Thursday 28 August 2014

శమంతకోపాఖ్యానం - 4

జాంబవంతుడు వచ్చి కృష్ణపరమాత్మతో మల్లయుద్దం చేశాడు. యుద్దంలో కిందపడవేయడానికి ఎన్ని సార్లు ప్రయత్నించినా పడట్లేదు. ఎన్ని సార్లు ముట్టుకున్న జాంబవంతుడికి కృష్ణపరమాత్మను ముట్టుకోవాలనిపిస్తోంది. ఎన్నిసార్లు కౌగిలించుకున్నా ఇంకా ఇంకా హత్తుకోవాలి అనిపిస్తొంది. 21 రోజుల పాటూ నిర్విరామంగా యుద్దం చేసినా కృష్ణుడు అలసిపోలేదు. వచ్చింది రాముడే అన్న విషయం తెలుసుకున్నాడు జాంబవంతుడు. ఆయనకు నమస్కరించి, శమంతకమణి ఇచ్చి, తన కూతురు జాంబవతికి కృష్ణునితో వివాహం చేశాడు. కృష్ణపరమాత్మ జాంబవతిని వెంటపెట్టుకొని మణితో ద్వారకకు వెళ్ళాడు. జరిగిన విషయాన్ని సత్రాజిత్తుకు వివరించాడు. నిజం తెలుసుకున్న సత్రాజిత్తు, కృష్ణుడు ఎంతో మంచివాడని, కృష్ణుడి మీద వేసిన నీలాపనిందలకు క్షమాపణగా ఆయన కూతురు సత్యభామను ఇచ్చి వివాహం చేశాడు. శమంతకమణిని ఇచ్చాడు కానీ కృష్ణుడు తీసుకోలేదు. ఉన్నది ఒక్క కూతురే కనుక ఎలాగో తరువాత తమకే దక్కుతుందని, ఎంతో ఇష్టపడి సూర్యుడి దగ్గరనుండి తెచ్చుకున్నారు కనుక తన  దగ్గరే ఉంచుకోమని సత్రాజిత్తుకు చెప్పాడు.    

ఇక్కడితో కధ ముగియలేదు. పెద్ద మలుపు తిరిగింది. ఎప్పటినుంచో సత్యభామను వివాహం చేసుకుంటామని అక్రూరుడు, శతధన్వుడు, కృతవర్మ అనే ముగ్గురు సత్రాజిత్తును అడుగుతున్నారు. ఇంతకాలంగా వివాహ విషయాన్ని దాటవేతూ వచ్చిన సత్రాజిత్తు ఇప్పుడు మణి తెచ్చి ఇచ్చాడని కృష్ణపరమాత్మకు ఇచ్చి వివాహం చేయడం సహించలేకపోయారు. ఆ ముగ్గురిలో అక్రూరుడు, కృతవర్మకు కృష్ణుని యందు అపారమైన భక్తి. శతధన్వుడికి భక్తి కాస్త తక్కువ. సత్రాజిత్తు మీద ఉన్న కసిని తీర్చుకోవడానికి సమయం కోసమని ఎదురుచూస్తున్నారు.


ఆ సమయానికి పాండవులను లక్క ఇంట్లో పెట్టి, ఇంటిని తగలబెట్టి చంపేశారని కృష్ణుడికి వార్త అందింది. తమ్ముడి కొడుకులు చనిపొయారని బాధపడుతున్నట్టు నటిస్తున్న దృతరాష్ట్రుడిని ఓదార్చడానికి కృష్ణుడు వెళ్ళాడు. ఈ ముగ్గురికి సమయం దొరికింది. సమావేశం జరిపి సత్రాజిత్తును చంపాలి అని పధకం వేశారు. అక్రూరుడు,కృతవర్మకు భక్తితత్పరులు కనుక శతధన్వుడికి ఈ పని అప్పగించారు. శతధన్వుడు నిద్రపోతున్న సత్రాజిత్తును చంపాడు. చంపి ఆ మణిని మెడలో వేసుకొని వచ్చాడు. మణి అపవిత్రమయ్యింది. వాడు అక్రూరుడి వద్దకు వచ్చి ఈ మణి తన దగ్గర ఉంటే జాగ్రత్తగా ఉండదని, అందువల్ల అక్రూరుడి వద్ద దాచమని చెప్పి, బలవంతంగా ఇచ్చి తన ఇంటికి వెళ్ళి దాక్కున్నాడు.

సత్యభామ రధమెక్కి కృష్ణుడి వద్దకు వెళ్ళి జరిగినదంతా చెప్పింది. కృష్ణుడు శతధన్వుడిని చంపుతానని రధం ఎక్కి ద్వారకకు వెళ్ళి, బలరాముడికి విషయం చెప్పి, రా! అన్నయ్యా ఇద్దరం కలిసి వెళదాం అన్నాడు. ఇద్దరు కలిసి రధం మీద బయలుదేరారు. బలరామకృష్ణులు వస్తున్నారన్న సంగతి తెలుసుకున్న శతధన్వుడు, జాంబవంతుడినే ఓడించిన కృష్ణుడు తనను చంపుతాడని ఆందోళన చెంది  గుర్రమెక్కి పారిపోయాడు.

