Friday 22 October 2021

శ్రీ హనుమద్భాగవతము (54)



ఆంజనేయుడు రామలక్ష్మణసహితుడై సుగ్రీవుని దగ్గరకు చేరింది. సుగ్రీవుడు పరమతేజస్వులైన ఆ కుమారులిరువురకు నమస్కరించాడు. హనుమానుడు సుగ్రీవుని శ్రీరామునకు పరిచయము చేసాడు. అనంతరం అతడు ప్రజ్వరిల్లునట్టి అగ్నిని సాక్షిగా ఉంచి ధర్మవత్సలుడైన శ్రీరామునకు సుగ్రీవునకు మిత్రత్వమును కూర్చాడు. భగవానుడగు శ్రీరాముడు, వానర రాజైన సుగ్రీవుడు ఇరువురు చాలా ప్రసన్నులయ్యారు. పిమ్మట ఆకులు పూలు ఎక్కువగా గల కొమ్మ నొకదానిని బఱచి దానిపై ఎంతో ఆదరముగా శ్రీరాముని కూర్చుండబెట్టి తాను కూడా ఆయనతో పాటు కూర్చున్నాడు. హనుమంతుడు పుష్పించిన మంచి గంధపుచెట్టు కొమ్మను ఒకదానిని విఱచి దానిపై లక్ష్మణుని కూర్చుండబెట్టాడు.


అధికసంతుష్టుడైన సుగ్రీవుడు మృదుమధురములైన వాక్కులతో తన కథను వినిపించుచు శ్రీరామచంద్రునితో - రఘునందనా ! ప్రాణప్రియమైన ' నా భార్యను హరించి వాలి క్రూరముగా నన్ను వెడలగొట్టినాడు. నేను వానికి భయపడి ఈ పర్వతముపై నివసించుచున్నాను. నాకు శరణు నిమ్ము.'నన్ను నిర్భయునిగా చెయ్యీ.


శ్రీరాముడిట్లు పలికాడు- 'మిత్రుడా! సుగ్రీవుడా! నేను వాలిని ఒకేఒక బాణముతో సంహరిస్తాను, విశ్వసించు. అమోఘమైన నా బాణముచే అతని ప్రాణములు రక్షించబడుట అసంభవము. 


నిఖిలలోక పావనుడగు శ్రీ రాముని బాణముచే వాలి హతుడయ్యాడు. త్రైలోక్యరక్షకుడైన శ్రీరాముని ఎదుట అతడు తన భౌతికశరీరమును విడిచాడు. భర్త మరణవార్తను విని వాలి భార్యయైన తార ఇచటికి వచ్చి దీనముగా ఏడ్వసాగినది. అపుడు తారను ఓదార్చుతూ పరమవీతరాగుడైన హనుమానుడిట్లా పలికాడు.


గుణదోషకృతం జంతుః స్వకర్మఫల హేతుకమ్ | 

అవ్యగ్ర స్తద వాప్నోతి సర్వం ప్రేత్య శుభాశుభమ్! 

శోచ్యాశోచసి కం శోచ్యం దీనం దీనానుకంపసే |

కశ్చ కస్యానుశోచ్యోఒస్తి దే హేఒస్మిన్ బుద్బుదోపమే | 

జానాస్య నియతామేవం భూతానామాగతీం గతిమ్ | 

తస్మాచ్ఛుభం హి కర్తవ్యం పండితే నేహ లౌకికమ్|| (వా. రా. 4-21-2,3,5)


"దేవీ! జీవుని గుణబుద్దుల చేత లేదా దోషబుద్ధి చేత చేయబడిన కర్మలే సుఖదుఃఖ రూపఫలమును పొందుతాయి. పరలోకమునకు వెళ్ళి ప్రతిజీవుడు శాంతభావముతో నుండి తన శుభాశుభ కర్మ ఫలమును అంతటిని అనుభవిస్తాను. నీవు శోచనీయవు, అట్లుండగా నీవు మఱియొక శోచనీయుని చూసి దుఃఖింపనేల? నీవు స్వయముగా దీనురాలవై ఉండి మఱియొక దీనునిపై కరుణ చూపనేల? నీటి బుడగవంటి ఈ శరీరమున నుండి ఏ జీవుడు మఱియొక జీవుని కొఱకు దుఃఖంచును ?


దేవీ! నీవు విదుషీమణివి. అందువలన ప్రాణుల జనన మరణములకొక నిర్ణీతమైన సమయము లేదని నీకు తెలుస్తుంది. కనుక శుభకర్మము చేయవలెను. దుఃఖంచుట మొదలైన లౌకిక కర్మలను చేయరాదు”


No comments:

Post a Comment