నాయనా దీపకా వింటున్నావా అని వేద ధర్ముడు హెచ్చరించాడు. దీపకుడు ఆనందంతో తలవూపాడు. సుమతి తన తండ్రికి చెప్పిన కధ యిది. అనసూయ అత్రి మహర్షులు పుత్రవాంఛతో మదనాగ్నిని ప్రజ్వలింప చేసుకున్నారు. హోమగుండంలో పడబోతున్న హవిస్సును వాయుదేవుడు చెదరగొట్టాడు. ఒక అంశం వచ్చి మహర్షి కుడి కంటిలో పడింది. తక్కిన రెండు భాగాలు క్షణకాలం వ్యవధిలో అనసూయాదేవి గర్భకోశాన ప్రవేశించాయి. అత్రిముని కంటిలోపడిన భాగాన్ని ఆశ్రయించి బ్రహ్మచంద్రుడుగా ఉదయించాడు. అనసూయాసాధ్వి గర్భంలోకి ప్రవేశించిన ద్వితీయాంశను ఆశ్రయించి పురుషోత్తముడు దత్తాత్రేయుడిగా ఆవిర్భవించాడు. తృతీయాంశం రూపాన్ని ధరిస్తూ ఉండగా హైహయుడు అనే రాజు అడ్డగించాడు. ఇది గ్రహించిన రుద్రుడూ ఆ భాగాన్ని ఆశ్రయించి ఏడు రోజులు గర్భవాసం చేసి తమోగుణ ప్రధానుడై దూర్వాసుడుగా జన్మించాడు.
బ్రహ్మాంశ సంభవుడయిన చంద్రుడు రజోగుణ ప్రధానుడై లోకాలకు వెన్నెలను ప్రసాదిస్తున్నాడు. ప్రజాపతి పదవిని పొందాడు. కళలకు, ఔషధాలకు పోషకుడయ్యాడు. శివాంశ సంభవుడయిన దూర్వాసుడు రౌద్రగుణ ప్రధానుడై శాపాయుధుడై ఉన్మత్త వ్రత దీక్షతో వెలుగొందుతున్నాడు. కేశవాంశ సంభవుడయిన దత్తుడు యోగవిద్యా పారంగతుడై సత్వగుణ ప్రధానుడై తపోదీక్షతో తరచూ ఏకాంత వాసాలతో కాలం గడుపుతూ ఉన్నాడు. ముని పుత్రులు చాలామంది ఆయనకు శిష్యులు అనుచరులు అయ్యారు. అందువల్ల ఆయన ఏకాంతానికి నిష్ఠకు భంగం కల్గుతోంది. వారిని పరీక్షించాలని కూడా దత్తుడు భావించి వెళ్ళి వెళ్ళి ఒక సరస్సులో మునిగిపోయాడు. ఎంతకాలానికి సరస్సు నుంచి బయటకు రాలేదు. అయినా శిష్యవర్గం విడిచిపెట్టలేదు. గట్టున నిలబడి నిరీక్షిస్తున్నారు. ఇదిగో వస్తాడు, అదిగో వస్తాడు అని ఎదురు చూస్తూ ఉండగానే నూరు సంవత్సరాలు గడిచి పోయాయి. అప్పుడు లేచివచ్చాడు. అఖండ తేజోమూర్తి సూర్యకాంతిలాంటి తేజస్సుతో, చంద్రబింబంలా సరస్సునుండి బయటకు వచ్చాడు. శిష్యులంతా కరతాళధ్వనులతో జయజయ నాదాలతో జయగురుదత్తా! శ్రీ గురుదత్తా అంటూ ఆనంద తాండవం చేసారు. కొందరైతే బుంగమూతులు పెట్టి గోముగా నిష్ఠురాలు పలికారు. అందరినీ సముదాయించి దత్తాత్రేయుడు చిరునవ్వులు పంచి పెడుతూ ఆశ్రమం వైపు నడక సాగించారు. శిష్యులంతా కోలాహలంగా ఆయన్ను అనుసరించారు.
దత్తగురు, ఇంకెప్పుడు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళకు. మమ్మల్ని ఏకాకుల్ని చేయకు. నిన్ను చూడకుండా క్షణం కూడా ఉండలేము. నీ విరహాన్ని మేము భరించలేము అన్నారు. శిష్యులు మిత్రులు ఇలా అడుగుతూ ఉంటే దత్తుడు చిరునవ్వులు చిందిస్తూ వారితో కొంతకాలం గడిపేడు. వారితో బంధం యోగసాధనకు ఆటంకమవుతోంది. అదీగాక వీళ్ళందరూ నిజంగా తన పట్ల గురుభావంతోనే ఉన్నారా? ఉంటే దాని లోతు ఎంత? వీరు ఎరిగిన విలువలకు భిన్నంగా నేను ప్రవర్తిస్తే ఎంతమంది సహిస్తారు. ఎంతమంది అసహ్యిస్తారు, పరీక్షిద్దామను కున్నాడు.
No comments:
Post a Comment