Thursday, 31 March 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 29 వ భాగం



తాత్కాలిక సత్యం గురించి చెప్పేటపుడు మంచి చెడు కర్మలు, దానికి తగిన ఫలాన్ని ఈశ్వరుడిస్తాడనే మాట కుదురుతుంది. అందువల్ల సత్కర్మలు చేయండని, దానికి తగిన ఫలాన్ని ఈశ్వరుడిస్తాడని, చిత్త శుద్ధి కల్గుతుందని, తరువాత అతని అనుగ్రహం లభిస్తుందని, తద్వారా జ్ఞాన మార్గంలో ప్రవేశించి అతనిలో లీనం కావచ్చని చెబుతారు. ఈ మంచి కర్మలు, ధర్మశాస్త్రం విధించిన కర్మలు.


అంతా శూన్యమని దీనినందుకొనుటయే మోక్షమని చెప్పే బౌద్ధమతం, సత్యాహింసలను పాటించాలని అంటుంది. హింసను పాటిస్తే తప్పేమిటి? మంచి నడవడిక ఎందుకుండాలని ప్రశ్నించవచ్చు. అటువంటివారికి వారి దగ్గర సమాధానం దొరకదు. శంకర సిద్ధాంతంలో సమాధానం దొరుకుతుంది. మాయా జగత్తు మిథ్యయని చెప్పినపుడు ఇది పూర్తిగా సత్యము కాదు. అసత్యమూ కాదని చెప్పినపుడు ఈ మధ్యలో సత్కర్మలకు మంచి ఫలాన్ని ఇస్తాడని, మనిషికి చిత్తశుద్ధి ఏర్పడుతుందని, జ్ఞాన మార్గాన్ని అవలంబించుటకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడనే మాటకు ఆస్కారం ఉంటుంది. అందుకే మీమాంసకుల కర్మ మార్గాన్ని వీరు స్వీకరించారు. బౌద్ధుల మాయావాదాన్ని ఒక దశలో స్వీకరించారు. జైనుల అహింసామార్గాన్ని గ్రహించారు. ఆయా స్థానములలో అన్నిటినీ గ్రహించారు.


అన్నీ అబద్ధమని చెప్పిన బౌద్ధమతం గాని, ఏదీ స్పష్టంగా నిర్వచించని జైన మతంగాని కర్మ - దాని ఫలాలు నిర్వహించుటలో విఫలం పొందాయి. సాధారణంగా ఈశ్వర సంబంధం లేని మతానికి ప్రజలు మ్రొగ్గు చూపరు.


బౌద్ధ జైనాలు - ప్రజల మనః ప్రవృత్తి

 

సాధారణ ప్రజలు తత్త్వాన్ని గూర్చి ఆలోచించరు. ఏదో ఒక శక్తి, ఈ జగత్తు నంతటినీ నడుపుతోందని భావిస్తారు. ఏదో మహాత్ముణ్ణి ఆదర్శంగా తీసుకొని అతడు చెప్పినది సత్యమని నమ్మి పాటిస్తూ ఉంటారు. అతడు చెప్పిన తత్త్వం ఒంటబట్టిందా లేదా అనే విచారణ లేకుండా అతణ్ణి పూజిస్తూ ఉంటారు. ఏ మతస్థులైనా కొంతైనా ఆచరిద్దామని భావిస్తారు.


Wednesday, 30 March 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 28 వ భాగం



కర్మ జడం కదా! తగిన ఫలాన్ని అది ఎట్లా ఈయగలదు? వేదాన్ని నమ్ముతూ కర్మ, తనంతట తానే ఫలాన్నిస్తుందని, ఈశ్వరుడవసరం లేదని ఒకవైపు మీమాంసకులనగా; వేదాలను కాదని కర్మ, ఎట్లా ఫలాన్నిస్తుందో బౌద్ధ జైనాలు వివరించలేదు. కర్మ ప్రకారం మరల పుట్టుక ఉందంటారు. కనుక వీరు పునాది లేని సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. అంతా శూన్యమని అంటూనే, అంతా నిరంతరం మార్పు చెందుతోందని అంటూ ఫలానా కర్మలు, ఫలానా ఫలాన్ని ఇస్తాయని బౌద్ధులెట్లా నిర్ణయించగలరు? అంతా మాయయని కొట్టివేయకుండా దీనినంతటినీ నడిపే గొప్ప మనస్సు (మహత్తు) లేదా ఈశ్వరుడన్నాడని వేదాంతులంటారు.


