Monday, 27 February 2023

శ్రీదత్త పురాణము (63)




వద్దు స్వామి వద్దు నీ పరీక్షలు నేనింక తట్టుకోలేను. నువ్వు జగన్నాధుడవని, శ్రీమన్నారాయణుడవని నాకు తెలుసు. ఈ నారీలలామ సాక్షాత్తూ లక్ష్మీదేవియే నాకు తెలుసు. ఈ విలాసిని బృందము ఈ మద్యపానము ఇదంతా నీ మాయ అని నాకు తెలుసు. భక్తుల్ని ఎంతగా పరీక్షిస్తావో ఎలా బురిడీలు కొట్టిస్తావో నేను ఎరుగుదును. ఎవరు నీవు, ఎందుకు సేవలు చేస్తున్నావంటే నన్ను అనుగ్రహించడానికి అని సంబరపడ్డాను. పరీక్షలు ముగిసాయి అని అనుకొన్నాను. ఇది ఇంకోరకం పరీక్ష అని తెలుసుకోలేకపోయాను. అనఘాత్మా! నువ్వు యోగినాం యోగిని ఋషీనాంఋషిని కవీనాం కవివి. నీకు అసాధ్యమంటూ లేదు. సంకల్పించాలే కాని సమస్తమూ నీ అధీనంలోదే. ఈ దీనుణ్ణి కనికరించి స్వర్గ సింహాసనం మీద పునః ప్రతిష్టితుణ్ణి చెయ్యాలి అనుకోవాలే గాని అది నీకు క్షణాల మీద పని. ఎందరెందరో మహారాక్షసుల్ని చిటికలో తుదముట్టించిన వాడివి. జంభాసురుడు నీకొక లెక్కా. నిజంగా మా సేవలు నీకు నచ్చివుంటే దయచేసి ఈ ఉపకారం చేసిపెట్టు. లేదంటే నీ సేవలో ఇలాగే మరికొంత కాలం గడిపే అదృష్టం కలిగించు. అంతేగాని కల్లబొల్లి మాటలు చెప్పి మమ్మల్ని తప్పించుకోవాలని అనుకోకు. మా అపరాధ సహస్రాలన్నింటికి ఇదే విరుగుడు అంటూ దేవేంద్రుడు సాష్టాంగపడి నమస్కరించి దీనంగా అడిగాడు.


దత్తాత్రేయుడు పకపకా నవ్వాడు. ఇంద్రుణ్ని లేవనెత్తి గాఢంగా కౌగిలించుకున్నాడు. శచీపతీ ఆందోళన చెందకు. నీ శత్రువుల్ని పారద్రోలి నీ ఇంద్ర లోకాన్ని నీకిప్పిస్తాను. స్వర్గలోకాన్ని రక్షిస్తాను. నిన్ను ఇంద్రలోక సింహాసనంపై కూర్చుండ బెడతాను. ఆ జంభాదిరాక్షసులు నాకు కన్పించేట్లుగా చేయి చాలు. మిగతా సంగతి అంతా నేను చూసుకుంటాను. వెళ్ళిరండి మీకు జయమవుతుంది అని ఆశీర్వదించి పంపించాడు.


ఇంద్రాది దేవతలు సంతోషించి బయలుదేరారు. జగన్నాటక సూత్రధారి ఈ విష్ణుమూర్తి రాక్షస బాధల్ని తప్పించటానికి ఎప్పటికప్పుడు ఏదో ఒక ఉపాయం పన్నుతూంటాడు. ఏదో ఒక కొత్త నాటకం ఆడుతూ వుంటాడు. ఈ సారి ఏమి చేయ సంకల్పించాడో చూద్దామని అనుకుంటూ స్వర్గలోకం సమీపించారు. నందన వనంలో పొదరిళ్ళలో, చెట్ల నీడల్లో, దివ్యభవనాల్లో దేవ కన్యలను అప్సరసలను బలాత్కరిస్తూ క్రూరంగా హింసిస్తున్న రాక్షసుల్ని చూసారు. అన్ని వైపుల నుండి ఒక్క సారిగా చుట్టుముట్టి హై హై హే హే అంటూ దేవతలు రాక్షసుల మీద విరుచుకుబడ్డారు. రాక్షసులు కూడా సన్నద్ధులై తిరగబడ్డారు. దేవతల్ని తరిమి తరిమి కొడుతున్నారు. వాళ్ళు తరుముతున్నంత సేపూ పారిపోతున్నట్లుగా నటిస్తూ వాళ్ళు ఆగినపుడు మళ్ళీ తిరగబడి ఉసిగొల్పుతూ మళ్ళీ పారిపోతూ మళ్ళీ తిరగబడి ఉసిగొల్పుతూ వాళ్ళు తమ వెంట బడేటట్లుగా చేసుకుని ఎలాగైతేనేమి తెలివిగా రాక్షసుల నందర్నీ దత్తాశ్రమ ప్రాంతానికి లాక్కు వచ్చారు దేవతలు. 


No comments:

Post a Comment