Tuesday, 30 November 2021

శ్రీ హనుమద్భాగవతము (88)



వెంటనే హనుమానునిదృష్టి పవిత్రమైన ఒక భవనముపై పడీంది. అచట భగవానుని ఆలయమొకటి శోభిల్లుతున్నది. ఆ భవన కుడ్యములపై నంతట అనేకమైన అవతారముల యొక్క, లీలల యొక్క చిత్రములు, రామనామము అంకితమై ఉన్నాయి. దాని ద్వారముపై రాముని ఆయుధములైన ధనుర్బాణములచిహ్నములు అంకితమై ఉన్నాయి. అచట మణుల వెలుగులలో కుంకుమపువ్వుతో పాటు, ఇతరపుష్పములతో పాటు మడులలో తులసిమొక్కలు స్పష్టముగా కనిపిస్తున్నాయి. దీనిని చూడగానే హనుమంతుడు ఎంతో ఆశ్చర్యము చెందాడు, ధర్మమునకు, వేదపురాణములకు, యజ్ఞయాగములకు, గోవులకు, ద్విజులకు, దేవతలకు, భగవానునకు సహజశత్రువులైన రాక్షసుల పట్టణములలో ఈ ఆలయము౦డుటేమి?


అప్పుడే రావణుని సోదరుడైన విభీషణుడు నిద్ర నుండి లేచి శ్రీరాముని నానుమును స్మరింపసాగాడు. అతని నోటినుండి శ్రీరామనామము వినబడినంతనే నిజంగా ఇతడు భగవద్భక్తుడే అనే నమ్మకము హనుమానునకు కలిగింది. శరణాగత వత్సలుడైన హనుమానుడు వెంటనే బ్రాహ్మణవేషమును ధరించి భగవన్నామమును ఉచ్చరింపసాగాడు. రామనామమును విన్న వెంటనే విభీషణుడు బయటకు వచ్చి బ్రాహ్మణ వేషధారీ, జగత్పావనుడైన పవనపుత్రుని చరణములను ఆదరపూర్వకంగా నమస్కరించి ఇలా - ' బ్రాహ్మణ దేవా! మీరెవరు? మీరు భగవద్భక్తులే అని నా మనస్సు చెప్పుచున్నది. మిమ్ము చూసినంతనే నా మనస్సులో ప్రేమ ఉత్పన్నమవుతున్నది. లేదా మీరు మీ భక్తులకు సుఖమును కలిగించుటకై నన్ను ధన్యునిగా చేయుటకై వచ్చిన నా స్వామియైన శ్రీరాముడవు కావు గదా! దయ యుంచి నాకు మీ విషయమును చెప్పండి.


సంసారభయనాశకుడైన అంజనీనందనుడు పూర్ణమైన మధురవాక్కులను ఇట్లు పలికాడు. ప్రేమ 'నేను మహా పరాక్రమవంతుడైన వాయు దేవుని పుత్రుడను, నా పేరు హనుమానుడు. నేను శ్రీరాముని భార్య, జగజ్జనని అయిన జానకీ దేవీ జాడను తెలుసుకొనుటకై ఆయన ఆదేశాన్ని అనుసరించి ఇచటకు వచ్చాను. నిన్ను చూడగానే నా మనస్సు సంతోషముతో ఉప్పొంగినది. దయయుంచి వివరించండి”.


Monday, 29 November 2021

శ్రీ హనుమద్భాగవతము (87)



మతిమంతుడైన హనుమానుడు రావణుని ఆ విశాల భవనమునంతటిని తిరిగి నిదురిస్తున్న వేలకొలది సుందరీమణులను శ్రద్ధగా చూసాడు. వెంటనే అతని మనస్సులో ఒక ఆలోచన వచ్చింది - 'నేను బాల బ్రహ్మచారిని, శ్రీరామునిదూతను, లోకమాతను వెదకుటకు వచ్చాను. కాని ఇచట నేను గాఢ నిద్రాముద్రితలై ఉన్న పరస్త్రీలను చూసాను, నాకిది తగదు. నా దృష్టి ఇంతవఱకెప్పుడూ నా తల్లిని విడచి మరియే స్త్రీ మీదను పడలేదు, కాని నేడు నేను ధర్మమునుండి చ్యుతుడనైతిని. 