వేదాంతులు బ్రహ్మమే సత్యమని చెబుతూ మాయా సిద్ధాంతాన్ని బౌద్ధుల నుండి తీసుకొన్నారని వేదాంతులను ఇతరులక్షేపిస్తారు. వారొక భేదాన్ని తప్పక గుర్తించాలి. మాయవల్ల బ్రహ్మము ప్రపంచంగా కన్పిస్తోందని ఈశ్వరుడు తన ఆధీనంలో మాయ నుంచుకొని ఫలాలనందిస్తాడని వేదాంతులంటారు. మరొక విధంగా చెప్పాలంటే నిర్గుణ బ్రహ్మము, నిష్క్రియ బ్రహ్మము మాయాశక్తితో కలిసి ఈశ్వరుడగుచున్నాడని, సగుణ బ్రహ్మము (ఈశ్వరుడు) ప్రపంచ వ్యవహారాలను నడిపిస్తున్నాడని అద్వైతులంటారు. సగుణ బ్రహ్మము నుండి నిర్గుణ బ్రహ్మము వైపు పయనించడమే అద్వైత లక్ష్యం. అందువల్ల మాయతో కూడిన సగుణ బ్రహ్మము యొక్క అనుగ్రహం కావాలని, జ్ఞాన మార్గానికి వెళ్ళడానికి ముందు భక్తితో ఈశ్వరుని భజించాలని అద్వైతం అంటుంది. ఇట్లా బౌద్ధానికి ఇది భిన్నం.


మరొక భేదం ఉంది. మాయ అంటే కేవలం అబద్ధం కాదు. దానిని అత్యంత అసత్ అనలేదు. నిర్గుణ బ్రహ్మమే అసలైన సత్యం. దీని మధ్యలో ప్రాతిభాసిక సత్యం ఉంది. అనగా సత్యమని భ్రమింపచేసి అసత్యమని నిరూపించుట. ఇది ఎండలో ముత్యపు చిప్ప, వెండిగా కనబడే స్థితి. ఈ మాయాలోకాన్ని ప్రాతిభాసిక సత్యమన్నారు. ఇది జ్ఞానంలో కనుమరుగై పోతుంది. కనుక ప్రాతిభాసిక సత్యం కేవలం అసత్ కాదు. అట్లాగే జగత్తు అసత్యం కాదు. ఇది మిథ్య. అనగా తాత్కాలికంగా సత్యంగా కనబడేది.


Tuesday, 29 March 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 27 వ భాగం



కర్మలు, అణు స్వరూపాలై, ఆత్మలో చొచ్చుకొని ఆత్మను బంధిస్తాయని; బంధాలను త్రెంపుకొంటే ఆత్మకు విముక్తియని, ఆకాశం చివర భాగంలో సంతోషంతో ఉంటుందని అంటారు. అణుస్వరూపాలుగా ఆత్మలో కర్మలు ప్రవేశించడాన్ని అడ్డుకోవాలని, అందుకై తీవ్రవ్రతాలను అనుసరించాలని అంటారు.


అహింసకు ఈ మతం అధిక ప్రాధాన్యం ఇస్తుంది. దాన ధర్మాలకూ అంతే. ప్రాపంచిక జీవితంపై తీవ్ర ద్వేషంతో ఉంటుంది. సిద్ధాంతాలు బాగుండవచ్చుగాని సామాన్యులకు అందుబాటులో ఉండవు. అందువల్ల దానిని అనుసరించువారే దానిపై తిరుగుబాటు చేస్తారు. మన మతంలో గృహస్థాశ్రమానికి, పురుషార్థాలకు తగిన స్థానం ఉంది, అందర్నీ ఉన్నత స్థితిని చేరుకోవడానికి రకరకాల మార్గాలను సూచించింది. పరిపక్వమైన మనస్సులు కానివారికి అట్టి బౌద్ధ జైనాలు సంతృప్తి నీయలేదు. అపరిపక్వమైన పండు చెట్టునుండి పడితే రుచికరంగా ఉంటుందా? సామాన్యులు ఆ సిద్ధాంతాలను ఆచరించడం సాధ్యం కాదు కనుక ఈ దేశం నుండి అవి పోవడమో, లేదా ఈ దేశపు ఆచారాలకై మరల వారు మ్రొగ్గు చూపడమో జరిగింది.


