Saturday 2 July 2016

హిందూ ధర్మం - 215 (యజ్ఞం ప్రాముఖ్యత - 2)



యజ్ఞం వలన పర్యావరణ శుద్ధి జరగడం, వర్షం కురవడం లౌకికమైన ప్రయోజనాలైతే, యజ్ఞాల ద్వారా దేవతలు సంతృప్తి చెంది మానవులకు వరాలివ్వడం, కోరికలు తీర్చడం కళ్ళకు కనిపించని, అనుభవంలో మాత్రమే తెలుసుకునే అలౌకిక ప్రయోజనం. యజ్ఞం యొక్క ప్రయోజనం ప్రకృతిని పరిపుష్టం చేయడం. భూలోకంలో అగ్నిముఖంగా చేసే యజ్ఞం అనేక భూమికల్లో అనేక విషయాలకు ప్రతీక. యజ్ఞం సమస్త బ్రహ్మాండాన్ని సూచిస్తుంది. పరబ్రహ్మం నుంచి ఉద్భవించిన ఈ సృష్టియే ఒక యజ్ఞం అని ఋగ్వేదంలోని పురుష సూక్తం స్పష్టం చేస్తోంది.

తస్మా”ద్విరాడ’జాయత | విరాజో అధి పూరు’షః |
స జాతో అత్య’రిచ్యత | పశ్చాద్-భూమిమథో’ పురః ||
యత్పురు’షేణ హవిషా” | దేవా యఙ్ఞమత’న్వత |
వసంతో అ’స్యాసీదాజ్యమ్” | గ్రీష్మ ఇధ్మశ్శరధ్ధవిః ||
సప్తాస్యా’సన్-పరిధయః’ | త్రిః సప్త సమిధః’ కృతాః |
దేవా యద్యఙ్ఞం త’న్వానాః | అబ’ధ్నన్-పురు’షం పశుమ్ ||

భావం - ఆ బ్రహ్మం నుంచి విరాట్ పురుషుడు ఆవిర్భవించాడు. ఆయన కూడా సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. ఆయనే సృష్టిగా, ప్రాణులుగా రూపుదాల్చాడు. అన్నిటికి ఆధారమైన ఆ పరతత్త్వం తెర అనుకుంటే, దాని మీద కదిలే బొమ్మలు ఈ విరాట్ పురుషుడు, ఆయన సృష్టి. ఆ బ్రహ్మాన్ని ఉద్దేశించి దేవతలు యజ్ఞం నిర్వహించదలచారు. అప్పుడు సృష్టి ఇంకా పూర్తి కాలేదు కనుక దేవతలు ఈ విరాట్ పుర్షుడినే ఆహుతి వస్తువుగా చేసుకుని యజ్ఞం ప్రారంభించారు (మనసులో ధ్యానించారు). అందులో వసంత ఋతువును ఆవునెయ్యిగా, గ్రీష్మ ఋతువు వంటచెరుకుగా, శరత్కాలం హవిస్సుగా అర్పించారు. పంచభూతాలు, పగలు, రాత్రి అనే 7 ఈ మహాయజ్ఞానికి సప్త పరిధులయ్యాయి. యజ్ఞ పరిధి అంటే యజ్ఞకుండం యొక్క సరిహద్దు రేఖ. దుష్టశక్తుల నుంచి యజ్ఞాన్ని రక్షించడం దీన్ని ఏర్పాటు చేస్తారు. దేవతలు యాగాన్ని ప్రారంభించి, విరాట్ పురుషుడిని యాగపశువుగా కట్టారు.... ఆ యజ్ఞం నుంచే దేవతలు, ఋషులు, సాధ్యులు, పశువులు, పక్షులు, మనుష్యులు, అందరూ ఉద్భవించారు.

