Sunday 2 October 2016

హిందూ ధర్మం - 226 (జ్యోతిష్యం - 8)

కాలగణనలో భాగంగా ఋషులు మొత్తం 27 నక్షత్రాల గురించి చెప్పారు. నక్షత్రం అనే పదమే ఒక నిర్వచనం. మహాభారతం ప్రకారం నక్షత్రం అనగా కదలనిది అని నిర్వచనం ఉంది. ఒకే నక్షత్రంలో అనేక తారలు (stars) ఉండచ్చు, మండలాలు (constellations) కూడా ఉండచ్చు. ఉదాహరణకు కృత్తికా నక్షత్రంలో 6 తారలు ఉంటాయి, రోహిణి నక్షత్రంలో ఎద్దు తల ఆకారాన్ని సూచించే 5 తారాలు ఉంటాయి, మృగశిరా నక్షత్రం జింక తల ఆకారాన్ని సూచించే 3 తారల సమూహం. ఆ సమూహంలో ఉండే తారల్లో భ్రమణం ఉండచ్చు కానీ నక్షత్రాలు (మండలం) స్థిరంగా ఉంటాయి. అందువల్ల కాలగణనకు వాటిని ప్రాతిపదికగా తీసుకుంది వైదిక సంస్కృతి. ఒక్కో నక్షత్ర పరిధిని అంతరిక్షంలో 13 డిగ్రీల 20 నిమిషాలు ఉంటుంది. భూ భ్రమణం, సూర్యుని చుట్టు తిరిగే సమయంలో, చంద్రుడి కదలికలను ఆధారంగా చేసుకుని, చంద్రుడు ఆ నక్షత్ర మండలానికి దగ్గరగా జరుగుతున్నాడో చూసి, ఆ మాసానికి ఆ నక్షత్రం పేరు నిర్ణయించారు ఋషులు. అశ్విని నక్షత్రంలో పూర్ణిమ తిధిలో చంద్రుడు ఉదయించిన మాసానికి ఆశ్వీయుజ మాసమని, కృత్తికా నక్షత్రంలో పూర్ణిమ నాటి చంద్రోదయం అయిన మాసానికి కార్తీక మాసం అని, మృగశిరా నక్షత్రంలో పూర్ణిమ నాటి చంద్రోదయం అయిన మాసానికి మార్గశిర మాసమని పేరు. అలా ఒక్కో మాసానికి ఆ పేరు రావడనికి వెనుక ఆ నక్షత్రం ఉంటుంది. అలాగే ఈ నక్షత్ర మండలాలన్నిటిని ఒక సమూహంగా చూసినప్పుడు రాశులు ఏర్పరిచారు. 360 డిగ్రీల అంతరిక్షంలో ఒక్కో రాశి పరిధి 30 డిగ్రీలు. ఈ రాశులని, నక్షత్రాలని మాములు కంటితో కూడా చూడవచ్చు. కానీ కాలుష్యం కారణంగా నగరాల్లో ప్రజలకు అలాంటి అవకాశం లేదు. అంతరిక్షం, జ్యోతిష్యం మీద కొద్దిగా అవగాహన ఉంటే, మిరుముట్లు గొలిపే కాంతికి దూరంగా ఉండే ప్రదేశాల నుంచి వీటిని చూడవచ్చు. ఇక సంక్రమణం పేరుతో మనకు 12 సంక్రాంతులు ఉన్నాయి. సూర్యుడు ఒక్కో రాశిలో ప్రవేశంతో ఒక్కో సంక్రమణం వస్తుంది. సూర్యుడు ప్రవేశించడమేంటి అనే అనుమానం వస్తుంది. భూభ్రమణంలో కలిగే మార్పులను అనుసరించి, భూమి యొక్క అక్షాంశ, రేఖాంశలను బట్టి, భూమికి సూర్యునికి మధ్య ఉన్న దూరాన్ని అనుసరించి ఈ నిర్ణయం జరుగుతుంది. మనం భూమిపై నుంచి గమనిస్తాం కనుక, సూర్యుడు ప్రవేశించాడంటున్నాం. మనకు తెలిసి, అందరం పండుగగా జరుపుకునేది మకర సంక్రమణం. అదే మకర సంక్రాంతి. ఇలా సూర్యుని ఒక్కో రాశిలో ప్రవేశంతో 12 రాశులకుగానూ మనకు 12 నెలలు ఉన్నాయి.

360 డిగ్రీల చంద్రుని భ్రమణంలో ప్రతి 12 డిగ్రీల కదలికను ఒక తిధిగా పరిగణించింది జ్యోతిష్యం. శుక్లపక్ష, కృష్ణపక్ష తిధులతో కలిపి మొత్తం మనకు 30 తిధులు ఉన్నాయి. భూమి సూర్యుని చుట్టు తిరిగడానికి 365 రోజుల 6 గంటల .... సమయం పడుతుంది. కానీ చంద్రుడు భూమి చుట్టు ఒక సారి తిరగడానికి 27 రోజులే పడుతుంది. అనగా 12 నెలలకు గానూ 354 రోజులలో చంద్రుడు భూమి చుట్టూ తిరగడాన్ని పూర్తి చేస్తాడు. అంటే ఒక ఏడాదిలో సుమారు 11 రోజుల వ్యత్యాసం కనిపిస్తోంది. ఈ వ్వత్యాసం వల్ల భూమి సూర్యుని చుట్టు 19 సార్లు తిరిగితే చంద్రుడు 235 సార్లు తిరుగుతున్నాడు. దాని వలన 19 సంవత్సరాలకు..... ఏడాదికి 12 మాసాల చొప్పున 238 మాసాలు రావలసి వుండగా 235 మాత్రమే వస్తున్నాయి. అనగా చంద్రుడు 7 నెలలు అధికంగా తిరుగుతున్నాడని అర్థం. ఆ లెక్కను సరి చేయడానికి, రెండు గణనల మధ్య సమన్వయాన్ని ఏర్పరచడానికి, ప్రతి ముప్పై రెండున్నర సౌరమాసాలకు ఒక చంద్రమాసం అధికంగా వస్తుంది. ఇలా మొట్టమొదట ఏర్పరించిన వారు వారు భారతీయఋషులు మాత్రమే. ఒక్కో రాశిలో ఒక నెలపాటు తిరగాల్సిన సూర్యుడు...... ఈ అధిక మాసంలో రెండు నెలల పాటు ఒకే రాశిలో ఉంటాడు. ఇందులో మొదటి నెలలో రవి సంక్రాంతి వుండదు. అప్పుడు దాన్నే అధిక మాసం అంటారు.

To be continued ............

No comments:

Post a Comment