Monday 1 April 2013

పరమేశ్వరుని సేవ



ఓం నమః శివాయ

|| తన్మే మనః శివ సంకల్పమస్తు ||

'లింగ్యతే జ్ఞాయతే అనేన ఇతి లింగం'. లింగం అంటే చిహ్నం, గుర్తు, ప్రతిరూపం అని అర్దం.

మనకు లింగార్చనలో వివిధ రకాల లింగాలున్నాయి. వాటిలో రెండూ స్థావర లింగం, జంగం లింగం. స్థావరములంటే కదలనివి, చెట్లు, లతతలు తీగలు వంటివి. ఇవి కూడా శివలింగానికి ప్రతిరూపాలు.

జంగమాలంటే కదిలేవి. పశుపక్ష్యాదులు, క్రిమికీటకాలు, చీమలు మొదలైనవి.

అలాగే ప్రతి మనిషి కూడా 7 చక్రాలు కలిగి ఉన్న ఓక శివలింగం. ఆత్మశక్తి కూడా లింగాకారంలో ఉంటుంది.

ఇవన్నీ శివ లింగాలు అంటే శివుడు ప్రతిరూపాలు.

శివం అంటే శుభం, ప్రాణం, ఆత్మ. రుద్ర నమక-చమకాలు ఈ సమస్త బ్రహ్మాండమంతా శివుడే అని, సర్వం శివ మయం జగత్ అని వర్ణిస్తోంది.

స్వయంగా శివమహాపురాణంలో పరమశివుడే చెప్పాడు, చెట్లు, లతలు, మొక్కలు స్థావరలింగాలు కనుక వాటికి నిత్యం నీరు పెడితే అది తన అర్చనగా భావిస్తానన్నాడు. జంతువులు, పక్షులు, క్రిమికీటకములకు నిత్యం ఆహారం, నీరు అందిచడం కూడా తనకు చేసే ఆరాధనగా స్వీకరిస్తానని చెప్తాడు.

ఈ వేసవి కాలంలో ఆహారం, నీరు లేక అనేక జంతువులు, పక్షులు మరణిస్తుంటాయి. చెట్లు ఎండిపోతుంటాయి. కనీసం మన ఇంటి చుట్టు ఉండే చెట్లకు నీరు పోయండి.  పక్షుల కోసం మీ ఇంటి ముందు గోడల మీద, ఇంటి పైకప్పు మీద మట్టిముంతలో ప్రతి రోజు శుభ్రమైన త్రాగు నీరు పెట్టండి. కుక్క కాలభైరవుడికి ప్రతీక. శివగణాల్లో ఒకటి. వీధిలో ఏ దిక్కులేని కుక్కలకు వీలైతే ఆహారం పెట్టండి. కనీసం నీరైన అందుబాటులో ఉంచండి.

అనేక మంది వేసవికి దాహంతో అల్లాడిపోతారు. వీలైతే చలిచేంద్రాలు ఏర్పాటు చేసి, వారి దాహం తీర్చండి. ప్రచారం కోసం చలివేంద్రాలు ఏర్పాటు చేయడం కాదు, పరమేశ్వరుని సేవకు ఏర్పాటు చేయండి. అప్పుడు ప్రతి ఒక్కరిలోనున్న పరమశివుడు, అవి తనకు సమర్పించినవిగా, వాటిని పరమ సంతోషంగా స్వీకరిస్తాడు. తప్పక అనుగ్రహిస్తాడు.

పరమాత్ముడు ఈ సమస్త సృష్టిలో ప్రతి అణువులో ఉన్నాడు. మనం మన తోటి జీవుల జీవనం కోసం చేసే ప్రతి చిన్న సహాయాన్ని ఆయన అర్చనగా భావిస్తాడు. శివతత్వాన్ని అర్దం చేసుకోండి. పరమేశ్వరుడి సృష్టిని గౌరవించండి.

సర్వజీవుల యందున్న పరమేశ్వరుడిని గుర్తించి ఆరాధించండి.

|| తన్మే మనః శివ సంకల్పమస్తు ||

ఓం నమః శివాయ

No comments:

Post a Comment