Monday, 31 October 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 237 వ భాగం



పృథ్వీరుణ్ణి శృంగేరీ పీఠాధిపతిగా చేసారని జర్మనీకి చెందిన పుస్తకాల పట్టికలో "శృంగేరీ పృథ్వీ ధరాచార్య" అని ఉంది. ఇతణ్ణి పృథ్వీధర భారతియని కూడా అంటారు. శృంగేరిలోనున్నవారికి, భారతీయని చివర ఉంటుంది. తీర్ధ సంప్రదాయం వారూ ఇందున్నారు.


దిగ్విజయం భారతీయ సమైక్యం


ఆరువేల మంది శిష్యులతో ఆసేతు హిమాచలం పర్యటించి 56 దేశాలలో ఉన్న విమతాలను ఖండించి వేదధర్మాన్ని ప్రతిష్టించారు. ఎవరినీ హింసించి కాదు. వారు జయశాలి.


72 మతాలున్నాయంటే ప్రజలు 72 వర్గాలుగా చీలిపోయారన్నమాట. వీరినందరినీ సనాతన ధర్మంవైపు మళ్ళించారు. దానిని పూర్తిగా నిర్వహించినవారు శంకరులు. ఇదంతా ఏ రాజుల యొక్క అండదండలు లేకుండా నిర్వర్తించగలిగారు. దీనినందరూ ప్రశంసిస్తున్నారు. ఆధునిక భావాలు కలిగిన నెహ్రూగారు. ఆయన వ్రాసిన Glimpses of world History' లో "I have spoken about Kings and Royal Dynasties. But more than all these Kings and Emperors this young man from the south did more for national life. What is surprising in this is that without givivng room to emotions, intellectually he attracted even the ordinary people and not Brahmins or scholars"


నెహ్రూగారు చెప్పినది ముమ్మాటికీ సత్యమే. ప్రేమతో బుద్ధుడు ప్రజలను ఆకట్టుకుంటే బుద్ధితో వీరాపని చెప్పారు. తత్త్వం గురించి చెప్పేటపుడు భావావేశాలకు లోనుగాక శ్రుతి, యుక్తి, అనుభవాన్ని జోడించి ఒప్పించారు. ఆలయ పునరుద్ధరణ, పూజా పద్ధతులు, భక్తి స్తోత్రాల రచన - ఇదంతా ప్రేమతోనే చేసారు. ఇక్కడ భావాలకు ప్రాధాన్యం. భక్త్యావేశంతోనే వ్రాసేరు.


Sunday, 30 October 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 236 వ భాగం



వంద సంవత్సరాల Aufrecht వెనుక అనే దొర మా మఠ తాళపత్ర పట్టికను తయారు చేసాడు. అట్లాగే జర్మనీలో ఉన్నవాటికీ, ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఉన్నవాటికీ పట్టికలు తయారయ్యాయి. జర్మనీలో ఉన్న విశ్వవిద్యాలయ గ్రంథాలలో 'గురు పాదాది నమస్కారం' అనే గ్రంథం ఉంది. అందు పృధ్వీధరుని పేరుంది. శంకరుల శిష్యులతో బాటు ఇతని పేరూ ఉంది.


ఇంకా మరేదైనా పుస్తకం వ్రాసాడో లేదో తెలియదు. పై పట్టికనుండి 'ద్వాదశ మహావాక్య వివరణం' అనే తాళపత్ర ప్రతి ఉన్నట్లు తెలిసింది. దానిని వైకుంఠ పురి వ్రాసేడు.


దీనిని బట్టి శంకరులు, దశ నామి సన్న్యాసి పద్ధతిని ప్రవేశ పెట్టారని, సన్యాసి పేరు చివర, దశనామి నామాలలో ఒకటి ఉందని తెలుస్తోంది. తీర్థ - ఆశ్రమ - వన - అరణ్య - గిరి - పర్వత - సాగర - సరస్వతి - భారతి - పురి అనేవి దశనామి సంప్రదాయాలు. వీరందరూ పృథ్వీధరుని శిష్యులే అని యుంది.


