Thursday 18 April 2024

శ్రీ గరుడ పురాణము (152)

 


సుందరమైన నాసిక గలవారు సుఖజీవనులవుతారు. శుష్కించినట్లున్న ముక్కు గలవారు దీర్ఘాయువులవుతారు. ముక్కు చివరి భాగం భిన్నంగా వుండి, నూతి ఆకారంలో నాసిక గలవారు అద్భుత లక్షణాలుండి, ఎవరికీ అందని వారి పొందును పొందగలుగుతారు. పొడవాటి ముక్కున్నవారు సౌభాగ్యసంపన్నులూ, కుంచించుకుపోయిన నాసిక గలవారు దొంగలూ కాగలరు. చప్పిడిగా అణగిపోయి వున్న ముక్కు అకాలమృత్యు సూచకము. కుడివైపు కాస్త వంగియున్న ముక్కు క్రూరత్వానికి చిహ్నము. చిన్న చిన్న గోళాలతో, సాపుగా, సొంపుగా వుండే నాసిక చక్రవర్తి కుంటుంది. 

వక్ర ఉపాంతభాగాలతో నుండి, పద్మపత్రము వలె సుందరంగా మెరిసే నేత్రాలు సుఖజీవనులకుంటాయి. పిల్లి కళ్ళు పాపాత్ములకీ మధు పింగళవర్ణంలో నేత్రాలు దురాత్ములకీ వుంటాయి. ఎండ్రకాయ కనుల వంటి కనులున్నవాడు (రు) క్రూర కర్ముడౌ (లౌ)తారు. ఆకుపచ్చటి కనులున్నవారు పాపకర్మలంటే ఇష్టపడతారు. ఏనుగు కన్నులున్నవారు సేనలను నడుపగలరు. గంభీర నేత్రాలు రాజ లక్షణం. స్థూలనేత్రాల వారు మంత్రులవు తారు. నీలికమలముల వంటినయనాలున్నవారు విద్వాంసులూ, నల్లకనులవారు సౌభాగ్యశాలులూ అవుతారు. మండలాకార నేత్రాలున్నవారు పాపాత్ములూ, ఎప్పుడూ దీనభావమే గోచరించే కనులున్నవారు దరిద్రులూ కాగలరు. సుందర విశాల నేత్రాలున్న వారు రకరకాల సుఖాల ననుభవిస్తారు. కళ్ళు ఎక్కువగా పైకి లేపేవాళ్ళు అల్పాయుష్కులౌతారు. విశాలంగా వుండి పైకి లేచే కనులున్నవారు సుఖపడతారు.


కనుబొమ్మలు విషమంగా వుండే వారు దరిద్రులవుతారు. పొడవుగా, దట్టంగా, పెద్దగా ఎడం లేకుండా, వక్రంగా, ఉన్నతంగా వంపు తిరిగియున్న కనుబొమ్మలు గలవారు గొప్ప ధనికులై మహాభోగములననుభవిస్తుంటారు. మధ్యలో తెగినట్లున్న, ఖాళీ గల కనుబొమ్మలు నిర్ధనులకూ, బాగా వంగియున్న కనుబొమలు అందని వారి పొందునందగలిగే వారికీ వుంటాయి. అయితే, వీరికి పుత్ర సంతానముండదు.


No comments:

Post a Comment