దత్తాత్రేయుడు యధావిధిగా కూర్చునివున్నాడు. సరసన వున్న అనఘ రాశిపోసిన సౌందర్యంలా కూర్చుని విలాసంగా చిరునవ్వులతో కవ్విస్తుంది. రాక్షసుల దృష్టి హఠాత్తుగా సౌందర్యరాశిపై పడింది. ముఖ సౌందర్యానికి కొందరు, చిరునవ్వులకు కొందరు, కొంటె చూపులకు కొందరు, యౌవన సంపదకు కొందరూ, చేతుల్లోని కేలీ పద్మ విలాసానికి కొందరు. మృదుతర హస్తాంగుళీ విన్యాసానికి కొందరు, రత్న కంకణకాంతి ఝణత్కారాలకు కొందరు, కిరీటతాటంక రత్న హారకాంచీనూపుర శోభా సంపదలకు కొందరూ అంగరాగ ఘుమ ఘుమలకు కొందరూ, వినూత్న పట్టు వస్త్ర ధగధగలకు కొందరూ, పాదాంగుళీ మార్ధవాతిశయమునకు కొందరూ ఇలా రాక్షస వీరులందరూ ఆమెను చూచి సౌందర్యానికి ముగ్ధులయ్యారు. కామ వికారంతో వివశులవుతున్నారు. నాయకుడికి నమ్మిన బంటులు కనుక తిరుగులేని నిస్వార్ధ మూర్ఖ సేవకులు కనుక, ఆమెకోసం తమలో తాము కలహించుకోకుండా అందరూ కలిసి నిర్ణయించుకొని తమ నాయకుడి కొరకు ఆమెను అపహరించుకు పోవాలి అని అనుకున్నారు. ఆ ఆలోచన వాళ్ళకి రావడమే ఆలస్యం తమకున్న మాయాశక్తితో బంగారు పల్లకీ సృష్టించారు. ఆ సౌందర్యరాశిచుట్టూ తిరుగుతూ వికటాట్టహాసాలు చేస్తూ పిచ్చి గంతులు వేస్తూ మారుమాట్లాడకుండా ఈ పల్లకీలో కూర్చోమంటూ గద్దించారు. ఆమె ఒక్కసారిగా దత్తాత్రేయుడి వైపు చూసింది. ఆయన చిరునవ్వుతో వెళ్ళమని సైగ చేసాడు. అనుజ్ఞ అందుకొన్న ఆ సౌందర్యరాశి భయాన్ని, బెరుకును, నటిస్తూ లేచి ఒయ్యారంగా నడిచి వెళ్ళి పల్లకీలో కూర్చుంది. ఆ చర్య వారి మనసుల్ని మరింత ఆనందింపజేసింది. బంగారు పల్లకీలో వున్న బంగారు రాశిని భుజాల మీద మోసుకొని వెళ్ళడం కన్నా నెత్తి మీద పెట్టుకొని తీసికెళ్తే మరింత శోభగా వుంటుందని ఆమెను తమ నాయకుడు మరింత ఆనందిస్తాడని తలచి రాక్షసులు బంగారు పల్లకీని నెత్తులకు ఎత్తుకున్నారు. ఓహోం ఓహోం అంటూ పరుగులాంటి నడక అందుకున్నారు. వాళ్ళు అల్లంత దూరం వెళ్ళడం చూచి దేవతలంతా దత్తుడి వద్దకు చేరుకున్నారు.
పల్లకీ వెళ్తున్న వైపే చూస్తూ దత్తస్వామి ఇలా అన్నాడు - అయిపోయింది. ఈ రాక్షసుల పని ఈ రోజుతో అయిపోయింది అన్నాడు. దేవతలకి ఏమీ అర్ధంకాలేదు. స్వామివైపు ప్రశ్నార్ధకంగా చూసారు.
దేవతలారా మీ కోరిక నెరవేరింది లక్ష్మి రాక్షసులనెత్తికెక్కింది. అంటే ఇంక వాళ్ళు సర్వనాశనమయ్యారన్నమాట.
ఇంక వాళ్ళ దగ్గర నీ లక్ష్మీ నిలవదు. శరీరంలో ఏడు స్థానాలు దాటించి ఎవరైతే లక్ష్మిని నెత్తిపైకెక్కించుకుంటారో వాడు మరు క్షణంలోనే దరిద్రుడవుతాడు. లక్ష్మి పురుషుడికి పాదస్థానంలో వుంటే పెద్ద పెద్ద భవనాల్లో నివసించేటట్లుగా చేస్తుంది. కటిస్థానంలో వుంటే మణి మాణిక్యాలు, అతివిలువైన వస్త్రములను కలిగిస్తుంది. లక్ష్మి గుహ్యంలో వుంటే భార్యా సౌఖ్యం కలిగిస్తుంది. సందిటలో వుంటే సంతాన సంపద కలిగిస్తుంది. లక్ష్మి హృదయస్థానంలో వుంటే అభీష్టాలు సిద్ధింపజేస్తుంది. కంఠ ప్రదేశంలో వుంటే విలువైన రత్నాల హారాలు ధరింపజేసేటట్లు చేస్తుంది. లక్ష్మి ముఖ స్థానంలో వుంటే భోజన సౌఖ్యం, మాటకారితనం, కవన శక్తి, అమోఘవర్చస్సులు ప్రసాదిస్తుంది. ఈ ఏడు స్థానాలు దాటి లక్ష్మి శిరస్సుకి ఎక్కిందంటే ఇక అతణ్ణి విడిచిపెట్టి వెంటనే వెళ్ళిపోతుంది. వెంటనే మరొకన్ని ఆశ్రయిస్తుంది. ఇది లక్ష్మి యొక్క నియమం. మీరే చూశారు గదా వీళ్ళు లక్ష్మిని నెత్తి మీద ఎక్కించుకొని వెళ్తున్నారు. ఇంక కొద్ది క్షణాల్లోనే వాళ్ళను విడిచి వస్తుంది.