ధర్మమూర్తియు, వీరకర్ముడైన హనుమానుడు ధర్మ భయముచే శంకితుడయ్యాడు, కాని మనస్సులోను, ప్రాణములోను ఆయన శరీరములోను, సర్వాంతర్యామియైన శ్రీరాముడే విరాజిల్లుచున్నాడు. అందువలన మరుసటి క్షణములోనే అతని మనస్సునకు సమాధానము తట్టినది. ఆయన ఇట్లా  ఆలోచింపసాగాడు -- ‘రావణుని స్త్రీలు సందేహము లేనివారై నిద్రించుచున్నారు. ఆ అవస్థలో వారిని నేను జాగ్రత్తగా చూసాను. కాని నా మనస్సులో ఎట్టి వికారమును కలుగలేదు. శుభాశుభములకు ప్రేరకము మనస్సు, నా ఈ మనస్సు సంపూర్ణముగా శాంతముగానూ, స్థిరముగానూ ఉన్నది. దానికి రాగముగాని ద్వేషముగాని లేదు. అందువలన నా ఈ స్త్రీ దర్శనమువలన ధర్మమునకు ఎట్టి లోపము కలిగియుండక పోవచ్చు. నేను కావాలని వారిని చూడలేదు. జానకిని అన్వేషించుటకు, గుర్తించుటకు వారిపై దృష్టిను ఉంచాను, స్త్రీ అగుట వలన సీతా దేవిని స్త్రీలలోనే వెదుకవలసివచ్చినది. ఆమెను నేను పరిశుద్ధమైన మనస్సుతోనే అన్వేషించాను, కనుక నేను పూర్తిగా దోషరహితుడనే.”


కామవిజేతయైన హనుమంతుడు జానకీ దేవిని అన్యస్థలములలో కూడా వెతికాడు. ఆయన లంకలో మిగిలిన గృహములను, వనములను, ఉపవనములను, వాటికలను, వాపీకూపములను, మందిరములను, పశుశాలలను, సభాభవనములను, సైనిక స్థావరములను, రహస్యస్థావరములను చూసాడు. ఇట్లాయన సావధానముగా రాత్రియంతా సీతను అన్వేషిస్తూనే ఉన్నాడు. కాని ఆమె జాడ ఎక్కడ తెలియరాలేదు. అతడు విచారగ్రస్తుడగుచున్నాడు. రాత్రి గడచుచున్నాడు. బ్రాహ్మముహూర్తము సమీపించుచున్నది.


Sunday, 28 November 2021

శ్రీ హనుమద్భాగవతము (86)



ఇటు అటు చూస్తూ హనుమానుడు స్ఫటికమణినిర్మితమైన దివ్యమైన ఒక వేదికను చూసాడు. దానిపై రత్న నిర్మితమైన రావణుని పర్యకముండింది. దానికి నలువైవులు చాలా మంది స్త్రీలు నిలువబడి చామరములను ధరించి విసరుచున్నారు. ఉజ్జ్వలమైన ఆ పర్యంకముపై లంకాధిపతియైన రావణుడు సుఖముగా నిద్రించుచున్నాడు; అచట బ్రహ్మచారియైన హనుమానుడు రావణుని పత్నులను కూడా చూసాడు. వారాతని చరణములకు అటు నిటు నిద్రించుచున్నారు. సమీపమునందే అతనికి సంతోషమును గలుగ జేసే వీణావాదినులైన సుందరీమణులు గాఢనిద్రలో పడి ఉన్నారు. ఇంకా కొందఱి వక్షఃస్థలముపై వీణులు పడియే ఉన్నాయి. కోమలమైన వారివేళ్ళు వీణాతంత్రులను స్పృశించుచునే ఉన్నాయి. 


