Sunday 2 October 2016

శైలపుత్రీ అమ్మవారు వైశిష్ట్యం

శైలపుత్రీ అమ్మవారు వైశిష్ట్యం

వందే వాఞ్ఛితలాభాయ చంద్రార్ధకృతశేఖరాం|
వృషారూఢాం శూలధరాం శైలపుత్రీ యశస్వినీమ్ ||


దుర్గాదేవి ప్రథమ స్వరూపంలో ‘శైలపుత్రీ’ నామంతో ప్రసిద్ధి చెందింది. పర్వత రాజైన హిమవంతుని సదనంలో పుత్రిక రూపంలో ప్రభవించడం వల్ల ఈమెను శైలపుత్రికగా వ్యవహరించారు. వృషభారూఢురాలైన ఈమె దక్షిణ హస్తంలో త్రిశూలం, వామహస్తంలో పద్మమూ శోభిల్లుతున్నాయి. నవదుర్గలలో ప్రథమ దుర్గ ఈమెయే. పూర్వజన్మలో ఈమె దక్షప్రజాపతి పుత్రికగా అవతరించింది. ఆ కాలంలో సతి నామంతో పిలువబడింది. శంకర భగవానుడితో ఆమెకు వివాహమైంది. ఒకానొక సమయంలో దక్షప్రజాపతి ఓ మహాయాగం చేశఋడు. తమ తమ యాగాదులను స్వీకరించవలసిందిగా అతడు దేవతలందరినీ ఆ మహాయాగానికి ఆహ్వానించాడు.

కానీ శంకరుడిని మాత్రం ఆ యాగానికి ఆహ్వానించలేదు. తన తండ్రి ఓ మహాయాగాన్ని నిర్వహిస్తున్నాడన్న వార్తను ఆలకించిన సతీదేవి మనస్సు యాగానికి వెళ్ళాలని మథనపడసాగింది. తన అభీష్టాన్ని ఆమె మహాదేవుడికి విన్నవించుకుంది. సర్వవిషయములు తెలిసిన శంకరభగవానుడు సతీ నీ తండ్రి ఏ కారణం వల్లనో మనయందు కృద్ధుడై ఉన్నాడు. తన యాగానికి దేవతలందరినీ ఆహ్వానించి వారి యాగభాగాలను వారికి సమర్పించాడు. తెలిసియే మనలను పిలువలేదు. కనీసం ఎట్టి సూచన కూడా చేయలేదు. ఇట్టి దశలో ఎంతమాత్రం నువ్వు అక్కడకు వెళ్ళడం భావ్యం కాదు అని అన్నాడు. శంకరుడి పలుకులు సతీదేవికి నచ్చలేదు.

తండ్రి యాగాన్ని చూడాలనీ, సోదరీమణులను చూసి సంభాషించాలని ఆమె తొందరపడసాగింది. ఆమె స్థితిని గమనించిన మహాదేవ భగవానుడు పుట్టింటికి వెళ్ళేందుకు ఆమెకు అనుమతి ప్రసాదించాడు. పితృగృహం చేరిన సతీదేవితో బంధుబాంధవులెవరూ మాట్లాడలేదు. కేవలం ఆమె తల్లి మాత్రం ప్రేమగా కౌగిలించుకుంది. అందరికందరూ ఎడమొగంగా పెడమొగంగా ఉండిపోయారు. అక్కచెళ్ళెళ్ళ ముఖంలో వ్యంగ్యం, పరిహాసం కనిపించాయి. పరిజనుల ఆ వ్యవహారానికి సతీదేవి మనస్సు తీవ్రంగా గాయపడింది. అంతే కాదు, అక్కడ సర్వేసర్వత్రా శంకర భగవానుడి పట్ల తిరస్కార భావాలు గోచరించాయి. దక్షుడు కృద్ధుడై ఆమె పట్ల అవమానజనకంగా ప్రవర్తించి అదోరకంగా భాషించాడు.

అదంతా చూసిన సతీదేవి హృదయం క్షోభతో, గ్లానితో క్రోధసంతప్తమై పోయింది. పతిదేవుని పలుకులను వినక తాను అక్కడకు రావడం పొరపాటేనని గ్రహించింది. మహాదేవునకు అక్కడ జరుగుతున్న అవమానాన్ని చూసి ఆమె సహించలేకపోయింది. తన దేహాన్ని యాగాగ్నిలో భస్మం చేసేసుకుంది. పిడుగు వంటి ఆ విషాద వార్తను వింటూనే కృద్ధుడైన శంకర భగవానుడు తన గణాలను పంపి దక్షుడి యాగాన్ని సంపూర్ణంగా ధ్వంసం చేయించాడు. యాగాగ్నిలో దేహాన్ని దగ్ధం చేసుకున్న సతీదేవి ఉత్తర జన్మలో పర్వతరాజైన హిమవంతునికి పుత్రికగా ప్రభవించింది.

ఆమెనే శైలపుత్రిక నామంతో ప్రఖ్యాతి చెందింది. పార్వతి, హైమావతి కూడా ఆమె నామాలే. ఉపనిషత్‌ కథానుసారం ఆమెయే హైమవతీ స్వరూపంలో దేవతలందరి గర్వాన్ని అణిచివేసింది. శైలపుత్రి వివాహం పరమేశ్వరుడితో జరిగింది. పూర్వజన్మలో వలెనే ఆమె ఈ జన్మలో కూడా శంకర అర్ధాంగి గానే విశేష ఖ్యాతి పొందింది. నవదుర్గలలో ప్రథమురాలైన శైలపుత్రి దుర్గ యొక్క మహత్వశక్తులు అనంతాలు. నవరాత్రి పూజలలో మొదటి రోజు ఈ శైలపుత్రీ పూజోపాసనలు కొనసాగుతుంటాయి. ఈ ప్రథమ దివసోపాసనలో యోగి తన మనస్సును మూలాధార చక్రంలో నిలిపి ఉంచుతాడు. ఇక్కడి నుండియే అదని యోగసాధన ప్రారంభమవుతుంది.

Source: http://www.suryaa.com/features/article.asp?subCategory=3&ContentId=49658

No comments:

Post a Comment