భగవత్ తత్త్వం 


కర్మ సిద్ధాంతం గురించి కొంత మాట్లాడుకుందాం. చర్యకు ప్రతిచర్య ఉంటుంది. కారణానికి కార్యం ఉంటుంది. దీనినుండి ఎవ్వరూ తప్పించుకోలేరు. మంచి చెడు కర్మలకు తగిన ఫలముంటుంది. శరీరం పోయినా జీవుడు మరొక శరీరం దాల్చి గత జన్మలకు తగిన ఫలాన్ని పొందవలసిందే. ఈ చక్రం నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు. మీమాంస, బౌద్ధ, జైనాలు, ఈ సిద్ధాంతాన్ని నమ్ముతూ ఈశ్వరుడు మాత్రం ఫలదాత కాదంటారు. ఇదీ చిత్రం.


Sunday, 27 March 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 25 వ భాగం

 

జడమైన ప్రకృతియే ప్రపంచానికి కారణమని సాంఖ్యులన్నట్లు, న్యాయ వైశేషికాలు ప్రపంచానికి అణువులే కారణమంటాయి. కనుక వైదిక మత విరుద్ధములున్నారు శంకరులు.


ఇక బౌద్ధులకు, జైనులకు వేదము లేదు, వేదాధ్యయనమూ లేదు. కర్మకాండలు లేవు, వర్ణాశ్రమాలసలే లేవు. ఈశ్వరునే వారు కాదన్నారు. మన ధర్మ శాస్త్రాలలో ఉన్న సామాన్య ధర్మాలను వారు స్వీకరించారు. సత్యం, అహింస, అస్తేయం (దొంగతనం లేకుండుట) బ్రహ్మచర్యం, అపరిగ్రహం (అవసరాన్ని మించి ప్రోగు చేయకుండా ఉండడం) మొదలైన వాటిని గ్రహించి ఇవి అందరికీ అని అన్నారు. మనుష్యులలో పరిపక్వతను గ్రహించకుండా తీవ్రంగా అందరికీ ఈ ధర్మాలను విధించారు. జైన మతంలో భిక్షువులవలంబించే మహావ్రతము ఉంది. సామాన్యులకు తక్కువస్థాయి అను వ్రతం ఉంది. ఆ మతంలో వర్ణాశ్రమ ధర్మం లేకపోవడం వల్ల సామాన్య జనులు, ఈ అనువ్రతాలను అవలంబించలేకపోయారు. శరీరాన్ని బాధపెట్టడం వల్ల (శ్రమ) కర్మలను చేయమంటుంది. అందుకే వారిని శ్రమణులంటారు.


ఇది నిశ్చయమని మనమేమీ చెప్పనవసరం లేదని, ఎవరి అంతటవారే విచారించాలని కొద్దిగా తత్త్వాన్ని బుద్ధుడు అందించాడు. ఆ చెప్పినది, తరువాత వచ్చిన వారికి భిన్న భిన్నంగా తోచి వైభాషికమని, సౌతాంత్రికమని, యోగాచారమని, మాధ్యమికమని నాల్గు మార్గాలైంది. రెండు ప్రధాన భేదాలుగా మహాయాన హీనయానములున్నాయి. యోగాచారం, మాధ్యమికం, మహాయానం పరిధిలోనికి రాగా; సౌతాంత్రికము, వైభాషికము హీనయాన పరిధిలోనికి వస్తాయి. ఇదంతా వాద వివాదాలతో ఉంటుంది.