వారందఱికంటె వేఱుగా ఎంతో సుందరమైన శయ్యపై పరుండి ఉన్న అనుపమ రూపలావణ్యసంపన్నయైన ఒక యువతిని హనుమానుడు చూసాడు. కోమలములు, సుందరమైన ఆమె అవయవములపై ముత్యములతోనూ మణులతోనూ కూడిన వివిధమైన ఆభూషణాలు విరాజిల్లుచున్నాయి. ఆమె శరీరకాంతి సువర్ణమువలె మెఱయు చుండింది. అనుపమ రూపవతియైన ఆమె రావణుని భార్యయైన మండోదరి. ఆమెను చూసినంతనె హనుమానునకు 'ఈమె సీతా దేవియా' అనే అనుమానము కలిగింది. అతని సంతోషమునకు ఎంతు లేకపోయింది. హర్షిన్మత్తుడై ఆయన తన తోకను నేలపై కొడుతూ ముద్దిడు కొనసాగాడు. వానరుల ప్రకృతిని అనుసరించి ఆయన ఇటు అటు పరుగిడసాగాడు. ఆయన ఒక మారు స్తంభముల ఎక్కుతూ, వెంటనే మఱల క్రిందకు దూకాడు.


సద్గుణములకు నిలయమైన పవనకుమారునకు వెంటనే మఱియొక ఊహ తట్టెను - “పరమపతివ్రతయైన సీతా దేవి ప్రభువైన శ్రీరాముని వియోగమున ఎప్పుడూ అలంకరించుకొని వస్త్రాభరణములను ధరించదు. ఆమె భోజనము చేయదు, సుఖముగా శయనించదు, మద్యపానము స్వప్నమునందైనా చేయదు. శ్రీరామునితో సాటివచ్చు సౌందర్యవంతులు దేవ దానవనాగకిన్నరులలోగాని ఈ భూమిపై గల మానవులలో గాని ఎవ్వరునూ లేరు. ఇక సీత వంటి పతివ్రతా స్త్రీ పరపురుషునికడకు ఎలా వెళుతుంది? అందువలన ఈమె సీతా దేవి ఏ మాత్రమును గాదు”.


Friday, 26 November 2021

శ్రీ హనుమద్భాగవతము (85)



మరల ఆయన రావణుని భవనము కడకు వేగముగా వెళ్ళాడు. కపిశ్రేష్ఠుడైన హనుమంతుడు లంఘించి రావణుని భవనములోనికి ప్రవేశించాడు. అచ్చట ఆయన శూలములు, ముద్గరములు, శక్తి, గదలు, పట్టిసములు, కోదండములు, ముసలములు, పరిఘలు, భిందిపాలములు, బల్లెములు, పాశములు, తోమరములు మున్నగు శస్త్రాస్త్రమములను ధరించి ఉన్న అసంఖ్యాకులైన రాక్షసులను, రాక్షసస్త్రీలను చూసాడు. వారందఱు విశాలకాయులు, వీరులు, అపారశక్తి సంపన్నులు. వారి దృష్టిలో పడకుండా పింగళకేశుడైన హనుమానుడు సూక్ష్మరూపముతో రావణుని భవనములోని ప్రతికక్ష్యును జాగ్రత్తగా చూస్తూ వెళ్ళుచున్నాడు. అచట ఆయన బంగారము వంటి కాంతిగలది, అనేకములైన రత్నములచే నిండినది, వివిధములైన వృక్షముల పుష్పములచే ఆచ్ఛాదితమైనది, అనుపమమైనదైన పుష్పకవిమానమును చూసాడు. అది తన దివ్యమైన కాంతిచే ప్రజ్వలితమగుచున్నట్లుంది. అద్భుతము, పరమమనోహరమైన విమానమును చూసి హనుమానుడు ఎంతో విస్మితుడయ్యాడు. కాని నలువైపులు తిరిగి చూసినా పూజనీయురాలైన సీతాదేవి కనబడకపోవుటచే అతడు చింతితుడయ్యాడు.


