Friday 19 April 2024

శ్రీ గరుడ పురాణము (153)



నుదురు అర్ధచంద్రాకారంలో వుంటే చాలా మంచిది. అది తరగని ధన సంపదని సూచిస్తుంది. మస్తకం ముత్యంలాగా నుదురు విశాలంగా మెరుస్తూ వుంటే ఆచార్య పీఠం లభిస్తుంది. నుదుటిపై రక్తనాళాలు కనిపించరాదు. అది పాపకర్ముల లక్షణము. అస్పష్టంగా కనిపిస్తూ ఉన్నతంగా ఉండే నాడులతో స్వస్తిక ముద్రతో ఎత్తయిన, సుందరమైన లలాటం గలవారు ధనవంతులవుతారు. కిందికీ, లోనికీ వంగిన నుదురున్నవారు చెఱసాల పాలౌతారు.


ఎవరైనా నవ్వినపుడు కంపనం లేకుండా నవ్వితే వారిని శ్రేష్టులుగా గౌరవించవచ్చు. కన్నులు మూసుకొని నవ్వేవారిలో పాపాత్ములెక్కువ. మాటిమాటికీ అనవసరంగా నవ్వేవారిలో దుష్టులెక్కువ.


నూరేళ్ళాయుర్దాయం గలవారి మస్తకంపై మూడు రేఖలుంటాయి. నాలుగు రేఖలు రాజలక్షణం, ఆయుర్దాయం తొంబదియైదు. రేఖారహితమైన లలాటమున్నవారు తొంబది యేళ్ళు జీవిస్తారు. నుదుటి నిండా ముక్కలైన రేఖలున్నవారిలో వ్యభచరించే వారెక్కువ. నుదుటిపై వుండే రేఖలు చివరికంటా పోయి కేశాలను తగులుతుంటే, ఆ విధమైన రేఖలున్నవారు ఎనభై యేళ్ళు బ్రతుకుతారు. అయిదు, ఆరు లేదా ఏడు రేఖలున్నవారు యాభై యేళ్ళే జీవిస్తారు. ఏడు కన్న నెక్కువ గీతలున్న వారిలో నలభై సంవత్సరాలు బతికే వారే ఎక్కువ.


బల్లపరుపుగా, అణగినట్లుగా తల వుండే వారికి పితృవియోగం చాలా వేగంగా సంభవిస్తుంది. కుండ ఆకారంలో తల గలవారికి పాపం వైపే మనసు వెళుతుంటుంది. ఒక కన్నంలో నుంచి ఒక తలవెండ్రుకే మొలవడం మంచిది. తద్విపరీతం ధనక్షయకరం. అతిశయరూక్షత - అనగా మొరటుదనం ఏ అంగంలోనూ మంచిది కాదు. మరీ పేలవంగా, రక్తమాంసరహితంగా వుండే అంగాలన్నీ అశుభసూచకాలే. మానవశరీరంలో మూడంగాలు విశాలంగా, మరో మూడు గంభీరంగా ఒక అయిదు పొడవుగా చిన్నగా, ఆరు ఎత్తుగా నాలుగు పొట్టిగా, మరొకయేడు రక్తవర్ణంలో వుండడం శుభలక్షణాలు. ఈ లక్షణాలన్నీ కలవారు మహారాజులవుతారు.


No comments:

Post a Comment