సుమతీ నిజంగా నాకు తెలియదు. ఏమి జరిగిందో చెప్పు ఇంటి దగ్గర బయలు దేరడం స్మశానంలో నడవడం ఇంత వరకే నాకు తెలుసు. ఆపైన ఏం జరిగిందో ఇసుమంతైనా నాకు తెలీదు. నిజం చెబుతున్నాను. మాండవ్యుడి శిరస్సుకి నా కాలు తగలడం ఏమిటి? అంతటి పాపం చేస్తానా? చేస్తే క్షమించమని ఆ మహర్షి పాదాలు పట్టుకుని క్షమించమని అడగనూ? ప్రాణాలు వదిలేస్తాను గాని పాపంజేసి ప్రాయశ్చిత్తం చేసుకోకుండా వుంటానా? ఏ జన్మలో ఏ పాపం చేశానో ఈ మహారోగం అనుభవిస్తున్నాను. తెలిసి తెలిసి ఇంకా పాపాలు చేస్తానా అసలు ఏం జరిగింది చెప్పు అన్నాడు.
సుమతి నివ్వెరపోయింది. క్షణం క్రింద కళ్ళ ఎదుట జరిగిన సంఘటన నాధుడికి తెలియదు. ఇది మరొక దైవలీల. నిజమే తెలిసివుంటే అంతసేపు నోరు మూసుకొని కూర్చుంటాడా? కనీసం క్షమించండి స్వామి అనడా సరే అని అనుకొని జరిగిందంతా నాధుడికి వివరించింది. కౌశికుడు సిగ్గుపడ్డాడు. భయపడ్డాడు. సుమతీ! వేశ్యా లేదు గీశ్యా లేదు. వెంటనే వెనక్కు వెళ్ళిపోదాం మాండవ్యుడి కొరత దగ్గరకు నన్ను తీసికెళ్ళు. మాండవ్యుడు బ్రతికివుంటె క్షమించమని అడుగుతాను. మృత్యువుకీ భయపడి మాత్రం కాదు. అధర్మానికి సిగ్గుపడుతున్నాను. ఇంతకీ నా కామ వాంఛ ఇన్ని దురవస్థలు తెచ్చిపెట్టింది. నిన్ను అవస్థలు పెడుతున్నాను. నేను అవస్థలు పడుతున్నాను. శాపం కొని తెచ్చుకున్నాను. ఇంక నేను జీవించేదికొన్ని ఘడియలు మాత్రమే. క్షణం వృధాచేయ వద్దు. తొందరగా మాండవ్యుడికి క్షమాపణ చెప్పి ఇల్లు చేరుకుందాం. హరినామ స్మరణతో చివరి ఘడియలు గడుపుతాను. పదపద అన్నాడు. పాపం సుమతి వెనక్కుమళ్ళింది. పిచ్చి ఆవేశమేదో ఆమెను ఆవరించింది. త్వరత్వరగా నడిచింది. పరిచయం లేని ప్రదేశం. కారు చీకటి. దుర్గంధం. లోపల ఆందోళన దారి తప్పింది. ఎంత తిరిగినా ఎటు తిరిగినా మాండవ్యుడి కొరత ప్రదేశం కన్పించలేదు. నాధా ఈ శ్మశానంలో మాండవ్యుడి శరీరం ఎక్కడుందో కన్పించడం లేదు. దారి మారి పూరిదారిలో వచ్చేశాం అంది.
సుమతీ నీవు ఏనాడైనా గుమ్మం దాటిన దావవా, ఎంత హింసిస్తున్నాను. పోనీలే ఇంటికి వెళ్లాం. మాండవ్యుడు ఇచ్చిన శాపానికి తిరుగులేదు. కాలయాపన చెయ్యకుండా పద పద అన్నాడు. సుమతి ఇంటికి చేరుకుని ఇంటి ముంగిటవున్న పంచలో నున్న మంచంపై అతన్ని దింపింది. తాను పెరట్లోకి వెళ్ళి బావివద్ద నీళ్ళతో కాళ్ళు కడుక్కుని తడి చేతులతో భర్త కాళ్ళు, చేతులూ, ముఖం తుడిచింది. అప్పటికీ కౌశికుడు ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. అతని చెంత ఆమె పద్మాసనం వేసుకొని కూర్చుని బిగించిన పిడికిలిలా కూర్చుంది. ఉపదేశం పొందిన మంత్రాన్ని ప్రాణాయామ పూర్వకంగా అనుసంధానం చేసింది.
No comments:
Post a Comment