"పృధ్వీదరాచార్యః తస్యాపి శిష్యాదశ" 


వీరిని ఒక క్రమపద్ధతిలో పెట్టాడంటే అర్ధమేమిటి? శంకరుల మనోగతానికి అనుగుణంగా వీరిని పరివిధాలుగా విభజించి కొన్ని సంప్రదాయాలను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. సిద్ధాంతం ఒక్కటైనా బాహ్య నియమాలలో కొద్దిగా భేదం ఉంటుంది. ఇందు కొందరు తెల్లని బట్టలు కట్టుకుంటారు. దండానికి వస్త్రానికి ఎట్లా ముడి వేయాలనే నియమాల వంటివి యుంటాయి.


ఈనాటికీ, అట్టి కట్టుబాట్లున్నాయంటే వీరి సంఘటనాశక్తి, కార్య నిర్వహణ సామర్ధ్యం గొప్పదనే కదా.


Saturday, 29 October 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 235 వ భాగం



శంకరులు సిద్ధి పొందడానికి ముందుగా సురేశ్వరుల పర్యవేక్షణలో ఇతడు కంచి మఠాన్ని అధిరోహించాడు. అందువల్ల సురేశ్వరులను గురువుగా భావించి ఆయనను 'దేవేశ్వరుడని' ఇతడు కీర్తించాడు. 


ఈయన సన్యాసనామం సర్వజ్ఞాత్ముడు ఇతడు సంక్షేప శారీరకాన్ని వ్రాసేడు. ఇది శంకరుల శారీరక భాష్యాన్ని ఆధారంగా చేసుకుని వ్రాసినది. పేరులో సంక్షేపం (చిన్నది) అని యున్నా వేయి శ్లోకాలతో ఉంటుంది. శ్లోక రూపంలో అద్వైతం గురించి చాలా తక్కువ పుస్తకాలున్నాయి. ఇతడేకాదు, విద్యారణ్య స్వామివారొక అద్వైత గ్రంథాన్ని వ్రాసారు.


పంచ ప్రక్రియయనే అద్వైత గ్రంథాన్ని కూడా రచించాడు. మీమాంసపై ప్రమాణ లక్షణాన్ని వ్రాసేడు. వ్యాస పూజలో ఇతణ్ణి కొలుస్తారు. వ్యాస పూజలో 30 మంది ఆచార్యులను కొలుస్తారు. అవి ఆరు పంచకాలుగా ఉంటాయి. ద్రవిడ పంచకంలో ఇతని పేరుంటుంది. ఈయనను సంక్షేప శారీరకాచార్యుడని సర్వజ్ఞాత్మముని అని కూడా కొలుస్తారు.


పృథ్వీధరాచార్యుడు, శంకరుల కంటే పెద్ద. శంకరుల ముందే చాలామంది సూత్రభాష్యాలు వ్రాసేరు. అవి అద్వైతానికి భిన్నంగా ఉంటాయి. ఈయన వ్రాసిన భాష్యానికి పృధ్వీధర భాష్యమంటారు. పృధ్వీధరుని భాష్యం, అభినవగుప్తుని భాష్యంతో కలిపి 99 మంది భాష్యాలను ఆచార్యులు ఖండించారని తత్త్వ చంద్రికలో ఉంది. ఇందు పృథ్వీధరుణ్ణి పేర్కొనడం వల్ల ఈయన ఉన్నతస్థానం తెలుస్తోంది. తంత్రాలోకం, అలంకారశాస్త్ర వ్యాఖ్యానం వ్రాసిన అభినవగుప్తుడు గీతాభాష్యాన్ని కూడా వ్రాసాడు.


పృథ్వీధరుడు శంకరుల చేతిలో ఓడిపోయాడు. శిష్యుడయ్యాడు.


Friday, 28 October 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 234 వ భాగం



"ద్రుతమేవ విధేహి కృపాం సహజాం"

"భవశంకర దేశిక మే శరణం" అని కాళ్ళమీద పడ్డాడు. శిష్యులందరూ ఈ దృశ్యాన్ని చూసి ఆనందాశ్చర్యాలను ప్రకటించి యుంటారు, ఆనందాశ్రువులను రాల్చి యుంటారు. ఎందుకంటే ఇవి ఇతని పట్ల దయతో కూడినవి. ఇన్నాళ్ళూ ఇతణ్ణి మూర్ఖుడని భావించాం. ఎంత పొరపాటు జరిగిందని బాధపడి యుంటారు. ఇతడు "ప్రతిసార సముద్ధరణం" అనే గ్రంథాన్ని వ్రాసాడని అంటారు. అదీ తోటక ఛందస్సుతో ఉంటుంది. ఇతణ్ణి జ్యోతిర్మఠానికి అధిపతిని చేసారు.