ఇది ఋగ్వేదం చెప్తున్న మాట. ఈ యజ్ఞం ఒకనాడు జరిగి ఆగిపోయింది కాదు, ఇప్పటికీ జరుగుతూనే ఉంది. దాని ఫలాలను మానవులు అందుకుంటున్నారు. అందుకే ఋతువులు ఏర్పడుతున్నాయి, పంటలు పండుతున్నాయి, వాటి ద్వారా వచ్చిన ఆహారం మానవులకు శక్తినిస్తోంది. ఈ మహాయజ్ఞం ద్వారా జరిగిన మేలుకు కృతజ్ఞతగా ప్రతి మనిషి అగ్నిహోత్రంలో ప్రతి నిత్యం రెండు సంధ్యాకాలాల్లో రెండు ఆహుతులు వేయాలని ధర్మం చెప్తోంది. సృష్టి నుంచి మానవుడు ఫలాలు పొందే క్రమంలో ఈ సృష్టి కొంత కలుషితమవుతుంది, తన వనరులను, శక్తిని కొంతమేర కోల్పోతుంది. అందువల్ల ప్రకృతిని తిరిగి పోషించడం, పరిపుష్టం చేయడం మానవులు వ్యష్టి (Individual) గాను, సమిష్టి (Collective) గాను చేసే బాహ్య (సాగ్నికం) యజ్ఞం యొక్క లక్ష్యం. అప్రాచ్య అభివృద్ధి విధానాలనే (Western development models) సరైనవనుకున్న ఆధునిక మానవుడు ఈ సృష్టి అనే మహాయజ్ఞానికి తన వంతు సహాయం చేయక, ఆ యజ్ఞాన్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే ఋతువులు గాడి తప్పుతున్నాయి, భయంకర రోగాలు వ్యాపిస్తున్నాయి, స్వీకరించిన ఆహారం బలాన్నివ్వకపోగా, అనారోగ్యాన్ని కలిగిస్తోంది. అలా యజ్ఞాలను నాశనం చేసేవారిని రాక్షసులంటుంది ధర్మం. ఈ సృష్టి అనేది ధర్మంలో పవిత్రకార్యం. అధర్మాల్లో ఈ సృష్టికికి పవిత్రత ఆపాదించబడలేదు. సనాతన ధర్మావలంబకులందరూ యజ్ఞాన్ని గౌరవిస్తారు. అలాగే ప్రకృతిని కూడా గౌరవించి, దాన్ని కలుషితం చేయక, పవిత్రంగా, శుద్ధంగా ఉంచడం ఈ ధర్మాన్ని ఆచరించే ప్రతి ఒక్కరి కనీస 'ధర్మం'. ఈ విశ్వమే ఒక మహాయజ్ఞం, దీనికి ఏ మాత్రం కీడు కలిగించకూడదు అనేది 'వైదిక పర్యావరణవాదం' (Vedic Environmentalism)లో ఈ ముఖ్యసూత్రం.

అందువలన ఈ భూమి మీద యజ్ఞకుండం పెట్టి మానవులు నిర్వహించే యజ్ఞం సమస్త సృష్టికి, దాని క్రమానికి సూచికగా నిలుస్తోంది. అలాగే భోజన సమయంలో ఎన్నో నియమాలను పాటించడం ధర్మంలో చెప్పబడింది. కూర్చుని భోజనం చేయడం, భోజనానికి ముందు కాళ్ళు, చేతులు శుభ్రపరుచుకోవడం, శుచిగా అన్నం వండడం, మౌనంగా భుజించడం, మొదట ఔపోసన పట్టి, నెయ్యి కలిపిన 5 మెతుకులను పంటికి తగలకుండా, ఓం ప్రాణయ స్వాహా, ఓం అపానయ స్వాహా, .......... అంటూ విడివిడిగా 5 సార్లు కడుపులో ఉన్న జఠరాగ్నికి (వైశ్వనరాగ్నికి) ఆహుతివ్వడం, భోజనం మధ్యలో లేవకపోవడం, ఇదంతా పిండాండంలో, వ్యక్తి దేహంలో జరిగే యజ్ఞం. బాహ్యంలో జరిగే యజ్ఞానికి ఇది ప్రతీక (Symbolic representation).

భోజనం దేహానికి బలాన్నిస్తే, యజ్ఞం దేవతలకు శక్తినిస్తుంది. భగవంతునిచే నిర్వహించబడుతున్న సృష్టి అనే యజ్ఞం దేవతలు మొదలు సర్వజీవులు తమ పాపపుణ్యాలను అనుభవించడానికి, ధర్మాన్ని ఆచరించి, మోక్షం పొందడానికి తగిన ఉపాధులను (శరీరాలను) ఇస్తోంది. ఇలా యజ్ఞం అనే ప్రక్రియ బ్రహ్మాండం, అండాండం, పిండాండాల్లో అంతటా వ్యాపించి, వేర్వేరు స్థాయుల్లో వివిధ రకాలుగా జరుగుతోంది. అంతటా వ్యాపించి ఉన్న బ్రహ్మమే ఈ యజ్ఞము, యజ్ఞ కర్త, భోక్త ............ అన్నీను. బ్రహ్మము యజ్ఞము అభిన్నము, అంటే రెండూ వేరు కాదు. అందుకే 'యజ్ఞోవై విష్ణుః' అని యజుర్వేదం కీర్తిస్తోంది.  

To be continued ..........

No comments:

Post a Comment