Sunday, 26 February 2023

శ్రీదత్త పురాణము (62)

 


నీకు తెలుసుగదా మేమెంతటి యుద్ధ వీరులమో. అందుచేత రణరంగానికైతే రాలేం కానీ మీ వెంట ఉండి శిబిరాలలో క్షతగాత్రులకు సేవలు అందించగలం. ఈ పాటి సహకారం అందించడానికి మేమూ ఎప్పుడూ సిద్ధమే. నిజానికి అది మా అదృష్టంగా భావిస్తాం. దీనికి మీరు అభ్యర్థించాలా? ఆజ్ఞాపించండి. అంతటి సువర్ణావకాశం మాకు కలిగించండి. దేవతలకు సహకరించడంకన్నా తపస్వులకు కోరుకోవలసింది ఏమిటి ఉంటుంది ?


దత్తయోగీంద్రా! ఇది చాలా అన్యాయం. మాటలతో మమ్మల్ని మభ్యపెట్టాలని చూస్తున్నారు. స్వామీ! ఇప్పటికీ అన్ని విధాలా నలిగిపోయాం. కాపాడవలసిన నాథుడే పరాచికాలాడితే మేము ఏమైపోవాలి? మీరు అనుగ్రహిస్తే స్వర్గలోకం మళ్ళీ మాకు దక్కుతుంది. లేదంటే ఇక్కడే ఇలాగే మీ సేవలో ఉండిపోతాం. ఇంతకన్నా గొప్ప ఆనందమేదీ ఆ సింహాసనంలో లేదు. కాకపోతే నా విధులు నేను నిర్వహించాలి కనక, యజ్ఞయాగాదుల్ని సక్రమంగా జరిపించాలి. కనక, ఈ భాధ్యతల్ని అలనాడు మీరంతా నాకు అప్పగించారు కనుక, దుర్మార్గంగా అన్యాక్రాంతమైన స్వర్ణోకాన్ని- అదీ రాక్షసాంతమైన స్వర్గసీమను మళ్ళీ నాకు అప్పగించమని అభ్యర్ధిస్తున్నాను. తమరు దయమాలి నాతో ఆడుకుంటున్నారు. నా అదృష్టం ఇలా ఉంది. ఏం చెయ్యను. నన్ను నమ్ముకుని ఈ దేవతలు కూడా అగచాట్లు పడుతున్నారు.


దేవేంద్రా! నన్నూ నా మాటల్నీ అపార్ధం చేసుకుంటున్నావు. నిన్ను నొప్పించడంగానీ పరాచికాలాడటం కానీ నా ఉద్దేశం కాదు. నేను అంతటి వాణ్నికాను. నేనేమన్నా ఉపేంద్రుణ్ణా ఇంద్రుడితో పరాచికాలాడటానికి, సాధారణ తపస్విని. చూశావుగదా నా దిన చర్య. ఎంతటి భ్రష్టాచారుల్లో గ్రహించే ఉంటావు. మధ్యపానరతుణ్ణి, మదవతి లోలుణ్ని, సంయోగమే తప్ప యోగమంటూ ఎరగని వాణ్ణి. ఇదే తపస్సుగా ఇదే అద్వైత స్థితిగా మురిసిపోతున్న వాణ్ణి. ఈ పాటి ఇంద్రియాలనే జయించలేని నేను ఇంద్రుడికి సహకరించడమా? విడ్డూరం. కష్టాలలో ఉన్నావు గనుక ప్రతి గడ్డిపోచా నీ కంటికి ఇలాగే కనిపిస్తుంది. సహజం. కానీ నా శక్తి ఏమిటో నేను తెలుసుకోవద్దూ! అందుకని మరోసారి చెబుతున్నాను. ఆ రాక్షసులేమిటో ఆ యుద్ధాలేమిటో మీరు చూసుకోండి. మేము అందించగల సేవలేమిటో మాకు ఆజ్ఞాపించండి. ఆనందంగా చేస్తాం..


No comments:

Post a Comment