అప్రయత్నంగా చేతులు జోడించి నమస్కరిస్తూ అమ్మ ఒడిలో వాలి అమ్మా అంటూ బావురుమంది. అనసూయ గంభీరవదనంతో చిరునవ్వుతో తలపంకిస్తూ సుమతి తల నిమురుతూనే వుంది.
పిచ్చితల్లీ ఎందుకింత భయం! మేమంతాలేమా! ఈ సృష్టిలో నీవొక్కతినే ఒంటరి దానవి అని అనుకుంటున్నావా? లే, లేచి ముఖం తుడుచుకో, ఇదిగో చూడు ఎవరెవరు వచ్చారో అంది.
అమ్మా! బాబయ్యగారు కూడా వచ్చారా? అత్రి ముని వచ్చాడేమో అతిధి మర్యాదలు చెయ్యాలిగదా అనుకొని తలపై కెత్తి చూసింది సుమతి. ఇంటి ముంగిట వైపు చూసింది. బృహస్పతి, దేవేంద్రుడు, అష్టదిక్పాలకులు, సకల ఋషులు, అఖిల దేవతలు తమ తమ దివ్య తేజోమయ రూపాలతో కనిపించారు. అందరూ వినయంగా చేతులు కట్టుకొని నిలిచి వున్నారు. అందరి చూపుల్లో కాపాడుతల్లీ అన్న ప్రాధేయభావం కన్పిస్తూ ఉంది. ఆశ్చర్యపడుతూ అనసూయమ్మ వంక చూసింది సుమతి.
అమ్మా సుమతీ! అంతా దైవలీల. అతిధి మర్యాదల కొరకు ప్రయత్నించకు. నీ పాతివ్రత్య ప్రభావానికి మెచ్చి అందరూ నీ ఎదుట నిలచారు. నీ అనుగ్రహం కొరకు అందరూ ఎదురు చూస్తున్నారు. ప్రతిజ్ఞ సడలించు. సూర్య రధాన్ని అనుమతించు. కారు చీకటిలో మునిగిపోయి సృష్టి అంతా వెలుగు కొరకు పరితపిస్తోంది అన్నది అనసూయమాత. అపుడు సుమతి అమ్మా మరి మాండవ్యశాపం అని ఆర్థ్రోక్తిలో ఆగిపోయింది. సుమతీ! ఏమీ ఫరవాలేదు. నేను ఉన్నానుగా మాండవ్యశాపము చెల్లుతుంది. నీ మాంగల్యమూ నిలుస్తుంది. పిచ్చితల్లీ మట్టి బొమ్మలు చేసి ఆడుకునేవాడు ఒక బొమ్మకు వంకరవస్తే ఏం చేస్తాడు. ఆ బొమ్మను ముద్దచేసి మళ్ళీ అచ్చులో ఒత్తుతాడు. అవునా అదే జరుగబోతుంది.
నీ భర్త రోగ విముక్తుడై రూప యౌవనములతో పునరుజ్జీవితుడు కాబోతున్నాడు. అది నేను చేస్తాను అన్నది అనసూయమ్మ.
అమ్మాయి సుమతీ! అన్నీ నీ మంచికే దైవలీలలు చిత్రాతి చిత్రంగా వుంటాయి. ఒక్క విషయం ఆలోచించు. ఒక్క విషయం ఆలోచించు. ఏనాడూలేనిది ఆరోగ్యం క్షీణించిన దశలో నీ పతికి కామవాంఛ కలగడం ఏమిటి? అదీ వేశ్యతో, అదీ నీ సహాయాన్నే అతను అర్ధించడం. పోనీ మీరున్న వీధీలో ఏనాడైనా సాని పాపలు అడుగు పెట్టే సాహసం చేసారా? మరి సానిపాప ఎలా రాగలిగింది? వచ్చివచ్చి ఇలా మీ ఇంటి ముందే నిలబడాలా? నీ పతినే చూడాలా? అది చూసేసరికి ఇలా ఆయన మనస్సు కరిగిపోవాలా? పిచ్చి దానా ఇదంతా శ్రీమన్నారాయణుని వ్యూహం. శృంగార వాంఛలు రూపయాననముల పునరాగమమునకు సంకేతములు. అది సరే కొరతకు వ్రేలాడుతూ కన్పించిన మాండవ్యుడు మళ్ళీ కనిపించాడా? పదిగజాల దూరం మాత్రమే నడిచావు వెనక్కి మళ్ళావు. అంతలోనే దారితప్పి పోవాలా ఆలోచించు. అడుగో మాండవ్యమహర్షి బృహస్పతి చాటున నిలబడి ఉపద్రవానికి తన శాపమే కారణము అనుకొని సిగ్గుపడుతున్నాడు. తానే కర్తని అనుకొంటున్నాడు పాపం. ఎంతటి జ్ఞానులకైనా ఈ భ్రమలు తొలగవు కదా!
No comments:
Post a Comment