Wednesday 24 April 2024

శ్రీ గరుడ పురాణము (158)

 


ప్రశ్నలు చెప్పేవారు అడిగేవారి నాడీ ప్రవాహస్థితిని గమనించాలి. తనకు శుభం కలుగుతుందా అశుభం కలుగుతుందా, లాభమొస్తుందా నష్టం వచ్చిపడుతుందా అని అడిగేవారికి అడుగుతున్నపుడు మధ్యమనాడి చలనంలో వుంటే అశుభమూ, నష్టమే కలుగుతాయి కాబట్టి జాగ్రత్తపడాలని చెప్పాలి. అదే, అదే సమయంలో ఇడా, పింగళనాడులు ప్రవహిస్తుంటే శుభం కలుగుతుందనీ, లాభమే వస్తుందనీ నిస్సందేహంగా చెప్పవచ్చును.


అలాగే అడిగేవారి గొంతుని బట్టి అది ఏ స్వరంలో వుందో ఆ స్వరం నాడీ మండలంలో ఎక్కడి నుండి వస్తోందో బాగా విచారించి సాధ్యాసాధ్యాలనూ, సిద్ధ్యసిద్ధులనూ పోల్చుకొనవచ్చును. దీనికి స్వరోదయ విజ్ఞానం తెలియాలి".


(అధ్యాయం - 67)


(గరుడ పురాణంలో ఇటువంటి విజ్ఞానమొకటి కలదనే విషయం మాత్రమే సూచింప బడింది. ఈ అంశంపై కృషి చేయదలచుకున్న వారు నాడీగ్రంథాలను అవలోకించాలి) 

రత్నాల పుట్టుక కథ వజ్ర పరీక్ష


“ప్రాచీన కాలంలో బలాసురుడను ఒక రాక్షసుడుండేవాడు. అతడు ఇంద్రాది దేవతలందరినీ యుద్ధంలో జయించి దేవతల అసమర్థతనీ తన త్రైలోక్యాధిపత్యాన్నీ లోకానికి చాటుకున్నాడు. బలాసురునికి ఇచ్చిన మాటను తప్పకూడదనే నియమం వుండేది. దేవతలు బ్రాహ్మణ వేషాలలో అతని వద్దకు పోయి తామొక యజ్ఞాన్ని తలపెట్టామనీ బలిపశువు కోసం ఆతనిని యాచించడానికి వచ్చామనీ బలాసురుని బతిమాలుకున్నారు. అతడు వెంటనే వారికి కావలసిన బలిని తాను సమకూర్చగలనని మాట ఇచ్చాడు. వెనువెంటనే దేవతలు “నువ్వే కావాలి' అన్నారు. ఈ విధంగా తన వాగ్వజ్రానికి తానే బలి అయిపోయాడు బలాసురుడు.


బలాసురుని బలిదానం ఉత్తినేపోలేదు. లోకకల్యాణం జరిగింది. సామాన్యులు చేసే యజ్ఞానికే కీటకసంహారం, కాలుష్య నివారణం, నగరశాంతి వంటి లోకమంగళకర కార్యాలు జరుగుతాయి కదా, అలాంటిది ఇంద్రాదులంతటివారు ఒక మహాదాతను బలిపశువుగానే చేసిన యజ్ఞానికి సామాన్య ఫలితముంటుందా! ఒక లోకకల్యాణమేమి, త్రైలోక్య కల్యాణమే జరిగినది. బలాసురుని శరీరము ఈ విశుద్ధ కర్మ వలన పరమ విశుద్ధ శరీరముగా పరిణతి చెందినది. సత్త్వగుణ సంపన్నమై విరాజిల్లినది. అందలి అన్ని అంగములూ రత్నబీజములై ప్రపంచమునే సంపన్నము గావించినవి.


No comments:

Post a Comment