Wednesday 22 March 2017

రాజేంద్ర సింగ్‌ - 'వాటర్‌ మేన్‌ ఆఫ్‌ ఇండియా'

ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా ఏడారి ప్రాంతంలో నదులను జీవింపచేసిన గొప్ప వ్యక్తి గురించి తెలుసుకుందాం.

రాజేంద్ర సింగ్‌ - 'వాటర్‌ మేన్‌ ఆఫ్‌ ఇండియా'

నది ప్రాణాధారం. ఆ నదికే ప్రాణం పోస్తే? ఆవిరైపోయిన జల కళకు జీవాన్నిస్తే. ఒక్కడే ఏకంగా ఐదు నదులకు నీటిదానం చేస్తే ఏమనాలి? కనుమరుగైపోతోన్న జీవజలాన్ని పునరుద్ధరిస్తున్న జల మాత ముద్దుల బిడ్డ రాజేంద్ర సింగ్‌ను 'వాటర్‌ మేన్‌ ఆఫ్‌ ఇండియా' అని పిలుస్తున్నారు. జబ్బు పడిన ఎడారి జలాలకు వైద్యం చేస్తున్నాడీ ఆయుర్వేద వైద్యుడు.

              రాజస్తాన్‌లో చుక్క నీరు కూడా అమృతంతో సమానమే. ఎడారంతా జల్లెడ పడితే ఎక్కడో చిన్న చిన్న జలాశయాలు కనిపిస్తాయి. మైళ్లకు మైళ్లు కాలినడకన నీటి బిందెల్ని మోయడమే అన్నింటి కన్నా ముఖ్యమైన విషయం అక్కడ. అలాంటి ప్రాంతంలో అమృత ధారలుగా పేరొందిన నదులు కాస్త అంతరించిపోతుంటే రాజేందర్‌ సింగ్‌ ప్రాణమే పోతున్నట్టు వ్యాకులచెందారు. ఆ నదీమ తల్లులను కాపాడుకోవాలని పరితపించారు. రాజేందర్‌ సింగ్‌ ఓ ఆయుర్వేద వైద్యుడు. కానీ, వ్యవసాయం పైనే ఆసక్తంతా. 1985లో వైద్య పట్టా చేతికందగానే ఆల్వార్‌ జిల్లాకు తిరిగొచ్చేసి తన ప్రాంతంలో వైద్యంతో పాటు వ్యవసాయం చేద్దామని ఉత్సాహంగా వచ్చారు. అంతకు ముందు తనకు ఇష్టమైన నది పాయ అదృశ్యమై, ఆ ప్రాంతం సగం ఖాళీ అయి కనిపించే సరికి విస్తుపోయారు. సరైన సంరక్షణ చర్యలు లేక నదీ పాయలు ఆవిరైపోయాయని అర్థం చేసుకున్న ఆయన తాను ముందు వైద్యం చేయాల్సింది నదీ ప్రాంతానికి అని గ్రహించారు. తన ఒక్కడి వల్ల అది అవుతుందా అనేది ఆలోచించకుండా వెంటనే రంగంలోకి దిగారు.

ప్రాచీన భారతీయ విజ్ఞానానికి చెందిన భూ, జల, పర్యావరణ సూత్రాలకు అనుగుణంగా 'జోహాద్‌' శైలిలో వాన నీటి జలాశయాల్ని తవ్వడం ప్రారంభించాడు. నదుల్లోకి చేరే వాగులున్న చోట వాటి నిర్మాణం చేపట్టాడు. అందుబాటులో ఉన్న మట్టి, రాళ్లు, కాంక్రీట్‌ వంటి వస్తువులతోనే వాటిని పూర్తి చేశాడు. వీటి వల్ల భూగర్భ జలాల మట్టంతోపాటు జలాశయాల మట్టం పెరుగుతుందనేది ఆయన అంచనా. వాగుల వేగాన్ని తగ్గించేందుకు చెక్‌ డ్యామ్‌లను ఏర్పాటు చేసి నీరు ఇంకేలా నీటి పారుదల వ్యవస్థను రూపొందించారు. రెండేళ్ల పాటు అవిశ్రాంతంగా కృషి చేసినా అనుకున్న ఫలితం అందలేదు. స్థానికుల ఆయన ప్రయత్నాన్ని పరిహసించినా వెనుకడుగు వేయలేదు. మరింత శ్రమించి జోహాద్‌ల సంఖ్య పెంచుకుంటూ పోయాడు. ఆయన ప్రయత్నం వెనుక ఉన్న సదాశయం గ్రామస్తులను కదిలించి వారూ చేయి కలిపారు. జోహాద్‌ల సంఖ్య పెరిగే కొద్దీ ఫలితం మెరుగవుతూ వచ్చింది. ఎప్పుడో 1940లోనే అంతరించిపోయిందనుకున్న ఆర్వారి నది తన ప్రస్థానాన్ని మళ్లీ ప్రారంభించింది. మరో నాలుగు నదులు తిరిగి ప్రాణం పోసుకున్నాయి. 1000 ఎకరాల ప్రాంతంలో మళ్లీ పచ్చదనం చిగురించింది. జలాశయాలు కళకళలాడాయి. మట్టికి నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం పెరిగింది. వాన నీటి వృథా తగ్గిపోయింది. తాగునీటి బావులు, జలాశయాలు జీవం పోసుకున్నాయి. 20 అడుగుల మేర భూగర్భ జల నీటి మట్టం పెరిగింది. అటవీ ప్రాంతం 33 శాతానికి పైగా విస్తరించింది. వలస పోయిన వారు తిరిగి గ్రామాలకు చేరుకున్నారు. వ్యవసాయం సాధ్యమైంది.
తన ప్రయత్నం వల్ల ఏకంగా నదులే జీవాన్ని సంతరించుకుంటాయని ఊహించని రాజేంద్ర సింగ్‌కు ఇది పెద్ద బహుమతి అయ్యింది. ఇంకా తన పథకాలు విస్తరించుకుంటూ ఎన్నో గ్రామాలకు తీరుతెన్నుల్ని మార్చారు. అలా ఇప్పటివరకు 11 రాష్ట్రాల్లోని 850 గ్రామాల్లో 4500 జోహాద్‌లను నిర్మించారు. నదీ సభలను ఏర్పాటుచేసి గ్రామస్తులు స్వతహాగా నీటిని సంరక్షించుకునేలా ప్రోత్సహిస్తున్నారు. రాష్ట్రంలోని జల సంరక్షణకు అడ్డు తగులుతున్న 470 గనుల్ని మూసివేయాల్సిందిగా ప్రభుత్వాన్ని ఒప్పించాడు. దీనిపై అక్కసు పెంచుకున్న గని యజమానులు ఆయనపై దాడులు చేయించారు. ప్రజల అండతో ఆయన తన ప్రయత్నాన్ని విరమించుకోలేదు. రాజేంద్ర సింగ్‌ రాజస్థాన్‌లో ఓ హీరో అని అనడం కన్నా వారికి, వారి ప్రాణ సమమైన జల వ్యవస్థకు ఆయువునిచ్చిన జల వైద్యుడు అని చెప్పుకోవచ్చు.

Source: Praja Sakti Newspaper- Saturday,June 27,2015

1 comment:

  1. చాల కష్టమైన ప్రయత్నం చేసి సఫలీకృతులైన రాజేంద్ర సింగుగారికి అభినందనలు. ఇలాంటి వారు మనదేశానికి ఇంకా చాలామంది కావాలి.

    ReplyDelete