Thursday 7 November 2013

పాము కనిపిస్తే ఏం చేయాలి ? సర్పదోషాలు ఉన్నవారు పఠించవలసిన మంత్రం ఏమిటి?

పాము కనిపిస్తే ఏం చేయాలి ? సర్పదోషాలు ఉన్నవారు పఠించవలసిన మంత్రం ఏమిటి?

పాములను పూజించే మనం నిజంగా పాము కనిపించగానే హంగామా చేసేస్తాం. కారణం అవి కాటేస్తాయనే భయం. ఒక్కసారి ఈ దేశంలో రోజు చనిపోతున్నవారిలో పాముకాటు వల్ల చనిపోతున్నవారు ఎంత మంది అని చూడండి, వేళ్ళ మీద లెక్కించవచ్చు, ఒక్కోరోజు అసలు ఉండకపోవచ్చు. పామును దైవంగా పూజించే మనం ఒక పాము కనిపించగానే, లేనిపోని హడావుడి చేసి, పాముకు ఒక భయానక వాతవరణాన్ని సృష్టించి, జనం అందరిని పోగేసుకుని, దాన్ని చంపే ప్రయత్నం చేస్తారు. అది కాటేస్తుందంటారు.

ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. పాము కాటు గురవ్వగానే ఎవరు మరణించరు. అలా భయానక విషసర్పాలు మన దేశంలో చాలా తక్కువ. పాము కాటుకు గురయ్యామన్న భయమే మరణానికి కారణమవుతుంది.  భయం కారణంగా రక్తప్రసరణ వేగం పెరుగుతుంది, విషం ఇతర శరీర భాగాలకు చేరి, శరీరం విషతుల్యమవుతుంది. పాముకాటుకు గురైన తరువాత 6 గంటల వరకు మనకు ఏమి కాదు. ఈ సమయంలో టెన్షన్ పడకుండా, ఎక్కడ కాటు వేసిందో, ఆ ప్రాంతానికి కొంతపైన భాగంలో ఒక బట్టతో గట్టిగా కట్టి, ప్రశాంతంగా, త్వరగా ఆసుపత్రికి వెళ్తే, ఆ విషానికి విరుగుడు మందు ఇస్తారు వైద్యులు. ఉదాహరణకు పాము చేతివేళ్ళ భాగంలో కాటేస్తే, మణికట్టు దగ్గర ఒక బట్టను గట్టిగా కట్టి, ఆవేశపడకుండా, భయానికి, టెన్షన్‌కు లోనుకాకుండా, త్వరగా వైద్యుడిని సంప్రదిస్తే సరిపోతుంది. ఇలా బట్ట కట్టడం వలన, రక్తప్రసరణ ఆ భగం నుంచి తగ్గిపోతుంది, ఫలితంగా విషం దెహమంతా వ్యాపించదు.

ఇంకొక విషయం ఏమిటంటే పాములు అదే పనిగా జనానికి హాని తలపెట్టాలని అనుకోవు. వాటి ప్రాణరక్షణ కోసం మాత్రమే అవి కాటు వేస్తాయి. మనం ఎలాగైతే, రోడ్డున వెళ్తామో, అలాగే అవి కూడా వెళ్తాయి. వాటి మానాన అవి ఎదో ఆహారం కోసం అన్వేషిస్తుంటాయి. అవి కనిపించగానే, అరిచి, హంగామా చేసేకంటే, మౌనంగా నిల్చుంటె, అది ఏ పొదల్లోకో వెల్ళిపోతుంది. ఇది పంటపోలాల సంగతి. ఇక నగరాల్లో జనావాసాల్లోకి వస్తే, పోని ఎవరైనా బుట్టలో పెట్టి వాటిని తీసుకువచ్చినా, వెంటనే స్నేక్‌సెల్ వారికి ఫోన్ చేయండి. మనం పూజించే సర్పజాతికి ఉపకారం చేయండి.

ఇక శాస్త్రం కూడా పాము కనిపించగానే ఆస్తిక మహర్షి శరణు వేడమని చెప్పింది. ఆస్తికమహర్షి సర్పజాతికి చేసిన మేలుకు కృతజ్ఞతగా ఆయన్ను శరణూ వేడగానే, పాములు వాటంతట అవే తప్పుకుంటాయి. దీని అర్ధం, మనం పాము ముందుకు కావలని వెళ్ళి నిల్చుని ఆస్తికుడిని తలుచుకోమని కాదు, పొరపాటున మన దారిలో పాము వస్తే / కనిపిస్తే, దాని నుంచి మనకు హాని కలుగకూడదని, ఆయన్ను శరణు వేడాలి. అప్పుడే పనిచేస్తుంది.

ఇక సర్పదోషాలున్నవారు భయపడవలసిన అవసరంలేదు. సర్పజాతికి హాని తలపెట్టకుండా ఉండడంతో పాటు "ఓం నమో మనసాయై" అని మానసాదేవి మంత్రాన్ని ప్రతి నిత్యం జపించడం వలన సర్పదోషాల ప్రభావం తగ్గుతుంది.

ప్రకృతిలో ఉన్న ప్రతి జీవిలోని దైవత్వాన్ని గుర్తుంచి పూజించే సంస్కృతి మనది. ప్రతి జీవి జీవవైవిధ్యంలో ఎంతో విలువైనది. అన్ని జీవరాశులను కాపాడుకుందాం. పచ్చని ప్రకృతిని భావితరాలకు అందిద్దాం. ఈ భూమి మీద మనం ఎలా జీవిస్తున్నామో, అవి కూడా అలాగే జీవిస్తున్నాయి. మనం వాటి జోలికి వెళ్ళవద్దు, అవి మన జోలికి రావద్దని కోరుకుందాం.

No comments:

Post a Comment