Sunday, 12 February 2023

శ్రీదత్త పురాణము (48)

 


నీ భర్తకు రోగానుభవకాలం అయిపోయింది. పూర్వ జన్మల పాపనిధులు కరిగిపోయాయి. ఇపుడు రోగ విముక్తుడు కావాలి. అందుకొరకు విధి పన్నిన వ్యూహం ఇది. ఇందులో ఆ సానిపిల్ల, ఈ మాండవ్యుడు పరికరాలు మాత్రమే. తల్లిగా నా మాట విశ్వసించు. నీ పాతివ్రత్యం లోకానికి వెల్లడి అయ్యింది. నీకు పతి సేవా పరాయణత్వం లభించింది. ఇన్నాళ్ళూ రోగిష్టి భర్తతో నానా అవస్థలు పడ్డావు. ఇక నుండి నీ జీవితంలో అంతా పండు వెన్నెలే. లే! లేచి సూర్య రధానికి అనుమతి ప్రసాదించు. నా తపస్సు ధారపోసి అయినా నీ మాంగల్యాన్ని నిలబెడతాము. ధ్యాన నిష్టలో వున్న నీ భర్త నిద్ర నుండి మేల్కొన్నట్లుగా సంపూర్ణ ఆయురారోగ్యాలతో దివ్య తేజస్సుతో సుందర రూపంతో లేచి కూర్చుంటాడు అన్నది అనసూయాసాధ్వి.


సుమతి సరేనని ఊపిరి బిగించి కళ్ళు మూసుకొని సూర్యుణ్ణి ధ్యానించింది. సూర్యగమనంపై విధించిన ఆంక్ష సడలించింది. సూర్య రధం కదిలింది. తూర్పు దిక్కున వెలుగు రేఖలు మెల్లమెల్లగా విచ్చుకుంటున్నాయి. సృష్టి అంతా క్రమక్రమంగా చైతన్యం పుంజకుంది. ధ్యాన సమాధిలో కూర్చున్న కౌశికుడు మంచం మీదికి ఒరిగిపోయాడు. అనసూయాదేవి లేచి నిల్చుంది. దేవతల వైపుకి చూసింది. దేవతలంతా మాండవ్యముని వైపు చూసారు. ఆయన తలపంకించాడు. యమధర్మరాజు రెండడుగులు ముందుకు వేసి తన అభయ హస్తం చూపించాడు. అనసూయాదేవి కౌశికుడి శరీరాన్ని రెండు చేతులతో ఆపాదమస్తకమూ స్పృశించింది. అప్పుడు అనసూయమ్మ గంభీరవదనంతో ఇలా అంది. రూప, శిల, వాక్కు, ఆలంకారములతో నేను పరపురుషుడ్ని భర్తృసమానుడుగా చూడని దానినే అయితే ఈ బ్రాహ్మణుడు ఆరోగ్యవంతుడై పునర్జీవించుగాక! త్రికరణ శుద్ధిగా నిత్యమూ భర్తను ఆరాధించిన దానినే అయితే ఈ ద్విజుడు సంపూర్ణ ఆయురారోగ్యములతో పునర్జీవించుగాక!


కౌశికుడు కళ్ళు తెరిచాడు. ఎదురుగా అనసూయమ్మ కనిపించింది. అమ్మా అంటూ ముకుళిత హస్తములతో లేచి నిల్చున్నాడు. కళ్ళు మూసుకొని కూర్చునివున్న సుమతికి భర్తగొంతు వినిపించింది. రోగగ్రస్తుడు కాని రోజుల్లో భర్త కంఠలో వినిపించిన ధ్వని. కళ్ళు తెరిచింది. నవ యౌవనంతో సుందర రూపంతో కౌశికుడు కనువిందు చేసాడు. సుమతీ అన్నాడు. తనను తాను ఆపాదమస్తకమూ పరిశీలించుకున్నాడు. పతిసేవలో అలసిసాలసి పోయిన ఆమె శరీరం కూడా కొత్తకాంతితో నిండు యౌవనంతో వెలిగిపోతూవుంది. ఆమె శరీరం మీద ఆభరణములు అన్నీ తళుక్కు తళుక్కుమని మెరుస్తూ ప్రత్యక్షమయ్యాయి.


సుమతి ఒక నవ వధువులా మారిపోయింది. అనసూయమ్మ తనవైపే చిరునవ్వులు చిందిస్తూ చిద్విలాసంగా తనవైపే చూస్తూవుంది. సుమతికి ఒక్కసారిగా సిగ్గు ముంచుకొచ్చింది. వీధివాకిలివైపు చూసింది. దేవతలు మాయమైనారు. ఇంటిలోపలికి చూసింది. కొత్త కాంతులతో, రంగవల్లికలతో, పచ్చని తోరణముతో, కళకళలాడుతూవుంది. పాత్ర సామాగ్రి తళతళమని మెరిసిపోతున్నాయి. సుమతీ కౌశికుల ఆనందానికి అవధులు లేవు. తల్లీ, అమ్మా అంటూ అనసూయాదేవికి పాదాభివందనం చేసుకున్నారు సుమతీ కౌశికుల దంపతులు.


No comments:

Post a Comment