చింతితుడైన హనుమానుడు సీతాన్వేషణమునకై శస్త్రాస్త్రసంపన్నులైన రాక్షసవీరుల నుండి తప్పించుకొంటూ, రాక్షసరాజైన రావణుడు నివసించు ప్రదేశమునకు చేరాడు. అచట రాక్షసజాతీయపత్నులు, హరించి తెచ్చిన వేలకొలది రాజకన్యలు ఉన్నారు. అచట వరుసగా సువర్ణమయమైన దీపాలు ప్రజ్వరిల్లుచున్నాయి. అచటి నేల స్ఫటిక మణి నిర్మితము, సోపానములు మణిమయములు, వాతాయనములు సువర్ణ నిర్మితములు. 'రావణుని ఆ నివాసము స్వర్గముకంటెను ఎంతో గొప్పగా ఉన్నట్లు తోచుచున్నది.


సగమురాత్రి గడచింది. ఆ భవనమున పవనకుమారుడు రంగురంగుల వస్త్రమములను పుష్పమాలలను ధరించి అనేకమైన వేషభూషలచే విభూషితలైయున్న వేలకొలది సుందరీమణులను చూసాడు. మద్యపానము చేత, ఎక్కువగా మేలుకొని యుండుట చేత వారు ఆయా ప్రదేశములలో ఆ రాత్రి గాఢ నిద్రాపరవశలై ఉన్నారు. వారి వస్త్రములు అస్తవ్యస్తములై ఉన్నాయి. హనుమానుడు సీతా దేవిని ఇంతకుమునుపు ఎన్నడూ చూసి ఉండలేదు, కాని పతివ్రతయైబ జానకి యొక్క పరమ సాత్త్వికము, తేజస్వంతమైన రూపము గుర్తింపదగినట్లుంది. అందువలన హనుమానుడు ఆ సుందరీమణులను శ్రద్ధగా చుస్తున్నాడు. 

Thursday, 25 November 2021

శ్రీ హనుమద్భాగవతము (84)



హనుమంతుడు విభీషణుని గలిసికొనుట


కపికుంజరుడైన శ్రీ పవనపుత్రుడు మూడులోకములచే నమస్కరింపదగినదైన సీతా దేవిని దర్శించుటకై ఎంతో వ్యాకులపడుచున్నాడు. అందువలన ఆయన భయంకరులైన రాక్షసులకు కనబడకుండగా విచిత్రములైన పుష్పమయ ఆభరణముచే అలంకృతమైయున్న లంకలోని ముఖ్యస్థలాలను జాగ్రత్తగా చూడసాగాడు. నగర మధ్య భాగమున రావణుని గూఢచారులెందరో ఆయనకు కనబడ్డారు. అంతేకాదు ఆయన రావణుని అంతఃపురమును జాగ్రత్తగా కాపలాకాయుచున్న శస్త్రసంపన్నులైన ఒక లక్ష మంది సైనికులను కూడా చూసాడు. అంజనానందనుడు దశాననుని అశ్వశాలను, గజశాలను, అస్త్రాగారాన్ని, మంత్రణాలయాన్ని, సైన్యస్థావరాన్ని శ్రద్ధగా చూసాడు. ఆయన సీతా దేవిని అన్వేషిస్తూ రాక్షసుల హర్మ్యములలో ప్రవేశించి వారి ఆహారవిహారములను, పడకలను, మనోరంజనాదుల స్థలాలు మొదలైనవాటిని కూడా చూసాడు.


అచట వీరవరుడైన ఆంజనేయుడు ఐశ్వర్యమదమత్తులైన నిశాచరులను, మద్యపానమత్తులైన రాక్షసులను ఎందఱినో చూసాడు. శ్రీరాముని దూతయైన హనుమంతుడు జగత్రయ విజేతయైన రావణుని లంకలోనూ ఉత్కృష్టమైన బుద్ధిగలవారు, సుందరముగా పలుకువారు, గొప్ప శ్రద్ధగలవారు, అనేక విధములైన రూపములు వర్ణములు గలవారు, సుందరములైన నామములు గలవారైన అసురులనెందఱినో చూసాడు. కాని వారిలో జనకనందిని ఎచ్చటనూ కానరాలేదు. వారి సంభాషణముల వలన కూడా ఆమె ఉనికి తెలియలేదు.