శతధన్వుడు వంద ఆమడల దూరం పరిగెత్తగల గుర్రం ఎక్కాడు. బలరామకృష్ణులు నాలుగు గుర్రాలతో నడిచే రధం మీద వెంబడిస్తున్నారు. కొంచం దూరం వెళ్ళాక శతధన్వుడి గుర్రం కిందపడి మరణించింది (శమంతమణి ప్రభావం). వాడు పరిగెత్తడం చూసి రధంలో వెంబడిస్తున్న కృష్ణుడు అన్నయ్యా, వాడి గుర్రం చనిపొయింది. అలా నేల మీద పరిగెడుతున్న వాడిని రధంలో వెంబడించడం తగదు. ఒంటరిగా పరిగెడుతున్న వాడిని ఇద్దరు వెంబడించడం ధర్మం కాదు. అందువల్ల నువ్వు రధంలోనే ఉండు నేను వాడిని చంపి మణి తీసుకువస్తానన్నాడు.

కృష్ణుడు వాడిని వెంబడించగా, వాడు పొదల్లొ దాక్కొవడం, యుద్దం చేయడం, వాడిని చంపడం జరిగింది. వాడు చనిపోయాక వాడి బట్టలంతా వెతికినా శమంతకమణి దొరకలేదు (ఇంతకముందే వాడు అక్రూరుడికిచ్చాడు). జరిగినదంతా చెప్పి శమంతకమణి దొరకలేదన్న విషయాన్ని చెప్పగా, బలరాముడు 'చిన్నప్పటినుంచి నిన్ను చూస్తునేవున్నా. నువ్వు ఎన్ని దొంగతనాలు చేయలేదు, ఎంత వెన్న తినలేదు, నేను వయసులో పెద్దవాడిని, మణి నాకు ఇవ్వవలసి వస్తుందని, మణి దొరకలేదని అబద్దాలు చెప్తున్నావు. మణిని శతధన్వుడు రధంలో దొంగిలించడం చూసి సత్యభామ నీకు చెప్పింది. మరి మణి వాడి దగ్గర లేకపొతే ఎక్కడ ఉంటుంది? నువ్వూ వద్దు, ద్వారక వద్దు. నేను విదేహరాజ్యానికి వెళ్తున్నాను' అని చెప్పి వెళ్ళిపోయాడు.

తిరిగి ద్వారకకు వెళ్ళిన కృష్ణుడిని చూసి 'చుశారా! అన్నయ్యని కూడా మోసం చేశాడి కృష్ణుడు' అంటూ ప్రజలు అన్నారు.

జాంబవతి 'ఈయన మా నాన్న మీద గెలిచి నన్నూ, మణిని తీసుకున్నాడు. ఈ మణి మా నాన్న ఇచ్చాడన్న గౌరవం కూడా లేకుండా, మా నాన్నకు పేరు వస్తుందని సత్రాజిత్తుకిచ్చాడు. సత్రాజిత్తుకిచ్చి ఆయన దగ్గర నుండి తిరిగి మణిని తీసుకొని సత్రాజిత్తుకు పేరు తేవాలని చూస్తున్నాడు' అని జాంబవతి అనుమానం వ్యక్తం చేసింది.

ముందు మా నాన్న మణి అడిగితే ఇవ్వలేదు. తరువాత ఇచ్చినా అహంకారం అడ్డువచ్చి తీసుకోలేదు. శతధన్వుడు చంపుతాడని తెలిసి, ఆయన మా నాన్ను చంపడం కోసమే కృష్ణుడు ఊరు విడిచి వెళ్ళాడు. ఆ శతధన్వుడిని చంపి ఆ మణి తన దగ్గరే దాచిపెట్టుకొని, లేదని చెప్తూ నటిస్తున్నాడని సత్యభామ అన్నది. తనలో సగమైన భార్యలు కూడా అనుమానించడం మొదలు పెట్టారు. ఇంతకంటే పెద్ద నీలాపనిందలు ఇంకేమంటాయి?

ఇన్ని నీలాపనిందలు ఎదురుకున్న కృష్ణుడు అంతఃపురంలో కూర్చుని ఎంత బయట పడదామన్నా, ఇంకా ఇంకా అపనిందలు వస్తూనే ఉన్నాయి, ఏమి చేయాలని ఆలోచిస్తున్నాడు.

అక్రూరుడికి కృష్ణునియందు అపారమైన భక్తి ఉన్నా, ఆ మణిని కృష్ణునకు ఇవ్వడానికి సిగ్గుపడి, ఆ మణిని తీసుకొని కాశీకి వెళ్ళాడు. కాశీకి వెళ్ళగానే ఆయన మనసు మారింది. నేను మణి ఇవ్వకపోవడం వల్లనే కృష్ణుడి మీద ఇన్ని అపనిందలు పడ్డాయి అని భాదపడ్డాడు. దానిని పవిత్ర కార్యాలకు వాడడం మొదలు పెట్టాడు. దాని నుండి వచ్చిన బంగారంతో కాశీలో రోజు అన్నదానం చేశాడు. ఆ మణిని పవిత్రంగా ఉంచడంవల్ల దాని ప్రభావంతో కాశీలో కరువుకాటకాలు రాలేదు. వ్యాధులు అసలే లేవు.