మరో ఇద్దరు శిష్యులు


వీరికి పై నల్గురే కాకుండా ఇంకా శిష్యరత్నాలున్నారు. అందిద్దర్ని పేర్కొంటాను. వారూ సురేశ్వరుని మాదిరిగానే వాదించి ఓడింపబడ్డవారే. తరువాత శిష్యులైనారు. అందొకరు శంకరుల కంటే పెద్ద కూడా. అతని పేరు పృథ్వీధరుడు. మరొకడు శంకరులకంటే చిన్నవాడు, సర్వజ్ఞాత్ముడు.


కంచిలో పీఠాన్ని ఆరోహించిన వెనుక చాలామంది శంకరులతో వాదాలు చేసారు. తామ్రపర్ణీనదీతీరం నుండి ఒక తండ్రి, ఏడేళ్ళ కొడుకు వచ్చారు. ఆ పిల్లవాని పేరు మహాదేవుడు. ఇతని తండ్రి పెద్ద మీమాంసకుడు. ఆయన బౌద్ధ జైనులతో వాదించినపుడు ఈ పిల్లవాడూ పాల్గొంటూ ఉండేవాడు. తండ్రి, శంకరులతో వాదించి ఓడిపోయినపుడు ఈ పిల్లవాడు నాల్గు రోజులపాటు శంకరులతో వాదించి చివరగా ఓడిపోయాడు.


వీరిచే ఓడింపబడ్డానని కుఱ్ఱవాడు కలత పడలేదు సరికదా, వీరిపట్ల భక్తితో ఉన్నాడు. సన్న్యాస దీక్ష నిమ్మని అడుగగా శంకరులు ఇచ్చారు.


Thursday, 27 October 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 233 వ భాగం



"అహిమాంశురివ అత్ర విభాసి గురో"


అవి అన్నీ తిరుగుతూ ఉన్నట్లు కన్పిస్తాయి. కాని తిరగకపోయినా నక్షత్ర వీధి సంచారం ఉంటుంది.


మరొక సంగతి గుర్తుకు వస్తోంది. అగస్త్యోదయం కాగా మురికి నీటిలో మురికి అంతా పోతుంది. తేటగా నీళ్ళుంటాయి. అట్లాగే శంకరులనే సూర్యులుదయించగా మురికి బట్టిన బుద్ధులు కలవారికి తేటదనం వస్తుంది. చివరి శ్లోకంలో నేను మూర్ఖుణ్ణి. నాకేమి తెలుసునని మిమ్ము గానం చేస్తున్నా? 64 కళలు తెలిసిన సర్వజ్ఞులు మీరు "విదితా సమయా విశదైకకలా" ఎంత విద్వాంసుడైనా సమగ్రంగా సత్యాన్ని తెలుసుకోలేదని అర్థం.


సర్వజ్ఞులైన ఆచార్యులు సర్వజ్ఞుడైన శంకరునితో "నాకేం తెలుసు? స్మృతులా? శాస్త్రాలా? వైద్యమా? కవిత్వమా? సంగీతమా? పురాణమా? శాస్త్రమా? ఏమీ తెలియకుండా నేను పశువులా ఉన్నానని, నీవు పశుపతివని, అందువల్ల నాపై దయ చూపించుమని అన్నారు. ఇదంతా నిజరూపాన్ని కప్పి పుచ్చి మనలను మోసం చేయడం కాదా!


అందుకే చివరి శ్లోకంలో నా బుద్ధితో మిమ్ము సంతృప్తి పరచలేను.


డబ్బిచ్చి సంతృప్తి పరచలేను. 

"న కించన కాంచన మస్తి గురో" అయినా మీనుండి వచ్చిన అనుగ్రహమే నన్ను రక్షిస్తుంది. అన్ని వేళలా దానిని నాకిత్తురుగాక.


Wednesday, 26 October 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 232 వ భాగం



ఇంతలో తోటకుడు, నృత్యం చేస్తూ, శంకరులపై స్తోత్రం చేస్తూ వచ్చాడు. అప్రయత్నంగానే అతని నోటివెంట శ్లోకాలు వచ్చాయి. అవి తోటక ఛందస్సులో ఉన్నాయి. అవి ఎనిమిది శ్లోకాలు. దానినే తోటకాష్టకమని అంటారు. అందువల్ల ఇతడు తోటకాచార్యుడయ్యాడు.


