మరింత అవాక్కులయ్యారు అమాత్యులందరూ. వారి వెంట నిలిచిన గర్గముని కార్తవీర్యుడి నిశ్చయానికి చాలా సంబరపడ్డాడు. పట్టుదలని గుర్తించాడు. తపస్సు చేస్తాడనీ అమోఘ ఫలాలు పొందుతాడనీ గ్రహించాడు. రాకుమారా! నీ నిర్ణయాన్ని అభినందిస్తున్నాను. నీ దృడ సంకల్పాన్ని ప్రశంసిస్తున్నాను. తపస్సులు ఫలించడమంటే అదొక సుధీర్ఘ యాత్ర. వేల సంవత్సరాల కృషి, లోక శ్రేయస్సు కోసం నీకొక దగ్గరిదారి చెబుతాను. ఆలకించు. సహ్యాద్రి ఎరుగుదువు కదా! దాని లోయల్లో ఒక చోట ఆశ్రమం నిర్మించుకొని దత్తాత్రేయుడు తపస్సు చేసుకుంటున్నాడు. అతడు అమోఘ యోగశక్తి సంపన్నుడు. యోగ విద్యా ప్రవర్తకుడు. ఈ జగత్తును కాపాడటం కోసం విష్ణుదేవుడి అంశతో అవతరించాడు. నువ్వు వెళ్ళి అతడిని ఆశ్రయించు. నీ సంకల్పం సత్వరం సిద్ధిస్తుంది. స్వర్గలోకాన్ని జంభాసురాదులు ఆక్రమించినప్పుడు దేవేంద్రుడంతటివాడు వచ్చి ఈ దత్తాత్రేయుణ్ణి ఆశ్రయించాడు. అతడి కరుణవల్ల రాక్షసుల్ని జయించి మళ్ళీ తన స్వర్గపీఠం తాను అందుకోగలిగాడు. ఇటువంటి విజయగాధలు ఎన్నో ఉన్నాయి. నీకు జయం కలుగుతుంది. వెళ్ళిరా.
ఇది ఆదేశమా, ఆశీర్వచనమా అనిపించేట్టు గర్గముని పలికిన ఈ మాటలు కార్యవీర్యుణ్ణి ఆకట్టుకున్నాయి. అతడివైపు సభక్తికంగా చూస్తూ- మునీంద్రా ! నీ ఆదేశం నాకు శిరోధార్యం. అలాగే చేస్తాను. కానీ జంభాసురాదులు ఇంద్ర రాజ్యాన్ని ఎలా అపహరించారు. ఇంద్రుడు దత్తాత్రేయుణ్ణి ఎలా ఉపాసించాడు, తిరిగి తన స్వర్గపీఠాన్ని ఎలా పొందాడు? ఇవన్నీ సవివరంగా తెలుసుకోవాలని ఉంది. దయచేసి నన్ను కృతార్ధుణ్ణి చెయ్యండి.
కార్తవీర్యుడి అభ్యర్ధనకు గర్గముని మురిసిపోయాడు. రాకుమారా! తప్పకుండా చెబుతాను. ఆలకించు అంటూ ప్రారంభించాడు.
ఇంద్రాది దేవతల దత్తోపాసన
వెనుకటి కాలంలో జంభాసురుడు ఘోరతపస్సు చేసి బ్రహ్మదేవుణ్ణి మెప్పించి అనేక దివ్యవరాలు పొందాడు. శివుణ్ణి మెప్పించి అనేక దివ్యాయుధాలు పొందాడు. వీటి గర్వంతో సమస్త లోకాలూ జయించాలనీ సకల సంపదలూ పొందాలనీ ఆశ కలిగింది. మహా రాక్షు సైన్యాన్ని లక్షల సంఖ్యలో సమకూర్చుకుని స్వర్గ మధ్య పాతాళలోకాలపైకి దండయాత్రకు బయలుదేరాడు. ముందుగా సరాసరి స్వర్గలోకాన్ని చుట్టుముట్టాడు. దేవాసురులకు భీకర సంగ్రామం కొన్ని సంవత్సరాలపాటు జరిగింది. జంభాసురుడూ, అతడి సైన్యమూ వరమహిమవల్ల నానాటికీ బలపడుతుంటే దేవసైన్యం క్షీణిస్తోంది. చివరికి దేవతలు ఓటమి అంగీకరించి స్వర్గలోకం విడిచిపెట్టి పలాయనం చిత్తగించారు.
No comments:
Post a Comment