Monday, 13 February 2023

శ్రీదత్త పురాణము (49)

 

అర్ఘ్యపాదాలతో పూజించారు. అతిధి మర్యాదలు జరిపారు. అనసూయాసాధ్వి వారిద్దరిని సకల సంపదలతో పుత్రాపౌత్రాభివృద్ధిగా వుండమని ఆశీర్వదించి తిరుగు ప్రయాణానికి సిద్ధం అయ్యింది. ఇంక వెళ్ళొస్తాను సంధ్యకు వేళవుతున్నది. అక్కడ అత్రి మహర్షి ఎదురు చూస్తుంటారు అని చెప్పి బయలుదేరింది. ఇంతలో అక్కడ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ప్రత్యక్షమైనారు. మాతా! మహాసాధ్వి! ముల్లోకాలను రక్షించావు నీ తపశ్శక్తి ధారపోశావు దీనికి ప్రత్యుపకారంగా నీకు వరం ఇవ్వాలని వచ్చాము కోరుకో అన్నారు.


అప్పుడు అనసూయాదేవి ఇలా అంది. త్రిమూర్తులారా! మీరు దర్శనం అనుగ్రహించారు. ఇంతకన్నా ఏమి కావాలి అయినా వరం కోరుకోమన్నప్పుడు కోరాలి కనుక అడుగుతున్నాను. అత్రి మహర్షి అంతరంగం ఎరిగి అడుగుతున్నాను. మీరెలాగూ నన్ను తల్లీ అని పిలిచారు కనుక ఆ పిలుపు సత్యమయ్యేట్లుగా వరం అనుగ్రహించండి. మీరు ముగ్గురూ నాకు బిడ్డలు అవ్వండి అని వరం కోరుకుంది.


త్రిమూర్తులు తధాస్తు! అని అంతర్ధానం చెందారు. అనసూయాదేవి ముఖంలో కొత్త ఆనందం పరవళ్ళు త్రొక్కింది. అమ్మాయీ, సుమతీ, మీ వల్ల నాకు మేలు జరిగింది. సాక్షాత్తూ త్రిమూర్తులే నాకు పుత్రులు కాబోతున్నారు. ఈ శుభవార్తను అత్రి మహర్షికి తెలియజెయ్యాలి. ఇంక వస్తాను సెలవు అంటూ వెళ్ళిపోయింది.


అనసూయాదేవి రాక కొరకు చిగురించిన గున్నమామిడి చెట్టు క్రింద అరుగు మీద కూర్చొని ఎదురుచూస్తూవున్నాడు అత్రి ముని సంధ్య ఉపాశించి కూర్చున్నాడు. ఉదయకిరాణాలు సోకినప్పుడే అనుకున్నాడు.


అనసూయమ్మ విజయం సాధించిందని, కౌశికుని మాట ఏమిటా అని ఆలోచిస్తూవున్నాడు. అదే సమయానికి అనసూయాదేవి ఆకాశమార్గమున తిరిగివచ్చి అత్రి మునికి నమస్కరించింది. పాదాభివందనం చేసింది. మహర్షి ఆమెను లేవనెత్తాడు. నీ ముఖంలో వెలుగు చూస్తుంటే తెలుస్తోంది. సుమతి మాంగల్యం నిలబెట్టావని. ముల్లోకాలకు కలిగిన ముప్పును తప్పించావు. బహుశా అందరూ నిన్ను పతివ్రతా శిరోమణివని పొగడి వుంటారు. అందుకే ఈ ఆనందం అంతా. అవునా? అంటూ ప్రేమగా పలకరించి దగ్గర కూర్చోబెట్టుకున్నాడు అత్రి మహర్షి. ఇదొక్కటే కాదు నా ఆనందమునకు కారణం ఇంకోటి వుంది అన్నది అమ్మ. అలాగా ఏమిటో చెప్తే మేమూ విని ఆనందిస్తాం అన్నాడు అత్రి మహాముని. అనసూయామాత త్రిమూర్తులు యిచ్చిన వరం సంగతి చెప్పింది.


No comments:

Post a Comment