Thursday 21 July 2016

ఆధ్యాత్మికతవేత్త అని ఎవరిని అనాలి?

ఆధ్యాత్మికతవేత్త అని ఎవరిని అనాలి?

ఈ మధ్య బంగ్లాదేశ్‌లో ఇస్లామిక్ తీవ్రవాదం పంజా విసిరిన తర్వాత, ఆ దుశ్చర్యలో పాల్గొన్న ఉగ్రవాదుల్లో కొందరు ఇస్లాం ప్రవచనకారుడు జాకీర్ నాయిక్ వలన ప్రభావితమయ్యారని, ఉగ్రసాహిత్యాన్ని చెప్తున్న అతనిపై కూడా చర్యలు తీసుకోవాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం భారత ప్రభుత్వాన్ని కోరింది. భారత ప్రభుత్వం అతనిపై విచారణ జరిపి తగు చర్యలు చేపట్టాలని భావిస్తోంది. ముస్లింలంతా తీవ్రవాదులుగా మారాలని చెప్పిన జాకీర్ నాయిక్ అన్యమతాలను తన ప్రవచనాల్లో వక్రీకరించి మతమార్పిడులకు బీజం వేస్తున్నాడు. ఇదంతా పత్రికల్లో చదివాము, వార్తల్లో చూశాము. అయితే ఈ సందర్భంలో మీడియా జాకిర్ నాయిక్‌ను ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అని సంబోధించింది. అసలు ఆధ్యాత్మికవేత్త అని ఎవరిని అనాలి?

ముందు మనం గుర్తించవలసింది, మనకు కావల్సింది పరస్పర గౌరవం. మన ధర్మాన్ని ఏ మతం గౌరవిస్తుందో, మనం ఆ మతాన్ని గౌరవించాలి. గౌరవం పొందాలనుకునేవారు ఇతరులను గౌరవించాలి. సహనం అనేది పాతమాట. సహనం పేరుతో ఎదుటివాడి ఎన్ని దురాగతాలు చేసినా భరించాలనే స్థాయికి మనల్ని దిగజార్చారు.

ఆయా మతాలను గౌరవిస్తూనే వారి మనకూ బేధం తెలుసుకుందాం. అప్పుడు ఈ మాట ఎవరికి వాడవచ్చో అర్దమవుతుంది. అధ్యాత్మ / ఆధ్యాత్మ - అనగా తన యందే (On oneself) అని అర్దం. సర్వవ్యాపి, సర్వశక్తిమంతుడైన భగవంతుడిని తన (ఆత్మ) యందే దర్శించడం ఆధ్యాత్మ విద్య. ఆ విధమైన జీవినమే ఆధ్యాత్మికత. సర్వజీవులలో ఆత్మ ఉంటుందని, మనకు కలిగే బాధ, వాటికి కలిగే బాధ ఒకటేనని, అందువల్ల సర్వజీవులను తనవలే భావించినవాడు మాత్రమే ముక్తికి అర్హుడని సనాతనధర్మం చెప్తోంది. సనాతన ధర్మంలో ఆత్మ శుద్ధమైనది, పాపరహితమైనది, పవిత్రమైనది. జీవుడు తాను పాపరహితుడని, తనలో దైవం ఉన్నదని, తాను కూడా దైవాంశేనని తెలుసుకునే క్రమమే ఆధ్యాత్మికత. ఇక్కడ మధ్యవర్తుల పాత్ర ఏమాత్రం ఉండదు, చరిత్రలో జరిగిన ఒక చారిత్రిక సంఘటనను నమ్మాలసిన అవసరంలేదు. గురువు ఉన్నా, అతను మార్గదర్శియే కానీ, విచారించి తెలుసుకోవాల్సింది మాత్రం సాధకుడే.  ఆ సాధన కోసం వచ్చినవే భక్తి, జ్ఞాన, కర్మయోగాలు, ధ్యానం, ప్రాణాయామం మొదలైన పద్ధతులు. ఇందులో పునర్జన్మ - కర్మ సిద్ధాంతం ఎంతో ముఖ్యంగా కనిపిస్తుంది.