బుద్ధుడు వేదంలో కొంతయే చెప్పాడని అన్నాను. ఉపనిషత్తులనుండి మాయనే గ్రహించాడు. కాని ఆ మాయకు ఆధారమైన సత్యాన్ని గ్రహించలేదు. కనుక సచ్చిదానందుడైన పరబ్రహ్మము చేరుట లక్ష్యంగా బౌద్ధము చెప్పదు. ఈ మాయనుండి, మాటిమాటికీ మారే జగత్తునుండి విముక్తులై శూన్యస్థితిని అందుకోవడమే నిర్వాణమని, లేదా మోక్షమని అంటుంది. ఉన్నదానిని లేదంటూ ధ్యానం వల్ల ఎట్లా తెలిసికోగలం? బ్రహ్మానందముండగా అంతా శూన్యమవడం ఎట్లా? నిత్య వ్యవహారంలోనే బ్రహ్మానంద మనుభవించామని అంటాం కదా! ఇక సమాధిలో అనుభవించిన వారికి ఎట్లా లేదని చెప్పగలం?


శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 26 వ భాగం



ప్రపంచం లేదు, జీవం లేదు. ఈశ్వరుడు లేడు, ఆత్మ లేదు, పరబ్రహ్మము లేదు, కనబడేదంతా భ్రాంతియే. కనబడుట, కనబడకపోవుట నిరంతరంగా సాగుతూ ఉండడం వల్ల జీవం ఉన్నట్లు భ్రాంతి కల్గుతోంది. ఊదితే దీపం, ఆరిపోవునట్లు అన్నిటినీ ఊది వేయగా నిర్వాణం కల్గుతుందని బౌద్ధం అంటుంది. జీవుడు పరమాత్మలో ఐక్యమయినపుడు ఈ జగత్తు జీవించుట అంతా అబద్ధమని వేదాంతము చెబుతుంది. జ్ఞానం రానంతవరకూ, అతనిలో ఐక్యం కానంతవరకూ మాయా శక్తితో కూడిన ఈశ్వరుడై బ్రహ్మము ఇదంతా ఆడిస్తున్నాడని, ఒక క్రమపద్ధతిలో ఈశ్వరుడు దీనిని నడుపుతున్నాడని, ప్రపంచము పారమార్థిక సత్యం కాపోయినా, వ్యావహారిక సత్యమని (కొంత కాలం ఉండిపోయేదని) జ్ఞానం పట్టుబడనంతవరకూ ధార్మికమైన నియమాలు అందరూ పాటించాలని అంటుంది వేదాంతం. బౌద్ధం, ఈశ్వరునీ నమ్మదు, వ్యావహారిక సత్యాన్నీ నమ్మదు. అన్నీ కనిపిస్తూ మరుగైపోతాయంటుంది. అయితే కర్మసిద్ధాంతాన్ని బౌద్ధులంగీకరిస్తారు. కారణ కార్యాలుండడం వల్ల పునర్జన్మనూ అంగీకరిస్తారు. ఇట్టి పద్ధతి అసంబద్ధంగా ఉంటుంది.


బ్రహ్మము గురించి జైన మతము చెప్పక పోయినా, అది ఉందని గాని, లేదని గాని కంఠోక్తిగా చెప్పదు. దీనిని స్యాత్వాదమంటారు. కొన్ని ఇట్లా ఉండవచ్చు అని అంటుందే కాని ఇది ఇట్లా ఉంటుందని గట్టిగా చెప్పదు. కావచ్చు, కాకపోవచ్చనే భేదం, ఇది ఏడు రకాలుగా ఉంటుంది. (సప్తభంగి). కాని ఒక చిక్కు సమస్యలా ఉంటుంది. స్యాత్ అస్తి = వస్తువక్కడ ఉండవచ్చు; స్వాత్ నాస్తి=అందుండకపోవచ్చు; స్యాత్ అస్తి నాస్తి = అది అక్కడ ఉండవచ్చు, లేకపోవచ్చు; స్యాత్ అవక్తవ్య= దానిని నిర్వచించకపోవచ్చు; స్యాత్ అస్తిచ అవక్తవ్య = అది అక్కడ ఉన్నా నిర్ధారణగా అది ఎట్లానో చెప్పలేకపోవచ్చు; స్వాత్ నాస్తిచ అవక్తవ్య : = ఆ వస్తువు అక్కడ లేకపోయినా దాని స్వరూపాన్ని చెప్పలేకపోవచ్చు; స్యాత్ అస్తిచ, నాస్తిచ అవక్తవ్య= ఆ వస్తువు వుందని గాని లేదని గాని చెప్పుటకు వీలు పడకపోవచ్చు.


