Friday, 10 February 2023

శ్రీదత్త పురాణము (46)



మానవులకన్నా దేవతలు మరింతగా కలవరపడ్డారు. సూర్యోదయం ఆగిపోతే కాలాన్ని కొలిచేదెలాగా? నిత్య నైమిత్తిక కర్మలు జరిగేదెలా? పాడి పంటలు అంతరించిపోతాయి. యజ్ఞయాగాదులు నిలచిపోతాయి. ప్రజలకే కాదు మనకూ నైవేద్యములు అర్పించే వారు వుండదు. ఇంతకీ ఈ విపరీతానికి కారణం ఏమిటి? అని దేవతలందరూ దేవ గురువైన బృహస్పతిని శరణు శరణు అన్నారు. ఆయన దివ్యదృష్టిసారించి కారణం చెప్పాడు. అయితే సుమతిని ప్రసన్నురాలిగా చేసుకోవడం ఎలాగ? మాండవ్య శాపాన్ని మళ్ళించడం ఎలాగ? ఏమీ పాలుపోలేదు. బ్రహ్మ దగ్గరికి పరుగులు తీసివెళ్ళారు. అప్పుడు బ్రహ్మ ఆలోచించి వారితో ఇది ఒక పతివ్రత చేసిన ప్రతిజ్ఞ. తన భర్త ప్రాణాలు కాపాడుకొనేందుకు సూర్యోదయాన్ని నిషేదించింది. ఆమె పాతివ్రత్యం ముందు మన శక్తి యుక్తులు సరిపోవు. మరొక పతివ్రత ఎవరైనా పూనుకోవాలి. అత్రి మహర్షి భార్య అనసూయాదేవి మహా పతివ్రతామతల్లి. కరుణామయి. అందరూ వెళ్ళి శరణు వేడండి లోకహితం కోరి ఉపకారం చెయ్యమని అర్ధించండి. సుమతికి వచ్చిన ఆపదను తీర్చి ప్రతిజ్ఞను మళ్ళించగల సమర్థురాలు. ప్రయత్నించండి అన్నాడు బ్రహ్మ. 

దేవతలందరూ హుటాహుటిన అత్రిమహర్షి ఆశ్రమం చేరుకున్నారు. అనసూయాదేవి పాదములకు సాష్టాంగ నమస్కారములు చేశారు. లోకానికి వచ్చిన ఉపద్రవాన్ని తొలగించమని వేడుకున్నారు. అంతా విని ఆ గంభీరవదనంతో నిశ్శబ్దంగా తలవూపి తమ పర్ణశాలలోనికి వెళ్ళిపోయింది. ఇంద్రాది దేవతలు అవాక్కయ్యారు. ఆశ్రమంలో అల్లంత దూరాన ఒక గున్న మామిడి చెట్టుక్రింద జపం చేసుకుంటున్న అత్రిమహర్షిని చేరుకున్నారు. మీరే కాపాడాలని ప్రాధేయపడ్డారు. సూర్యోదయం కాకపోతే జరిగే ప్రమాదాలన్నీ ఆయకు ఏకరువుపెట్టారు. బ్రహ్మ దేవుని ఆజ్ఞతోనే ఇలా వచ్చామని విన్నవించారు. అనసూయమ్మ అంతా విని లోపలకి వెళ్ళిపోయింది. మాకు భయంగావుంది. రక్షించు మహర్షీ అంటూ దేవతలంతా మూకుమ్మడిగా కాళ్ళమీద పడ్డారు. అత్రి ముని చిన్నగా నవ్వి అనసూయాదేవిని పిలిచాడు. లోకోపకారం కొరకు దేవతలంతా ప్రాధేయపడుతున్నారు. ఒక్కసారి వెళ్ళి సుమతితో మాట్లాడమని అన్నాడు. ఆ అనుమతికోసమే ఎదురు చూస్తున్నట్లుగా సరే అంది. పతి పాదాలకు నమస్కరించి ఆకాశమార్గాన దేవతలంతా వెంటరాగా బయలు దేరింది సుమతి ఇంటికి. సుమతి ఇంటి ముందు నిలిచి ఇంటి ముంగిట పంచలో ధ్యాన నిష్టలో నిమగ్నమైవున్న దంపతులను చూసింది. దేవతలందర్ని దూరంగా వుండమని తానొక్కతె శబ్దం చేయకుండా వెళ్ళి సుమతి ముందు కూర్చుంది.


మంచం మీద కుష్టురోగ పీడితుడైన కౌశికుడు ధ్యాన సమాధినిష్టలో వున్నాడు. పాదముల చెంత పద్మాసనంలో మమతి. సుమతి తల మీద చేయివేసి ప్రేమగా నిమిరింది అనసూయమ్మ. ఉపాశ్యదేవత ముగ్గురమ్మల మూలపుటమ్మ అనుగ్రహించి సహస్రార కమలంలో కరుణారస వృష్టి కురిపించిన అనుభూతి కలిగింది సుమతికి. ధ్యాన సమాధి నుండి బయటపడాలంటే ఇంతకు ముందు ఎంతో కష్టపడవలసివచ్చేది. ఇప్పుడేమో సడలింపు తనంత తానుగా కలిగింది. కన్నులు విప్పారాయి. ముంగిట అమోఘతేజస్సు, ఏమిటి పొరపాటున సూర్యోదయం కాలేదు కదా! క్షణకాలం సుమతిలో చైతన్య నిలిచిపోయింది. కాదు ఇది సూర్యకాంతి కాదు అలాగని చంద్ర తాపము కాదు. కన్నులకు కనిపించని కాంతి. ఆధ్యాత్మిక సాధనలో అనుభవం ఉన్న వారికి మాత్రమే తెలిసేది. పాతివ్రత్యం అనుగ్రహించిన వెలుగు, సుమతి పోల్చుకుంది. మరోసారి మృదువుగా తలనిమిరింది అనసూయాదేవి. సుమతి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.


No comments:

Post a Comment