అందొక శ్లోకాన్ని పేర్కొంటా. ఇతడు చెప్పినదాని కంటె ప్రత్యేకంగా నేను చెప్పేదేమీ లేదు. ఈ మధుర శ్లోకాన్ని అందరూ ఆస్వాదింతురుగాక. ఇది భక్తితో కూడినది, మనోల్లాసాన్ని కల్గిస్తుంది.


"జగతీమవతుం కలితా కృతయో 

విచరంతి మహామహసః ఛలతః 

అహిమాం శురివాత్ర విభాసి గురో 

భవ శంకరదేశిక మే శరణం"


మహామహన్ అనగా పెద్ద జ్యోతి, అది అందరినీ అనుగ్రహిస్తుంది. చెడ్డ దారిలో జనులు వెళ్ళకుండా అట్టి జ్యోతిస్సులు మానవాకారం ధరించి యుంటాయి. కనుక మహాన్. ఛలతః = ఒక మిషతో నిజరూపాన్ని కప్పుకొని వస్తారు. అట్టివారు మానవాకారంలో రావడం మనలను మోసగించడం కాదా? అసలు వారికీ వేషంతో పనేమి? తీర్ధయాత్రలవల్ల వారికేమి లాభం? అయినా చేస్తారు. ఇదంతా ప్రజలకు మోసంగా కనబడడం లేదా?


వారు నక్షత్రాలు, గ్రహాలూ తిరుగుతున్నట్లుగా తిరుగుతూ ఉంటారు. అయితే సూర్యుడుదయిస్తే నక్షత్రాల కాంతి వెలవెలబోవడం లేదా? అట్లా వెలవెల పోకుండా వెలిగే వాటిల్లో మీరు సూర్యుని వంటివారని పొగడ్త. 


Tuesday, 25 October 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 231 వ భాగం



తోటకుడు గురుభక్తి


భావాద్వైతం కాని, క్రియాద్వైతం కాదని శంకరులన్నారు. అయితే ప్రతిదానిపట్లా భావాద్వైతం కుదరదు. ఎక్కడ? "అద్వైతం త్రిములోకేషు" అని ఉంది. మూడు భువనాలలోనూ భావాద్వైతం ఉండాలి. అయితే గురువు పట్ల మాత్రం తానూ, గురువూ ఒకటని భావించకూడదు.


"నాద్వైతం గురుణా సహ" (న+అద్వైతం=నాద్వైతం)


తానూ, భగవానుడూ ఒక్కటే అనుకోవచ్చు. అంతేనే కాని, నేనూ, గురువూ ఒకటని భావించకూడదు. గురువుని తనకంటే భిన్నంగా, గొప్పగా చూడాలి. గురువుతో ఇట్లా అనాలని అమ్మవారే చెప్పింది. మీరు వేరు, నేను వేరు, మీరు పాలకులు, నేను సేవకుణ్ణి, మీరు సముద్రం- నేనొక నీటి బిందువును అని అతణ్ణి సేవించాలని ఉంది.


తోటకునికి తల్లిదండ్రులు ఆ పేరు పెట్టలేదు. ఇతని అసలు పేరు ఆనందగిరి. పైకి మూర్ఖునిలా కనబడేవాడు. శంకరుల చుట్టూ ఆరువేల మంది శిష్యులుండేవారు. వారికి పాఠాలను చెబుతూ ఉండేవారు. శిష్యులు చాలా తెలివైనవారు. ఆచార్యులు చెప్పింది శ్రద్ధగా విని అపుడపుడు సందేహ నివృత్తి చేసుకునేవారు. ఇతడేనాడూ గురువుని సందేహాలు అడుగలేదు. అందుచేత ఇతనిని మందబుద్ధిగా మిగతా శిష్యులు భావించారు. ఒకనాడు ఇతడు పాఠానికి రావడం ఆలస్యమైంది. శంకరులు ఏడితడని ప్రశ్నించారు. అతని కోసం వేచియుండడం దండుగని, వచ్చినా, రాకపోయినా ఒక్కటే అని మిగిలిన శిష్యులు అన్నారు.


శిష్యులలో గర్వం పనికిరాదని, వారికొక గుణపాఠం చెప్పాలనుకున్నారు. ఆపైన ఇతనిపై వారికొక అపారమైన దయ యుండేది.