ఇట్లా సాగుతూ ఉంటే ఏ నిర్ణయానికి వచ్చినట్లు? జ్ఞాన స్వరూపము, ఆత్మయని జైనమతం అంగీకరిస్తూ, శరీరమెంత ఉంటుందో ఆత్మ అంత ఉంటుందని ప్రత్యేకంగా చెప్పింది. చీమలో చీమంత ఆత్మ; ఏనుగులో ఏనుగంత ఆత్మయని; చీమ, ఏనుగుగా జన్మిస్తే ఏనుగంత ఆత్మ ఉంటుందని అంటుంది.


Saturday, 26 March 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 24 వ భాగం



అఖండ చైతన్యమైన బ్రహ్మమే ప్రపంచానికి కారణమని ఉపనిషత్తులంటాయి. కాని జడమైన ప్రకృతియే కారణమని సాంఖ్యం అంటుంది. ఈ ప్రధానమైన భేదాన్ని మనసులో పెట్టుకొని సాంఖ్యం, వైదిక సంప్రదాయానికి చెందినదని శంకరులన్నారు.


వేదాంతుల మాదిరిగానే, సాంఖ్య పురుషుడు (ఆత్మ) నిష్క్రియుడు. కాని ఇతని తృప్తికోసం ప్రకృతి సృష్టిస్తోందని సాంఖ్యమంటుంది. ఇది వేదాంతానికి, బుద్ధికి రుచించనిమాట. అనుభవించుట యనేది ఒక క్రియ కాదా? పురుషుడు నిష్క్రియుడైతే తనంతట తాను ప్రకృతి వ్యవహరించగలదా? సమాధి సుఖాన్ని పొందినవారు, పురుషుడైన ఆత్మ, పనికి కారకుడు కాదని, అతడనుభవించబడడని అంటారు. ఒకమూల పురుషుడు, కర్త కాదంటూ అనుభవించడం సబబుగా ఉందా?


చిత్తాన్ని అదుపులో ఉంచేది యోగపద్ధతి. సమాధి స్థితి, ఎట్లా పట్టుబడుతుందో చెబుతుంది. ఇది అష్టాంగాలలో ఉంటుంది. దీనిని అనుసరించేవారు నేటికీ ఉన్నారు. లాభాలను పొందుతున్నారు. దీనిలో ఈశ్వరుడున్నాడు. మిగిలినదంతా సాంఖ్యాన్ని అనుసరిస్తుంది. కనుక సాంఖ్యంలోని లోటుపాట్లు, ఇందులోనూ ఉంటాయి. చరాచర వస్తు ప్రపంచాన్ని నడిపేవాడు ఈశ్వరుడనే మాటను, ఫలదాతయనే మాటనూ పలుకకుండా అతడు శుద్ధుడని, దుఃఖాలంటనివాడని, అభ్యాసకునకు ఆదర్శప్రాయుడని, చితైకాగ్రతకు దోహదం చేస్తాడని వీరు అంటారు.


న్యాయ, వైశేషిక మతాలు కేవలం బుద్ధి గమ్యాలు. తర్కంపై న్యాయం ఆధారపడింది. బ్రహ్మ సత్యమని, మాయ, జీవులనే తొడుగులు తొడిగిందని జ్ఞానం వల్ల ఆ ముసుగులును తొలగించాలని, బ్రహ్మముతో ఐక్యం కావాలని వేదాంతం చెప్పగా పై రెండు మతాలు జీవులు, ప్రపంచమూ సత్యమేయని, ముసుగులంటూ ఏమీ లేవని ఒక్క పరమాత్మ అనుటకు పెక్కు ఆత్మలని అంటాయి. వైశేషిక సిద్ధాంతము, న్యాయ మతాన్నే అనుసరిస్తుంది. చరాచర వస్తువులలోనున్న విశేషాన్ని గుర్తిస్తుంది. అనగా ప్రత్యేకతను. దీని మత ప్రకారం జగత్తు, జీవభావం జ్ఞానం వల్ల పోదని, చరాచర వస్తు ప్రపంచం అంతా అణువులతో నిర్మితమైందని, అవి విభజించడానికి వీలు లేవని, అణువుల కలయిక వస్తూత్పత్తి మొదలైన విషయాలనందిస్తుంది. శరీరము ప్రపంచమూ అంతా అణువులతో నిర్మింపబడిందే, ఆత్మయే చైతన్య స్వరూపమని తెలిసి, జీవన మరణ ప్రవాహం నుండి విముక్తులు కావాలని చెబుతుంది. సాంఖ్యంలో ఏ లోటుపాటులున్నాయో, ఈ వైశేషికంలోనూ అవే ఉన్నాయి. కర్మనాశన మెట్లా? వాదప్రతివాదాలతో సంబంధ విముక్తి ఎట్లా?


