Saturday 11 November 2017

శివయోగసాధన - పరిక్రమ ప్రయోజనాలు - స్వామి శివానంద

పరిక్రమ అంటే ఒక పవిత్ర ప్రదేశం చుట్టూ ప్రదక్షిణ చేయటం. అది ఒక పర్వతశిఖరం, ఒక పుణ్యతీర్థం, యాత్రాస్థలం లేదా సంప్రదాయం ప్రకారం పవిత్రంగా భావించే ఒక పెద్ద ప్రదేశమైనా కావచ్చు. ఇలా ప్రదక్షిణ చేయడం అనేది సాధరణంగా ఏ సమయంలోనైనా చేయవచ్చు, మరియు ముఖ్యంగా సంవత్సరంలోని ప్రత్యేక రోజుల్లో భక్తులు గుంపుగా చేస్తారు.

చిన్న స్థాయిలో, తక్కువ స్థలంలో, ఆలయంలో ప్రతిష్టించిన మూర్తి చుట్టూ గానీ, లేదా పవిత్ర తులసి మొక్క లేదా రావి చెట్టు చుట్టూ చేసేదాన్ని సాధరణంగా ప్రదక్షిణం అంటారు. పరిక్రమ అంటే కూడా నిస్సందేహంగా ప్రదక్షిణమే, కానీ లోకరీతిలో, అది పెద్ద స్థలానికి చేసే ప్రదక్షిణం.

ఎన్నో కష్టమైన పరిక్రమలు వాడుకలో ఉన్నాయి. అధిక శారీరిక శ్రమ మరియు కష్టంతో కూడిన అనేక విధానాలను పరిక్రమతో కలుపుతారు. కొందరు మార్గమంతా పొర్లుదండాలు పెడతారు. కొందరేమో నెమ్మదిగా ప్రతి మూడు లేదా పది అడుగులకు వంగి నమస్కారం చేస్తూ కొనసాగిస్తారు. కొందరు ప్రతి అడుగును లెక్కపెట్టుకుంటూ, నెమ్మదిగా నడుచుకుంటూ మొత్తం దూరం నడుస్తారు; మరికొందరు తమ చుట్టూ తామే తిరుగుతూ, ఆత్మ ప్రదక్షిణంగా వెళతారు. ప్రత్యేక సాధనల్లో లేదా మొక్కుకున్నప్పుడు, లేదా స్వతస్సిద్ధంగా అప్పటికప్పుడు ఏర్పడిన భావనను అనుసరించి ఈ కష్టమైన విధులను భక్తులు ఆచరిస్తారు. మీ మానసిక భావన మరియు ఉద్దేశం మీకు అత్యధిక, ఉన్నతమైన ఆధ్యాత్మిక లక్ష్యాన్ని ప్రసాదిస్తుంది.

చలించని యాత్రికులు మంచుతో కప్పబడిన హిమాలయాల్లో కైలాస పర్వతానికి లేదా మానససరోవరానికి సైతం కష్టమైన పరిక్రమను చేస్తారు. ఇతర యాత్రికులు మొత్తం ఉత్తారాఖండ్ ను చుట్టి వస్తారు, చార్-ధాం ను చుట్టి వచ్చిన తర్వాత కేదార్-బధ్రీ యాత్రలో భాగంగా ఒక దారిలో వెళ్ళి వేరే దారిలో వస్తారు.

దక్షిణాన, విశ్వాసముగల భక్తులు తిరువణ్ణామలై (అరుణాచలం) లో ఉన్న పవిత్ర పర్వతానికి ప్రదక్షిణం చేస్తారు. రామ భక్తులు మరియు కృష్ణ ప్రేమికులు చిత్రకూట పర్వతం, అయోధ్య, వ్రజ, బృందావనం, గోవర్ధనగిరి మరియు బధ్రీనాథ్ చుట్టూ ప్రదక్షిణం చేస్తారు. 

