Friday 24 April 2020

మన సంస్కృతియే మనకు శ్రీ రామ రక్ష (8) - మైల - శుభ్రత



గత భాగంలో మరణం సంభవించినప్పుడు అక్కడ జరిగే జీవక్రియల గురించి తెలుసుకున్నాము కదా. ఇప్పుడు ఇంకొంత. (ఇంతకముందు మనం చెప్పుకున్నవన్నీ చదివితేనే దీన్ని అర్ధం చేసుకోగలరు). 

కుటుంబంలో మరణం సంభవించగానే ఆ కుటుంబసంభ్యులు మైల పడతారు. మరణ సమయంలో పట్టే మైలను మృతాశౌచం అంటారు. వాళ్ళు ఆ ఇంట్లో వస్తువులు ఏమీ ముట్టుకోరు. ఆ కుటుంబానికి బంధువులు కానివారిని పిలిచి, తమకు కావలసిన బట్టలు, ఇతర సామాన్లు తీసి పక్కన పెట్టమంటారు. వంటింట్లోకి వెళ్ళరు. శుద్ధి అయ్యేవరకు అందరికి దూరం పాటిస్తారు, ఎక్కడికీ వెళ్ళరు. ఈ రోజు మనం క్వారంటైన్ అంటున్నాం కదా, అలాంటిదే. 

శవం చుట్టూ క్రిములు ఉంటాయి, మనం జాగ్రత్త పడకుండా అన్నిటిని ముట్టుకుంటే అన్ని అపరిశుభ్రమవుతాయి. ఆ తర్వాత అన్నిటిని శుద్ధి చేయడం కష్టం. వంటిల్లు అంటేనే పరిశుభ్రంగా ఉండాలి, ఎందుకంటే ఏదైనా రోగం వస్తే ముందు అక్కడి నుంచే వ్యాపిస్తుంది. వంటిట్లో పప్పులు, ధాన్యాలను ఎలా శుభ్రం చేస్తాం ? ఈరోజు శానిటైజ్ (Sanitize) అంటున్నాం కదా. అది పప్పుదినుసుల మీద చేయడం అసాధ్యం. అందుకే మనం ముందు మూసేసేది వంటిల్లు. మరి వంట ఎలా? అందుకే మైల లేని వ్యక్తులను అప్పుడు వంటకు నియమిస్తారు. వారు మడి కట్టుకుని వంట చేసి వడ్డిస్తారు. మడి ఎందుకు అనేది ఇంతకముందు చెప్పుకున్నాము.

అదేకాక మరణం అనేది ఒక కుటుంబంలో చాలా విషాదాన్ని మిగుల్చుతుంది, ఒంటరి తనాన్ని, బాధను, కుంగుబాటును ఆ కుటుంబానికి కలిగిస్తుంది. ఇవన్నీ నకారాత్మక భావనలు. ఆలోచనలు అనేవి అంటువ్యాధి వంటివి. అవి ఫ్లూ కంటే త్వరగా వ్యాపిస్తాయని అంటారు స్వామి శివానంద సరస్వతీ. ధ్యానసాధన చేసేవారికి ఈ విషయం అనుభవమే. మామూలు వ్యక్తులైన సరే, గమనించండి. ఒక ప్రదేశం చాలామంది ఏడుస్తూ ఉంటే, మనకు తెలియకుండానే మనకు ఏడుపు వస్తుంది. అదే పదిమంది సంతోషంగా ఉండే వ్యక్తుల మధ్యలో ఉంటే మనకూ ఆనందం కలుగుతుంది. ఎవరి ఆరా బలంగా ఉంటే వారి ఆరా మిగితావారిని ప్రభావితం చేస్తుంది. మరి ఇలా మరణం వలన దుఃఖిస్తున్న వ్యక్తులు జనం మధ్యకు వెళితే, మిగితావారు కూడా ఏదో ఒక కుంగుబాటుకు గురవుతారు, వారి మీద కూడా ప్రభావం పడుతుంది. అదీగాక మరణం సంభవించిన ఇంట్లో నిత్యకర్మ కోసం రోజూ స్మశానానికి వెళ్ళి వస్తూ ఉంటారు. కనుక శుభ్రత కోసం మిగితావారితో కలవకుండా ఉండాలి. వంట చేసే సమయంలో ఇలా బాధపడుతూ చేస్తే, ఆహారం కూడా అదే భావనలతో నిండి త్వరగా బయటకు రాలేరు. అందుకే శౌచం ఉన్నవారు మడితో వండి పెడతారు. మైల అంటే ఒకరకంగా ఈ రోజు చెప్తున్న self-isolation, home-quarantine. మీకు ఎప్పుడైనా నెగటివ్ ఆలోచనలు కలిగినప్పుడు, బయటకు వెళ్ళి వాటిని అంటించకండి. మనస్సు మరలా మామూలు స్థితికి వచ్చేవరకు తలుపులన్నీ వేసుకుని ఇంట్లోనే కూర్చోండి అంటారు స్వామి వివేకానంద.

11 రోజులు పూర్తియై, కర్మలన్నీ పూర్తి చేశాక, అప్పుడు ఇంటిని గోమూత్రం మరియు పసుపునీటితో శుద్ధి చేస్తారు. గోమూత్రం మరియు పసుపు సూక్ష్మక్రిమి సంహారకాలు. అప్పుడు వారికి శౌచం వస్తుంది. 

స్త్రీ నెలసరి సమయంలో కూడా ఇవే అంశాలు కనిపిస్తాయి. అప్పుడు శరీరంలో జరిగే మార్పులతో పడే ఆమె మానసికవేదన ఎవరికి అర్ధమవుతుంది. అలాంటి సమయంలో ఆమె పనులు చేయడం ఆమెకు, ఆమె కుటుంబానికి ఎంతమాత్రం శ్రేయస్కరం కాదు. కనుక ఆమెకు ఆ నాలుగు రోజులు పూర్తిగా self-quarantine (స్వీయనిర్బంధం).  

ఇందులో మనకు ప్రధానంగా కనిపించేది పరిశుభ్రత, రెండవది మానసిక ఆరోగ్యంపై మన పూర్వీకులు పెట్టిన శ్రద్ధ.  

No comments:

Post a Comment