దీనంగా ఆలోచిస్తున్న కృష్ణుని వద్దకు నారదమహర్షి వచ్చారు. కృష్ణా! నీకు ఇన్ని అపనిందలు రావడానికి కారణం భాద్రపద శుక్లచవితినాడు (అంటే వినాయక చవితి)  నువ్వు ప్రసేనుడితో కలిసి వీటకు వెళ్ళినప్పుడు చూసిన చవితి చంద్రుడు. ఆ రోజు చంద్రున్ని చూసిన వారికి నీలాపనందలు వస్తాయని వినాయకుడి శాపం. అందువల్ల ఈసారి నువ్వు వినాయకచవితి రోజున వరసిద్ధివినాయకచవితి వ్రతం ఆచరించు. 21రకాల పత్రిని, అలాగే పచ్చని దొసపండు (కీరదోసకాయ) ను సమర్పించు. వినాయకుడు తప్పక అనుగ్రహిస్తాడు అని పలికాడు నారదమహర్షి.

నారదమహర్షి చెప్పినట్టుగానే కృష్ణుడు వ్రతం ఆచరించాడు. వ్రతం ముగియగానే గణపతి ప్రత్యక్షమయ్యి, మామయ్య!(పార్వతిదేవి విష్ణుమూర్తికి చెల్లెలు. గణపతికి విష్ణుమూర్తి మామయ్య) నా వ్రతం ఆచరించావు కనుక ఈ రోజుతో నీ మీద పడ్డ నీలాపనిందలు తొలగిపోతాయి అన్నాడు. వరం ఇవ్వగానే  కాశీకి  'అక్రూర, జరిగింది ఏదో జరిగిపొయింది. ఇక్కడ కరువు వచ్చింది. వర్షాలు లేవు. అందువల్ల నువ్వు తక్షణమే ఆ మణిని తీసుకోని ద్వారకకు రావాలి' అని కబురు పంపాడు.

సాక్షాత్ కృష్ణుడే రమ్మన్నాడు కదా అని అక్రూరుడు ద్వారకు వచ్చి కృష్ణుడికిస్తే, దానికి బదులుగా కృష్ణుడు 'నాకేందుకీ మణి. నేను ప్రజల బాగు కోసమే అడిగాను. నీ దగ్గరే పెట్టుకోని, దీని నుండి వచ్చిన బంగారంతో అన్నదానం చేస్తూ, ఆ మణిని పవిత్రకార్యాలకు వాడు' అని పలికాడు.

అప్పటినుండి ద్వారకలో కరువులేదు. ప్రజలు సుఖశాంతులతో హాయిగా ఉన్నారు. ఆ సమయంలో వినాయకుడు కృష్ణుడితో 'ఇప్పుడు ఆనందంగా ఉందా. నీ మీద పడ్డ పనిందలన్ని తొలగిపోయయి కదా' అని అంటే కృష్ణుడు 'భగవంతుండినైన నేనే చంద్రుని చూసినందుకు నీ శాపం కారణంగా ఇన్ని అపనిందలు పడ్డాను. ఇక సామాన్య మానవులు మరెన్ని కష్టాలు పడతారో. దీనికి ఏదైనా పరిష్కారం చూపవా' అన్నాడు. అందుకు బదులుగా వినాయకుడు, వినాయక చవితి రోజున నువ్వు పడ్డ కష్టాలతో కూడిన ఈ కధను చదివి లేదా విని అక్షింతలు వేసుకుంటారో వారి 'పొరపాటున' చంద్రున్ని చూసినా వారికి ఏ నీలాపనిందలు రాకుండా వరం ఇస్తున్నా. అలాగే పూజ చేయకూడని వారు (జాతాశౌచం, బందువుల మరణం లాంటి కారణాల వల్ల) ఈ కధ చదివిన లేదా విన్న వారు, కధా చదివే సమయంలో చేతిలో పట్టుకున్న అక్షతలను తలమీద వెసుకున్నా ఫలితం లభిస్తుంది' అని పలికాడు.

గణపతి ఎంత శక్తివంతుడో,ఆయన శాపానికి ఎంత శక్తి ఉంటుందో ఈ కధ ద్వారా మనకు అర్దం అవ్తుంది. అలాగే మన కోసమని కృష్ణపరమాత్మ ఇన్ని కష్టాలు పడి, వినాయకుడి ద్వారానే ఒక పరిష్కారం చూపి మనల్ని ఉద్ధరించాడు.

ఈ కధనే వినాయకచవితి నాడు చదవాలి. అలా వీలుకాని పక్షంలో కనీసం శ్లోకమైన చదివి అక్షతలు వేసుకోవాలి.

సింహప్రసేనమవధి సింహోజాంబవతాహతః
సుకుమారకమారోధి తవహేష్యాశ్శమంతకః

ఓం శాంతిః శాంతిః శాంతిః

No comments:

Post a Comment