అందువలన కామరూపధారియైన పవనకుమారుడు సీతాదేవి అన్వేషిస్తూ స్వర్ణమయములైన కోటగోడలతో చుట్టబడి ఉన్న రావణుని మహలులోనికి ప్రవేశించాడు. రాజోచితములైన సామగ్రులతో నిండిన శ్రేష్ఠము సుందరమైన ఆ భవనమును చూసి సమీరకుమారుడు ఆశ్చర్యచకితుడయ్యాడు. ఆ భవనద్వారము మిలమిలలాడే బంగారము చేయబడినది. వెండి చే చేయబడిన చిత్రములతో దానిశోభ అద్భుతముగా ఉంది. దాని రక్షణకై శస్త్రములను ధరించిన లక్షల కొలది వీరులు సావధానముగా నిలబడియుంన్నారు. సైనికులందఱు అభేధ్యమైన కవచాలను ధరించి యుంన్నారు. ఏనుగులతోను, గుఱ్ఱములతోను, రధములతోను నిండియున్న ఆ భవనము యొక్క సాటిలేని రూపమును చూసి పవనకుమారుడు ఎంతో చకితుడయ్యాడు, కాని ఆయన నేత్రములు జనక నందినిని అన్వేషించుటలోనే నిమగ్నములై యున్నవి.


సర్వవిద్యావిశారదుడైన హనుమంతుడు ఆ భవనమునకు చుట్టుప్రక్కలనున్న భవనములలో ప్రవేశించి సీతా దేవి జాడను తెలుసుకునే పని ప్రారంభించాడు. ఆయన లంఘించి కుంభకర్ణుని భవనంలోకి ప్రవేశించాడు. అచట నుండి మహోదర విరూపాక్ష విద్యుజ్జిహ్వ విద్యున్మాలురగృహములలోనికి వెళ్ళాడు. ఆ అసురులు అమిత సంపదలను, మహావైభవమును చూస్తు నిర్భయుడైన హనుమంతుడు దూకి వజ్రదంష్టశుక సారణుల గృహములలోనికి వెళ్ళాడు. ఆయన సీతను అన్వేషిస్తూ ఇంద్రజిత్తు, జంబుమాలి, సుమాలీల ఇళ్ళకు కూడా వెళ్ళాడు. అచట సీతా దేవి కనబడలేదు. అమితవిక్రమశాలియైన హనుమానుడు రశ్మి కేతు సూర్యశత్రు వజ్రకాయులభవనములోనికి వెళ్ళాడు. సీతా దేవి జాడను తెలుసుకొనుటకు పవననందనుడు ఎంతో శ్రమపడుచున్నాడు. ఆయన ధూమ్రాక్షుడు, సంపాతి, విద్యుద్రూపుడు, భీముడు, ఘనుడు, విఘనుడు, చక్రుడు, శరుడు, కపటుడు, హ్రస్వ కర్ణుడు, దంష్ట్రుడు, లోమశుడు, యుద్ధోన్మత్తుడు, మత్తుడు, ధ్వజగ్రీవుడు, ద్విజిహ్యుడు, హస్తిముఖుడు, కరాళుడు, పిశాచుడు, శోణితాక్షుడు మొదలైన సుప్రసిద్ధులైన అసురుల గృహములలోనికి వెళ్ళి చాలా జాగ్రత్తగా పరిశీలించాడు. కాని అచట ఎక్కడ గూడ జానికి దర్శనము కాలేదు.