Friday, 25 March 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 23 వ భాగం



సాంఖ్యంలో 24 తత్వాలు, ప్రకృతి నుండి పంచ భూతాలవరకూ లెక్కింపబడ్డాయి. ప్రపంచానికి ప్రకృతియే కారణమంటారు. మనస్సు, ఇంద్రియాలు ప్రకృతి నుండే వచ్చాయని అది సత్వ రజస్తమో గుణాలను కలుపుతుందని, చరాచర వస్తు ప్రపంచమూ దాని నుండే వచ్చిందని అంటారు. ఇక జీవంతో ఉన్నవాడు పురుషుడే. అతడు ప్రకృతితో సంబంధం లేకుండా ఉండగలడు. అతడు కార్యాలలో మునిగి తేలడు. కాని ఇతని సన్నిధానం వలన ప్రకృతి, అన్ని కార్యాలను నిర్వహిస్తుంది. జీవుడు ఈ 24 లను (పంచతన్మాత్రలు, పంచభూతాలు, పంచ కర్మేంద్రియాలు, పంచజ్ఞానేంద్రియాలు మొదలైనవి) నిశితంగా గమనించి వాటిని తొలగించుకుని, పై మూడు గుణాలకు సమతౌల్యం తీసుకొని రాగలిగితే ప్రకృతి నుండి విడివడి కేవలం పురుషునిగా ఉండగలగడమే కైవల్యమని, లేదా మోక్షం అంటారు. ఇది వారి సిద్ధాంతము.


వీరి పురుషుడు వేదాంతులు చెప్పే నిర్గుణమైన ఆత్మతో; ప్రకృతి - మాయతో సమానము, కాని మన వేదాంతము, ఆత్మయే పరమాత్మయని లేదా బ్రహ్మమని, ప్రపంచము కనబడుతున్నట్లుగా ఉంటుంది, మాయవల్ల కల్పనగా ఉందని అంటుంది. ఇక మాయ లేదా ప్రకృతి అన్నిటికీ కారణమైనపుడు ఆత్మ, జ్ఞానంతో ఉన్న పురుషుడు, ఒక్కరు కాదా? పెక్కు ఆత్మలుంటాయా?


మీమాంసకులున్నట్లుగానే సాంఖ్యులు కూడా ఈశ్వరుని అంగీకరించరు. కాని వేదాంతులేమంటారంటే సగుణ బ్రహ్మయైన ఈశ్వరుడు తన ఆధీనంలో మాయ నుంచుకొంటాడని, నిర్గుణ బ్రహ్మము మాయతో కలిసినపుడు ఈశ్వరుడై ప్రపంచ ప్రవర్తకుడౌతున్నాడని చెబుతుంది. పురుషుని కెట్టి సంబంధం లేదని, అతడుండడం వల్లనే ప్రకృతి, ఈ నాటకం ఆడుతోందని సాంఖ్యులు చెప్పే మాట సబబుగా లేదు.


నిష్కామ కర్మయోగం వల్ల చిత్తశుద్ధిని పొంది ఈశ్వరుణ్ణి భక్తితో భజించి ఏకాగ్రతతో జ్ఞానం విచారించి చేస్తే, ప్రకృతి బంధంనుండి విముక్తులు కావచ్చని వేదాంతులంటారు. కర్మకాండను ఈశ్వరుణ్ణి విడిచి కేవలం విడువదగిన 24 తత్త్వాలను విచారణ చేస్తేనే విముక్తి ఎట్లా సిద్ధిస్తుందని వేదాంతులంటారు.