వంట చేసి, గణపతికి నివేదన చేసి భోజనం చేయాలంటోంది ఆయుర్వేదం. అంటే కేవలం నెయ్యితోనే ఆహారపదార్ధాలు తయారుచేయాలి. ఇది దక్షిణాయనం, వర్షాకాలం. సూర్యకాంతి భూమి మీద తక్కువగా ప్రసరించడంతో మనలోని జీవక్రియలు నెమ్మదిస్తాయి. అరుగుదల, ఆకలి మందగిస్తుంది, చికాకుగా అనిపిస్తుంది, మలబద్దకం పెరుగుతుంది. శరీరంలో వ్యర్ధ పదార్ధాలు పెరిగిపోతే, అది ఆమం (విషం /Toxin) గా మారి రోగాలకు కారణమవుతుంది. ఆహారంలో నెయ్యి కలుపుకుని తినడం వలన, నెయ్యి మలద్వారానికి వెళ్ళే పేగుల గోడలకు ఒక పొరగా/పూతగా ఏర్పడి, మల విసర్జన సాఫిగా జరగడానికి కారణమవుతుంది. పుష్టికరమైన శుచికరమైన ఆహారం తీసుకోవడం ఎంత అవసరమో, శరీరంలో ఉన్న వ్యర్ధపదార్ధాలను, అక్కర్లేని చెత్తను బయటకు పంపించడం అంతే ముఖ్యం. ఆరోగ్యవంతమైన శరీరం ఉన్నవారి మనసు చురజక్గా పని చేస్తుంది. అటువనటి మనసే మంచి ఆలోచనలు చేయగలదు. మంచి ఆలోచనలే, సత్ సంకల్పాలై, సత్కర్మలకు దారి తీస్తాయి. సత్కర్మలు చిత్తశుద్ధిని కలిగిస్తాయి. శుద్ధిపొందిన చిత్తము ఆత్మాజ్ఞానానికి పాత్రతను పొందుతుంది. అటువంటి వారి తపస్సే ఫలిస్తుంది. కనుక ఆహారం తీసుకోవడం అంత ప్రధానామో, శరీరంలో ఉన్న చెత్తను వివిధ రకాలుగా తొలగించుకోవడం కూడా అంతే ప్రధానం. అందుకే గణేశ చతుర్థీ రోజున ప్రత్యేకించి నెయ్యితో చేసిన పదార్ధాలనే భుజించమన్నారు. ఒక్క వినాయక చవితికే కాదు, నిత్యం కూడా నెయ్యి కలిపిన ఆహారాన్నే స్వీకరించాలి. నెయ్యి లేని తిండి నీతిమాలిన తిండి అన్నారు మన శతకకర్తలు.

గణపతి ఇష్టమైనవి కుడుములు. కుడుములు ఆవిరి మీద ఉడికించి తయారుచేస్తారు. వర్షాకాలంలో వ్యాధులు ప్రబలడానికి ఒకానొక ముఖ్యకారణం ఆహారం. ఆహారం విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవాలి. శ్రావణంలో కొద్దిగా పసుపు కలిగిన నీటిలో నానబెట్టిన శెనగలను మొలకెత్తాక స్వీకరిస్తారు. ఇది శ్రావణమాసానికి తగిన ఆహారం కాగా, ఈ భాధ్రప్రదమాసంలో ఉడికించిన ఆహారం అత్యంత శ్రేష్టం, ఆరోగ్యకరం. అందుకే మన పెద్దలు ఈ సమయంలో ఆవిరి మీద ఉడికించిన ఆహారం అయితే మహాశ్రేష్టమని, ఆరోగ్య ప్రదాయకమని గుర్తించి గణపతికి కుడుములు సమర్పించమన్నారు. గణపతి చవితి ఒక రోజు ముందు వచ్చే ఉండ్రాళ్ళ తద్దే నుంచి గణపతి నవరాత్రులలో ప్రతి రోజు ఈ కుడుములు భుజించడం వలన ఆరోగ్యం చక్కగా ఉంటుంది.

అందుకే మన వినాయక చవితి రోజు స్వామికి నేతితో చేసిన వంటకాలు, కుడుములు సమర్పిస్తాం. గణపతి 21 సంఖ్య ఇష్టం కనుక వీలైతే 21 సంఖ్యలో కుడుములు / ఉండ్రాళ్ళు సమర్పించండి.

ఓం గం గణపతయే నమః