Wednesday, 24 November 2021

ఆచారాలను తర్వాతి తరాలకు నేర్పాల్సింది పెద్దలే



మన సంస్కృతి, సంప్రదాయలు, మన ఇంటి ఆచారవ్యవహారలు మన తర్వాతి తరాలు కూడా పాటించాలంటే అన్నిటికంటే ముందు కుటుంబాల్లో ఉన్న పెద్దలు శ్రద్ధగా సంప్రదాయలను పాటించాలి. ఇతర దేశాల్లో దీని మీద పరిశోధనలు కూడా జరిగాయి. పిల్లలు ఏది పాటిస్తారని చూడగా, పెద్దలు చెప్పింది చూసి పిల్లలు నేర్చుకోరట, పెద్దల నడవడిని మాత్రమే పిల్లలు చూసి నేర్చుకుంటారని తేలింది.


బ్రాహ్మణ కుటుంబాల్లో పుట్టి పెరిగిన వాళ్ళలో కూడా ఇంట్లో పూజలు చేసుకోవడం రానివారిని కూడా నేను చూసాను. దళిత కుటుంబాల్లో పుట్టినా, తమ పెద్దలు శ్రద్ధగా పాటిస్తున్న ఆచరాన్ని చూసి నేర్చుకుని పాటించే వాళ్ళానీ చూశాను. అంటే బ్రాహ్మణులంతా అలా ఉంటారని కాదు. కాని అదొక్క చిన్న ఉదాహరణ మాత్రమే. ఇంట్లో ఎవ్వరూ పాటించకున్నా నేర్చుకునేవారు కూడా లేకపోలేదు. అది మినహాయింపు అనుకోండి. దానికి కారనం పూర్వజన్మ వాసన.


మా చిన్నప్పుడు మా బామ్మ, అమ్మ, అమ్మమ్మ మన సంస్కృతి గురించి రకరకాల కథలు చెప్పారు. కార్తిక మాసం మొదలైనవి వచ్చినప్పుడు సాయంకాలం చీకటి పడే సమయానికి బడి నుంచి వచ్చిన మేము కాళ్ళు చేతులు కడ్డుక్కుని శుభ్రంగా ఉంటే ఆవిడ దీపం వెలిగించి దణ్ణం పెట్టుకోమనేవారు. మాతోనూ పెట్టించేవారు. అలా మాకు చిన్నప్పుడే కార్తికమాసం అంటే దీపాలు పెట్టాలని తెలిసింది. మూడవ తరగతి నాటికే మిత్రబృందం (అందరం చిన్నపిల్లలమే) అంతా గుడికి వెళ్ళి, అక్కడ కూడా దీపాలు వెలిగించేవాళ్ళము. కార్తిక సోమవారమని ఇంట్లో ఉపవాసాలు చేస్తుంటే మేమూ చేసేవాళ్ళము. మాతోటి స్నేహితులు కూడా అంతే. అదీగాక సహవాసదోషం కూడా ఉంటుంది గదా. మమ్మల్ని చూసి మా స్నేహితులు కూడా నేర్చుకున్నారు. అప్పట్లో మా పెద్దలు ఆచరించారు కాబట్టే ఇప్పుడు ఎవరూ చెప్పకున్నా పాటిస్తున్నాము.


మనమేమీ పాటించకుండా, కేవలం వాట్సాప్, ఫేస్‌బుక్, టెలిగ్రాం సమూహాల్లో వచ్చే సందేశాలను చదివి, 'ఫార్వార్డ్' చేస్తూ, అంతరాజలంలో దొరికిన దీపాల చిత్రాలను 'స్టేటస్సులు'గా పెట్టుకుని కూర్చుంటే; మైకులు లౌడ్ స్పీకర్లు పెట్టి అరిచినా లేక షార్ట్-ఫిలంలు తీసినా సరే,  ఈ తరానికి లేదా రాబోయే తరానికి మన సంస్కృతి అందదు. కనుక పెద్దలైనవారు శ్రద్ధగా మన ఆచారాలను పాటించాలి. ఆ పండుగ వాతావరణాన్ని ఇంట్లో కలిగించాలి. అప్పుడే పిల్లలు నేర్చుకుంటారు. దీని గురించి ధూర్జటి చెప్పిన ఒక పద్యం చూడండి. 