అబ్రహామిక్ మతాల్లోకి వెళ్తే, అక్కడ ఉండేది సోల్ (Soul). సోల్ #ఆత్మ కాదు. ఎందుకంటే సోల్ శుద్ధమైనది, పవిత్రమైనది, దైవాంశ అని ఆ మతగ్రంధాలు ఒప్పుకోవు. ఈ సోల్ మళ్ళీ అన్ని జీవులలో ఉండడు. అది కేవలం మానవులకే పరిమితం. 18 వ శత్బాదం ముందువరకైతే సోల్ అనేది కేవలం రాజులోనే ఉంటుందని, మాములు వ్యక్తులలో, అందునా తక్కువ స్థాయి వారిలో ఉండదని నమ్మేవారు. స్త్రీలలో అసలే ఉండదని కూడా వారి నమ్మకం. అది కేవలం పురుషులకే పరిమితమైనది. సనాతనధర్మం యొక్క స్పర్శ తర్వాత ఆయా దేశాల్లో ఈ వాదం క్రమంగా తగ్గి, ఇప్పుడు కేవలం మనుష్యులకు మాత్రమే సోల్ ఉంటుందని చెప్తున్నారు. సర్వజీవులను తన వలే భావించిన వాడికి సాల్వేషన్ (Salvation) (సాల్వేషన్ మోక్షం ఒకటి కాదు) అని ఇందులో చెప్పబడలేదు. ఈ మతాల్లో సాల్వేషన్ కావాలంటే ఖచ్ఛితంగా కాలంలో ఒకానొక సమయంలో జరిగిన చారిత్రిక సంఘటనను (historical event) నమ్మాలి, ప్రవక్త ద్వారానే వస్తుందని విశ్వసించాలి. వ్యక్తి అంతర్ముఖమై తన సోల్ ను సాక్షాత్కారించుకునే అవకాశం లేదు. కేవలం గాడ్ ని నమ్మడం వల్లనే సాల్వేషన్. భక్తి, జ్ఞాన, కర్మయోగం, ధ్యానం వంటి పద్ధతులు లేవు. అసలు అంతర్ముఖమవ్వడం అనేదే లేదు. సోల్ దైవాంశ అని నమ్మడం ఇస్లాంలో పెద్ద దైవనింద. గాడ్ కి ఏ ఇతర వస్తువుతోనైనా సంబంధం పెడితే, శాశ్వత నరకంలో పడతారు. వారికి సాల్వేషన్‌కు అవకాశం ప్రవక్త జన్మించడం వలననే ఏర్పడింది.

మనలాగా తమ యందు మనోబుద్ధులను, ఇంద్రియాలను నిగ్రహించుకుని, చిత్తాన్ని శుద్ధి చేసుకుని, సాధనతో ముక్తిని పొందే మార్గాలు అవి చెప్పవు. కనుక వాటిని బోధించేవారిని ఆధ్యాత్మికవేత్త అనకూడదు. అత్మస్పర్శ ఉండి, పునర్జన్మ, కర్మ మొదలైన సనాతనధర్మానికి చెందిన సిద్ధాంతాల గురించి చెప్పేవారిని మాత్రమే ఆధ్యాత్మికవేత్తలనడం సరైన పద్ధతి. అదేకాక ఇలా ఆయా మతాల ప్రవచనకారులను ఆధ్యాత్మికవేత్తలనడం ఆ మతగ్రంధాలను అవమానించడమే అవుతుంది. వాళ్ళతో మనల్ని సమానం చేసి, మనల్ని అవమానించినట్లు కూడా అవుతుంది. కాబట్టి వారి వారి గ్రంధాలను అనుసరించి ఏమనాలో అదే అంటే బాగుంటుంది.

రాజీవ్ మల్హోత్రా గారి రచనల ప్రేరణతో

No comments:

Post a Comment