Friday, 24 February 2023

శ్రీదత్త పురాణము (60)

 


జంభాసురుడు స్వర్గ సింహాసనాన్ని ఆక్రమించి అధిష్టించాడు. తలకొక దిక్కుగా పారిపోయిన దేవతలు ఒకానొక పర్వతారణ్య ప్రాంతంలో గుమికూడారు. అది వాలఖిల్యాది మహర్షులుండే అరణ్యం. దేవ గురువు బృహస్పతి కూడా అక్కడికే చేరుకున్నాడు. అందరూ ఆ మహర్షులతో మంతనాలు జరిపారు. స్వర్గలోకాన్ని మళ్ళీ సంపాదించుకోవాలంటే విష్ణు మూర్తిని శరణువేడుట ఒక్కటే కర్తవ్యమని నిర్ధారించుకున్నారు. ఆ చతుర్భుజుడు ఇప్పుడు దత్తాత్రేయుడుగా అవతరించి సహ్యాద్రిసీమలో విహరిస్తున్నాడని మహర్షులు చెప్పారు.

అయితే అతడు మదవతీ మద్యలోలుడై నింద్యాచారుడుగా కనిపిస్తాడనీ, ఆ మదవతి సాక్షాత్తుగా లక్ష్మీదేవియే అనీ, అతడిని ప్రసన్నుణ్ణి చేసుకోవడం చాలా కష్టమనీ, అయినా మరి గత్యంతరం లేదు కనుక ప్రయత్నించండని మహర్షులు ఉపదేశించి నిండా ఆశీర్వదించి పంపించారు. బృహస్పతిని ముందు నిలుపుకుని ఇంద్రాదిదేవతలు సహ్యాద్రి చేరుకున్నారు. దత్తాశ్రమం వెదికి పట్టుకున్నారు. ఆశ్రమ మధ్యభాగంలో తీర్చిదిద్దిన చలువ పందిరి. సుగంధ పరిమళాలను వెదజల్లుతున్న పూల తోరణాలు, బంగారు జరీ నగిషీలు పొదిగిన మేల్కట్టు చాందినీలు. మధ్య భాగంలో పద్మకర్ణికాకారంలో మెత్తని వితర్లిక. దాని మీద దత్తాత్రేయుడు ఒక అందాల భామకు వీపుచేర్చి, ఎడమమోచెయ్యిని మరొక భామామణి ఊరు భాగాన అన్ని ఓరవాటుగా కూర్చుని ఉన్నాడు. కుడి చేతిలో బంగారు చేపకం. మరొక నారీలలామ (లక్ష్మీదేవి) ముందుగా తాను చవిచూసి రకరకాల మద్యాలను ఆ చపకంలోకి ఆధారంగా నింపుతోంది. దత్తయోగి అదే పనిగా సేవిస్తున్నారు. చుట్టూ చిన్న చిన్న వేదికల మీద కూర్చుని గంధర్వాప్సరసల్లాంటి యువతలు అనేక వాద్య విశేషాలను మృదువుగా శ్రావ్యంగా మ్రోగిస్తున్నారు. వాటితో శృతిగలిగిన ఏవో గీతాలు పాడుతున్నారు. వాటిని వింటూ ఒక్కొక్కప్పుడు తాళం వేస్తూ మరొకప్పుడు తానూ గొంతు కలుపుతూ దత్తయోగి ఆనందపరవశుడవుతున్నాడు. అవధులు దాటిన మద్యపానం వల్ల వశం తప్పిన శరీరం వొదులొదులుగా వూగుతోంది. ఎరుపెక్కిన కన్నులు, బూరటెల్లిన బుగ్గలు. చెమట చిత్తడితో జిడ్డుదేరిన ముఖం, చేతి నుంచి జారిపోతున్న మధుచపడాన్ని వారీలలామ అందుకుంటోంది. తానే స్వయంగా దత్తస్వామి నోటికి అందిస్తోంది. మెచ్చుకోలుగా ఆమెను పొదువుకునే ప్రయత్నం చేస్తున్నాడు యోగి. వివశుడై ఆమె పైకి ఒరిగిపోతున్నాడు.


ఇంద్రాది దేవతలకు కనిపించిన దృశ్యమిది. అందరూ ఆశ్చర్యచకితులయ్యారు. పరస్పరం కన్నులతో సన్నలు చేసుకున్నారు. ఆశ్రమం అంతటా సర్దుకున్నారు. కొందరు పద్మవితర్ణిక చుట్టూ చేరుకున్నారు. దత్త యోగికి ఆశ్రమవాసులకూ అందరూ అందరికీ కను సన్నల్లో మెలుగుతున్నారు. ఇంద్రుడు స్వయంగా దత్తయోగికి అంతరంగిక సేవకుడయ్యాడు. కాళ్ళు పట్టడం దగ్గర్నుంచి అన్ని సేవలూ భక్తి శ్రద్ధలతో వినయవిధేయతలతో చేస్తున్నాడు.


No comments:

Post a Comment