మ. మొదలం జేసిన వారి ధర్మములు నిర్మూలంబుగాఁ జేసి దు

ర్మదులై యిప్పటి వార ధర్మము లొనర్పం దమ్ము దైవంబు న

వ్వదె? రానున్న దురాత్ములెల్లఁ దమత్రోవం బోవరే? యేల చే

సెదరో మీదు దలంచి చూడ కతముల్‌ శ్రీ కాళహస్తీశ్వరా!


భావం - శ్రీ కాళహస్తీశ్వరా! పాత కాలం వారు ఆచరించిన ధర్మాలను పాటిపెట్టి, అవి పనికిరానివని చెప్పి, తాము ఆచరించేదే ధర్మమని, ఈ తరం వారు అధర్మాలను ఆచరిస్తుంటే దైవం నవ్వకుండా ఉంటుందా? ఎందుకంటావా! రాబోయే తరలావారు కూడా ఈ దుర్మార్గాల పాలై పతనమవ్వరా! పిల్లలకు ఆస్తులు కూడా బెట్టి వారు సుఖంగా ఉండాలని తలచే ఈ మూఢజనులు ఈ విషయంలో ఎందుకు ముందు చూపు లేకుండా ప్రవర్తిస్తున్నారు?

Tuesday, 23 November 2021

కృష్ణ అంగారక చతుర్థి మహత్యం



కృష్ణ అంగారక చతుర్థి మహత్యం


మంగళవారం వచ్చిన చవితి (చతుర్థి) తిథి వెయ్యి సూర్యగ్రహణాల పుణ్యకాలానికి సమానం. కృష్ణ అంగారక చవితి నాడు గణపతి ప్రీత్యర్ధం ఉపవసించిన భక్తునికి వచ్చే పుణ్యం అనంతం మరియు 1000 పడగల ఆదిశేషునకు సైతం ఆ వైభవాన్ని వివరంచుట వీలుకాదు.


మాఘమాస కృష్నపక్షంలో అంగారక చతుర్థి రావడం చాలా అరుదు మరియు అది గణేశోపాసకులకు అత్యంత విశేషం. ఆ తర్వాత భాద్రపద మరియు కార్తిక బహుళ చతుర్థిలకు ఆ విశేషముంది. మిగితా మాసాల్లో వచ్చిన కృష్ణ అంగారక చతుర్థులకంటే ఇవి చాలా ఫలప్రదం.


ఈ ఏడాది మనకు మాఘమాసంలోనూ మరియు కార్తిక మాసంలోనూ కృష్ణ అంగారక చవితులు వచ్చాయి.


గణపతి ముందు 16 దీపాలను వెలిగించి షోడశ గణపతులను ఆవహన చేసే ప్రక్రియ కూడా ఈరోజు చేస్తారు.


కృష్ణ అంగారక చవితి నాడు గణపతిని పూజిస్తే అతి శీఘ్రంగా ఫలాలు పొందవచ్చు. అందునా ఈ రోజు ఉపవాసం చేస్తే ఏడాదిలో వచ్చి ప్రతి సంకటహర చవితికి ఉపవాసం చేసిన ఫలితం వస్తుందని కొన్ని గ్రంథాల్లో చెప్పగా, 21 సంకటహర చవితులు ఉపవసించిన ఫలం లభిస్తుందని కొన్ని పురాణ గ్రంథాల్లో కనిపిస్తుంది. అంగారక చవితి నాడు గణపతిని ఆరాధిస్తే కుజుడు కూడా ప్రసన్నుడవుతాడు. కుజుడు గణపతి కోసం చేసిన వెయ్యి సంవత్సరాల తపః ఫలితం ఈనాడు గణపతిని ఆరాధించవారికి లభించి, వారు అభివృద్ధి చెందుతారని గణపతి చెప్పాడట.


గణేశాయ నమస్తుభ్యం సర్వసిద్ధి ప్రదాయక |

సంకష్టం హరమేదేవాం గృహణార్ఘ్యం నమోస్తుతే ||


ఓం శ్రీ గణేశాయ నమః