పరిక్రమ యొక్క లోతైన ప్రాముఖ్యం ఏమిటంటే భక్తుడు అక్కడి బాహ్యమైన తీర్థం లేదా పర్వతాన్ని చూడడు, కానీ అక్కడ ప్రత్యక్షమై, కొలువై ఉన్న ఆధ్యాత్మిక శక్తిని చూస్తాడు. భగవద్గీతలోని పదవ అధ్యాయం ద్వారా, అలాంటి ప్రత్యేకస్థలాల్లో దైవత్వం ఎంతగా ఉందో మీకు అర్ధమవుతుంది. శ్రద్ధతో కూడిన విశ్వాసం మరియు ఆరాధన ద్వారా, పవిత్ర స్థలంలోని ఆధ్యాత్మిక స్పందనల మీలోనికి ప్రవేశించేందుకు మిమ్మల్ని మీరు గ్రహణశీలం చేసుకుంటారు. ఈ శక్తివంతమైన ఆధ్యాత్మిక తరంగాలు స్థూల, సూక్ష్మ మరియు అన్ని కోశాల్లోకి ప్రవేశించి చెడు వాసనలను, సంస్కారాలను నశింపజేస్తాయి. తమోగుణం మరియు రజోగుణం తగ్గుతాయి. కేంద్రీకృతమైన సత్త్వగుణం నిద్రాణమైన ఆధ్యాత్మిక వాసనలను జాగృఅతపరుస్తుంది. పరిక్రమ ద్వారా, ఆ ప్రదేశమంతా వ్యాపించి ఉన్న ఆధాయ్త్మిక వాతవరణాన్ని భక్తుడు బాగా స్వీకరించి, సత్త్వంతో తడిసిన ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వస్తాడు. ఇది పరిక్రమ చేయడంలోని నిజమైన ఆంతర్యము మరియు ప్రాముఖ్యత.

గొప్ప శుద్ధినిచ్చేది కనుక, అది ఒక విధమైన ఉన్నతమైన సంప్రదాయానికి చెందిన తపస్సుగా భక్తులకు ఆజ్ఞాపించబడింది. ఇది గొప్ప ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని మరియు పుణ్యాన్నిచ్చే కర్మ. భక్తుడు స్నానమాచరించి, శుభ్రమైన బట్టలు ధరించి, తిలకం లేదా పవిత్రభస్మం ధరించి, తులసి లేదా రుద్రాక్ష మాల వేసుకుని, భగవన్నామాన్ని పెదవులతో పలకడం మొదలుపెడతాడు. పరిక్రమ మార్గంలో, అక్కడ నివసించే సన్యాసులు మరియు సాధ్వుల విలువైన సత్సంగం మీకు లభిస్తుంది. పవిత్రనదుల్లో లేదా తటాకాలు, కుండాల్లో స్నానమాచరించడం వలన మీ పాపాలు నశిస్తాయి. ఆ మార్గంలో ఉన్న ఎన్నో పవిత్ర క్షేత్రాలు మరియు ఆలయాల సందర్శన ద్వారా మీరు ఉన్నతమైన స్థితిని పొందుతారు. ఎండ, వాన, చలి మొదలైన అసౌకర్యాలను తట్టుకోవడం ద్వారా మీలో ఓపిక మరియు సహనశీలత పెరుగుతుంది. మీ మనస్సు అన్ని ఆలోచనల నుంచి ముక్తి పొంది, దైవం యొక్క ఉనికి అనే ఆలోచనలో మీరు లీనమవుతారు. భక్తితో చేసిన పరిక్రమ అనే ఒక కర్మ త్రివిధమైన సాధనగా మీ దేహం, మనస్సు మరియు ఆత్మలను ఉద్ధరిస్తుంది. పవిత్ర ప్రదేశాలు మరియు ఆలయాల్లోని ఆధ్యాత్మిక ప్రతిస్పందనలను మీలోని సహజమన ఆసూరి వృత్తులను శుద్ధి చేసి, సత్త్వాన్ని, పవిత్రతను నింపుతాయి. మీరు సత్సంగానికి వెళ్ళాల్సిన పనిలేదు. మహాపురుషులే మీ వద్దకు వస్తారు. వారెప్పుడు నిజమైన మరియు నిజాయతీగల సాధకుల కోసం అన్వేషణలో ఉంటారు. అందుకే వారు పవిత్రస్థలాలైన బధ్రీ, కేదార్, కైలాసపర్వతం, హరిద్వార్, బృందావనం, మథుర మొదలైన క్షేత్రాల్లో కూడా ఉంటారు.

పరిక్రమలో పాల్గోనెవారు అదృష్టవంతులు, ఎందుకంటే వారు త్వరగా శాంతిని, పరమానందాన్ని, మోక్షాన్ని పొందుతారు! అయోధ్యకు అధిపతి అయిన శ్రీ రామునకు జయము! బృందావనంలో ప్రత్యేకంగా ఉండేవాడు, హృదయనివాసి అయిన శ్రీ కృష్ణునకు జయము! భక్తులకు జయము! వాళ్ళ ఆశీస్సులు మీపై ఉండుగాకా! 

- స్వామి శివానంద  

No comments:

Post a Comment